Tags

, , ,


ఎం కోటేశ్వరరావు
ప్రపంచ ఆరోగ్య సంస్ధ : చైనా చేతిలో కీలుబమ్మగా మారింది.
ప్రపంచ వాణిజ్య సంస్ధ: దీన్ని రద్దు చేయాలి, మాకు ఉపయోగపడటం లేదు. చైనా ఆర్ధిక సామ్రాజ్యవాదిగా వ్యవహరిస్తోంది.
ప్రపంచ మానవ హక్కుల కమిషన్‌: తన స్వార్ధం తాను చూసుకొంటోంది, దొంగ ఏడ్పులు ఏడుస్తోంది.
అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు : దీన్ని మేము గుర్తించం, మా మీద విచారణ జరిపే అధికారం దానికి లేదు.
ఏడుదేశాల బృందం(జి7) : దీనికి కాలదోషం పట్టింది. ఈ బృందంలో భారత్‌, రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాలను చేర్చాలి.
ఇలాంటి సాకులు చెబుతూ ఒక్కొక్క ప్రపంచ సంస్ధ నుంచి తాము తప్పుకుంటామని ప్రకటించటం లేదా బెదిరించటం ఇటీవలి కాలంలో అమెరికాకు మామూలైంది.దశాబ్దాల పాటు తామే అయి నడిపిన యాంకీలు ఇప్పుడు ఆ సంస్ధలనే తూలనాడుతున్నారు, బెదిరిస్తున్నారు ఎందుకు ? కరోనా వైరస్‌ను అవకాశంగా తీసుకొని ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి బయటపడేందుకు పూనుకుంది. చైనీయులను బూచిగా చూపుతోంది. ఇలా మరికొన్నింటి నుంచి కూడా తప్పుకొనేందుకు పూనుకుంది వాటన్నింటికీ కారణం ఏమిటి , కారకులు ఎవరు ?
ప్రపంచంలో మానవ హక్కులను కాపాడే ఏకైక దేశంగా ఫోజు పెట్టిన అమెరికా ఆచరణలో వాటిని హరించేదిగా మారింది. స్వేచ్చకు ప్రతి రూపంగా లిబర్టీ విగ్రహాన్ని పెట్టుకున్న వారు ఒక వైపు యాత్రీకుల నుంచి ఆదాయం పిండుకొనే వనరుగా మార్చుకున్నారు. మరోవైపు ప్రపంచంలో అనేక దేశాల పౌరుల స్వేచ్చా, స్వాతంత్య్రాలను హరించిన మిలిటరీ, ఇతర నియంతలను ఆ విగ్రం ముందు నిలబెట్టి అసలైన రక్షకులుగా ప్రపంచానికి చూపారు.
2018లో ప్రపంచ మానవహక్కుల సంస్ధ నుంచి అమెరికా వైదొలగింది. పాలస్తీనియన్ల సమస్య మీద ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఆ సంస్ధ పని చేస్తున్నట్లు ఆరోపించింది. నిజానికి పాలస్తీనియన్ల మాతృదేశాన్ని లేకుండా చేసి వారి ప్రాంతాలను ఆక్రమించి, బందీలుగా మార్చి, నిత్యం దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ యూదు దురహంకారులకు నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్న ఏకైక దేశం అమెరికా. తాను చేసిన ఆరోపణలకు ఆమోద ముద్రవేయకపోవటం, తాను నందంటే నంది, పందంటే పంది అని వంతపాడేందుకు ఆ సంస్ధ నిరాకరించటమే అసలు కారణం. ఆ సంస్ధ నుంచి వైదొలిగిన అమెరికా సాధించిందేమీ లేదు, అమెరికా లేనంత మాత్రాన దాని కార్యకలాపాలు ఆగిపోలేదు. సిరియా, ఇరాక్‌, లిబియా, ఆఫ్ఘనిస్తాన్‌ వంటి చోట్ల అమెరికన్లు దాడులు,తిరుగుబాట్లను ప్రోత్సహించి, రెచ్చ గొట్టి, తామే స్వయంగా దాడులకు పాల్పడి మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన సత్యం దాస్తే దాగేది కాదు. ఆ నేరాలు ఏడాది కేడాది పెరుగుతున్నాయి గనుక తమను ఎక్కడ బోనులో నిలబెడతారో అనే భయంతో ఐక్యరాజ్యసమితి చొరవతో ఏర్పడిన అంతర్జాతీయ నేర కోర్టును గుర్తించేందుకు నిరాకరిస్తున్నారు.
అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టును ఏర్పాటు చేయాలని అనేక సంప్రదింపుల అనంతరం రోమ్‌ సమావేశంలో తీర్మానించారు.1998 జూలై 17న దాన్ని 120దేశాలు ఆమోదించగా, 21 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. వ్యతిరేకించిన ఏడు దేశాలలో అమెరికా, చైనా, లిబియా, ఇరాక్‌, ఇజ్రాయెల్‌, ఎమెన్‌, కతార్‌ ఉన్నాయి. అయితే 2000 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ ఒప్పందం మీద సంతకం చేశాడు. ఇలాంటి ఒప్పందాల మీద దేశాలు సంతకాలు చేస్తేనే చాలదు, వాటిని ఆయా దేశాల పార్లమెంట్‌లు ఆమోదించాలి. క్లింటన్‌ పార్లమెంట్‌కు నివేదించలేదు. రెండు సంవత్సరాల తరువాత ఐక్యరాజ్యసమితికి ఒక లేఖ రాస్తూ రోమ్‌ ఒప్పందానికి తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదంటూ నాటి అధ్యక్షుడు బుష్‌ స్పష్టం చేశారు. ఒకసారి అంగీకరిస్తే ఆయా దేశాల మీద వచ్చే ఆరోపణలు, విమర్శల మీద విచారణ జరపాల్సి ఉంటుంది. అమెరికా గనుక చేరి ఉంటే ఏదో ఒకసాకుతో అనేక దేశాలలో జోక్యం చేసుకుంటున్నదాని దుర్మార్గాలపై ఈ పాటికి ఎన్నో విచారణలు జరిగి ఉండేవి, దాని దుర్మార్గం మరింతగా లోకానికి బట్టబయలు అయి ఉండేది. అందుకే చేరేందుకు నిరాకరిస్తోంది. ఒక వైపు తాము సహకరిస్తామని చెబుతూనే నేరాలకు పాల్పడిన తమ సైనిక, గూఢచార ఇతర పౌరులను రక్షించుకొనేందుకు, కోర్టు కార్యకలాపాలను అడ్డుకొనేందుకు చేయాల్సిందంతా చేస్తోంది. మరికొన్ని అంతర్జాతీయ ఒప్పందాల నుంచి కూడా ఏకపక్షంగా వైదొలగింది. వాటిలో ఇరాన్‌తో కుదిరి అణు ఒప్పందం అన్నది తెలిసిందే. దాన్నుంచి వైదొలగిన తరువాత అమెరికా దాడులు, దానికి ఇరాన్‌ ప్రతిదాడుల సంగతి తెలిసిందే.
ప్రపంచ వాణిజ్య సంస్ధ ఏర్పాటులో అమెరికా ప్రముఖ పాత్ర పోషించింది. ప్రపంచీకరణను అమలు జరిపే సాధనంగా దాన్ని మార్చుకొని తన ప్రయోజనాలు సాధించుకోవాలని చూసింది.కొన్ని సంవత్సరాల తరువాత భారత్‌, చైనాలు ఇంకేమాత్రం అభివృద్ధి చెందుతున్న దేశాలు కాదని, ఆ పేరుతో వాటికి రాయితీలు కల్పించటం అక్రమం అని, తమకు సంస్ధలో ఉన్నందున ప్రయోజనాలేమీ లేవని, తమకు సైతం అదే హౌదా ఇవ్వాలని లేకుంటే తాము సంస్ధ నుంచి విడిపోతామని ట్రంప్‌ బెదిరింపులకు దిగాడు. వర్ధమాన దేశాలు పన్నులను తగ్గించేందుకు ఇచ్చిన వ్యవధి మేరకే భారత్‌, చైనాలు అవకాశాలను వినియోగించుకుంటున్నాయి తప్ప ఎవరి దయాదాక్షిణ్యమో కాదు. నిజానికి నిబంధనలను ఉల్లంఘించి లబ్ది పొందుతోంది అమెరికాయే. అనేక దేశాలపై కేసులు దాఖలు చేసి బెదిరింపులకు దిగింది. మన దేశం పత్తికి మద్దతు ధర ప్రకటించటాన్ని రాయితీ ఇవ్వటంగా చిత్రించి ప్రపంచ వాణిజ్య సంస్దలో మనకు వ్యతిరేకంగా కేసు దాఖలు చేసింది. బోయింగ్‌ విమాన కంపెనీకి పెద్ద ఎత్తున దొడ్డిదారిన రాయితీలు ఇస్తోంది. ఆ విమానాలను కొనాలని ఇతర దేశాలపై తన పలుకుబడిని వినియోగిస్తోంది. బోయింగ్‌కు పోటీగా ఐరోపా ధనిక దేశాలు ఎయిర్‌బస్‌కు మద్దతు ఇస్తున్నాయి. రెండూ పరస్పరం ఆరోపణ చేసుకొని దాఖలు చేసిన కేసు ఇంకా కొలిక్కి రాలేదు. పదహారేండ్ల నుంచి సాగుతున్న ఈ వివాదంలో ఐరోపా యూనియన్‌ను బెదిరించేందుకు అక్కడి నుంచి దిగుమతి చేసుకొనే విమానాలు, విడిభాగాలపై విధిస్తున్న పన్ను 10 నుంచి 15శాతానికి ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా పెంచింది.
ప్రపంచ ఆరోగ్య సంస్ధ విషయానికి వస్తే కరోనా వైరస్‌కు కారణం చైనాయే అని ప్రకటించాలన్నది అమెరికా వత్తిడి. దానికి ఆ సంస్ధ లొంగకపోవటంతో ట్రంప్‌ ఎదురుదాడి ప్రారంభించి చైనాతో కుమ్మక్కయిందని ఆరోపించాడు, ముందు నిధులు నిలిపివేస్తామని ప్రకటించి ఇప్పుడు ఏకంగా వైదొలుగుతామని బెదిరింపులకు దిగాడు. ఈ సంస్ధకు ఇచ్చే నిధులను ప్రపంచంలో ప్రజారోగ్యానికి చేసే ఖర్చుకు అంద చేస్తామని గొప్పలు చెప్పాడు. కరోనా వైరస్‌ ఎక్కడ నుంచి ప్రారంభమైందో దర్యాప్తు జరిపేందుకు చైనా సంస్థలను తమకు అప్పగించాలని అమెరికా ముందు డిమాండ్‌ చేసింది, అంతేకాదు, బాధిత దేశాలకు నష్టపరిహారం చెల్లించాలని కేసుల నాటకం ఆడించింది. చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్ధ సమావేశాల్లో తాము చెప్పిన పద్దతుల్లో దర్యాప్తు తీర్మానం చేయించాలని వత్తిడి తెచ్చింది. అయితే రాజకీయ కోణంతో జరిపే దర్యాప్తులకు బదులు వాస్తవం తెలుసుకొనేందుకు కరోనా సమస్య సమసిపోయిన తరువాత స్వతంత్ర సభ్యులతో దర్యాప్తు జరపవచ్చని దానికి తాము కూడా సహకరిస్తామని చైనా ప్రకటించింది. భారత్‌తో సహా 122 దేశాలు ఉమ్మడిగా ప్రవేశపెట్టిన తీర్మానంపై ఎలాంటి ఓటింగ్‌ లేకుండా ఏకగ్రీవంగా ఆమోదించటం అమెరికాకు మింగుడు పడలేదు. చైనా వ్యతిరేకిస్తుందని, దాన్ని సాకుగా తీసుకొని దాడి చేయాలని చూసిన ఆమెరికా దీంతో హతాశురాలైంది. ఇక లాభం లేదనుకొని తాము సంస్ధ నుంచి వైదొలుగుతామని ప్రకటించింది. సంస్కరణలు తేవటంలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ విఫలమైందని ట్రంప్‌ ఆరోపించాడు. అయితే అమెరికా కోరుతున్న సంస్కరణలు ఏమిటో స్పష్టత లేదని, బయట చర్చకు పెట్టలేదని, ఒక నెల వేచి చూస్తామని చెప్పిన ట్రంప్‌ వారం రోజులకే బెదిరింపులకు ఎందుకు దిగారో తెలియటం లేదని సంస్ధ ప్రధాన కార్యదర్శి టెడ్రోస్‌ చెప్పారు. ట్రంప్‌ నిర్ణయం ముందు చూపులేమి, అమెరికన్ల ప్రాణాలకు ముప్పు తేవటమే అని విమర్శలు వచ్చాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్ధ అసెంబ్లీ ఆమోదించిన ఒక చారిత్రాత్మక ప్రతిపాదన కూడా అమెరికా నిర్ణయాన్ని ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది.కరోనా వైరస్‌ నిరోధానికి తయారు చేసే వ్యాక్సిన్‌ ప్రజల వస్తువుగా ఉండాలి తప్ప ఒకటి రెండు సంస్ధలకు పేటెంట్‌ ఔషధంగా ఉండకూడదని కోస్టారికా చేసిన ప్రతిపాదనను అమెరికా, బ్రిటన్‌ తప్ప మిగిలిన దేశాలన్నీ అంగీకరించాయి. వాటిలో అమెరికా అనుయాయి దేశాలు అన్నీ ఉన్నాయి. ప్రపంచానికి మహమ్మారులుగా మారిన వ్యాధుల నివారణకు రూపొందించిన ఔషధాలు చౌకగా అందరికీ అందుబాటులో ఉండాలి తప్ప కొన్ని కంపెనీలకు లాభాలను తెచ్చిపెట్టేవిగా ఉండకూడదు. అదే జరిగితే ఏం జరుగుతుందో ఎయిడ్స్‌ ఔషధాల విషయంలో చూశాము.
తాము కూడా కరోనా వాక్సిన్‌ తయారీలో ఉన్నామని, అవి జయప్రదమైన తరువాత ప్రజల వస్తువుగా అందుబాటులో ఉంచుతామని చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ ప్రకటించారు. అంతే కాదు ప్రజల వస్తువుగా ఉంచే వాక్సిన్‌ తయారీ యత్నాలకు రానున్న రెండు సంవత్సరాలలో రెండు బిలియన్‌ డాలర్లు అందచేస్తామని కూడా చెప్పారు. ప్రస్తుతం ఎనిమిది సంస్ధలు వాక్సిన్‌ ఒకటి, రెండవ దశ పరీక్షలలో ఉన్నాయి. వాటిలో నాలుగు చైనాలో, రెండు అమెరికా, జర్మనీ, బ్రిటన్‌లో ఒక్కొక్కటీ ఉన్నాయి.
ఎయిడ్స్‌ ఔషధ పేటెంట్‌ పొందిన కంపెనీ ఏడాదికి ఒక్కో రోగి నుంచి పది నుంచి పదిహేనువేల డాలర్లు వసూలు చేసి విక్రయించింది. పదేండ్ల పాటు అంత ఖర్చు భరించలేని రోగులందరూ దుర్మరణం పాలయ్యారు.2004లో మన దేశ కంపెనీలు ఏడాదికి కేవలం 350 డాలర్లకే మందులను అందుబాటులో తెచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచానికి కావలసిన ఎయిడ్స్‌ ఔషధాలలో 80శాతం మన దగ్గర నుంచే సరఫరా అవుతున్నాయి. కాన్సర్‌ చికిత్సకు ఉపయోగించే నెక్సావార్‌ ఔషధంపై బేయర్‌ కంపెనీ పేటెంట్‌ హక్కు కలిగి ఉంది. నూట ఇరవై బిళ్లలను రెండు లక్షల ఎనభైవేల రూపాయలకు కొనుగోలు చేయాల్సి వచ్చేది. అలాంటిది మన దేశంలోని నాట్కో కంపెనీ జనరిక్‌ ఔషధాన్ని కేవలం రూ.8,800లకే అందుబాటులోకి తెచ్చింది. తాము ఈ ఔషధాన్ని భారత మార్కెట్‌కోసం తయారు చేయలేదని పెద్ద మొత్తం చెల్లించి కొనుగోలు చేయగల పశ్చిమదేశాల వారికి ఉద్దేశించింది అని నాట్కో కంపెనీపై కేసు దాఖలు చేసిన సందర్భంగా బేయర్‌ కంపెనీ సిఇఓ చెప్పాడు. అయితే ఆ కేసులో బేయర్‌ ఓడిపోయింది.
ఇప్పుడు కరోనా వాక్సిన్‌తో వ్యాపారం చేయాలన్నది అమెరికా, బ్రిటన్‌ ఆలోచన. అనేక వ్యాధులు పశ్చిమ దేశాలలో అంతగా రావు, అయినా పశ్చిమ దేశాల కంపెనీలు ఆ వ్యాధులకు ఔషధాలను ఎందుకు రూపొందిస్తున్నాయంటే రోగులను పీల్చి పిప్పి చేసేందుకే అన్నది స్పష్టం. ప్రపంచ ఆరోగ్య సంస్ధలో ఉంటూ ఇలాంటి చర్యలకు మద్దతు ఇస్తే అమెరికన్లు సభ్య సమాజం నుంచి మరింతగా వేరుపడతారు. ఇతర జబ్బులకు ఒకసారి పెట్టుబడి పెట్టి అభివృద్ది చేస్తే తరువాత రోజుల్లో పెద్ద మార్పుల అవసరం ఉండదు. కరోనా వైరస్‌ లేదా మరొక వైరస్‌ దేనికీ ఒకసారి తయారు చేసిన ఔషధం శాశ్వతంగా పనికి రాదు. వైరస్‌లో మార్పులు జరిగినపుడల్లా మార్చాల్సి ఉంటుంది. అన్నింటికీ మించి ఎయిడ్స్‌ కోరి తెచ్చుకొనే జబ్బు, కరోనా కోరకుండానే దాడి చేస్తుంది కనుక ప్రతి ఒక్కరూ భయంతో జీవించాల్సి ఉంటుంది, వాక్సిన్‌కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్దపడతారు.మహమ్మారులుగా మారినపుడు లక్షలు, కోట్ల మందికి సోకుతాయి. ఈ అవసరం, బలహీనతను సొమ్ము చేసుకోవాలని అమెరికా, బ్రిటన్‌ కార్పొరేట్‌ సంస్ధలు కాచుకు కూర్చున్నాయి. వాటి ఆకాంక్షలను ట్రంప్‌ వెల్లడిస్తున్నాడు.
ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) నుంచి అమెరికా వైదొలగాలన్న అంశం గత పదిహేను సంవత్సరాలుగా నలుగుతున్నదే. అధికార పార్టీకి చెందిన ఎంపీలు ఇటీవల ఈ సంస్ధను రద్దు చేయాలంటూ ఊగిపోయారు. అలాంటి అధికారం గనుక అమెరికాకు ఉంటే ఈ పాటికి ట్రంప్‌ ఎప్పుడో ఆ పని చేసి ఉండేవాడు. ఈ విషయంలో ప్రతిపక్ష డెమోక్రాట్లు కూడా తక్కువ తినలేదు.ఆ సంస్ధ నుంచి తప్పుకోవాలంటూ పార్లమెంట్‌లో ఆ పార్టీ సభ్యుడు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఒక వేళ ట్రంప్‌ అలాంటి పిచ్చిపని చేస్తే ముందు నష్ట పోయేది అమెరికా తప్ప మిగతా ప్రపంచం కాదు. అయితే తీర్మానం నెగ్గి వెంటనే అమెరికా బయటకు పోతుందని ఎవరూ భావించటం లేదు. అదే జరిగితే ప్రపంచ వాణిజ్యం మీద ఐరోపా యూనియన్‌, చైనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందరితో పాటు కూర్చునేందుకు తమకు స్ధలం ఉండదు అని అమెరికా వాణిజ్య మాజీ ప్రతినిధి వెండీ కట్లర్‌ చేసిన వ్యాఖ్య తీవ్రతకు నిదర్శనం.
గాట్‌లో, తరువాత దాని స్ధానంలో ఏర్పడిన ప్రపంచ వాణిజ్య సంస్ధలో స్ధాపక సభ్యురాలిగా చైనాకు స్ధానం కల్పించేందుకు అమెరికా, దాని మిత్ర రాజ్యాలు అనుమతించలేదు.ఏ వర్ధమాన దేశానికీ విధంచని షరతులను చైనాకు పెట్టి చివరకు చేర్చుకున్నారు.అప్పటి నుంచీ చైనా తమ దేశం నుంచి ఫ్యాక్టరీలు, సంస్ధలను తరలించుకుపోతున్నది, ఉద్యోగాలకు ఎసరు పెట్టింది, వాణిజ్యాన్ని దెబ్బతీసింది అంటూ అమెరికా సణగని రోజు లేదు.
అమెరికా ఒక్క ఐక్యరాజ్యసమితి సంస్ధల నుంచే కాదు. ఇతర వ్యవస్ధలను కూడా చిన్నాభిన్నం చేయాలని చూస్తోంది. బలహీనులనే కాదు బలవంతులను కూడా తన పాదాల చెంతకు తెచ్చుకొనేందుకు పూనుకుంది. చరిత్రలో జరిగిన అనేక ప్రాంతీయ, రెండు ప్రపంచ యుద్దాలకు సామ్రాజ్యవాదుల ఇలాంటి వైఖరే కారణమైంది.
జి7 దేశాల బృందానికి కాలదోషం పట్టిందని ప్రకటించటానికి ట్రంప్‌ ఎవరు ? దానిలో అమెరికాతో పాటు కెనడా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, ఇటలీ, జర్మనీ, జపాన్‌ ఉన్నాయి. మధ్యలో కొన్ని సంవత్సరాలు రష్యాను ఎనిమిదవ దేశంగా చేర్చుకొనేందుకు నిర్ణయించి క్రిమియా ప్రాంతాన్ని ఆక్రమించుకొందనే సాకుతో పక్కన పెట్టారు.ఈ ఏడాది జరిగే సమావేశానికి తిరిగి అధికారికంగా పిలవాలని నిర్ణయించారు. గత ఏడాది మనదేశంతో సహా తొమ్మిది దేశాలను అతిధులుగా ఆహ్వానించారు. ఆరు దేశాల బృందంగా ఏర్పడిన ఈ ఆర్ధిక కూటమిలో తరువాత ఏడవద దేశంగా కెనడాను చేర్చుకున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత ఐరోపా యూనియన్‌ శాశ్వత ఆహ్వానిత సంస్ధగా పిలుస్తున్నారు. నిజానికి ఇది ధనిక రాజ్యాలు తమ ప్రయోజనాలకోసం ఏర్పాటు చేసుకున్నది తప్ప ఐక్యరాజ్యసమితితో ఎలాంటి ప్రమేయం లేదు. ఈ ఏడాది జూన్‌ 10-12 తేదీలలో అమెరికా మేరీలాండ్‌ రాష్ట్రంలోని కాంప్‌డేవిడ్‌లో జరపాలని నిర్ణయించారు. అయితే కరోనా కారణంగా సమావేశాన్ని ఆన్‌లైన్‌ జరపనున్నట్లు మార్చి నెలలో తెలిపారు. ఇప్పుడు దాన్ని కూడా ఏకంగా సెప్టెంబరుకు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. అప్పటికి అమెరికా ఎన్నికలు దగ్గరపడతాయి కనుక తన లాభనష్టాలను బేరీజు వేసుకొని తదుపరి నిర్ణయం తీసుకోవచ్చు.
ఒకే గూటి పక్షులైన ఈ బృంద దేశాలతో కూడా అమెరికా సక్రమంగా వ్యవహరించటం లేదు. మిగతా దేశాలన్నీ తనకు అణగి మణగి ఉండాలని కోరుకుంటోంది. ఈ నేపధ్యంలో 2018లో కెనడాలోని మాంట్రియల్‌ నగరంలో జరిగిన సమావేశం రసాభాస అయింది. డోనాల్డ్‌ ట్రంప్‌తో మిగిలిన ఆరుగురు నేతలు పడిన ఇబ్బందులను గమనించిన జర్నలిస్టులు ఆ సమావేశాన్ని ” జి6ప్లస్‌ ఒన్‌ ” అని అపహాస్యం చేశారు. ఆ సమావేశం ఎలాంటి ప్రకటనను ఆమోదించకుండా ముగియటానికి అమెరికా, ట్రంపే కారణం అంటే అతిశయోక్తి కాదు. ఆ ఏడాదే చైనా, కెనడా , ఐరోపా యూనియన్‌ ఇతర అనేక దేశాలపై బస్తీమే సవాల్‌ అంటూ ట్రంప్‌ వాణిజ్య యుద్దం ప్రకటించటమే దీనికి కారణం. ఈ ఏడాది ఆతిధ్యం ఇస్తూ ఈ బృందం పనికిమాలినది అని వ్యాఖ్యానించటాన్ని బట్టి ట్రంప్‌ సంస్కారం ఏమిటో బయటపడింది. అదే నోటితో మన దేశంతో సహా మిగిలిన దేశాలతో దాన్ని విస్తృత పరచాలంటూ ఆదేశాల తరఫున మాట్లాడుతున్నట్లు ఫోజు పెట్టాడు. నిజానికి ఆ బృందంలో ఉన్నంత మాత్రాన ఏ దేశానికైనా పెద్దగా ఒరిగేదేమీ లేదు. దానితో నిమిత్తం లేకుండానే చైనా అంతర్జాతీయ వాణిజ్యంలో ఎంతగా ఎదిగిందో, ఆ బృందంలోని అమెరికా మినహా మిగిలిన దేశాలను దాటి ఎలా ముందుకు పోతోందో ఇప్పుడు కరోనా వైరస్‌ను అరికట్టటంలో సోషలిస్టు వ్యవస్ధ ప్రత్యేకతను ప్రపంచానికి చాటింది. ఒక్క జపాన్‌ మినహా మిగిలిన అన్ని జి7దేశాలూ కరోనాతో సతమతం అవుతున్నాయి. అమెరికా గురించి చెప్పనవసరం లేదు. ప్రపంచంలో ఇది రాస్తున్న సమయానికి నమోదైన 62లక్షల కేసుల్లో పద్దెనిమిది లక్షల కేసులను దాటి పోయింది. 2008లలో ధనిక దేశాలలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం నుంచి జి7లోని ఏ ఒక్కదేశమూ బయటపడకపోగా మరో సంక్షోభంలోకి కూరుకుపోతుండటాన్ని చూస్తున్నాము.
అమెరికా పాలకవర్గం, దాని ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అనుకుంటున్నది ఒకటి-జరుగుతున్నది మరొకటి కావటంతో తట్టుకోలేకపోతున్నాడు. ఏదో ఒక పిచ్చిపనో, ప్రకటనో, బెదిరింపులో చేస్తున్నాడు. వాటిలో ఒకటి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి అమెరికా తప్పుకుంటుందన్న అంశం. గతంలో ప్రపంచాన్ని బెదిరించేందుకు జపాన్‌పై అణుబాంబులు వేశారు. ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత బెదిరింపులు ఎక్కువయ్యాయి. ప్రపంచ సంస్ధల నుంచి తప్పుకుంటామనే రూపంలో అవి ముందుకు వస్తున్నాయి.అందుకుగాను ప్రతిదానికీ ఏదో ఒక సాకు చూపుతున్నారు.
రెండవ ప్రపంచ యుద్దం తరువాత తలెత్తిన పరిస్ధితుల్లో అమెరికా ఒక పెద్ద ఆర్ధికశక్తిగా ఎదిగింది. కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టే బాధ్యతను నెత్తికి ఎత్తుకొని ప్రపంచలోని కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులన్నింటినీ కూడగట్టింది. ఆ ముసుగులో తన కార్పొరేట్‌ సంస్ధలకు ఆయా దేశాలను మార్కెట్‌గా చేసుకొనేందుకు, సహజవనరులను కొల్లగొట్టేందుకు ప్రయత్నించింది. తన మిలిటరీ,రాజకీయ వ్యూహాలను అమలు జరిపేందుకు కేంద్రాలుగా చేసుకున్నది. గడచిన ఏడున్నర దశాబ్దాలలో అమెరికా అనుసరించిన ఎత్తుగడలు దానికి ఎదురుతన్నాయి.ఈ కారణంగానే డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ సంస్ధలలో అమెరికా కొనసాగటం, వాటికి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం దండగ, తమ లక్ష్యాలకు ఉపయోగపడటం లేదని భావించటం, తప్పుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అమెరికాయే కాదు ఏదేశంలో అయినా పాలకవర్గాలకు తమ ప్రయోజనాలే ముఖ్యం తప్ప వ్యక్తులు కాదు. తాము నిర్దేశించిన అజెండాను అమలు జరపకపోతే ఒక బొమ్మ బదులు మరొక బొమ్మను గద్దెపై కూర్చోబెడతాయి. ఈ నేపధ్యంలోనే నవంబరు ఎన్నికలలో ట్రంప్‌ ఓడిపోయి మరొకరు వచ్చినా భాష, హావభావాలు, పిచ్చిమాటలు మారవచ్చు తప్ప ఇదే వైఖరి కొనసాగుతుంది.
ఇలాంటి వైఖరి అమెరికాకు ఉపయోగపడుతుందా ? ప్రపంచ సంస్ధలతో నిమిత్తం లేకుండా తనకున్న ఆర్ధిక, మిలిటరీ శక్తితో ప్రపంచాన్ని శాసించి తన అదుపులోకి తెచ్చుకోవాలని గత కొంత కాలంగా ప్రయత్నిస్తోంది. అది సాధ్యం కాదని దానికి అవగతం అవుతోంది. 2008లో పెట్టుబడిదారీ దేశాలలో వచ్చిన మాంద్యం తరువాత అనేక దేశాలు రక్షణాత్మక చర్యలు తీసుకోవటం, ప్రపంచ వాణిజ్య సంస్ధను పక్కన పెట్టి విడిగా ఒప్పందాలు చేసుకోవటం పెరుగుతోంది. గత ఏడాది నవంబరు వరకు వచ్చిన వార్తల ప్రకారం రక్షణాత్మక చర్యల్లో అమెరికా 790తో అగ్రస్ధానంలో ఉంది. మన దేశం ప్రపంచ వాణిజ్యంలో చాలా తక్కువశాతమే కలిగి ఉన్నప్పటికీ దాన్నయినా కాపాడుకొనేందుకు రక్షణాత్మక చర్యల్లో 566తో అమెరికా తరువాత రెండో స్ధానంలో ఉన్నాం. దేశాల వారీ జర్మనీ 390, బ్రిటన్‌ 357, ఫ్రాన్స్‌262, చైనా 256, కెనడా 199, ఆస్ట్రేలియా 174 చర్యలు తీసుకున్నాయి.2018 చివరిలో ప్రపంచ వాణిజ్యం మాంద్యంలోకి జారిపోయింది. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచం ఎలాంటి పర్యవసానాలను చూడాల్సి వస్తుందో అప్పుడే చెప్పలేము.
ఐక్యరాజ్యసమితికి ఉండే బలహీనతలు దానికి ఉన్నాయి. అంతకంటే మెరుగైన వ్యవస్ధను ఏర్పాటు చేసుకొనేంతవరకు దాన్ని కొనసాగించటం తప్ప మరొక మార్గం లేదు. ఉన్నదాన్నే కొనసాగించటానికి అంగీకరించని అమెరికన్లు దాన్ని బోనులో నిలబెట్టే అంతకంటే శక్తివంతమైన ప్రపంచ వ్యవస్ధ ఏర్పాటుకు అంగీకరిస్తారని ఆశపెట్టుకోనవసరం లేదు. గతంలో సామ్రాజ్యవాదులు ప్రపంచాన్ని పంచుకొనేందుకు, రక్షణాత్మక చర్యలు అమలు జరిపిన కారణంగానే ప్రపంచ యుద్దాలు వచ్చాయి. ట్రంప్‌ చేస్తున్న పిచ్చిపనులు నవంబరులో జరిగే ఎన్నికల్లో లబ్దిపొందేందుకు అన్నది ఒకటైతే రెండవది అమెరికా వైఖరిలో రోజు రోజుకూ పెరుగుతున్న అసహనానికి నిదర్శనం. ట్రంప్‌ ఓడిపోతారా, డెమోక్రాట్‌ జోబిడెన్‌ గెలుస్తారా అన్నది పక్కన పెడితే అగ్రస్దానం అమెరికాదే అన్న వైఖరిని మరింత ముందుకు తీసుకుపోతే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడే తెలియదు గానీ, తీవ్రంగా ఉంటాయని కచ్చితంగా చెప్పవచ్చు.