ఎం కోటేశ్వరరావు
చైనా నుంచి ఎఫ్‌డిఐల రాక మీద కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెడితే దాన్ని కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారంటూ ఒక పోస్టు సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది. అసలు వాస్తవం ఏమిటి ? తమ దేశాలలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మీద జర్మనీ, ఆస్ట్రేలియా,చెక్ వంటి దేశాలు నిబంధనలలో కొన్ని మార్పులు చేశాయి. అదే పద్దతులలో మన కేంద్ర ప్రభుత్వం కూడా నిబంధనలను సవరించింది. దాని ప్రకారం ” భారత్‌తో భూ సరిహద్దు ఉన్న దేశాలకు చెందిన సంస్ధలు లేదా పెట్టుబడుల ద్వారా లబ్దిపొందే యజమానులైన పౌరులు అటువంటి దేశాలకు చెందిన వారైనా పెట్టుబడులు పెట్టవచ్చు, అయితే అది ప్రభుత్వ మార్గాల ద్వారానే జరగాలి” అని పేర్కొన్నారు.
ప్రస్తుతం రెండు మార్గాల ద్వారా విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం లేదా రిజర్వుబ్యాంకు అనుమతితో నిమిత్తం లేకుండా నేరుగా వచ్చేవి. ప్రభుత్వ అనుమతితో వచ్చేవి రెండవ తరగతి. మొదటి మార్గంలో వస్తున్న పెట్టుబడులతో మన దేశంలోని సంస్ధలను చైనా కంపెనీలు కబ్జా చేస్తున్నాయన్నది ఒక తీవ్ర ఆరోపణ. ఒక గూండా, పలుకు బడిన రాజకీయ నేత, అధికారో బలహీనులను అదిరించి బెదిరించి స్దలాన్నో పొలాన్నో రాయించుకుంటే అది అక్రమం. ఎవరైనా అలాంటి ఫిర్యాదు చేస్తే కేసు అవుతుంది. ఏ కంపెనీ అయినా తన సంస్ధను లేదా వాటాలను అమ్మకానికి పెట్టినపుడు ఎవరి దగ్గర సత్తా ఉంటే వారే కొనుక్కుంటారు. దానిలో బలవంతం ఏమి ఉంటుంది.1963లో భారతీయులు నెలకొల్పిన విద్యుత్ పరికరాల సంస్ధ యాంకర్ గురించి తెలియని వారు ఉండరు. ఆ కంపెనీని 2007లో జపాన్ కంపెనీ పానాసోనిక్ కొనుగోలు చేసింది. అది చట్టబద్దమే, అలాగే అనేక స్వదేశీయుల మధ్యనే చేతులు మారాయి. రుచి గ్రూప్ కంపెనీ రుచి సోయా దివాళా తీసింది. దాన్ని రామ్‌దేవ్ బాబా పతంజలి కంపెనీ కొనుగోలు చేసింది. అంకుర సంస్ధల ఏర్పాటులో అనేక మంది చైనాతో సహా పలుదేశాలకు చెందిన సంస్ధలు, వ్యక్తుల నుంచి పెట్టుబడులు తీసుకొని భాగస్వామ్యం కల్పిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచ వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో చైనా దూసుకుపోతున్నది. ఆర్ధికంగా, సాంకేతిక పరంగా ఎన్నో విజయాలు సాధిస్తున్నందున వచ్చిన అవకాశాలను మన వారు వినియోగించుకుంటున్నారు. అలాంటి వెసులు బాటు చైనా కంపెనీలకు ఉన్నది. తమ వ్యాపార విస్తరణ వ్యూహాల్లో భాగంగా అవి లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. మన దేశం విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఏప్రిల్ నుంచి అమల్లోకి తెచ్చిన నిబంధనల్లో ఎక్కడా చైనా అనో మరో దేశం పేరో పేర్కొన లేదు. అయితే మన దేశంతో భూ సరిహద్దు ఉన్న దేశాలలో పెట్టుబడులు పెట్టగలిగింది ఒక్క చైనాయే గనుక ఆ సవరణ వారిని లక్ష్యంగా చేసుకున్నదే అని మీడియా లేదా వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. అది వాస్తవం. భారత ప్రభుత్వ చర్య వివక్షాపూరితం అని చైనా పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వ చర్యను భారత కమ్యూనిస్టులు వ్యతిరేకించినట్లు ఒక్క ఆధారం కూడా లభ్యం కాలేదు, ఎవరైనా చూపితే సంతోషం. ” బందీ అయిన వామపక్షం ” కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద ఎలాంటి వైఖరీ తీసుకోలేరు అంటూ రిపబ్లిక్ టీవీ వ్యాఖ్యాత 2020 ఏప్రిల్ 19న పేర్కొన్నారు. అయినా కమ్యూనిస్టులు వ్యతిరేకించినవి ఏవి ఆగాయి గనుక ?
చైనాతో సంబంధాలను ప్రోత్సహించి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లబ్ది పొందిందని కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్ రుస రుసలాడుతున్నారు. గత ఆరు సంవత్సరాలుగా రవిశంకర ప్రసాద్‌గారు మంత్రిగా ఉన్న మోడీ సర్కార్ నిర్వాకం ఏమిటి ? గత పాలకుల వైఖరిని కొనసాగించిందా ? నిరుత్సాహపరచిందా ? రవిశంకర ప్రసాద్‌కు మద్దతుగా బిజెపి ఐటి విభాగం అధిపతి అమిత్ మాలవీయ ట్వీట్ చేస్తూ 2003-04లో 101 కోట్ల డాలర్లుగా ఉన్న చైనా వాణిజ్యం 2013-14 నాటికి 362 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ నిర్వాకమే అనుకుందాం. 2014 నాటికి మన దేశంలో చైనా పెట్టుబడులు 160 బిలియన్ డాలర్లు ఉంటే ప్రస్తుతం 2,600 కోట్లు, ఇవిగాక ప్రతిపాదనల్లో మరో 1,500 కోట్ల డాలర్లు, ఇవిగాకుండా సింగపూర్, మలేసియా తదితర మూడో దేశాల పేరుతో ఉన్న మరికొన్ని వందల కోట్ల డాలర్ల చైనా పెట్టుబడుల సంగతేమిటో బిజెపి మంత్రులు,నేతలు చెప్పాలి. ఇవన్నీ కమ్యూనిస్టులు చెబితే మన దేశానికి వచ్చాయా ? పోనీ బిజెపి నేతలకు తెలివితేటలు ఎక్కువ కనుక మనకు అవసరమైన పెట్టుబడులు తెచ్చుకొని మన వస్తువులను చైనాకు ఎగుమతి చేశారా అంటే అదీ లేదు. వాణిజ్య లోటు 36బిలియన్ డాలర్లు కాస్తా 63 బిలియన్ డాలర్లకు పెరిగిన తీరు చూశాము. ఇదిగాక హాంకాంగ్, ఇతర దేశాల ద్వారా మన దేశంలో ప్రవేశిస్తున్న చైనా వస్తువులను కూడా కలుపుకుంటే మన వాణిజ్యలోటు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ నిర్వాకాన్ని ఏమనాలి ? ఇన్ని సంవత్సరాలుగా లేని ఈ చర్చను, ఇలాంటి తప్పుడు ప్రచారాలను బిజెపి ఇప్పుడు ఎందుకు లేవనెత్తుతున్నట్లు ? లడఖ్ లడాయి కారణం. చైనా వారు మన భూభాగంలోకి రాలేదు, మన సైనికపోస్టులను ఏమీ చేయలేదు అని ప్రధాని మోడీ చెప్పటంతో పోయిన పరువు నుంచి జనాన్ని తప్పుదారి పట్టించేందుకు బిజెపి ముందుకు తెచ్చిన ప్రచారదాడి. చైనా గురించి అలా చెప్పాలని ఏ కమ్యూనిస్టు పార్టీ లేదా నేతలు ఎవరైనా ప్రధాని నరేంద్రమోడీ గారికి చెప్పారా ? చైనా మన ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చిందని చెప్పింది మోడీ మంత్రులు, మోడీగారేమో అలాంటిదేమీ లేదు అని చెబుతారు. అసలు కేంద్ర ప్రభుత్వంలో సమన్వయం ఉందా ? దేశ ప్రజలను గందరగోళ పరచటం తప్ప ఒక పద్దతి ఉందా ?
జూలై ఒకటి తరువాత బంగ్లాదేశ్ నుంచి ఎగుమతి చేసే 97శాతం వస్తువులపై చైనా దిగుమతి పన్ను రద్దు చేసేందుకు రెండు దేశాల మధ్య కొద్ది రోజుల క్రితం ఒప్పందం కుదిరింది. ఇదే సమయంలో భారత్-చైనాల మధ్య లడక్ వాస్తవాధీన రేఖ వద్ద వివాదం తలెత్తింది. ఈ నేపధ్యంలో ఇంకే ముంది భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌ను బుట్టలో వేసుకొనేందుకు చైనా ఈ రాయితీలు ప్రకటించిందంటూ మీడియాలో టీకా తాత్పర్యాలు వెలువడ్డాయి. గత కొద్ది సంవత్సరాలుగా చైనా అనేక దేశాలతో తన వాణిజ్య సంబంధాలను విస్తరించుకుంటున్నది. అవి ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలకు వ్యతిరేకం అయితే ప్రభావితమైన ఏదేశమైనా దానికి ఫిర్యాదు చేయవచ్చు, కేసు దాఖలు చేయవచ్చు.
అసలు ఇది ఎంత వరకు నిజం ? మీడియా పండితులకు వాస్తవాలు తెలిసి ఇలాంటి ప్రచారానికి దిగారా లేక తెలియక దిగారా ? తెలిసి చేస్తే జనాన్ని తప్పుదారి పట్టించే యత్నం, తెలియకపోతే తమ విశ్వసనీయతను తామే దెబ్బతీసుకోవటం. ఆసియా ఫసిపిక్ వాణిజ్య ఒప్పందం(ఆప్టా) కింద ఇప్పటికే 3,095 బంగ్లా ఉత్పత్తులకు చైనాలో పన్నులు లేవు. వాటిని ఇప్పుడు 8,256కు పెంచారు.
ఇంతకీ ఈ ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1975లో జరిగిన ఆప్టాలో భారత్, బంగ్లాదేశ్,దక్షిణ కొరియా, శ్రీలంక, లావోస్ మధ్య జరిగిన బ్యాంకాక్ ఒప్పందం ఇది. తరువాత 2005లో ఆసియా ఫసిపిక్ వాణిజ్య ఒప్పందం అని పేరు మార్చారు. 2001లో చైనా, 2013లో మంగోలియా ఒప్పందంలో చేరాయి. సభ్య దేశాల మధ్య దిగుమతులపై పన్నులు తగ్గించుకోవటం ప్రధాన లక్ష్యం. ఈ ఒప్పంద లక్ష్యానికి ఇది విరుద్దమైతే మన ప్రభుత్వమే బహిరంగంగా అభ్యంతరం చెప్పవచ్చు. రెండు దేశాల సంబంధాలను మరింతగా పెంచుకోవాలని షేక్ హసీనా-గ్జీ జింపింగ్ నిర్ణయించుకున్న నెల రోజుల తరువాత జూన్‌లో జరిగిన పరిణామమిది. ఈ ఒప్పందం ప్రకారం చైనా తీసుకున్న చర్య నిబంధనలకు విరుద్దం అయితే కేంద్ర ప్రభుత్వమే తన అభ్యంతరాన్ని ఎందుకు చెప్పలేదు ? లేదా ఇలాంటి పనులు చేస్తే తాము ఒప్పందం నుంచి వైదొలుగుతామని అయినా హెచ్చరించాలి కదా ?
భారతదేశంతో తన సరిహద్దులతో కూడిన చిత్రపటానికి చట్టబద్దత కల్పించేందుకు నేపాల్ పార్లమెంట్ ఒక రాజ్యాంగ సవరణను ఆమోదించింది. కాళీ నది తూర్పు ప్రాంత భూమి తమది అని అక్కడి నుంచే తమ పశ్చిమ సరిహద్దు ప్రారంభం అవుతుందని నేపాల్ చెబుతోంది. కాళీ నది నేపాల్ చెబుతున్న ప్రాంతం కంటే బాగా దిగువన ప్రారంభమైనందున ఆ ప్రాంతంతో నేపాల్‌కు సంబంధం లేదని నది ప్రారంభ స్ధానం గురించి నేపాల్ చెబుతున్నదానిని అంగీకరించటం లేదని మన దేశం చెబుతున్నది. ఈ వివాదం గురించి నేపాల్‌తో చర్చించవచ్చు, పరిష్కరించవచ్చు. నేపాల్ తన దేశ చిత్రపటాన్ని రాజ్యాంగంలో చేర్చటం వెనుక చైనా ఉన్నది అంటూ ఈ సమస్యలో కూడా చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది.
స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు మన లాభదాయకమా? నష్టమా ? నష్టం అయితే నరేంద్రమోడీ సర్కార్ ఆరు సంవత్సరాల కాలంలో ఒక్కసారైనా సమీక్షించిందా ? నష్టం అని తేలితే గతంలో చేసుకున్న ఒప్పందాలన్నింటి నుంచి వైదొలిగేందుకు తీసుకున్న చర్య లేమిటి ? పది దేశాలతో కూడిన ఆగేయ ఆసియా దేశాల అసోసియేషన్ను ” ఆసియన్” అని పిలుస్తున్నాము. వీటితో మరో ఆరు దేశాలు పలు ఒప్పందాలు చేసుకున్నాయి. మన దేశం 2010జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఒక స్వేచ్చా వాణిజ్య ఒప్పందాన్ని చేసుకుంది. మన ఉత్పతులను ఆదేశాల మార్కెట్లలో నింపాలన్నది మన ఆలోచన. కానీ దానికి బదులు వాటి ఉత్పత్తులే మన మార్కెట్లో ఎక్కువగా వచ్చి చివరకు మనకు వాణిజ్యలోటును మిగిల్చాయి. ఆ ఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలోనే కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న సిపిఎం నేత విఎస్ అచ్యుతానందన్ నాటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకతను తెలిపారు. రబ్బరు, సుగంధ ద్రవ్యాల వంటి తోట పంటల ఉత్పత్తులు మన మార్కెట్లోకి వస్తే కేరళ రైతాంగానికి నష్టదాయకమని నాడు చెప్పారు. అదే జరిగింది.
2019 సెప్టెంబరు నెలలో బాంకాక్‌లో జరిగిన ఆసియన్-భారత్ సమావేశంలో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాన్ని సమీక్షించాలని నిర్ణయించారు. అనేక దేశాలు, అసోసియేషన్లతో చేసుకున్న స్వేచ్చావాణిజ్య ఒప్పందాలు తమకు పెద్దగా ఉపయోగపడటం లేదని, వాటిని సమీక్షించాలని మన వాణిజ్య, పారిశ్రామికవేత్తలు గత కొంతకాలంగా ప్రభుత్వం మీద వత్తిడి తెస్తున్నారు.యుపిఏ అయినా ఎన్‌డిఏ అయినా అనుసరిస్తున్నది దివాలా కోరు విధానాలే. స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు మన దేశానికి హానికరం అనుకుంటే వాటిని చేసుకోబోయే ముందు బిజెపి ఎలాంటి వ్యతిరేకతను వ్యక్తం చేయలేదు. ఆసియాలో గరిష్ట సంఖ్యలో అలాంటి వాటిని చేసుకున్నది మనమే అని నివేదికలు చెబుతున్నాయి. మొత్తం 42 ఒప్పందాల మీద అవగాహనకుదిరితే వాటిలో 13 అమల్లో, 16 సంప్రదింపుల్లో , 12 పరిశీలనలో ఉన్నాయి. మొత్తం మీద అమలు జరిగిన వాటి సారం ఏమిటంటే అవి లేకపోతే మన వాణిజ్య పరిస్ధితి ఇంకా దిగజారి ఉండేది. దక్షిణాసియా స్వేచ్చా వాణిజ్య ఒప్పందం( సాఫ్టా) 2006 నుంచి అమల్లో ఉంది. అప్పుడు 680 కోట్ల డాలర్లుగా ఉన్న వాణిజ్యం 2018-19 నాటికి 2850 కోట్ల డాలర్లకు పెరిగింది. మన వాణిజ్య మిగులు 400 నుంచి 2100 కోట్లడాలర్లకు పెరిగింది. ఆసియన్ దేశాలతో కుదిరిన ఒప్పందం లావాదేవీలు గణనీయంగా పెరగటానికి తోడ్పడింది గానీ మన ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువగా ఉన్నాయి. వాణిజ్యలోటు పెరిగింది. దక్షిణ కొరియాతో మన దేశం కుదుర్చుకున్న ఒప్పందం ఫలితంగా మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా పెరిగాయి. జపాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం తీరు తెన్నులు చూస్తే ఎగుడుదిగుడులు ఉన్నా మన దిగుమతులే ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలతో వాణిజ్య లావాదేవీలు పెరిగాయి. ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువ. ఒక్క సాఫ్టా తప్ప మిగిలిన వన్నీ మనకు పెద్దగా ఉపయోగపడలేదు. అందువలన వాటిని సమీక్షించటానికి కమ్యూనిస్టులు లేదా కాంగ్రెస్ వారు గానీ ఎన్నడూ అభ్యంతరం చెప్పలేదు. అధికారానికి వచ్చినప్పటి నుంచి జనాన్ని మత ప్రాతిపదికన చీల్చి మెజారిటీ ఓటు బ్యాంకును ఎలా పెంచుకోవటమా అన్న యావతప్ప దేశ అభివృద్ధి గురించి పట్టించుకొని ఉంటే నేడు ఈ పరిస్ధితి ఉండేదా అని అందరూ ఆలోచించాలి.
పదమూడు సంవత్సరాల పాటు పారిశ్రామికంగా ముందున్న గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉన్నందున ఆ నమూనాను దేశమంతటా అమలు జరుపుతామని నరేంద్రమోడీ ఎన్నికల్లో చెప్పారు. గత పాలనా అనుభవం కారణంగా ప్రధానిగా నేరుగా రంగంలోకి దిగుతానని చెప్పిందీ మోడీ గారే. అలాంటి వ్యక్తి పాలనలో ఆరేండ్లు తక్కువేమీ కాదు. దక్షిణాసియాలో అగ్రరాజ్యం మనదే. సాఫ్టా ఒప్పందం కూడా ఉంది. అయినా ఏమి జరిగింది ?
ఆప్ఘనిస్తాన్, పాకిస్దాన్, శ్రీలంక, మాల్దీవులు, మయన్మార్, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లతో 2014-18 మధ్య చైనా తన ఎగుమతులను 41 నుంచి 51.7 బిలియన్ డాలర్లకు పెంచుకున్నది. ఇదే సమయంలో తన దిగుమతులను 19.4 నుంచి 8.3 బిలియన్ డాలర్లకు తగ్గించుకుంది.2018లో ఈ దేశాలతో చైనా వాణిజ్యం 55.99 బిలియన్ డాలర్లు కాగా మన దేశం 30.95బిలియన్ డాలర్లు మాత్రమే ఉంది. చైనాకు ఒక్క పాకిస్ధాన్‌తో మాత్రమే స్వేచ్చావాణిజ్య ఒప్పందం ఉంది. నేపాల్, భూటాన్, ఆఫ్‌ఘనిస్తాన్‌తో మన వాణిజ్యం 9.88 బిలియన్ డాలర్లు ఉంటే ఈ దేశాలతో చైనా 1.8 బిలియన్ డాలర్లు మాత్రమే. మొత్తం మీద ఈ పరిణామాన్ని మోడీ సర్కార్ వైఫల్యం అనాలా లేక చైనా విజయం అనాలా ? మన వైపు నుంచి లోపం ఎక్కడుందో ఆలోచించుకోవాలా వద్దా !
చైనా పెట్టుబడులు : ఆంక్షలు పెట్టింది కేంద్రం – నింద కమ్యూనిస్టుల మీద !
30 Tuesday Jun 2020
Posted CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion
in