Tags
#China biological weapons, american crimes against humanity, COVID- 19 pandemic, Donald trump angry at China, German crimes against humanity
ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్ తొలుత బయట పడిన ఊహాన్ నగరంలో జరిగిందేమిటో తెలుసుకొనేందుకు తమ తనిఖీదార్లను అనుమతించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశాడు. ఈ డిమాండ్‌ను చైనా తోసి పుచ్చింది. కరోనా గురించి సకాలంలో హెచ్చరించని కారణంగా తమ దేశానికి జరిగిన నష్టం 20లక్షల కోట్ల డాలర్లు చైనా చెల్లించాల్సిందే అని అమెరికన్లు కొందరు తమ దేశంలో దావా దాఖలు చేశారు. చైనా మీద కేసులు అమెరికా కోర్టుల్లో దాఖలు చేయటం ఏమిటో, అవి విచారణ జరిపే ప్రహసనం ఏమిటో రాబోయే రోజుల్లో చూద్దాం. ఇదే విధంగా తమకు 149 బిలియన్ యూరోల నష్టపరిహారం చెల్లించాలని జర్మన్ పత్రిక బిల్డ్ పేర్కొన్నది. రాబోయే రోజుల్లో ఇంకా ఇతర దేశాల నుంచి కూడా ఇలాంటి డిమాండ్‌లు రావచ్చు. అవెంత ఉంటాయో తెలియదు. ఈ డిమాండ్లు న్యాయసమ్మతమేనా ? ఆచరణ సాధ్యమేనా ?
నావరకు అయితే కొన్ని చిన్న చిన్న షరతులతో న్యాయసమ్మతమే, ఆచరణ సాధ్యమే ! అదెలాగో తరువాత చూద్దాం.ఈ వార్తలను చూసి చాలా మంది చైనా తిక్క కుదిరింది అనుకుంటున్నారు. దాఖలు చేయని కేసులను కూడా వేసినట్లే సంబర పడుతున్నారు. ముందు తమ దేశాల్లో కరోనా నివారణ చేయకుండా ఇదేమిటి అనుకొనేవారు కూడా లేకపోలేదు. ఇలాంటి నష్ట పరిహారం కోరేవారు నిజంగా సాధించేందుకు అవకాశాలున్నాయని నమ్ముతున్నారా ? లేక ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు ట్రంప్ ఇలాంటి కేసులను వేయిస్తున్నాడా అన్నది అనుమానమే. అసలు ఇప్పుడున్న ప్రపంచ వ్యవస్ధలో అలాంటి అవకాశాలు ఉన్నాయా? ఐక్యరాజ్య సమితి నిర్ధారించిన మార్గదర్శక సూత్రాల మేరకు అంతర్జాతీయ నేరాలుగా పరిగణించిన వాటిని విచారించేందుకు అంతర్జాతీయ న్యాయ స్ధానం ఉంది. చైనాలో వెలువడిన కరోనా వైరస్ అలాంటి నేరంగా ఎవరూ ఎక్కడా నిర్ధారించలేదు. చరిత్రలో ఎప్పుడైనా నిజంగా తప్పు చేసిన ఏ దేశమైనా ఎవరికైనా పరిహారం చెల్లించిందా ?
అమెరికా ఏమిటి ఏ దేశమైనా దేని గురించి అయినా స్వంత విచారణలు జరుపుకోవచ్చు. కోరుకున్న తీర్పులు రాసుకోవచ్చు. రద్దు కింద అమ్ముకోవటానికి తప్ప అవి దేనికి పనికి వస్తాయి ? ఆ దేశాలన్నీ ముందు చైనాలో వైరస్‌ను ఎలా అరికట్టారో తమ దేశాలలో ఎలా జనం ప్రాణాలు తీస్తున్నారో తెలుసుకోవాలి. ఇతర దేశాల్లోకి స్వంత దర్యాప్తు బృందాలను పంపటానికి ఏ దేశానికీ హక్కు లేదు, అవకాశం అంతకంటే లేదు. అదే నిజంగా ఉంటే పాకిస్ధాన్‌లోని ఉగ్రవాద కేంద్రాలను ఈ పాటికే మన కేంద్ర ప్రభుత్వం తనిఖీ చేసి ఉండేది, అదే విధంగా పాక్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి మన మీద చేసిన ఆరోపణలను విచారించే వారు. అమెరికాలో అత్యధిక కేసులు ఐరోపా నుంచి దిగుమతి అయ్యాయి. అందువలన ఆ దేశాల మీద ముందు అమెరికా దర్యాప్తు జరపాలి. ఇప్పటికే ప్రపంచ పోలీసుగా తనకు తాను బాధ్యత తీసుకున్న అమెరికా దాదాపు అన్ని చోట్లా చావు దెబ్బతిన్నది. ఇప్పుడు ప్రపంచ న్యాయమూర్తిగా మారదలచుకున్నట్లు కనిపిస్తోంది. అత్యాశగాకపోతే అది సాధ్యమేనా ?
చైనాలోని ఉహాన్ వైరాలజీ సంస్ధ అధిపతి, చైనా మిలిటరీ మేజర్ జనరల్ తమ దేశంలో కరోనా వ్యాప్తి, మరణాలకు కారకులని, నష్టపరిహారంగా 20లక్షల కోట్ల డాలర్లు చెల్లించాలని అమెరికాలోని ఒక లాయర్, మరో ఫొటోల కంపెనీ, మరో ఇద్దరు కేసులు దాఖలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ పిచ్చి కేసుకు ప్రపంచ వ్యాపితంగా ప్రచారం తప్ప మరొక లాభం ఉండదు. అది కోరిన మొత్తం చైనా జిడిపికంటే ఎక్కువ. అంటే చైనా మొత్తాన్ని అమ్మినా అంత సొమ్ము రాదు, అసలు కొనే వారెవరు అన్నది వేరే విషయం. ఆస్ట్రేలియా ఎలాంటి నష్ట పరిహారం కోరలేదుగానీ అమెరికా ఏది మాట్లాడితే దానికి వత్తాసుగా పలుకుతోంది. ఇక జర్మనీలో అత్యధిక ఆదరణ కలిగిన పత్రిక ” బిల్డ్ ” సంపాదకులు తమ దేశానికి చైనా కారణంగా వివిధ రంగాలకు 149 బిలియన్ యూరోల మేరకు నష్టం జరిగిందని ఆ మొత్తం చెల్లించాలని రాశారు. అయితే ఇందుకోసం ఎలాంటి కేసులు గట్రా దాఖలు చేయలేదు.
ఇక చైనా మీద విచారణ అంశాన్ని దానికి గాను నేను ముందే చెప్పిన షరతుల సంగతి చూద్దాం. ఎప్పుడో క్రీస్తు పూర్వం సంభవించిన వైరస్‌ల మూలాలు ఏదేశంలోనివో ఇప్పుడు నిర్ధారించటం కష్టం. ఎందుకంటే నాడున్న దేశాలు లేదా సామ్రాజ్యాలు నేడు లేవు గనుక నిందితులు ఫలానా అని నిర్దారించలేము. నిజానికి ఏ దేశం తప్పుచేసినా విచారణ జరిపేందుకు ప్రపంచ రాజ్యాలు ఏక క్రీవంగా అంగీరించి ముందు ఐరాస భద్రతా మండలిలో తీర్మానం ఆమోదించాలన్న చిన్న షరతును ముందు నెరవేర్చాలి. ఆ మేరకు ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి కనుక మొదటి ప్రపంచ యుద్ధాన్ని తీసుకుందాం, లేదూ ఎవరైనా అంతకు ముందు నుంచే విచారణ ప్రారంభించాలి అంటే అభ్యంతరమూ లేదు.చైనాకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వాల్సిన అవసరం లేదు.
కరోనా వైరస్‌ను చైనా తయారు చేసిందనటానికి ఎలాంటి ఆధారాలు లేవు. మానవాళి చరిత్రలో అతి పెద్ద మహమ్మారి ప్లేగు వ్యాధి అని తెలిసినా కొన్ని వందల సంవత్సరాలు గడచి నందున దానికి సంబంధించిన అంశాలు పూర్తిగా నిర్దారించలేము. మనకు బాగా తెలిసిన స్పానిష్ ఫ్లూ(ప్రపంచానికి తెలిసిన తొలి హెచ్1ఎన్1 వైరస్). మొదటి ప్రపంచ యుద్ధం చివరిలో ప్రబలింది. ఇది ఐరోపాలోనా, అమెరికాలోనా ఎక్కడ ప్రారంభమైంది అన్న అంశం మీద వివాదం ఉంది. భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఎక్కువ పరిశీలనలు అమెరికా వైపే వేలు చూపుతున్నాయి. నిజానికి ట్రంప్‌కు, జర్మన్ పత్రిక బిల్డ్ సంపాదకులకు, వారిని సమర్ధించే వారికి చిత్తశుద్ధి ఉంటే ఈ వైరస్ ఎక్కడ ప్రారంభమైందో ఇప్పుడు ఉన్న ఆధారాల ప్రకారం నిర్ధారించాలి. చైనాలో విచారణకు తమ నిపుణులను అంగీకరించాలని ట్రంప్ కోరాడు. అలా ఒక దేశం కాకుండా భద్రతా మండలిలో ఇప్పుడు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా సభ్యరాజ్యాలుగా ఉన్నాయి కనుక వాటి ప్రతినిధులను ఎంపిక చేసి విచారణ జరిపించాలి. ఆ నివేదిక ప్రాతిపాదికన నష్టాలను నిర్ధారించి ఆ మొత్తాలను బాధిత దేశాలకు పంచాలి. ఇదేమీ పెద్ద షరతు కాదు, అసాధ్యమైంది అంతకంటే కాదు.
1918 జనవరి నుంచి 1920 డిసెంబరు వరకు ప్రపంచ వ్యాపితంగా నాడు ప్రపంచంలో ఉన్న మూడో వంతు జనాభా 50 కోట్ల మందికి సోకింది. కోటీ 70లక్షల నుంచి ఐదు కోట్ల మందికి, మరికొందరి అంచనాల ప్రకారం పది కోట్ల మంది దుర్మరణం చెందారు. ఇది మొదటి ప్రపంచ యుద్దంలో పాల్గొన్న దేశాలు గావించిన నష్టానికి అదనం, ప్రపంచ ఆధిపత్యం కోసం యుద్దాన్ని తెచ్చిన దేశాలు, స్పానిష్ ఫ్లూ నష్టాలను కలిపి లేదా విడిగా తేల్చి దానిలో ఎవరి వాటా ఎంతో ఎలా చెల్లిస్తారో అమెరికా, ఐరోపా దేశాలు ముందు తేల్చుకోవాలి. ఆ యుద్ధంలో స్పెయిన్ తటస్ధంగా ఉంది. అయితే ఆ సమయంలోనే తలెత్తిన ఫ్లూ సోకి రాజు 13వ ఆల్‌ఫోన్సో మరణించటంతో నేటి మాదిరే నాటి పత్రికలు కూడా వెనుకా ముందూ చూడకుండా స్పెయిన్‌లోనే పుట్టిందని దానికి స్పానిష్ ఫ్లూ అని రాశాయి. తరువాత స్పెయిన్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిసినా ఆ పేరు వాడుకలో ఉండిపోయింది. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్ద కరోనాకు కోవిడ్-19 అని పేరు పెట్టినా చైనా వైరస్ అని నిందిస్తున్న మాదిరి అన్నమాట. ఈ ఫ్లూ కొనసాగింపుగా 2009లో స్వైన్ ఫ్లూ వచ్చింది కనుక దీన్ని కూడా చేర్చి విచారణ జరపాలి. ఇది పుట్టింది అమెరికాలోనా, మెక్సికోలోనా మరొక చోటా అన్నది ఆ దేశాలు తేల్చాలి. పనిలో పనిగా ఎయిడ్స్‌ను ఎక్కడ తయారు చేసి ప్రపంచం మీద వదిలారో కూడా తేల్చి పరిహారం చెల్లించాలి.
మన కళ్ల ముందే ఇరాక్‌లో మారణాయుధాలు, జీవ రసాయన ఆయుధాల గుట్టలు ఉన్నట్లు ప్రచారం చేసిన అమెరికన్ల గురించి తెలుసు. ఆ పేరుతో ఇరాక్ మీద దాడి చేసి పదిలక్షల మంది ప్రాణాలు తీశారు. దేశాన్ని సర్వనాశనం చేశారు. తీరా తమ తనిఖీలో ఎలాంటి జీవ, రసాయన ఆయుధాలు లేవని స్వయంగా అమెరికన్లే ప్రకటించారు. అంతే కాదు ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రవేశించి అపార ప్రాణ నష్టానికి కారకులయ్యారు. ఇస్లామిక్ తాలిబాన్(ఉగ్రవాదులు)లను సృష్టించారు. ఈ రోజు వారు ప్రపంచ వ్యాపితంగా చేస్తున్న దుర్మార్గాలకు గాను ఎవరు పరిహారం చెల్లిస్తారు, ట్రంప్ మెడపట్టి బాధిత దేశాలన్నీ నష్టపరిహారం కోరాలి. విచారణకు డిమాండ్ చేయాలి. పాక్ ఉగ్రవాదులు తాలిబాన్ల శిక్షణలోనే తయారయ్యారు కనుక మన మోడీ గారు కూడా స్నేహితుడనే విషయాన్ని పక్కన పెట్టి ఈ విషయంలో అమెరికా, ట్రంప్‌ను పరిహారం కోరాలి.
రెండవ ప్రపంచ యుద్ధంలో మిగతా వన్నీ పక్కన పెడితే కొన్ని దేశాలు ప్రత్యేకంగా చేసిన నేరాలు ఉన్నాయి. వాటిని విచారణ జరిపి శిక్షలు కూడా వేశారు. ఆ యుద్దం ముగింపు దశలో అమెరికన్లు జపాన్‌లోని నాగసాకి,హిరోషిమా పట్టణాల మీద వేసిన రెండు అణుబాంబులు ఎంత మందిని బలితీసుకున్నాయో తెలుసు. తొలిసారి అవసరం లేకపోయినా చేసిన ఈ దాడికి అమెరికన్లు జపాన్‌కు ఎంత నష్టపరిహారం ఇస్తారో ముందు తేల్చాలి. అమెరికా మిత్ర దేశంగా జపాన్ ఉంది కనుక ఆ పరిహారాన్ని తీసుకోవాలా లేదా అన్నది వేరే విషయం. జపాన్ మిలిటరీ చైనా పట్టణాలపై ప్లేగు బాంబులు వేసి ప్లేగు వ్యాధిని వ్యాపింప చేసి దొరికి పోయి విచారణ ఎదుర్కొన్న విషయం దాస్తే దాగేది కాదు. అందువలన దానికి చైనాకు ఎంత నష్ట పరిహారం ఇస్తారో జపాన్ కూడా తేల్చాలి. వియత్నాం ఇతర ఇండో చైనా దేశాలేమీ ఎవరి మీదా దాడులు చేయలేదు, దురాక్రమణకు పాల్పడలేదు. అయినా జపాన్, ఫ్రెంచి, అమెరికా సామ్రాజ్యవాదులు దశాబ్దాలతరబడి దాడులు చేసి కలిగించిన అపార నష్టానికి ఆ మూడు దేశాలు నష్టపరిహారం చెల్లించాలి, ఎవరి వాటా ఎంతో అవే తేల్చుకోవాలి.
ఇక జర్మనీ సంగతి. రెండవ ప్రపంచ యుద్దం సందర్భంగా 60లక్షల మంది యూదులు, కోటీ పదిలక్షల మంది ఇతరులను బలిగొన్న నాజీ సైన్యాలను నడిపింది జర్మనీ. గ్యాస్ ఛాంబర్లలో ఏ రసాయనాన్ని పంపి హత్యలు చేశారో వెల్లడించాలి. దానికి ఎంతో నష్టపరిహారం చెల్లించాలో ముందు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బిల్డ్ సంపాదకుడు తగుదునమ్మా అంటూ ఆధారాలు లేని చైనాను నష్టపరిహారం అడుగుతున్నాడు.
మన దేశాన్ని బ్రిటన్ ఆక్రమించి మనక ఎంత నష్టం కలిగించిందో తెలిసిందే. అందువలన దాని మీద కూడా విచారణ జరిపి నష్టపరిహారాన్ని రాబట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వ్యక్తులు లేదా దేశాల మీద ఆపాదించినంత మాత్రాన నేరంచేసినట్లు కాదు. చైనా మీద కూడా ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు.పైన చెప్పుకున్న దేశాల నేరాలు ఇప్పటికే రుజువయ్యాయి. అందువలన నిందితులను, నష్టపరిహారాన్ని తేల్చి తరువాత చైనా సంగతి మాట్లాడాల్సి ఉంటుంది. ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడిన చరిత్ర ఇప్పటి వరకు సామ్రాజ్యవాదులదే, ఏ సోషలిస్టు దేశానికి అలాంటి చరిత్ర లేదు. ఒక వేళ ఎవరైనా నిరూపిస్తే దానికి ఎలాంటి అభ్యంతరం లేదు.