Tags
communist ideological differences, communist ideological differences in India, Communist Party, Communists, CPI, CPI()M
ఎం కోటేశ్వరరావు
కారల్ మార్క్స్ 202వ జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమంలో వచ్చిన ఒక పోస్టు దిగువ విధంగా ఉంది. ఒక జర్నలిస్టు తన వాల్ మీద షేర్ చేస్తే దాని నుంచి నేను తీసుకున్నాను. అభిమాని-కార్యకర్త మధ్య సంభాషణగా దీన్ని రాశారు, రచయిత పేరు తెలియదు. ఏ సందర్భంగా రాసినప్పటికీ దీనిలోని అంశాలు అనేక మందిలో ఉన్నాయనేది ఒక వాస్తవం. ఒక జర్నలిస్టుగా, పరిశీలకుడిగా కొన్ని అభిప్రాయాలను చర్చ కోసం పాఠకుల ముందు ఉంచుతున్నాను. నేను కమ్యూనిస్టు సిద్దాంత పండితుడిని కాదు కనుక పొరపాటు అభిప్రాయాలు వెల్లడిస్తే ఎవరైనా సరిచేయవచ్చు. ఇది సమగ్రం అని కూడా చెప్పలేను, ఒక అభిప్రాయం మాత్రమే.
పురోగామి, కమ్యూనిస్టు ఉద్యమ అభివృద్ధి కోసం నూరు పూవులు పూయనివ్వండి నూరు ఆలోచనలను వికసించనివ్వండి అనే ఆలోచనతో ఏకీభావం ఉన్న వ్యక్తిగా చేస్తున్న వ్యాఖ్యలను ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోవద్దని మనవి. అసలు పోస్టు ఏమిటో తెలియకుండా దాని మీద వ్యాఖ్యలు చేయటం వలన పాఠకులకు ఇబ్బందిగా ఉంటుంది కనుక ఆ పోస్టును ముందుగా ఉన్నది ఉన్నట్లుగా ఇస్తున్నాను. తరువాత అభిమాని ప్రశ్నలను అలాగే ఉంచి లేవనెత్తిన అంశాలకు మరో కార్యకర్త వివరణ రూపంలో నా అభిప్రాయాలను వెల్లడిస్తున్నట్లు గమనించాలని మనవి. బుల్లెట్ల రూపంలో చిట్టి పొట్టి వివరణలు ఇచ్చి సందేహాలను తీరిస్తే మంచిదే కానీ, అన్ని వేళలా అది సాధ్యం కాదు. సాధ్యమై ఉంటే కాపిటల్ గ్రంధాన్ని అంత వివరంగా మార్క్స్ రాసి ఉండేవారు కాదు. దీన్ని కూడా చదివే ఓపికలేని అభిమానులు, కార్యకర్తల వలన ప్రయోజనం లేదు. కనుక ఓపిక, ఆసక్తి ఉన్నవారు మొత్తం చదవాలని మనవి. లేనట్లయితే ఇక్కడితోనే ముగించి మరింత ఉపయోగకరమైన విషయాలను చదువుకోవచ్చు.
(దిగువ ఉన్నది నేను స్వీకరించిన పోస్టు)
అభిమాని – కార్యకర్త – మధ్యలో మార్క్స్
అభిమాని: మన దేశంలో మార్క్స్ వారసులు ఎవరు?
కార్యకర్త: పదుల సంఖ్యలో ఉన్న అన్ని కమ్యూనిస్టు పార్టీల్లోని నాయకులు, కార్యకర్తలు, సభ్యులు, సానుభూతిపరులు.
అభిమాని: మరి మార్క్స్ వారసులు ఇన్ని పార్టీల్లో ఎందుకున్నారు?
కార్యకర్త: తీవ్రమైన సైద్ధాంతిక, రాజకీయ విభేదాలు ఉన్నాయి కాబట్టి.
అభిమాని: తీవ్రమైన సైద్ధాంతిక, రాజకీయ విభేదాలు అంటే ఏమిటి?
కార్యకర్త: అవి తీవ్రమైనవి కాబట్టి, అంత సులభంగా అందరికీ అర్థం అయ్యేలాగా చెప్పడం సాధ్యం కాదు. ఇప్పుడు వివరించడం అస్సలు సాధ్యం కాదు.
అభిమాని: ఈ తీవ్రమైన సైద్ధాంతిక, రాజకీయ విభేదాలకు మార్క్స్ మౌలిక రచనల్లో ఏమైనా సమాధానాలు దొరుకుతాయా?
కార్యకర్త: మార్క్స్ మౌలిక రచనలు అంటే ఏమిటి?
అభిమాని: మార్క్స్ మౌలిక రచనలు చాలా ఉన్నాయి. పోనీ ఇప్పటి వరకూ మీకు తెలిసిన, మీరు చదివిన మార్క్స్ రచనలు ఏంటో చెప్పండి?
కార్యకర్త: ఏంగెల్స్ తో కలిసి రాసిన కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో చదివాను. మార్క్స్ రాసిన ‘పెట్టుబడి’ గ్రంథాన్ని చూశాను, దాని గురించి విన్నాను, పూర్తిగా చదవలేదు. పెట్టుబడి గ్రంథంలోని మూడు వాల్యూమ్స్ బహుశా మా నాయకులు కూడా చదివి ఉండరు. మిగిలిన మౌలిక రచనల గురించి పెద్దగా తెలియదు.
అభిమాని: మార్క్స్ మౌలిక రచనలు చదవకుండా, మార్స్కిస్టులమని చెప్పుకోవడం, మార్క్స్ కి జేజేలు పలకడం సబబేనా?
కార్యకర్త: రాముడిని నమ్మేవాళ్ళంతా రామాయణాన్ని చదవలేదు కదా!
అభిమాని: అది మతం, నమ్మేవారు భక్తులు. కానీ మార్క్సిజం ఒక శాస్త్రమని చెబుతున్నప్పుడు, మార్క్సిస్టులు భక్తులు కాదు కదా!
కార్యకర్త: ఇది ఆలోచించాల్సిన విషయమే అయినా, మరీ ఆ పోలికేంటి?
అభిమాని: మరైతే మౌలిక రచనల్ని చదవడం ప్రారంభిస్తే, వాటిలోనే ఈ సైద్ధాంతిక, రాజకీయ విభేదాలకు సమాధానం దొరుకుతుందేమో పరిశీలించండి.
కార్యకర్త: ఈరోజు మార్క్స్ జయంతి సందర్భంగా మా పార్టీ కూడా కొన్ని కార్యక్రమాల్ని రూపొందించింది. అవన్నీ పూర్తయ్యాక, మీరు చెప్పిన దాని గురించి ఆలోచిస్తాను.
(పై పోస్టు మీద నా అభిప్రాయాలు దిగువ ఇస్తున్నాను)
అభిమాని – కార్యకర్తల సమన్వయమే మార్క్స్
అభిమాని: మన దేశంలో మార్క్స్ వారసులు ఎవరు?
కార్యకర్త: ఎక్కడైనా దోపిడీ సమాజాన్ని రూపు మాపాలని చిత్తశుద్దితో పని చేసే వారు, కోరుకొనే వారందరూ వారసులే, వారంతా కమ్యూనిస్టు పార్టీల్లోనే ఉండాల్సిన అవసరం లేదు. అందుకు ఉదాహరణకు లాటిన్ అమెరికా దేశాలు, అమెరికాలో, ఇతర చోట్ల మార్పుకోరుకొనే కమ్యూనిస్టేతర వామపక్ష శక్తులు కూడా వారసులే. మార్క్స్ వారసత్వానికి పేటెంట్ లెప్ట్ తప్ప రైట్ లేదు.
అభిమాని: మరి మార్క్స్ వారసులు ఇన్ని పార్టీల్లో ఎందుకున్నారు?
కార్యకర్త: ఈ ప్రశ్న గురించి చర్చించే ముందు ఒక ప్రశ్న. మార్క్స్‌ను అభిమానించే వారిలో కొందరే కార్యకర్తలుగా, ఎక్కువ మంది అభిమానులుగా ఎందుకు ఉన్నారో ఎవరికి వారు సమాధానం చెప్పుకోవాలని మనవి. సమాజాన్ని స్ధూలంగా దోపిడీదారులు-దోపిడీకి గురయ్యేవారు అని చూస్తే దోపిడీదారులందరూ ఒకే పార్టీలో ఎందుకు లేరో కూడా ఆలోచించాలి. మార్క్సిజం పిడివాదం కాదు. అది నిరంతరం నవీకరణకు గురయ్యే ఒక శాస్త్రం. అది చెప్పినట్లు దోపిడీ సమాజం అంతం కావటం అనివార్యం తప్ప అది అన్ని చోట్లా ఒకే విధంగా ఒకే సారి జరుగుతుందని ఎక్కడా చెప్పలేదు. అలాంటి జోశ్యాలు కొన్ని తప్పాయి. కమ్యూనిస్టు ప్రణాళికను రాయటానికి ముందే జర్మనీలో, ఇతర దేశాల్లో కమ్యూనిస్టులు ఉన్నారు. అది రాసిన లేదా రాస్తున్న సమయంలోనే జర్మనీతో సహా అనేక ఐరోపా దేశాలలో తిరుగుబాట్లు జరిగాయి. వాటిలో కమ్యూనిస్టులు పాల్గొన్నారు గానీ నాయకత్వ పాత్రలో లేరు. జర్మన్ కమ్యూనిస్టు లీగ్ రెండు భావాల, సంస్ధల సమ్మిళితంగా ఏర్పడిన పార్టీ. ఆ మాటకొస్తే ప్రతి పార్టీ చరిత్రా అదే, స్థూలంగా కొన్ని అంశాలతో ఏకీభవించే వారు దగ్గరయ్యారు. విబేధాలు తలెత్తినపుడు విడిపోయారు. 1836 లో లీగ్ ఆఫ్ జస్ట్ పేరుతో పని ఏర్పడిన క్రైస్తవ కమ్యూనిజం, ఊహావాద కమ్యూనిజం భావాలతో ఉన్న జర్మన్ కార్మిక నేత కారల్ ష్కాప్పర్ నాయకత్వంలో దేవుని రాజ్యం ఏర్పాటు చేయాలనే సత్ససంకల్పంతో పారిస్‌లో ఏర్పడి పని చేసింది. ఈ సంస్ధతో కారల్ మార్క్స్ మరియు ఎంగెల్స్ ప్రధాన పాత్రధారులుగా ఉంటూ బెల్జియంలోని బ్రసెల్స్‌లో పని చేసిన కమ్యూనిస్టు కరస్పాండెన్స్ కమిటీ విలీనమై 1847లో కమ్యూనిస్టు లీగ్‌గా మారాయి. హైదరాబాద్ ఎలా వెళ్లాలి అని ఎవరినైనా అడిగిత నాలుగు దిక్కుల్లో ఉన్నవారు నాలుగు విధాలుగా చెబుతారు. బస్సుల గురించి తెలిసిన వారు బస్సుద్వారానే వెళ్లాలని చెబుతారు. అలాగే రైళ్లు, విమానాల వారు తమ పద్దతులను చెబుతారు. జర్మన్ కమ్యూనిస్టు లీగ్ ఏర్పడిన తరువాతే కమ్యూనిస్టు ప్రణాళిక రచన జరిగింది. అందువలన భిన్న ఆలోచనలు, భిన్న మార్గాలతో సమసమాజాన్ని స్ధాపించాలని ఐక్యమైన వారిలో ఎలా సాధించాలి అనే అంశంపై భిన్న అభిప్రాయాలు తలెత్తటం సహజం. అనేక పార్టీలు ఏర్పడటానికి ఇదే మూలం. ఈ మౌలిక అంశాన్ని ఎవరూ విస్మరించలేరు. ఎవరి మార్గం సరైనది అన్నది ఎక్కడికక్కడ ఆచరణలో తేలాల్సి ఉంది. అనేక దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు ఒకే సమయంలో ఉనికిలోకి వచ్చినా అన్ని చోట్లా విప్లవాలు జయప్రదం కాలేదు. అంతెందుకు నిజాం సంస్ధానంలో తెలుగు, కన్నడ, మరాఠీ ప్రాంతాలు ఉన్నాయి. నిజాం దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలుగా ఉన్న ప్రాంతంలోనే సాయుధ పోరాటం ఎందుకు పారంభమైంది. తెలంగాణాలో ఇతర చోట్లకు, మిగిలిన కన్నడ, మరాఠా ప్రాంతాలకు ఎందుకు విస్తరించలేదు. వారికి నిజాంపాలనపై ఎందుకు ఆగ్రహం రాలేదు. ఇలాంటి అంశాలన్నీ అధ్యయనం చేయాల్సినవి. పాఠాలు తీసుకోవాల్సినవి. కమ్యూనిస్టు పార్టీలు కానివన్నీ దోపిడీని కోరుకొనేవే. అలాంటపుడు ఇన్ని రకాల పార్టీలుగా వారంతా ఎందుకు ఉన్నారు ? దోపిడీని అంతం చేయటం ఎలా అన్న అంశంపై కమ్యూనిస్టు పార్టీలలో తేడాలు తెస్తే దోపిడీ చేయటం ఎలా అన్న విషయంలో మిగతా పార్టీల మధ్య అధికార కుమ్ములాటలే అన్ని పార్టీలుగా ఏర్పడటానికి కారణం.
అభిమాని: తీవ్రమైన సైద్ధాంతిక, రాజకీయ విభేదాలు అంటే ఏమిటి?
కార్యకర్త: వాటిని అర్ధం చేసుకోవటం అంతకష్టమేమీ కాదు, సమాధానం చెప్పలేకపోతే కుత్తుకలను ఉత్తరించే అపూర్వ చింతామణి ప్రశ్న అసలే కాదు. అమెరికాలో ఉన్న కార్మికవర్గానికి- ఆదిలాబాద్ అడవుల్లో ఉన్న కార్మికవర్గ స్ధాయి, అవగాహన ఒకే విధంగా ఉండదు. మన నిచ్చెన మెట్ల సమాజంలో దళిత కార్మికుడి ఆలోచన, దళితేతర కార్మికుల ఆలోచన ఒకే విధంగా ఉండదు. ఇద్దరూ ఒకే ఫ్యాక్టరీలో పని చేస్తూ ఒకే దోపిడీకి గురవుతున్నా, దళితుడికి ప్రత్యేకమైన సామాజిక అణచివేత అదనపు సమస్యగా ఉంటుంది. ఏ దోపిడీని ముందు అంతం చేయాలన్న అంశపై ఏకాభిప్రాయం లేకపోవటమే ఒక సైద్దాంతిక విబేధం.ఇలా అనేక వాస్తవిక అంశాల మీద సమస్యలు తలెత్తాయి. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌కు వ్యతిరేకంగా సోవియట్ యూనియన్ నిలిచింది. దాని సరసనే బ్రిటన్ కూడా పోరాడింది. బ్రిటీష్ వారితో విబేధాలున్నా తొలి కార్మిక రాజ్యంతో కలసి పోరాడుతోంది, హిట్లర్ ముట్టడి సోవియట్ గురైంది కనుక బ్రిటీష్ వారికి మద్దతు ఇస్తే అది సోవియట్‌కు బలం చేకూర్చుతుందనే అభిప్రాయంతో క్విట్ ఇండియా పిలుపు సమయంలో కమ్యూనిస్టులు దూరంగా ఉన్నారు. ఇది ఒక సైద్దాంతిక సమస్య విబేధం. తరువాత కాలంలో అలా చేయటం తప్పని పాఠం నేర్చుకున్నారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడటంలో కొన్ని తేడాలున్నా కాంగ్రెస్, కమ్యూనిస్టులు, సోషలిస్టులు మొత్తం మీద ఐక్యంగానే ఉన్నారు. తరువాత దేశంలో ఎలాంటి సమాజాన్ని ఏర్పాటు చేయాలన్నదాని మీద ఏకాభిప్రాయం కుదరలేదు. ఆ కాంగ్రెస్ వారే బ్రిటీష్ వారి పెట్టుబడులు, కంపెనీలకు రక్షణ కల్పించారు. స్వాతంత్య్రం అనంతరం ఏర్పడిన ప్రభుత్వం పట్ల ఎలాంటి వైఖరి తీసుకోవాలి అన్న అంశం మీద కమ్యూనిస్టుల్లో భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. ఇవి అర్ధం చేసుకోలేనంతటి తీవ్రమైనవి కాదు. కాస్త పురోగమన భావాలతో అధికారంలో ఉన్నవారికి మరికాస్త ఊపునిస్తే వారే సోషలిజం తెస్తారన్న భ్రమలకు కొందరు లోనై చివరికి వారితోనే కలసిపోయారు. కాదు జనంలో అసంతృప్తి ఉంది, ఒక దగ్గర అంటిస్తే తాటాకు మంట మాదిరి విప్లవం వ్యాపించి అధికారానికి రావచ్చని కొందరు తుపాకి పడితే విప్లవం బదులు పొగ మాత్రమే వచ్చింది. ఈ రెండు ధోరణులతో జనానికి విశ్వాసం తగ్గిపోయింది, రెండు మార్గాలు కాదు మూడో మార్గంలో విప్లవం తేవాలని చెప్పిన వారు ఒక పెద్ద పార్టీగా ప్రత్యామ్నాయం చూపుతున్నా వారి మీద జనంలో విశ్వాసం కలగటం లేదు. ఇలా ఎందుకు జరుగుతోందో అధ్యయనం చేయాలి. ఏనుగు ఎలా ఉందని అడిగితే ఏడుగురు అంధులు తాము తడిమిన ఏనుగు అవయవాలను బట్టి దాన్ని భిన్నంగా వర్ణించారు. వారు చెప్పింది వాస్తవమే అయినా ఏనుగు సమగ్ర రూపం కాదు. వివిధ ప్రాంతాలు, పరిస్ధితుల్లోని విప్లవకారుల అవగాహన కూడా అలాంటిదే. అయితే తాము చెప్పిందే ఏనుగు రూపం అని ఎవరికి వారు భీష్మించుకుంటే సమస్య పరిష్కారం కాదు, కలబోసుకొని అవగాహనకు రావాలి.
అభిమాని: ఈ తీవ్రమైన సైద్ధాంతిక, రాజకీయ విభేదాలకు మార్క్స్ మౌలిక రచనల్లో ఏమైనా సమాధానాలు దొరుకుతాయా?
కార్యకర్త: మార్క్స్ ఎంగెల్స్‌లు తమ కాలంలో పరిస్ధితులను అధ్యయనం చేసి కొన్ని రచనలు చేశారు. వాటిలో ఏవైనా ఇప్పటి పరిస్ధితులకు అన్వయించలేము అనుకుంటే వాటిని పక్కన పెట్టవచ్చు. ఆ రచనల్లో సూచన ప్రాయంగా ప్రస్తావించిన అంశాలు కొన్ని ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వారి తరువాత కాలంలో సామ్రాజ్యవాదం మరికొన్ని పాఠాలు నేర్పింది, రష్యా, చైనా విప్లవాలు, మన దేశంలో మూడు చోట్ల కమ్యూ నిస్టుల నాయకత్వంలో ప్రభుత్వాల ఏర్పాటు నుంచి తాజా లాటిన్ అమెరికా పరిణామాల వరకు ప్రతిదీ ఒక కొత్త పాఠాన్ని నేర్పేవే. ఒక నాడు హిందూమత దేశంగా ప్రకటించుకున్న నేపాల్‌లో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. ఇస్లామిక్ రాజ్యాలుగా ప్రకటించుకున్న చోట అలాంటి పరిణామం జరగలేదు. మన దేశాన్ని హిందూ మత రాజ్యంగా మార్చే యత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతాలకు చెందిన వారిని సమీకరించటం ఎలా, వీటిలో కొన్ని సమాధానాలు ఇస్తుంటే మరికొన్నింటికి వెతకాలి. కావాల్సింది ఓపిక, ఎటిఎం కార్డు పెడితే మిషన్ నుంచి డబ్బువచ్చినట్లుగా సమాధానాలు దొరకవు. ఒక మిషన్‌లో ఏ నోట్లు ఎన్ని పెట్టాలో ముందే నిర్ణయం అయి వుంటుంది, నోట్లు కూడా ముందే ముద్రించి పెడతారు. సమస్యలు, వాటికి సమాధానాలు అలాంటివి కాదు. వీటిని కార్యకర్తలే కాదు అభిమానులు కూడా చర్చించవచ్చు, పరిష్కారాలను సూచించవచ్చు. అభిమానులకు ఆ వెసులు బాటు ఇంకా ఎక్కువ.
అభిమాని: మార్క్స్ మౌలిక రచనలు చాలా ఉన్నాయి. పోనీ ఇప్పటి వరకూ మీకు తెలిసిన, మీరు చదివిన మార్క్స్ రచనలు ఏంటో చెప్పండి?
కార్యకర్త: ఒక కార్యకర్తగా అన్ని మౌలిక రచనలను పూర్తిగా చదవటం సాధ్యం గాకపోవచ్చు. మార్క్స్ మౌలిక రచనలు చదివితేనే చాలదు. వాటికి అనేక వ్యాఖ్యానాలు వచ్చాయి. వాటిలో కొన్ని తప్పుదారి పట్టించేవి కూడా ఉంటాయి. మార్క్సిజాన్ని ఒక దేశ పరిస్ధితులకు నిర్దిష్టంగా అన్వయించటం ఒక ఎత్తయితే దాన్ని అమలు జరిపే పార్టీ నిర్మాణం కావాలి. లాటిన్ అమెరికాలో మార్క్సిస్టు మేథావులు అలాంటి ఎత్తుగడలను రూపొందించి వామపక్ష శక్తులు అధికారానికి రావటానికి తోడ్పడ్డారు. కానీ ఆ విజయాలను పటిష్ట పరచుకొనేందుకు విప్లవాన్ని తీసుకు వచ్చేందుకు అవసరమైన పార్టీ నిర్మాణాలు జరగనందున అనేక ఎదురు దెబ్బలు తిన్నారు. అదొక లోపం. మార్క్సిజానికి సంబంధించి అనేక మౌలిక గ్రంధాలు ఉన్నాయి. ప్రతి సభ్యుడు, అభిమాని వాటిని చదివిన తరువాత కార్యాచరణ మొదలు పెట్టాలంటే జీవిత కాలాలు చాలవు. ఏది ముందు జరగాలి ? అధ్యయనమా ? కార్యాచరణా ? అని తర్కించుకుంటూ కూర్చునే వారు కుర్చీలకే పరిమితం అవుతారు. రెండూ కలగలిపి జరపాలి. పని చేసే క్రమంలో తలెత్తే సమస్యలకు పరిశీలన, అధ్యయనం చేయాలి. పని మాత్రమే చేసి మౌలిక అంశాలను అధ్యయనం చేయకపోతే విబేధాలు, కొత్త సమస్యలు,సవాళ్లు తలెత్తినపుడు గందరగోళపడి రెండింటికీ దూరమౌతారు.
అభిమాని: మార్క్స్ మౌలిక రచనలు చదవకుండా, మార్స్కిస్టులమని చెప్పుకోవడం, మార్క్స్ కి జేజేలు పలకడం సబబేనా?
కార్యకర్త: ఇది పడక కుర్చీ వాదులు ముందుకు తెచ్చే వాదన. మార్క్సిస్టులం అని ఎవరైనా చెప్పుకుంటున్నారంటే దాని అర్ధం స్దూలంగా దోపిడీని నిర్మూలించాలనే ఆ సిద్దాంతాన్ని అంగీకరిస్తున్నామని. ఏమీ తెలియని ఒక కార్మికుడు, మహిళ పార్టీలోకి రావాలంటే కమ్యూనిస్టు మానిఫెస్టో, కాపిటల్ , ఇతర గ్రంధాలను చదవాలనే షరతు పెట్టటం అర్ధం లేని విషయం. నిరక్షరాస్యులు, అక్షర జ్ఞానం ఉన్నా, సాధారణ పుస్తకాలు కూడా చదవలేని వారెందరో ఉన్నారు. తెలంగాణా సాయుధ పోరాట కాలంలో అనేక మంది నిరక్షరాస్యులు కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు సాయుధ దళాల్లో చేరి తరువాత చదువు నేర్చుకున్న వారు, మరింత పదును పెట్టుకున్నవారు ఎందరో ఉన్నారు. ఇప్పుడైనా అనేక మంది కనీస నిబంధనలను అంగీకరించి సభ్యులుగా చేరిన వారు ఎందరో సైద్దాంతిక అంశాలను అధ్యయనం చేశారు. దేవాలయాలకు వెళ్లే వారందరూ భగవద్దీతను, సమాజు చేసే వారు ఖురాన్, చర్చ్‌లకు వెళ్లేవారందరూ బైబిల్‌ను పూర్తిగా చదవటం లేదు.
అభిమాని: అది మతం, నమ్మేవారు భక్తులు. కానీ మార్క్సిజం ఒక శాస్త్రమని చెబుతున్నప్పుడు, మార్క్సిస్టులు భక్తులు కాదు కదా!
కార్యకర్త: కచ్చితంగా కాదు. పార్టీలో సభ్యులుగా చేరే వారికి ఆయా ప్రార్ధనా స్ధలాలకు వెళ్లటం అనర్హత కాదు. ఒకసారి పార్టీ సభ్యుడు అయిన తరువాత మతం, దేవుడు, దేవత విశ్వాసాల గురించి అధ్యయనం చేయించి వారిని హేతువాదులుగా, భౌతికవాదులుగా మార్చాలి, శాస్త్రీయ ఆలోచనతో పని చేసేట్లు చూడాలి. ఎక్కడైనా విఫలమైతే అది ఆయా స్ధాయిలో ఉన్న కార్యకర్తల, నాయకత్వ లోపం తప్ప పార్టీలోపం కాదు.
అభిమాని: మరైతే మౌలిక రచనల్ని చదవడం ప్రారంభిస్తే, వాటిలోనే ఈ సైద్ధాంతిక, రాజకీయ విభేదాలకు సమాధానం దొరుకుతుందేమో పరిశీలించండి.
కార్యకర్త: మౌలిక రచనల్లో అన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని చెప్పలేము. అవి సాధారణ సూత్రీకరణలు వాటిని ఆయా దేశాలు, సమాజాలకు అన్వయించుకోవటంలోనే సమస్యలు వస్తున్నాయి. ముందే చెప్పుకున్నట్లు మన దేశంలో కుల వివక్ష, ఇతర సామాజిక అంశాల గురించి మౌలిక సిద్ధాంతాలలో పరిష్కారం దొరకదు. సైద్ధాంతిక భిన్నాభిప్రాయాలు ఉండటం ఒక మంచి లక్షణం. అంతర్గతంగా కొన్ని అంశాల మీద విబేధించినా కాల క్రమంలో వాటి గురించి అధ్యయనం చేయాలి. ఆచరణలో ఎవరి వైఖరి సరైనదో తేల్చుకుంటారు. అయితే ఒక అంశం మీద విబేధం ఉంది అది పరిష్కారం కాకుండా ముందుకు కదలటానికి వీల్లేదంటే కుదరదు. అది సైద్ధాంతిక సమస్య అయినా, ఎత్తుగడలకు సంబంధించింది అయినా మెజారిటీ అభిప్రాయాన్ని మైనారిటీ అంగీకరించి అమలు జరపాలి. కొన్ని సందర్భాలలో మెజారిటీ కూడా పొరపాటు పడవచ్చు. గుడ్డిగా అనుసరించటం హానికరం. పార్టీలు వేరైనా ఏకీభావం ఉన్న అంశాల మీద కలసి పని చేస్తున్నాం. వాటికి సైద్ధాంతిక సమస్యలను అడ్డంకిగా తేగూడదని భావిస్తున్నాం. ఆ క్రమంలో వాటిని పరిష్కరించుకుంటాం. సైద్ధాంతికంగా విబేధిస్తే వాటిని తర్కం ద్వారా పరిష్కరించుకోవాలి. కానీ మీరు ద్రోహులు అని ముద్రవేసి ఇతరుల మీద సాయుధదాడులు చేయటం, హతమార్చటం కమ్యూనిస్టుల లక్షణం కాదు. అది వర్గశత్రువుకు ప్రయోజనం, కనుక అలాంటి వారితో చేతులు కలపటం సాధ్యం కాదు.
ఈ రోజు సైద్దాంతిక సమస్యలతో పాటు అసలు మొత్తంగా కమ్యూనిస్టు సిద్ధాంతాన్నే సవాలు చేసే పరిస్ధితులు మరోసారి వచ్చాయి. అదే సమయంలో పెట్టుబడిదారీ వ్యవస్ధకు ఎదురువుతున్న సవాళ్లకు పరిష్కారం మార్క్సిజంలో దొరుకుతుందా అని ఇంతకాలం ఆ వ్య వస్ధ మీద భ్రమలు ఉన్న వారు ఇప్పుడు మార్క్సిస్టు గ్రంధాల దుమ్ముదులుపుతున్నారు. అభిమానులుగా బయట ఉండి సలహాలు చెప్పటం మంచిదే. చెరువు గట్టు మీద ఉండి కబుర్లు చెప్పేవారికి దాని లోతు ఎంతో తెలియదు. కనుక చెప్పేది ఎక్కువ అయితే కొందరు బోధకులుగా మారతారు. మీరు కూడా కార్యకర్తగా ఒక్క అడుగు ముందుకు వేయండి, వాస్తవిక సమస్యలు అర్ధం అవుతాయి, విప్లవం మరింత ముందుకు పోతుంది. ఏ పార్టీ మంచిది ఏది సరైన దారి చూపుతుంది అని తేల్చుకొనేందుకు మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి. ముందు కమ్యూనిస్టులు విబేధాలను పరిష్కరించుకురండి అప్పుడు ఆలోచిస్తాం అని కొందరు అభిమానులుగా చెప్పుకొనే వారు అంటారు. అది సానుకూలంగా చెప్పేవారు కొందరైతే ఆ పేరుతో తప్పించుకొనే వారు మరి కొందరున్నారని మాకు తెలుసు. కమ్యూనిస్టులు పోటీ చేసినపుడు అభిమానులం అని చెప్పుకొనే వారు కనీసం ఓటు కూడా వేయని వారిని చూస్తున్నాం. ప్రతికూల పరిస్ధితులు ఎదురైనపుడు తట్టుకొని నిలిచే వాడే కార్యకర్త. అభిమానులు కూడా అలాగే ఉండాలి. పార్టీ మంచి విజయాలు సాధిస్తే ఆహౌ ఓహౌ అనటం, ఎదురు దెబ్బలు తగిలితే మొహం చాటేయటం, నాయకులు ఏదో తప్పు చేశారని అనటం అభిమానుల లక్షణం కాకూడదు. మంచి చెడుల చర్చ ఆరోగ్యకర లక్షణం. అభిమానులు, కార్యకర్తలూ అందరికి అది ఉండాలి.