ఎం కోటేశ్వరరావు
భారత్‌ాచైనాల మధ్య వివాదాస్పర సరిహద్దు సమస్యలో మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్దంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని రెండు దేశాలకూ తెలియచేశానని కూడా చెప్పారు. మరుసటి రోజు ఇదే అంశంపై మాట్లాడుతూ ” మోడీతో మాట్లాడాను. చైనాతో తలెత్తిన పరిస్ధితి గురించి ఆయన మంచి మానసికస్దితిలో(గుడ్ మూడ్) లేరని నేను చెప్పగలను.రెండు దేశాలూ సంతోషంగా లేవు” అని కూడా ట్రంప్ చెప్పారు. ఇది ఎంతో తెలివిగా చేసిన వ్యాఖ్య. నిజంగా మోడీ ఎలా ఉన్నారో తెలియదు. నీవు నీ భార్యను కొట్టటం మానుకున్నావా అని ఎవరైనా అడిగినపుడు ఏ సమాధానం చెప్పినా తంటాయే. మామూలుగానే మన ప్రధానికి మాట్లాడే అలవాటు లేదు కనుక స్పందన తెలియదు. అయితే మన విదేశాంగ ప్రతినిధి మాట్లాడుతూ చైనాతో శాంతియుతంగా పరిష్కరించే పనిలో ఉన్నామని వ్యాఖ్యానించారు. ఇదే విధంగా చైనా కూడా స్పందించింది. ట్రంప్ ప్రస్తావన లేకుండా చైనా రక్షణశాఖ ప్రతినిధి మాట్లాడుతూ చైనా-భారత్ సరిహద్దు విషయంలో చైనా వైఖరి స్పష్టం. శాంతి, ప్రశాంతతను కాపాడేందుకు చైనా దళాలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. రెండు దేశాల మధ్య ట్రంప్ జోక్యం అవసరం లేదని చైనా మీడియా వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు లడఖ్ ప్రాంతంలో తలెత్తిన తాజా పరిణామాల గురించి చైనా వ్యాఖ్యాతలు పరిస్ధితి అదుపులోనే ఉందని చెబుతున్నారు తప్ప మన దేశంలో మీడియా మాదిరి యుద్ధానికి దారి తీస్తుందా అన్నట్లు చిత్రీకరించటం లేదు.
కరోనా వైరస్‌తో సహజీహనం చేయాలంటూ పాలకులు తమ బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకొనేందుకు పూనుకున్నారు.దరిద్రం, నిరుద్యోగం, ఆకలి, అవినీతి, అక్రమాలు, రోగాలు, రొష్టులు, అంటరానితనం, కులతత్వం, మతోన్మాదం, సామాజిక వివక్ష, అణచివేత ఇలా చెప్పుకొంటే శతకోటి అవాంఛనీయాలతో సహజీవనం చేయటానికి, దేనికీ స్పందించలేని స్ధితికి అలవాటు పడ్దాం.
కరోనా వైరస్ మీద కేంద్రీకరించిన మీడియాకు ఇప్పుడు భారతాచైనా సరిహద్దు వివాదం ఒక రేటింగ్ సాధనంగా మారింది. యుద్దం వస్తే బాగుండు అన్నట్లుగా కొందరి వ్యవహారం ఉంది. ఎంత రంజుగా రాస్తే అంత గొప్ప, ఎంత చైనా వ్యతిరేకతను రెచ్చగొడితే అంత కసి ఉన్నట్లు, ఎంతగా జాతీయ(దురహంకారం)వాదాన్ని ప్రదర్శిస్తే అంత గొప్ప దేశభక్తులని భావిస్తున్న ఈ రోజుల్లో భిన్న అభిప్రాయం సంగతి దేవుడెరుగు, భిన్న సమాచారాన్ని పాఠకులు, వీక్షకుల ముందుంచటం కూడా దేశద్రోహంగా ముద్రవేస్తున్న ఒక ప్రమాదకర స్ధితిలో ఉన్నాం.
రెండు దేశాల మధ్య ఏదైనా వివాదం తలెత్తితే ముందు బలయ్యేది నిజం. ఇప్పుడు అదే జరుగుతోందా ? చైనా-భారత్ సరిహద్దు వివాదం బ్రిటీష్ పాలకుల పుణ్యం. కాగితాల మీద గీసిన సరిహద్దుల ప్రకారం ప్రాంతాలు లేవు. ఆయా దేశాల ఆధీనంలో ఉన్న ప్రాంతాల ప్రకారం సరిహద్దు గీతలు లేవు. తమ ఆధీనంలో లేని ప్రాంతాల మీద హక్కులు తమవే అని రెండు దేశాలూ చెప్పటమే వివాదాలకు కారణం. పరస్పరం సంప్రదింపులు, ఇచ్చిపుచ్చుకోవటం తప్ప మిలిటరీ చర్యల ద్వారా పరిష్కారాలు సాధ్యం కావన్నది ప్రపంచ అనుభవం. రష్యాతో, ఇతర పూర్వం సోవియట్ రిపబ్లిక్‌లుగా ఉండి తరువాత స్వతంత్రులుగ మారిన మధ్య ఆసియా దేశాలతో చైనా ఈ పద్దతిలోనే సరిహద్దు వివాదాలను పరిష్కరించుకుంది. మన దేశం కూడా ఇలాగే పరిష్కరించుకోవాలన్న అభిప్రాయం వెలిబుచ్చినందుకు కొందరు కమ్యూనిస్టులను 1962లో నాటి పాలకులు జైల్లో పెట్టారు. చైనాతో యుద్దానికి మద్దతు ఇచ్చిన మరి కొందరు కమ్యూనిస్టులను బయట తిరగనిచ్చారు.
ఏదైనా ఒక సంఘటన జరిగితే తప్ప అనుభవం రాదని పెద్దలు చెబుతారు.1962 యుద్దం తరువాత పదమూడు సంవత్సరాలకు 1975లో భారత్-చైనా ఒక అవగాహనకు వచ్చాయి. దాని ప్రకారం సరిహద్దుల్లో ఏదైనా వివాదం తలెత్తితే ఏ వైపు నుంచి తుపాకులు పేలకూడదు, తూటాలు బయటకు రాకూడదు. దానికి రెండు దేశాలూ ఇప్పటి వరకు కట్టుబడి ఉన్నాయి.అయితే మధ్యలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తలేదా ? రెండు దేశాల మధ్య ఉందని చెబుతున్న వాస్తవాధీన రేఖ ఒక ఊహ, తాత్కాలిక సర్దుబాటు మాత్రమే. దాన్ని అధికారికంగా ఎవరూ గుర్తించటం లేదు. ఎవరి ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని వారు సంరక్షించుకోవటం, దానిలో భాగంగా కాపలా ఏర్పాట్లు తప్ప నిర్దారణ లేదు. దాన్ని లేదా ఇతర మార్పులు చేర్పులతో గుర్తిస్తే అదే అధికారిక సరిహద్దు అవుతుంది.
సరిహద్దు ఉల్లంఘనలు జరిగాయి అని భావించిన ప్రతిసారీ గతంలో అటూ ఇటూ మోహరించిన సైనికులు చేతులతో తోసుకున్నారు, కాస్త ముదిరితే ముష్ఠిఘాతాలకు తలపడ్డారు, రాళ్లు విసురుకున్నారు. ఈ లోగా రెండు వైపులకూ సమాచారం చేరటం, జోక్యంతో సర్దుమణగటం మామూలైంది.2017 డోక్లాం వివాదంలో 72రోజుల పాటు రెండు వైపులా సైనికులు మోహరించటం తప్ప ఒక్క తూటా, ఫిరంగి పేలలేదు. తాజాగా జరుగుతున్న ఉదంతాలలో ఇనుపరాడ్లు ఉపయోగించినట్లు వార్తలు వచ్చాయి. అసలెందుకు ఇది జరిగింది, జరుగుతోంది ?
సరిహద్దులలో రెండు వైపులా మౌలిక వసతులు క్రమంగా మెరుగుపడుతున్న కారణంగా పహారా పెరుగుతోంది. ఆ ప్రాంతాలకు సరిహద్దు భద్రతా దళాలు చేరేందుకు పెద్దగా వ్యవధి అవసరం లేకపోతోంది. పర్యవసానంగా ఉల్లంఘనలు జరిగాయని భావించినపుడు వివాదాలు చెలరేగేవి.సర్దుబాటు చేసుకొనే వారు. అనేక ఉదంతాలు మీడియా వరకు వచ్చేవి కాదు. వచ్చిన వాటికి వాస్తవం గోరంత అయితే కొండంత కల్పనలతో చెలరేగిపోయేవి.
భారత్-చైనా మధ్య లడఖ్ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఆక్సారు చిన్ ఒక వివాదాస్పద ప్రాంతం. అక్కడ యుద్దం కూడా జరిగింది.అది తొలి నుంచీ తమ ఆధీనంలో ఉంది అని చైనా చెబుతోంది. కాదు మనదే అని మన దేశం అంటోంది. మన ఏలుబడిలోని అరుణాచల్ ప్రదేశ్ తమ టిబెట్‌లోని దక్షిణ ప్రాంతం కనుక తమదే అని చైనా చెబుతోంది. ఎన్నడూ టిబెట్‌లో భాగంగా లేదు, మాతోనే ఉంది అని మనం చెబుతున్నాం. ఈ వివాదాన్ని ఎవరు తేల్చాలి ? మూడో పక్షానికి అవకాశం ఇచ్చామా ? అవి అక్కడ తిష్టవేస్తాయి. రెండు దేశాల జుట్లూ చిక్కించుకుంటాయి. మరి ఎలా తేలాలి. సంప్రదింపులు, సంప్రదింపులు, సంప్రదింపులు. రెండు వైపులా చిత్తశుద్ధి ఉంటే పరిష్కారం అసాధ్యం కాదు.
తాజా వివాదానికి కారణం ఏమిటి ? సరిహద్దు సమస్య పరిష్కారం కానప్పటికీ ఏ దేశానికి ఆదేశం తన ఆధీనంలో ఉన్న ప్రాంతంలో రోడ్లు వేసుకోవటం, మిలిటరీ ఏర్పాట్లు చేసుకోవటానికి ప్రయత్నించినపుడు అదిగో మా ప్రాంతంలో మీరు ఆక్రమణకు పాల్పడ్డారు అని ఉభయులూ వివాదపడతారు. లడక్ ప్రాంతంలోని గలవాన్ లోయ. సముద్ర మట్టానికి పదిహేనువేల అడుగున ఎత్తు ఉంటుంది. అక్కడ రెండు దేశాల మధ్య వాస్తవాధీన రేఖ కాశ్మీర్ నుంచి మయన్మార్ వరకు ఉంది. దాన్ని ఇద్దరూ అంగీకరించరు. ఎవరి ఆధీనంలో ఉన్న ప్రాంతంలో వారు తమ తమ బలగాలను పటిష్టపరచుకొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గలవాన్‌లోయ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ సమీపంలో ముందుగా భారత్ రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించిందని వార్తలు. ఇది వివాదాస్పద ప్రాంతంలో జరుగుతోందంటూ అడ్డుకొనేందుకు చైనా ప్రయత్నించింది. చైనా మిలిటరీ కదలికల తరువాతనే మన ప్రాంతంలో మిలిటరీ వ్యవస్దల నిర్మాణానికి చైనా పూనుకుందంటూ మన దేశం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో రెండు వైపులా సైనికులు గుడారాలు వేసుకొని అడ్డుకొనేందుకు కాచుక్కూర్చున్నారు. చైనా వైపున 80 నుంచి వంద గుడారాలు, భారత్ అరవై గుడారాలు వేసినట్లు వార్తలు. అటు అన్నివేల మంది సైనికులు ఉన్నారు, ఇటు ఇన్నివేల మంది సిపాయిలున్నారనే వార్తలు అటూ ఇటూ మీడియా విభాగాలు ఒక పధకం ప్రకారం ఇచ్చే లీకులు, ఇష్టాగోష్టి వార్తలు తప్ప ఎవరూ తలలు లెక్కపెట్టింది లేదు. ఇంతకు మించి అటూ ఇటూ ఎలాంటి ఒప్పంద ఉల్లంఘనలు జరిగినట్లు విమర్శలు లేవు.
లడఖ్‌లో దౌలత్ బేగ్ ఓల్డీ విమానస్దావరాన్ని గతేడాది అక్టోబరులో మన దేశం ప్రారంభించింది.దానికి దారితీసే 66 రోడ్లను 2022 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో మన దేశం నిర్మిస్తోంది. వాటిలో కొన్ని చైనా ఆధీనంలోని గలవాన్‌లోయకు దగ్గరగా ఉన్నాయి. ఒక ప్రధాన రోడ్డు వాస్తవాధీన రేఖకు సమాంతరంగా అనేక పాయింట్లను కలుపుతూ నిర్మితమౌతోంది. దీన్ని చైనా అభ్యంతర పెడుతోంది.ఈ ప్రాంతంలోని కొన్ని ఏరియాలు తమవని చైనా చెబుతోంది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. 2017లో డోక్లాం ప్రాంతంలో చైనా రోడ్లు నిర్మించటాన్ని మన దేశం అభ్యంతరం పెట్టింది. అది వాస్తవానికి భూటాన్ -చైనా మధ్య ఉన్న వివాదాస్పద ప్రాంతం. అయితే భూటాన్‌తో మనకు ప్రత్యేక సంబంధాలు ఉన్నాయని, భూటాన్ కోరిక మేరకు డోక్లాంలో చైనాను అడ్డుకున్నట్లు మన ప్రభుత్వం చెప్పింది. అయితే అసలు వాస్తవం ఏమిటంటే డోక్లాం మన సిలిగురి ప్రాంతానికి అతి సమీపంలో ఉన్నందున మన భద్రతా ప్రయోజనాలకు ముప్పు అన్నది మన వ్యూహకర్తల ఆందోళన. గత ఏడాది మన దేశం లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. మన మ్యాపులో తమ ఆధీనంలో ఉన్న ఆక్సారు చిన్ ప్రాంతాన్ని కూడా లడఖ్ ప్రాంతంగా చూపటాన్ని అప్పుడే చైనా అభ్యంతర పెట్టింది. మ్యాపులో చూపినా వాస్తవాధీన రేఖ యథాతధ స్దితి కొనసాగుతుందని మన దేశం ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్‌లో నిర్మించిన రోడ్లపై కూడా చైనా అభ్యంతరాలు తెలిపింది.
గత నాలుగు వారాలలో నాలుగు చోట్ల రెండు దేశాల కాపలా బృందాలు తారసపడ్డాయి. వాటిలో మూడు లడఖ్‌లో, నాలుగోది సిక్కిం దగ్గర టిబెట్‌ను కలిపే నుకాలా కనుమవద్ద అని వార్తలు వచ్చాయి.1993లో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఎవరైనా వాస్తవాధీన రేఖను అతిక్రమించినపుడు మీరు అతిక్రమించారు, వెనక్కు పోండి అని చెప్పటం, అదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పెద్ద ఎత్తున చైనా సైనికులు చొచ్చుకు వచ్చారని మన మీడియాలో వార్తలు వస్తున్నాయి. చైనా కూడా అదే చెబుతోంది, తమ గలవాన్‌లోయలో భారత్ రోడ్డు నిర్మిస్తోందని అంటున్నది. భారత దళాల సాధారణ పహారాకు ఆటంకం కలిగించే విధంగా చైనా వ్యవహరిస్తోందని భారత విదేశాంగశాఖ విమర్శించింది.
మన దేశం-నేపాల్ మధ్య ఉత్తరాఖండ్‌లో 62చదరపు కిలోమీటర్ల కాలపానీ ప్రాంతం మన ఆధీనంలో ఉంది. అయితే అది తమ ప్రాంతమని నేపాల్ 1998 నుంచి వివాదాన్ని రేపింది. అది పరిష్కారం కాలేదు. మేనెల ప్రారంభంలో రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్ రిమోట్‌తో ఆ ప్రాంతంలో ఒకరోడ్డు ప్రారంభోత్సవం చేశారు. ఆ చర్యను నేపాల్ నిరసించింది. వేరే వారి ప్రమేయంతో నేపాల్ ఆ చర్యకు పాల్పడిందంటూ చైనాను ఉద్దేశించి పరోక్షంగా మన సైనికాధికారి ఎంఎం నవరానే వ్యాఖ్యానించారు.1816లో నేపాల్, నాటి బ్రిటీష్ ఇండియా మధ్య కుదిరిన ఒప్పందంలో మహాకాళీ నది నుంచి నేపాల్ పడమటి సరిహద్దు ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. అయితే ఆ నది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందన్నదానిపై రెండు దేశాల మధ్య స్పష్టత లేకపోవటం వివాదానికి కారణం.
తాజా పరిణామాలపై రెండు దేశాల సామాజిక, సాంప్రదాయ మాధమాల్లో అనేక అభిప్రాయాలు వెలువడుతున్నాయి. వాటిని ఇక్కడ పేర్కొంటున్నామంటే ఏకీభవించినట్లు కాదు. మన దేశంలో ట్విటర్లలో వెలువడుతున్న అభిప్రాయాల ఒక మచ్చుతునక ఇలా ఉంది.” సింధు జలాలపై మోడీ పాకిస్ధాన్‌ను బెదిరించినపుడు చైనా బ్రహ్మపుత్ర నీటితో చేస్తుంది.లిపులేఖ్ దగ్గర సరిహద్దును మార్చాలని మోడీ నేపాల్ మీద వత్తిడి తెచ్చినపుడు చైనా లడఖ్‌లోని వాస్తవాధీన రేఖను దాటుతుంది. మోడీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచటమే చైనా పధకం” దీనిలో వాస్తవాలు ఎలా ఉన్నాయన్నది పక్కన పెడితే ప్రతి దేశం తన రాజకీయాలను తాను చేస్తుందన్నది కనిపిస్తోంది.
చైనా మీడియాలో వచ్చిన వార్తలు, విశ్లేషణల సారాంశం ఇలా ఉంది.” తాజా సరిహద్దు వివాదం ఏదో యాదృచ్చికంగా జరిగింది కాదు. భారత్ ఒక పధకం ప్రకారమే వ్యవహరించింది. గాలవాన్ లోయ ప్రాంతం చైనా ఆధీనంలోనే ఉందని భారత్‌కు స్పష్టంగా తెలుసు. మే తొలి వారంలో చైనా ప్రాంతంలోకి భారత్ ప్రవేశించింది, సైన్యం కావాలని రెచ్చగొట్టింది. చైనా పహరా బృందాలకు ఆటంకాలు కల్పించింది. ఆ లోయలో చైనా మిలిటరీది పైచేయి అని తెలుసు కనుక భారత సైన్యం తెగేదాకా లాగుతుందని అనుకోవటం లేదు. ఒక వేళ పరిస్ధితిని దిగజార్చితే భారత మిలిటరీ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కరోనా వైరస్ నివారణ చర్యల్లో వైఫల్యం వలన భారతీయ సమాజం నుంచి వచ్చిన వత్తిడి పెరిగింది. ఇంతకు ముందే బలహీన పడిన భారత ఆర్ధిక పరిస్ధితి కరోనా కారణంగా మరింతగా దిగజారి మాంద్యలోకి పోనుందని గోల్డ్‌మన్‌శాచస్ పేర్కొన్నది. ఇప్పటికీ నరేంద్రమోడీ పలుకుబడి ఉన్నత స్ధాయిలోనే ఉన్నప్పటికీ దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక సవాళ్లను అధిగమించటానికి అది పని చేయదు.కనుక స్ధానిక సమస్యల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు జాతీయవాదాన్ని ముందుకు తెచ్చి మరోసారి చైనాతో సరిహద్దు సమస్యను పెంచి పెద్దది చేసేందుకు నిర్ణయించింది. ఆర్ధిక, వైద్య సహాయం కోసం చైనాతో బేరమాడేందుకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. సరిహద్దు వివాదాలను రోజువారీ సాధారణ వ్యవహారంగా మార్చేందుకు భారత్ పూనుకుంది.ఎందుకంటే సరిహద్దులకు తరచుగా సైన్యాన్ని పంపేందుకు దానికి భౌతిక సానుకూలతలు ఎక్కువగా ఉన్నాయి.కనుక ఇదొక దీర్ఘకాలిక సమస్యగా మారే అవకాశం ఉంది. చైనా కంటే భారత్‌కు అంతర్జాతీయ వాతావరణం అనుకూలంగా ఉందని భారత్‌లోని కొందరు పండితులు నమ్ముతున్నారు.చైనా-అమెరికా మధ్య విబేధాలు తీవ్రతరమైతే అమెరికాకు దగ్గరయ్యేందుకు భారత్‌కు అవకాశాలు పెరుగుతాయని వారు భావిస్తున్నారు.
రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఒకటైతే అంతర్జాతీయ రాజకీయాల కారణంగా తీసుకుంటున్న వైఖరులు కూడా వివాదాన్ని ముదిరేట్లు చేస్తున్నాయి. టిబెట్, తైవాన్ రెండు ప్రాంతాలూ చైనాలో అంతర్భాగమే అన్నది మన ప్రభుత్వ అధికారిక వైఖరి. అయితే అమెరికా, బ్రిటన్ వంటి దేశాల మద్దతుతో టిబెట్‌లో తిరుగుబాటు చేసిన దలైలామాను అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం అణచివేసింది. దాంతో దలైలామా పారిపోయి మన దేశం వచ్చాడు. ప్రాణభయంతో ఆశ్రయం కోరిన వారికి రక్షణ కల్పించటాన్ని కొంత మేరకు అర్ధం చేసుకోవచ్చు. కానీ జరిగిందేమిటి ? దలైలామా మన దేశంలోని హిమచల్ ప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన ప్రవాస ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించనప్పటికీ ఆ పేరుతో సాగించే చైనా వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించింది. చైనా వ్యతిరేకులకు ఆశ్రయం కల్పించింది. అనేక చోట్ల నివాసాలను ఏర్పాటు చేసింది. అరుణాచల్ ప్రదేశ్ తమ టిబెట్‌లో భాగం అని చైనా చెబుతున్నది. అక్కడి తవాంగ్ పట్టణాన్ని దలైలామా సందర్శించేందుకు 2009లో యుపిఏ పాలనా కాలంలోనూ, 2017లో మోడీ ఏలుబడిలో మరోసారి సందర్శించేందుకు అనుమతించటాన్ని చైనా వ్యతిరేకించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాలకు తమ పేర్లు పెట్టింది. అరుణాచల్ ప్రదేశ్, తైవాన్‌లను తమ ప్రాంతాలుగా చూపకుండా ముద్రించిన ప్రపంచ మ్యాప్‌లను 2019లో చైనా కస్టమ్స్ అధికారులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
భారత-చైనాల మధ్య ఉన్న మరో వివాదాస్పద అంశం దక్షిణ చైనా సముద్రంలో జోక్యం. ఈ సముద్ర ప్రాంతం మన దేశానికి ఎంతో దూరంగా ఉంది, దానితో మనకు ఎలాంటి సంబంధం లేదు. మనకంటే ఇంకా ఎంతో దూరంలో ఉన్న అమెరికా ఈ ప్రాంత వ్యవహారాల్లో జోక్యం చేసుకొని రెచ్చగొడుతోంది.దానికి మన దేశం వంతపాడుతున్నట్లు చైనా భావిస్తోంది. ఆ సముద్రంలో ఉన్న కొన్ని దీవులపై హక్కు తమదే అని చైనా చెబుతోంది. మరో సోషలిస్టు దేశమైన వియత్నాంతో సహా ఫిలిఫ్పీన్స్, బ్రూనే,మలేషియా, ఇండోనేషియాలు చైనా హక్కు వాదనతో విబేధిస్తున్నాయి. ఆ దీవులలో చమురు, ఇతర సంపదలు ప్రధానమైన అంశం. ఈ వివాదాన్ని అంతర్జాతీయం చేయవద్దని చెబుతూనే దక్షిణ చైనా సముద్రంలో తాము స్వేచ్చగా ప్రయాణించే హక్కు కలిగి ఉండాలని మన దేశం కోరుతోంది. ఈ జలాలపై చైనా హక్కును గుర్తిస్తే ఆ మార్గం గుండా ప్రయాణించే నౌకలు వినియోగ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మనకూ ాచైనా మధ్య ఏవైనా తీవ్ర విబేధాలు తలెత్తితే మనకు ఇబ్బందులు వస్తాయి. మన దేశ వాణిజ్యంలో 55శాతం ఈ ప్రాంతంలోని మలక్కా జలసంధి ద్వారా జరుగుతోంది. ఈ ప్రాంతంలో బలహీనపడుతున్న అమెరికా తన ప్రతినిధిగా భారత్ ఉండాలని కోరుకుంటోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్ధ అధ్యక్ష స్ధానానికి తాజాగా మన దేశం ఎన్నికైంది. ఈ సంస్ధలో స్వతంత్ర రాజ్యాలు మాత్రమే సభ్యత్వానికి అర్హత కలిగి ఉంటాయి. అయితే తైవాన్‌కు సభ్యత్వం ఇవ్వాలని, అధికారయుతంగా సమావేశాలకు ఆహ్వానించాలని అమెరికా పట్టుపడుతోంది. అందుకు చైనా ససేమిరా అంటోంది. మన దేశం తైవాన్ ప్రాంతం చైనాకు చెందిందే అని అధికారిక వైఖరిని కలిగి ఉన్నప్పటికీ బిజెపి దానికి కట్టుబడి ఉండటం లేదు. అమెరికా క్రీడలో పావుగా వ్యవహరిస్తోంది. చైనాకు చెందిన ఒక తిరుగుబాటు రాష్ట్రం తైవాన్. అక్కడ జరిగిన ఎన్నికలలో అధికారానికి వచ్చిన పార్టీ చైనాలో విలీనాన్ని వ్యతిరేకిస్తోంది. ఇటీవల అధ్యక్షురాలు శారు ఇంగ్ వెన్ అధికారస్వీకారోత్సవానికి బిజెపికి చెందిన మీనాక్షీ లేఖి మరొక ఎంపీని ఆహ్వానించారు. ఆ మేరకు వారు ఆన్‌లైన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది తమను రెచ్చగొట్టే చర్యగా చైనా పరిగణిస్తోంది.
ఈ నేపధ్యంలో తాజా పరిణామాలను ఏ విధంగా చూడాలి అన్నది సమస్య. అంతర్జాతీయ రాజకీయాలు, ఎత్తుగడలలో ఒక దగ్గర స్విచ్ వేస్తే మరొక దగ్గర లైట్ వెలగటం తెలిసిందే. ఏ దేశంతో అయినా ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో సత్సంబంధాలను కలిగి ఉండటం, ప్రత్యేకించి ఇరుగుపొరుగుదేశాలతో సఖ్యతగా ఉండటం ఎంతో అవసరం. దాని వలన బోలెడు మిలిటరీ ఖర్చు తగ్గిపోయి, అభివృద్ధికి వెచ్చించవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైన జర్మనీ, జపాన్‌లు ఆ యుద్దం ముగిసిన తరువాత రెగ్యులర్ మిలిటరీ కలిగి ఉండటానికి వీల్లేదని విజేతలు శాశించారు. అప్పటి నుంచి ఆత్మరక్షణ దళాల పేరుతో పరిమితి సాయుధ బలగాలే ఉన్నాయి. మిలిటరీకి చేసే ఖర్చును ఆ రెండు దేశాలు పరిశోధన, అభివృద్ధికి ఉపయోగించి పెద్ద ఎత్తున పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో అభివృద్ది చెందాయి. అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్ధలే ఉన్నందున దానిలోని అంతర్గత వైరుధ్యాల కారణంగా అవి కూడా సమస్యలను ఎదుర్కొంటున్నా మిగతా దేశాల కంటే మెరుగ్గానే ఉన్నాయి.
ఏ రీత్యా చూసినా ఇప్పుడు ఏ దేశమూ యుద్దం చేయగల స్ధితిలో లేదు. అటు గ్జీ జింపింగ్, ఇటు నరేంద్రమోడీ వెనుక 140 కోట్ల మంది చొప్పున జనం ఉన్నారన్నది మర్చిపోకూడదు. ప్రస్తుత పరిస్ధితుల్లో రెండు దేశాల సరిహద్దు భద్రతా బలగాల మధ్య తలెత్తిన వివాదం గతంలో ముందుకు వచ్చిన వాటికంటే భిన్నమైనది, తీవ్రమైనది అని చెబుతున్నవారితో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. ఇది ఇంతకు మించి మిలిటరీ చర్యలకు దారి తీసే అవకాశాలు పరిమితం. రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం పేరుతో దూరేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఎట్టి పరిస్ధితుల్లోనూ నెరవేరదు. అది తన అనుయాయులను సంతృప్తిపరచినా ఒక ప్రధానిగా నరేంద్రమోడీ అంగీకరించే అవకాశం లేదు. 1. రెండు దేశాలూ కరోనా వైరస్ మీద పోరాడుతున్నాయి. చైనాలో కరోనాను కట్టడి చేసినా ఇంకా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. మన దేశంలో కట్టడి చేశామని చెబుతున్నప్పటికీ అది కొన్ని ప్రాంతాలకే పరిమితం. గతంలో కంటే కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. విదేశాల నుంచి, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారి నుంచి కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. మనకు ఇంకా ముప్పు తొలగలేదు. 2.కరోనా కారణంగా చైనాలో ఒక్క హుబెరు రాష్ట్రమే లాక్‌డౌన్‌లో ఉంది. మన దేశం మొత్తం ఉంది. అక్కడ ఆర్ధిక కార్యకలాపాలూ పూర్తిగా కొద్ది వారాల క్రితమే ప్రారంభం అయ్యాయి. మన దగ్గర ఇంకా అనిశ్చితంగానే ఉంది. 3.కరోనాకు ముందే మన దేశం తీవ్ర ఆర్ధిక సమస్యల్లో కూరుకుపోయింది. చైనాలో అలాంటి పరిస్ధితి లేకపోయినా వృద్ది రేటు తగ్గింది. కరోనా అనంతరం దాని వృద్ధి రేటు రెండున్నరశాతం వరకు ఉండవచ్చని అంచనాలు వెలువడుతుండగా మనది మైనస్ ఆరుశాతం వరకు ఉండవచ్చు అంటున్నారు. స్వల్ప యుద్దం జరిగినా రెండు దేశాలూ నష్టపోతాయి, ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లు, ఎంతో మిగులులో ఉన్న చైనాతో పోలిస్తే వాణిజ్య లోటుతో ఉన్న మన నష్టం ఎంతో ఎక్కువగా ఉంటుంది.
భారత్-చైనాలు రెండూ అణ్వస్త్రదేశాలే కనుక యుద్దమంటూ వస్తే పరస్పరం నాశనం తప్ప విజేతలంటూ ఉండరు. రెండూ వర్ధమాన దేశాలే కనుక యుద్దం కంటే జనజీవితాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వాలి.భారత-పాకిస్ధాన్ మధ్య యుద్దం వస్తే ఆయుధాలు అమ్ముకొని లాభపడేది అమెరికా.భారత-చైనాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తినా జరిగేది అదే. కనుక సంప్రదింపుల ద్వారా తాజాగా తలెత్తిన ఉద్రిక్తతలను ఉపశమింప చేసేందుకు ప్రయత్నించాలి. జాతీయవాదం, దురహంకారాన్ని రెచ్చగొట్టటం సులభం, దాన్నుంచి వెనక్కు రావటం ఎంతో కష్టం. అది సామాన్యుల్లో తలెత్తితే సమసిపోతుంది, కానీ పాలకులకే ఆ వైరస్ అంటుకుంటే ఏం జరుగుతుందో గతంలో చూశాము. చరిత్ర పునరావృతం కారాదని కోరుకుందాం.
భారత్ – చైనా మధ్యలో దూరే అవకాశం లేదు ట్రంప్ గారూ !
29 Friday May 2020
Posted CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA
in