Tags

, , ,

Kim Jong-un 'speaks out' amid death claims, according to North ...

ఎం కోటేశ్వరరావు
ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ అన్‌ కొద్ది రోజులు కనిపించకపోవటం గురించి కట్టు కథలు అల్లి చివరకు ‘చంపేసిన’ మీడియా మే ఒకటవ తేదీన కనిపించిన తరువాత పిట్ట కథలు చెబుతోంది. ప్రపంచంలో అనేక దేశాధినేతలు, మీడియాలో కతలు వండే, చెప్పేవారిని, ఉత్తర కొరియా నుంచి ఫిరాయించి రాజభోగాలు అనుభవిస్తున్న విభీషుణులకు కిమ్‌ తీవ్ర ఆశాభంగం కలిగించారు. ప్రపంచంలో తమకు తెలియని రహస్యం ఉండదు అని విర్రవీగే సిఐఏ వంటి గూఢచార సంస్ధలు జరిగిన దాన్ని చూసి నోళ్లు వెళ్ల బెట్టాయి. అలాంటి పేరు మోసిన సంస్ధలు, జేమ్స్‌ బాండ్‌ వంటి గూఢచారులను కూడా ఉత్తర కొరియా వెర్రి వెంగళప్పలను చేసింది. అవాక్కయిన వారందరూ గుక్క తిప్పుకొని మరో రూపంలో దాడి చేస్తున్నారు. పిట్ట కథలు చెబుతున్నారు.
కిమ్‌ విషయంలో తెలుగు మీడియా కూడా తక్కువ తినలేదు. పోటీలు పడి అమెరికా సిఐఏ, దక్షిణ కొరియా సంస్ధలు, ఉత్తర కారియా వ్యతిరేకులు అందించిన సమాచారంతో కొద్ది రోజుల పాటు ఊహాగానాలతో కాలక్షేపం చేశారు. కొన్ని విదేశీ టీవీలు కిమ్‌ మరణించినట్లు వార్తలు చెప్పేశాయి. మన తెలుగు టీవీ ఉత్సాహవంతులెవరైనా ఆ పుణ్యం కట్టుకున్నారేమో తెలియదు. ఉత్తర కొరియా నుంచి ఫిరాయించిన ఒక మాజీ దౌత్యవేత్త థాయే ఎంగ్‌ హౌ మీడియాను రంజింప చేశాడు. కిమ్‌ నిలబడలేడు, నడవ లేని స్ధితిలో తీవ్రంగా జబ్బు పడ్డాడు అంటూ మే ఒకటవ తేదీకి మూడు రోజుల ముందు చెప్పాడు. అది వాస్తవం కాదని తేలటంతో ఇప్పుడు క్షమాపణలు చెప్పాడు. ఇంతకూ ఈ పెద్ద మనిషి 2016లో దక్షిణ కొరియాకు ఫిరాయించాడు, గత నెలలో పార్లమెంట్‌ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యాడు.ఉత్తర కొరియాకు సంబంధించిన అంశాలలో ఆకాంక్షలకు అనుగుణ్యంగా కచ్చితమైన విశ్లేషణ చేస్తానని, అంచనాలు వేస్తాననే నమ్మకంతో మీరు నన్ను పార్లమెంట్‌కు ఎన్నుకున్న కారణాలలో ఒకటని నాకు తెలుసు. కారణాలేమైనప్పటికీ నేను ప్రతివారికి ఇప్పుడు క్షమాపణ చెబుతున్నాను. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు బాధ్యత, తప్పు నాదే అని ప్రకటించాడు. కిమ్‌ చావు వార్త గురించి తాను ఎటూ చెప్పలేని కొద్ది రోజుల క్రితం చెప్పిన ట్రంప్‌ అంతర్గతంగా ఎదురు చూశాడని వేరే చెప్పనవసరం లేదు. అయితే మే ఒకటవ తేదీన కనిపించటంతో తనకు ఎంతో సంతోషంగా ఉందని ట్వీట్‌ చేశాడు.

Kim Jong Un resurfaces on state media with mysterious mark on ...
అతనికి ఉన్న సిగ్గు, బిడియం మీడియాకు ఎందుకు లేకపోయింది ? తేలు కుట్టిన దొంగల మాదిరి ఏమీ ఎరగనట్లు కొత్త కథలు అల్లటంలో నిమగమయ్యారు. కిమ్‌కు అసలు ఎలాంటి ఆపరేషన్లు జరగలేదని దక్షిణ కొరియా చెబుతోంది. అయినా సరే కిమ్‌ చేతికి ఒక గాయం మాదిరి కనిపిస్తోందని జర్నలిస్టులు చెబుతున్నారు. తన వ్యతిరేకులను, కట్టు కథలను అల్లిన మీడియా జనాలను వెర్రి వెంగళప్పలను చేయటానికి అలాంటి చిహ్నంతో మేకప్‌ వేసుకొని కావాలని కనిపించేట్లు చేశారేమో ! మరొక ఫిరాయింపుదారు, పార్లమెంట్‌కు ఎన్నికైన జి సెయోంగ్‌ హౌ అయితే మరొక అడుగు ముందుకు వేసి గుండె ఆపరేషన్‌ జరిగిన కిమ్‌ మరణించాడని 99శాతం కచ్చితంగా చెబుతున్నా, మృతి వార్తను అధికారికంగా శనివారం నాడు ప్రకటిస్తారు అని శుక్రవారం నాడు చెప్పాడు. ఇతగాడిని 2018లో అమెరికా పార్లమెంట్‌ ఉభయ సభలలో ప్రసంగించేందుకు ట్రంప్‌ ఆహ్వానించాడు. ఇలాంటి ఫిరాయింపుదార్లందరినీ అమెరికా సర్కార్‌ పెంచి పోషిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ఈ పెద్దమనిషి ఇప్పుడు మీడియాను తప్పించుకు తిరుగుతున్నాడు.
చీకట్లో బాణాలు వేసే ఇలాంటి వారి మాటలను నమ్మి జనానికి మీడియా కట్టుకధలు అందిస్తోందని మరోసారి రుజువైంది. నిజం చెప్పకపోగా ఉత్తర కొరియాతో సంబంధాలను మరింతగా చెడగొట్టినందుకు గూఢచార, రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీల నుంచి వారిని తొలగించాలని అధికార పక్షంలో కొందరు సూచించారు.న్యూస్‌ వీక్‌ వంటి పత్రికల్లో రాసే వారు కూడా ఫేక్‌ న్యూస్‌ను పాఠకుల ముందు కుమ్మరించారు. హయాంగ్‌సాన్‌ రాష్ట్రంలోని మౌంట్‌ కుమగాంగ్‌లో ఒక విల్లాలో కిమ్‌ అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని రాసింది. నిజానికి అలాంటి రాష్ట్రం ఉత్తర కొరియాలో లేదు. అది మౌంట్‌ మోయోయాంగ్‌ ప్రాంతంలోని ఒక ఆసుపత్రి పేరు. ఇలాంటి వాటిని చూసి జనంలో నగుబాట్ల పాలౌతారని కామోసు ఒక వ్యాఖ్యాత కిమ్‌ గురించి వార్తలు రాయటం కంటే రాయకపోవటమే మంచిది అని పేర్కొన్నాడు.
క్యూబా ప్రజల ప్రియతమ నేత ఫిడెల్‌ కాస్ట్రోను సిఐఏ లేదా అది కిరాయికి నియమించిన హంతకులు 634 పద్దతుల్లో లేదా అన్ని సార్లు హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు హాలీవుడ్‌లో ఒక సినిమా కూడా తీశారు. సిఐఏ ఏజంట్లు, వారితో కుమ్మక్కైన వారు పలు దేశాలలో అనేక మంది నేతలను మట్టుపెట్టారు. మీకు కూతవేటు దూరంలో కేవలం 144 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యూబా అధినేత కాస్ట్రోను ఏమి చేయలేకపోయారు మీ గొప్పల గురించి మాదగ్గర చెప్పకండి అని అమెరికా మిత్రులు బహుశా ఎకసెక్కాలాడి ఉంటారు. అందుకే కసితో అన్ని సార్లు కాస్ట్రోను హతమార్చేందుకు యత్నించి ఉండాలి అనుకోవాల్సి వస్తోంది.అలాగే గత ఏడు దశాబ్దాలుగా ఆసియాలో కొరకరాని కొయ్యగా ఉన్న ఉత్తర కొరియా నాయకత్వాన్ని హతమార్చేందుకు అమెరికన్లు చేయని యత్నం లేదు. కిమ్‌ జోంగ్‌ అన్‌ మీద, తాత కిమ్‌ ఇల్‌ సంగ్‌, తండ్రి కిమ్‌ జోంగ్‌ ఇల్‌ను హత్య చేసేందుకు అమెరికా, దక్షిణ కొరియా సంస్ధలు చేయని యత్నం లేదు. అనేక సార్లు మీడియాలో వారిని బతికి ఉండగానే చంపేశారు.
క్యూబాలో ఫిడెల్‌ కాస్ట్రో ఆయన సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు, కొరియాలో కిమ్‌ ఇల్‌ సంగ్‌, ఆయన కుటుంబ సభ్యులు తమ తమ దేశాల్లో నియంతలు, దురాక్రమణదారులకు వ్యతిరేకంగా పోరాడిన ఘన చరిత్ర కలిగిన వారు తప్ప నియంతలు కాదు. ఏ సోషలిస్టు దేశంలోనూ లేని విధంగా ఉత్తర కొరియాలో కిమ్‌ ఇల్‌ సంగ్‌ వ్యక్తి పూజ గురించి, ఆయన తరువాత కుమారుడు, ఆ తరువాత మనుమడికి పట్టం కట్టటం గురించి ఎవరైనా విమర్శలు చేయవచ్చు. కుటుంబవారసత్వం అన్నది అది తప్పా ఒప్పా అన్నది ఆ దేశ పౌరులు తేల్చుకుంటారు, కానీ నియంతలని నిందించటం తగనిపని. అమెరికాకు లొంగని వారందరినీ నియంతలుగానే చిత్రిస్తారు. దాని మద్దతుతో గద్దెలెక్కి జనాన్ని అణచివేసిన నియంతలందరినీ అపర ప్రజాస్వామిక వాదులుగా చూపుతారు. వారితో బహిరంగంగా చేతులు కలపటాన్ని ప్రోత్సహిస్తారు. అమెరికా సిఐఏ, దానితో చేతులు కలిపిన అనేక సంస్ధలు, వ్యక్తులు కూడా నిఖార్సుగా నిలిచిన సోషలిస్టు దేశాల నేతలు, అంతర్గత విషయాలలో బొక్కబోర్లా పడ్డారు. ఇప్పుడూ అదే జరిగింది, ఊహాగానాలు తప్ప ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. ఫిరాయింపుదార్ల మాటలు నమ్మి ట్రంప్‌ వంటి వారు నగుబాట్ల పాలయ్యారు.
ఏప్రిల్‌ 11న ఉత్తర కొరియా పాలక వర్కర్స్‌ పార్టీ విధాన నిర్ణాయక కమిటీ సమావేశంలో కిమ్‌ పాల్గొన్నారు. పదిహేనవ తేదీన కిమ్‌ ఇల్‌ సంగ్‌ జయంతి కార్యక్రమానికి హాజరు కాలేదు.ఇరవై ఒకటవ తేదీన అమెరికా నిధులతో దక్షిణ కొరియా నుంచి నడిచే డెయిలీ ఎన్‌కె అనే దినపత్రిక కిమ్‌కు గుండె ఆపరేషన్‌ జరిగినట్లు రాసింది. ఇరవై మూడవ తేదీన కిమ్‌ ప్రయివేటు రైలు ఒక దగ్గర కనిపించిందంటూ కొన్ని చిత్రాలను విడుదల చేశారు, అదే రోజు అక్కడకు చైనా వైద్యులు వచ్చినట్లు కూడా వార్తలను రాశారు. మే ఒకటవ తేదీన ఒక ఎరువుల కర్మాగారంలో జరిగిన మేడే కార్యక్రమంలో పాల్గొన్న కిమ్‌ చిత్రాలు, వీడియోలను విడుదల చేయటంతో పుకార్ల మిల్లుల యంత్రాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఫిరాయింపుదార్లు, అమెరికా ఏజంట్లు వ్యాపింప చేసిన వార్తలను తాము నమ్మటం లేదని దక్షిణ కొరియా ప్రభుత్వం ఒకవైపు చెబుతున్నా, తప్పుడు సమాచారాన్ని ఖండించకపోవటంతో మీడియా రెచ్చిపోయింది. గతంలో ఉత్తర కొరియన్లు ఆకలితో చచ్చిపోతున్నారంటూ మీడియాలో చెప్పిన అంకెలను అన్నింటినీ కలిపితే ఆ దేశ జనాభాను మించి ఉన్నాయి. అసలు దేశమే అంతరించి పోయి ఉండేది. ఎవరికైనా ఇబ్బందులు రావటం వేరు, వాటిని బూతద్దంలో చూపి అంతా అయిపోయినట్లుగా చెప్పటాన్ని ఏమనాలి?

Kim Jong-un Resurfaces, State Media Says, After Weeks of Health Rumors
కిమ్‌ కనపడటం లేదంటూ చావుతో సహా రకరకాల ప్రచారం చేసిన పెద్దలు ఇప్పుడు అవే నోళ్లతో ఆరోగ్యంగా ఉన్నాను, ఇప్పటికీ అధికారంలో ఉన్నాను అని రుజువు చూపేందుకు ఇప్పుడు బయటకు వచ్చారంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఒక వేళ తనకేదయినా జరిగితే అధికారం కోసం ఎవరు ఎలా ప్రవర్తిస్తారో, జనం ఎలా స్పందిస్తారో తెలుసుకొనేందుకు కిమ్‌ చావు నాటకం అడారని కొందరు ఇప్పుడు వీక్షకులకు కతలు వినిపిస్తున్నారు. అధికారం కోసం పాకులాడిన వారి తొలగింపు తదుపరి జరగనుందని చెబుతున్నారు. కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ ఇటీవల సోదరుడితో తరచూ కనిపిస్తున్నారని, తదుపరి ఆమే పీఠం ఎక్కవచ్చంటూ గతంలో ప్రచారం చేశారు. ఇతర దేశాల నేతల మాదిరి ప్రతి రోజూ సోషలిస్టు దేశాల నేతలు మీడియాలో కనిపించకపోవటం కొత్తేమీ కాదు.2014లో నలభై రోజుల పాటు కిమ్‌ బహిరంగ కార్యక్రమాల్లో కనిపించలేదు. అంతకు ముందు ఆయన తండ్రి కిమ్‌ జోంగ్‌ ఇల్‌ కొన్ని నెలల పాటు కనిపించని సందర్భం కూడా ఉంది. తన సమీప బంధువు కిమ్‌ కొయోంగ్‌ హురును విషమిప్పించి కిమ్‌ చంపించాడని ఫిరాయింపుదార్లు నమ్మబలికారు. ఆ తరువాత ఆమె చిరునవ్వుతో దర్శనమిచ్చింది. ఉత్తర కొరియాలో ఏమి జరుగుతోందో తెలియదని ఇనుపతెర ఉందని చెబుతారు. అదే నోటితో అమెరికాలోని పెంటగన్‌ లేదా సిఐఏ కార్యాలయాల్లో ఏమి జరుగుతోందో తెలియదని, అక్కడి పాలకులు నియంతలని మీడియాలో ఎందుకు వర్ణించరు? తాము మెచ్చింది రంభ-మునిగింది గంగ అంటే ఇదేనా ?