Tags

, , ,

Thousands of Companies from America, Japan and Korea leave China ...

ఎం కోటేశ్వరరావు
కష్ట కాలంలో కడుపు నిండా తిండి పెట్టకపోయినా కడుపు నింపే కబుర్లు చెబితే చాలు. చివరికి ఏమీ జరగకపోయినా ఎవరైనా ఏమి చేస్తారులే, మన ఖర్మ అలా ఉంది అని సర్దుకుపోయే స్ధితిలో మన సమాజం ఉంది. మనిషి ఆశాజీవి కనుక దారీ తెన్నూ కనిపించనపుడు ఏ చిన్న వెలుగు కనిపించినా , ఏ కాస్త శుభవార్త చెప్పినా పోయేదేముంది చూద్దాం అని గుడ్డిగా నమ్మేస్తారు. ప్రపంచ ఫ్యాక్టరీగా ఉన్న చైనా నుంచి మన దేశానికి వాణిజ్య, పారిశ్రామిక సంస్ధలు ముఖ్యంగా అమెరికాకు చెందినవి తరలి రానున్నట్లు గత కొద్ది రోజులుగా ఊదరగొడుతున్నారు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీయే అందుకు తెరలేపారంటే అతిశయోక్తి కాదు. రాబోయే కంపెనీల కోసం ముందుగానే స్ధలాలు, పొలాలను సిద్ధం చేస్తున్నామని, అందరికంటే ముందుగా ఎగిరి అందుకోవటానికి సిద్ధంగా ఉండాలని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు సన్నాహాలు చేస్తున్నారు.నమ్మిన వారు కలలు కంటున్నారు. గతంలో నమ్మి దెబ్బతిన్నవారు వెనుకా ముందూ ఆలోచిస్తున్నారు. అనుమానాలను వ్యక్తం చేస్తున్నవారి మీద మీరసలు దేశభక్తులేనా, ఒక వేళ వస్తే గిస్తే మీకేమైనా ఇబ్బందా, చైనాయే అభివృద్ది చెందాలా? మనం వెనుకబడిపోవాలాని అని కొందరు వీరావేశంతో ఎదురు దాడికి దిగుతున్నారు. వారిలో ఒక తెగ వృత్తినటులు, అవసరానికి తగినట్లు తమ నట విశ్వరూపాన్ని ప్రదర్శిస్తారు. మరి కొందరు నటీనటుల హావభావాలు, విన్యాసాలకు పడిపోయి నటనే నిజమని భ్రమించి భుజానవేసుకొని వాదించే వారు. అసలు ఏం జరుగుతోంది ?
ఒక వైపు కరోనా వైరస్‌ కారణంగా తమ బతుకులు అతలాకుతలం కావటంతో పరాయి చోట దిక్కులేకుండా పడి ఉండటం కంటే స్వంత ఊళ్లో కడుపులో కాళ్లు పెట్టుకొని ఉండవచ్చని కోట్లాది మంది వలస కార్మికులు ప్రాణాలకు తెగించి వెళ్లిపోతున్నారు. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. పరిస్ధితులు ఎప్పుడు బాగుపడతాయో, మూతపడిన పరిశ్రమలు తిరిగి ఎన్ని తెరుచుకుంటాయో, వెళ్లిన వారు ఎంతకాలానికి తిరిగి వస్తారో తెలియదు. అందుకే తమ పనులకు అవసరమైన వారిని ఊళ్లకు పంపవద్దని నిర్మాణ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు పాలకులపై వత్తిడి తెస్తున్నారు. కొందరు పరోక్షంగా అందుకు సహకరిస్తే తెగించిన వారికి తెడ్డే లింగం అన్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్డియూరప్ప ఏకంగా బహిరంగంగానే మద్దతు ఇస్తూ శ్రామిక రైళ్లను రద్దు చేయాలని నిర్ణయించారు. ముది మది తప్పిందా అని పార్టీ పెద్దల నుంచి అక్షింతలు పడటంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారనుకోండి.
ప్రపంచ వ్యాపితంగా కరోనాకు ముందే ఆర్ధిక సంక్షోభ ఛాయలు ముసరటం ప్రారంభమైంది. ఈ ఏడాది ప్రపంచ జిడిపి వృద్ధి రేటు ఎంతశాతమన్నది తప్ప తిరోగమన దిశలోనే ఉండబోతున్నది. కోట్లాది మంది కార్మికులు, ఉద్యోగులకు మన దేశంలో కూడా పని ఉండదనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇది మన కొనుగోలు శక్తిని మరింత దెబ్బతీస్తుంది. ఇప్పటికే ఉన్న కంపెనీల ఉత్పత్తులనే కొనుగోలు చేసే వారు తగ్గిపోయినట్లు గతంలోనే నివేదికలు వెలువడిన విషయం తెలిసిందే. అలాంటపుడు చైనా, మరొక దేశం నుంచి వచ్చే కంపెనీలు తయారు చేసే వస్తువులను కొనే దెవరు? కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక యంత్రాలతో ఒక వేళ అవి చౌకగా తయారు చేస్తే పోటీకి తట్టుకోలేక ఉన్న కంపెనీలు మూత పడతాయి. సిమెంట్‌ రంగంలో ఏమి జరిగిందో చూశాము. కొత్త కంపెనీలకు ఇచ్చే రాయితీల కోసం పాత కంపెనీలను మూత పెట్టి విలువైన స్దలాలను రియలెస్టేట్‌తో సొమ్ము చేసుకొన్న కంపెనీలు మన కళ్ల ముందే ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలో కొత్తగా పెట్టేవైనా, విదేశాల నుంచి వచ్చేవైనా కార్మికులు తక్కువ-యాంత్రీకరణ ఎక్కువ అన్నది తెలిసిందే. అందువలన అవి కొత్త సమస్యలను తీసుకువస్తాయి.

Thousands of companies mull China exit after Covid; India next ...
ఒక వైపు విదేశీ వస్తువులు వద్దు,స్వదేశీయే ముద్దు అనే కొత్త పల్లవిని మన పాలకులు అందుకున్నారు. తెలివి తేటలు ఏ ఒక్కరి సొత్తూ కాదు, చైనా నుంచి అరువు తెచ్చుకొని లేదా అనుకరించి మనం లాక్‌డౌన్‌ అమలు జరిపినట్లే మన స్వదేశీ పిలుపును చూసి ఇతరులూ అమలు జరపరా? ప్రపంచమంతటా కరోనా వైరస్‌ సమస్య ఉంది కదా ! కరోనా లేనపుడే మన మేకిన్‌ ఇండియా పిలుపు దారుణంగా విఫలమైంది, జనం చెవుల్లో కమలం పువ్వులు పెట్టటం గాకపోతే ఇప్పుడు మేకిన్‌ ఇండియా పిలుపు వలన ప్రయోజనం ఏమిటి? దానిలో భాగంగా తయారు చేసే వస్తువులను ఏ దేశానికి ఎగుమతి చేస్తాము? ఇవన్నీ ఆలోచించాలా వద్దా ? దున్న ఈనిందనగానే గాటన కట్టేయమన్నట్లు పాలకులు, వారికి వంత పాడే మీడియా ఏది చెబితే దాన్ని నమ్మటమేనా మన పని ?
గతాన్ని మరచిన జాతికి భవిష్యత్‌ ఉండదు. ఆరు సంవత్సరాల క్రితం నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా తాను పొందిన అనుభవంతో గుజరాత్‌ అభివృద్ది నమూనాను దేశవ్యాపితంగా అమలు జరిపి అభివృద్ధి చేస్తా అన్నారు. మనమంతా నిజమే కదా అనుకున్నాం.తరువాత ఎన్నడైనా దాని గురించి నోరు విప్పారా ? విదేశీ, స్వదేశీ నల్లధనాన్ని వెలికి తీస్తామని, దాన్ని పంచితే ప్రతి ఒక్కరికీ పదిహేనులక్షల వరకు వస్తుందని చెప్పారు. ప్రత్యేక తెలంగాణా వస్తే ఆంధ్రావారంతా వెనక్కు వెళ్లిపోతారని, హైదరాబాదులో వారు ఖాళీ చేసిన ఇండ్లు (దీనికి ప్రాతిపదిక లేకపోలేదు. నైజాం నవాబు మీద తిరుగుబాటు చేసిన సమయంలో అనేక మంది నవాబు వంశీకులు, ఇతరులు హైదరాబాద్‌, కొన్ని పట్టణాలలోని కొంపా గోడూ, పొలాలు, స్దలాలు వదలి పాకిస్ధాన్‌ లేదా మరోచోటకు పోయారు. ఆ ఆస్ధులను అనేక మంది ఆక్రమించుకున్నారు) తమకు వస్తాయని కొంత మంది భ్రమించినట్లుగా నిజంగానే అంతగాకపోయినా కొంతయినా అందిస్తారని చాలా మంది నమ్మారు, ఆశగా ఎదురు చూశారు అదేమైందో తెలియదు. అసలెంత నల్లధనం వెలికి వచ్చిందో, దానిలో ఖజానాకు ఎంత చేరిందో సంఘపరివార్‌ సామాజిక మాధ్యమ మరుగుజ్జు వీరులు చెబుతారా ?
అధికారానికి వచ్చిన కొత్తలో నరేంద్రమోడీ రకరకాల కొత్త కొత్త కోట్లు వేసుకొని వరుసబెట్టి విదేశీ ప్రయాణాలు చేస్తుంటే నల్లడబ్బు వెలికితీతకేమో అని జనం అనుకుంటే , కాదు, దేశానికి అవసరమైన పెట్టుబడులు తేవటానికని వెంకయ్య నాయుడు వంటి వారు చెప్పారు. నల్లడబ్బూ తేలేదు, అదనంగా విదేశీ పెట్టుబడులూ లేవు, మేకిన్‌ ఇండియా ఎటుపోయిందో తెలియదు. పెద్ద నోట్ల రద్దు నల్లధనం వెలికి తీత, దేశభక్తి అంటే కామోసనుకున్నాం. స్వాతంత్య్రపోరాటంలో జనం బ్రిటీష్‌ వారి తుపాకి తూటాలకు ,లాఠీలకు ఎదురొడ్డి నిలుచున్నట్లుగా కోట్లాది మంది తమ డబ్బు తాము తీసుకొనేందుకు బ్యాంకులు, ఎటిఎంల ముందు వరుసలు కట్టినిలుచున్నారు. పనులతో పాటు కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. నరేంద్రమోడీ ప్రపంచంలో ఎవరూ చేయని పిచ్చి పని చేశారని విమర్శించిన వారిని దేశద్రోహులు అన్నట్లుగా చూశారు. ఇప్పుడు వాటిని గుర్తు చేస్తే కొందరికి ఎక్కడెక్కడో కాలుతోంది నిజమే. మరి ఆ చర్యవలన వచ్చిన ఉపయోగాలేమిటో ఎన్నడైనా మోడీగారు నోరు విప్పి మాట్లాడారా ? విలేకర్లతో మాట్లాడే ధైర్యం ఎలాగూ లేదని తేలిపోయింది. పోనీ కనీసం మన్‌కీ బాత్‌లో అయినా చెప్పారా ? పైన చెప్పినవి, మరి కొన్నింటినీ కలగలిపి జనానికి అచ్చేదిన్‌ తెస్తామని అన్నారు. ఆచరణలో జనాలకు చచ్చే దినాలు వచ్చాయి. అన్నింటా విఫలమైనా ఐదేండ్లలో మోడీ మీద జనాలకు మోజు తీరక, నమ్మకం చావక, ప్రతిపక్షాల మీద విశ్వాసం లేక రెండోసారి మరిన్ని సీట్లు ఇస్తూ ఓటువేశారు.

China's mobile and digital dominance runs deep into Indian economy ...
జరిగిందేమిటి ? నరేంద్రమోడీ ఏలుబడిలో తట్టలోని సంసారం బుట్టలోకి వచ్చింది. దాన్ని దాచి పెట్టేందుకు ఇప్పుడు కరోనాను సాకుగా చూపుతున్నారు. ఆపేరుతో కార్మిక చట్టాలను మార్చేందుకు శ్రమజీవులను మరింతగా కట్టుబానిసలుగా మార్చేందుకు సిద్దం చేస్తున్నారు. ఏ దేశ చరిత్ర చూసినా ఆర్దికంగా సంక్షోభంలో ఉన్న సమయంలోనే దాన్నుంచి బయటపడవేసే సాకుతో, ప్రజా, కార్మిక వ్యతిరేక చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడూ జరుగుతోంది అదే. జనానికి జ్ఞాపకశక్తి తక్కువ గనుక గతంలో విదేశాల నుంచి పెట్టుబడులు తెస్తామని ఎలా ఊరించారో ఇప్పుడు చైనా నుంచి ఫ్యాక్టరీలను తెస్తామని అంతకంటే ఎక్కువగా నమ్మబలుకుతున్నారు. దీని గురించి ఎవరైనా సందేహాలు వ్యక్తం చేస్తే అసలు మీరు దేశభక్తులేనా, చైనా నుంచి ఫ్యాక్టరీలు రావటం ఇష్టం లేదా అని ఎవరైనా అడ్డుతగలవచ్చు. చైనా నుంచే కాదు, యావత్‌ దేశాలలో ఇంకా మిగిలి ఉన్న ఫ్యాక్టరీలు, సంస్దలన్నీ వచ్చినా సంతోషమే.
నిద్రిస్తున్న మహా దేశం మేలుకొంటోంది, చైనా నుంచి వచ్చే ఫ్యాక్టరీలకు స్వాగతం పలికేందుకు రాష్ట్రాలు సిద్ధం కావాలని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ముఖ్యమంత్రులకు సూచించినట్లు వార్తలు వచ్చాయి. అమెరికా-చైనాల మధ్య తలెత్తిన వాణిజ్యం యుద్దం, కరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన పరిస్ధితుల నేపధ్యంలో చైనా నుంచి కంపెనీలు రావాలనుకుంటున్నాయని వాటికి అవసరమైన మౌలిక సదుపాయాల వంటివి కల్పిస్తే చైనాకు తగిన ప్రత్యామ్నాయం అవుతామని ప్రధాని చెప్పినట్లు మీడియా పేర్కొన్నది. ఏ దేశానికి ఆదేశం మరొక దేశంతో పోటీబడి అభివృద్ది చెందితే అభ్యంతరం ఎవరికి ఉంటుంది. ఎదుటివారిని దెబ్బతీసి మనం లాభపడాలనుకుంటే ఎదుటి వారు కూడా మన గురించి అదే అనుకుంటారు అని గ్రహించటం అవసరం.
మనమహాదేశం మోడీ అధికారానికి వచ్చిన ఆరుసంవత్సరాల పాటు నిద్రలో ఉండటానికి కారణం ఎవరు? పోనీ దానికి కారణం కాంగ్రెస్‌ అనుసరించిన విధానాలే అని అంగీకరిద్దాం. యాభై సంవత్సరాల పాటు కాంగ్రెస్‌ చేసిన తప్పిదాలను కేవలం ఐదు సంవత్సరాలలో సరిదిద్దామని చెప్పుకున్నవారు, దేశాన్ని నిద్రలేపటానికే ఆరు సంవత్సరాల వ్యవధి తీసుకుంటే, దాన్ని నడిపించటానికి ఎన్ని ఆర్లు కావాలి ? ఇలాంటి కబుర్లు గతంలోనే చాలా చెప్పారు. జరిగిందేమిటి ?
ఏప్రిల్‌ 22నాటి బిజినెస్‌ టుడే వార్త ప్రకారం వెయ్యి విదేశీ కంపెనీలు ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నాయని కనీసం 300 సంస్ధలను రప్పించే లక్ష్యంతో పని చేస్తున్నట్లు ఒక అధికారి చెప్పినట్లుగా ఉంది. పోనీ ఇవన్నీ చైనా నుంచే వస్తాయని అనుకుందాం. అసలు చైనాలో ఉన్న విదేశీ కంపెనీలు ఎన్ని ? 2012లో 4,36,800 ఉండగా 2018లో 9,61,000 ఉన్నాయి. తరువాత పెరిగినా తరిగినా మొత్తం మీద స్ధిరంగా ఉన్నాయని అనుకుందాం. వీటిలో వెయ్యి కాదు మన మోడీ ఎంతో పలుకుబడి గలవారు గనుక మరో పది వేల కంపెనీలను రప్పించినా మన దేశం మరొక చైనా మాదిరి తయారవుతుందా ? చైనా దెబ్బకు అంత పెద్ద అమెరికాయే గిలగిల్లాడుతుంటే మనం తట్టుకోగలమా ? మన ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి ? గతంలో గ్రామాల్లో బుర్రకథలు చెప్పేందుకు వచ్చిన వారు గ్రామీణులను ఉబ్బించి ఎక్కువ బహుమతులను రాబట్టుకొనేందుకు వెళ్లిన ప్రతి ఊరిలో మీ గ్రామం చుట్టుపక్కల అరవై ఆరు గ్రామాలకు పోతుగడ్డ అని చెప్పేవారు. మన దేశం, రాష్ట్రాల గురించి అలాగే ఉబ్బవేస్తుంటే నిజమే అనుకుంటున్నారు.
చైనా కంపెనీలు విదేశాలకు పోక, మన దేశానికి రాక గురించి ఊరించటం కొత్త కాదు.చైనాలో వేతన ఖర్చు క్రమంగా పెరుగుతున్న కొద్దీ అంతకంటే తక్కువ ఖర్చయ్యే దేశాల గురించి వెతుకులాట గత ఐదు సంవత్సరాల నుంచి పెరుగుతోంది.2016-17 మన ఆర్ధిక సర్వేలో ” చైనాలో పెరుగుతున్న వేతన ఖర్చు కారణంగా దుస్తులు, తోళ్లు, పాదరక్షల తయారీ రంగాలలో ఉత్పత్తుల మార్కెట్లలో చైనా వాటా స్ధిరపడటం లేదా తగ్గుతున్న నేపధ్యంలో ఈ రంగాలను ప్రోత్సహించటానికి మన దేశానికి అవకాశం వచ్చింది. చైనాతో పోల్చితే భారత్‌లోని అత్యధిక రాష్ట్రాలలో వేతన ఖర్చు తక్కువగా ఉంది. చైనా నుంచి తరలిపోయిన వాటిలో వేగంగా దుస్తుల రంగం బంగ్లాదేశ్‌, వియత్నాంకు తరలిపోయింది. తోళ్లు,పాదరక్షల రంగం వియత్నాం, ఇండోనేషియాకు పోయింది. మన దేశంలోని దుస్తుల కంపెనీలు కూడా బంగ్లాదేశ్‌, వియత్నాం, మయన్మార్‌, చివరికి ఇథియోపియాకు కూడా తరలిపోతున్నాయి” అని పేర్కొన్నారు. మొన్నటికి మొన్న అంటే తాజా ఆర్ధిక సర్వేలో చైనా తరహా అభివృద్ది, ఆకర్షణ గురించి పేజీలకు పేజీలే రాసుకున్నాం. నిజానికి దానికీ కరోనాకు అస్సలు సంబంధమే లేదు. నాలుగేండ్ల నాటికి ఇప్పటికీ జరిగిన పెద్ద మార్పు ఏమిటో ఎవరైనా చెప్పగలరా ?
తమ రాష్ట్రాలలో ఏర్పాటు చేసే సంస్దలలో మెజారిటీ ఉద్యోగాలను స్ధానికులకే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాలు చట్టాలను చేశాయి. దీని మీద దేశీయంగా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. తమ కంపెనీలలో తాము ఎంపిక చేసుకున్న సిబ్బందినే పెట్టుకోవాలని కోరుకొనే కంపెనీలకు ఈ చట్టాలు ఆటంకంగానే కనిపిస్తాయి. ఇలాంటి చట్టాలను చేసిన రాష్ట్రాలు గానీ చేయని రాష్ట్రాలకు గానీ విదేశీ పెట్టుబడులు, సంస్ధలను ఆకర్షించటంలో పెద్ద తేడా కనిపించటం లేదు. గత మూడు సంవత్సరాలలో కొత్త కంపెనీల తీరుతెన్నులను చూసినపుడు పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. ఈ స్ధితిలో ఉన్న కంపెనీలు తమ సామర్ధ్యాన్ని పెంచుకొనేందుకు లేదా అదనపు సిబ్బందిని నియమించేందుకు ముందుకు రావటం లేదు. ఈ స్ధితిలో కొత్తగా వచ్చే కంపెనీలకు మన దేశంలో కనిపించే ఆకర్షణలు ఏమిటి ?
చైనా నుంచి వస్తాయని చెబుతున్న కంపెనీలలో ఎక్కువ భాగం అమెరికాకు చెందినవిగా చెబుతున్నారు. అవే ఎందుకు ఆసక్తి కనపరుస్తున్నాయి? ఒక వైపు ట్రంప్‌ అమెరికాలో పెట్టుబడులు, పరిశ్రమల స్ధాపనకు విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాడు. చైనా మీద ఆధారపడిన కారణంగానే అమెరికాలో ఇబ్బందులు తలెత్తాయన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అలాంటపుడు చైనాలోని అమెరికా కంపెనీలు తమ దేశానికి పోకుండా మన దేశానికి ఎందుకు రావాలని కోరుకుంటున్నాయి. వాటికి దేశభక్తి లేదా ? మన దేశాన్ని ఉద్దరించాలనే సదాశయంతో వస్తున్నాయా ? 2018 నుంచి డోనాల్డ్‌ ట్రంప్‌ చైనాతో వాణిజ్య యుద్ధం చేస్తున్నాడు. చైనాలోని అమెరికన్‌ కంపెనీలు తయారు చేసే వస్తువులను కూడా చైనావిగానే పరిగణించి వాటి మీద దిగుమతి పన్ను విధిస్తున్నాడు. అమెరికా దేశభక్త కంపెనీలు ఆ పన్ను భారాన్ని తాము భరించాలా లేక తమ దేశ వినియోగదారుల నుంచి వసూలు చేయాలా అనే సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఒక వేళ చైనా మరిన్ని ప్రతీకార చర్యలకు పూనుకుంటే తాము ముందు బలౌతామనే భయం అమెరికన్‌ కంపెనీల్లో కలుగుతోంది. దీనికి తోడు వేతన పెరుగుదల వంటి అంశాలు, చైనా సుంకాలను పెంచితే గిట్టుబాటు కావనే దిగులు, ఇలా అనేక అంశాలను గమనంలో ఉంచుకొని ముందుగానే జాగ్రత్త పడితే మంచిదనే ఆలోచనతో కూడా కొన్ని కంపెనీలు తరలిపోవాలనే ఆలోచనలు చేస్తున్నాయి.

Why Companies Shift From China To Vietnam More Than
అయితే అసలు చైనా నుంచి విదేశీ కంపెనీలు తరలిపోవటం లేదా ? లేదని ఎవరు చెబుతారు ?లాభాల కోసం తమ స్వంత దేశాలను వదలి చైనా వచ్చిన కంపెనీలు మరొక దేశంలో లాభం ఎక్కువ వస్తుందనుకుంటే అక్కడికి తరలిపోవటంలో ఆశ్చర్యం ఏముంది. పెట్టుబడి లక్షణమే అది. పెట్టుబడులను ఆకర్షించేందుకు మోడీ సర్కార్‌ అనేక చర్యలు తీసుకుంది, రాయితీలు ప్రకటించింది, కార్మిక చట్టాలను నీరుగార్చింది. సులభతర వాణిజ్యం ర్యాంకులో ముందుండటం కోసం పోటీ పడుతోంది. అయినా ఆకర్షణ కలగటం లేదు.2018 ఏప్రిల్‌ నుంచి 2019 ఆగస్టు వరకు 56 చైనా కంపెనీలు అక్కడి నుంచి బయటకు వచ్చాయి. వాటిలో 26 వియత్నాంకు,11 తైవాన్‌కు, 8 థారులాండ్‌కు తరలిపోగా మన దేశానికి మూడు, ఇండోనేషియాకు రెండు వెళ్లాయని జపనీస్‌ సంస్ధ నొమురా నివేదించింది. అంతెందుకు సిఎన్‌బిసి అనే అమెరికన్‌ టీవీ మే 14న ప్రసారం చేసిన ఒక సమీక్షలో చైనా నుంచి ఎలా తరలిపోవాలా అని కంపెనీలు చూస్తుంటే మరోవైపు ఎక్కువ విలువ కలిగిన వస్తు తయారీకి చైనా సాంకేతిక రంగం మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోందని ఎర్నెస్ట్‌ అండ్‌ ఎంగ్‌ కంపెనీ ఆసియాపసిఫిక్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ పాట్రిక్‌ వింటర్‌ చెప్పారు. చైనాలో వేతన ఖర్చులు పెరగటం, అమెరికాతో వాణిజ్య యుద్దం కారణంగా చాలా కాలం నుంచి కంపెనీలు తరలిపోయే ఆలోచన చేస్తున్నాయన్నారు. బమ్మలు,కెమెరాల తయారీ మెక్సికోకు, పర్సనల్‌ కంప్యూటర్లు తైవాన్‌కు, ఆటోమోటివ్‌ కంపెనీలు థారులాండ్‌, వియత్నాం,భారత్‌కు తరలుతున్నాయని చెప్పారు. అంటే మనం కూడా మిగతాదేశాల్లో ఒకరం తప్ప చైనా కంపెనీలన్నీ ఏకంగా మన ఒళ్లో వచ్చి వాలిపోవటం లేదు.
సామాజిక మాధ్యమంలో మరుగుజ్జులు వేసే జిమ్మిక్కులు నిజమే అని నమ్మే జనం గణనీయంగా ఉన్నారు. అలాంటి ఒక పోస్టు ప్రస్తుతం వాట్సాప్‌లో తిరుగుతోంది. నిన్న నోయిడా వ్యాపారులు 150 మిలియన్‌ డాలర్ల చైనా ఆర్డర్‌ను రద్దు చేశారని దేశం మొత్తం నుంచి రెండు బిలియన్‌ డాలర్ల మేరకు రద్దు చేసి అనధికారికంగా చైనాను కాళ్లబేరానికి తెచ్చారని, గత సంవత్సరం దీపావళికి చైనా లైట్లను కొనుగోలు చేయనందున చైనా వస్తువులు 20శాతం నాశనం అయ్యాయని, అదే మొత్తం 62బిలియన్‌ డాలర్ల ఆర్డర్లు రద్దు చేస్తే ఏమౌతుందో చూడండి.90 రోజులు ఏ విదేశీ వస్తువులు కొనకండి, డాలరుతో రూపాయి మారకపు విలువ రెండు రూపాయలకు సమానం అవుతుంది అంటూ ఆ పోస్టు మహా రంజుగా సాగింది. చదివిన వారు లొట్టలు వేసుకుంటూ ఇతరులకు పంపుతున్నారు.
ఈ పోస్టులో నిన్న నోయిడా అంటే అది 2016 అక్టోబరు 13వ తేదీనాటి హిందూస్దాన్‌ టైమ్స్‌ వార్త. ఆ తరువాత మన దేశం చైనా నుంచి దిగుమతులను పెంచుకుందే తప్ప ఏమాత్రం తగ్గించలేదు. అంటే అనుమతించిన పాలకులు, దిగుమతి చేసుకున్న వ్యాపారులను దేశభక్తులనాలా, దేశద్రోహులనాలా ! ఇలాంటి పోసుకోలు కబుర్లు, పగటి కలలతో జనాన్ని ఎంతకాలం మభ్యపెడతారు. నరేంద్రమోడీ గారి ఏలుబడి తొలి ఏడాది 2014-15లో డాలరుతో రూపాయి సగటు మారకపు విలువ 61.14 ఉంటే ఇప్పుడు 75 రూపాయలు నడుస్తోంది. తిరిగే చక్రం మీద కూర్చున్న ఈగ తానే చక్రాన్ని నడుపుతున్నట్లు కలగంటుందట. మనం వస్తువులు కొనుగోలు చేయకపోతే చైనా కాళ్ల బేరానికి వస్తుంది, కుప్పకూలిపోతుంది అన్నది కూడా ఈగ బాపతే. 2019లో చైనా నుంచి ఎక్కువగా దిగుమతులు చేసుకున్న తొలి పదిహేను దేశాలలో మూడు శాతంతో మనది ఏడవ స్ధానంలో వుంది. అంటే మిగిలిన దేశాలన్నీ 97శాతం వాటా కలిగి ఉన్నాయి. మన మూడుశాతం నిలిపివేస్తే చైనాకు వచ్చే నష్టం ఏముంటుంది? అగ్రస్ధానంలో ఉన్న అమెరికాకు చైనా 16.8శాతం ఎగుమతి చేస్తోంది. అలాంటి దేశ అధ్యక్షుడు ట్రంప్‌ను చైనీయులు మూడు చెరువుల నీరు తాగించి తమ కాళ్ల బేరానికి తెచ్చుకుంటున్నారు. ఇక మన దేశ వాణిజ్య భాగస్వాములలో చైనా 2019లో 5.08శాతంతో మూడవ స్ధానంలో ఉంది. తొలి రెండు స్ధానాలలో అమెరికా, యునైటెడ్‌ అరబ్‌ ఏమిరేట్స్‌ ఉన్నాయి. చైనా ఎగుమతి చేసే వందలో మూడు వస్తువులను మనం తెచ్చుకుంటుంటే, మనం ఎగుమతి చేసే వందలో చైనా ఐదింటిని తీసుకొంటోది. పరిస్ధితి ఇలా ఉంటే మనం చైనాను కాళ్లబేరానికి తెచ్చుకోవటం ఏమిటి? మతి ఉండే ఆలోచిస్తున్నామా ? మన ఘనమైన సంస్కృతి ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని చెప్పింది తప్ప దురహంకారానికి లోను కమ్మని చెప్పలేదు.

Foreign companies are coming to India leaving China, will settled ...
బాధ్యత కలిగిన వారెవరైనా వెనుకా ముందూ చూసుకోవాలి, చర్యకు ప్రతి చర్య పర్యవసానాల గురించి ఆలోచించకుండా ముందుకు పోతే గోతిలో పడతారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో విదేశీమారక ద్రవ్యం గణనీయంగా ఉన్న తొలి పది దేశాలలో మనది ఐదవ స్ధానం. అయితే తొలి స్ధానంలో ఉన్న చైనా దగ్గర 3,091, దాని ఏలుబడిలోని హాంకాంగ్‌లో 441, మకావులో 22 అంటే మొత్తం చైనా దగ్గర 3,554 బిలియన్‌ డాలర్లు ఉంటే, మన దగ్గర 485 బిలియన్‌ డాలర్లు ఉన్నాయి. మన దేశం అక్కడి పరిశ్రమలను ఆహ్వానించి చైనాతో వాణిజ్య యుద్దానికి దిగితే ఏమి జరుగుతుందో ఆలోచించుకోవాలి. మన దేశానికి చెందిన నోబెల్‌ బహుమతి గ్రహీత అయిన ఆర్ధికవేత్త అభిజిత్‌ ముఖర్జీ మే 12న ఒక బెంగాలీ టీవీతో మాట్లాడుతూ ఒక వేళ చైనా తన కరెన్సీ విలువను తగ్గిస్తే ఏం జరుగుతుంది ? దాని వస్తువుల ధరలు తగ్గుతాయి, జనాలు వాటినే కొంటారు అన్నారు. ఆలా చెప్పిన ఆయన దేశభక్తుడు కాదా ?
ఒక దేశ జీవన ప్రమాణాలకు తలసరి జిడిపి ఒక గీటు రాయి. 2019లో చైనాలో పదివేల డాలర్లకు పైబడితే మన దేశంలో రెండువేల డాలర్లు. అందువలన చైనాను మిగతా దేశాలు ఇబ్బందుల పాలు చేసినా తాను తయారు చేసిన వస్తువులను తన ప్రజలకే విక్రయించి తన కాళ్లమీద తాను నిలబడగదు. 2008 తరువాత ధనిక దేశాల్లో సంక్షోభం కారణంగా దాని ఎగుమతి ఆధారిత వ్యవస్ధకు ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే ఆ మేరకు తన అంతర్గత వినియోగాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకొని వాటి నుంచి కాచుకుంది.మనం అటువంటి స్ధితిలో ఉన్నామా ?
చైనాలో ఉన్నది కమ్యూనిస్టు నియంతృత్వం అని ఒక పాటపాడతారు. ప్రపంచ పెట్టుబడిదారులు మరి అక్కడకు ఎందుకు వెళుతున్నట్లు ? ప్రపంచ దేశాలన్నీ దాని నేతలను ఎందుకు ఆహ్వానిస్తున్నట్లు ? నిన్నగాక మొన్న చైనా జింపింగ్‌ను మోడీ గారు రావయ్యా జింపింగూ అజెండా ఏమీ లేదు గానీ మంచి చెడ్డలు మాట్లాడుకుందాం రమ్మని మహాబలిపురానికి ఎందుకు ఆహ్వానించినట్లు ? మోడీ గారు చైనా ఎందుకు వెళ్లినట్లు ? ప్రపంచంలో కమ్యూనిస్టులు లేని దేశాల్లో నియంతలు ఎందరో ఉన్నారు. మరి అక్కడికి పెట్టుబడులు ఎందుకు వెళ్లటం లేదు ? మన దేశంలో ప్రజాస్వామ్యం ఉంది కనుక చైనా మాదిరి మనం అభివృద్ది చెందలేమని మరొక ముక్తాయింపు. అదే తర్కానికి కట్టుబడితే చైనా నుంచి కంపెనీలు వచ్చినా మనం ఎలా అభివృద్ధి చెందగలం ?
ఒక దేశంతో మరొక దేశం పోల్చుకోవటం అసంబద్దం. దేనికి ఉండే అనుకూల ప్రతికూలతలు దానికి ఉంటాయి. అందువలన అభివృద్ధి మార్గం కూడా భిన్నంగానే ఉండాలి తప్ప మరొక దాన్ని అనుసరించటం, అనుకరించటం వలన ప్రయోజనం ఉంటుందా ? ఆ రీత్యా చూసినపుడు మన భారతీయ విధానాలను అభివృద్ధి చేసుకోకుండా చైనాను అనుకరించటం భారతీయత ఎలా అవుతుంది. అసలు సిసలు దేశభక్తులం అని చెప్పుకొనే వారు ఆలోచించాలి మరి. చైనా అభివృద్ధి చైనా కమ్యూనిస్టు పార్టీ విధానాల కారణంగానే సాధ్యమైంది. మన దేశం అభివృద్ధి గాకపోవటానికి కాంగ్రెస్‌-బిజెపి వాటి విధానాలకు మద్దతు ఇచ్చే పార్టీలే కారణం. కమ్యూనిస్టులకు అధికారం ఉంటే కరోనా మహమ్మారిని ఎదుర్కోవటంలో కమ్యూనిస్టుల ప్రత్యేక ఏమిటో మన దేశంలో కేరళ, ప్రపంచంలో చైనా, వియత్నాం, క్యూబా, ఉత్తర కొరియా వంటి దేశాలు నిరూపించాయి.
ప్రపంచంలో గత కొద్ధి సంవత్సరాలుగా దిగజారుతున్న ఆర్ధిక పరిస్ధితిని కరోనా వైరస్‌ తాత్కాలికంగా అయినా మరింతగా దిగజార్చనుంది. గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్ద(ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంకు చెప్పిన అనేక జోశ్యాలు, చూపిన రంగుల కలలు కల్లలయ్యాయి. అయినా అవి తప్ప మరొక ప్రత్యామ్నాయం లేనందున అవి చెప్పిన అంశాల ప్రాతిపదికనే అయితే, గియితే అనే షరతులు, హెచ్చరికలతో చర్చించుకోక తప్పటం లేదు.

COVID-19 and the new coronavirus: Fact versus fiction - COVID-19 ...
ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం 2020-21లో మన జిడిపి వృద్ధిరేటు 0.5శాతమే. మరొక అంచనా ప్రకారం 2020లో 1.9శాతం, ఇంకో అంచనా మైనస్‌ మూడుశాతం. ఇవన్నీ లాక్‌డౌన్‌కు ముందు, కొనసాగుతున్న సమయంలో వెలువడిన అంచనాలు. ఎంతకాలం కొనసాగుతుంది, ఆర్ధిక కార్యకలాపాలు తిరిగి ఎపుడు, ఎలా ప్రారంభం అవుతాయి అనేదాని మీద ఈ అంకెల్లో, వాస్తవంలో మార్పులు ఉంటాయి. ఈ నేపధ్యంలో చైనా నుంచి కంపెనీలు రావటం అంటే ఏటిఎంలో కార్డు పెట్టి వెంటనే నగదు తీసుకున్నంత సులభం కాదని గ్రహించాలి. అక్కడ 1978 నుంచి అనుసరించిన విధానాలు జిడిపిలో అమెరికాకు ధీటుగా చైనాను ముందుకు తెచ్చింది. తాము ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నామని, అందువలన మరింత అభివృద్ధి చెందేందుకు సంస్కరణలను కొనసాగిస్తామని, పెట్టుబడులకు మరిన్ని అవకాశాలిస్తామని చైనా ప్రకటించింది. అంతే కాదు, 1970దశకం వరకు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ సంస్ధలకు దూరంగా ఉంచిన అమెరికా, ఇతర దాని మిత్ర దేశాల మెడలు వంచి ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యరాజ్యమైంది. తరువాత ప్రపంచ వాణిజ్య సంస్ధలో అడుగుపెట్టి తన ఎగుమతి అవకాశాలను పెంచుకుంది.2049 నాటికి చైనాలో పూర్తిగా విలీనం కావాల్సిన హాంకాంగ్‌, మకావు దీవుల్లో పెట్టుబడిదారీ వ్యవస్ధను కొనసాగిస్తామని, అక్కడి ప్రయివేటు పెట్టుబడులకు రక్షణ కల్పిస్తామని చైనా హామీ ఇవ్వటం ప్రపంచ పెట్టుబడిదారుల్లో పెద్ద విశ్వాసాన్నిచ్చింది.స్ధిరమైన ప్రభుత్వం, స్ధిరమైన విధానాలను కొనసాగించటమే చైనా విజయ రహస్యం.ఆ కృషి వెనుక ఉన్న స్ధిరమైన విధానాలు ప్రపంచ పెట్టుబడిదారులను చైనా బాట పట్టించాయని అంగీకరిస్తారా ?