Tags

, ,


ఎం కోటేశ్వరరావు
తమ ప్రభుత్వం నిర్ణయించిన వ్యవసాయ పంటల కనీస మద్దతు ధర ప్రపంచ మార్కెట్‌కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్గరీ చెప్పారు. అరవై లక్షల టన్నుల పంచదార ఎగుమతికి కేంద్రం మరో ఆరువేల కోట్ల రూపాయల మేర సబ్సిడీ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాల వరకు మనకు బియ్యం, గోధుమ మిగులు ఉంటుందని వాటిని నిల్వ చేసుకొనేందుకు స్దలం కూడా లేదని అన్నారు. ప్రస్తుతం ఆరు- ఏడులక్షల కోట్ల రూపాయల మేరకు చమురు దిగుమతి చేసుకుంటున్నామని, ప్రస్తుతం ఇరవై వేల కోట్ల రూపాయల విలువగల ఇథనాల్‌ తయారు చేస్తున్నామని దాన్ని లక్ష కోట్ల రూపాయలకు పెంచనున్నట్లు తెలిపారు. ఏటా 90వేల కోట్ల రూపాయల విలువగల ఖాద్య తైలాలను దిగుమతి చేసుకుంటున్నామని, అందువలన చమురు గింజల ఉత్పత్తి కూడా పెంచాలన్నారు. అమెరికా, బ్రెజిల్‌ దేశాలలో 30, 27-28 క్వింటాళ్ల మేరకు సోయా బీన్స్‌ దిగుబడి ఒక ఎకరానికి వస్తుండగా మన దేశంలో 4.5క్వింటాళ్లకు మించి లేదన్నారు.
దీనిలో మొదటిది అతిశయోక్తి లేదా ఆధారం లేని అంశం. ఏ దేశంలో ఎంత ఇస్తున్నారో మంత్రి చెప్పి వుంటే దానికి విశ్వసననీయత ఉండేది.రెండవది రైతాంగానికి మద్దతు ధర వేరు, గిట్టుబాటు ధర వేరు. మంత్రి చెప్పినట్లుగానే సోయా విషయాన్నే తీసుకుంటే అమెరికా కంటే మన రైతాంగానికి మద్దతు ధర ఎక్కువ ఇచ్చినా గిట్టుబాటు కాదు,ఎందుకంటే అమెరికాలో ఆరు రెట్లు దిగుబడి ఎక్కువ. అందువలన అక్కడ ధర తక్కువ ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చే ఇతర సబ్సిడీలను పరిగణనలోకి తీసుకుంటే మన రైతుకంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. మూడు సంవత్సరాల వరకు బియ్యం, గోధుమలు మిగుల్లో ఉంటాయని చెప్పినందుననే ఈ ఏడాది రైతాంగానికి క్వింటాలు ధాన్యానికి కేవలం 53 రూపాయలు మాత్రమే మద్దతు ధర పెంచారు.రానున్న మూడు సంవత్సరాలలో కూడా ఇంతకు మించి ఎక్కువ పెంచే అవకాశం ఉండదనేందుకు ఈ వ్యాఖ్యలు ఒక సూచిక అని చెప్పవచ్చు. ఒక వేళ అనూహ్యంగా మధ్యంతర ఎన్నికలు వస్తే అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కరోనా వైరస్‌ ఆర్ధిక రంగంలో కలిగించే విపత్కర పరిస్ధితి ఆ వైపు నెట్టదని చెప్పలేము.
కుండలో కూడు కుండలోనే ఉండాలిాపిల్లాడు మాత్రం లడ్డులా తయారు కావాలన్నట్లుగా రైతుల పరిస్ధితి ప్రస్తుతం తయారైంది. గత ఆరు సంవత్సరాలుగా పెరుగుదల లేని ఒకే మొత్తం సబ్సిడీ. యూరియాకు మాత్రమే సబ్సిడీ ఇస్తాం. మిశ్రమ ఎరువుల ధరలు పెరిగితే ఉన్నదాన్నే సర్దుతాం తప్ప మాకు సంబంధం లేదు, మేము ఇవ్వాలనుకున్న మేరకే సబ్సిడీ ఇస్తాం లేదా తగ్గిస్తాం తప్ప పెంచేది లేదు. కనీస మద్దతు ధరలను ముష్టి మాదిరి విదిలించి 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తాం. స్ధూలంగా కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాటలివి.
డిఏపి, ఎంఓపి, ఎన్‌పికె వంటి ఎరువులకు సబ్సిడీని తగ్గిస్తున్నాం, మంచం పొట్టిదైతే కాళ్లు నరుక్కోవాల్సిందే తప్ప వేరే ఏర్పాటు చేయలేం, వర్తమాన ఆర్ధిక సంవత్సరానికి మిశ్రమ ఎరువులకు రూ.22,186 కోట్ల రూపాయలనే సబ్సిడీగా ఇస్తాం, దాంతో సర్దుకోవాల్సిందే ఈ విషయం మీకు ముందే చెబుతున్నాం అన్నట్లుగా ఏప్రిల్‌ మూడవ వారంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా మీడియా పెద్దగా వార్తలివ్వలేదు, జనం కూడా పట్టించుకోలేదు. స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన ఆర్ధిక వ్యవహారాల కాబినెట్‌ కమిటీ ఈ నిర్ణయం చేసింది.
వ్యవసాయంలో ఎరువుల ప్రాధాన్యత గురించి పదే పదే చెప్పుకోనవసరం లేదు. అయితే ఏ పంటకు, ఏనేలలో ఏ ఎరువు ఎంత వేయాలనేది మాత్రం నిరంతరం చెప్పుకుంటూ ఉండాల్సిందే. లేనట్లయితే, నేల ఆరోగ్యం దెబ్బతింటుంది, పంట దిగుబడుల మీద ప్రతికూల ప్రభావాలు పడతాయి. గడచిన ఐదు దశాబ్దాల చరిత్రను చూస్తే మన వంటి వర్ధమాన దేశాల సాగులో ఎరువుల సబ్సిడీ ఒక ప్రధాన పాత్ర వహించింది. దాన్ని తగ్గిస్తే అది చిన్న,సన్నకారు రైతుల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ధనిక దేశాల వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ కల్పించేందుకు వాటి సాధనాలుగా ఉన్న ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి సంస్ధలు వర్దమాన దేశాలకు రుణాలు కావాలంటే వ్యవసాయ సబ్సిడీలను రద్దు చేయాలనే ఒక షరతును 1980దశకంలో ముందుకు తెచ్చాయి. దొడ్డిదారిన ధనిక దేశాలు ఇచ్చే సబ్సిడీల గురించి మాట్లాడవు.
కరోనా వైరస్‌ నేపధ్యంలో వ్యవసాయ రంగం ఎలా ఉంటుందో తెలియని అనిశ్చితి ఏర్పడింది.ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనంలోకి జారిపోతోందని ప్రపంచ బ్యాంకుతో సహా అన్ని సంస్ధలూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. కరోనాకు ముందే దేశ వ్యవసాయరంగం కుదేలైంది. గత ఆరు సంవత్సరాలుగా వ్యవసాయ రంగ అభివృద్ధిలో మెరుగుదల లేదు, గిడసబారిపోయింది, ఈ ఏడాది కూడా అంతకు మించి పెరుగుదల ఉండదు, మూడుశాతం ఉంటుందని నీతి ఆయోగ్‌ అంచనా వేసింది. యుపిఏ పాలనా కాలంలో దాదాపు పన్నెండుశాతం కనీస మద్దతు ధరలు పెరిగితే బిజెపి ఏలుబడిలో నాలుగున్నరశాతానికి మించి లేవు.
వివిధ దేశాలలో వ్యవసాయానికి పెద్ద ఎత్తున సబ్సిడీలను కొనసాగిస్తున్నారు. ఈ విషయమై ధనిక దేశాల మధ్య తలెత్తిన వివాదం కారణంగా 2001లో ప్రారంభమైన దోహా దఫా చర్చలు ఇంతవరకు ముగియ లేదు, ఒక కొలిక్కి వస్తాయనే ఆశలేదు. వ్యవసాయ సబ్సిడీలపై ధనిక దేశాల మధ్య పడిన చిక్కుముడే దీనికి కారణం. ప్రపంచం మరోసారి తీవ్ర ఆర్ధిక సంక్షోభానికి గురైతే అసలు ప్రపంచ వాణిజ్య సంస్దే కుప్పకూలినా ఆశ్చర్యం లేదు. దోహా చర్చలు ఇంకా ముగియ లేదు కనుక అటు ధనిక దేశాలు తమ రైతాంగానికి పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తున్నాయి. మరోవైపు ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ సంస్దల ద్వారా వర్ధమాన దేశాల్లో సబ్సిడీల రద్దు లేదా నామమాత్రం చేయటానికి వత్తిడి పెంచుతున్నాయి. ఈ పూర్వరంగంలో చైనా నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా అన్నది చూద్దాం. ఎందుకంటే రెండు దేశాలు తమ జనాభాకు అవసరమైన ఆహార భద్రతను సమకూర్చాల్సి ఉంది.
మన దేశంలో సాగుకు అనుకూలమైన భూమి 156మి.హె ఉంటే చైనాలో 120 మి.హె మాత్రమే ఉంది. సాగునీరు మన దేశంలో 48శాతం సాగుభూమికి ఉంటే చైనాలో 41శాతానికి ఉంది. దీని కారణంగా మొత్తం పంటలు సాగు చేసే ప్రాంతం చైనాలో 166 మి.హె, మన దేశంలో 198మి.హెక్టార్లు ఉంటుంది. చైనాలో సాగు భూమి తక్కువగా ఉన్నప్పటికీ అక్కడి వ్యవసాయ ఉత్పత్తుల విలువ 1,367 బిలియన్‌ డాలర్లు కాగా మన విలువ కేవలం 407 బిలియన్‌ డాలర్లు మాత్రమే. ఈ విషయంలో చైనా నుంచి మనం నేర్చుకోవాల్సిందేమైనా ఉందా ?
రెండు దేశాలూ పురాతన నాగరికత కలిగినవే, రెండూ స్వాతంత్య్రం వచ్చే నాటికి వ్యవసాయాధారిత దేశాలుగానే ఉన్నాయి. వ్యవసాయ పరిశోధన మరియు అభివృద్ధి, వినూత్న పద్దతులను కనుగొనేందుకు 2018-19లో మన దేశం 140 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే చైనాలో 780 కోట్ల డాలర్లు ఉంది. మన దేశంలో జరిపిన విశ్లేషణ ప్రకారం వ్యవసాయ పరిశోధన-విస్తరణ పధకాలకు ఖర్చు చేసే ప్రతి రూపాయికీ జిడిపిలో రూ.11.20 పెరుగుదల ఉంటుంది. వీటి మీద చేసే ప్రతి పది లక్షల రూపాయల ఖర్చుతో 328 మంది దారిద్య్రం నుంచి బయట పడవేయవచ్చు. దేశ జివిఏ(గ్రాస్‌వాల్యూయాడెడ్‌- ఒక ప్రాంతం లేదా ఒక పరిశ్రమలో ఉత్పత్తి చేసే వస్తువులు మరియు సేవల విలువ)లో మనం కేవలం 0.35శాతమే ఖర్చు చేస్తుండగా చైనా 0.8శాతం ఉంది. అందువలన పరిశోధన, అభివృద్ధి, విస్తరణకు మన దేశం చేయాల్సిన ఖర్చు పెరగాల్సి ఉంది. ఈ ఖర్చు పెంచితే రైతాంగ ఆదాయాలు గణనీయంగా పెరుగుతాయి. ఈ దిశగా నరేంద్రమోడీ సర్కార్‌ చర్యలు లేవు.
నాణ్యమైన విత్తన తయారీతో పాటు ఎరువుల వినియోగం కూడా పెరుగుతుంది.2016లో ఒక హెక్టారుకు చైనాలో 503కిలోల ఎరువులు వినియోగిస్తే మన దేశంలో 166కేజీలు మాత్రమే ఉందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఇక పంటల ఉత్పాదన విషయానికి వస్తే మన దేశంతో పోల్చితే చైనాలో 50 నుంచి వందశాతం వరకు ఎక్కువగా ఉన్నాయి. రైతాంగానికి వివిధ రూపాలలో ఇచ్చే సబ్సిడీని ఇప్పుడు ఆంగ్లంలో ప్రొడ్యూసర్‌ సపోర్ట్‌ ఎస్టిమేట్స్‌(పిఎస్‌ఇ) అంటున్నారు. అనేక దేశాల్లో ఈ భావనతో రైతాంగానికి ఇచ్చే పెట్టుబడి సబ్సిడీ లేదా దానికి సమానమైన వాటిని గణిస్తున్నారు. చైనాలో 2018-19కి మూడు సంవత్సరాలలో దేశ మొత్తం వ్యవసాయ ఆదాయంలో 15.3శాతం రైతాంగానికి సబ్సిడీ రూపంలో అందింది. ఇదే కాలంలో మన దేశంలో 5.7శాతం ప్రతికూలత ఉంది. అంటే రైతాంగానికి ఇచ్చే సబ్సిడీల కన్నా వారి మీద మోపిన పన్ను తదితర భారం పెరిగింది. మన దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోవటానికి ఇదొక కారణం అన్నది స్పష్టం. దీన్ని సరిదిద్దటానికి బదులు 23 రకాల పంటలకు కనీస మద్దతు ధరలను పెంచటం ద్వారా రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామనే పేరుతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తున్నది. పోనీ ఇదైనా స్వామినాధన్‌ కమిటీ చేసిన సిఫార్సులకు అనుగుణ్యంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నదా అంటే అదీ లేదు. పెరిగిన వ్యవసాయ పెట్టుబడులను కూడా పూర్తిగా మద్దతు ధరలకు ప్రాతిపాదికగా తీసుకోవటం లేదు. కనీస మద్దతు ధరల గురించి బిజెపి ఎన్నికబుర్లైనా చెప్పవచ్చు, అంకెలు నిజాలే చెబుతాయి. 2004-14 పదేండ్ల కాలంలో యుపిఏ హయాంలో సాధారణ ధాన్యం మద్దతు ధర క్వింటాలుకు రూ.560 నుంచి 1310కి (750) పెరిగింది. అదే ఎన్‌డిఏ హయాంలో ఏడు సంవత్సరాల కాలంలో (2014-15 నుంచి 2020-21) 1310 నుంచి రూ.1868కి (558) మాత్రమే పెరిగింది. శాతాల్లో చూస్తే మొత్తంగా యుపిఏ కాలంలో 133శాతం,ఎన్‌డిఏ కాలంలో 42.5శాతమే పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ధరలకంటే ఎంతో ఎక్కువ మొత్తాలను చెల్లించి చైనాలో రైతుల వద్ద పంటలను కొనుగోలు చేయటంతో ప్రభుత్వానికి కొన్ని సమస్యలు వచ్చాయి. తెలంగాణాలో ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తాము నిర్దేశించిన పంటలను సాగు చేస్తేనే రైతు బంధు నిధులు ఇస్తామని ఒక షరతును పెట్టింది. కేంద్ర ప్రభుత్వం నేరుగా అందచేస్తున్న నగదుకు ఎలాంటి షరతులు లేవు. చైనాలో కూడా ఎలాంటి షరతులు లేకుండా నేరుగా రైతులకు నిధులను బదిలీ చేస్తున్న పధకాన్ని అమలు జరుపుతున్నారు. అయితే చైనాలో రైతులకు, యావత్‌ ప్రజానీకానీకానికి అమలు జరుపుతున్న ఇతర సంక్షేమ పధకాలు, అన్నింటికీ మించి రైతులకు మనకంటే రెట్టింపు దిగుబడుల కారణంగా అక్కడ వ్యవసాయ రంగంలో ఎలాంటి సంక్షోభాలు రాలేదు. అందువలన చైనా నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రధాన అంశం పరిశోధన, అభివృద్ధి, విస్తరణ ఖర్చు గణనీయంగా పెంచటమే. అది కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా చేయాల్సి ఉంది.
2022 నాటికి అంటే మన స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచే నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని 2016లో నరేంద్రమోడీ ప్రకటించారు. అంటే ఆ రోజుకు ఉన్న ఆదాయాలు రెట్టింపు అని మనం అర్ధం చేసుకోవాలి. మోడీ అవగాహన ప్రకారం కనీస మద్దతు ధరలను రెట్టింపు చేస్తే ఆదాయం రెట్టింపు అవుతుందనా లేక ఖర్చులన్నీ పోను వచ్చే మిగులు రెట్టింపు అవుతుందా అన్నది స్పష్టత లేదు. వ్యవసాయ ఖర్చులు ఒక రాష్ట్రంలోనే ప్రాంతానికి ప్రాంతానికి మారుతున్నాయి. కాలువల ద్వారా నీరు పారే ప్రాంతానికి బోర్ల ద్వారా నీటిని అందించే లేదా వర్షాధారిత చోట్లకు ఎంత తేడా ఉంటుందో తెలిసిందే. మన వ్యవసాయ వృద్ధి రేటు నిలకడగా ఉండటం లేదు. ఒక రంగంలో ఉండే జివిఏకు మరో రంగానికి పోలిక ఉండటం లేదు. ఉదాహరణకు మత్స్యరంగంలో ఏడుశాతం, హార్టీ కల్చర్‌లో 4.5, పశుసంపదలో 6శాతం ఉంది.2019 వ్యవసాయంపై క్రిసిల్‌ అధ్యయన నివేదికలో ఖరీఫ్‌ దిగుబడి మూడున్నర శాతం తగ్గుతుందని అంచనా వేసింది. అంటే రైతుల లాభం 10-12శాతం తగ్గిపోతుంది. నీతి అయోగ్‌ 2017లో రూపొందించిన పత్రంలో వార్షిక వృద్ధి రేటు 10.4శాతం ఉండాలని పేర్కొన్నది. కానీ మన సగటు మూడుశాతానికి మించటం లేదు. రైతుల ఆదాయాలను ఐదు సంవత్సరాలలో రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం తీరిగ్గా రెండు సంవత్సరాల తరువాత ముఖ్యమంత్రులతో ఒక ఉన్నత స్ధాయి కమిటీని ఏర్పాటు చేసిందంటే ఆ వాగ్దాన అమలు తీరు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆశ్రద్ధ వ్యవసాయ రంగంలో పెట్టుబడులకు తిలోదకాలు ఇస్తున్న కారణంగా గత పాతిక సంవత్సరాలలో సగం రాష్ట్రాలలో ఒక్క ఎకరానికి కూడా నీటి పారుదల సౌకర్యం అదనంగా కలిగించలేదంటే అతిశయోక్తి కాదు. కొత్త ప్రాజెక్టులు పూర్తి కాకపోవటం లేదా పాత ప్రాజెక్టులలో పూడిక పెరిగిపోవటం, కాలువల చివరి భూములకు నీరందకపోవటం వంటి కారణాలతో కొన్ని చోట్ల వాస్తవ సాగు భూమి తగ్గిందనే వార్తలు కూడా వచ్చాయి.
ప్రపంచంలోనే మన మద్దతు ధరలు ఎక్కువగా ఉన్నాయనే గొప్ప గురించి చూద్దాం. ప్రపంచ దేశాలలో ధాన్యం ధరల గురించి మనకు సమాచారం అందుబాటులో లేదు. బియ్యం ధరలను ప్రాతిపదికగా తీసుకొని పరిశీలిద్దాం. ప్రపంచంలో బియ్యాన్ని ఎగుమతి చేయటంలో మనమే ప్రధమ స్ధానంలో ఉన్నాం. మన తరువాత స్ధానాల్లో థారులాండ్‌, వియత్నాం, పాకిస్ధాన్‌ ఉన్నాయి. బియ్యాన్ని దిగుమతి చేసుకోవటంలో చైనా తొలి స్ధానంలో ఉంది. చైనా జనాభా 140 కోట్లయితే మనం 135 కోట్లు ఉన్నాం. మన దేశంలో 2019-20లో 1,17,939 వేల టన్నుల బియ్యం ఉత్పత్తి చేయగా చైనా 1,46,730 వేల టన్నులని అంచనా. మన దేశంలో ఈ మొత్తమే మూడేండ్లకు మిగుల్లో ఉండగా మన కంటే జనాభా, ఉత్పత్తి ఎక్కువగా ఉన్న చైనా దిగుమతి చేసుకుంటోంది అంటే అక్కడ కొనుగోలు శక్తి ఎక్కువ, జనం మన కంటే ఎక్కువ తింటున్నారని అర్ధం.
ఐక్య రాజ్యసమితి ఆధ్వర్యంలోని ప్రపంచ వ్యవసాయ మరియు ఆహార సంస్ద (ఎఫ్‌ఏఓ) నిర్వహించే వివరాల ప్రకారం 2015 నుంచి 2019 సంవత్సరాలలో ఒక టన్ను ఎగుమతి చేసిన బియ్యానికి మన రకాలకు వచ్చిన ధర 337 నుంచి 361 డాలర్ల మధ్య ఉంది. ఏడాది సగటు 353 డాలర్లు. ఇదే కాలంలో థారులాండ్‌ బియ్యానికి వచ్చిన సగటు ధర 392 డాలర్లు, వియత్నాం బియ్యానికి 346, పాకిస్ధాన్‌ బియ్యానికి 336 డాలర్లు ఉంది. మనం పోల్చుకోవాల్సింది మన కంటే ఎక్కువ ధర వచ్చిన థారులాండ్‌తోనా తక్కువ వచ్చిన దేశాలతోనా ? అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టే దేశీయ మార్కెట్‌ ధరలు కూడా ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు.
ఎన్నికలను గమనంలో ఉంచుకొని ఆ ఏడాది పంటలకు మద్దతు ధరలను అంతకు ముందు-తరువాత సంవత్సరాల కంటే కాస్త ఎక్కువగా పెంచిన తీరు కాంగ్రెస్‌-బిజెపి పాలన రెండింటిలోనూ గమనించవచ్చు. ఉదాహరణకు ధాన్యం, పత్తి విషయాలు తీసుకుందాం. గడచిన ఐదు సంవత్సరాలలో 2019లో ఎన్నికలకు ముందు 2015-16 నుంచి 2017-18 వరకు మూడు సంవత్సరాలలో సాధారణ రకం ధాన్యం ధర క్వింటాలుకు రూ. 1410 నుంచి 1550కి(240) పెరగ్గా 2018-19లో రూ. 1750(200) పెరిగింది. తరువాత గత ఏడాది, ఈ సంవత్సరం రెండు సంవత్సరాలకు కలిపి పెంచింది రూ. 1868కి అంటే 118 మాత్రమే. పెరుగుదల రేటు తగ్గిపోయింది. పత్తి విషయం తీసుకున్నా ఇదే ధోరణి కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో పొడవు పింజ పత్తి ధర 2016-17కు రూ.4,160 నుంచి 2017-18లో రూ.4,320(120)కి పెరగ్గా 2018-19లో రూ.5,450(230) గత ఏడాది రూ100, ఈ ఏడాది రూ. 275 పెంచారు. నాలుగేండ్లలో ఏడాది సగటు 180 మాత్రమే ఉంది. ఈ తీరును గమనించినపుడు దిగుబడులు తక్కువగానూ పెట్టుబడులు ఎక్కువగా ఉన్న సమయంలో అన్ని రకాల ఖర్చులు, పెట్టుబడులను పరిగణనలోకి తీసుకోకుండా పెంచుతున్న మద్దతు ధరలు రైతాంగ ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయంటే నమ్మే దెలా ?