Tags

, , ,


ఎం కోటేశ్వరరావు
ఆమె మేనకా గాంధీ. ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి, బిజెపి ఎంపీ. ఏ నేత చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు ఎన్నో పార్టీలు మారిన ఆమె రాజకీయ చరిత్రనుంచి యువతరం ఆదర్శంగా తీసుకోవాల్సిందేముందన్నది పెద్ద ప్రశ్న. ఇప్పుడు పెద్ద అబద్దాల కోరుగా తయారయ్యారు. కేరళలో మరణించిన ఒక ఏనుగు ఉదంతంలో మతవిద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి తాను ఇంకా రాజకీయంగా జీవించే ఉన్నా అన్నట్లుగా మీడియాలో మరోసారి వెలుగులోకి వచ్చారు.ఆమె చేసిన వ్యాఖ్యల గురించి బిజెపి స్పందించలేదు గనుక వాటిని ఆమోదించినట్లే భావించాలి. దేశంలో అనేకం జరుగుతున్నా మిన్నువిరిగి మీద పడ్డా చలించని అనేక మంది ప్రముఖులు ఏనుగు విషయంలో అపూర్వ స్పందన కనపరిచారు. వారిని ఆ మేరకు అభినందించాల్సిందే. అసలు స్పందించని వారికంటే వీరు మేలు, మనుషుల విషయంలో మాకేం పట్టదన్నట్లు మౌనంగా ఉన్నా బోలెడంత జంతు ప్రేమ ఉందని లోకానికి తెలిపారు. అలాంటి వారి చర్మాలు ఎప్పుడైనా పలుచనై మనుషుల మీద కూడా జాలి చూపే అవకాశం ఉంటుందని ఆశిద్దాం.
ఏనుగు దారుణంగా మరణించిందనే దాని కంటే అది కడుపుతో ఉందన్న వార్తకు జనంలో స్పందన ఎక్కువగా వచ్చినట్లు అనిపించింది. మీడియా కూడా దాన్నే ఎక్కువగా చూపింది. దేనికి రేటింగ్‌ ఎక్కువగా ఉంటే అదే ముఖ్యం కదా మరి ! ఈ వార్త, స్పందన చూడగానే వెంటనే గుజరాత్‌ బాబు బజరంగీ గుర్తుకు వచ్చాడు. అడవి పందుల నుంచి పంటలను కాపాడుకొనేందుకు అటవీ సమీప ప్రాంత రైతులు తీసుకొనే అనేక చర్యల గురించి మనకు తెలిసిందే. వాటికోసం, పొలాల చుట్టూ విద్యుత్‌ తీగలను అమర్చటం, పేలుడు పదార్ధాలను వినియోగించటం సర్వసాధారణం. కేరళలో కూడా అలా అమర్చిన ఒక పైనాపిల్‌ను అడవి పందులకు బదులు తిన్న ఏనుగు వాటిలో అమర్చిన టపాసులు పేలి గాయపడి మరణించి ఉండవచ్చన్నది ఒక కథనం. జంతు ప్రేమికులు పందుల మీద ఒక ప్రేమ ఏనుగుల మీద మరొక ప్రేమ ప్రదర్శిస్తారని ఇప్పుడు అర్ధమైంది. ఇక బాబు బజరంగీ అనే మానవ రూపంలో ఉన్న ఒక కాషాయ జీవి గుజరాత్‌ మారణకాండ సమయంలో ఇతర కాషాయ తాలిబాన్లతో కలసి దాడుల్లో పాల్గొన్నాడు. సామూహిక హత్యలు, దహనకాండకు పాల్పడిన నర రూప రాక్షసుల్లో ఒకడు. కౌసర్‌ బాను అనే ఒక గర్భిణీ అతగాడి కంటపడింది. ఇంకేముంది చేతిలోని బాకుతో ఆమె పొట్టను చీల్చి కడుపులోని పిండాన్ని దానితో పైకి లేపి వికటాట్టహాసం చేసి ఉంటాడు. కేరళ ఏనుగు ఎంతబాధ పడి మరణించిందో ఊహించుకొని స్పందించిన వారి మాదిరే బజరంగీ కూడా చేసి ఉండాలి, లేకపోతే అలాంటి వారికి కిక్కు ఉండదు. తరువాత తామెలా చంపిందీ హవభావాలతో ఒక మీడియా సంస్ధకు వివరించాడు కూడా !
పంటలను కాపాడుకొనేందుకు పేలుడు పదార్ధాలను పెడితే ఆ పేలుడు శబ్దాలకు లేదా పేలుడుతో గాయపడి జంతువులు పంటల జోలికి రాకుండా పారిపోతాయని రైతులు భావిస్తారు. మరి బజరంగీ ఎవరిని రక్షించటానికి ఒక గర్భిణీపై అంతదుర్మార్గంగా వ్యవహరించాడు ? కేరళ ఏనుగు మరణానికి పరోక్ష కారకులుగా భావిస్తున్నవారందరూ తమ పదవులకు రాజీనామా చేయాలని మేనకా గాంధీ డిమాండ్‌ చేశారు. ఒక ఉదంతం జరిగినపుడు ఎవరైనా, దేన్నయినా డిమాండ్‌ చేసే హక్కు కలిగి ఉంటారు, మేనకా గాంధీ అందుకు మినహాయింపు కాదు. ఒక స్త్రీగా, తల్లిగా గర్భ సమయంలో ఎలా ఉంటుందో ఆమెకు చెప్పనవసరం లేదు. మరి కౌసర్‌బీని అత్యంత అమానుషంగా హత్య చేసిన ఉదంతంపై ఆమె స్పందన ఏమిటి ? దాన్ని ఖండించినట్లు, ఏవైనా డిమాండ్లు చేసినట్లు ఆధారాలుంటే ఏవరైనా తెలియచేయాలని మనవి. ఎందరినో అన్యాయంగా పొట్టన పెట్టుకున్న దారుణాలకు నైతిక బాధ్యత వహించి ముఖ్య మంత్రిగా ఉన్న నరేంద్రమోడీతో సహా ఎవరూ రాజీనామా కాదు కాదు కనీసం అయ్యోపాపం అని కూడా అనలేదు. గట్టిగా చెప్పే ధైర్యం లేక లేదా చిత్తశుద్ధి లేక గానీ నాడు ప్రధానిగా ఉన్న వాజ్‌పారు కేవలం రాజధర్మాన్ని పాటించమని మాత్రమే నరేంద్రమోడీకి చెప్పారు. ఈ రోజు గర్భంతో ఉన్న ఏనుగు మృతికి స్పందించిన వారు అప్పుడు తామెలా స్పందించిందీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటారా ?
కౌసర్‌బాను కేసులో తీర్పు చెప్పిన న్యాయమూర్తి జ్యోత్సా యాగ్నిక్‌ తన తీర్పులో గర్భిణి మీద బజరంగీదాడి చేశాడు గానీ ఆమె కడుపులోని పిండాన్ని కత్తితో బయటకు తీసి ఉండడు, ముస్లింల మీద ద్వేషంతో దాడి చేశాడు తప్ప పుట్టబోయే బిడ్డను అడ్డుకొనేందుకు కాదు అని చెప్పారు. తన సోదరి కడుపును బజరంగీ చీల్చాడని 14ఏండ్ల ఆమె సోదరుడు చెప్పిన సాక్ష్యాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. అలాంటి పని శిక్షణ పొందిన వైద్యులు లేదా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తులు మాత్రమే చేయగలరని బజరంగీ అలా చేశాడని తాను నమ్మటం లేదని, కత్తితో పొడిచినపుడు బయటకు వచ్చిన రక్త మాంసాలను చూసి పిండం బయటకు వచ్చిందని అనుకొని ఉండవచ్చని, బజరంగీకి ఆ ఉద్దేశం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. కౌసర్‌బీ మీద దాడి తరువాత ఆమెను అక్కడే సజీవదహనం చేశారు కనుక పోస్టు మార్టం చేసే అవకాశం లేకుండా పోయింది. తెహల్కా రహస్య శోధనలో ఆ ఉదంతం గురించి బజరంగీ పూసగుచ్చినట్లు చెప్పాడు. ఈ దారుణం గురించి మేనకా గాంధీ లేదా ఏనుగు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేసినట్లు నాకు ఎక్కడా సమాచారం దొరకలేదు.
ఇక కేరళ ఏనుగు ఉదంతం జరిగింది పాలక్కాడ్‌ జిల్లాలో అని తెలిసిన తరువాత కూడా మలప్పురం జిల్లా, అక్కడి పౌరుల గురించి చేసిన దుర్మార్గ పూరితమైన వ్యాఖ్యల పట్ల కనీసం విచారం కూడా మేనకా గాంధీ నుంచి ఇంతవరకు వెలువడలేదు. ఆమె మీద ఒక కేసు దాఖలైనట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు ఆమె తన వ్యాఖ్యలను ఎలా సమర్దించుకుంటారో చూద్దాం. ఈ ఉదంతంలో బిజెపి మత రాజకీయాలకు ఎలా పాల్పడిందో విజ్ఞులైన వారు గ్రహిస్తారని అనుకుంటున్నాను. మలప్పురం దేశంలో అత్యంత హింసాత్మక,హీనమైన జిల్లా అని ఎఎన్‌ఐ అనే వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మేనకా గాంధీ వర్ణించారు. అక్కడ మెజారిటీ పౌరులు ముస్లింలు కావటం, ఆమెలో వారి పట్ల ఉన్న విపరీత ద్వేషం తప్ప అంతటి సీనియర్‌ నేత వాస్తవాల ప్రాతిపదికన అలాంటి బాధ్యతా రహిత వ్యాఖ్య చేయలేదు.అత్యంత కల్లోల జిల్లాలో అదొకటని రోజూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందని, అక్కడ జరిగేవాటి మీద చర్యలు తీసుకొనేందుకు ప్రభుత్వం భయపడుతుందని, అత్యంత బలహీనమైన అధికారులను అక్కడ నియమిస్తుందని ఇంకా అలాంటి అనేకం ఆమె నోటి నుంచి జాలువారాయి.(హైదరాబాదు పాతబస్తీలో మజ్లిస్‌ గురించి బిజెపి నేతలు నిత్యం చేసే విమర్శలు అచ్చం ఇలాగే ఉంటాయి) హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు,అత్యాచారాల వంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నట్లు కేంద్రం గుర్తించి మూడు వందల అగ్రశ్రేణి జిల్లాల్లో మలప్పురం లేదని మేనకా గాంధీకి, ఆమె తప్పుడు ప్రచారాన్ని గుడ్డిగా నమ్మిన వారికి ఎవరు చెబుతారు. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన పిలిభిత్‌, ప్రస్తుతం ఎన్నికైన సుల్తాన్‌పూర్‌ జిల్లాల్లో నేరాల సంగతి అయినా ఆమెకు తెలిసి ఉంటే ఇలా మాట్లాడి ఉండేవారు కాదు.
కేరళలో ప్రతి ఏటా ఆరువందల ఏనుగులను చంపివేస్తున్నారని కూడా మేనక ఆరోపించారు.అది కూడా పచ్చి అబద్దమే. దేశం మొత్తంలో కూడా అన్నింటిని చంపలేదు. పార్లమెంట్‌లో తమ ప్రభుత్వం స్వయంగా వెల్లడించిన సమాచారం కూడా ఆమెకు తెలియదు.2016-17 నుంచి 2018-19 వరకు దేశంలో 314 అటవీ ఏనుగులను చంపివేసినట్లు ఈ ఏడాది మార్చి 20న పార్లమెంట్‌కు తెలిపారు. వాటిలో కేరళలో మూడు సంవత్సరాలలో కేవలం 21 మాత్రమే కాగా బిజెపి ఏలుబడిలోని అసోంలో అత్యధికంగా 90 ఏనుగులను చంపివేశారని ఆ పార్టీ వారికి ఎవరు చెబుతారు.
అంతే కాదు తరువాత ఆమె ఇండియా టుడే టీవీతో మాట్లాడుతూ మలప్పురంలో ఎక్కడో రెండు మూడు చోట్ల కొందరు బాంబులు తయారు చేస్తున్నారు.ఈ రోజు ఏనుగుకు బాంబు పెట్టిన వారు రేపు మనుషులకు పెడతారు అన్నారు. మేనకా గాంధీ అంటే ఉద్యోగం లేక నిరాశతో, వయసు పైబడి , మతి తప్పి కేరళలో ఏ జిల్లా ఏమిటో తెలియని స్ధితిలో ఉన్నారనుకుందాం,కేంద్ర అటవీ, వన్య ప్రాణిశాఖ మంత్రి ప్రకాష జవదేకర్‌ సైతం ఉదంతం ఏ అడవిలో జరిగిందో తెలుసుకోకుండా మలప్పురం అని నోరు పారవేసుకున్నారు.
2017లో జరిగిన ఏనుగుల సర్వే ప్రకారం దేశం మొత్తం మీద 29,964 ఉన్నాయి.వాటిలో కేరళలో 5,706 ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన ఒక అఫిడవిట్‌ ప్రకారం దేశంలో 2,454 మచ్చిక చేసుకున్న ఏనుగులు ఉన్నాయి. వాటిలో 1,809 ప్రయివేటు వ్యక్తులు, దేవాలయాలు, సర్కస్‌ కంపెనీలలో ఉండగా మిగిలినవి జంతు ప్రదర్శన శాలల్లో ఉన్నాయి. ఈ ఏనుగుల్లో రాష్ట్రాల వారీ అసోంలో 905, కేరళలో 518, కర్ణాటకలో 184, తమిళనాడులో 138 ఉన్నాయి. తరువాత కేంద్రం పార్లమెంట్‌కు సమర్పించిన సమాచారం ప్రకారం ప్రయివేటు వ్యక్తులు మచ్చిక చేసుకున్న ఏనుగులు 1,774 అని పేర్కొన్నారు. మరి కేరళలో ఏటా ఆరువందల ఏనుగులను చంపుతున్నట్లు పోసుకోలు సమాచారం తప్ప మేనకా గాంధీ ఏ ఆధారంతో చెప్పినట్లు ?
దేవాలయాల్లో ఉన్న ఏనుగులను కాళ్లను ఇరగ్గొట్టి, కొట్టి, ఆకలితో మాడ్చి, ఇతరంగా చంపుతున్నట్లు కూడా మేనకా గాంధీ పేర్కొన్నారు. అలాంటి ఉదంతాలు జరిగినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. జంతు ప్రేమికురాలిగా మేనకా గాంధీ అలాంటి దారుణాలకు పాల్పడిన దేవాలయ సిబ్బంది లేదా ప్రయివేటు వ్యక్తుల మీద ఎందుకు ఫిర్యాదు చేయలేదు. దేవాలయాల జోలికి పోవటానికి ఆమెకు భయమెందుకు ? ఒక్క ఉదంతంలో అయినా ఆమె మంత్రిగా ఉండగా, లేనపుడు ఒక వ్యక్తిగా తీసుకున్న చర్య ఏమిటో చెప్పగలరా ? ఇప్పుడెందుకు ఏనుగు మీద అంత ప్రేమ పుట్టుకు వచ్చింది, పీనుగు రాజకీయాల ద్వారా ఆమె ఏమి ఆశిస్తున్నట్లు ?