Tags

, ,

Gilead says Remdesivir trial posted online prematurely was ...

ఎం కోటేశ్వరరావు
చైనాకు వ్యతిరేకంగా ఏ చెత్తను మార్కెట్లో పెట్టినా ఆమ్ముడవుతుందా ? కొన్ని మీడియా సంస్ధలు అలాంటి చెత్త వార్తలను అమ్మి సొమ్ము చేసుకొనేందుకు పూనుకున్నాయా ? ఏమో ! చైనా ” మందు ” జాగ్రత్త అనే శీర్షికతో ఒక ప్రముఖ తెలుగు పత్రిక సోమవారం నాడు ఒక వార్తను ప్రచురించింది. తప్పుడు వార్తలు రాసేందుకు, రాయించేందుకు కూడా ” సమగ్రశిక్షణ ” అవసరం అని కాస్త జాగ్రత్తగా చదివిన వారికి అర్ధం అవుతుంది. ఇంతకూ ఏమిటట?
జనవరి 20న కరోనా వ్యాప్తిపై ప్రకటన, తరువాతి రోజే రంగంలోకి ” వూహన్‌ లాబ్‌ ”, రెమ్‌డెసివిర్‌ ఔషధం పేటెంట్‌కు దరఖాస్తు. ఈ అంశాల మీద ఆ కథను అల్లారు. వైరస్‌ వ్యాప్తి గురించి ఆరు రోజుల పాటు బయటి ప్రపంచానికి తెలియకుండా చైనా ప్రభుత్వమే మోకాలడ్డిందని ఇంకా ఏవేవో రాసిన వాటిని పునశ్చరణ చేయనవసరం లేదు. దీనర్ధం ఏమంటే వైరస్‌ పరిశోధనలు చేస్తూ దాన్ని ఒక పధకం ప్రకారం బయటకు వదలిన చైనాలోని వూహాన్‌ వైరాలజీ సంస్ధ దాని నిరోధానికి అవసరమైన ఔషధాన్ని కూడా ముందే తయారు చేసి పెట్టుకుందని జనాల బుర్రలకు ఎక్కించే యత్నమే.
ఈ వార్తను లండన్‌ నుంచి ప్రచురితమయ్యే డెయిలీ మెయిల్‌ డాట్‌కామ్‌ 25వ తేదీ బిఎస్‌టి(బ్రిటీష్‌ సమ్మర్‌ టైమ్‌) రాత్రి పది గంటలకు ప్రచురించింది. దానికి మనం నాలుగున్నర గంటలను కలుపుకుంటే మన సమయం రాత్రి రెండున్నర అవుతుంది. ఆ వార్త లేదా ఏదైనా ఏజన్సీ వార్తను గానీ తీసుకొని పైన చెప్పిన కథను వండి వడ్డించి ఉండాలి. దాని సంగతి తరువాత చూద్దాం. ముందుకొన్ని విషయాలు ఇక్కడ చెప్పుకోక తప్పదు. చైనా గురించి మీడియాలో వచ్చేది, దాని వ్యతిరేక దేశాల నేతలు, శాస్త్రవేత్తలు చెప్పేదంతా నిజమే అని నమ్మేవారు నమ్మవచ్చు. అలా నమ్మకాన్ని ఖరారు చేసుకొనే ముందు భిన్న కథనాలు కూడా ఉన్నాయని, వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సవినయ వినతి. అవన్నీ ఎక్కడ కుదురుతాయి… మా వీనులకు విందు, చెవులకు ఇంపుగా ఉండేది, బుర్రకు కిక్కునిచ్చేదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాం అనే వారి నిజాయితీకి జోహార్లు.
కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి ప్రకటనలు బయటకు రాగానే చైనా గూఢచారులు కెనడా లాబ్‌ నుంచి అపహరించి వూహాన్‌ లాబ్‌ నుంచి బయటకు వదిలారు, చైనా ప్రమాదకర జీవ ఆయుధాలను తయారు చేస్తోంది అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నిజంగా బయటకు వదల దలచుకొంటే కెనడా లాబ్‌ నుంచే చైనా గూఢచారులు బయటకు పంప వచ్చు కదా ! దున్న ఈనిందంటే ముందు దూడను గాటన కట్టేయమన్నట్లుగా చాలా మంది నమ్మేశారు. నిజంగానే ఎవరైనా ఒక వైరస్‌ను బయటకు వదిలితే దానికి సరిహద్దులు,దేశాలు, రంగు బేధాల తేడాలుండవు, ఎక్కడ అనువుగా వుంటే అక్కడకు పాకి తన ప్రభావం చూపుతుందనే లోకజ్ఞానం ఈ సందర్భంగా పని చేసి ఉంటే ఇప్పుడు కరోనా ప్రళయ తాండవానికి కకావికలౌతున్న దేశాలన్నీ జాగ్రత్తలు తీసుకొని ఉండేవి. లక్షలాది ప్రాణాలను కాపాడేవి. కొంత మంది కావాలని కాదు గానీ ప్రమాదవశాత్తూ బయటకు వచ్చి ఉంటుందని సన్నాయి నొక్కులు నొక్కుతూ నమ్మింపచేసేందుకు ప్రయత్నించారు. ప్లేగు, మసూచిని కావాలని అంటించిన దేశాలను, రసాయన బాంబులు, గ్యాస్‌లో జనాన్ని మట్టు పెట్టిన దుర్మార్గాన్ని ప్రపంచం చూసింది. ఒక వైరస్‌ను సృష్టించి వదలిన దేశం గురించి చరిత్రలో నమోదు కాలేదు. కొన్ని అనుమానాలు వ్యక్తం అయినా ఎక్కడా రుజువు కాలేదు. ఒక కొత్త వైరస్‌ తొలుత ఎక్కడ బయటపడితే దాన్ని ఆదేశమే తయారు చేసింది అనే నిర్ధారణకు వచ్చేట్లయితే ఆ వరుసలో చైనా కంటే ముందు అనేక దేశాలు ఉన్నాయి. కరోనా వైరస్‌ గురించి ప్రపంచానికి ఇంతకు ముందే తెలుసు. తాజాగా తలెత్తిన కోవిడ్‌-19 వైరస్‌ కొత్తరకం అని కృత్రిమ సృష్టి కాదని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్ధ, అనేక మంది ఆ రంగంలో పని చేస్తున్నవారు ప్రకటించినా, కొందరు పని గట్టుకొని చేస్తున్న ప్రచారానికి మీడియా ఎలాటి విమర్శనాత్మక దృష్టి లేకుండా ఏకపక్షంగా ప్రాధాన్యత ఇస్తోంది.
రెండవ అంశం ఈ వైరస్‌ను అమెరికన్లే తయారు చేసి తమ దేశం మీద ప్రయోగించినట్లు అనుమానిస్తున్నట్లు చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఒక విమర్శ చేశాడు. అమెరికా మిలిటరీ దాన్ని తీసుకువచ్చినట్లు పేర్కొన్నాడు. అమెరికాలోని మేరీలాండ్‌లో ఉన్న ఫోర్ట్‌ డెట్‌రిక్‌ అమెరికా మిలిటరీ లాబ్‌ నుంచి వైరస్‌లు బయటకు రాకుండా నివారించేందుకు తగిన రక్షణ ఏర్పాట్లు లేనందున ఏడాది క్రితమే దాన్ని మూసివేశారని వెంటనే వార్తలు వచ్చాయి. అయితే తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేశారు తప్ప మూసివేయలేదని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ప్రకటించింది.
ఇక రెమిడెసివిర్‌ ఔషధం కధను చూద్దాం. కరోనా వైరస్‌ కొత్తది కాదు, గతంలోనే గుర్తించారు. దానిలో అనేక రకాలు ఉన్నాయి. తాజాగా తలెత్తినదానిని కోవిడ్‌-19 అని పేరు పెట్టారు. గతంలో తలెత్తిన కరోనా వైరస్‌, ఇతర వైరస్‌లకు వ్యాక్సిన్‌లు, ఔషధాలు తయారు చేసే సంస్ధలు ఎన్నో గతంలోనే పేటెంట్లకు దరఖాస్తులు చేశాయి. అంటే అవి ముందే మందులను తయారు చేసి వైరస్‌ను ఇప్పుడు సృష్టించాయని భావించాలా ? కుట్ర సిద్దాంతాలను పరిగణనలోకి తీసుకున్నట్లయితే కోవిడ్‌-19ను అమెరికానే సృష్టించిందని అనుకోవాలి? అది అలాంటి ప్రయత్నాలు చేయకపోతే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన గిలీడ్‌ కంపెనీ నాలుగు సంవత్సరాల క్రితమే కరోనా వైరస్‌ చికిత్సకు రెమిడెసివిర్‌ను అనుమతించాలని పేటెంట్‌కు దరఖాస్తు ఎందుకు చేసినట్లు ? ప్రపంచ వ్యాపితంగా వినియోగించేందుకు నాలుగు సంవత్సరాల క్రితమే దరఖాస్తు చేసినట్లు గిలీడ్‌ కంపెన చెప్పినట్లు డెయిలీ మెయిల్‌ రాసింది. కోవిడ్‌-19కు అది పని చేస్తుందని తేలితే భవిష్యత్‌లో సరఫరా చేసేందుకు గాను ప్రస్తుతం చికిత్సలో దాని పని తీరును నిర్ధారించుకునే పనిలో ఉన్నామని గిలీడ్‌ చెబుతోంది. నిజానికి ఆ ఔషధాన్ని ఎబోలా వైరస్‌కోసం గిలీడ్‌ తయారు చేసింది. ఇది కరోనాకూ పని చేస్తుందేమో అని అది నిర్ధారించుకుంటోంది. అదే ఔషధం తయారీకి తమకు పేటెంట్‌ ఇవ్వాలని ఊహాన్‌ వైరాలజీ సంస్ధ జనవరి 21న దరఖాస్తు చేసిందట. అది నిజంగా కరోనా కోసమో కాదో తెలియదు, కరోనా కోసమే అయితే ఏ తరగతి కోసమో అంతకంటే తెలియదు, దరఖాస్తులోని వివరాలు ఏడాది తరువాత గానీ బయటకు రావు. అలాంటిది ముందే కరోనా మందుకు పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసినట్లు ఏ ఆధారాలతో రాస్తారు ? ఒక వేళ నిజంగానే రెమ్‌డెసివిర్‌కు చైనా సంస్ధ దరఖాస్తు చేస్తే అంతకు ముందే ఉన్న గిలీడ్‌ కంపెనీకి ఇవ్వకుండా చైనా సంస్ధకు ఎలా ఇస్తారు ? నిజంగా ఆ ఫార్ములాను ఎవరైనా తస్కరిస్తే మరొక పేరుతో దరఖాస్తు చేస్తారు తప్ప అదే పేరుతో ఎలా చేస్తారు ? మరీ అంత అమాయకంగా ఎవరైనా ఉంటారా ? ఎప్పుడో నాలుగేండ్ల క్రితం దరఖాస్తు చేసిన దానికే ఇంతవరకు అనుమతి రాకపోతే జనవరిలో చేసిన దానికి వెంటనే అనుమతి ఎలా వస్తుంది ? ఇదంతా చూస్తే కందకు లేని దురద కత్తిపీటకు అన్నట్లు గిలీడ్‌ కంపెనీ తాపీగా ఉన్నా జర్నలిస్టులు కొందరు గోక్కుంటున్నారు.
ఇక రెమ్‌డెసివవిర్‌ గత కొద్ది వారాలుగా వార్తల్లో ఉంది. ఆ ఔషధాన్ని తయారు చేశారు గానీ ఎక్కడా ఉత్పత్తి చేయటం లేదు. ఎబోలా కోసం తయారు చేసిన దానిని ఇప్పుడు కరోనాకు ఉపయోగపడుతుందేమో చూద్దాం అన్నట్లుగా గిలీడ్‌ కంపెనీ ఉంది.కోవిడ్‌-19 రోగులు 63 మంది మీద ప్రయోగిస్తే 36 మందికి కాస్త గుణం కనిపించిందని, ఇంకా ప్రయోగదశలోనే ఉందని, ప్రపంచంలో ఎక్కడా చికిత్సకు అనుమతించలేదని కంపెనీ సిఇఓ డేనియల్‌ ఓడే ఏప్రిల్‌ 10న ప్రకటించినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వార్త పేర్కొన్నది.ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఫలితాలు వెల్లడైన తరువాత వినియోగం గురించి పరిశీలిస్తామని భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్‌) శాస్త్రవేత్త రామన్‌ గంగా ఖేద్‌కర్‌ చెప్పారు. 2015లో ఇదే కంపెనీ తయారు చేసిన హెపటైటిస్‌ సి ఔషధం గురించి చేతులు కాల్చుకున్న ఐసిఎంఆర్‌ అంత రెమ్‌డెసివర్‌ గురించి ఆసక్తి ప్రదర్శించటం లేదని కూడా వార్తలు వచ్చాయి. పనికి వచ్చేట్లయితే జనరిక్‌ ఔషధం తయారు చేసేందుకు గిలీడ్‌ కంపెనీ స్వచ్చందంగా అనుమతిస్తే తయారు చేయవచ్చని కొందరు అంతకు ముందు ఆలోచన చేశారు. మరికొన్ని వార్తల ప్రకారం ఇదే ఔషధంపై చైనాలోని రెండు ఆసుపత్రులలో 28 మగ చిట్టెలుకల మీద ప్రయోగాలు జరపగా వాటిలో వీర్య కణాల సంఖ్య తగ్గినట్లు, అసహజత పెరిగినట్లు ప్రాధమిక పరశీలనల్లో వెల్లడైంది.దీని గురించి ఎలాంటి నిర్దారణలకు ఇంకా రాలేదని ఏప్రిల్‌ 23న ఒక వెబ్‌సైట్‌ పేర్కొన్నది. ఇలాగే అమెరికా, బ్రిటన్‌, మరికొన్ని దేశాలలో కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇది కోవిడ్‌-19కు పని చేయదని తేలినట్లు గిలీడ్‌ కంపెనీ గతశుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపిందని కూడా వార్తలు వచ్చాయి.
చైనా దరఖాస్తు గురించి తమకు తెలుసునని, అయితే వచ్చే ఏడాది ఆ వివరాలను ప్రచురించేంత వరకు దాని గురించి తామేమీ చెప్పలేమని గిలీడ్‌ చెప్పింది. ఎబోలాకు తయారు చేసిన తమ ఔషధం కరోనాకు పనికి వస్తుందా లేదా అన్న అధ్యయనాన్ని నిలిపివేసినట్లు కూడా పేర్కొన్నది. ఒక కంపెనీ తయారు చేసిన దాన్ని మరొక దేశంలో పేటెంట్‌ కోరినా మంజూరు కాదు.గిలీడ్‌ కంపెనీ తమ ప్రయోజనాలకు భంగం కలుగుతోందని ఫిర్యాదు అయినా చేసి ఉండేది, ఒక వేళ అదే నిజమైతే ఈ పాటికి డోనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశ కంపెనీ తయారు చేసిన దాన్ని చైనా తస్కరించిందని ఈ పాటికే నానా యాగీ చేసి ఉండేవాడు. బహుశా ఈ ఔషధ ప్రయోగాల గురించి చెప్పి ఉంటే అది నిజమని నమ్మి కొద్ది రోజుల్లో వాక్సిన్‌ తయారు చేయాలని రెండు నెలల క్రితం ట్రంప్‌ బహిరంగంగా విలేకర్ల సమావేశంలో చెప్పాడని అనుకోవాల్సి వస్తోంది. కోవిడ్‌ -19 చికిత్సకోసం అమెరికా, ఐరోపాల్లో వాక్సిన్ల పేటెంట్‌ గురించి నంబర్లతో సహా సామాజిక మాధ్యమంలో ప్రచారం జరుగుతోంది. ఎఎఫ్‌పి వార్తా సంస్ధ వాటి గురించి నిర్ధారణ చేసుకొని అవన్నీ నకిలీ అని తేల్చింది.