Tags

, ,


ఎం కోటేశ్వరరావు
తారీఖులు, దస్తావేదులు ఇవి కాదోరు చరిత్ర సారం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అలా చూస్తే ఈనెల 30 తేదీకి నరేంద్రమోడీ2.0పాలనకు ఏడాది పూర్తి, ఖాతాలో ఆరేండ్లు జమ చేసుకోవటం తప్ప ఏం సాధించారన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. సాధారణంగా చివరి సంవత్సరంలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పాలకుల వైఫల్యాల గురించి చర్చ ప్రారంభం అవుతుంది. కానీ చిత్రం ఏమిటంటే మోడీ రెండవ సారి అధికారానికి వచ్చిన తొలి ఆరునెలల్లోనే దిగజారుతున్న దేశ ఆర్ధిక స్ధితికి కారకులు ఎవరనే ప్రశ్న ముందుకు వచ్చింది. దిగ్గజాలనిపించుకుంటున్న మన మంత్రులు హాస్యభరితమైన సమాధానాలు చెబుతుండగా కరోనా వైరస్‌ పుణ్యమా అంటూ అది వెనక్కు పోయింది. కరోనా వైరస్‌ పేరుతో వైఫల్య వైరస్‌ బయటకు రాకుండా ఎంతకాలం, ఎలా కాపాడతారో దేశం చూడనుంది.
ఏడాది పాలన మంచి చెడ్డల కంటే ముందుగా కరోనా నిరోధ చర్యల విషయంలో ప్రభుత్వ వైఫల్యం గురించి వచ్చిన విమర్శలకు అధికారపక్షం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సామాజిక మాధ్యమంలో బిజెపి మరుగుజ్జులు విన్యాసాలు చేసేందుకు భయపడుతున్నారు.ఎంత ఎక్కువ తప్పుడు ప్రచారం చేస్తే అంత ఎక్కువగా జనంలో పలచనౌతారు. ఏడాది పాలన ఉత్సవాలను ఎలా చేసుకుంటారో, ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో, జనం ఏవిధంగా చూస్తారో చూద్దాం. క్రికెట్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రెండవ ఇన్నింగ్స్‌లో తరచూ విఫలమయ్యాయరన్నది ఒక విశ్లేషణ. రాజకీయాల్లో రెండవ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మోడీకి ఇది వర్తిస్తుందా?
కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలలో చేతులు కడుక్కోవటం ఒకటి.పేరుకు 20లక్షల కోట్ల రూపాయల పాకేజ్‌ అని ప్రకటించినప్పటికీ రెండున్నర లక్షల కోట్లకు మించి ఖజానా నుంచి ఖర్చు చేయకుండా కేంద్ర ప్రభుత్వం చేతులు కడిగేసుకోవటాన్ని చూశాము. అదే విషయాన్ని ప్రతిపక్షాలు ఎత్తి చూపితే అదిగో చూడండి పాకేజ్‌ను అర్ధం చేసుకోకుండా లోపాలు వెతికేందుకు పూనుకున్నారు అంటూ నిర్మలమ్మ ఎగిరి పడ్డారు.
2024 నాటికి మన ఆర్ధిక వ్యవస్ధను ఐదు లక్షల కోట్ల డాలర్ల స్ధాయికి పెంచాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. సర్వేజనా సుఖినో భవంతు మాదిరి ఐదు కాదు ఆయన మంత్రదండంతో పదిలక్షల కోట్లకు పెంచినా మంచిదే, దాంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఎలా సాధిస్తారన్నదే కదా సమస్య. దానికంటే ముందు 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామన్న వాగ్దానం గురించి మాట్లాడటం మానేశారు. ఒకసారి చెప్పినదాని గురించి మరోసారి మాట్లాడకపోవటమే కదా అనితర సాధ్యమైన నరేంద్రమోడీ ప్రత్యేకత. గతంలో కాంగ్రెస్‌, ఇతర పార్టీలు, చివరికి బిజెపికే చెందిన వాజ్‌పారు ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు విమర్శిస్తే ఎక్కడ దేశ ద్రోహి అంటారో, తుకడే తుకడే గాంగ్‌ అని ముద్రవేస్తారో అని ప్రముఖ పారిశ్రామికవేత్తల మొదలు మేథావుల వరకు ఎవరూ ప్రభుత్వ విధానాలు,వాటి పర్యసానాల గురించి మాట్లాడేందుకు భయపడి చస్తున్నారు.
సిఎఎ, ఎన్‌ఆర్‌సి సంబంధిత అంశాలు, ఢిల్లీ మతదాడులతో మలివిడత తొలి ఏడాది ప్రారంభంలో ఆర్టికల్‌ 370, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రం, ముమ్మారు తలాక్‌ రద్దు వంటి విజయగానాలు మూగపోయాయి. ఏదో ఆరోజు అలా అనుకున్నాం అని గాక ఆర్టికల్‌ రద్దు, కాశ్మీర్‌ రాష్ట్ర రద్దు వలన ఆ రాష్ట్ర ప్రజలకు, మొత్తంగా దేశ ప్రజలకు జరిగిన మంచి ఏమిటో మోడీ లేదా మద్దతు ఇచ్చిన ప్రాంతీయ పార్టీలు జనానికి ఈ సందర్భంగా చెప్పాలి. ఏదో ఒక రోజు కరోనా లాక్‌డౌన్‌ ఎత్తివేత జరుగుతుంది తప్ప గత ఏడాది ఆగస్టు 5న ప్రకటించిన కాశ్మీర్‌ లాక్‌డౌన్‌ ఎత్తివేత కనుచూపు మేరలో కనిపించటం లేదు. దాన్ని సమర్ధించిన పార్టీలేవీ మాట్లాడటం లేదు. అది ఇంక శాశ్వతం అన్నట్లుగా జనాలు కూడా ఆలోచించటం మానుకున్నారు. దాని గురించి మాట్లాడేందుకే పాలక పార్టీ భయపడుతోంది. ఆర్ధిక వ్యవస్ధ మరింత సంక్షోభంలోకి కూరుకుపోకుండా చూసేందుకు ఊబిలో ఉన్న జనాలను రక్షించేందుకు గాక వెలుపల ఉన్న పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ప్రభుత్వం చేయూతనిస్తోంది. అయితే కొత్తగా పెట్టుబడులు పెడితే తాము కూడా ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుందని వారు ముందుకు రావటం లేదు. బంగారు బాతులను కోసి గుడ్లు తీసుకున్నట్లుగా ఎల్‌ఐసి, చమురు సంస్ధల వాటాల విక్రయం, ప్రయివేటీకరణ అజెండా గురించి వేరే చెప్పనవసరం లేదు.
దేశంలో హిందువులున్న ప్రతి గ్రామంలో రామాలయం ఉంది, వాటి సరసన ఆయోధ్యలోని వివాదాస్పద స్ధలంలో మరో ఆలయ నిర్మాణానికి సుప్రీం కోర్టు తీర్పు అవకాశం ఇచ్చింది. రాముడి మనోభావాలకు విలువ ఇచ్చిన ఉన్నత న్యాయస్ధానం వలస కార్మికుల విషయంలో మేమేం చేస్తామంటూ కడిగేసుకుంది. తమ స్వస్ధలాలకు వెళ్లేందుకు అవకాశం, వ్యవధి ఇవ్వకుండా ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా కోట్లాది మంది పడిన ఇబ్బందులు మోడీ సర్కార్‌కు తొలి ఏడాది పాలనలో మాయని మచ్చగా మారాయి. ఎన్ని మరకలు పడితే అంత మంచిది అని భావించే వారిని అవి బాధించవు. అన్నింటికీ మించి 20లక్షల కోట్ల జుమ్లా పాకేజ్‌ మోడీ సర్కార్‌ బూటకాన్ని మరోసారి బట్టబయలు గావించింది. మన ప్రజారోగ్య వ్యవస్ధ ఎంత బలహీనంగా ఉందో మహమ్మారుల సమయంలో వైద్యులు, సిబ్బందికి కనీసం అవసరమైన ముఖతొడుగులు, పిపిఇ కిట్స్‌ కూడా అందించలేని దుస్ధితిని కరోనా వెల్లడించింది. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు పారాసిటమాల్‌, బ్లీచింగ్‌ పౌడర్లతో వైరస్‌ను అరికట్టవచ్చని ముఖ్యమంత్రులే చెప్పారు.
ఏడాది పాలన సందర్భంగా వందిమాగధులు చప్పట్లు కొట్టే పరిస్ధితి లేదు, అభిమానులు దీపాలు వెలిగించి హారతులు పట్టేంత గొప్పలేమీ లేవు. పూలు చల్లి పూజలు చేసే మహిమలేవీ మోడీ బాబా ప్రదర్శించలేదు. కాంగ్రెస్‌ ఐదు దశాబ్దాలలో చేయలేని దానిని లేదా చేసిన నిర్వాకాలను మేము ఐదు సంవత్సరాలలో సరిదిద్దామని బిజెపి నేతలు చెప్పుకున్నారు. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అని ఒక కవి చెప్పిన మాటలను ఆ పార్టీకి అన్వయించుకోవలని వారే స్వయంగా రుజువు చేసుకున్నారు. మచ్చుకు ఒకదానిని చూద్దాం. 2013-14 ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ స్వదేశీ, విదేశీ అప్పు మొత్తం రూ. 46,15,250 కోట్లు కాగా 2019-20కి రూ.100,18,120 కోట్లు. సెంచురీ సాధించిన ఘనత కచ్చితంగా మోడీదే. నాటి నెహ్రూ మొదలు మధ్యలో వాజ్‌పేయితో సహా మన్మోహన్‌ సింగ్‌ వరకు చేసిన అప్పుల బకాయిల కంటే అరు సంవత్సరాలలో మోడీ గారి ప్రగతి ఆకాశానికి ఎలా ఎగిరిందో వ్యాఖ్యలు అవసరం లేదు. జనానికి ఇస్తున్న లక్షల కోట్ల రూపాయల రాయితీల రద్దు తరువాత జరిగినది ఈ పురోగతి.
వృతం చెడ్డా ఫలం దక్కలేదు. నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. ఈ సమస్యను కరోనాకు ముందు, తరువాతగా చూసేట్లయితే మోడీ 2.0 రెండవ ఏడాది ఎదుర్కోబోయే సవాలు అర్ధం అవుతుంది.లాక్‌డౌన్‌ ప్రకటించిన తరువాత మార్చి 25న దేశంలో నిరుద్యోగుల శాతం 7.58శాతంగా ఉందని సిఎంఐయి విశ్లేషణ పేర్కొన్నది. అదే మేనెల 24న 24.6శాతంగా తెలిపింది. లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తరువాత ఇది ఎలా మారుతుందో చూడాల్సి వుంది. ఏప్రిల్‌ నెలలో పెద్ద రాష్ట్రాలలో గరిష్టంగా తమిళనాడులో 49.8శాతం ఉంది, కేంద్ర పాలిత రాష్ట్రమైన పుదుచ్చేరిలో 75.8శాతం కాగా ఆంధ్రప్రదేశ్‌లో 20.5, తెలంగాణాలో 6.2శాతం ఉన్నట్లు సిఎంఐయి తెలిపింది. దేశ ఆర్ధిక రంగంలో వైఫల్యాలు లేదా ఎదురువుతున్న సవాళ్ల గురించి మచ్చుకు ఇవి చాలు. ఈ పరిస్ధితికి కారకులు ఎవరు ?
గాంధీ, నెహ్రూలే అని ఆరు సంవత్సరాల ఏలుబడి తరువాత మోడీ పరివారం చెబితే నడవదు, భక్తులు కూడా మరీ అంతగా కమలం పువ్వులు ఎక్కువ కాలం పెట్టుకోలేరు. మోడీ సర్కార్‌ చెప్పుకున్నట్లు చైనా కంటే అధిక వృద్ధి రేటు అంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా, ఎక్కువగా ఉన్న మన దేశం ఒక్కసారిగా తిరోగమనంలోకి జారిందన్నది కాదనలేని వాస్తవం. త్వరలో మాంద్యంలోకి పోబోతున్నదని అందరూ అంగీకరిస్తున్న అంశం. అనాలోచితంగా మోడీ ప్రకటించిన 2016నాటి పెద్ద నోట్ల రద్దు,తరువాత తగినంత కసరత్తు లేకుండా ప్రవేశపెట్టిన జిఎస్‌టి, తదితర అంశాలు అంతగా అంతుబట్టని ఆర్ధిక గొలుసుకట్టు రాతను జనం అర్ధం చేసుకొనే తరుణం వచ్చింది.
యుపిఏ హయాంలో ముడుపులు తీసుకొని కాంగ్రెస్‌ మంత్రులు ఫోన్లు చేసి లక్షల కోట్ల రూపాయలను ఆశ్రిత పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు రుణాలుగా ఇప్పించారని, తీసుకున్నవారంతా ఎగవేస్తున్నారని, దానికి బాధ్యత కాంగ్రెస్‌దే, ఫోన్‌ బ్యాంకింగ్‌ అంటూ ఇప్పటి వరకు ప్రచారం చేస్తున్న బిజెపి తన ఏలుబడిలో ఆ అప్పులను రద్దు చేస్తున్నది లేదా ఎంతో కొంత వసూలు చేసి లావాదేవీలను మూసివేయమంటున్నది. నాడు అప్పులు ఇప్పించినందుకు కాంగ్రెస్‌కు ఎన్ని ముడుపులు ముట్టాయో వాటిని రద్దు చేస్తున్నందుకు ఇప్పుడు అంతకంటే ఎక్కువే బిజెపికి ముడుతూ ఉండాలి. లేకుంటే ఉత్తి పుణ్యానికే రద్దు చేస్తారా ? కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బిజెపి నేత నళిన్‌ కోహ్లీతో చెప్పినట్లుగా బిజెపి సోషల్‌ మీడియా వేదికలు వెల్లడించిన సమాచారం ప్రకారం సిబిఐ, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌.కాగ్‌(మూడు సి’లు) గురించి భయపడాల్సిన పనిలేదని, అర్హులైన వారికి ఉదారంగా రుణాలివ్వాలని, నిర్ణయం తప్పయినా, ఏదైనా నష్టం జరిగినా ప్రభుత్వం నూరుశాతం హామీగా ఉంటుందని బ్యాంకు, ఆర్ధిక సంస్ధల అధికారులకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. వాటిని ఎక్కడా ఖండించినట్లు కనిపించలేదు. అంటే ఆర్ధిక సంస్ధల ఉన్నతాధికారులు, బడాబాబుల బంధం మరింత గట్టిపడి రాబోయే రోజుల్లో జనం సొమ్ము లూటీ చేసేందుకు హామీ ఇవ్వటం తప్ప ఇది వేరు కాదు. కాంగ్రెస్‌ నేతలు అనధికారికంగా సిఫార్సులు చేసినా మేం చూసుకుంటామని ఎక్కడా చెప్పలేదు, పోయినోళ్లే మంచోళ్లు అనిపిస్తున్నారు బిజెపి నేతలు.
మన దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభం లేదా మాంద్యానికి ద్రవ్య వ్యవస్ధను ప్రయివేటీకరించకపోవటమే అని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారీ లాబీ చెబుతోంది. రుణాల వృద్ది రేటు బలహీనంగా ఉందని, మూడింట రెండు వంతుల బ్యాంకింగ్‌ ఆస్ధులను ప్రభుత్వ రంగబ్యాంకులే అదుపు చేస్తున్నాయని, గత ఆకస్మిక రుణ వృద్ధి తరువాత నిరర్ధక ఆస్తుల్లో 90శాతం ప్రభుత్వ బ్యాంకుల్లోనే ఉన్నాయని, ప్రభుత్వరంగ బ్యాంకులను తెగనమ్మకుండా వాటిని సంస్కరించటానికి పూనుకున్నట్లు నిషఉ్ఠరాలాడుతున్నారు. 2008 సంక్షోభంలో ప్రయివేటు రంగ బ్యాంకులు ఇతర దేశాల్లో ఎలా కుప్పకూలాయో చూసిన తరువాత మన దగ్గర అలాంటి సంక్షోభం తలెత్తకపోవటానికి కారణం బ్యాంకింగ్‌ రంగం ప్రభుత్వ ఆధీనంలోనే ఉండటం అన్నది తెలిసిందే. ఇప్పుడు ఆ బ్యాంకులను దెబ్బతీసేందుకు, ప్రయివేటు పరం చేసేందుకు వత్తిడి తెస్తున్నారు.
ి ఏడవ వేతన సంఘ సిఫార్సుల ప్రభావం తొలి రోజుల్లో ఎక్కువగా ఉన్నప్పటికీ అది తగ్గిపోవటం ప్రారంభమైందని ఆర్ధిక వ్యవస్ధ మందగించటానికి ఇది ఒక కారణమన్నది ఒక అభిప్రాయం. ఆర్ధిక పునరుద్దరణకు వడ్డీ రేట్ల తగ్గింపు జిందాతిలిస్మాత్‌ కాదు.పరిమిత ప్రయోజనాలు మాత్రమే ప్రతికూల పర్యవసానాలు కూడా వెంట ఉంటాయి. అనేక దేశాల్లో సున్నా లేదా ఒకటి రెండు శాతమే వడ్డీ రేటు ఉన్నా అవి ఆర్ధిక సుడిగుండాల నుంచి బయటపడటం లేదు.
ఒకవైపు ప్రపంచంలోనే అత్యంత వేగంగా, చైనా కంటే అధికంగా నరేంద్రమోడీ హయాంలో దేశం అభివృద్ధి చెందుతున్నదని ఊదరగొట్టిన వారు, తిరోగమనం ప్రారంభం కాగానే మాట మార్చారు. మన మందగమనానికి కారణం ప్రపంచ వ్యవస్ధ లేదా అన్ని దేశాల మాదిరిగానే మనదీ సమస్యలను ఎదుర్కొంటోందంటూ విమర్శకులపై ఎదురుదాడి చేస్తున్నారు. మరోవైపు ప్రపంచ మందగమనానికి మన దేశం ప్రాధమిక కారణమని, సులభలెక్కల్లో అయితే 80శాతం అని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్ధికవేత్త గీతా గోపీనాధ్‌ జనవరినెలలో దవోస్‌ ప్రపంచ ఆర్ధిక వేదిక సమావేశాల్లో చెప్పారు.భారత అభివృద్ధి మందగించిన కారణంగానే ప్రపంచ సూచికలను తగ్గించాల్సి వస్తోందన్నారు.
ప్రపంచ వాణిజ్యంలో భారత వాటా నామమాత్రమని అమెరికా-చైనాల మధ్య సాగుతున్న వాణిజ్యపోరు, అమెరికా-ఇరాన్‌ వైరం, అమెరికా నుంచి ఐరోపా, రష్యా వరకు ఏ ఒక్క దేశంలోనూ పురోగతి కనిపించటం లేదు, ఇవన్నీ మన దేశాన్ని దెబ్బతీస్తున్నాయి తప్ప మనం కారణం అనటం ఏమిటనిఅనేక మంది ఆర్దికవేత్తలు గీతపై రుసరుసలాడారు. ఇవన్నీ కరోనా వైరస్‌ వ్యాప్తి పర్యవసానాల గురించి అంచనాలు లేక ముందు జరిగిన చర్చ అంశాలు. కరోనాకు ముందు 2019లో మన ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి రేటు అక్టోబరు అంచనాలో 6.1శాతం కాగా తరువాత 4.8శాతానికి ఐఎంఎఫ్‌ తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం 6.8శాతం నుంచి జనవరిలో ఐదు శాతానికి తగ్గించింది. వాస్తవంలో ఎంతో ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడు 2020లో మనదీ, ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనంలో ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి. రిజర్వుబ్యాంకు గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఎంత శాతమో ఇంకా తెలియదు గానీ తిరోగమనమే అని చెప్పగా పదిహేనవ ఆర్ధిక సంఘం చైర్మన్‌ ఎన్‌కె సింగ్‌ మాత్రం మైనస్‌ ఆరు నుంచి ఒకశాతం మధ్య ఉంటుందన్నారు. చైనాకు సంబంధించి గణనీయంగా తగ్గినా పురోగమనమే తప్ప తిరోగమం కాదని అంచనాలు వెలువడిన విషయం తెలిసిందే.
క్రిసిల్‌ రేటింగ్‌ సంస్ధ ప్రధాన ఆర్ధిక వేత్త డికె జోషి ప్రపంచ ఆర్ధిక మందగమనానికి భారత్‌ కారణం అనటాన్ని తోసిపుచ్చారు. మూలము ధనిక దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలకు పాకుతుంది అన్నారు.భారత మందగమనానికి స్ధానిక అంశాలే మొత్తంగా కారణం అన్నారు. అంకెల రీత్యా భారత్‌ ప్రభావం చూపినట్లు కనిపించవచ్చుగానీ భౌతికంగా కాదు అన్నారు. కొనుగోలు శక్తి తుల్యత(పర్చేజింగ్‌ పవర్‌ పారిటీ) ప్రాతిపదికన అభివృద్ధి రేటును లెక్కిస్తే ప్రపంచంలో భారత్‌ మూడవ పెద్ద దేశం.(2020 అంచనాల ప్రకారం చైనా 27.8, అమెరికా 20.29, భారత్‌ 11.32, జపాన్‌ 5.45, రష్యా 4.18 లక్షల కోట్ల డాలర్ల వంతున తొలి ఐదు స్ధానాల్లో ఉన్నాయి. కరోనా ఈ అంకెలను ఎలా మారుస్తుందో తెలియదు.) భారత మందగమనం కానసాగటానికి కారణం ద్రవ్య రంగ సమస్యలు. వస్తు ఉత్పత్తి, సేవలు, ద్రవ్య రంగం ఒకదానికి ఒకటి సాయపడాల్సి ఉంది. ఆర్ధికవ్యవస్దకు ఉత్తేజం, ఉల్లాసం కలిగించే సామర్ధ్యం దేశ ద్రవ్యవిధానాలకు పరిమితంగా ఉంది, కాబట్టి ముడి చమురు ధరలు, రుతుపవనాల మీద అదృష్టం ఆధారపడి ఉంటుందని జోషి చెప్పారు.
ప్రపంచ-భారత ఆర్ధిక సంస్ధలు పరస్పర ఆధారితమైనవి.అనేక మంది ఆర్ధికవేత్తలు చెప్పినట్లు వర్తమాన భారత మందగమనాన్ని బయటి అంశాలు తీవ్రం చేశాయి. అయితే స్ధానిక సమస్యలే దానికి మూలం అన్నది ముఖ్యమని గుర్తుకు తెచ్చుకోవాలి. వ్యవసాయ సంక్షోభం, గ్రామీణ ప్రాంతాలలో దారిద్య్రం, గిరాకీ(డిమాండ్‌) పడిపోవటం, పెట్టుబడుల రేటు తీవ్రంగా పడిపోవటం, పెద్ద నోట్ల రద్దు, లోపాలతో కూడిన జిఎస్‌టి భారత వృద్ధి రేటు పడిపోవటానికి ప్రాధమిక కారణాలు అని ఆర్ధికశాఖ మాజీ కార్యదర్శి అరవింద్‌ మాయారామ్‌ చెప్పారు.
పారిశ్రామిక ఉత్పత్తి, వ్యవసాయ రంగాలలో అమెరికా, ఐరోపా యూనియన్‌ అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలే మన దేశీయ అభివృద్ధికి ప్రతికూలంగా మారాయని బిజెపి ఆర్ధిక వ్యవహారాల ప్రతినిధి గోపాల కృష్ణ అగర్వాల్‌ చెప్పారు. దేశ ఆర్ధిక వృద్ధి కంటే నరేంద్రమోడీ తన రాజకీయ, సామాజిక అజెండాను నెరవేర్చుకోవటం మీదే కేంద్రీకరించిన పర్యవసానమే మందగమనం అని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వ్యాఖ్యానించారు.
దేశ ఆర్ధిక మందగమనానికి నెహ్రూ, ఇందిరా గాంధీలే కారణం అని చెప్పవద్దని శివసేన పత్రిక సామ్నా వ్యాఖ్యానించింది. అధికారాలన్నీ చేజిక్కించుకొని మంత్రులకు అధికారం లేకుండా చేసిన ప్రధాన మంత్రి కార్యాలయమే ఒక ప్రధాన కారణమని, ఆర్ధికం అంటే షేర్‌ మార్కెట్‌ జూదంగా భావిస్తున్న బిజెపి నాయకత్వం ఆర్ధికవేత్తలు చెప్పేది వినటం లేదని పేర్కొన్నది.
” టీవీలలో చూపే లెక్కల జోలికి మీరు పోవద్దు, దేశం ఐదులక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్ధగా ఎదగాలంటే పన్నెండుశాతం వంతున ఎదగాలి. ఈరోజు ఆరుాఏడుశాతం చొప్పున పెరుగుతున్నది. మీరు ఆలెక్కల్లోకి పోవద్దు గురుత్వాకర్షణ సిద్దాంతాన్ని కనుగొనేందుకు ఐనిస్టీన్‌కు లెక్కలు ఎప్పుడూ ఉపయోగపడలేదు ” (ఐనిస్టీన్‌ పుట్టటానికి దాదాపు రెండు వందల సంవత్సరాల ముందే న్యూటన్‌ ఆ సిద్దాంతాన్ని కనుగొన్నాడు. ఐనిస్టీన్‌ సాధారణ సాపేక్ష సిద్దాంతాన్ని కనుగొన్నాడు. అవి రెండూ లెక్కల ప్రాతిపదికగా చెప్పినవే ) అని చెప్పిన మంత్రి పియూష్‌ గోయల్‌, ఆటోమొబైల్‌ పరిశ్రమలో మాంద్యం ఎందుకు వచ్చిందంటే జనాలు ఊబర్‌,ఓలాలు వినియోగించటమే కారణం అని చెప్పిన నిర్మలాసీతారామన్‌, మూడు సినిమాలు కిక్కిరిసిన ప్రేక్షకులతో నడుస్తుంటే ఇంకా ఆర్ధిక మందగమనం ఎక్కడ అని ప్రశ్నించిన రవిశంకర్‌ ప్రసాద్‌ వంటి వారు నరేంద్రమోడీ కొలువులో మంత్రులుగా ఎన్ని ఉత్సవాలు చేసుకున్నా, ఎంతకాలం పదవుల్లో ఉన్నా దేశ మందగమనానికి అసలైన కారణాలు, బాధ్యుల గురించి వారి నోట వినగలమా ?