Tags

, , , ,

मोदी सरकार की 20 बड़ी 'उपलब्धियां ...

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ కారణంగా యావత్‌ ప్రపంచం, మన దేశం కూడా అత్యంత కష్టకాలంలో ఉంది. గతంలో ప్లేగు, కలరా వంటి మహమ్మారులు ప్రబలినపుడు జనం పెద్ద సంఖ్యలో దిక్కులేని చావులకు గురైయ్యారు తప్ప ఇంతటి ఆర్దిక విపత్కర పరిస్ధితి బహుశా మన దేశంలో ఇదే ప్రధమం కావచ్చు.
మన దేశం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యవ్యవస్ధ కలిగినది అని చెప్పుకుంటాం. అఫ్‌కోర్స్‌ ఆ వైఖరితో విబేధించేవారిని అనుమతించినంత కాలం అది ప్రజాస్వామిక వ్యవస్ధగానే ఉంటుంది. ఎవరైనా కొత్త ఆలోచనను ముందుకు తేవటం లేదా సూచనలు చేయటం తప్పుకాదు. దాన్ని చర్చించి లేదా చర్చించకుండానే పాలకులు పక్కన పెట్టేయవచ్చు. గతంలో అనేక మంది ఎన్నో విలువైన సూచనలు చేశారు. వాటిని పాలకులు చర్చించకుండానే పక్కన పెట్టారు. పాలకులు చేసిన అనేక ప్రతిపాదనలు, చర్యలను జనం తిప్పికొట్టారు. ఇది ప్రజాస్వామ్య సూత్రం. కానీ అసలు సూచన చేయటమే తలకొట్టివేసే తప్పిదం అన్నట్లుగా ఎవరైనా వ్యహరించటాన్ని ఏమనాలి?
దేశంలో ఇప్పుడు ఏం జరుగుతోంది? అరవైతొమ్మిది వేల కోట్ల రూపాయల పెద్దల రుణాలను ప్రభుత్వ రంగ బ్యాంకులు సాంకేతికంగా రద్దు చేసినట్లు స్వయంగా రిజర్వుబ్యాంకే ఒక సమాచార హక్కు అర్జీదారుకు సమాధానమిచ్చింది. ఇదే విషయాన్ని గృహబందీకి ముందు ముగిసిన పార్లమెంట్‌ సమావేశాల్లో అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. రుణాల రద్దు గురించి వ్యాఖ్యలు చేసిన రాహుల్‌ గాంధీకి రద్దుకు అర్ధం తెలియకపోతే తమ నేత మన్మోహన్‌ సింగ్‌ను అడిగి తెలుసుకొమ్మని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో యాభై మంది ఐఆర్‌ఎస్‌ అధికారులు కోవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యల నిమిత్తం ఆదాయం పెంపుదలకు సూచనలు చేసినందుకు ఐఆర్‌ఎస్‌ అసోసియేషన్‌ నేతలుగా ఉన్న ముగ్గురు సీనియర్‌ అధికారుల మీద నరేంద్రమోడీ సర్కార్‌ వేటు వేసింది. ఈ ప్రతిపాదనలు దేశం కొంపను ముంచుతాయన్నట్లుగా చిత్రించింది. కొద్ది మంది కార్పొరేట్లకు, ధనికులకు లక్షల కోట్ల రూపాయల రుణాల రద్దు, రాయితీలు ఇచ్చినపుడు మునగని కొంప వారి నుంచి పన్ను రూపంలో తాత్కాలిక అత్యవసర చర్యగా కొన్ని లక్షల కోట్లు వసూలు చేస్తే ఎలాా మునుగుతుంది ? ఒక చర్యను అడ్డగోలుగా సమర్ధించుకున్న కేంద్రం మరొక చర్య మీద ఆగ్రహం వ్యక్తం చేయటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ?
మన ప్రధాని నరేంద్రమోడీ ఒక్కసారి కూడా విలేకర్ల సమావేశంలో మాట్లాడకుండా మౌనవృతంలో ఇప్పటికే ప్రపంచ పాలకుల్లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు.కోవిడ్‌-19(కరోనా వైరస్‌) మహమ్మారి విషయంలో మోడీ బాబాగా మారుతున్న తీరు తెన్నులు బాగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రుల సమావేశాల్లో, ఇతరంగా దేశ ప్రజల నుద్దేశించి మాట్లాడిన సందర్భాలలో చెప్పిన మాటలు, ప్రవచనాలే అందుకు పెద్ద నిదర్శనం. వాటిని పునశ్చరణ చేస్తే భక్తులకు ఆగ్రహం, అంతకంటే చదువరులకు సమయం దండగ అవుతుంది. గృహబందీ ప్రకటించటం ద్వారా మోడీ తన తెలివి తేటలను అమోఘంగా వ్యక్తపరిచారని,జనం ప్రాణాలను కాపాడారని భజన చేస్తున్నవారి గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. చైనాలో మన కంటే రెండు నెలల ముందు అమలు జరిపిన గృహబందీని గుర్తు తెచ్చుకొంటే దాన్నే మన దేశంలో అమలు జరపటం అనితర ఆలోచన, పెద్ద గొప్ప అని ఎవరైనా అంటే ఎందుకు కాదు అని తలవంచుకొని పోవటం తప్ప వారితో వాదించి లాభం లేదు.
భారతీయ జనతా పార్టీ పెద్దలు దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుగా ఉంటారు. తమ మోడీ గనుకే జిడిపిలో మన దేశాన్ని ఐదవ స్ధానంలో తేగలిగారని ఊరూ వాడా వాయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఐఎంఎఫ్‌ అంచనాల ప్రకారం ఏడవ స్ధానంలోకి తిరోగమించాం. అంతకంటే దిగజార్చలేదుక కనుక అదీ గొప్పేకదా అంటారేమో, దాన్ని కాసేపు పక్కన పెడదాం. కరోనా వైరస్‌ దాడిని ఎదుర్కొనేందుకు అనేక దేశాలు ఉద్దీపన పధకాలు ప్రకటిస్తున్నాయి. వాటిలో లోపాల గురించి లేదా కార్పొరేట్‌ రంగానికే పెద్ద పీట అన్న విమర్శలు-వాస్తవాల గురించి కూడా కాసేపు మరచిపోదాం. మన దేశం ఇంతవరకు ప్రకటించిన తక్షణ ప్రత్యక్ష ఉద్దీపన పధకం లక్షా 75వేల కోట్ల రూపాయలు మన జిడిపిలో 0.7శాతం. ఇదే సమయంలో తక్షణ ఉద్దీపన చర్యలకు గాను అమెరికా 9.1, జర్మనీ 6.9, బ్రిటన్‌ 4.5, ఫ్రాన్స్‌ 2.4శాతం ప్రకటించాయి. ఇవిగాక వాయిదా వేసిన, ఇతర ఉద్దీపనలు కూడా కలుపుకుంటే చాలా ఉన్నాయి. ప్రపంచ దేశాలకు నాయకత్వం వహిస్తున్నామని చెప్పుకుంటున్న మనం వీటి సరసన ఎక్కడ ఉన్నాం, ఇంత తక్కువ ప్రకటిస్తే మన నాయకత్వాన్ని అంగీకరిస్తాయా ? ఎందుకు మూట ముడి విప్పటం లేదు, ఆ దేశాలకు మల్లే పరిస్ధితి విషమించిన తరువాత విప్పుతామంటారా ? మరోవైపు మన మోడీ గారి దోస్తు ట్రంప్‌ రెండవ పాకేజీ కూడా ప్రకటించారు. ఆయనకేం నవంబరులో ఎన్నికలున్నాయి కనుక రెండు కాదు నాలుగు ప్రకటిస్తాడు, మనకేం ఎన్నికలున్నాయి అంటారా ? అదైనా చెప్పండి, జనం ఆశలేమీ పెట్టుకోకుండా తిరిగి ఎన్నికలు వచ్చే వరకు తమదారి తాము చూసుకుంటారు. అసలు సమస్య ఏమిటి ?
మోడీ బాబా గారు ఇంతవరకు చేసిన ప్రసంగాలు, ప్రకటించిన కార్యక్రమాల్లో మన సంకల్పాన్ని ప్రదర్శించే చప్పుట్లు కొట్టటం, నూనె, కొవ్వొత్తి దీపాలు వెలిగించటం, విద్యుత్‌ దీపాలు ఆర్పించటం, రోజూ చేతులు కడుక్కోవాలనే అంశాలు తప్ప మరొకటేమీ లేవు. కావాలంటే ప్రతి రోజూ చప్పట్లు కొడదాం, దీపాలు వెలిగిద్దాం, సంకల్పాన్ని పదే పదే ప్రకటిద్దాం. కానీ అది చాలదే ! గృహబందీ పొడిగింపు, సడలింపులకు సంబంధించి ముఖ్యమంత్రులతో మాట్లాడటం తప్ప ప్రధాని నరేంద్రమోడీ లేదా కేంద్ర ప్రభుత్వం ఇతరంగా ఆర్ధిక పరిస్ధితి గురించి సూచనలు, సలహాలను కోరుతూ ముఖ్యమంత్రులతో లేదా ఇతరులతో ఎలాంటి ప్రత్యేక వీడియో సమావేశాలను నిర్వహించలేదు, సూచనలు పంపాలని కోరలేదు. మన ఖజానా పరిస్ధితి ఇలా ఉంది ఏం చేద్దామని అడిగితే కేంద్రానికి పోయేదేముంది ?
ఇక బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని కావాలని ఎగవేసిన యాభై సంస్ధల పెద్దలకు దాదాపు 69వేల కోట్ల రూపాయలను గతేడాది సెప్టెంబరు నాటికి రద్దు చేసినట్లు రిజర్వుబ్యాంకు వెల్లడించింది. ఇలాంటి మొత్తాలు దాదాపు ఎనిమిది లక్షల కోట్లు, ఇంకా ఎక్కువే ఉంటాయి. అయితే సాంకేతిక భాషలో చెప్పాలంటే వీటిని సాంకేతికంగా రద్దు చేయరు. వసూలు చేయాల్సిన పారు బాకీల కింద రోజువారీ చిట్టాల నుంచి తొలగించి తరువాత వసూలు చేసే ఖాతాలో చూపుతారు. అయితే మన ”సమర్ధ ” ప్రధాని మోడీ గారి ఏలుబడిలో ఈ మొత్తంలో ఎంత వసూలు చేశారన్నది ముఖ్యం. గత పది సంవత్సరాలలో ఏడు లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పులను రద్దు చేస్తే ఆర్ధిక మంత్రి నిర్మలమ్మగారు సెలవిచ్చినదాని ప్రకారం కేవలం ”పక్కన పెడితే ” దానిలో 80శాతం నరేంద్రమోడీగారి ఏలుబడిలోనే జరిగింది. ఇవన్నీ ప్రతిపక్షాల బుర్రలో పుట్టినవి కాదు, రిజర్వుబ్యాంకు చెప్పిన లెక్కల ప్రకారమే నండోరు.కాంగ్రెస్‌ ఏలుబడిలో కావాల్సిన వారికి అప్పులు ఇప్పించారని చెప్పిన బిజెపి వారు అలాంటి కాంగ్రెస్‌ అనుకూలుర నుంచి గోళ్లూడగొట్టి ఎందుకు వసూలు చేయలేదు ? మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు వంటి వారందరూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కాంగ్రెస్‌ నుంచి బిజెపిలో చేరటమే దీనికి కారణమా ? పక్కన పెట్టిన (రద్దు చేసిన) బాకీలను వసూలు చేస్తున్నామని బ్యాంకులు, ప్రభుత్వం చెబుతోంది. ఎన్ని లక్షల కోట్లు పక్కన పెట్టారు, ఎన్ని లక్షల కోట్లు వసూలు చేశారో ఎవరికైనా చెబుతున్నారా ? పది హేను నుంచి 20శాతం వరకు మాత్రమే వసూలు శాతం ఉందని ఒక అంచనా, దాని ప్రకారం, నరేంద్రమోడీ తొలి ఏలుబడిలో రద్దు చేసినట్లు చూపిన 5,55,603 కోట్లకు గాను కనిష్టంగా 80వేల కోట్లు, గరిష్టంగా అయితే లక్షా పదివేల కోట్లకు మించి లేవు, అంతకు ముందు రద్దు చేసిన మొత్తంతో సహా ఏడులక్షల కోట్లనుకుంటే లక్షా40వేల కోట్లకు మించి తేలటం లేదు. విజయమల్య తాను చెల్లిస్తాను మహాప్రభో అంటున్నా తీసుకోవటం లేదనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఎంతకాలం వసూలును సాగదీస్తారు. వీరికి- వారికి పర్సెంటేజ్‌లు ఇంకా కుదరలేదా అని జనం అనుకుంటున్నారు.
బడా బడా బాబులకు వేల కోట్ల రుణాలు రద్దు చేశారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించినందుకు అది రద్దు కాదు, కావాలంటే మీ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను అడిగి తెలుసుకో అని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్వీట్ల మీద ట్వీట్లతో సమాధానమిచ్చారు. అమ్మా నిర్మలమ్మా మీరు చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజమే అనుకుందాం. అదే రీతిలో అనేక అంశాలకు మీరు కూడా నరేంద్రమోడీ గారిని అడిగి తెలుసుకొని జనానికి చెప్పాలమ్మా ? మచ్చుకు ఒక్కటి, నెలన్నరగా పెట్రోలు, డీజిలు రేట్ల సవరణ చేయకపోవటాన్ని ఏమనాలో కాస్త చెబుతారా ? అసలే ఉపాధిపోయి, ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న జనాన్ని లాక్‌డౌన్‌ సమయంలోనూ బాదటం లేదా, జేబులు కొల్లగొట్టటటాన్ని ఏమనాలి? గృహబందీకి ముందు చివరిగా మార్చి16న పెట్రోలు, డీజిలు రేట్లను సవరించారు. నాటి నుంచి నేటి వరకు ఎలాంటి సవరణ లేదు, ఈ మధ్య కాలంలో రికార్డు స్ధాయిలో ముడి చమురు రేట్లు పడిపోయాయి. అంతర్జాతీయ రేట్లు తగ్గితే తగ్గింపు, పెరిగితే పెంపు విధానం ప్రకారం ప్రతి రోజూ సవరిస్తామన్నారు కదా గత నెలన్నరగా ఎందుకు నిలిపివేశారు ? చమురు బిల్లు తగ్గింది, జనం దగ్గర వసూలు పెరిగింది, పోనీ ఆమేరకైనా జనానికి సంక్షేమ చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు. డబ్బు పోగేసి ఎవరికి ధారాదత్తం చేయాలనుకుంటున్నారు, గతంలో కార్పొరేట్లకు ప్రకటించిన రాయితీలను ఈ విధంగా జనం నుంచి వసూలు చేస్తున్నారా ? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు.
తొలిసారి ప్రకటించిన నామమాత్ర పాకేజి తప్ప మరోసారి ఆలోచన లేదని అన్ని తరగతుల నుంచి విమర్శలు వెల్లువెత్తినా దున్నపోతు మీద వానకురిసినా మిన్నకున్నట్లు ఏమీ మాట్లాడరు. ఐఆర్‌ఎస్‌ అధికారులు ఒక సలహా చెబితే వారినేతలను ఉద్యోగాల నుంచి పక్కన పెట్టి మీ మీద ఇతర చర్యలు ఎందుకు తీసుకో కూడదో సంజాయిషీ ఇవ్వండని నోటీసులు ఇచ్చారు. ఇదెక్కడి విపరీతం ? వారు తయారు చేసిన సిఫార్సుల పత్రాన్ని ప్రధాని, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు డైరెక్టర్లకు, ఆర్ధికశాఖకు పంపారు. అదే ప్రతిని మీడియాకు విడుదల చేశారు. యువ అధికారులను తప్పుదారి పట్టించారని, ఆ సూచన పత్రాన్ని అనుమతి లేకుండా బహిరంగ పరిచారు కనుక అది ఉద్యోగ నిబంధనలను అతిక్రమించటమే అంటూ ఈనెల 27వ తేదీలోగా రాతపూర్వకంగా లేదా స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నోటీసులు జారీ చేసింది. ముగ్గురు అధికారులను బాధ్యతల నుంచి తొలగించింది. ఈశాన్య ప్రాంత దర్యాప్తు విభాగం ముఖ్య డైరెక్టర్‌ సంజరు బహదూర్‌,ఐఆర్‌ఎస్‌ అధికారుల అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి,డిఓపిటి డైరెక్టర్‌ శ్రీ ప్రకాష్‌ దూబే, ఢిల్లీ ఆదాయపన్ను ముఖ్య కమిషనర్‌ మరియు అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి అయిన ప్రశాంత భూషణ్‌ మీద చర్య తీసుకున్నారు. వారు చేసిందేమిటి ?
ప్రభుత్వం ఇచ్చిన సంజాయిషీ నోటీసు ప్రకారం దూబే, బహదూర్‌ ఆదాయపెంపుదల గురించి ఒక నివేదికను తయారు చేయమని తమ జూనియర్‌ అధికారులను కోరారు. ఆ నివేదికను ప్రశాంత భూషణ్‌ బహిర్గతం చేశారు. ఈ చర్యలు అనుమతి లేనివి, తమ విధులను పక్కన పెట్టి ఇతర పనులు చేయటంగా, ఉద్యోగ నిబంధనలకు వ్యతిరేకమైనవి వర్ణించారు. యువ అధికారులు తయారు చేసిన ఈ సూచనలను ప్రభుత్వం తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకొని ఉండేది, కానీ ఈ ఉదంతంలో అధికారిక పద్దతుల్లో ప్రభుత్వానికి పంపకుండా బహిరంగ పరచటంతో ఇప్పటికే ఆర్ధిక వ్యవస్ధ వత్తిడికి గురైన స్దితిలో ఈ నివేదిక భయాందోళనలను, పన్ను విధాన అనిశ్చితి పరిస్ధితిని కలిగించిందన్నది ప్రభుత్వ పెద్దల వాదన. ఈ నివేదిక వివరాలు బయటకు వచ్చిన తరువాత భయంతో ఏ ఒక్క పారిశ్రామిక, వాణిజ్యవేత్త లేదా ఇతర ధనికులు భయంతో ఆత్మహత్యల వంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడినట్లు ఎలాంటి వార్తలు లేవు. ఏ విదేశీ కంపెనీ కూడా మన దేశం నుంచి బయటకు పోతామని, ఏ స్వదేశీ సంస్ధ కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించలేదు. కోట్లాది మందికి ఉపాధిపోయినా, వలస కార్మికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయి తీవ్ర ఆందోళనకు గురైనా, రాష్ట్రాలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులకు గురైనా చీమ కుట్టినట్లుగా కూడా లేని కేంద్ర సర్కార్‌ ఈ ప్రతిపాదనల మీద ఎందుకు అంతలా వణికిపోయినట్లు ? అదృష్టం కొద్దీ వారు నివేదికను బహిర్గతం చేసిన సమయంలో మార్కెట్‌లు మూతపడి ఉన్నాయట. అతిశయోక్తి గాకపోతే స్టాక్‌ మార్కెట్‌ ఆ నివేదికకు ముందు ఎన్నివేల పాయింట్లు పతనమైందో జనానికి తెలియదా ? మరి దానికి కారకులెవరు ?
ఐఆర్‌ఎస్‌ అధికారులేమీ ధనికుల ఆస్ధులను స్వాధీనం చేసుకోమని చెప్పలేదే, కోటి రూపాయలకు పైబడిన ఆదాయం వస్తున్నవారి మీద ఆదాయపన్ను 40శాతం విధించాలని, నాలుగుశాతం కోవిడ్‌-19 సెస్‌ విధించాలని, ఐదు కోట్ల రూపాయలకు పైబడిన సంపదలు కలిగిన వారి మీద సంపద పన్ను తిరిగి ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. సంఘపరివార్‌ ప్రమాణాల ప్రకారం చూసినా ఇదేమీ దేశద్రోహం కాదు, సూచనలు చేసిన వారు తుకడే తుకడే గ్యాంగు అసలే కాదు, పోనీ వారు చెప్పినట్లు వసూలు చేస్తే వచ్చే సొమ్ము పాకిస్ధాన్‌ లేదా అది పంపే ఉగ్రవాదులకు పోయేది కాదు. సామాన్యులు, మధ్యతరగతి వారి నుంచి ఎంత వీలైతే అంత పిండి కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలు గత ఐదు సంవత్సరాలుగా అనుసరిస్తున్న పెద్దలకు దానికి భిన్నమైన ఇలాంటి ప్రతిపాదనలు కేంద్ర సర్వీసు ఉన్నతాధికారుల నుంచి రావటం మింగుడు పడలేదు. ఆగ్రహానికి కారణం ప్రతిపాదనలు చేసినందుకు కాదట, వాటిని బహిర్గత పరచినందుకట. ప్రతి రోజూ కేంద్రానికి ఇలాంటి అనేక ప్రతిపాదనలు వస్తుంటాయి, ఇంతవరకు ఎన్నింటిని బయట పెట్టారు. బహుశా తమ ప్రతిపాదనలు కూడా అలా బీరువాలకే పరిమితం అవుతాయని, బహిరంగ పరిస్దే చర్చిస్తారని భావించి బహిర్గత పరచి వుండవచ్చు. ఇలాంటి ప్రతిపాదనల మీద చర్చ జరిగితే లేదా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటే ధనికులకు ఆగ్రహం కలుగుతుంది. అవును, ఇలాంటి విపత్కర పరిస్ధితుల్లో తాత్కాలికంగా కొంత కాలం అయినా ఎందుకు అమలు జరపరు అని కాస్త బుర్ర ఉన్న జనంలో చర్చ జరుగుతుంది. వాట్సాప్‌లో తప్పుడు ప్రచారం ఎంత జరిగినా పర్లేదు గానీ ఇలాంటి అంశాలు జనం మెదళ్లలోకి ఎక్కితే దాన్ని ” నయా లేదా కాషాయ దేశ భక్తులు ” తట్టుకోలేరు. అందుకే తమదైన శైలిలో ఐఆర్‌ఎస్‌ అధికారులను కొందరు అర్బన్‌ నక్సల్స్‌ అని నిందిస్తూ పోస్టులు పెట్టారు. ఎంత దుర్మార్గం ?
దేశంలోని 140 కోట్ల మంది జనాభాకు కోటీ 75లక్షల కోట్ల మేరకు ఉద్దీపన ప్రకటించిన కేంద్రం,అంతకు కొద్ది వారాల ముందు వేళ్ల మీద లెక్కించదగిన ధనికులకు లక్షా 45వేల కోట్ల రూపాయల పన్ను రాయితీ తగ్గించిన విషయం మరువగలమా ? కొత్త పరిశ్రమలకు పన్ను రేట్లు తగ్గించారు. ఆ విధానాన్ని ఐఆర్‌ఎస్‌ అధికారులు తప్పు పడుతూ బజారుకెక్కితే అది ఉద్యోగ నిబంధనలకు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం కనుక చర్య తీసుకున్నామంటే అర్ధం ఉంది. వారా పని చేయలేదే ! దేశం, ప్రపంచం యావత్‌ ఆరోగ్య అత్యవసర పరిస్ధితిని ఎదుర్కొంటున్న సమయంలో ఉద్యోగా మరొకరా అన్నదానితో నిమిత్తం లేకుండా సూచనలు చేయటాన్ని కూడా మన ప్రజాస్వామ్య వ్యవస్ధ అంగీకరించదా ?దీన్ని ప్రజాస్వామ్యం అనాలో నియంతృత్వం అని వర్ణించాలో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు.

baba ji ka thullu by modi
నూరు పూవులు పూయనివ్వండి, నూరు ఆలోచనలను తర్కించనివ్వండి ఇది చైనాలో మావో ఇచ్చిన ఒక ఉద్యమ పిలుపు. చైనా ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారాలను, విధానాల మీద సవిమర్శలను వ్యక్తం చేయనివ్వాలన్న కమ్యూనిస్టు పార్టీ నిర్ణయాన్ని అమలు చేసేందుకు మావో ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.(కొందరు నూరు పూవులు పూయనివ్వండి, వెయి ఆలోచనలను వికసించనివ్వండి అని కూడా దీన్ని వర్ణించారు. దీనిలో కూడా తప్పులేదు). అలాంటి ఆలోచనలను ఆహ్వానించిన కారణంగానే నేడు ప్రపంచంలో రెండవ ధనిక దేశంగా చైనా ఎదిగింది. సరే కొందరు కమ్యూనిస్టు నియంతృత్వం అని ఆరోపించే వారు, అది నిజమే అని నమ్మేవారు ఉన్నారు, రాబోయే రోజుల్లో కూడా ఉంటారు. ఇది చైనా వ్యవహారం కనుక పక్కన పెడదాం. మన దేశం విపత్కర పరిస్ధితుల్లో ఉన్నపుడు ఆదాయ పెంపు సూచనలు చేస్తే వాటితోనే దేశ ఆర్ధిక వ్యవస్ధ తలకిందులై పోతుందన్నట్లుగా భయపడటం అంటే గత ఐదేండ్లలో మన పెరుగుదల వాపా, బలుపా ?