Tags

, , ,

Saving the food value chain amid Covid lockdown - The Hindu ...

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ ప్రపంచానికి కునుకు లేకుండా చేస్తోంది. కర్షకులను అయోమయంలోకి నెడుతోంది. ఎటు నుంచి ఎవరి మీద దాడి చేస్తుందో తెలియని స్ధితి. కనిపించే, చేతికి చిక్కే శత్రువుతో పోరాడగలం గానీ వైరస్‌లు సాధారణ కంటికి కనపడవు, ఉన్న ఔషధాలతో అంతం కావు. ఒక దానికి వ్యాక్సిన్‌ తయారు చేస్తే అది మార్కెట్లోకి వచ్చే సరికి వైరస్‌లు తమ స్వభావాన్ని మార్చుకోవటంతో ప్రయోజనం లేకుండా పోతోంది. కరోనా కూడా అలాంటిదే, ఇప్పటికి 33 మార్పులకు లోనైనట్లు గుర్తించారు. ఇంకా ఎన్ని విధాలుగా మారి ప్రపంచం మీద దాడి చేయనుందో తెలియదు. అంతిమంగా ఏ వైరస్‌ను అయినా అదుపు చేయగలం లేదా అది బలహీనమై పోయి మానవ శరీరాల చేతిలోనే చావు దెబ్బలు తింటుందన్నది గత చరిత్ర. అయితే ఇప్పుడు కరోనా నుంచి ఎప్పుడు బయటపడతామో తెలియదు. మే మూడవ తేదీతో గృహబందీ(లాక్‌డౌన్‌) ఎత్తివేస్తారని భావిస్తున్నప్పటికీ ఇది రాస్తున్న సమయానికి వైరస్‌ వ్యాప్తిని చూస్తే కొన్ని సడలింపులు ఉన్నప్పటికీ మే నెలాఖరు వరకు, పరిస్ధితి విషమిస్తే తరువాత కూడా కొనసాగవచ్చన్నది ఒక అభిప్రాయం. ఇప్పటికే అనేక విధాలుగా నష్టపోయిన రైతాంగానికి ఏరువాక దగ్గరపడుతుండటంతో ఏమి చేయాలో తోచని స్ధితి అంటే అతిశయోక్తి కాదు.
కరోనా మహమ్మారి ప్రపంచం మీద ఎలా పర్యవసానాలకు నాంది పలుకుతుందో, అవి ఏవిధంగా ఉంటాయో వైరస్‌ తీరుతెన్నుల మాదిరే తెలియటం లేదు. క్షణ క్షణానికి వైరస్‌ రోగులు, మరణాల సంఖ్య మారుతున్నట్లే ఒక రోజు వేసిన అంచనాలు మరో రోజుకు పాతబడి పనికి రాకుండా పోతున్నాయి. వ్యవసాయ రంగం మీద ప్రభావాలను ఈ సందర్భంగా చూద్దాం. మన దేశంలో 50 నుంచి 60శాతం వరకు జనం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. సరిగ్గా పొలాల నుంచి వివిధ పంటలు ముఖ్యంగా రబీ, దోఫసలీ(దీర్ఘకాల) పంటలు రైతుల ఇండ్లకు వచ్చే సమయంలో వైరస్‌ వ్యాప్తి కారణంగా గృహబందీని ప్రకటించారు. ఫలితంగా రైతాంగం, వారి మీద ఆధారపడిన వ్యవసాయ కూలీలు తీవ్రంగా ప్రభావితులయ్యారు. పంటలను కోసే దిక్కు లేకుండా పోయింది కొన్ని చోట్ల, యంత్రాలు ఒక ప్రాంతం నుంచి మరోచోటికి తరలే అవకాశాలు లేక కూలీల కొరత ఏర్పడింది. కొన్ని చోట్ల చెరకు, మిర్చి కోతలకు వచ్చిన వలస లేదా అతిధి కూలీలు సీజను ముగిసి తమ ప్రాంతాలకు వెళ్లే సమయంలో ఎక్కడికక్కడ చిక్కుకు పోయారు. అకాల వర్షాల కారణంగా కళ్లాల్లో ఉన్న ధాన్యం, మిర్చి వంటికి తడిచిపోయాయి. పండ్లు కోసేవారు, కోసినా మార్కెట్లకు తరలించే సదుపాయాల్లేక చెట్ల మీదనే పండిపోతున్నా రైతాంగం గుడ్లప్పగించి చూస్తూ వదలివేయటం తప్ప మరొకటి చేయలేని స్ధితి.అన్ని చోట్లా ఏ పంటకూ కనీస మద్దతు ధర రావటం లేదు. ముఖ్యంగా పంట్ల తోటల రైతాంగ పరిస్ధితి దారుణంగా తయారైంది. పంటలు కాస్త బాగా పండాయి అనుకున్న స్ధితిలో గృహబందీ దేశంలోని 14 కోట్ల రైతు కుటుంబాలకు పిడుగుపాటులా మారింది.
మన దేశ వ్యవసాయ రంగంలో పరిస్ధితిని చూద్దాం. కరోనా వైరస్‌ రాక ముందే గతేడాది మధ్య నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ముఖ్యంగా ఉల్లి, బంగాళాదుంపలు, కూరగాయల వంటి వాటి ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుదల నమోదు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఉల్లి ధరలు తగ్గినా మిగతావి తగ్గలేదు. తరువాత కరోనా కారణంగా డిమాండ్‌ బలహీనపడి ద్రవ్యోల్బణం తగ్గవచ్చని మార్చి 27న ఆర్‌బిఐ ఒక నివేదికలో పేర్కొన్నది. 2018-19 కంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి 2019-20లో 2.4శాతం పెరిగి 29.2 కోట్ల టన్నులకు పెరగవచ్చని అంచనా. మార్చి ఒకటవ తేదీ నాటికి భారత ఆహార సంస్ధ వద్ద7.76 కోట్ల టన్నుల ధాన్యం నిలవ ఉంది. వ్యూహాత్మక, అత్యవసరాలకోసం అవసరమైన 2.14 కోట్ల టన్నుల కంటే ఇవి మూడు రెట్లు ఎక్కువ. రబీ పంట సేకరణ కూడా జరిగితో మరో మూడు కోట్ల టన్నులు పెరుగుతాయని అంచనా.

Flower trade wilts under lockdown across the country - The Hindu ...
దేశంలో భిన్నమైన వ్యవసాయ ప్రాంతాలు ఉన్నాయి. పంటలు కూడా అలాగే ఉంటాయి. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం వివిధ తరగతులకు ప్రకటించిన ఉద్దీపన లక్షా 70వేల కోట్ల రూపాయలు మాత్రమే. ఇది జిడిపిలో కేవలం 0.7శాతమే. కనీసం ఐదు నుంచి పదిశాతం వరకు సాయం చేయాలన్న సూచనలను కేంద్రం పట్టించుకోలేదు. అంతకు మించి రైతు ప్రతినిధులతో కనీసం చర్చలే జరపలేదు. అడిగితే ఎంతో కొంత సాయం చేయాల్సి వస్తుందన్న కారణంతో గావచ్చు రాష్ట్రాలను ప్రతిపాదనలు పంపమని కూడా అడగలేదు. కేంద్ర ప్రకటించిన మొత్తంలో ఇరవైవేల కోట్ల రూపాయలు గతంలోనే ప్రకటించి పిఎం కిసాన్‌ పధకం కింద మూడు విడతలుగా అందచేసే ఆరువేల సాయంలో మొదటి విడత రెండు వేల రూపాయలను ముందుగా విడుదల చేయటం తప్ప అదనపు సాయం కాదు. ఇక వ్యవసాయ కూలీలకు పని లేకుండానే స్వల్ప మొత్తంలో 182 నుంచి 202కు వేతనం పెంచి అదే పెద్ద సాయం అన్నట్లుగా చిత్రించారు. వచ్చే మూడు మాసాలకు అదనపు ఆహార ధాన్యాలు, జనధన్‌ ఖాతాలున్న వారికి నెలకు ఐదువందల రూపాయల చొప్పున మూడు నెలలపాటు ఇస్తామని ప్రకటించారు. ఇవిగాక పిఎం కేర్‌ నిధుల నుంచి వలస, అసంఘటిత కార్మికులకు మరికొంత సాయం చేస్తామని చెప్పారు. ఇవి అవసరాలతో పోలిస్తే నామమాత్రమే. రైతాంగ రుణాలకు సంబంధించి మూడు లక్షల రూపాయల వరకు మూడు శాతం వడ్డీ రాయితీతో రుణాలను మే31వరకు మూడునెలలు వసూలు వాయిదాను ప్రకటించారు. అసలు పంటలే అమ్ముకోలేని స్ధితి, అమ్ముకున్నా కనీస మద్దతుధరల కంటే వందల రూపాయలు తక్కువగా అమ్ముకోవాల్సి వస్తున్న రైతాంగానికి ఇవి కంటి తుడుపు మాత్రమే.
ఈతి బాధలు, కరోనా వంటి మహమ్మారులు తలెత్తినపుడు మన దేశంలో ముందు ప్రభావితులౌతున్నది రైతాంగంలో 85శాతంగా ఉన్న సన్న, చిన్నకారు రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీలు, చేతి వృత్తులు దెబ్బతిని వ్యవసాయ కూలీలు, ఇతర పనులకు మరలిన పేదలే అన్నది స్పష్టం. ఫ్యాక్టరీలు, కార్యాలయాల్లో పని చేసే వారికి కొంతమందికైనా ఏదో ఒక సామాజిక రక్షణ ఉంటుంది. గ్రామీణ కార్మికులకు అవేమీ ఉండవు. కరోనా ఉద్దీపన పేరుతో తీసుకుంటున్న చర్యలు మొత్తంగా వట్టిస్తరి మంచినీళ్లు తప్ప మరొకటి కాదన్నది తేలిపోయింది. పాస్ఫరస్‌, పొటాసియం ఉండే ఎరువులకు రూ.22,186 కోట్ల రూపాయల మేర సబ్సిడీ ఇవ్వనున్నట్లు గృహబందీ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అనేక మంది ఇది బడ్జెట్‌లో ప్రకటించిన దానికి అదనం అనుకుంటున్నారు, కానే కాదు. ప్రతి ఏడాది ఎరువులకు ఇస్తున్న సబ్సిడీ మొత్తాలు 75వేల కోట్ల రూపాయలకు మించటం లేదు. దానిలోనే ఒక ఎరువుకు తగ్గించినా, మరొకదానికి పెంచినా సర్దుకోవాలి. ఇప్పుడు కూడా అదే జరిగింది. రూపాయి విలువ మరింత దిగజారిన కారణంగా దిగుమతి చేసుకొనే ఎరువుల ధరలు పెరగవచ్చు, అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో మాంద్యం కారణంగా కంపెనీలు తెగబడి చమురు మాదిరి ఎరువులను కూడా తగ్గించి అమ్మితే తగ్గవచ్చు. ఇది రాస్తున్న సమయానికి అలాంటి సూచనలేవీ కనిపించటం లేదు.

The great lockdown gums up animal farms
ఫిబ్రవరి ఒకటవ తేదీన పార్లమెంట్‌కు సమర్పించిన 2020-21 బడ్జెట్‌ పత్రాల ప్రకారం అంతకు ముందు సంవత్సరంలో పాస్ఫరస్‌, పొటాసియం ఎరువుల సబ్సిడీ అంచనా రూ.26,335 కోట్లుగా చూపారు. వాస్తవానికి ఎంత ఖర్చు చేసిందీ మనకు వచ్చే ఏడాది పత్రాలలో గానీ తెలియదు. కేంద్ర సమాచార శాఖ మంత్రి విలేకర్లతో ఇలా చెప్పారు. ” 2020-21కి ఫాస్పేటిక్‌ మరియు పొటాసియం ఎరువులకు సబ్సిడీ రూపంలో ఖర్చు రూ. 22,186 కోట్లకు పెంచాలని నిర్ణయించాము, ఈ సబ్సిడీ పధకం ప్రతి ఏడాదీ ఉండేదే, ఈ ఏడాది ఐదు నుంచి ఏడు శాతం అదనంగా ఇవ్వాలని నిర్ణయించాము” అన్నారు. అంటే గత ఏడాది అంచనా మొత్తం కంటే ఖర్చు గణనీయంగా తగ్గి ఉండాలి. గత ఏడాది కంటే ఎరువులు, ఆహార సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. గత సంవత్సరం 80వేల కోట్ల రూపాయల అంచనా కాగా దాన్ని 70వేల కోట్లకు సవరించారు. ఈ ఏడాది ఆ 70వేల కోట్లనే అంచనాగా చూపారు. ఆహార సబ్సిడీని కూడా రూ.1.84లక్షల కోట్ల నుంచి 1.15లక్షల కోట్లకు తగ్గించారు. దీన్ని మరో విధంగా చెప్పాలంటే భారత ఆహార సంస్ధను అప్పుల పాలు చేసి ఆ పేరుతో దాన్ని మూసివేసేందుకు ఎంచుకున్నదారి ఇది. బడ్జెట్‌లోటును తగ్గించే దొడ్డిదారి. ఎఫ్‌సిఐ లాభాల ప్రాతిపదికన పని చేసే వాణిజ్య సంస్ధ కాదు. ఇటీవలి సంవత్సరాలలో దాని బడ్జెట్‌కు నిధులు కేటాయించని కారణంగా అది జాతీయ చిన్న మొత్తాల పొదుపు సంస్ధ నుంచి అధిక వడ్డీకి అప్పులు చేస్తున్నది. గతేడాది మార్చి ఆఖరుకు దాని అప్పులు రెండు లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయి. దాన్ని చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు చేయటం లేదు.ఈ ఏడాది ఇంకా కోత పెట్టింది. అంటే కేటాయించిన మొత్తం పోను ఎఫ్‌సిఐ మరింత ఎక్కువగా ఈ ఏడాది అప్పు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం జాతీయ ఆహార భద్రతా పధకం కింద ఉన్న 67శాతం మందిని 20శాతానికి కుదించాలని, రేషన్‌ దుకాణాల ద్వారా ఇస్తున్న సరకుల ధరలను పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సర్వే సూచించింది. అది కేంద్ర ప్రభుత్వం తయారు చేసేదే కనుక మోడీ సర్కార్‌ ఆలోచనకు ప్రతిబింబం. దీనిలో భాగంగానే ఎఫ్‌సిఐని నిర్వీర్యం చేసి రాష్ట్రాలకే ధాన్యం కొనుగోలు బాధ్యతను ఇప్పటికే బదలాయించారు. వారెలా చేస్తున్నదీ చూస్తున్నాము.
బడ్జెట్‌ పత్రాల ప్రకారం 2019-20లో నేరగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్న మొత్తాలకు కేటాయించిన 75వేల కోట్ల రూపాయలకు గాను ఖర్చయింది రూ.54,370 కోట్ల రూపాయలే. ఇరవై ఒక్కవేల కోట్ల రూపాయలను ”పొదుపు” చేసింది. ఈ పధకం కింద దేశంలోని 14కోట్ల రైతు కుటుంబాలకు గాను లబ్దిపొందింది కేవలం 8.4కోట్ల కుటుంబాలే అని అంచనా. కరోనా కారణంగా తలెత్తిన పరిస్ధితిలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకొనేందుకు కేంద్రం నుంచి ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేవు. ఆరోగ్య సేవలను ప్రయివేటు రంగానికి అప్పగించాలన్న నిర్ణయాన్ని వేగంగా అమలు జరుపుతున్నారు. కరోనా సందర్భంగా అదెంత ప్రమాదకర పోకడో ప్రపంచ వ్యాపితంగా వెల్లడైంది. ఇలాంటి మహమ్మారులు, ప్రకృతి ప్రళయాల సమయాల్లో ఎఫ్‌సిఐ లేదా మరొక ప్రభుత్వ సంస్ధ లేకపోతే ఎంత నష్టమో ఇప్పటికే రైతాంగానికి అర్ధం అయింది.
మన దేశం వెలుపల పరిస్ధితి ఎలా ఉందో చూద్దాం. ఇప్పటికే చైనా, ఇతర ఐరోపా దేశాలతో ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్దం అమెరికా రైతాంగానికి ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్దితిలోకి నెట్టింది. కరోనా కారణంగా చైనా ఆర్ధిక స్ధితి కూడా తాత్కాలికంగానే అయినా గణనీయంగా దెబ్బతిన్నట్లు స్వయంగా వారే ప్రకటించారు. ఇప్పుడు ట్రంప్‌ తన ఎన్నికల కోసం కరోనా వైరస్‌ పేరుతో రాజకీయం చేయాలని చూస్తున్నాడు. అవసరమైతే వాణిజ్య ఒప్పందాలను నిలిపివేస్తానని బెదిరిస్తున్నాడు. అమెరికాకు చైనా ఎంత దూరమో చైనాకు కూడా అమెరికా అంతే దూరంలో ఉంటుంది. చైనాకు వచ్చే ఆర్ధిక ఇబ్బందులు దానికే పరిమితం కావు,చైనాతో పోల్చితే అమెరికా ఆర్ధిక వ్యవస్ధ ఎంత బలహీనంగా ఉందో చెప్పనవసరం లేదు.చమురు నిల్వ ఖాళీ లేక, ఉన.్నది అమ్ముడు పోక చమురు ధరలు పడిపోవటంతో కొనుగోలుదార్లు అమ్మకం దార్లకు ఎదురు డబ్బులు ఇచ్చి నష్టాలను తగ్గించుకున్నారు.కరోనా కారణంగా అనేక ప్రాంతాల్లో అమెరికా రైతులు పాలు అమ్ముడుపోక గోతుల్లో పోస్తున్నారని, కూరగాయల తోటలను దున్నివేస్తున్నారని వార్తలు వచ్చాయి. పంటలకు పదిశాతం, పశువులకు 12శాతం ధరలు పడిపోతాయని, రైతుల నిఖర ఆదాయాలు 20బిలియన్‌ డాలర్లు తగ్గుతాయని ఆహార మరియు వ్యవసాయ విధాన పరిశోధనా సంస్ద అంచనా వేసింది. అమెరికాలో అలా జరగటం అంటే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలతో వారు ప్రపంచ మార్కెట్లో మరింత చౌకగా వాటిని కుమ్మరిస్తారు. పందొమ్మిది బిలియన్‌ డాలర్ల మేరకు వ్యవసాయ రంగానికి ఇచ్చేందుకు ట్రంప్‌ చర్యలు తీసుకుంటున్నాడు. మన దేశంలో అలాంటి నష్టం ఎంత జరిగిందో అంచనా వేసేవారు లేరు, వేసినా పరిహారం ఇచ్చేవారూ లేరు.
ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి జారుతోందన్నది అందరూ అంగీకరిస్తున్న అంశం. వేగతీవ్రత అంచనాలో తేడాలుండవచ్చు.2020లో ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనంలో ఉంటుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. కరోనా ప్రారంభంలో నష్టం జరిగితే అది చైనాకే పరిమితం అవుతుందన్నది ఎక్కువ మంది జోశ్యం. ఇప్పుడు ప్రపంచాన్ని కమ్ముకుంటున్నది. మన పరిస్ధితి గురించి కేంద్ర పెద్దలు అంగీకరించినా లేకున్నా గతేడాది కాలంగా దిగజారుతూనే ఉంది.ప్రపంచంలో గతేడాది ఆహార వస్తువుల ధరలు ప్రారంభంలో తగ్గినప్పటికీ కరోనా కారణంగా ఇటీవల ధరలు పెరిగినట్లు ప్రపంచ మార్కెట్ల తీరుతెన్నులు తెలుపుతున్నాయి. అనేక దేశాలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎగుమతులపై ఆంక్షలు విధించటం, వినియోగదారులు నిల్వలు చేసుకోవటం ఒక కారణంగా చెబుతున్నారు. వియత్నాం నిషేధం కారణంగా ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో 15శాతం తగ్గాయి, మన దేశం, థారులాండ్‌ కూడా ఆంక్షలు విధిస్తే ప్రపంచ మార్కెట్లో ధరలు బాగా పెరిగే అవకాశం ఉంది.

No crops if lockdown extended: Karnataka farmers wary of distress ...
గోధుమలను అత్యధికంగా ఎగుమతి చేసే రష్యా, గోధుమ పిండిని ఎగుమతి చేసే కజకస్తాన్‌ కూడా ఎగుమతుల మీద ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఇంకా అనేక దేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పరిమితం అయ్యే అవకాశాలున్నాయి. దీన్ని ”ఆహార జాతీయవాదం ” తలెత్తటంగా అభివర్ణిస్తున్నారు. అమెరికాలో చమురు వినియోగం గణనీయంగా పడిపోవటంతో మొక్కజొన్నల నుంచి తయారు చేసే ఎథనాల్‌కు సైతం డిమాండ్‌ పడిపోయింది. ఫలితంగా మొక్కజొన్నల ధరలు పడిపోయాయి. అమెరికా వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం బియ్యం, గోధుమల ఉత్పత్తి రికార్డు స్ధాయిలో ఈ ఏడాది 126 కోట్ల టన్నులు ఉండవచ్చని, ఇది వినియోగం కంటే ఎక్కువ కనుక ఆంక్షలు సడలిస్తే సరఫరా మెరుగుపడవచ్చని భావిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి తీరుతెన్నులను బట్టి అంచనాలు, జోశ్యాలు మారిపోవచ్చు. అమెరికాలో గుడ్లు, పాలు, మాంసం సరఫరా తగ్గటంతో ధరలు ముఖ్యంగా గుడ్ల ధరలు 180శాతం వరకు పెరిగాయి. గత నెలలో జనం అవసరాలకు మించి కొనుగోలు చేయటం దీనికి ఒక కారణంగా భావిస్తున్నారు.చైనా పాల దిగుమతులు ఈ ఏడాది 19శాతం తగ్గుతాయని, అదే సమయంలో ప్రపంచంలో దిగుబడి తగ్గే అవకాశాలు లేనందున పాలు, పాల ఉత్పత్తుల ధరలు తగ్గవచ్చని భావిస్తున్నారు. 2018 చివరిలో చైనాలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ కారణంగా దేశంలోని సగం పందులను చంపివేయటంతో మాంసం ధరలు గణనీయంగా పెరిగాయి. పంది మాంసం బదులు గొడ్డు మాంసానికి మరలటంతో దాని ధరలు కూడా పెరిగాయి. కరోనా కారణంగా అన్ని చోట్లా ధరలు పడిపోయాయి.అయితే అమెరికాలో రాబోయే రోజుల్లో కొరత ఏర్పడవచ్చనే భయంతో జనం కొనుగోళ్లకు ఎగబడటంతో అక్కడ ధరలు పెరిగాయి.
ఈ ఏడాది కరోనా దాదాపు ప్రపంచమంతటా కొత్త సమస్యను తెచ్చి పెట్టింది. ఆయా వ్యవసాయ సీజన్లలో వలస లేదా అతిధి కూలీలు ఎక్కడ పని దొరికితే లేదా అవసరం మేరకు వలస పోవటం సర్వసాధారణం. గృహబందీ, రవాణా లేకపోవటం వలన ఈ ఏడాది కొరత తీవ్రమైంది. సీజనల్‌ వలస కూలీలు రాని కారణంగా తమకు రానున్న మూడు నెలల్లో రెండు లక్షల మంది అవసరమని ఫ్రాన్స్‌ అంచనా వేసింది. ఇండ్లలో చిక్కుకు పోయిన వారు పనులకు రావాలని వ్యవసాయ మంత్రి బహిరంగ విజ్ఞప్తి చేశాడు. నిరుద్యోగులైన కాటరింగ్‌ కార్మికులు వ్యవసాయ పనులకు రావాలని జర్మనీ అధికారులు కోరుతున్నారు. అక్కడ పండ్లు, కూరగాయల కోతకు ఏటా మూడులక్షల మంది వస్తారు. ఉక్రెయిన్‌ నుంచి వ్యవసాయ పనులకోసం కూలీలు పోలాండ్‌కు వలస వెళతారు. వారిని స్వదేశానికి పంపకుండా అక్కడే కొనసాగేందుకు అనుమతి ఇవ్వాలని రైతుల యూనియన్‌ ప్రభుత్వాన్ని కోరింది. వ్యవసాయ కూలీలు ఎక్కడకు పోవాలనుకుంటే అక్కడకు స్వేచ్చగా అనుమతించాలని ఐరోపా యూనియన్‌ సభ్య దేశాలను కోరింది. బ్రిటన్‌లో కూరగాయలు, పండ్ల కోతకు 80వేల మంది అవసరమని, వారికి ప్రత్యేక పాకేజ్‌ ఇచ్చేందుకు 93లక్షల పౌండ్లను ప్రభుత్వం మంజూరు చేయాలని రైతు సంఘాలు కోరాయి. ఇతర చోట్ల పనులు కోల్పోయిన వారిని వ్యవసాయరంగానికి మరలేట్లు ప్రోత్సహించాలని ఇతరులు కూడా కోరుతున్నారు. అమెరికాలో వ్యవసాయ కూలీల సంఖ్య చాలా తక్కువ, ఎక్కువ భాగం యంత్రాలతోనే పని నడుస్తుంది. అయితే మనుషులు అవసరమైన చోట పని చేసేందుకు పక్కనే ఉన్న మెక్సికో నుంచి హెచ్‌ 2ఏ వీసాలతో అనుమతిస్తారు. ఈ సంవత్సరం కరోనా కారణంగా అలాంటి వారు కనీసం అరవైవేల మంది తగ్గుతారని అంచనా వేశారు. ఇప్పటికే వచ్చి పని చేస్తున్నవారి వీసాలను పొడిగించాలని కోరుతున్నారు. ఒక వైపు వ్యవసాయేతర రంగాలలో పని చేసేందుకు ఇతర వీసాలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్‌ సర్కార్‌ వ్యవసాయంలో పని చేసే వారికి మాత్రం వీసాలు అదనంగా ఇవ్వాలని చూస్తోంది. అనేక దేశాలు ప్రకటిస్తున్న ఉద్దీపన పధకాలలో వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్న మొత్తాల వివరాలు ఇంకా తెలియనప్పటికీ మన కంటే మెరుగ్గా ఉంటాయని చెప్పవచ్చు.

Indian Farmers Struggle to Harvest, Sell Crops During COVID ...
మన రైతాంగ విషయానికి వస్తే ఈ ఏడాది ఇప్పటికే జరిగిన నష్టంతో పోల్చితే నామ మాత్రమే అయినా కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఇస్తున్న ఆరువేల రూపాయలను రెట్టింపు చేయాలి.దీన్ని కౌలు రైతులకు కూడా వర్తింప చేయాలి. కరోనా కారణంగా నష్టపోయిన పంటలకు బీమా పధకాన్ని వర్తింప చేసి పరిహారం ఇవ్వాలి. గ్రామీణ కార్మికులకు కనీసం వందరోజుల ఉపాధిని కల్పించాలి. ఉచితంగా అందచేస్తున్న ధాన్యం మొత్తాలను రెట్టింపు చేయాలి. కార్డులు లేనివారికి కూడా ఉదారంగా సాయం చేయాలి. ఖరీఫ్‌ సీజన్‌లో తీసుకున్న రుణాలకు చిన్న సన్నకారు రైతులకు వడ్డీ రద్దు చేయాలి. వచ్చే ఏడాది పంటల కనీస మద్దతు ధరలను ఒకటిన్నర రెట్లు పెంచాలి.
ఏప్రిల్‌ 17న అంతర్జాతీయ రైతాంగ పోరాటదినం జరిగింది. ఎనభై దేశాలకు చెందిన 180 రైతు సంఘాలు ఒక ప్రకటన చేస్తూ కరోనా కారణంగా ఇండ్లకే పరిమితం అవండి, మౌనంగా ఉండవద్దు అని పిలుపునిచ్చాయి. ప్రపంచ జనాభా కడుపు నింపేందుకు పూనుకోవటంతో పాటు రైతాంగ హక్కుల కోసం పోరాడాలన్నదే దాని సారాంశం.