Tags

, , , , , ,

Slowdown blues: State of Indian economy and its fragile-five past ...

ఎం కోటేశ్వరరావు
కరోనా విపత్తు సమయంలో ప్రధాని నరేంద్రమోడీ ఇస్తున్న పిలుపులు, వాటి తీరుతెన్నులను చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. మోడినోమిక్స్‌ ద్వారా అంతర్జాతీయ సహకారం, ప్రపంచ ఆర్ధిక వృద్ధికి గాను చేసిన కృషికి చరిత్రలో మన ప్రధానుల్లో ఎవరూ పొందని విధంగా రెండు సంవత్సరాల క్రితం సియోల్‌ శాంతి బహుమతి అందుకున్న వ్యక్తి, ప్రస్తుత మోడీ ఒకరేనా అన్న అనుమానం కలగకపోదు. గత ఆరు సంవత్సరాల కాలంలో ఎన్ని పిలుపులు, ఎంత హడావుడి చేశారు. గతంలో మాదిరి స్వదేశీ వస్తువులనే కొనండి అన్న పిలుపు తిరిగి ఇస్తే తన ప్రత్యేకత ఏముంటుంది అనుకున్నారేమో ” స్వదేశీ వస్తువులనే అడగండి ”(వోకల్‌ ఫర్‌ లోకల్‌ ) అని ఇచ్చిన పిలుపు నిజంగానే వీనుల విందుగా ఉంటుంది. నరేంద్రమోడీ, ఆయన మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్ద పెద్ద స్వదేశీ లేదా భారతీయ నామాలు పెట్టుకొని జనం ముందు ప్రదర్శిస్తున్నా ఆచరణలో ఎక్కువగా విదేశీ వైపు మొగ్గుచూపటం నగ సత్యం. ప్రపంచ దేశాల వారందరూ వచ్చి మన దేశంలో ఖాయిలా పడిన లేదా అమ్మకానికి పెట్టిన కంపెనీలను కొనుగోలు చేసేందుకు ఎలాంటి ఆంక్షలు విధించని, కొన్ని రంగాలలో నూటికి నూరు శాతం విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచిన కేంద్ర ప్రభుత్వం చైనా పెట్టుబడుల విషయంలో తాజాగా కొన్ని నిబంధనలు విధించింది. అది ప్రపంచ వాణిజ్య సంస్ధ, స్వేచ్చా వాణిజ్య విధానాలకు వ్యతిరేకం అని చైనా విమర్శించింది. అయితే ఇదే మోడీ సర్కార్‌ చైనా నుంచి చేసుకుంటున్న దిగుమతులపై ఇంతకాలం ఇలాంటి ఆంక్షలు ఎందుకు విధించలేదు అన్న ప్రశ్నకు జవాబు లేదు. పెట్టుబడులు వద్దు-దిగుమతులు ముద్దు అని చెబుతారా ? పళ్లూడ గొట్టుకొనేందుకు అమెరికా రాయి హాయి నిస్తుంది, చైనా రాయి బాధనిస్తుంది అంటారా ?
మన దేశ ఆర్ధిక సంస్కరణల చరిత్రను చూసినపుడు అవి బాధ ఉపశమనానికి పైపూత ఔషధాల మాదిరిగా పని చేశాయి తప్ప చైనా మాదిరి మన దేశం ఒక ఆర్ధిక శక్తిగా ఎదగటానికి గానీ, సామాన్యుల జీవన స్ధితిగతులు మెరుగుపడేందుకు గానీ తోడ్పడలేదు. మన దేశమే కాదు అనేక లాటిన్‌ అమెరికా దేశాలు సంస్కరణల పేరుతో అనేక చర్యలు తీసుకున్నాయి ఏ ఒక్కటీ చైనా మాదిరి లబ్ది పొందలేదు. చైనా కమ్యూనిస్టు దేశం, అక్కడ ప్రజాస్వామ్యం లేదు, మనది ప్రజాస్వామ్యం అక్కడి మాదిరి మనకు కుదరదు అని ఎవరైనా చెప్పవచ్చు. అలాంటపుడు చైనాతో పోల్చుకోవటం ఎందుకు? త్వరలో చైనాను అధిగమిస్తామని ప్రగల్భాలు పలకటం ఎందుకు ? కమ్యూనిస్టు చైనా మాదిరిగాక పోతే మిగతా దేశాల మాదిరి పురోగమించకుండా అడ్డుకున్నదెవరు ? అత్యంత పేద దేశం, ఫ్రెంచ్‌, జపాన్‌, అమెరికన్‌ సామ్రాజ్యవాదుల దురాక్రమణ యుద్ధాలు సాగిన వియత్నాం సాధించిన మేరకు అయినా మనం ఎందుకు ఎదగలేకపోయాం.2018లో ప్రపంచ ఎగుమతుల్లో మన దేశం 323,056,409,000 డాలర్లతో 18వ స్ధానంలో ఉండగా వియత్నాం 290,395,445,000 డాలర్లతో 22వ స్ధానంలో ఉంది. తొమ్మిదిన్నర కోట్ల జనాభాగల ఆదేశం ఎక్కడ 140 కోట్లు గల మనం ఎక్కడ ?

Slowdown: Does the Narendra Modi govt even understand what is ...
మన దేశంలో అమలు జరిపిన ప్రతి దశ సంస్కరణల లక్ష్యం గురించి ఎన్ని తీపి కబుర్లు చెప్పినా, పర్యవసాన మన మార్కెట్‌ను విదేశీ కార్పొరేట్‌ సంస్ధలకు, ద్రవ్యపెట్టుబడికి మరింతగా తెరవటమే అన్నది చేదు నిజం. స్వాతంత్య్రానికి ముందు పరాయి బ్రిటీష్‌ పాలకులు మన దేశాన్ని ప్రత్యక్షంగా పరిపాలిస్తే విదేశీ కార్పొరేట్లు ఇప్పుడు మనలను పరోక్షంగా నడిపిస్తున్నారు. నాడు కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు బ్రిటీష్‌ వారిని వ్యతిరేకిస్తే కాషాయ దళాలు వారికి సేవ చేస్తూ స్వాతంత్య్ర ఉద్యమానికి దూరంగా ఉన్నాయి. ఇప్పుడు కమ్యూనిస్టులు మాత్రమే విదేశీ పెత్తనం, కార్పొరేట్‌ దోపిడీని వ్యతిరేకిస్తుంటే కాంగ్రెస్‌, బిజెపి, ఆ ప్రాంతీయ పార్టీ ఈ ప్రాంతీయ పార్టీ అని లేకుండా అన్ని పార్టీలు విదేశీ, కార్పొరేట్‌ సేవలో తరిస్తున్నాయి. మన దేశ ఫెడరల్‌ వ్యవస్ధ మౌలిక లక్ష్యాలను దెబ్బతీసే విధంగా వివిధ రంగాలలో రెగ్యులేటరీ వ్యవస్ధల ఏర్పాటుకు ఆద్యుడు బిజెపి నేత వాజ్‌పేయి, ఆయన హయాంలోనే నాంది పలికారు. తాజాగా కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణల బిల్లు కూడా అలాంటిదే. నిత్యం ప్రభుత్వ కార్యాలయాలకు ఆ రంగు వేశారు, ఆర్‌టిసి బస్సులకు ఈ రంగు వేశారంటూ గుండెలు బాదుకుంటున్న, సమర్ధించుకుంటున్న తెలుగుదేశం-వైసిపిలు రాష్ట్ర అధికారాలను హరించి వేసే ఈ బిల్లు విషయంలో కేంద్రానికి భజన చేస్తున్నాయి. తెలుగుదేశం బహిరంగంగా ప్రకటిస్తే వైసిపి తన వైఖరిని ప్రకటించేందుకు భయపడుతోంది.
దేశమంతా కరోనా వైరస్‌ను ఎలా కట్టడి చేయాలా అన్న గొడవలో ఉంటే ఇక నరేంద్రమోడీ హయాంలో మరో దఫా సంస్కరణలకు ఇదే సరైన తరుణం అని కార్పొరేట్‌ మీడియా చెవిలో జోరిగలా తొలుస్తోంది. సినిమాల్లో క్లబ్‌డాన్సర్లు నృత్యం ప్రారంభం నుంచి ముగిసే వరకు ఒంటి మీది దుస్తులు ఒక్కొక్కటి తొలగిస్తూ జనాలకు మత్తు ఎక్కిస్తుంటారు. మన దేశంలో సంస్కరణల ద్వారా ఒక్కొక్క రంగాన్ని తెరుస్తూ అదే మాదిరి విదేశీ సంస్ధలకు కిక్కు ఎక్కిస్తున్నారు. ఒక మోజు తీరగానే కొంత కాలానికి మరో కొత్తదనం(సంస్కరణ) కావాలనే డిమాండు ముందుకు వస్తోంది. 1991 తరువాత ప్రతి సంస్కర్త పాలనాకాలం వైఫల్యంతోనే ముగిసింది. మరో ముఖ్య అంశం ఏమంటే 2014 ఎన్నికల్లో తప్ప అంతకు ముందు జరిగిన ప్రతి ఎన్నిక సంకీర్ణ కూటములకే తీర్పు ఇచ్చింది. ఏక పార్టీ ఆధిపత్యం లేదు. ఆ ప్రభుత్వాలకు నాయకత్వం వహించిన వారు తమ వైఫల్యాలకు దాన్నొక కారణంగా చెప్పుకున్నారు. కిచిడీ ప్రభుత్వాలంటూ రాజకీయంగా బిజెపి ఆ పరిస్ధితిని బాగా వాడుకుంది. ఈ నేపధ్యంలోనే నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపికి అలాంటి సమస్యలు లేకుండా ఒకటికి రెండు సార్లు జనం తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. మేము సంకీర్ణ ధర్మాన్ని పాటించాల్సి ఉంది, పూర్తి మెజారిటీ లేదు, ఉంటే మా తడాఖా ఏమిటో చూపే వారం అని చెప్పుకొనే అవకాశం లేకుండా చేశారు.
నిర్ణయాత్మక ప్రజాతీర్పే కాదు, నరేంద్రమోడీ నాయకత్వానికి గత ఆరు సంవత్సరాలలో అనేక సానుకూల అంశాలు ఉన్నాయి. అత్యధిక రాష్ట్రాలలో ఆ పార్టీ పాలనే సాగుతోంది. అయినా అనేక అంశాలలో గత రికార్డులను తలదన్నే వైఫల్యాలను ప్రభుత్వం ఎదుర్కొంటోంది. వాటికి తగిన చికిత్సబదులు వేరే మార్గాలను ఎంచుకొంటోంది. వాటికి మరో తరం సంస్కరణలు అని ముద్దు పేరు పెడుతోంది. 1991 సంస్కరణలతో ఎన్నో ఆశలు పెంచుకున్న నాటి యువతీ యువకులకు వరుస వైఫల్యాలకు కారణాలు తెలియటం లేదు. ఆ తరువాత పుట్టిన నేటి యువతరానికి అసలేం చేయాలో తోచటం లేదు.
బంగారాన్ని తాకట్టు పెట్టి విదేశీ చెల్లింపులు చేయాల్సిన దుస్ధితిలో ఆర్ధిక వ్యవస్ధ ఉన్న సమయంలో పివి నరసింహారావు 1991లో ఆర్ధిక సంస్కరణలకు తెరతీశారు. ఆ సమయంలో మన విదేశీ అప్పులో కేవలం ఏడుశాతమే విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయి. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014లో 68.2శాతం ఉండగా 2018లో అవి గరిష్టంగా 80.2శాతానికి పెరిగాయి, ఈ ఏడాది జనవరి 11న రిజర్వు బ్యాంకు ప్రచురించిన సమాచారం ప్రకారం 77.8శాతం ఉన్నాయి. పివి నరసింహారావు సంస్కరణలు ప్రకటించిన తరువాత అవి 23శాతానికి పెరిగాయి. అందువలన ఇప్పుడు విదేశీ మారక ద్రవ్యం కోసమైతే సంస్కరణలు అవసరం లేదు. సంస్కరణలో భాగంగా పివి తన పాలనా కాలంలో రూపాయి విలువను గణనీయంగా తగ్గించారు లేదా పతనం అయ్యేట్లు చూశారు. 1991 మార్చినెలలో డాలరుకు రు.19.64 ఉన్నది కాస్తా 1996 నాటికి రూ.34.35కు పతనమైంది. గత ఆరు సంవత్సరాల మోడీ పాలనలో రూపాయి విలువ రూ.61.14 నుంచి ప్రస్తుతం 75కు పడిపోయిన విషయం తెలిసినదే. వాజ్‌పేయి హయాం నాటి రూపాయి విలువ స్ధాయికి అయినా ఎందుకు పెంచలేదో , ఇలా ఎందుకు జరిగిందో, దాని వలన మనకు జరిగిన లాభ నష్టాలేమిటో అధికారం పక్షం చెప్పదు, ప్రతిపక్షం లేదా ఆర్ధికవేత్తలు చెప్పేదానిని అంగీకరించకపోగా ఎదురుదాడి చేసే ఒక నిరంకుశ పరిస్ధితిలో ఉన్నాం. బేటీ బచావో అని చెప్పిన నరేంద్రమోడీ పాపాయి వంటి రూపాయిని బజారులో(మార్కెట్‌ శక్తులకు) వదలి పెట్టి మరింత బలహీనపరచకుండా చూసేందుకు ఏమి చేస్తున్నారు? ఆయనలో మూర్తీభవించినట్లు చెప్పే భారతీయత, దేశభక్తి ఏమైనట్లు ?
ఇక పివి నరసింహారావు తరువాత పదమూడు రోజుల పాలనను పక్కన పెడితే 1998 నుంచి 2004వరకు అధికారంలో ఉన్న బిజెపి నేత వాజ్‌పేయి కూడా అనేక సంస్కరణలకు తెరతీశారు. ఆయన పాలనలో ప్రత్యేకత ఏమంటే మన విదేశీ అప్పులో 36శాతంగా ఉన్న విదేశీ మారక ద్రవ్యం 103శాతానికి పెరిగింది, అంతే కాదు ఆయన పాలన చివరి రెండు సంవత్సరాలలో మన విదేశీ వాణిజ్యం జిడిపిలో 1.5శాతం మిగులులో ఉంది. స్వాతంత్య్రం తరువాత అలాంటి పరిస్ధితి ఆయన ఏలుబడికి ముందూ, తరువాత కూడా లేదు. అయితే రూపాయి విలువ వాజ్‌పేయి హయాంలో రూ.37.16 నుంచి 45.95కు దిగజారింది. ఆయన పదవి నుంచి దిగిపోయే ముందు పెట్రోలు, డీజిల్‌ మీద సబ్సిడీలను రద్దు చేశారు. మొత్తంగా తమ పాలనలో దేశం వెలిగిపోయింది అనే నినాదంతో ఎన్నికలకు పోయిన బిజెపి 2004లో ఘోరపరాజయం పాలైంది.

Decoding Slowdown: Dip in household savings, investment an ...
వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ పరాజయాన్ని చూసిన తరువాత అధికారంలోకి వచ్చిన మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ చమురు సబ్సిడీలను తిరిగి ప్రవేశ పెట్టింది. తొలి ఏడాది రూ.5,430 కోట్ల నుంచి పదేండ్లలో రూ.1,60,000 కోట్లకు పెంచారు. యుపిఏ పాలనా కాలంలో ఎరువుల వినియోగం గణనీయంగా పెరిగింది. సబ్సిడీ దాదాపు సున్నా నుంచి 1,38,000 కోట్ల రూపాయలకు పెరిగింది. వాజ్‌పేయి హయాంలో దిగుమతి చేసుకున్న ఎరువులు పదిశాతం ఉంటే పదేండ్లలో 60శాతానికి పెరగటం దీనికి ఒక కారణం. ఈ కాలంలో చమురు ధరలు, దానికి అనుగుణంగానే దిగుమతి చేసుకున్న ఎరువుల ధరలు, వాటికి సబ్సిడీ విపరీతంగా పెరిగింది. మోడీ హయాంలో దిగుమతి ఎరువుల శాతం 30కి అటూఇటూగా ఉంటోంది. విపరీతంగా పెరిగిన చమురు, ఎరువులు, బొగ్గు దిగుమతి ఖర్చు కారణంగా యుపిఏ పాలనా కాలంలో వాణిజ్యలోటు విపరీతంగా పెరిగింది. పదేండ్లలో జిడిపిలో 1.5శాతం మిగులు నుంచి నుంచి 5.1శాతం లోటుకు చేరింది. పర్యవసానంగా విదేశీ అప్పుకు 103శాతంగా ఉన్న విదేశీ మారక ద్రవ్యం 68శాతానికి తగ్గిపోయింది. ఈ కాలంలోనే రూపాయి విలువ రూ .45.95 నుంచి 60.09కి దిగజారింది.
యుపిఏ పాలనా కాలంలో రూపాయి విలువ పతనం గురించి నానా యాగీ చేసిన బిజెపి నాయకత్వం 2014లో అధికారానికి వచ్చిన తరువాత ఆ పతనాన్ని కొనసాగించి ప్రస్తుతం 75కు దిగజార్చింది. మోడీ తొలి మూడు సంవత్సరాల కాలంలో చమురు ధరలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా విదేశీ మారక నిల్వలు 80శాతానికి పెరిగాయి. ఈ ఏడాది మార్చి ఆరవ తేదీ నాటికి కరంట్‌ ఖాతా లోటు 0.2 ఒకశాతానికి తగ్గిపోయింది. ఇది మన విదేశీ చెల్లింపులకు ఢోకాలేని స్ధితిని తెలుపుతోంది. అయితే ఇదే పరిస్ధితి కొనసాగుతుందని చెప్పలేము. లోటు పెరిగే కొద్దీ రూపాయి విలువ మీద వత్తిడి పెంచుతుంది. ఈ ఏడాది ఆఖరుకు 1.6శాతానికి లోటు పెరగవచ్చని అంచనా వేశారు. అయితే అనూహ్యంగా చమురు, గ్యాస్‌ ధరలు రికార్డు స్ధాయిలో పడిపోవటంతో పరిస్ధితి ఎంతో మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇన్ని సానుకూల అంశాలు నరేంద్రమోడీ సర్కార్‌కు కలసి వచ్చినా అనేక రంగాలలో వైఫల్యం చెందటానికి కారణాలు ఏమిటి, దాన్నుంచి బయట పడేందుకు సర్కార్‌ తీసుకుంటున్న లేదా రాష్ట్రాలతో అమలు చేయిస్తున్న కార్మిక చట్టాల సవరణల వంటి సంస్కరణలు ఏమేరకు తోడ్పడతాయి అన్నది ప్రశ్న. కరోనా సంక్షోభం రాక ముందే అన్ని రంగాలలో తలెత్తిన సంక్షోభాన్ని ప్రభుత్వం దాచి పెట్టింది. మాంద్యం లేదు గానీ మందగమనం ఉందని సన్నాయి నొక్కులు నొక్కింది. గతంలోనే అనేక కార్మిక చట్టాలను నీరు గార్చటంలో బిజెపి పాలిత రాష్ట్రాలు ముందున్నాయి. ఇప్పుడు కేంద్రంలో కూడా వారే ఉన్నారు గనుక మరోసారి మిగిలిన వాటిని దెబ్బతీసేందుకు పూనుకున్నారు. ఓవర్‌ టైమ్‌ చేయించేందుకు వీలు కల్పించే పేరుతో పన్నెండు గంటల పని పద్దతిని అమలు చేయాలని అనేక చోట్ల ప్రతిపాదించారు. అంటే పని స్ధలాలకు దూరంగా ఉన్న కార్మికులు ఇండ్లకు వెళ్లేందుకు వీలు కలగదు, బ్రిటీష్‌ వారి కాలంలో మాదిరి పని చేసి ఇంటికి పోకుండా మరుసటి రోజు విధులకు వెళ్లేందుకు ఫ్యాక్టరీ గేట్ల ముందే విశ్రమించే రోజులు వచ్చినా ఆశ్చర్య ం లేదు.
1971లో ఇందిరా గాంధీ జనం దృష్టిలో దేవత దుర్గాదేవి. పాక్‌ సేనలను లొంగదీసుకొని బంగ్లాదేశ్‌ విముక్తికి తోడ్పడిన సమయంలో ఆమె తిరుగులేని నేత. బంగ్లా విముక్తికి కొద్ది నెలల ముందు గరీబీ హఠావో పేరుతో మధ్యంతర లోక్‌సభ ఎన్నికల్లో ఆమె తిరుగులేని విజయం సాధించారు. కానీ రెండు సంవత్సరాలు కూడా గడవక ముందే పరిస్ధితులు మారిపోయాయి. కాలేజీ ఫీజుల పెంపుదల, అధిక ధరలకు వ్యతిరేకంగా విద్యార్ధులు ప్రారంభించిన ఉద్యమాలు దేశ రాజకీయాలనే మార్చివేశాయి. బంగ్లా విముక్తి వంటి విజయం నరేంద్రమోడీ ఖాతాలో లేకపోయినా వివిధ కారణాలతో జనంలో పలుకుబడి కలిగి ఉన్నారు. సర్కార్‌ ఏలుబడిలో తీవ్ర సమస్యలున్నా అలాంటి ఉద్యమాలు లేవు.
1971లో పాక్‌ ఆర్మీతో తూర్పు పాకిస్ధాన్‌లో యుద్దం పదమూడు రోజులే జరిగినప్పటికీ అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న మన ఆర్ధిక వ్యవస్ధకు భారంగా మారిందంటే అతిశయోక్తి కాదు.1971-72 మన జిడిపి వృద్ధి రేటు 0.9శాతమే. తరువాత రెండు సంవత్సరాలలో అనేక చోట్ల కరవు, ఆహార ధాన్యాల కొరత, అధిక ధరలు, బంగ్లా శరణార్దుల రక్షణ వంటి అంశాలు చుట్టుముట్టాయి. విదేశీ మారక ద్రవ్యం కరిగిపోయింది. పరిశ్రమల మూత, నిరుద్యోగం పెరుగుదల, 1973లో పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభం చమురు సంక్షోభానికి దారితీసి ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ ఏడాది కొద్ది వారాల్లోనే పీపా 60 నుంచి ఇరవై డాలర్లకు పడిపోతే నాడు కొద్ది రోజుల్లోనే మూడు నుంచి పన్నెండు డాలర్లకు పెరిగింది. మోడీకి ఎన్నో డాలర్లు మిగిలితే ఇందిరా గాంధీకి ఖర్చయ్యాయి. నాడు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే జనానికి పెరిగాయి, నేడు గణనీయంగా తగ్గినా పెరిగాయి. మోడీకి యుద్ధం లేదు, చమురు బిల్లు గణనీయంగా తగ్గింది గానీ జిడిపి వృద్ధి రేటు దిగజారింది. ఇందిరా గాంధీ నాటి స్ధాయికి నిరుద్యోగం పెరిగింది. ద్రవ్యోల్బణం ఇరవైశాతం పైనే ఉంది, దానికి తగినట్లు ధరలు పెరిగాయి. ఇప్పుడు ఆ స్ధాయిలో ద్రవ్యోల్బణం లేదు. చమురు ధరలు తగ్గి ప్రభుత్వం మీద ఆర్ధిక వత్తిడి గణనీయంగా తగ్గినా చమురు పన్ను ఒక ఆదాయవనరుగా మార్చు కుంది.2014లో లీటరు పెట్రోలు మీద రూ.9.48 ఉంటే ప్రస్తుతం ఆ మొత్తాన్ని రూ.32.98కి మోడీ సర్కార్‌ పెంచింది. పెట్రోలు, డీజిల్‌ మీద ఒక లీటరుకు ఒక రూపాయి పన్ను పెంచితే కేంద్ర ప్రభుత్వానికి ఏటా పదమూడు- పద్నాలువేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందని అంచనా అంటే అదనంగా సాధారణ రోజుల్లో ఏటా మూడు లక్షల కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరుతుంది. ఈ మొత్తం అదనం అయితే పెట్రోలు, డీజిల్‌ సబ్సిడీ ఏటా ఒక లక్ష కోట్ల రూపాయలు ఆదా అయింది. 2004-05 నుంచి 2018-19 వరకు పెట్రోలియం ఉత్పత్తుల మీద ఇచ్చిన సబ్సిడీ మొత్తం 10,99,234 కోట్ల రూపాయలు. అయితే 2014-15 నుంచి 2018-19 వరకు చూస్తే పెట్రోలియం ఉత్పత్తుల మీద వసూలు చేసిన పన్ను మొత్తం రూ. 11,90,777 కోట్లు అన్న పచ్చినిజం ఎంత మందికి తెలుసు ?
2014 మార్చి ఒకటవ తేదీన ముడిచమురు పీపా ధర 118 డాలర్లు ఉన్నపుడు వినియోగదారుడికి ఢిల్లీలో రూ.73.20 పెట్రోలు దొరికింది, ఈ ఏడాది మే 22న పీపాధర 33.25 డాలర్లకు పడిపోయినప్పటికీ పెట్రోలు ధర రూ.71.30 ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలను బట్టి చమురు ధరల పెంపు తగ్గింపు అనే విధానాన్ని గత రెండునెలలుగా పక్కన పెట్టేశారు. ఇలాంటి పాలకులు సంస్కరణలతో బొందితో కైలాసానికి తీసుకుపోతామని చెపితే నమ్మటం ఎలా ?
ఒకవైపు జనం మీద బాదుడు, మరోవైపు చమురు బిల్లు తగ్గుదల, అనేక ఆర్ధిక సూచికలు గతంతో పోల్చితే బాగున్నప్పటికీ అభివృద్ధి జాడల్లేవు. ప్రపంచంలో అభివృద్దికి పలు నమూనాలు ఉన్నాయని కొందరు చెబుతున్నారు. దానితో ఏకీభవించటమా లేదా అన్నది పక్కన పెడదాం. ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ గుజరాత్‌ నమూనాను అభివృద్ధి చేశారని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దాన్ని దేశమంతటా విస్తరించకుండా విదేశాలు, విదేశీ కార్పొరేట్ల కోసం వెంపర్లాడటం ఎందుకు అన్న ప్రశ్నకు జవాబు చెప్పేవారు లేరు.

Economic Crisis: View: India's economic crisis can bring about ...రిజర్వుబ్యాంకు శుక్రవారం నాడు మరోసారి వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ తీరు చూస్తుంటే వడ్డీ సంగతి తరువాత ఒక రూపాయి అప్పు తీసుకుంటే మరో రూపాయి ఉచితం అనే రోజులు వస్తాయా అని పిస్తోంది. రుణాలు తీసుకొనే వారు లేరు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం లేదు. గత ఆరు సంవత్సరాలలో మోడీ సర్కార్‌ సాధించినట్లు చెప్పుకుంటున్న అభివృద్ధి ఎంత బలహీనమైనదో అర్ధం అవుతోంది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మన జిడిపి వృద్ధి రేటు మైనస్‌ 2.5 నుంచి మైనస్‌ 3.6శాతానికి దిగజార నుందని రేటింగ్‌ సంస్ధ గోల్డ్‌మాన్‌ శాచస్‌ తాజా అంచనాలో పేర్కొన్నది. లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేసిన తరువాత ఈ అంచనా ఎలా మారుతుందో తెలియదు. 2020-21లో మన జిడిపి రేటు మైనస్‌ ఆరు, ప్లస్‌ ఒక శాతం మధ్య ఉండవచ్చని పదిహేనవ ఆర్ధిక సంఘం అధ్యక్షుడు ఎన్‌కె సింగ్‌ జోశ్యం చెప్పారు. ఇవన్నీ నిజానికి ఆందోళనకర వార్తలు. మరోవైపు చైనాలో వృద్ధి రేటు కనిష్టంగా 1.8శాతం ఉంటుందని అంచనాలు వెలువడతున్నప్పటికీ తాము ఒక లక్ష్యాన్ని నిర్దేశించే స్ధితిలో లేమని చైనా ప్రధాని శుక్రవారం నాడు ప్రకటించారు. గత ఆరు సంవత్సరాల కాలంలో బ్యాంకుల నిరర్దక ఆస్తులు విపరీతంగా పెరిగిపోవటం, ఎనిమిది లక్షల కోట్ల రూపాయల వరకు వాటిని రద్దు చేయటం చూశాము. వీటిలో కావాలని ఎగవేసిన వాటితో పాటు ఆర్ధిక వ్యవస్ధ దిగజారుడు కూడా కనిపిస్తోంది. మోడీ సర్కార్‌ గత ఏడాది కాలంలో క్రమంగా వడ్డీ రేట్లను ఎంత తగ్గించినా, తీసుకొనే వారు కనిపించకపోవటం పలుమార్లు కోత పెడుతోంది. మన మీద ఏ విదేశీ ఆంక్షలు లేవు, విదేశీ కంపెనీలు తమ లాభాలను స్వేచ్చగా తరలించుకుపోయేందుకు ద్వారాలను ఎప్పుడో తెరిచి ఉంచాము. అయినా పెట్టుబడులు రావటం లేదు.
మన రిజర్వుబ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించుకుంటూ పోతే బ్యాంకులు డిపాజిట్లపై ఇచ్చే వడ్డీని తగ్గించాల్సి ఉంటుంది, అదే జరిగితే బ్యాంకుల్లో సొమ్ముదాచుకొనే వారు తగ్గిపోతారు. అది సరికొత్త సమస్యలకు దారి తీస్తుంది.దీన్ని ఆసరా చేసుకొని ద్రవ్యపెట్టుబడికి దారులు తెరిచేందుకు మోడీ సర్కార్‌ సరికొత్త వాదనలను ముందుకు తెచ్చింది. అదే విదేశాల్లో డాలర్‌ రుణాలను ప్రభుత్వమే తీసుకోవటం. ఇదొక ప్రమాదకరమైన క్రీడకు పూనుకోవటమే. రిజర్వుబ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించినా ఆ మేరకు బ్యాంకులు తమ ఖాతాదార్లకు బదలాయించటం లేదన్నది ఒక వాస్తవం.స్ధానికంగా ఉన్న వడ్డీ రేట్లలో సగానికంటే తక్కువకే విదేశీ సంస్ధల నుంచి రుణాలు తీసుకుంటే స్వదేశంలో బాండ్లకు గిరాకీ తగ్గుతుంది. దీని వలన స్ధానిక వడ్డీ రేట్లు, భారం తగ్గుతుంది. ఇది జరిగితే బ్యాంకులు ఆ మేరకు తమ దగ్గర రుణాలు తీసుకున్న ఖాతాదారులకు భారాన్ని తగ్గిస్తాయి. ప్రయివేటు రంగానికి రుణ లభ్యత పెరుగుతుందని చెబుతున్నారు.
ఏ దేశానికైనా ప్రాధాన్యతలు ఉంటాయి. ఉట్టికి ఎగరలేని వారు స్వర్గానికి ఎగురుతామంటే ఎలా ? కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అవసరమైన పిపిఇ, మాస్కులను కూడా దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.ఒక వైపు వలస కార్మికులు మాటిక్కెట్లను మా డబ్బులతో కొంటాం మా స్వంత ఊళ్లకు పంపండి మహాప్రభో అని వేడుకుంటున్నా పట్టించుకోని పాలకులు మన జనాన్ని చంద్రుడి మీదకు అంతరిక్షయానం చేయించేందుకు విదేశీ కంపెనీలతో ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతుంటే నవ్వాలో ఏడవాలో అర్ధం కావటం లేదు. అమెరికాతో సహా అనేక పశ్చిమ దేశాలు మనకు సాంకేతిక పరిజ్ఞానం అందచేసేందుకు తిరస్కరించినపుడు సోవియట్‌ యూనియన్‌, తరువాత రష్యా సాయంతో మన ఇస్త్రో శాస్త్రవేత్తలు గణనీయమైన విజయాలు సాధించారు. ఇవాళ్లగాకపోతే రేపు ఇప్పుడు చౌకగా రాకెట్లను, ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నట్లే అంతరిక్ష యానం కూడా చేయించగల సత్తా ఉంది. వారిని అవమానించే విధంగా ఇప్పుడు ప్రయివేటు విదేశీ కంపెనీలను రమ్మంటున్నారు. సంస్కరణల్లో భాగంగా మన అంతరిక్ష పరిశోధనా సంస్ధ సౌకర్యాలను వినియోగించుకొనేందుకు ప్రయివేటు కంపెనీలను అనుమతిస్తూ కేంద్రం నిర్ణయించింది. మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన సౌకర్యాలను వినియోగించుకోవటం అంటే పుట్టా గుట్టా కొట్టి పెంచిన చెట్లు కాయలు కాసే తరుణంలో వాటికి నీరు పోసి పండ్లు కోసుకుపోయేందుకు వేరే వారికి అప్పగించటం తప్ప మరొకటి కాదు.

Where Are The Jobs? There Is A Real And Growing Unemployment Crisis In India
కరోనా సహాయచర్యలకు డబ్బులేదు , కావాలంటే అప్పులు ఇప్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఈ సమయంలోనే ఢిల్లీలో కొత్త పార్లమెంట్‌ భవనం, సచివాలయం, ప్రధాని, ఉపరాష్ట్రపతి భవనాల నిర్మాణం పేరుతో ఇరవై వేల కోట్ల రూపాయలను తగలేయనుంది. ఇప్పుడు ఉన్నవాటితో వచ్చిన ఇబ్బంది ఏమిటి ? వర్షాకాలంలో మన ఇండ్ల మాదిరి అవేమీ కారటం లేదు, వేసవి వస్తే వాటిలో ఉండేవారికి వడదెబ్బ తగలటం లేదే ? న్యూఢిల్లీలో కొత్తగా పర్యావరణానికి, వారసత్వ నిర్మాణాలకు భంగం కలిగించే ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని అనేక మంది మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా ముందుకు పోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.1970 దశకంలో ఇందిరా గాంధీ కుమారుడు సంజరు గాంధీకి ఏడాదికి యాభైవేల మారుతీ కార్ల తయారీకి ఇందిర ప్రభుత్వం లైసెన్సు ఇస్తే ఆర్దిక సంక్షోభ సమయంలో కార్లు అవసరమా అంటూ ఆ రోజు ధ్వజమెత్తిన ప్రతిపక్షాలలో నేటి బిజెపి పూర్వరూపం జనసంఫ్‌ు కూడా ఉంది. అదేమీ ప్రభుత్వ పెట్టుబడితో సంజయ గాంధీ స్వంతానికి పెట్టే కంపెనీ కాదు. అదే విమర్శ ఇప్పుడు బిజెపికి సైతం వర్తించదా ? ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయం తరలింపును, తెలంగాణాలో నూతన సచివాలయ, అసెంబ్లీ భవనాల నిర్మాణాల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న బిజెపి న్యూఢిల్లీలో చేస్తున్నదేమిటి ? కరోనా పరీక్షలకు నిధులు కేటాయించని కేంద్రం ఆర్ధికంగా దిగజారిన స్ధితిలో ఒకవైపు జనాల మీద పన్నులు బాదుతూ అన్నివేల కోట్ల రూపాయలతో నూతన నిర్మాణాలు చేయటం అవసరమా ? రోమ్‌ తగులబడుతుంటే ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తి వైఖరి కనిపించటం లేదా !