Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు
ప్రధాని నరేంద్రమోడీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అంటే మోజు తీరలేదా ? మరిన్ని కౌగిలింతల కోసం తహతహలాడుతున్నారా ? అమెరికన్లకే మోజు తీరి రోజు రోజుకూ ట్రంప్‌ పలుకుబడి తగ్గిపోతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి, అదే నిజమైతే ఓడిపోయే ట్రంప్‌తో కలసి ఊరేగేందుకు మోడీని మన పాలకవర్గాలు అంగీకరిస్తాయా ? ఒక వేళ డెమోక్రాట్లు గెలిస్తే తమకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేసిన నరేంద్రమోడీతో ఎలా వ్యవహరిస్తారు ? ఏడు ధనిక దేశాల(జి7) బృందంలో చేరినంత మాత్రాన మనది ధనిక దేశంగా మారుతుందా ? ఆ బృందం ఏర్పడిన నాటి కంటే నేడు ప్రభావం తగ్గిన నేపధ్యంలో దానిలో చేరినంత మాత్రాన మనకు ఒరిగేదేమిటి? మన కంటే పెద్ద ఆర్ధిక వ్యవస్ధ కలిగిన చైనాను పక్కన పెట్టి డోనాల్డ్‌ ట్రంప్‌ మనమీద ఎందుకు శ్రద్ద చూపుతున్నాడు? ఆ బృందాన్ని చైనా వ్యతిరేక వేదికగా చేసేందుకు ట్రంప్‌ పూనుకున్నాడన్నది బహిరంగ రహస్యం, అలాంటి దానితో చేరి చైనాతో వ్యతిరేకతను కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా ?చేరినంత మాత్రాన మనకు ఒరిగేదేమిటి ? అటు జి7, ఇటు జి20 రెండింటిలో కొనసాగితే మిగిలిన దేశాల వైఖరి ఎలా ఉంటుంది ? ఇలాంటి ఎన్నో భట్టి విక్రమార్క ప్రశ్నలు మన ముందుకు వస్తున్నాయి.
1973లో తలెత్తిన చమురు సంక్షోభ పర్యవసానాలతో ఏం చెయ్యాలా అన్న ఆలోచన తలెత్తి అమెరికా చొరవతో పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ సమావేశానికి అమెరికా అధ్యక్షభవనంలోని గ్రంధాలయం వేదిక అయింది. దాంతో నాలుగు దేశాలను గ్రంధాలయ బృందం అని పిలిచారు. తరువాత జపాన్‌ను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. అలా అది జి5 అయింది. తరువాత ఇటలీ, కెనడాలను చేర్చుకున్న తరువాత జి7 అయింది.1977 నుంచి ఐరోపా యూనియన్‌ను శాశ్వత ఆహ్వానితురాలిగా చేర్చారు. సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత పూర్వపు రష్యా తిరిగి ఉనికిలోకి వచ్చింది.1998లో రష్యాను చేర్చుకోవటంతో జి8గా మారింది. 2014లో ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియాను రష్యా తనలో విలీనం చేసుకోవటంతో ఆ బృందం నుంచి దాన్ని తొలగించారు.
తిరిగి ఇప్పుడు ట్రంప్‌ ఏలుబడిలో రష్యాతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, భారత్‌లను చేర్చుకోవాలని జి11గా విస్తరించాలన్న ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. ఈ బృందంలో ప్రతి ఏటా ఒక దేశం అధ్యక్ష స్ధానంలో ఉంటుంది. ఆ దేశనేత ఎవరినైనా ఆ సమావేశాలకు అతిధులుగా ఆహ్వానించవచ్చు. గతేడాది ఫ్రాన్స్‌ అదే హౌదాతో, ఇప్పుడు ట్రంప్‌ మన ప్రధాని నరేంద్రమోడీని జి7 సమావేశాలకు ఆహ్వానించారు.(2006లో రష్యా సెంట్‌ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన సమావేశానికి మన ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఆహ్వానించారు. మన దేశం నుంచి ప్రధాని వెంట వెళ్లిన పాత్రికేయ బృందంలో ఈ రచయిత ఒకడు) 2005 నుంచి వరుసగా ఐదు సమావేశాలకు మన్మోహన్‌ సింగ్‌ను ఆహ్వానించారు. జి7ను విస్తరించాలన్న ఆలోచన ట్రంప్‌లో తలెత్తిన సరికొత్త ఆలోచన కాదు. అంతకు ముందు నుంచీ ఉన్నది. పెరుగుతున్న మన దేశ జిడిపి, మార్కెట్‌ను గమనంలో ఉంచుకొనే అంతకు ముందు లేని విధంగా మన్మోహన్‌ సింగ్‌ను, ఇప్పుడు మోడీని ఆహ్వానిస్తున్నారు.
డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనతో ప్రపంచ మీడియాలో జి7 విస్తరణ వెనుక ఉన్న రాజకీయాల గురించి చర్చ జరుగుతోంది. ఆహ్వానం అందుకున్న దేశాలు ట్రంప్‌ ఆతిధ్యం స్వీకరిస్తే ఏమిటి ? లేకుంటే ఎలా అని తర్జన భర్జన పడుతున్నాయి. ఈ బృంద ప్రస్తుత రూపానికి కాలదోషం పట్టిందని, దీన్ని మార్చాలని ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. ప్రపంచంలో ఇది సక్రమంగా ప్రాతినిధ్యం వహించటం లేదన్నాడు. ఈ బృంద సమావేశాలలో తీసుకొనే నిర్ణయాలను విధిగా అమలు జరపాలనే నిబంధనేదీ లేదు. ఒక నాడు ప్రపంచ జిడిపిలో అత్యధిక భాగానికి ప్రాతినిధ్యం వహించిన ఈ బృందం క్రమంగా ప్రాభవం కోల్పోయింది.
జి7 విస్తరణతో అమెరికాకు ఒరిగేదేమిటి అని సిఎన్‌బిసి టీవీ విశ్లేషణ చేసింది. మిగిలిన ఆరు దేశాలలో కూడా మనకేమిటి అని, ట్రంప్‌ ప్రతిపాదిత జి7 విస్తరణ కూటమిలో చేరితే దానితో తలెత్తే ముప్పు లాభాల గురించి ప్రతి దేశంలోనూ తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఉదాహరణకు ఆస్ట్రేలియాలో ముందుకు వచ్చిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. చైనాను కట్టడి చేసే లక్ష్యంతో జరుగుతున్న సమావేశంలో ప్రాధాన్యత లేని పాత్రధారిగా ఆస్ట్రేలియా హాజరైతే కలిగే ప్రయోజనం ఏమిటి? ఓటమి అంచుకు చేరుతున్న ఒక అధ్యక్షుడితో చేతులు కలపటం అవసరమా ? అమెరికా కనుసన్నలలో ఆస్ట్రేలియా పని చేస్తోందనే చైనా ప్రచారం మరింతగా పాదుకుపోతుంది. చైనా వ్యతిరేకతను విధిగా వ్యక్తం చేసే అమెరికా ఎన్నికల ప్రచారానికి ఆస్ట్రేలియా అండనిస్తోందనే భావం కలుగుతుంది.
ఏ దేశమైనా ఇదే ప్రాతిపదికన ఆలోచించాల్సి ఉంటుంది. నరేంద్రమోడీ ఎన్నో అడుగులు ముందుకు వేసి ఆబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అంటూ గతేడాది హూస్టన్‌లో జరిగిన హౌడీమోడీ కార్యక్రమంలో మోడీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది అమెరికా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, డెమోక్రాట్లకు వ్యతిరేకతను వ్యక్తం చేయటమే. ఆ సభలోనే ఆహ్వానం పలికి ఈ ఏడాది అహమ్మదాబాద్‌లో పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేయటం దాని కొనసాగింపే. మోడీ సర్కార్‌ లేదా ఆయనకు సాయంగా ఉన్న విధాన నిర్ణేతలు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారా ? చైనాకు వ్యతిరేకంగా ఒక సంయుక్త సంఘటన ఏర్పాటు. చైనాతో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన ట్రంప్‌ కరోనా వైరస్‌ నుంచి తైవాన్‌, హాంకాంగ్‌ వరకు వివిధ అంశాలపై చైనాకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నాడు. ప్రతిదానిలో రాజకీయాలను చొప్పిస్తున్నాడు. వాణిజ్య ఒప్పందాలు, ఇరాన్‌ అణు ఒప్పందం, పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి ఏకపక్షంగా అమెరికా వైదొలగటం, ఆ నిర్ణయాలకు ట్రంప్‌ బాధ్యుడు కావటంతో గత రెండు జి7 వార్షిక సమావేశాలలో తీవ్ర సెగ తగిలింది. తనకు అనుకూలమైన దేశాలను జత చేసుకోవటం ద్వారా ట్రంప్‌ తన విమర్శకుల నోరు మూయించాలన్న ఎత్తుగడ కూటమి విస్తరణ పిలుపు వెనుక ఉంది. అమెరికా తరువాత ఈ బృందంలో పలుకుబడి కలిగిన జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజలా మెర్కెల్‌ ఈ ఏడాది అమెరికాలోని కాంప్‌డేవిడ్‌ సమావేశాలకు హాజరు కావాలని లాంఛనంగా ట్రంప్‌ స్వయంగా పలికిన ఆహ్వానాన్ని తిరస్కరించటాన్ని బట్టి విబేధాలు ఏ స్ధాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.రెండవది గతంలో రష్యాను బహిష్కరించి తిరిగి ఇప్పుడు ఏ ప్రాతిపదికన చేర్చుకోవాలని ట్రంప్‌ కోరుతున్నాడో తెలియని గందరగోళం బృందంలో తలెత్తింది. ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, రష్యాలను చేర్చుకొనేందుకు బ్రిటన్‌ విముఖంగా ఉంది.
ఏ దేశమైనా తన కార్పొరేట్‌ లేదా చైనా వంటి దేశాలైతే తన ప్రభుత్వ రంగానికి ఉపయోగపడేందుకు ఇలాంటి బృందాలను వినియోగించుకొనేందుకు ప్రయత్నిస్తాయి. మన బడా కార్పొరేట్‌ శక్తులు ముందుగా బలహీనమైన దేశాలలో ప్రవేశించాలని కోరుకుంటున్నాయి. అందుకుగాను భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం, అణుదేశాల క్లబ్బులో సభ్యత్వాన్ని కోరుతున్నాయనే అభిప్రాయం ఉంది. వీటి వెనుక మన దేశ భద్రతా కారణాలు కూడా ఇమిడి ఉన్నాయి. అయితే ఈ లక్ష్యాలను సాధించటం ఎలా, అందుకోసం చైనాను శత్రువుగా చేసుకోవాలా ? ఒక వేళ ఆ వైఖరితో ముందుకు పోతే అది సాధ్యం అవుతుందా అన్నవి పెద్ద ప్రశ్నలు.
ఈ నెలలో జరగాల్సిన సమావేశాన్ని సెప్టెంబరుకు వాయిదా వేయటం వెనుక ట్రంప్‌కు ఎదురైన తక్షణ సమస్యలేమిటన్నది ఆసక్తి కలిగిస్తున్నాయి. ఒకటి కరోనా వైరస్‌ తీవ్రత అమెరికాలో తగ్గే సూచనలు లేకపోవటం, ప్రపంచ నేతలు, ప్రతినిధి బృందాలు అమెరికా వచ్చేందుకు భయపడటం. తాను పాల్గొనేది లేనిదీ నిర్ధారించలేనని జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ప్రకటించటం ముఖ్యమైంది. సభ్యదేశాల నేతలందరూ హాజరు కావాల్సిందేనని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ పట్టుబట్టటం.జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ జి7 సమావేశాలకు హాజరుకాకపోవచ్చు అన్న వార్తల వెనుక తాము చైనా వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొనేందుకు సిద్దంగా లేమని, అమెరికా అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోవటానికి సిద్దంగా లేమని చెప్పటంగా అర్ధం చెబుతున్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఎవరి ప్రయోజనాలకు అనుగుణ్యంగా వారు ఎత్తులు పైఎత్తులు వేయటం సహజం. అయితే అమెరికా ప్రయోజనాలు, రాజకీయ ఎత్తుగడలకు మన దేశాన్ని పావుగా చేసుకొనేందుకు జరుపుతున్న యత్నాలు ప్రమాదకరమైనవి. అమెరికా ప్రయోజనాలు అంటే అర్ధం అక్కడి కార్పొరేట్ల ప్రయోజనాలే ప్రధానం.
డోనాల్డ్‌ ట్రంప్‌ ఆహ్వానం పలికిన ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా ప్రస్తుతం అమెరికా పాలేళ్ల వంటివి.భారత్‌, రష్యాలను ఆహ్వానించటం అంతర్జాతీయ రాజకీయాల్లో భాగం. చైనా వ్యతిరేకశక్తులను కూడగట్టటమే ప్రధాన లక్ష్యం అయితే దానిలో రష్యా భాగస్వామి అవుతుందా అన్నది ప్రశ్న. రెండు దేశాల మధ్య అనుమానాలు రేకెత్తించే ఎత్తుగడ కూడా ఉండవచ్చు. అనేక చోట్ల అమెరికాను నిలువరించటంలో రష్యా తనవంతు పాత్రను పోషిస్తున్నది. ఈ బృందంలో దాన్ని తిరిగి ఆహ్వానించటాన్ని కొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి కనుక తనకు ప్రయోజనమని ట్రంప్‌ భావిస్తూ ఉండాలి. ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నట్లు రష్యా అధినేత పుతిన్‌ ఇంతవరకు వెల్లడించలేదు. ఒక వేళ అంగీకరిస్తే కొన్ని దేశాల స్పందన ఎలా ఉంటుందో తెలియదు. రెండవది రష్యాను బుజ్జగించి అది ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలను చూపి తమతో భాగస్వామిగా చేసుకోవచ్చన్న దూరాలోచన కూడా ఉండవచ్చు. ఒక బలమైన ప్రత్యర్ధితో దెబ్బలాటకు దిగటం కంటే సర్దుబాటు చేసుకుంటే లాభం అనుకుంటే ఎత్తుగడలు మారిపోతాయి. కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్న స్ధితిలో ఇలాంటి సభల కంటే దాన్ని ఎదుర్కొనేందుకే వాయిదా వేశానని చెప్పుకోవచ్చు. ట్రంప్‌ వాయిదా వేసిన సెప్టెంబరులో అయినా అసలు సమావేశాలు జరుగుతాయా అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఆ సమయంలో ఐక్యరాజ్య సమితి సమావేశాలు ఉన్నాయి. నవంబరులో అమెరికాలో ఎన్నికలు ఉన్నాయి, వాటిలో ఓటమి పాలైతే ట్రంప్‌ అసలు పాల్గొనే అవకాశాలే ఉండక పోవచ్చు.
రష్యాను తిరిగి కూటమిలోకి రావాలని ట్రంప్‌ ఆహ్వానించటం రష్యా-చైనా-అమెరికా మధ్య ఉన్న సమతూకాన్ని తీవ్రదశకు చేర్చుతాయి. అమెరికా యత్నం ఎదురుతన్నినా ఆశ్చర్యం లేదు. తన ఎన్నిక కోసం ట్రంప్‌ ఈ చర్యకు పాల్పడినట్లు కొందరు చూస్తున్నారు. ట్రంప్‌ ఆహ్వానాన్ని రష్యా పట్టించుకోకపోగా ఐరోపాయూనియన్‌, కెనడా, బ్రిటన్‌ వ్యతిరేకించాయి. ఇలాంటపుడు రష్యా హాజరయ్యే అవకాశాలు పరిమితం. అయితే క్రిమియా ప్రాంతాన్ని తనలో విలీనం చేసుకున్న తరువాత రష్యా అటు అమెరికా, ఇటు ఐరోపా యూనియన్‌ దేశాల నుంచి ఆంక్షలు, తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నది, ఒంటరి పాటు అయింది. అమెరికాతో విబేధాలు ఉన్నప్పటికీ దాన్నుంచి బయట పడేందుకు ఇదొక అవకాశం అని రష్యా భావిస్తే జి7 సమావేశాలకు హాజరు కావచ్చు. చైనా దీన్ని సానుకూలంగానే పరిగణించవచ్చు.
ప్రస్తుతం చైనాతో ఉన్న స్నేహ సంబంధాలపై వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం గానీ, ట్రంప్‌ ఆహ్వానాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అగత్యం గానీ ప్రస్తుతానికి రష్యాకు లేదని రష్యన్‌ పరిశీలకులు చెబుతున్నారు. ఇతర దేశాలతో పోల్చితే గత రెండు దశాబ్దాలలో రష్యా-చైనా సంబంధాలు సజావుగానే కొనసాగుతున్నాయి. సరిహద్దు సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమయ్యాయి.చైనా మీద అమెరికా తెస్తున్న వత్తిడి కారణంగా సంబంధాలు మరింతగా బలపడ్డాయని చెప్పవచ్చు. ఈ నేపధ్యంలో చైనా నుంచి రాయితీలను ఎక్కువగా పొందవచ్చని కూడా కొందరి అంచనా. ఆర్ధికంగా చూస్తే చైనాకు రష్యా అవసరం కంటే రష్యాకే చైనా అవసరం ఎక్కువగా ఉన్నందున ఒక వేళ అమెరికా-చైనా మధ్య ప్రచ్చన్న యుద్దమంటూ జరిగితే అమెరికాతో రష్యా కలిసే అవకాశాలు ఉండకపోవచ్చు. ఒక బూర్జువా రాజ్యంగా ఆ విబేధాలను తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు ప్రయత్నించవచ్చు.
జి7 దేశాలతో కలసి పని చేసేందుకు భారత్‌ ఎంతో సంతోషిస్తుందని అమెరికాలో మన రాయబారి తరంజిత్‌ సింగ్‌ సంధు ఒక వార్తా సంస్ధతో చెప్పారు.జూన్‌ రెండవ తేదీన ట్రంప్‌-నరేంద్రమోడీ మధ్య ఫోన్‌ చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సంతోషం, కౌగిలింతల వెనుక ఉన్న రహస్యం అందరికీ తెలిసిందే. వాటిలో ఒకటి 2017-18లో మన దేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న చమురు 9.6 మిలియన్‌ పీపాలైతే 2019లో 93.34 మిలియన్‌ పీపాలకు పెరిగింది. ఫిబ్రవరిలో ట్రంప్‌ గుజరాత్‌ పర్యటన సందర్భంగా మరింతగా చమురు దిగుమతి చేసుకోవాలని ఒప్పందానికి వచ్చారు. ఇదంతా సాంప్రదాయంగా మనం పశ్చిమాసియా నుంచి చేసుకుంటున్న దిగుమతులను నిలిపివేసిన పర్యవసానం. ప్రభుత్వ రంగ ఐఓసి ఏటా 24మిలియన్‌ పీపాల చమురును అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలని టెండర్లు పిలిచింది.
అమెరికా తరువాత రెండవ పెద్ద ఆర్ధిక శక్తిగా ఉన్న చైనా లేకుండా జి7 సాధించేదేమిటి? ఆ కూటమిలో చేరినంత మాత్రాన మన దేశానికి ఒరిగేదేమిటి అన్నది ప్రశ్న. జి7 కంటే జి20 దేశాలు ఒక కూటమిగా బలంగా ఉన్నాయని చెప్పవచ్చు. అమెరికా తప్ప మిగిలిన జి7 దేశాల కంటే చైనా ఆర్ధిక ప్రభావం ఎక్కువ అన్నది జగమెరిగిన సత్యం.అమెరికా ఏకపక్షంగా అంతర్జాతీయ సంస్ధలు, ఒప్పందాల నుంచి వైదొలగటం ప్రారంభించిన తరువాత మిగిలిన ఆరు దేశాలపై దాని ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తోంది.
డోనాల్డ్‌ ట్రంప్‌ ఎత్తుగడ మేరకు ఒక వేళ దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా జి7లో చేరినా అవి అమెరికాకు వంత పాత్ర తప్ప ఆర్ధికంగా, రాజకీయంగా ప్రపంచం మీద పెద్ద ప్రభావం చూపే స్ధితిలో లేవు. వర్తమాన బలాబలాల్లో అమెరికా నుంచి చైనా నుంచి రాయితీలు ఎక్కువగా పొందేందుకు భారత పాలకవర్గాలు ప్రయత్నిస్తాయి తప్ప పూర్తిగా అమెరికాకు లొంగిపోయే అవకాశం లేదన్నది ఒక అభిప్రాయం.మొత్తంగా చూసినపుడు తన ఎన్నిక నేపధ్యంలో ట్రంప్‌ జి7 విస్తరణను ఒక రాజకీయ ప్రదర్శనగా మార్చదలుచుకున్నట్లు కనిపిస్తోంది. ఒక వైపు 2018 నుంచి చైనా నుంచి ఆర్ధిక రాయితీలు పొందేందుకే అమెరికా వాణిజ్య యుద్దం ప్రారంభించటం ఇతర వత్తిడులు అన్నది మిగతా దేశాలేవీ గ్రహించలేనంత అమాయకంగా లేవు. అందువలన అవి చైనా వ్యతిరేక కూటమిగా మారేందుకు ఎంత మేరకు ముందుకు వస్తాయి, వాటికి ఆ అవసరం ఏమిటన్నది ప్రశ్న.
ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటకు వచ్చింది.ప్రస్తుతం మిగిలిన దేశాలలో ప్రస్తుతం జర్మనీ ఈ ఏడాది అధ్యక్ష స్ధానంలో ఉంది. సెప్టెంబరు నెలలో జర్మనీ నగరమైన లీప్‌జిగ్‌లో ఐరోపాయూనియన్‌-చైనా సమావేశం జరగాల్సి ఉంది. కరోనా కారణంగా దాన్ని వాయిదా వేశారు. డిసెంబరులోగా జరగవచ్చు.వైరస్‌ ప్రబలటానికి చైనాయే కారణమన్న అమెరికా ఆరోపణలను ఐరోపా దేశాలు కొన్ని నమ్ముతున్నాయి. అయినా కూటమిలోని జర్మనీ-ఫ్రాన్స్‌ దేశాలు చైనాతో సత్సంబంధాలనే కోరుకుంటున్నాయి. వైరస్‌ నేపధ్యంలో చైనాతో సంబంధాల గురించి ఐరోపా యూనియన్‌ దేశాలలో ఏకాభిప్రాయాన్ని సాధించటం కూడా ముఖ్యాంశమే. ఒకవైపు చైనా తమకు ఆర్ధికంగా ప్రత్యర్ధి అని భావిస్తున్నా మరోవైపు దానితో ఇప్పటికిప్పుడు శత్రువుగా భావించే స్ధితి లేదు. కమ్యూనిస్టు దేశమని మడిగట్టుకు కూర్చునేందుకు మెజారిటీ దేశాలు సిద్దంగా లేవు. రాజకీయంగా ఈ కూటమి అమెరికాకు పావుగా పని చేసేందుకు సిద్దం కాదని కూడా గతంలో వెల్లడైంది.
జార్జి ఫ్లాయిడ్‌ హత్యకు నిరసన ప్రతి రోజూ అధ్యక్ష భవనం ముందు నిరసన ప్రదర్శనలు, కరోనా వైరస్‌ అదుపులేకుండా కొనసాగుతుండటంతో జనంలో డోనాల్డ్‌ ట్రంప్‌ పలుకుబడి పడిపోతోందని సిఎఎన్‌ మీడియా సంస్ధ జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది. ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ ప్రత్యర్ధి జో బిడెన్‌కు ఆదరణ పెరుగుతోంది. కరోనా, ఆర్ధిక దిగజారుడుతో పాటు ఇప్పుడు ఎన్నికల్లో జాత్యహంకారం కూడా ముందుకు వచ్చింది. ఈ ఏడాది జనవరి తరువాత ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన వారు 38శాతానికి పడిపోవటం, వ్యతిరేకించే వారు 57శాతం ఉండటం సహజంగానే ట్రంప్‌కు ఎదురు దెబ్బను సూచిస్తున్నది. జో బిడెన్‌-ట్రంప్‌ మధ్య తేడా 14పాయింట్లు ఉంది. బిడెన్‌ను 55శాతం మంది, ట్రంప్‌ను 41శాతం సమర్దిస్తున్నారు.ఫ్లాయిడ్‌ హత్యపై పెల్లుబికిన నిరసన పట్ల ట్రంప్‌ వ్యవహరించిన తీరు ట్రంప్‌ ఏలుబడిలోని మాజీ రక్షణ మంత్రి జేమ్స్‌ మాటిస్‌ వంటి రిపబ్లికన్లకే నచ్చలేదు. ట్రంప్‌ స్పందన నిరసనలు తగ్గటానికి బదులు పెరిగేందుకు తోడ్పడినట్లు 65శాతం మంది అమెరికన్లు భావిస్తున్నారు. జాతి వివక్ష ఒక ప్రధాన సమస్యగా ముందుకు వచ్చినట్లు వెల్లడైంది. ఈ నేపధ్యంలో నరేంద్రమోడీ కలలు నెరవేరేనా, కల్లలవుతాయా ?