Tags

, ,



ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ను చైనాయే సృష్టించిందనో, దాని ప్రయోగాల్లో పొరపాటున బయటకు వచ్చిందనో రకరకాలుగా ఏదో విధంగా బాధ్యతను అంట కట్టి దోషిగా నిలిపేందుకు ఇప్పటికీ అమెరికా వంటి దేశాలూ, వాటి కనుసన్నలలో నడిచే మీడియా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. మన దేశంతో సహా అనేక చోట్ల కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తమ ప్రభుత్వం కరోనా నిరోధానికి కఠినంగా వ్యవహరించినట్లు కొందరు తొలి రోజుల్లో భావించినా అమెరికా, ఐరోపా దేశాలు, బ్రెజిల్‌ తదితర దేశాల్లో పెరుగుతున్న కేసులు, మరణాలను చూసి తమ ప్రభుత్వం చేసింది సరైనదే అని పార్టీ, ప్రభుత్వం పట్ల మరింతగా చైనీయులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరోనా నిరోధానికి తీసుకోవాల్సిన చర్యల గురించి నివారించిన చైనా అనుభవాలను పరిగణనలోకి తీసుకోకపోతే నష్టం ఆయా దేశాల జనాలకే. మహమ్మారులు ప్రబలిన సమయంలో సుభాషితాలు చెప్పటం, చప్పట్లు కొట్టించటం, దీపాలు ఆర్పటం-హారతులు వెలిగించట కాదని, తమ సభ్యులను కదన రంగంలోకి దింపటం ముఖ్యమని చైనా కమ్యూనిస్టు పార్టీ వెల్లడించింది. ఈ నేపధ్యంలో కరోనాను ఎలా కట్టడి చేసిందీ వివరిస్తూ చైనా సమాచారశాఖ ఈనెల ఏడవ తేదీన ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. అరవై అయిదు పేజీలు ఆ పత్రంలోని అంశాల సారాంశం దిగువ విధంగా ఉంది.(పూర్తి పాఠం చదవాలని ఆసక్తి కనపరిచే వారి సౌకర్యం కోసం దాని లింక్‌ను చివరిలో చూడవచ్చు)
1949లో చైనా ప్రజారిపబ్లిక్‌ను స్ధాపించిన తరువాత కోవిడ్‌19 ఒక పెద్ద ప్రజారోగ్య అత్యవసర పరిస్దితిగా ముందుకు వచ్చింది. మరొకటేదీ ఇంత వేగంగా వ్యాపించలేదు, నిరోధించటం ఎంతో కష్టం అని రుజువు చేసింది. చైనా కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వం దీనికి అగ్రశ్రేణి ప్రాధాన్యత ఇచ్చాయి.అది చైనీయుల విశ్వాసాన్ని పదిలపరచింది.బాధాకరమైన ప్రయత్నాలు, ఎంతో మూల్యం చెల్లించాల్సి వచ్చినా చైనా తన పౌరులను రక్షించుకుంది. ఏ తేదీన ఏమి జరిగిందీ అని చైనా చెబుతున్నప్పటికీ అనేక మంది ఆ సమాచారాన్ని అనుమానంతో చూస్తున్నారు. మరి కొందరు చూస్తూనే ఉంటారు. గతంలో తాము సాధించిన అభివృద్ది గురించి చైనా ప్రకటిస్తే అదంతా అంకెల గారడీ అని చెప్పిన వారున్నారు. ఇప్పటికీ నమ్మని వారి సంగతి సరే సరి. తీరా నమ్మక తప్పని పరిస్ధితి వచ్చినపుడు ఆ అక్కడ కమ్యూనిస్టు నియంతృత్వం కనుక సాధ్యమైంది, మనది ప్రజాస్వామ్యం అని వైఫల్యాన్ని సమర్దించుకుంటున్నారు. కరోనా విషయంలో కూడా అదే జరుగుతోంది. వైరస్‌ కట్టడికి అక్కడి కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వం ఏ చర్యలను ఎలా అమలు జరిపిందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోని కారణంగా అనేక దేశాల పాలకులు తమ పౌరుల ప్రాణాలను ఫణంగా పెట్టారు. ఇప్పటికీ నేర్చుకొనేందుకు ముందుకు రావటం లేదు. అభివృద్ధి వైఫల్యాన్ని ప్రజాస్వామ్య ముసుగులో దాచి పెడుతున్న మేథావులమని చెప్పుకొనే వారు ప్రాణాలను బలి పెట్టకుండా మీరు చెప్పే నియంతృత్వ చైనాలో ఎలా కట్టడి చేశారో కనీసం తెలుసుకొనేందుకు పూనుకుంటారా ? మేథావులు అనేక మంది ప్రతిసారీ బస్సు మిస్సవుతున్నారు కనుక వారిని వదలి వేద్దాం. సామాన్యుల కోసం చైనా ప్రభుత్వం వెల్లడించిన శ్వేతపత్రంలోని అంశాల సారాంశం దిగువ విధంగా ఉంది.(స్ధలాభావం రీత్యా ఏ రోజు ఏమి జరిగిందీ అనే సమాచారాన్ని ఇవ్వటం లేదు. ఎలా అరికట్టారనే భాగానికే ఇది పరిమితం)
వైరస్‌ తొలుత బయటపడిన ఊహాన్‌ నగరంలోని 4.21 మిలియన్ల కుటుంబాలలో ఏ ఒక్కదానిని, కుటుంబంలో ఏ ఒక్కరినీ వదల కుండా వైరస్‌ పరీక్షలు చేశారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష వ్యవధిని రెండు రోజుల నుంచి 4-6 గంటలకు తగ్గించారు. తొలి రోజుల్లో రోజుకు 300 పరీక్షలు చేస్తే ఏప్రిల్‌ మధ్యనాటికి 50వేలకు చేరింది. నివాసులందరూ ప్రతి రోజూ ఆరోగ్య పరిస్ధితి ఎలా ఉందో అధికారులకు తెలియచేయాలని కోరారు. మరోవైపున సామాజిక కార్యకర్తలు ఆ సమాచారాన్ని నిర్ధారించుకొనేందుకు ఇంటింటికీ తిరిగారు. జ్వరాల ఆసుపత్రులలో పరీక్షలు చేసిన సమాచారాన్ని రెండు గంటల్లోగా ఉన్నతాధికారులకు చేరవేయాలని కోరారు. పరీక్షా ఫలితాలను పన్నెండు గంటలలో వెల్లడించారు. ఇరవైనాలుగు గంటలలో నిర్ధారిత పరీక్షలను పూర్తి చేసి రోగులను గుర్తించి ఆసుపత్రులకు తరలించారు.
ఉహాన్‌ నుంచి వచ్చిపోయే అన్ని రకాల దారులను పూర్తిగా మూసివేశారు.హువెరు రాష్ట్రం, వెలుపల ఉన్న ప్రాంతాలలో కేసుల తీవ్రతను బట్టి ఆంక్షలను అమలు జరిపారు. వైద్యపరమైన అత్యవసరాలకు మినహా గృహస్తులు ఇతర అవసరాలకు బయటకు రాకుండా కట్టడి చేశారు. సామాజిక కార్యకర్తలు వారికి అవసరమైన రోజు వారీ అవసరాలను తీర్చే ఏర్పాట్లు చేశారు. పరిమిత రాకపోకలను అనుమతించిన ఇతర ప్రాంతాలలో రాక-పోక సమయాల్లో శరీర ఉష్ణ్రోగ్రతలను విధిగా నమోదు చేశారు. దేశవ్యాపితంగా నిరోధ చర్యల్లో భాగంగా వీటితో పాటు ఇతర చర్యలను అమలు జరిపారు, అందుకు అవసరమైన వైద్య, ఇతర సదుపాయాలను అత్యవసర ప్రాతిపదికన మెరుగుపరిచారు.
దేశవ్యాపితంగా పదివేల ఆసుపత్రులను కోవిడ్‌-19 చికిత్సకు ప్రత్యేకించి అవసరమైన వసతులు కల్పించారు.ఆన్‌లైన్‌ ద్వారా అవసరమైన సాంకేతిక మద్దతు అందించారు. ప్రధాన కేంద్రమైన ఉహాన్‌లో 80శాతం కేసులు తీవ్రమైనవి కాదు. అయినా ఎటుపోయి ఎటు వస్తుందో అన్న ముందు జాగ్రత్తగా పద్నాలుగువేల పడకలతో స్టేడియాలు, ప్రదర్శన కేంద్రాలలో 16 తాత్కాలిక చికిత్స ఏర్పాట్లు చేశారు. నివారణలో ఇవి ప్రధాన పాత్ర పోషించాయి. ఆరోగ్యవ్యవస్ధ మీద వత్తిడిని తగ్గించటంలో ఇవి కీలక పాత్ర పోషించినట్లు బ్రిటీష్‌ వైద్య పత్రిక లాన్‌సెట్‌ పేర్కొన్నది. రోగ నిర్ధారణ, చికిత్సలో సంప్రదాయ చైనా వైద్య పద్దతులు, ఔషధాలను, ఆధునిక వైద్య పద్దతులు, ఔషధాలను రెండింటినీ వినియోగించారు. కొన్ని సంప్రదాయ చైనా వైద్య ఆసుపత్రులలో పూర్తిగా రోగులకు చికిత్స చేశారు, దానితో పాటు ప్రతి ఆసుపత్రిలోనూ ఆ వైద్య నిపుణులను అందుబాటులో ఉంచారు. తీవ్రత తక్కువ ఉన్న కేసులను ఈ ఆసుపత్రులలో చికిత్స చేసి తీవ్రమైన వారిని ఆధునిక వైద్య ఆసుపత్రులకు పంపారు. ఇందుకోసం ఈ రంగ వైద్య నిపుణులతో ఒక జాతీయ సమన్వయ సంస్ధను ఏర్పాటు చేశారు. తొంభై రెండుశాతం నిర్ధారిత కరోనా కేసులలో చైనా మూలికా ఔషధాలను వినియోగించారు. హుబెరు రాష్ట్రంలో చికిత్స పొందిన 90శాతం కేసులలో అవి సమర్దవంతంగా పని చేసినట్లు తేలింది.
కేంద్ర, రాష్ట్ర, స్ధానిక ప్రభుత్వాలన్నీ కలసి మే31 నాటికి 162.4 బిలియన్‌ యువాన్లు మహమ్మారి నివారణ, చికిత్సకు కేటాయించారు. బీమా కంపెనీలు పరిష్కరించిన యాభై ఎనిమిది వేల మంది ఆసుపత్రి చికిత్స బిల్లులను విశ్లేషించినపుడు సగటున ఒక్కొక్కరికి 23వేల యువాన్లు కాగా, తీవ్ర పరిస్ధితికి చేరిన వారికి లక్షా 50వేలు దాటింది. ఒక యువాను మన కరెన్సీలో పది రూపాయలకు పైగా విలువ కలిగి ఉంది. కొన్ని సంక్లిష్ట కేసులలో పది లక్షల యువాన్ల వరకు ఖర్చయింది. వ్యక్తులకు అయిన ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించింది.
మే 31వ తేదీనాటికి చైనా కేంద్ర సమాచార మండలి 161 పత్రికా సమావేశాలను ఏర్పాటు చేసింది. పద్నాలుగు వందల ప్రశ్నలకు 50శాఖల అధికారులు సమాధానాలు చెప్పారు. ఇవిగాక హుబెరు రాష్ట్రంలో 103 పత్రికా గోష్టులు ఏర్పాటు చేయగా ఇతర చోట్ల మరో 1050 నిర్వహించారు.మరోవైపు వాక్సిన్‌తో సహా కరోనా వైరస్‌కు సంబంధించి వివిధ అంశాలపై పరిశోధన మరియు అభివృద్దికి గాను కొత్తగా 83 కార్యక్రమాలను ప్రారంభించారు.
పౌరుల ప్రాణాలు, ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఆర్ధికంగా ఖర్చు గురించి ఆలోచించకుండా అనేక కఠిన చర్యలు తీసుకున్నది.” భారీ సామాజిక, ఆర్ధిక నష్టంతో చైనా విజయం వచ్చింది.ఆరోగ్యం మరియు ఆర్ధిక రక్షణ మధ్య ఉండాల్సిన సమతూకాన్ని సాధించేందుకు చైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది” అని లాన్‌సెట్‌ సంపాదకీయం పేర్కొన్నది. ఒకటిన్నర రోజు పసి గుడ్డు నుంచి వంద సంవత్సరాల పండు ముదుసలి వరకు ఖర్చు ఎంతైనా సరే ప్రాణాలను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది.చికిత్సకు, మరణాలను తగ్గించేందుకు ప్రాధాన్యత ఇచ్చింది.కరోనా తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు దేశంలోని నిపుణులైన వైద్యులు, సిబ్బందిని తరలించింది. ఊహాన్‌లో తీవ్ర స్ధితిలో ఉన్న 9,600 రోగులకు చికిత్స అందించారు.
బతికేందుకు ఏమాత్రం అవకాశం ఉన్నప్పటికీ ఖర్చుకు వెనుకాడకుండా వైద్యులు అన్ని ప్రయత్నాలు చేశారు. మే 31 నాటికి ఏడుగురు శతాధిక వృద్దులతో సహా 80 ఏండ్లు దాటిన మూడువేల మంది ప్రాణాలను రక్షించారు. వారిలో డెబ్బయి ఏండ్ల రోగి ఒకరికి పది మంది సిబ్బంది అనేక వారాల పాటు చికిత్సలో పాల్గొన్నారు. అందుకు పదిహేను లక్షల యువాన్లు ఖర్చు కాగా మొత్తం ప్రభుత్వమే భరించింది. వివిధ దేశాలలోని ప్రవాస చైనా విద్యార్ధులకు పదిలక్షల ఆరోగ్య కిట్లను చైనా పంపింది.
జనవరి 24 నుంచి మార్చి 8వ తేదీ వరకు హుబెరు రాష్ట్రంలోని ఊహాన్‌, మరో 16 పట్టణాలకు ఇతర ప్రాంతాలకు దేశమంతటి నుంచీ అన్ని రకాల వైద్య వనరులను సమీకరించారు, 346 జాతీయ వైద్య బృందాలలో 42,600 సిబ్బంది ఉన్నారు. వీరుగాక 900 మంది ప్రజారోగ్య నిపుణులు ఉన్నారు. చైనా ప్రజావిముక్త సైన్యం(పిఎల్‌ఏ) నుంచి నాలుగువేల మంది వైద్య సిబ్బందిని సమీకరించారు. ఆదేశాలిచ్చిన రెండు గంటల్లోనే బృందాలను ఏర్పాటు చేయటం, 24గంటల్లోగా నిర్దేశిత కేంద్రాలకు చేరటం ఏడు రోజులకు సరిపడా రక్షణ సామాగ్రితో వచ్చిన వెంటనే చికిత్స అందించటం ఆ బృందాల ప్రత్యేకత.
నలభైవేల మంది నిర్మాణ కార్మికులను రప్పించి వేయిపడకల ఆసుపత్రిని అన్ని రకాల పరికరాలతో పది రోజుల్లో, మరో 1600 పడకల ఆసుపత్రిని పన్నెండు రోజుల్లో నిర్మించారు.మరో 14వేల పడకల తాత్కాలిక ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేశారు.పది రాష్ట్రాల నుంచి 45వేల ఎర్ర రక్తకణ యూనిట్లు, 1762 ప్లేట్‌లెట్స్‌ డోస్‌లు, 1370 లీటర్ల గడ్డకట్టించిన ప్లాస్మాను సిద్ధం చేశారు. ఏ రకమైన వైద్య పరికరాలు, ముఖతొడుగులు,ఔషధాలకు కొరత రాకుండా ఉత్పత్తికి ఏర్పాటు చేశారు. చికిత్సా సమయంలో 17రకాల, వాక్సిన్లు, ఔషధాలను(క్లినికల్‌ ట్రయల్స్‌, వినియోగం) వినియోగించేందుకు అధికారులు అనుమతులు ఇచ్చారు. దేశవ్యాపితంగా నిరాటంకంగా ఎక్కడకు అవసరమైతే అక్కడకు తరలించే సమన్వయ వ్యవస్ధలను ఏర్పాటు చేశారు.
ఉహాన్‌ నగరంలో కోటి మంది, ఇతర ప్రాంతాల్లో లాక్‌డౌన్‌లో ఉన్న జనాలకు అవసరమైన ధాన్యం, కూరగాయలు, నూనెలు, పాలు, గుడ్లు, మాంసం తదితర నిత్యావసర వస్తువులను సరఫరా చేసేందుకు తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 500 సంస్దలతో సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు.
చైనా ప్రధాన భూభాగంలోనూ, తైవాన్‌, హాంకాంగ్‌, మకావు ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో ఉన్న చైనీయులు పెద్ద ఎత్తున స్పందించి 38.93 బిలియన్‌ యువాన్లు, 990 మిలియన్ల వస్తువులను విరాళంగా అందచేశారు. లాక్‌డౌన్‌తో పాటే చిన్న వ్యాపారులు, పారిశ్రామికవేత్తల మీద భారాలు తగ్గించటం, ప్రభుత్వ సబ్సిడీల పెంపు, ఉపాధి స్ధిరీకరణ, ప్రభుత్వ సేవల మెరుగుదల వంటి అనేక చర్యలను తీసుకుంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత తమ పని స్ధలాలకు చేరేందుకు వలస కార్మికులకు ప్రత్యేక రైళ్లు, విమానాలను ఏర్పాటు చేశారు. ఏప్రిల్‌ చివరి నాటికి ఏడాదికి రెండు కోట్ల యువాన్ల ఆదాయం వచ్చే కంపెనీలలో 99శాతం పనిలోకి వచ్చాయి. తీవ్రంగా ప్రభావితమైను హుబెరు రాష్ట్రంలో కూడా 98.2శాతం సంస్ధలు తిరిగి పని చేస్తుండగా 92.1శాతం కార్మికులు విధుల్లో చేరారు. ప్రజా రవాణా పూర్తిగా పునరుద్దరణ అయింది. యావత్‌ ప్రజాజీవనం సాధారణ స్ధాయికి చేరుకుంది.
హుబెరు రాష్ట్రంలోని 5,40,000 ఆరోగ్య కార్యకర్తలు, బయటి నుంచి వచ్చిన నలభైవేల మంది పౌర, మిలిటరీ వైద్య సిబ్బంది, మిలియన్ల కొలది ఆరోగ్య సిబ్బంది కరోనాను అడ్డుకొనేందుకు మరో గ్రేట్‌ వాల్‌ నిర్మించారు. పుట్టుకతో ఎవరూ వీరులు కాదు. ఈ పోరులో రెండువేల మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది, అనేక మంది మరణించారు. కరోనా పోరులో సామాన్య జనాన్ని సిద్దం చేసేందుకు, వారిని ఆదుకొనేందుకు 6,50,000 పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు, రోగులను గుర్తించేందుకు, పౌరుల రోజువారీ సమస్యల పరిష్కారానికి 40లక్షల మంది సామాజిక కార్యకర్తలు పని చేశారు. పద్దెనిమిది లక్షల మంది పారిశుధ్యకార్మికులు బహిరంగ స్ధలాలు, ముఖ్యమైన ప్రాంతాలను శుభ్రం చేయటంలోనూ, వైద్య, ఇతర చెత్తను సేకరించటంలోనూ పాలొన్నారు. పోలీసులు విధి నిర్వహణలో 130 మంది మరణించారు. వలంటీర్లుగా నమోదు చేసుకున్న 88లక్షల మంది 4,60,00 కార్యక్రమాల్లో 29కోట్ల గంటల పాటు సేవలు అందించారు.
చైనా కమ్యూనిస్టు పార్టీలో 46లక్షలకు పైగా ప్రాధమిక శాఖలు ఉన్నాయి.మహమ్మారిని ఎదుర్కోవటం,జనాన్ని సమీకరించటం, వారికి సేవ చేయటంలోనూ అవి గట్టిగా పని చేశాయి. మూడు కోట్ల 90లక్షల మంది పార్టీ సభ్యులు అగ్రగామి దళంగా ఉన్నారు. కోటీ 30లక్షల మంది వలంటీర్లుగా సేవలందించారు. సేవారంగంలో ముందున్న వారిని ఉన్నత స్ధానాల్లోకి ప్రమోట్‌ చేశారు,బాధ్యతా రహితంగా ఉన్నవారిని గుర్తించి చర్యలు తీసుకున్నారు. ఉత్పాతాల నుంచి కాపాడటంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం అత్యంత విశ్వసనీయంగా ఉంటుందని లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత సాధారణ జనం ఎంతగానో గ్రహించారు, రాజకీయ వ్య వస్ధ మీద తమ విశ్వాసాన్ని ప్రకటించారు. 170దేశాల నేతలు, 50 ప్రపంచ, ప్రాంతీయ సంస్దల అధిపతులు, 300 విదేశీ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు చైనాకు బాసటగా నిలిచాయి. డెబ్బరు ఏడు దేశాలు, పన్నెండు అంతర్జాతీయ సంస్ధలు అత్యవసర విరాళాలు అందచేశాయి.84దేశాల నుంచి వివిధ సంస్ధలు సాయాన్ని పంపాయి. బ్రిక్స్‌ అభివృద్ధి బ్యాంకు, ఏఐఐబి ఏడు,2.48బిలియన్‌ యువాన్ల చొప్పున అత్యవసర రుణాలు అందచేశాయి. నూటపది దేశాలకు చెందిన 240 పార్టీలతో కలసి చైనా కమ్యూనిస్టు పార్టీ సంయుక్త విజ్ఞాపనలు చేసింది. యాభై మంది నేతలు, అంతర్జాతీయ సంస్ధల అధిపతులతో దేశాధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ స్వయంగా మాట్లాడి చైనా తీసుకుంటున్న చర్యలను వివరించారు.
శ్వేత పత్రంలోని ముఖ్యాంశాలను పైన చూశాము. గత నెలలో అమెరికా వ్యాపింప చేసిన 24 అబద్దాలను తిప్పి కొడుతూ చైనా ఒక పత్రాన్ని విడుదల చేసింది. ఇప్పుడు కరోనాను ఎదుర్కొన్న తీరు తెన్నులను వివరిస్తూ శ్వేత పత్రాన్ని ప్రకటించింది. ఇంతవరకు ఏ దేశమూ ఇలాంటి చర్యలు తీసుకోలేదు. తాము తీసుకున్న చర్యలను అధికారికంగా విడుదల చేసి జనం ముందుంచటం కనీస బాధ్యత. వాటి మంచి చెడ్డలను జనం స్వయంగా తెలుసుకుంటారు. ప్రపంచంలో గతంలో అనేక మహమ్మారులు వచ్చాయి. అవి ముందుగా బయటపడిన దేశాలను అందుకు బాధ్యులుగా చేసి రచ్చ చేసిన ఉదంతం ఇదొక్కటే అని చెప్పవచ్చు. కరోనా వైరస్‌ దెబ్బలను ఎదుర్కొన్న ఒక బాధిత దేశంగా ఉన్న చైనా దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొని తానేమిటో, తన రాజకీయ వ్యవస్ధ ఔన్నత్యం ఏమిటో నిరూపించుకుంది. సాధారణ కార్యకలాపాలతో తిరిగి ముందుకు పోతున్నది.చైనా తీసుకున్న చర్యలను కూడా ఎవరైనా సహేతుకంగా విమర్శించవచ్చు, లోపాలను ఎత్తిచూపవచ్చు. ఇదే సమయంలో ఏ దేశం, ఏ పాలకులు బాధ్యతా రహితంగా వ్యవహరించి తమ పౌరుల ప్రాణాల మీదకు తెచ్చారో తెలుసుకోవటం పౌరుల హక్కులలో ఒకటి. అందుకే మిగిలిన దేశాలు కూడా తామేమి చేసిందీ ప్రపంచ జన కోర్టుకు చెప్పాలి. చైనాతో పోటీ పడుతున్నామని చెప్పుకుంటున్న, చైనా తరువాత జనాభా రీత్యా రెండవ స్ధానంలో ఉన్న మన పాలకుల మీద ఆ బాధ్యత మరింత ఎక్కువగా ఉందంటే ఏకీభవిస్తారా !
https://news.cgtn.com/news/2020-06-07/Full-Text-Fighting-COVID-19-China-in-Action-R7xr2aKsyA/index.html