Tags

, ,


ఎం కోటేశ్వరరావు
రాష్ట్ర ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను తొలగించటం చెల్లదని, దానికి దోహదం చేసిన ఆర్డినెన్స్‌, ప్రభుత్వ ఉత్తరువులను కొట్టి వేస్తూ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం నాడు తీర్పు ఇచ్చింది. శనివారం నాడు ఏడాది పాలన ఉత్సవాలు జరుపుకొనేందుకు ఏర్పాట్లు చేసుకున్న జగన్‌ మోహనరెడ్డి, అనుయాయులకు ఇది ఊహించని ఎదురు దెబ్బ. అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్న సామెత తెలిసిందే. గత ఏడాది కాలంలో జరిగిన అనేక పరిణామాలను చూస్తే జగన్‌ పరివారం అదే పని చేస్తున్నట్లు కనిపిస్తోంది.
అధికారానికి వచ్చిన తొలిరోజుల్లో అనుభవం లేక లేదా ప్రతిపక్ష నేతగా తాను అనుభవించిన అవమానాల అక్కసును భరించలేక ప్రత్యర్ధి పార్టీ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనుకొని ఏ పార్టీకి చెందని వారు సరిపెట్టుకున్నారు. ఏడాది కాలంలో అలాంటి వారందరినీ వైసిపి దూరం చేసుకుంది. జగన్‌ నాయకత్వం చేస్తున్న పనులు తెలియక కాదు తెలిసే చేస్తున్నారని, పర్యవసానాలను అనుభవించకతప్పదనే అభిప్రాయం పెరుగుతోంది. జగన్‌ తన మంత్రులకు సమాంతరంగా సలహాదారులను ఏర్పాటు చేసుకున్నారు. వారంతా భజనపరులుగా, మనసెరిగి మసలుకొనే అవకాశవాదుల్లా కనిపిస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ కొంప ముంచటంలో సలహాదారులు తక్కువేమీ తినలేదు. ఇప్పుడూ అదే పునరావృతం అవుతోందా అన్నది వైసిపి శ్రేణులు పరిశీలించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.
తిరుమల వెంకన్న భూములు కొన్ని నిరర్ధక ఆస్తులుగా ఉన్నాయని, వాటిని అమ్మేందుకు నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. ఆ చర్యను సమర్ధించుకుంటూ ఆ నిర్ణయం గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన దేవస్ధానం బోర్డే నిర్ణయం తీసుకుందని దాన్నే తాము అమలు జరుపుతున్నామని సమర్ధించుకున్న నేతల తీరు తెన్నులు యావత్‌ రాష్ట్రం చూసింది. తరువాత వచ్చిన వత్తిడి మేరకు తాము గత నిర్ణయాలను సమీక్షించామే తప్ప విక్రయ నిర్ణయం తీసుకోలేదని, ఒక వేళ అలాంటిది చేయాల్సివస్తే సంప్రదించే చేస్తామని అదే నోళ్లు ఎలాంటి వెరపు లేకుండా ప్రకటించటాన్ని చూసి విస్తుపోతున్నది. అంతే కాదు గతంలో వచ్చిన కానుకలు, భూముల విక్రయాలు తదితర అంశాలన్నింటితో ఒక శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. ఎవరు వద్దన్నారు ? ఎవరి బండారం ఏమిటో బయటపడుతుంది. జనం కోరుకున్నదీ అదే. అంతేకాదు, రాబోయే రోజుల్లో ఒక్క అంగుళం కూడా భూములు విక్రయించం అని కూడా ప్రకటించారు. ఇదేదో తొలిరోజే చెప్పి ఉంటే పోయేది. ప్రతిపక్షాలను అల్లరి పాలు చేయాలని యత్నించి తమ గోతిలో తామే పడినట్లుగా ఉంది వైసిపి వ్యవహారం. ఇలాంటి చర్యలతో గ్రామాలు, పట్టణాల్లో దిగువ స్ధాయిలో రొమ్ములు విరుచుకొని గుడ్డిగా సమర్ధించిన సామాన్య కార్యకర్తల పరువు ఏమౌతుందో, దాని ప్రభావం ఏమిటో ఆలోచించే వారున్నారా ?
ప్రభుత్వం చేసిన నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టులో, సుప్రీం కోర్టులో తీర్పులు వస్తున్న తరువాత అయినా కొత్తగా వేసే కేసులు నిలుస్తాయా లేదా ఓడిపోతే పరువు సంగతి ఏమిటని ఎవరూ ఆలోచిస్తున్నట్లు లేదు, తమ నేతలను ప్రశ్నిస్తున్నట్లూ కనపడదు. కోర్టుల్లో కేసులు ఓడిపోయినా జనంలో తమ పలుకుబడి తగ్గటం లేదని వైసిపి నాయకత్వం భావిస్తున్నదా ? దానికి ఆస్కారం లేకపోలేదు. ఆంగ్ల మాధ్యమంపై కోర్టులో ఓడిపోయిన తరువాత ఆ నిర్ణయాన్ని సమర్ధిస్తున్న వారందరూ కోర్టు తీర్పును తప్పుపట్టారు. అది సహజం. ఎందుకంటే ఆంగ్ల మాధ్యమంలో విద్య తమ బిడ్డలను అందలాలెక్కిస్తుందని ఆశలు పెంచుకున్నవారికి సహజంగానే కోర్టు తీర్పు రుచించదు, కనుక కేసు పోయినా మా మద్దతు మీకే అని అలాంటి వారందరూ మద్దతు ప్రకటించి ఉండవచ్చు. అయితే అది శాశ్వతంగా ఉంటుందనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఆంగ్ల మాధ్యమాన్ని గతంలో చెప్పినట్లు అమలు జరపకపోతే చేతగాని వారు ఎందుకు చెప్పినట్లు అనే అసంతృప్తి మెల్లగా ప్రారంభం అవుతుంది.
పోలీసు ఉన్నతాధికారి ఎబి వెంకటేశ్వరరావు కేసులో ప్రభుత్వం ఓడిపోయినా అదేమీ ప్రజాసమస్య కాదుకనుక తమకు వచ్చే నష్టమేమీ లేదని వైసిపి శ్రేణులు సమర్ధించుకోవచ్చు. సామాన్య జనానికి సంబంధించిన సమస్య కాదు గనుక దానితో పలుకుబడి మీద ప్రభావం చూపదు. కానీ తిరుమల వెంకన్న భూములపై తమ మాటలను తామే మింగిన తీరు, ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తొలగింపుపై తలెత్తిన తీవ్ర రగడ, రాజకీయ నేపధ్యం చూస్తే అది మిగతా కేసుల కంటే ఎక్కువగా ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశాలు ఎక్కువ.
ముఖ్యమంత్రిగా అసలైన అధికారం నాదా ఎన్నికల కమిషనర్‌దా అని ప్రశ్నించిన వైఎస్‌ జగన్‌కు అసలైన అధికారం ఎవరిదో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నపుడు ఎన్నికల కమిషనరే సుప్రీం అని చెప్పింది. సర్వాధికారి ఎవరు అన్న ప్రశ్నను స్వయంగా లేవనెత్తిన జగన్‌మోహన్‌రెడ్డికి ఆ విషయం అర్ధమైందని అనుకోవాలి. ఈ విషయంలో తనను తానే కించపరచుకున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఒక ముఖ్య మంత్రి తన అధికారాలేమిటో, ఎన్నికల కమిషనర్‌ అధికారం ఏమిటో తెలియదని స్వయంగా వెల్లడించుకున్నారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రీ ఇలా వ్యవహరించలేదు. అంతటితో ఆగకుండా సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు. బహుశా ఏ ముఖ్య మంత్రికీ లేనంత మంది సలహాదారులు ఉన్నప్పటికీ ఇది జరిగిందంటే సలహాదారుల సరకేమిటో బయటపడింది. ఎవరి మాటా వినరు అనే గత విమర్శలను జగన్మోహనరెడ్డి నిర్ధారించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కేంద్ర హౌంశాఖకు రాసిన లేఖను ఎవరు స ష్టించినా, పంపినా క్రిమినల్‌ కేసులు ఎదుర్కోక తప్పదని వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హెచ్చరించారు. లేఖ వెనుక పెద్ద కుట్ర ఉందని, దీనిపై క్షుణ్ణంగా విచారించాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. దానిలో అనేక అంశాలను ఆరోపించారు. విచారణ తతంగం జరిపారు. లేఖను రమేష్‌ కుమార్‌గారే రాశారన్నది తేలిపోయింది, విజయసాయి రెడ్డిగారన్నట్లు ఆయన మీద క్రిమినల్‌ కేసు పెడతారా ? ఆ లేఖ గురించి నానా యాగీ చేసిన వైసిపి నేతలు అనూహ్యంగా ఎన్నికల కమిషనర్‌ పదవీకాలాన్ని తగ్గిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకురావటం, దాని మేరకు నిమ్మగడ్డ పదవీ కాలం ముగిసిందని ప్రకటించటం, కొత్త కమిషనర్‌ నియామకం జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పదవికి తగిన వారెవరూ లేనట్లు తమిళనాడులో పాస్టర్‌గా ఉన్న రిటైర్డ్‌ జస్టిస్‌ కనకరాజ్‌ను తీసుకురావటం, ఆయన దళిత సామాజిక తరగతికి చెందిన వారని ప్రచారం చేసి దళితుల్లో సానుభూతి పొందేందుకు ప్రయత్నించటం తెలిసిందే.
నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు కులాన్ని అంటగట్టిందీ, కొత్త కమిషనర్‌కూ అదే పని చేసిందీ వైసిపి వారే కావటం గమనించాలి. అదీ, ఇదీ రెండూ చౌకబారు రాజకీయాలే. ఒక దళితుడి నియామకాన్ని తప్పుపడతారా అని మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. ఇది సలహాదారుల బుర్రలో పుట్టిందా లేక జగన్‌మోహనరెడ్డిగారికే తట్టిందో తెలియదు. ఇప్పుడు రమేష్‌ కుమార్‌ తొలగింపు చెల్లదు అని తీర్పు వచ్చిన తరువాత దాని మీద సుప్రీం కోర్టుకు వెళ్లవచ్చని కొందరు, కోర్టు తీర్పును ఆమోదిస్తామని మరి కొందరు అధికార పార్టీ నేతలు చెప్పారు. ఒక వేళ అదే జరిగితే మరో సమస్యను తలకెత్తుకొనేందుకు పూనుకున్నట్లే ?
నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తిరిగి అధికారం చేపట్టిన తరువాత పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించుకోనవసరం లేదు. ఈ తీర్పుతో ప్రభుత్వ పలుకుబడి తగ్గుతుందా, రమేష్‌ కుమార్‌కు సానుభూతి పెరుగుతుందా? పర్యవసానాలు ఎలా ఉంటాయనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. కారకులు వారా వీరా ఎవరు, ఎవరు ప్రారంభించారు, ఎవరు కొనసాగిస్తున్నారు అన్నది ఒక అంశమైతే నేడు ఆంధ్రప్రదేశ్‌లో కులాల కుమ్ములాటలు, సమీకరణలు మరింతగా ఘనీభవించాయన్నది ఒక అభిప్రాయం. ఆ ప్రాతిపదికన ఆలోచించే వారు ఏ పార్టీకి చెందినప్పటికీ లోపల ఎలా ఉన్నా బయటికి మాత్రం తమ పార్టీ ఏది చేసినా సరైనదే అనే అడ్డగోలు సమర్ధనకు పూనుకుంటున్నారు. దాన్ని సమర్ధించేందుకు ప్రత్యర్ధి పక్షం కూడా చేసింది అదేగా అని వారి తప్పులను తమకు రక్షణగా ముందుకు తెస్తున్నారు. ఈ నేపధ్యంలో చూసినపుడు నిమ్మగడ్డకు కొత్తగా వచ్చే సానుభూతి ఏమీ ఉండదు. అదే విధంగా కేవలం ఈ అంశం మీద అధికార పార్టీ పెద్దగా మద్దతు కోల్పోయే అవకాశాలు కూడా తక్కువే అని చెప్పవచ్చు.
అయితే అధికార పార్టీమీద ఎలాంటి ప్రభావం ఉండదా ? తప్పకుండా ఉంటుంది. ఏలుబడిలోకి వచ్చి ఏడాది మాత్రమే గడచింది. పెట్టుబడులు పెట్టిన వారు వాటిని రాబట్టుకోవటం ప్రారంభించిన సమయానికి కరోనా సమస్య వచ్చింది. సంక్షేమ పధకాలలో అధికార పార్టీ వారికి వచ్చే వాటాలేమీ ఉండవు. ఇసుక, మట్టిని పిండటం ప్రారంభమైంది. అవే చాలవు, ప్రభుత్వం చేపట్టే రోడ్లు, నిర్మాణాలు, ప్రాజెక్టుల వంటివి ఉంటే పంటపండుతుంది. ఉన్న సొమ్మంతా నవరత్నాలకే పోతే అలాంటివి ఎన్ని పనులు చేపడతారు, ఎలా అన్నది బడ్జెట్‌ ప్రవేశపెట్టినపుడు తేలిపోనుంది.
కోర్టులలో తగిలిన ఎదురు దెబ్బల కారణంగా వైసిపిలో స్ధానిక కార్యకర్తల మనస్ధైర్యం క్రమంగా సడలటం ప్రారంభం అయింది. ముఖ్యమంత్రే స్వయంగా రచ్చ చేసిన నిమ్మగడ్డ వ్యవహారంలో వచ్చిన తీర్పు ఒక మలుపు, అధికారపక్షానికి ఒక షాక్‌ వంటిదే. రాబోయే రోజుల్లో ఇలాంటివన్నీ ప్రతిపక్షాలకు ప్రచార ఆస్త్రాలుగా, పాలక పార్టీకి ప్రతికూలంగా మారతాయి.