Tags

, ,

West Bengal Congress on Twitter: "Our Prime Minister is so busy to ...

ఎం కోటేశ్వరరావు
యాభై మంది ప్రముఖులకు 68వేల కోట్ల రూపాయల రణాల రద్దు గురించి రాహుల్‌ గాంధీ ప్రశ్నించినందుకు ఆర్ధిక మంత్రి నిర్మలమ్మకు ఎక్కడ లేని కోపం వచ్చింది. మనకైనా అంతే కదా ఉన్నమాటంటే ఊరుకుంటామా ! దేశ పౌరులను తప్పుదారి పట్టించేందుకు సిగ్గు లేని రీతిలో ప్రయత్నిస్తున్నారని చాలా పెద్ద మాట వాడారు. అధికారంలో ఉన్నారు , జనం కాంగ్రెస్‌ను చులకనగా చూస్తున్నారు కనుక ఎంతమాటైనా అంటారు. రుణాల రద్దు అంటే రద్దు కాదు కావాలంటే మన్మోహన్‌ సింగ్‌ను అడిగి తెలుసుకోమని ఉచిత సలహా కూడా ఇచ్చారు. సరే రాహుల్‌ గాంధీ ఇప్పటికీ పరిణితి లేని కుర్రాడు, కాంగ్రెస్‌ కనుక దాని పూర్వీకులు చేసిన నిర్వాకాలను బిజెపి వారు మీ సంగతేమిటని జనం నిలదీసే వరకు నిందిస్తూనే ఉంటారు- ఆ విషయాన్ని వదలి వేద్దాం.
నిర్మలమ్మ గారు తమ నేత ప్రధాని నరేంద్రమోడీ గారిని అడిగి యావత్‌ దేశానికి చెప్పాల్సిన అంశం గురించి ఇక్కడ చూద్దాం. సౌదీ అరేబియా-రష్యా మధ్య ప్రారంభమైన చమురు యుద్ధం కారణంగా చమురు ధరలు రికార్డు స్ధాయిలో పతనమయ్యాయి. వారి మధ్య సయోధ్య కుదిరిన తరువాత కూడా ధరల పతనం ఆగలేదు. అమెరికాలో చమురు నిల్వ చేసేందుకు ఖాళీ లేకపోవటంతో ఎదురు డబ్బు ఇచ్చి చమురును వదిలించుకోవాల్సి వచ్చింది. చమురు చౌకగా వస్తోంది కనుక కేంద్ర ప్రభుత్వ బిల్లు కూడా గణనీయంగా తగ్గుతుంది.
గతేేడాది డిసెంబరు నెలలో సగటున ఒక పీపాను 66 డాలర్లకు కొనుగోలు చేశాము. అప్పుడు ధర వినియోగదారుడికి లీటరు పెట్రోలు ఢిల్లీలో 75.14 ఉండేది. 2015లో ఇదే సర్కార్‌ ఏలుబడిలో పీపా 35.68 డాలర్లకు కొనుగోలు చేసినపుడు వినియోగదారులకు రూ.59.98కి విక్రయించారు. ఇంకాస్త ముందుకు పోతే 2004లో పీపా ధర 34.22 డాలర్లు ఉన్నపుడు రూ.35.71కి దొరికింది. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్రణాళిక మరియు విశ్లేషణ విభాగం మే ఒకటవ తేదీ నవీకరించిన సమచారం ప్రకారం మార్చినెలలో ఒక పీపా చమురు సగటున మన దేశం 33.36 డాలర్లకు దిగుమతి చేసుకుంది. అది ఏప్రిల్‌ నెలలో 19.9డాలర్లకు పడిపోయింది. శుక్రవారం నాడు ధర 17.23 డాలర్లకు తగ్గింది. ఒక రోజు తగ్గవచ్చు మరో రోజు పెరగవచ్చు. కానీ ఆమేరకు వినియోగదారులకు మార్పులు జరగటం లేదు. మార్చినెల 16 నుంచి మే రెండవ తేదీ వరకు ఢిల్లీలో పెట్రోలు లీటరు రు.69.59 ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశమంతటా ఇదే విధంగా ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పోనీ కేంద్ర ప్రభుత్వం ధరల విధానంలో ఏదైనా మార్పులు ప్రకటించిందా అంటే అదేమీ లేదు. మరో పద్దతిలో నిర్మలా సీతారామన్‌ పదజాలంలో చెప్పాలంటే చమురు వినియోగదారులను సిగ్గులేని రీతిలో పట్టపగలే వినియోగదారుల జేబులు కొట్టి వేస్తున్నారు. ప్రభుత్వ చమురు కంపెనీలు దోపిడీ చేస్తూ ప్రయివేటు చమురు కంపెనీలను కూడా దోచుకొనేందుకు వీలు కల్పిస్తున్నాయి. మార్చి 14న కేంద్ర ప్రభుత్వం డీజిల్‌, పెట్రోలు మీద లీటరుకు మూడు రూపాయల చొప్పున పన్ను పెంచింది. రాబోయే రోజుల్లో మరో ఎనిమిది రూపాయలు పెంచుకొనేందుకు పార్లమెంట్‌లో ముందస్తు ఆమోదం తీసుకుంది. మన పార్లమెంట్‌ సభ్యులు దీనికి ఎందుకు ఆమోదం తెలిపారో అడిగే పరిస్దితి మనకు ఉంటే ఇలా జరిగేదా ?నరేంద్రమోడీగారి అచ్చేదిన్‌లో ఇదేమి దోపిడీ ?

3 reasons why fall in crude prices won't benefit India - Rediff ...
ఇంతగా చమురు ధరలు పడిపోయినా వినియోగదారులకు ఎందుకు తగ్గించటం లేదు ?
చమురు ధరల్లో పెద్దగా తేడాలు లేని రోజుల్లో ప్రతి రోజు ఒక పైసా లేదా రెండు పైసలు తగ్గించిన, పెంచిన రోజులు కూడా ఉన్నాయి. చూశారా మోడీ సర్కార్‌ వినియోగదారుల పట్ల ఎంత నిజాయితీగా ఉందో అని వంది మాగధులు పొగిడారు. ఇప్పుడు అసాధారణ రీతిలో చమురు ధరలు పడిపోయినందున పైసలు కాదు పదుల రూపాయలు తగ్గించాలి. పైసలంటే ఏదో కాని ఇంత పెద్ద మొత్తం తగ్గిస్తామా అన్నట్లుగా ఇప్పుడు సర్కార్‌ వ్యవహరిస్తోంది. గుండెలు తీసిన బంట్లు అంటే ఈ పాలకులేనా ? చమురు ధరలను ఎందుకు తగ్గించటం లేదో చూద్దాం.
1. ఇప్పటికే ధనికులకు ఇచ్చిన రాయితీలు, ధనికులు కావాలని ఎగవేసిన బ్యాంకు రుణాలు రద్దు చెయ్యటం, బ్యాంకులకు ఆ మేరకు ప్రభుత్వం నిధులు సమకూర్చటం. ఈ విధానాల పర్యవసానం ఖజనా గుల్లకావటం, దాన్ని పూడ్చుకొనేందుకు చమురు ధరల రూపంలో అందరి ముందే వినియోగదారుల జేబులు కొల్లగొట్టి లోటును పూడ్చుకొనేందుకు ఈ పని చేస్తున్నారు. మనం ఇంతకు ముందే చమురు దెబ్బలు తినేందుకు అలవాటు పడి చర్మం మొద్దుబారిన కారణంగా ఇదేమీ అనిపించటం లేదు, దీనికి తోడు గృహబందీల మయ్యాం. నోరెత్తితే దేశద్రోహం అవుతుంది.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ద్రవ్యలోటు జిడిపిలో 3.5శాతానికి మించకూడదు. ప్రభుత్వం అనుసరించిన దివాలా కోరు విధానాల కారణంగా ఈ ఏడాది ద్రవ్యలోటు ఏడుశాతం వరకు ఉండవచ్చని ముంబైకి చెందిన స్టాక్‌బ్రోకరేజ్‌ సంస్ధ మోతీలాల్‌ ఓస్వాల్‌ ఏప్రిల్‌13న ఒక నివేదికలో హెచ్చరించింది. మన జిడిపి వృద్ధి రేటు ఒక శాతానికి అటూ ఇటుకు దిగజారవచ్చన్న అంచనాల పూర్వరంగంలో లోటు ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదు. కనుక లోటు పూడ్చుకొనేందుకు ఇదొక మార్గం.
2. చమురు ధరలను తగ్గిస్తే కేంద్రానికి వచ్చే పన్ను ఆదాయం స్ధిరంగానే ఉంటుంది. ధరల మీద శాతాల ప్రాతిపదికన రాష్ట్రాలు వ్యాట్‌ విధిస్తున్నందున చమురు జారీ ధరలు తగ్గితే రాష్ట్రాలకు ఆదాయం పడిపోతుంది.అఫ్‌కోర్సు మిగిలిన రాష్ట్రాలకు సైతం ఉపయోగపడినా మెజారిటీ రాష్ట్రాలు బిజెపి పాలనలోనే ఉన్నాయి కనుక వాటికి ఆదాయం తగ్గకూడదు.
3. గృహబందీ కారణంగా రవాణా రంగం స్ధంభించింది, సాధారణ వినియోగం తగ్గింది, తిరిగి ఎంతకాలం తరువాత పూర్వపు స్ధితి ఏర్పడుతుందో తెలియదు కనుక చమురు రంగంలో ప్రయివేటు కంపెనీలు కూడా ఉన్నందున లావాదేవీలు తగ్గినా లాభాలు తగ్గకుండా చూసేందుకు అధిక ధరలను కొనసాగిస్తున్నారు.
4. రూపాయి విలువ పతనాన్ని నిలబెట్టటంలో కేంద్ర సర్కార్‌ ఘోరంగా విఫలమైంది. ఈ ఏడాది జనవరి నుంచి ఏడుశాతం పతనమైంది. రికార్డు స్ధాయిలో 76.92కు పడిపోయింది, 80కి దిగజారవచ్చని అంచనాలు. అదృష్టం ఏమిటంటే దీని వెనుక విదేశీ హస్తం ఉందని ఇంతవరకు ఎవరూ చెప్పలేదు.
5. ద్రవ్యలోటును పూడ్చుకొనేందుకు గుడ్ల కోసం బంగారు బాతులను కోయాలని కేంద్రం నిర్ణయించింది. దానిలో భాగంగానే భారత్‌ పెట్రోలియంలో వాటాలను అమ్మి ఈ ఏడాది అరవై వేల కోట్ల రూపాయలను ఖజనాకు జమచేయాలని కేంద్రం నిర్ణయించింది. చమురు ధరలను తగ్గిస్తే ఆ సంస్ధ లాభాలు తగ్గి వాటా విలువపడిపోతుంది. దాంతో తెగనమ్మితే నష్టం కనుక వాటిని అమ్మేంతవరకు కంపెనీకి లాభాలు తగ్గకుండా చూడాలంటే చమురు ధరలను తగ్గించకూడదు. ముందస్తు ధరలకు చమురు కొనుగోలు చేస్తాము. అయితే ఆ ధరలు ఖరారు అయిన తరువాత చమురు ధరలు భారీగా పడిపోయినందున వచ్చే నష్టాలను చమురు కంపెనీలు పూడ్చుకోవాలి కనుక ధరలు తగ్గించటం లేదు. అంతే కాదు ప్రపంచ వ్యాపితంగా శుద్ధి చేసిన చమురుకు డిమాండ్‌ పడిపోయింది. అందువలన శుద్ధి కర్మాగారాలు పూర్తి స్ధాయితో పని చేస్తే చమురు నిల్వ సమస్యలు తలెత్తుతాయి. మన దేశంలో కూడా అదే పరిస్ధితి ఏర్పడింది.తాత్కాలికంగా అయినా అవసరాలకు మించి చమురుశుద్ధి సామర్ద్యం ఉంది. ఈ దశలో డిమాండ్‌ లేనపుడు కంపెనీల వాటాలకు డిమాండ్‌ పడిపోతుంది. ఏనుగు వంటి బిపిసిఎల్‌ను కొనేందుకు ఈ దశలో ఎవరు ముందుకు వస్తారు? కంపెనీ వాటాల అమ్మకపు దరఖాస్తుల గడువును జూన్‌ 13వరకు ప్రభుత్వం గడువు విధించింది. అప్పటికి పరిస్ధితికి ఇంకా దిగజారితే… వేరే చెప్పాల్సిందేముంది ?
6.కేంద్ర ప్రభుత్వం మరో విధంగా కూడా చమురు ధరలతో ఖజనా నింపుతోంది. ఇప్పుడు ధరలు రికార్డు స్ధాయిలో పడిపోయినందున ఎంత ఎక్కువ ముడి చమురుకొని నిల్వచేస్తే ఒక వేళ రాబోయే రోజుల్లో ధరలు పెరిగితే ప్రభుత్వానికి అంతగా లాభం.ఒక వైపు వినియోగం పడిపోతున్నా కేంద్ర సర్కార్‌ చమురు కొనుగోళ్లను పెంచింది. అయితే చమురు ధరలు తగ్గినపుడల్లా వినియోగదారుల పన్ను రేటు పెంచి 2014-19 మధ్య కేంద్ర ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని పొందింది.
మరికొన్ని అంశాలను కూడా చూద్దాం. వర్తమాన ఖాతా లోటు (కరెంట్‌ ఎకౌంట్‌ ) ఇటీవలి కాలంలో మెరుగుపడింది. అయితే రూపాయి విలువ పతనం ఆ మెరుగుదలను దెబ్బతీస్తుంది. మార్చినెలలో మన విదేశీమారక ద్రవ్య నిల్వలు 475బిలియన్‌ డాలర్లు అయితే వాటిలో 300బిలియన్‌ డాలర్లు ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్స్‌(ఎఫ్‌పిఐ) ఖాతాలోనివే. అంటే విదేశీయులు మన దేశంలోని బ్యాంకుల్లో దాచుకొనే సొమ్ము, మన కంపెనీల వాటాలు, మనకు అప్పులు ఇచ్చిన మొత్తాలు. ఇవి కొన్ని సందర్భాలలో స్పెక్యులేషన్‌ కోసం కూడా వస్తాయి. అప్పులకు ఒక కాల పరిమితి ఉంటుంది తప్ప మిగిలిన వాటికి స్ధిరత్వం ఉండదు, లాభసాటిగా ఉంటే ఉంటాయి లేకపోతే నవారు అట లేదా పుల్ల ఆటగాండ్ల మాదిరి బిచాణా ఎత్తివేస్తాయి. మన వర్తమాన ఖాతా లోటు తగ్గటం అంటే మన విదేశీ మారక ద్రవ్య అవసరాలు తగ్గటం లేదా గణనీయంగా ఆ మొత్తాలు ఉండటం. అలా ఉండటం అంటే ఎప్‌పిఐలను మన ఆర్ధిక వ్యవస్ధ ఆకర్షించే శక్తి పరిమితం అని భావిస్తారు.
చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అంటే ధరల పెరుగుదల రేటు పడిపోతుంది. అయినా కేంద్రం పైన చెప్పుకున్న ఇతర కారణాలతో జనానికి ధరలు పెరిగితే మాత్రం ఏం అన్నట్లుగా చమురు ధరలను తగ్గించటం లేదు. పీపా ముడి చమురు ధరలో ఒక డాలరు తగ్గితే లీటరు డీజిల్‌ లేదా పెట్రోలుకు 50పైసలు తగ్గించవచ్చని చెబుతారు. ఇదే కాదు ముడి చమురు నుంచి వచ్చే నాఫ్తా వంటి ఉత్పత్తుల ధరలు కూడా తగ్గి ఎరువుల ధరలను తగ్గించాల్సి ఉంటుంది. కానీ ఎరువుల ధరలు తగ్గించలేదు.

India imports more oil in 5 years of Modi Govt; 10% import cut by ...
గృహబందీ ఏప్రిల్‌ 14వరకు కొనసాగితే పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం రెండు నుంచి మూడుశాతం మధ్య పడిపోవచ్చని క్రిసిల్‌ రేటింగ్‌ సంస్ధ అంచనా వేసింది. దాన్ని ఇప్పుడు మే 17వరకు కేంద్రం పొడిగించింది, తరువాత అయినా ఎత్తివేస్తారన్న హామీ లేదు, కరోనా వ్యాప్తి కేసులు వేగంగా పెరుగుతున్నందున తరువాత కూడా పొడిగించినా ఆశ్చర్యం లేదు. మన దేశంలో 15మిలియన్‌ టన్నుల చమురు నిల్వ సామర్ధ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించాము. అయితే ప్రస్తుతం 5.3మిలియన్‌ టన్నులు మాత్రమే నిల్వచేయగలం. మిగతా ఏర్పాట్లు పూర్తి కాలేదు. కనుక ప్రపంచ మార్కెట్లో ఎవరైనా ఉచితంగా ఇస్తామని చెప్పినా మనం చమురు తెచ్చుకోలేని పరిస్ధితి.
తాను వస్తే మంచి రోజులను తెస్తానని వాగ్దానం చేసిన నరేంద్రమోడీ జనం చచ్చేట్లు వ్యవహరిస్తున్నారు. ఆయన అధికారానికి వచ్చిన తరువాత ఎక్సయిజు పన్ను పెట్రోలు మీద 142, డీజిల్‌ మీద 318శాతం పెంచిన విషయం తెలిసిందే. ఇంకా పెంచేందుకు అనుమతి తీసుకున్నారని ముందే చెప్పుకున్నాము.అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రోజు వారీ ఎంత పెరిగితే అంత వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాము, ఎంత తగ్గితే అంత తగ్గిస్తాము, సబ్సిడీలేమీ ఉండవు, ఇదీ నరేంద్రమోడీ సర్కార్‌ జనానికి చెప్పింది. ఈ విధానం నుంచి గత కొన్ని వారాలుగా ప్రభుత్వం ఎందుకు వైదొలగిందో, ఎంతకాలం ఇలా అధిక ధరలకు విక్రయిస్తారో ఆర్ధిక మంత్రి నిర్మలమ్మగారు ప్రధాని నరేంద్రమోడీని అడిగి చెబుతారా ?
బిజెపి వారు ఇతర దేశాలతో మన దేశాన్ని పోల్చేందుకు పేటెంట్‌ తీసుకున్నారు, అదే ఇతరులు పోలిస్తే దేశద్రోహం, తుకడే తుకడే గ్యాంగులంటూ దాడి చేస్తారు. గత నెల 27న ప్రపంచంలో పెట్రోలు లీటరు సగటు ధర 92 సెంట్లు(డాలరుకు వంద సెంట్లు). మన ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్ధాన్‌లో 60,భూటాన్‌లో 65,నేపాల్లో 79, చైనాలో 83, శ్రీలంకలో 84, మన దేశంలో 95 సెంట్లు కాగా బంగ్లాదేశ్‌లో 105 సెంట్లు ఉంది. బంగ్లా మినహా మిగిలిన దేశాలలో రేట్లు ఎందుకు తక్కువ ఉన్నాయో ఆర్ధిక మంత్రి చెబుతారా ? బిజెపి మరుగుజ్జులు ఈ వాస్తవాలను కాదనగలరా ?