ఎం కోటేశ్వరరావు
కేంద్రపాలిత లడఖ్ ప్రాంతానికి చెందిన ఒక ఇంజనీరు, విద్యా సంస్కరణవాదిగా వర్ణితమైన సోనమ్ వాంగ్‌చుక్ చైనా వస్తువులను బహిష్కరించి ఆ దేశాన్ని మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలంటూ సామాజిక మాధ్యమంలో పెట్టిన ఒక వీడియో వైరల్ అవుతోంది.జూన్ రెండవ తేదీ నాటికి 20లక్షల మంది చూశారట. భారత-చైనా సరిహద్దులో ఒకటైన లడక్ ప్రాంతంలో ప్రస్తుతం ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపధ్యంలో పెట్టిన ఈ పోస్టుకు మీడియాలో కూడా పెద్ద ప్రచారమే వచ్చింది. మరోసారి చైనా వస్తువులను బహిష్కరించండి అనే వార్తలు దర్శనమిస్తున్నాయి.
బ్రిటీష్ వారు బెంగాల్‌ను విభజిస్తూ చేసిన నిర్ణయానికి వ్యతిరేకంగా 1905లో నాటి జాతీయోద్యమ నేతలు స్వదేశీ పిలుపునిచ్చి బ్రిటీష్ వారి వస్తువుల కొనుగోలును బహిష్కరించాలని కోరారు.ఆ చర్యతో ఆ నిర్ణయాన్ని వెనక్కు గొట్టవచ్చని భావించారు. నాడు పిలుపు ఇచ్చిన వారు తాము కాంగ్రెస్ వాదులం అని రొమ్మువిరుచుకొని వీధుల్లోకి వచ్చారు. ఇప్పుడు చైనా వస్తువులు కొనుగోలు చేయవద్దని పిలుపు ఇస్తున్నవారు, ప్రచారం చేస్తున్నవారు ముసుగులు వేసుకొని తమ గుర్తింపు బయటపడకుండా ఆ పని చేస్తున్నారు. నాడు కాంగ్రెస్ వాదులు బ్రిటీష్ వారితో చేతులు కలపలేదు. నేడు కొందరు ముసుగులు వేసుకొని ఒక వైపు ప్రచారం చేస్తుంటే మరోవైపు పాలకులు చైనా నేతలకు ఎర్రతివాచీ పరచి మర్యాదలు చేస్తున్నారు. ఆ ముసుగు వీరులు ఎక్కడా ఈ ఎర్రతివాచీలను పల్లెత్తు మాట అనరు. అంటే వారికీ వీరికీ చీకటి సంబంధం ఉందన్నది బహిరంగ రహస్యం. ఇద్దరూ కలసి జనాన్ని వెర్రివాళ్లను చేస్తున్నారా? చెవుల్లో కమలం పువ్వులు పెడుతున్నారా ?
ముసుగు లేదా మరుగుజ్జు వీరులు వాట్సాప్‌ద్వారా చేస్తున్న ప్రచారాన్ని అనేక మంది నిజమే అనుకుంటున్నారు. తామంతా చైనా వస్తువులను బహిష్కరించినట్లు, చైనా కమ్యూనిస్టులు తలుపుతట్టి తమ కాళ్ల మీద పడి తప్పయి పోయింది, మా వస్తువులను కొనటం మాని మా నోటి కాడ కూడును కొట్టకండి మహాప్రభో అని వేడుకుంటున్నట్లు చాలా మంది కలలు కంటున్నారు. వయసులో ఉన్న వారికి వచ్చే కొన్ని కలలు వారిని మంచాల మీద నుంచి పడవేస్తుంటాయి. కొందరికి చైనా కలలు కూడా అలాంటి కిక్కు ఇస్తూ ఉండవచ్చు.
కోట్లాది మంది చైనా యాప్స్‌ను తమ ఫోన్ల నుంచి తొలగిస్తే మన సరిహద్దులలోకి ప్రవేశిస్తున్న చైనా ప్రభుత్వానికి అదొక హెచ్చరికగా ఉంటుందని సోనమ్ వాంగ్‌చుక్ చెప్పాడు. మన సైన్యం ఆయుధాలను తీసి సమాధానం చెబుతుంటే జనం పర్సులను మూసి చెప్పాలన్నాడు. చైనా వస్తువులను బహిష్కరించితే దాని మూల్యం ఎంతో చైనాకు తెలిసి వస్తుందన్నాడు. చైనా వస్తువుల కొనుగోలుకు పెట్టిన ఆర్డర్లను వ్యాపారులు రద్దు చేసుకుంటే వ్యాపారంతోనే బతుకుతున్న తమ జనం తిరగబడతారని చైనా ప్రభుత్వం భయపడుతుంది. వ్యాపారం నిలిచిపోయి వారి ఆదాయం దెబ్బతింటే తిరుగుబాటే వచ్చే అవకాశం ఉంది. అందువల చైనా వస్తువులను బహిష్కరించాల్సి ఉంది అని కూడా చెప్పాడు. ఇలాంటి కలలు కనే వారు నిజంగానే తట్టుకోలేక మంచాల మీద నుంచి దభీమని పడతారు.మన సరిహద్దుల్లోకి చైనీయులు చొరబడినట్లుగా ప్రచారంలో ఉన్న వీడియోలు ప్రామాణికమైనవి కాదు, దుష్ట ఆలోచనతో రూపొందించినవి అని మరోవైపు మన సైన్యం ప్రకటించింది.
రెండుదేశాల మధ్య గత ఏడాది 93 బిలియన్ డాలర్ల వాణిజ్య లావాదేవీలు జరిగాయి. రెండుచోట్లా ఆర్ధిక పరిస్ధితులు బాగోలేక అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే మూడు బిలియన్ డాలర్ల మేర తగ్గాయి. మన దిగుమతులు ఎక్కువ కావటంతో చైనా మిగులు 56.77 బిలియన్ డాలర్లు ఉంది. కలలు అవి పగలు, రాత్రి అయినా కనేందుకు ఎవరికీ అభ్యంతరం లేదు. రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య లావాదేవీల గురించి కొన్ని వాస్తవాలను తెలుసుకోవటం అవసరం. బోగస్ వాట్సాప్ యూనివర్సిటీ మేథావుల సమాచారాన్ని నమ్మవద్దు. మన దేశం నుంచి 2019లో జరిగిన ఎగుమతులలో అమెరికాకు 15.91శాతం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు 9.13, చైనాకు 5.08,హాంకాంగ్‌కు 3.93శాతం, సింగపూర్‌కు 3.51, మిగతా అన్ని దేశాలకు కలిపి 62.44శాతం ఉన్నాయి. ఇదే ఏడాది చైనా ఎగుమతులలో మన దేశ వాటా కేవలం మూడు శాతంతో ఏడవ స్ధానంలో ఉన్నాము. మొదటి స్ధానంలో ఉండి 16.8 శాతం దిగుమతి చేసుకుంటున్న అమెరికాయే రెండు సంవత్సరాల నుంచి వాణిజ్య యుద్దం చేస్తూ చైనాను వెంట్రుకవాసి కూడా కదిలించలేకపోయిందన్నది తెలుసుకుంటే సోనమ్ వాంగ్‌చుక్ లాంటి వారు కలలు కనటానికి అసలు నిదరే పట్టదు మరి.
చైనా నుంచి మనం మూడుశాతం దిగుమతులు నిలిపివేస్తే, మన ఎగుమతులు ఐదుశాతం నిలిచిపోతాయి. చైనా నుంచి మనం వస్తువుల దిగుమతిని నిలిపివేయాలని వాస్తవాల మీద ఆధారపడి పిలుపులు ఇస్తున్నారా లేక ఊహల్లో ఉండి చేస్తున్నారో తెలియదు. ఇవాళ అనేక వస్తువులు ఏవీ ఒక దేశంలో తయారు కావటం లేదు. ఒక్కో దేశంలో కొన్ని భాగాలు తయారైతే వాటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి సంపూర్ణ వస్తువును రూపొందిస్తున్నారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫోన్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రికల్ వస్తువులన్నీ అలాంటివే. ఈ నేపధ్యంలో మన ప్రధాని నరేంద్రమోడీ స్ధానిక వస్తువులనే అడగండి అన్న పిలుపు మేరకు ఎవరైనా దుకాణాలకు వెళ్లి పక్కా స్ధానిక వస్తువులను ఎన్నింటిని కొనగలమో ఆలోచించండి.
ఒక దేశ వస్తువుల మీద మరొక దేశం లేదా కొన్ని దేశాలు దిగుమతి పన్నులు విధించినట్లయితే వాటిని తప్పించుకొనేందుకు ప్రతి దేశం ప్రయత్నిస్తుంది. అదే పని చైనా కూడా చేస్తున్నది. కొన్ని వస్తువులను హాంకాంగ్ ద్వారా ఎగుమతి చేయిస్తున్నది, మరికొన్నింటిని మరికొన్ని దేశాల ద్వారా సరఫరా చేస్తున్నది. అనేక వస్తువుల మీద ఏ దేశంలో తయారైంది అన్న సమాచారమే ఉండదు. అలాంటపుడు ఫలానా వస్తువు చైనాది అని ఎవరు చెప్పగలరు ? చైనా నుంచి మన ఔషధ కంపెనీలకు, ఇతర పరిశ్రమలకు అవసరమైన బల్క్‌డ్రగ్స్, ముడిసరకులను కూడా దిగుమతి చేసుకుంటున్నాము. వినిమయ వస్తువులనే కాకుండా చైనా అంశ ఉన్న ప్రాణావసర ఔషధాలను కూడా కూడా బహిష్కరించాలా ?
మన ప్రధాని మేకిన్ ఇండియా అని పిలుపు ఇచ్చిన తరువాత కొన్ని చైనా కంపెనీలు మన దేశంలోనే పెట్టుబడులు పెట్టి సెల్‌ఫోన్లను తయారు చేస్తున్నాయి. ఆ కంపెనీలను కూడా మూయిస్తారా, ఆ ఫోన్లను కూడా బహిష్కరిస్తారా ? చైనాగాక ఇతర దేశాలు తయారు చేస్తున్న అనేక వస్తువులను కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాము. వాటిలో ప్రతిదానిలో ఏదో ఒక భాగం చైనాలో తయారైనదిగా ఉంటుంది. మరి వాటి పట్ల వైఖరి ఏమిటి ? అమెరికా, జపాన్, మన దేశ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు కూడా అక్కడ సంస్ధలను స్ధాపించి వస్తువులను ఉత్పత్తి చేయించి ఎగుమతులు చేస్తున్నారు. వాటిని చైనా ఉత్పత్తులుగా పరిగణించాలా మరొక దేశానివిగా భావించాలా ?
చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటంలో బాబా రామ్‌దేవ్ కూడా తక్కువ తినలేదు. చైనా వస్తువులను బహిష్కరించటం దేశానికి సేవ చేయటమేనని చెప్పారు. ఫోన్ నుంచి టిక్‌టాక్, షేర్‌ఇట్,విడ్‌మేట్ వంటి యాప్స్‌ను తొలగిస్తున్న ఒకవీడియోను ట్వీట్ చేశారు. చైనా వ్యతిరేకతలో భాగంగా జైపూర్‌కు చెందిన ఒక సంస్ధ ‘రిమూవ్ చైనా యాప్(చైనా యాప్‌లను తొలగించండి) అనే ఒక యాప్‌ను తయారు చేసి వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంచింది. దాన్ని తమఫోన్‌లో పెట్టుకున్నవారికి ఏవి చైనా యాప్‌లో అది తెలియ చేస్తుంది. కావాలనుకున్నవారు వాటిని తొలగించుకోవచ్చు.
ఈ యాప్‌ను తన దుకాణంలో అందుబాటులో ఉంచిన గూగుల్ ప్రస్తుతం దాన్ని తొలగించింది. అలాంటి యాప్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచటం దుకాణ విధానాలకు వ్యతిరేకమని పేర్కొన్నది. అందుబాటుల్లో ఉంచే ముందు దానికి తెలియదా అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఇదే కాదు టిక్‌టాక్‌కు ప్రత్నామ్నాయ తయారీ అంటూ మిత్రోం పేరుతో విడుదల చేసిన యాప్‌ను కూడా గూగుల్ నిలిపివేసింది. కాపీ యాప్‌ల తయారీ, విక్రయం తమ విధానాలకు వ్యతిరేకమని పేర్కొన్నది. అయితే చైనా వత్తిడి కారణంగానే గూగుల్ ఈ చర్యకు పాల్పడిందని కొందరు నెటిజన్లు సంస్ధ సిఇఓ సుందర్ పిచరు మీద విరుచుకు పడ్డారు. ఆయన దేశద్రోహా, దేశభక్తుడా ?
చైనా వస్తువులను బహిష్కరించాలి అని ప్రబోధిస్తున్న వారు, దానిని సమర్ధిస్తున్నవారు కాస్త ఉద్రేకాన్ని తగ్గించుకొని ఆలోచించాలి. సరిహద్దుతో మనకు సమస్యలున్నాయి గనుక ఆ దేశ వస్తువులను వద్దంటున్నారా ? లేక స్వదేశీ వస్తువులనే అడగండి అని మోడీ పిలుపు ఇచ్చారు కనుక వద్దంటున్నారా ? మొదటి అంశం అయితే ఏదో ఉద్రేకం అని సరిపెట్టుకోవచ్చు. రెండవది అయితే ఒక్క మూడుశాతం చైనాయేం ఖర్మ, యావత్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న 97శాతం వస్తువులు నిలిపివేస్తే మన వస్తువులు మనం కొనుక్కున్నట్లు అవుతుంది. అవి తయారు చేసేందుకు అవసరమైన పరిశ్రమలు, వాణిజ్యాన్ని పెంచుకున్నట్లు ఉంటుంది. దాని ద్వారా మన యువతకు ఉపాధి లభిస్తుంది. రాజకీయంగా ఆ దేశాలన్నీ కూడా మన కాళ్ల బేరానికి వస్తాయి కదా ! మరి ఆ పిలుపు ఎందుకు ఇవ్వటం లేదు ? దీన్లో కూడా రాజకీయాలు ఉన్నాయా ?
చైనా వస్తువులను బహిష్కరించాలని చెప్పేవారు వాటిని మన దేశంలోకి అనుమతిస్తున్న పాలకుల సంగతి ముందు తేల్చాలి. వారు దేశభక్తులో, ద్రోహులో నిలదీయాలి.ఒక వేళ అక్రమంగా సరిహద్దులు, సముద్రాలు దాటి వస్తుంటే మన భద్రతా దళాలు, నిఘా సంస్ధలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించాలి. అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నట్లుగా ఒకవైపు అనుమతించటం ఎందుకు, మరో వైపు బహిష్కరించమనటం ఏమిటి ? వాణిజ్యవేత్తల లాభాల కోసం దిగుమతులను అనుమతిస్తూ జనానికి దేశభక్తి, స్వదేశీ, ఓకల్ ఫర్ లోకల్ అని సొల్లు కబుర్లు చెబుతారా ? చైనా లేదా మొత్తం విదేశీ వస్తువులను కొన వద్దు అని ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు పిలుపు ఇవ్వరు ? యాభై ఆరు అంగుళాల ఛాతీ ఉప్పొంగటం లేదా ? ఒక్క వస్తువులనేనా లేక చైనా పెట్టుబడులను కూడా వద్దంటున్నారా ?
గేట్‌వే హౌస్ అనే ఒక సంస్ధ ఇటీవల ఒక నివేదికను ప్రచురించింది. మన దేశంలోని టెక్ అంకుర సంస్ధలలో నాలుగు బిలియన్ డాలర్ల చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడి ఉన్న 30 పెద్ద అంకుర సంస్ధలలో 18లో చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఫిబ్రవరిలో వెల్లడైన ఆ నివేదిక ప్రకారం మొత్తం 92 సంస్ధలలో చైనా నిధులు ఉన్నాయి. నరేంద్రమోడీ గారు అధికారానికి వచ్చిన తరువాత ఆ పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. చైనా పెట్టుబడులు ఉన్న కంపెనీలన్నింటికీ యజమానులు చైనీయులు లేదా అక్కడి మాతృసంస్ధలు కావు. అనేక మంది భారతీయులు, చైనీయులు కాని వారు మెజారిటీ వాటాదారులుగా ఉన్నారు. అంతే కాదు, మన దేశానికి చెందిన వారు తమ సంస్ధలలో పెద్ద ఎత్తున నష్టాలు వచ్చిన తరువాతనే విదేశీ పెట్టుబడులకు అవకాశం ఇచ్చారు. వాటిలో చైనీయులు, కాని వారు అందరూ ఉన్నారు. పేటిమ్‌కు 2019లో రూ.3,690 కోట్లు, ఫ్లిప్‌కార్ట్‌కు రూ.3,837 కోట్ల నష్టం వచ్చింది. వాటిలో చైనీయులు పెట్టుబడి పెట్టారు. ఉన్న ఫళాన సోనమ్ వాంగ్‌చుక్ వంటి వారు వారిని తట్టాబుట్టా సర్దుకుపొమ్మంటారా ? లేదా స్వదేశీ రామ్‌దేవ్ బాబా చైనా పెట్టుబడులను తిరిగి ఇచ్చి ఆ వాటాలను తన పతంజలి సంస్ధద్వారా కొనుగోలు చేయాలి.
2019 నివేదిక ప్రకారం మన దేశంలో ఫోన్ వినియోగదారులు డౌన్లోడ్ చేసుకున్న అగ్రశ్రేణి 50శాతం యాప్‌లలో చైనా పెట్టుబడులు ఉన్నాయి. మరి వాటిని కూడా ఫోన్ల నుంచి తొలగిస్తారా ? 2019తొలి మూడునెలల్లో మన దేశంలోని స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనా బ్రాండ్స్ 66శాతం ఆక్రమించాయి. వాటిని కొనుగోలు చేసిన వారెందరు తమ ఫోన్లను చెత్తబుట్టలో పడవేసి తమ దేశభక్తిని నిరూపించుకున్నారో ఎవరికి వారు పక్కవారిని పరిశీలించాలి. మార్కెట్లో ఏ దేశంలో తయారైందో ,బ్రాండ్‌లు తెలియని అనేక చైనా వస్తువులను ఇబ్బడి ముబ్బడిగా విక్రయిస్తున్నారు, జనం కొనుగోలు చేస్తున్నారు. మేడిన్ ఇండియా అనే ముద్రలేని వస్తువులన్నింటినీ మన ఇండ్ల నుంచి బయటపడవేద్దామా ? స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా స్వదేశీ నినాదం మేరకు అనేక మంది బ్రిటన్ గ్లాస్కో పంచెలు, చొక్కాలను ,కోట్లు సూట్లు తీసి వేసి జీవితాంతం ఖద్దరు ధరించారు. మహాత్మా గాంధీయే అందుకు నిదర్శనం. ఆయనకంటే గొప్ప దేశభక్తులం మేము అని చెప్పుకుంటున్నవారు ఆపని చేయలేరా ? మనకా పట్టుదల లేదా ? ఓకల్ ఫర్ లోకల్ నినాద మిచ్చిన నరేంద్రమోడీ, ఆయన మంత్రి వర్గ సహచరులు ముందు ఆపని చేశారా ? ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులా ?
ప్రపంచీకరణ యుగంలో ఒక దేశం మరొక దేశంలో కంపెనీలు ఏర్పాటు చేస్తోంది. అక్కడి నుంచి మూడో దేశంలో పెట్టుబడులు పెడుతోంది. వాటిని ఏ దేశానికి చెందినవిగా పరిగణించాలి. ఉదాహరణకు సింగపూర్, హాంకాంగ్, మలేషియా, మారిషస్ వంటి దేశాల్లో ఉన్న రాయితీలు, ఇతర సౌలభ్యాల కారణంగా అనేక సంస్ధలు అక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయి. పెట్టుబడులు కూడా అక్కడి నుంచే పెడుతున్నట్లు చూపుతున్నాయి.ఉదాహరణకు పేటిమ్‌లో చైనాకు చెందిన ఆలీబాబా సింగపూర్ హౌల్డింగ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టారు. మన నరేంద్రమోడీ సర్కార్ వాటిని సింగపూర్ పెట్టుబడులుగా కాగితాల మీద చూపింది తప్ప చైనావిగా కాదు. మరి ఇలాంటి వాటి గురించి ఏమంటారు. ఇక్కడ చెప్పవచ్చేదేమంటే ఒక పిలుపు ఇచ్చేటపుడు, దాన్ని బలపరచే ముందు బాధ్యతాయుతంగా ఆలోచించాలి.ప్రతిపోసుకోలు కబురును భుజానవేసుకోకూడదు. భక్తి దేవుడి మీద చిత్తం చెప్పుల మీద అన్నట్లుగా రామ్‌దేవ్ బాబా తన వస్తువులను మరింతగా అమ్ముకొనేందుకు ఇలాంటి పిలుపులను సమర్ధిస్తారు తప్ప మరొకటి కాదని గుర్తించాలి. ఈ రోజు ఉన్నఫళంగా చైనా వస్తువులను ఆపివేస్తే వాటి స్ధానంలో ఎవరి వస్తువులను కొనాలి. చైనా తప్ప మనకు అన్ని దేశాలూ మిత్రపక్షాలే అని చెబుతున్నవారు ముందు ఆ సంగతి తేల్చాలి. వారు చైనా ధరలకే మనకు అందచేస్తారా ? సోనమ్ వాంగ్ చుక్ చెప్పినట్లు చైనా కోసం పర్సుమూస్తే అధిక ధరలుండా మిగతాదేశాల వస్తువుల కోసం ఉన్న పర్సును ఖాళీ చేసుకొని అప్పులు చేయాలి. చిప్పపట్టుకు తిరగాలి. అందుకు సిద్దపడదామా ?
విదేశీ వస్తువులు అవి చైనావి అయినా మరొక దేశానికి చెందినవి అయినా వినియోగదారులు ఎందుకు కొంటున్నారు. కొన్నవారందరూ దేశద్రోహులు, విదేశీ సమర్ధకులు, తుకడే తుకడే గ్యాంగులు కాదు. దిగుమతి చేసుకొనే వస్తువుల మాదిరి చౌక ధరలు, నాణ్యతను మన దేశంలో తయారీదారులు అందిస్తే ఎవరూ విదేశీ బ్రాండ్లకు ఎగబడరు. చౌకగా వస్తువులు విక్రయించటానికి చైనా,జపాన్, దక్షిణ కొరియాకు సాధ్యమౌతోంది. అదే అమెరికా,బ్రిటన్‌లకు ఎందుకు కావటం లేదు? తమ అవసరాలకు మించి మిగతా దేశాలకు సరఫరా చేసేందుకు పెద్ద ఎత్తున సరకులు తయారు చేస్తున్న కారణంగా చైనా వంటి దేశాలకు ఉత్పాదక ఖర్చు తగ్గుతోంది. తమ జనాభా మొత్తానికి పని కల్పించాలి కనుక వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని సబ్సిడీల రూపంలో ఇచ్చి విదేశీ మార్కెట్‌ను పెంచుకొంటోంది. అన్నింటికీ మించి చౌకగా వస్తువులను ఎలా తయారు చేయాలి, ఉత్పాదకతను ఎలా పెంచాలి అనేందుకు అవసరమైన పరిశోధన, అభివృద్ది ఖర్చు చైనా, జపాన్, కొరియాల్లో ఎక్కువగా ఉంటోంది. గతంలో ఎవరి చేతుల్లో చూసినా కొరియా శాంసంగ్, ఫిన్లాండ్ నోకియా కనిపించేది. చైనా ఫోన్లు చౌకరకం, సరిగా పనిచేయవని అనే వారు. ఇప్పుడు ఎక్కడ చూసినా చైనా ఫోన్లే, పని చేయవు అనే ఫిర్యాదు లేదు. వాటి దెబ్బకు జపాన్ సోనీ, పానాసోనిక్, మన దేశానికి చెందిన మైక్రోమాక్స్ కనుమరుగయ్యాయి.ఇప్పుడు మన దేశంలో తయారవుతున్న అనేక ఫోన్లలో వాడుతున్నది చైనా విడిభాగాలే, వాటిని తయారు చేస్తున్నదీ మన దేశంలో ఏర్పాటు చేసిన చైనా కంపెనీలే మరి. వాటన్నింటినీ మూసివేస్తే మన ఆర్ధిక వ్యవస్ధకు, ఉపాధికి సైతం నష్టమే. పడవ నుంచి దూకాలనుకొనే ముందు పర్యవసానాలను ఆలోచించుకోపోతే ఏమౌతుందో తెలుసా ?
చైనా వస్తు బహిష్కరణ: వేయి వాట్సాప్‌లు – పదివేల పగటి కలలు !
03 Wednesday Jun 2020
Posted CHINA, Current Affairs, Economics, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized
in