Tags

, , , ,

Did India handle Covid crisis better or Pakistan? The answer lies ...

ఎం కోటేశ్వరరావు
ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన 20లక్షల కోట్ల కరోనా సంక్షోభ నివారణ పాకేజ్‌ గురించి ప్రస్తుతం దేశంలో మధనం జరుగుతోంది. ప్రభుత్వం, అధికారపార్టీ, దాని మిత్రపక్షాలు ఆ పధకం నుంచి అమృతం రానుందని చెబుతున్నాయి. అంతా ఒట్టిదే ఇదంతా జుమ్లా, పంచపాండవులంటే మంచం కోళ్ల మాదిరి మూడనుకొని రెండువేయబోయి ఒకటి వేసి దాన్ని కూడా కొట్టి వేసి సున్నా చుట్టినట్లుగా ఉంటుందని, అమృతం రాదు, వచ్చేది ఏమిటో తెలియదు, అది ప్రాణాలు నిలుపుకొనేందుకు సైతం పనికి రాదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఏం వస్తుందో, ఏం రాదో తెలియక జనాలు జుట్టుపీక్కుంటున్నారు. తమ స్వస్థలాలకు పోయేందుకు వలస కార్మికుల తెగింపు తీరు తెన్నులను చూస్తుంటే తమకు వచ్చేదేమీ లేదు, రాబోయే రోజులు ఎలా ఉంటాయో తెలియని నిరాశా, నిస్పృహలతో ఉన్నట్లు చెబుతున్నాయి.
పాకేజ్‌ ఎలాంటిదో ప్రతి అంశాన్ని చూడనవసరం లేదు. ఉదాహరణకు ఎంఎస్‌ఎంఇ( సూక్ష్మ,చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్ధలు లాక్‌డౌన్‌ ప్రకటించే సమయానికి ఐదున్నరలక్షల కోట్ల రూపాయల మేరకు బకాయిలు ఉన్నాయి. వాటిని వెంటనే చెల్లిస్తే ఆ పరిశ్రమలకు అంతకంటే వరం మరొకటి లేదు. ఆ బకాయిలను చెల్లించకుండా ఆ సంస్ధలకు మూడులక్షల కోట్ల రూపాయల హామీ లేని రుణం ఇప్పిస్తామని కేంద్ర ప్రకటించటం హాస్యాస్పదం. ఐదున్నర లక్షల కోట్ల బకాయిలే చెల్లించలేని వారు ఇరవై లక్షల కోట్ల పాకేజ్‌ అమలు జరుపుతామని చెబుతుంటే తల్లికి కూడు పెట్టని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్న సామెత గుర్తుకు వస్తోంది. అందువలన పనికిరాని పాకేజ్‌ను కాసేపు పక్కన పెడదాం. ప్రపంచబ్యాంకు నిపుణులు ప్రతివారం వివిధ దేశాలలో అమలు చేస్తున్న, ప్రకటిస్తున్న కరోనా సంక్షేమ పధకాల గురించి సమాచారాన్ని సేకరించి మదింపు చేస్తున్నారు. వ్యాధి విస్తరిస్తున్నకొద్దీ ప్రతికూల ప్రభావాల తీవ్రత పెరిగే కొద్దీ పలు కొత్త పధకాలను ప్రకటించటం, అమల్లో ఉన్నవాటిని మెరుగుపరుస్తున్నారు. పాలకుల చిత్తశుద్ధి, శ్రద్ద ఎలా ఉంటుందో గ్రహించటానికి కరోనా సంక్షోభం పెద్ద అవకాశం కల్పించిందంటే అతిశయోక్తి కాదు.
ప్రపంచ వ్యాపితంగా సంక్షేమ చర్యలన్నీ ఒకే విధంగా లేవు. నగదు బదిలీ, ఆహార పంపిణీ తక్షణ సహాయ చర్యలుగా ఉన్నాయి. విద్యుత్‌, నీటి బిల్లుల రద్దు, వాయిదా, రాయితీల మొదలు ఉద్దీపనలు, తక్షణ సాయాలు రకరకాలుగా అమలు జరుపుతున్నారు. తాజాగా మేనెల 15వరకు వచ్చిన సమాచారం మేరకు 181 దేశాల్లో 870 రకాల సంక్షేమ చర్యలను ప్రకటించి అమలు జరుపుతున్నారు. మొత్తంగా చూసినపుడు 30.3శాతం(264) నగదు బదిలీ పధకాలు ఉన్నాయి. ఇవి గణనీయంగా పెరిగాయి. వీటిలో 104 దేశాల్లో148 నగదు పధకాల కొత్తవి. నాలుగో వంతు పధకాల్లో ఇస్తున్న నగదును ఒకేసారి ఇస్తున్నారు. వస్తుసహాయ పధకాలు కూడా గణనీయంగా ఉన్నాయి. కొన్ని చోట్లా సామాజిక భద్రతా పధకాలకు వినియోగదారులు చెల్లించాల్సిన వాటాల మొత్తాన్ని ప్రభుత్వాలు రద్దు చేశాయి.
నగదేతర సంక్షేమ పధకాల్లో ప్రజాపనుల వంటివి 26.5శాతం, వస్తుపధకాలతో పోల్చితే నగదు పధకాలు రెట్టింపు ఉన్నాయి. నగదు అందచేత పధకాల సగటు వ్యవధి 3.1నెలలు, ఇది క్రమంగా పెరుగుతోంది. ఒక నెల నుంచి గరిష్టంగా ఆరునెలల వరకు ప్రకటించిన దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాలలో వైరస్‌ సంక్షోభం ఎంతకాలం ఉంటే అంతకాలం అని కొన్ని దేశాలు ప్రకటించాయి. నగదు విషయానికి వస్తే మొత్తం మీద ఆయా దేశాలలోని తలసరి నెలవారీ జిడిపిలో సగటున 27శాతం ఉన్నాయి. ఉదాహరణకు మన దేశ తలసరి వార్షిక ఆదాయం 2020 అంచనాలో రు.1,76,976 ఉంది. దీన్ని నెలవారీ లెక్కిస్తే రూ.14,740 అవుతుంది. దీనిలో 27శాతం అంటే రూ.3,981. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం రూ.1,500 కనుక ప్రపంచ సగటులో సగానికంటే తక్కువే ఉంది. ఈ మాత్రానికే బిజెపి నేతలు ఎంతో గొప్ప సాయం అందించినట్లు చెప్పుకుంటున్నారు. పాకిస్ధాన్‌ తలసరి జిడిపి 2019లో 1388 డాలర్లు. దీన్ని మన రూపాయల్లోకి మారిస్తే 1,05,065. దీన్ని నెలవారీ చూస్తే రూ.8,755. దీనికి గాను పాక్‌ ప్రభుత్వం ఇచ్చిన మొత్తం ఆరువేల రూపాయలు( పాక్‌ రూపాయల్లో పన్నెండువేలు), అంటే మనం ఎక్కడ ఉన్నాం ? పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కంటే మన ప్రధాని మోడీ తక్కువ ఇచ్చినట్లే కదా ! ఎంత చెట్టుకు అంతగాలి, ఎంత మందికి అవకాశం ఉంటే అంత మందికి ఇస్తారు, ఇచ్చేది ఎంత అన్నది కూడా ముఖ్యమే కదా ! ప్రపంచ జిడిపిలో మన దేశాన్ని ఐదవ స్ధానంలోకి తీసుకుపోయామని చెప్పిన పెద్దలు సాయం విషయానికి వస్తే దరిద్రం తాండవించే దేశాల సరసన చేర్చారు. దీన్ని చూసి ఇంతకు ముందు ప్రశంసలు కురిపించిన వారు విస్తుపోతున్నారు. మనలను చూసి ప్రపంచం నేర్చుకొంటోందని చేస్తున్న ప్రచారం ఇలాంటి చర్యలతో గోవిందా ! మంగోలియాలో కరోనాకు ముందు పిల్లల నగదు సాయ ఆ దేశ కరెన్సీ ఎంవిటి పదివేలు ఉంటే కరోనా తరువాత లక్షకు పెంచారు. ఇలా అనేక దేశాలలో జరుగుతోంది. ఇలాంటి సాయం ప్రపంచం మొత్తం మీద 134శాతం పెరిగింది.మాల్డోవాలో కనిష్టంగా 43శాతం పెరిగితే గరిష్టంగా మంగోలియాలో 900శాతం ఉంది. మార్చినెల 27న నగదు బదిలీ పధకాలు 107 కాగా వస్తు సహా పధకాలు 22 ఉన్నాయి. అవి మే15నాటికి 264, 120కి పెరిగాయి.
కరోనానో నిమిత్తం లేకుండానే కొన్ని దేశాలలో నగదు బదిలీ పధకాలు ఉన్నాయి. ఇప్పుడు వాటికింద చెల్లించే మొత్తాలు 45దేశాలలో పెరిగాయి, 157దేశాలలో పధకాన్ని ఎక్కువ మందికి వర్తించేలా విస్తరించారు. కేవలం నగదు సాయాన్ని పొందుతున్న వారు ప్రపంచంలో 130 కోట్ల మంది అయితే సామాజిక పధకాల సాయం పొందుతున్నవారు 170 కోట్ల వరకు ఉన్నారు.
ప్రస్తుతం ప్రపంచంలో పంపిణీ చేసే నగదు మొత్తం పెంచటం ఒక తక్షణ సవాలుగా ముందుకు వస్తోంది. నూట పదకొండు దేశాలలో సాధారణంగా రెండు రకాలుగా ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి. కరోనా సంక్షోభానికి ముందే తమ వద్ద ఉన్న జాబితాలకు కొత్త కుటుంబాలను జత చేయటం, ఆన్‌లైన్‌ కంప్యూటర్లు లేదా ఫోన్ల ద్వారా దరఖాస్తులను స్వీకరించటం, మూడవది ప్రభుత్వాలే అర్హులను గుర్తించటం.కొన్ని దేశాల్లో తమ వద్ద ఉన్న ఫోన్‌ నంబర్ల ద్వారా లబ్దిదార్లకు తెలియ చేస్తున్నారు.
నూటపదిహేడు దేశాలలో సామాజిక పధకాలకు లబ్దిదారులు చెల్లించాల్సిన వాటాల మొత్తాలను రద్దు చేయటం లేదా రాయితీలు ఇస్తున్నారు.సిక్‌లీవులకు చెల్లింపులు, నిరుద్యోగ భృతి వంటివి కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ప్రకటించిన మేరకు సామాజిక భద్రతా పధకాలకు తలసరి ఖర్చు సగటున 44 డాలర్లు ఉంది. ఒక డాలరు చొప్పున ఎనిమిది దేశాల్లో , నాలుగు డాలర్లు 12చోట్ల, 25 దేశాలలో 25 డాలర్లు, 99 డాలర్ల చొప్పున 17దేశాలలో ఖర్చుచేస్తున్నారు. సామాజిక బీమా పధకాలు మన దేశంలో ఎనిమిదిశాతం మందికి వర్తింప చేస్తుండగా పాకిస్ధాన్లో నాలుగుశాతం ఉంది.
కొన్ని ముఖ్యమైన దేశాల్లో అమలు జరుగుతున్న పధకాల వివరాలు సంక్షిప్తంగా ఇలా ఉన్నాయి. చెల్లింపులు, ఇతర సాయం బాధితులు, అవసరమైన వారికే అని గమనంలో ఉంచుకోవాలి. అయితే పెట్టుబడిదారీ దేశాలలో కార్మికవర్గం ఎక్కువగా ఉంటుంది కనుక బాధితులూ ఎక్కువగానే ఉంటారు. మన దేశంలో వృద్ధాప్య, వికలాంగుల, ఒంటరి మహిళల పెన్షన్లు ఇస్తున్నట్లుగానే అనేక దేశాలలో అలాంటి పధకాలతో పాటు పరిమితంగా నగదు బదిలీ కూడా కరోనాతో నిమిత్తం లేకుండానే జరుగుతోంది. అనేక ఐరోపా దేశాలలో నిరుద్యోగ భృతి, నిరుద్యోగ బీమా పరిహారం వంటి పధకాలు ఉన్నాయి. మన వంటి అనేక దేశాలలో అవి లేవు.
అల్జీరియాలో రంజాన్‌ సందర్భంగా పేదలకు 79 డాలర్ల విలువగల పదివేల అల్జీరియన్‌ దీనార్‌లు చెల్లిస్తారు. గర్భిణులకు, పిల్లలను చూసుకోవాల్సిన మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు, తాత్కాలిక ఉద్యోగులకు 50శాతం సిక్‌ లీవు చెల్లింపు.ఆస్ట్రేలియాలో ప్రభుత్వ పెన్షనర్లకు ఒకసారి చెల్లింపుగా 750 ఆస్ట్రేలియన్‌ డాలర్లు(455 అమెరికా డాలర్లు), ఉద్యోగార్ధులకు, యువ అలవెన్సుకింద పదిహేనురోజులకు ఒకసారి 550 డాలర్లు చెల్లిస్తారు. కొత్తగా వలస వచ్చిన అర్హతగల వారికి వేచి ఉండే వ్యవధిని రద్దు చేసి అలవెన్సు ఇస్తున్నారు.తాస్‌మనానియన్‌ రాష్ట్రంలో అల్పాదాయం గల వారు స్వయంగా క్వారంటైన్‌లో ఉండేట్లయితే వ్యక్తికి 250, కుటుంబానికి1000 డాలర్లు అత్యవసర సాయంగా ఇస్తారు.
బంగ్లాదేశ్‌లో పేదలకు విక్రయించే బియ్యం రేటును కిలో 30టాకాల నుంచి ఐదుకు తగ్గించారు. బెల్జియంలో నిరుద్యోగ భృతి, అలవెన్సులను 60 నుంచి 70శాతం వరకు పెంచారు, గరిష్ట పరిమితిని నెలకు 2,754యూరోలుగా నిర్ణయించారు, మూడునెలల పాటు ఇస్తారు.కార్మికులకు నిరుద్యోగ భృతితో పాటు రోజుకు 5.63యూరోలు అదనంగా చెల్లిస్తారు. స్వయం ఉపాధి పొందుతున్న వారికి కరోనా కారణంగా ఏడాది పాటు వారు తమ సామాజిక బీమాకు చెల్లించాల్సిన మొత్తాన్ని రద్దు చేశారు. వారికి ఇచ్చే సాయంలో ఎలాంటి కోత ఉండదు. బ్రెజిల్‌లో నిరుద్యోగులైన అసంఘటిత రంగ కార్మికులైన పెద్దలకు మూడు నెలల పాటు 115 డాలర్లు లేదా కనీసవేతనంలో 60శాతం వంతున చెల్లిస్తారు.అయితే కుటుంబానికి గరిష్టంగా ఇద్దరికి మాత్రమే వర్తిస్తుంది.వంటరి తల్లులకు 230 డాలర్లు ఇస్తారు.
కెనడాలో ఉపాధి హామీ బీమా వర్తించని వారికి నాలుగు నెలల పాటు రెండువేల డాలర్ల చొప్పున చెల్లిస్తారు.బ్రిటీష్‌ కొలంబియాలో కరోనా కారణంగా ఆదాయం కోల్పోయిన వారికి ఒకసారిగా వెయ్యి కెనడియన్‌ డాలర్లు చెల్లిస్తారు.అద్దెలకు ఉండేవారికి ఐదు వందల డాలర్లు ఇస్తారు, విద్యార్ధుల రుణాల వసూలును ఆరునెలలు వాయిదా వేశారు. ఛాద్‌లో ఆరునెలలు నీటి పన్ను, మూడు నెలలు విద్యుత్‌ బిల్లులను రద్దు చేశారు. చిలీలో మొదటి అసంఘటిత రంగ కార్మికులకు మొదటి నెల 340 డాలర్లు తరువాత దానిలో 85శాతం, మూడవ నెలలో 65శాతం నగదు చెల్లిస్తారు.
చైనాలోని ఊహాన్‌ నగరంలో వలస వచ్చిన కార్మికులకు గుండుగుత్తగా ఐదువందల యువాన్లు(మన రూపాయల్లో నాలుగువేలకు సమానం) ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు చైనాలో సామాజిక భద్రతా పధకాల కింద నమోదైన కంపెనీలన్నింటిలో హుబెరు రాష్ట్రంలో ప్రతి కంపెనీ యజమానులు చెల్లించాల్సిన వాటాను రద్దు చేశారు. మిగతా చోట్ల ఎంఎస్‌ఎంఇలకు రద్దు చేశారు. ఇదిగాక నిరుద్యోగ బీమా పధకం నుంచి వేతనాలు, సబ్సిడీలను చెల్లిస్తారు.ఈ మొత్తం అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా లేదు. ఉదాహరణకు నాన్‌జింగ్‌లో రోజుకు ఒక కార్మికుడికి వంద యువాన్లు చెల్లిస్తారు. దారిద్య్ర నిర్మూలన పధకంగా చైనాలో కనీస జీవన ప్రమాణ హామీ పధకం అమల్లో ఉంది. దీన్ని దిబావో అనిపిలుస్తారు. దీని కింద ఒక వ్యక్తికి పట్టణాల్లో ఐదు వందలు,గ్రామాల్లో మూడు వందల యువాన్లు కనీసంగా చెల్లిస్తారు. ఇది కూడా అన్ని చోట్లా ఒకే విధంగా లేదు, ఎక్కువ మొత్తాలను చెల్లించే ప్రాంతాలు కూడా ఉన్నాయి. షెంజన్‌లో స్ధానిక దిబావో మొత్తాలకు రెండు నుంచి 18 రెట్లు పొందేవారు కూడా ఉన్నారు.
క్యూబాలో వృద్దులు,వ్యాధి గ్రస్తులు, కరోనా వైరస్‌ బాధితులై ఇంటి దగ్గరే ఉండిపోయిన వారికి మొదటి నెలలో వందశాతం వేతనం, రెండవ నెలలో 60శాతం చెల్లిస్తారు.డెన్మార్క్‌లో లేఆఫ్‌ ప్రకటించని పక్షంలో ప్రభుత్వం మూడు నెలలపాటు 75శాతం వేతనాలు చెల్లిస్తుంది.ఈ మొత్తం గరిష్టంగా 3,418 అమెరికన్‌ డాలర్లు ఉంటుంది.ఈజిప్టులో అసంఘటితరంగ కార్మికులకు నెలకు 500 ఈజిప్టు పౌండ్లు లేదా మన రూపాయల్లో 2400 మూడు నెలల పాటు చెల్లిస్తారు.
అమెరికాలో నాలుగు నెలల పాటు పెద్ద వారికి 1200, పిల్లలకు 500 డాలర్ల చొప్పున చెల్లిస్తారు. పాకిస్తాన్లో ఒక విడతగా పన్నెండువేల రూపాయలు, మన కరెన్సీలో ఆరువేలు చెల్లిస్తారు. జర్మనీలో కళాకారులు, నర్సుల వంటి వారికి మూడునెలల్లో 15వేల యూరోలు చెల్లిస్తారు. ఆదాయం కోల్పోయిన వారి పిల్లలకు మార్చినెల నుంచి సెప్టెంబరు వరకు 185యూరోలు చెల్లిస్తారు.వ్యాధి సోకిన వారికి ఆరువారాల పాటు సిక్‌ లీవు కింద పూర్తి వేతనం ఇస్తారు. సామాజిక బీమా పధకాలకు యజమానులు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వమే ఇస్తుంది. యజమానులు లేఆఫ్‌ చేయకుండా ఉన్న కంపెనీలలో పన్నెండు నెలల పాటు 60శాతం వేతనాలు చెల్లించవచ్చు, పిల్లలున్న కార్మికులకు 67శాతం ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రాన్స్‌లో అత్యవసర సాయం కింద కుటుంబానికి 150, పిల్లలకు వంద యూరోల చొప్పున చెల్లిస్తారు. స్వయం ఉపాధి పొందేవారికి 1500, విధుల్లో ఉన్న ఉద్యోగులకు వెయ్యి యూరోల బోనస్‌ చెల్లిస్తారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి మొత్తం వేతనంలో 70శాతం చెల్లిస్తారు, కనీసం వేతనం, అంతకంటే తక్కువ పొందేవారికి నూటికి నూరుశాతం చెల్లిస్తారు.

UN general assembly session: Imran Khan lashes out at Prime ...

దక్షిణ కొరియాలో నిరుద్యోగ భృతి అక్కడి కరెన్సీలో నెలకు రెండు నుంచి ఐదు లక్షలకు పెంచారు. రష్యాలో గర్భవతులకు నెలకు 63 డాలర్లు, నిరుద్యోగులకు మూడు నెలల పాటు 38డాలర్లు చెల్లిస్తారు. జపాన్‌లో ప్రతి పౌరుడికి 930 డాలర్లు ఇస్తున్నారు. ఇరాన్‌లో నాలుగు విడతలుగా 400 డాలర్లు, ఇరాక్‌లో ప్రతి ఒక్కరికి 253 డాలర్లు,హాంకాంగ్‌లో ఒక విడతగా 1,280 డాలర్లు, ఒక నెల సామాజిక భద్రత పధకం అలవెన్సు అదనం. గ్రీసులో మూతబడిన సంస్ధల సిబ్బందికి 800 యూరోలు చెల్లిస్తున్నారు. పాకిస్ధాన్‌లో ఒక విడతగా పన్నెండు వేల రూపాయలను ప్రకటించారు. ఇది మన ఆరువేల రూపాయలకు సమానం. ఈ నేపధ్యంలో ప్రతి దేశంలోనూ అందించాల్సిన సాయం, కోల్పోయిన ఉపాధి పునరుద్దరణ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఏ దేశంలో అయినా అందరికీ ఇవ్వాల్సిన అవసరమూ లేదు, అవకాశమూ ఉండదు. కొందరికి అయినా ఇచ్చే మొత్తం ఎంత అన్నది చూసినపుడు మనం ఇస్తున్నది చాలా తక్కువ. ఎంత ఇవ్వాలనే అంశంపై మన దేశంలో చర్చకు పాలకులు తావివ్వటం లేదు. చర్చ జరిగితే బండారం బయట పడుతుంది కనుక పాచిపోయినా సరే మూసి పెట్టటానికే సిద్దపడుతున్నారు.

కార్పొరేట్లకు కట్టబెట్టే సమయంలో ప్రదర్శించే ఉత్సాహం, ఉదారత, ఉద్దీపనలు సామాన్యుల విషయంలో కనిపించటం లేదు. ఏటా కనీసం ఐదు లక్షల కోట్ల రూపాయల మేర కార్పొరేట్లకు, ఇతర ధనికులకు రాయితీలు ఇస్తూ ఖజానాకు రావాల్సిన అంటే జనానికి ఖర్చు చేయాల్సిన మొత్తాన్ని వదులుకుంటున్నారు. వేల కోట్ల రుణాలు తీసుకొని కావాలని ఎగవేసిన బడా సంస్ధలకు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దు మన కళ్ల ముందే జరిగింది. అందువలన ఇలాంటి సమయాల్లో చప్పట్లు, దీపాలు వెలిగించటం, స్వదేశీ వంటి కబుర్లు కాదు, కార్యాచరణ కావాలని జనం కోరుకుంటున్నారు. సుభాషితాలు పెరిగే కొద్దీ చిరాకు నిరసనగా మారుతోంది.