కరోనాను వెనక్కు నెట్టి వైఎస్ జగన్ కక్ష కొరడాను తీస్తున్నారా !
ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌తో సహజీవనం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కొద్ది వారాల క్రితం వ్యాఖ్యానించారు. ఆ వ్యాధి తీవ్రత గురించి అందరూ ఆందోళన చెందుతున్న సమయంలో అసందర్భ వ్యాఖ్య చేసి విమర్శల పాలయ్యారు. ఇప్పుడు కేసులు మరింత ఆందోళనకరంగా పెరుగుతున్నపుడు బతికిన వారు బతుకుతారు, చచ్చేవారిని ఎలాగూ ఆపలేము, మిగతా సంగతులు చూసుకుందాం అన్నట్లుగా పరిస్ధితి తయారౌతోందా అనిపిస్తోంది.
కోర్టుల్లో తగులుతున్న ఎదురు దెబ్బలు తమ ప్రజాపునాదిని దెబ్బతీసేవిగా లేవనే నిర్దారణకు వైసిపి నాయకత్వం వచ్చినట్లు కనిపిస్తోంది. జనం కులాల వారీ సమీకరణ అయినపుడు, భ్రమల్లో ఉన్నపుడు నిజమే అనిపిస్తోంది. ఈ నేపధ్యంలోనే కేసులు కోర్టుల్లో కొట్టి వేసినప్పటికీ ఏదో ఒక విధంగా ప్రతిపక్ష నేతలను కొంత కాలమైనా జైలు పాలు చేయాలనే ధోరణితో వైసిపి నాయకత్వం వున్నట్లు జనం అనుకుంటున్నారు. తెలుగుదేశం, వైసిపి, తెరాస వంటి ప్రాంతీయ పార్టీల్లో నాయకత్వమైనా, అనుచరులైనా అంతా ఒకరే. తెలుగుదేశంలో అంతా చంద్రబాబే, వైసిపిలో సర్వం జగన్మయం, ఏకోపాసన.
తెలుగుదేశం నేతలు పైకి బింకాలు పోవచ్చుగానీ మానసికంగా తామూ ఏదో ఒకనాడు ఏదో ఒక కేసులో శిక్షగా కాకున్నా కస్టడీలో అయినా ఏడు ఊచలు లెక్కపెట్టక తప్పదని చాలా మంది లోలోపల అనుకుంటూ ఉండాలి. అధికార రాజకీయం అన్న తరువాత దేన్నయినా భరించాలి మరి. ఏ కారణంతో జైలుకు వెళ్లి వచ్చినా మంచి చెడ్డలను చూడకుండా నీరాజనాలు పట్టే జనాలు ఎలాగూ ఉన్నారని నిర్ధారణ అయింది కనుక ఎవరూ జైలు గురించి ఆందోళనపడాల్సిన పనిలేదు. ప్రతిపక్ష పార్టీ నేతల ఆందోళనల్లా తమ కార్యకర్తలు, మద్దతుదార్లను ఎంత మేరకు నిలుపుకోగలమన్నదే.
కరోనా విషయంలో చేయాల్సిందేదో చేస్తున్నాం, ఇప్పుడు అవినీతి అంతానికి ప్రాధాన్యత ఇస్తున్నామని జనానికి కనిపించేందుకు, రాజకీయ రచ్చను కొనసాగించేందుకు వైసిపి పూనుకున్నట్లు తెలుగుదేశం పార్టీ నేతల అరెస్టులు స్పష్టం చేస్తున్నాయి. ఉన్న సొమ్మును సంక్షేమ పధకాలకు ఖర్చు చేయటం, అభివృద్ధి పనులకు నిధుల లేమి అన్నది ఒక వాస్తవం. ఏడాది పూర్తి అవుతున్న సమయంలో కొంత మంది ఎంఎల్‌ఏలు, ఎంపీలలో వెల్లడైన అసమ్మతి అధికార పార్టీలో జరుగుతున్న మధనానికి చిహ్నం. అమృతం వస్తుందా హాలా హలం వస్తుందా ? దేన్ని ఎవరికి ఇస్తారు అన్నది వెండి తెరమీద చూడాల్సిందే.
చట్టం తనపని తాను చేసుకుపోతుంది అని చెప్పుకొనేందుకు వినసొంపుగానే ఉంటుంది. అనేక ఉదంతాలలో కేసులు బనాయించటం తప్ప అంగుళం కూడా ముందుకు పోని స్ధితి తెలిసిందే. అంటే అవసరమైనపుడు వాటిని బయటకు తీస్తారు. మాజీ మంత్రి, ఎంఎల్‌ఏగా ఉన్న కె అచ్చన్నాయుడిని అరెస్టు చేయటాన్ని తప్పు పట్టనవసరం లేదుగానీ, తీరు కక్షపూరితంగా కనిపిస్తోంది. మైనర్ ఆపరేషన్ చేయించుకున్న అచ్చన్నాయుడికి స్వస్ధత చేకూరే వరకు, అంతగా అవసరం అయితే కొద్ది రోజుల పాటు గృహనిర్బంధంలోనే ఉంచి తరువాత చట్టపరంగా కోర్టుకు అప్పగించవచ్చు. దానికి బదులు అరెస్టు చేసి గంటల కొద్దీ తిప్పిన తీరుతో ఆపరేషన్ గాయం పెద్దది కావటంతో చివరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చాల్సివచ్చింది. మరోమారు ఆపరేషన్ అవసరం లేదు అని వైద్యులు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అలాంటి స్ధితిలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేయాల్సినంత అత్యవసరం ఆ కేసులో ఉందా అంటే నిస్సందేహంగా లేదు.
అనంతపురం జిల్లా మాజీ శాసనసభ్యుడు, తెలుగుదేశం నేత జెసి ప్రభాకర రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని మోటారు వాహనాల కొనుగోలు అక్రమాల కేసులో అరెస్టు చేశారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు హాజరవుతానని చెప్పినప్పటికీ పిలవ కుండా కావాలని అరెస్టు చేశారని ఆయన చెబుతున్నారు.దానిలో వాస్తవం ఏమిటో ఎవరూ నిర్ధారణ చేయలేరు. అవినీతి, అక్రమాల కేసుల్లో ఉన్న ప్రతి నిందితుడు న్యాయస్ధానాల్లో రుజువయ్యేవరకు నిర్ధోషినని, కావాలని ఇరికించారనే చెబుతాడు.అప్రూవర్‌లుగా మారిన ఉదంతాలలో తప్ప ఇంతవరకు ఏ నేరగాడూ లేదా నేరగత్తె స్వచ్చందంగా నేరాన్ని అంగీకరించిన ఉదంతం మనకు సాధారణంగా కనపడదు. ప్రస్తుతం అనేక కేసులలో ముద్దాయిలుగా ఉన్న వారు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వారి వాదనలు ఏమిటో అందరికీ తెలిసిందే.
ఇఎస్‌ఐ అక్రమాల కేసుల్లో మంత్రిగా అచ్చెన్నాయుడి అవినీతి, మోటారు వాహనాల కొనుగోలు, అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో జెసి కుటుంబ సభ్యుల అవినీతి నిగ్గు తేలేవరకు వారంతా నిందితులే.అవసరమైతే జైలుకు పోవాల్సిందే. పదహారు నెలల పాటు జైల్లో ఉండి, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ విచారణకు హాజరుకావాల్సిందే అని కోర్టుతో చెప్పించుకున్న వైఎస్ జగన్మోహనరెడ్డే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. గతంలో వైసిపి నేతలు జైలు పాలయినపుడు ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు, ఇప్పుడు తమ నేతల అరెస్టుల గురించి ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేయటం సహజమే. గత ఐదు సంవత్సరాల పాలనలో వారిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేసులు దాఖలైతే మిగిలిన వారు కూడా రిమాండ్ లేదా జైలు పాలు కావచ్చన్న భయంలో వారిలో ఉండటం సహజం. తమ ఏలుబడిలో రాజకీయ ప్రత్యర్ధులను, సమస్యల మీద ఉద్యమించినందుకు తప్పుడు కేసులు పెట్టి సామాన్యులను ఎందరిని జైలు పాలు లేదా కస్టడీలకు పంపిందీ గుర్తుకు తెచ్చుకుంటే తెలుగుదేశం నేతలకు వారి మద్దతుదార్లకు కాస్త ఊరట కలుగుతుందేమో !
గతంలో కూడా అధికారంలో ఉన్నవారి మీద ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేయటం తెలిసిందే. అయితే వారు అధికారానికి వచ్చిన తరువాత వాటిని మరచిపోయినట్లు వ్యవహరించారు. కానీ ఇప్పుడు పరిస్ధితులు మారాయి. అధికారం కోసం ఎంతకైనా తెగించే ధోరణులు ప్రబలిన కారణంగా అంతే స్ధాయిలో కక్షలూ పెరిగాయి. ప్రతిపక్షంలో ఉండి తమను ఎదిరించిన వారిని ఆర్ధికంగా దెబ్బతీయటం, రాజకీయంగా అవమానించటం అనే కక్షపూరిత ధోరణులు దక్షిణాదిలో తొలుత తమిళనాడులో ప్రారంభమయ్యాయి.అధికార రాజకీయ కక్షలు ఎంత తీవ్రంగా ఉంటాయో,నీచ స్ధాయికి దిగజారుతాయో మాజీ ముఖ్యమంత్రి జయలలిత విషయంలో చూశాము. ఎంజిఆర్ మరణించినపుడు మృతదేహం దగ్గర ఆమెపై జరిగిన దాడి, గెంటివేత ఒకటైతే ఆ తరువాత రెండు సంవత్సరాలకు అసెంబ్లీలో ప్రతిపక్షనాయకురాలిగా ఉన్న ఆమెపై దాడి, చీరలాగివేసి అవమానించిన తీరు ఎరిగినదే. ఈ నేపధ్యంలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎలాంటి పరిణామాలను చూడాల్సి ఉంటుందో !
ఇలాంటి కక్ష, దెబ్బతీసే ధోరణులు పపంచమంతటా ఉన్నాయి. అందువలన తమ నేతకు కక్ష సాధించే లక్షణం లేదని ఎవరైనా వైసిపి కార్యకర్తలు, నేతలు చెప్పుకుంటే అది ఆత్మవంచనే అవుతుంది. ముందే చెప్పుకున్నట్లు కేసుల్లో అరెస్టు చేయటం వేరు. అరెస్టు చేసిన తీరు విపరీతంగా ఉన్నపుడు దానిలో కక్ష పాలు లేదని ఎలా చెప్పగలరు ? అచ్చెన్నాయుడిని అరెస్టు చేయదలచుకుంటే సాధారణంగానే ఆపని చేయవచ్చు గానీ అర్దరాత్రి అంత హైడ్రామా ఆడాల్సిన పనిలేదు. సినిమాల్లో పేరు మోసిన బందిపోటు, గజదొంగలు, లేదా స్మగ్లర్లను పట్టుకొనే మాదిరి దృశ్యాలకు తెరతీయాల్సినపని లేదు.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతల మీద ఇప్పటికే బనాయించిన కేసులు,రాబోయే కేసుల గురించి జనానికి ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఒక సాధారణ అంశంగానే తీసుకుంటున్నారు. అందుకే మీడియా ముందు నేతలు గుండెలు బాదుకుంటున్నా అవన్నీ మామూలే అనుకుంటున్నారు. తెలుగుదేశం పాలనలో లేదా అంతకు ముందు కాంగ్రెస్ పాలనలో అవినీతి జరగలేదని ఎవరూ చెప్పటం లేదు సమర్ధించటమూ లేదు. అందుకు బాధ్యులైన వారు రాజకీయ నేతలైనా, వారికి సహకరించి వాటా పొందిన ఉన్నత అధికారులైనా సరే విచారణ, కేసులను ఎదుర్కోవాల్సిందే.
రాజకీయ నేతలు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి లేకపోతే అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవాల్సి ఉంటుందని యనమల రామకృష్ణుడి ఉదంతం తెలియచేస్తోంది. మాజీ ఎంఎల్‌ఏ పిల్లి అనంత లక్ష్మి కుమారుడికి యనమల స్వగ్రామంలో రెండవ వివాహం చేసేందుకు ఏర్పాటు చేయగా దానికి ఎనమలతో పాటు సోదరుడు కృష్ణుడు, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు. అది తెలిసిన అనంత లక్ష్మి కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ వివాహాన్ని నిలిపివేయించింది. ఆమె దళిత యువతి, తన భర్తకు రెండవ వివాహం చేయించేందుకు ప్రయత్నించారని, తనను బెదిరించారని ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార చట్టం కింద కేసుదాఖలు చేసింది. ఈ ఉదంతంలో పాలకపార్టీ పెద్దల ప్రమేయంతో ఆ యువతి కేసు దాఖలు చేసిందని తెలుగుదేశం నేతలు చెప్పుకోవచ్చు. ఒక వివాహంలో సమస్యలు వచ్చి విడాకులు తీసుకోకుండానే మరో వివాహం చేయటం, దానికి హాజరు కావటం ఒక అక్రమాన్ని ప్రోత్సహించటమే అవుతుంది. మాకు వివరాలు తెలియదు అంటే చట్టం అంగీకరించదు.
ఆర్ధిక మూలాలను దెబ్బతీసే ఎత్తుగడలు ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణాలో ప్రస్తుతం ఉన్న పాలకులు కొత్తగా ప్రారంభించినవేమీ కాదు. అంతకు ముందే నాంది పలికారు. దానిలో భాగమే ప్రతి పార్టీలో గెలిచిన నేతలను అధికారపక్షం వైపు ఆకర్షించటం లేదా పరోక్షంగా బెదిరించటం అన్నది బహిరంగ రహస్యం. ఇప్పటికే అవి పరాకాష్టకు చేరాయి. రానున్న రోజుల్లో సాధారణం అవుతాయి. ఎన్నికల్లో డబ్బు అన్నది ప్రధాన పాత్ర వహిస్తున్నందున ఓటర్లు కూడా నేతల నైతిక ప్రవర్తనకు బదులు జేబులను చూస్తున్నారు.ఇది పార్టీలు మారేందుకు, అధికారం ఎక్కడుంటే అక్కడకు చేరేందుకు రాజకీయనేతలకు మరింత వెసులుబాటు కలిగిస్తోంది.
గత పాలకుల అవినీతిపై కేసులు బనాయించటం, జైలు పాలు చేయటం రాబోయే రోజుల్లో ఏ పర్యవసానాలకు దారి తీస్తుంది ? అధికారపక్షంలో ఉన్నవారి అవినీతి మీద ప్రతిపక్షం నిరంతరం ఒక కన్నువేసి ఉంచుతుంది. ఎప్పటికప్పుడు బయటపెట్టేందుకు ప్రయత్నిస్తుంది. అధికారగణం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. అధికారపక్షం తన అవినీతిని కప్పి పుచ్చుకొనేందుకు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది, కొత్త పుంతలు తొక్కిస్తుంది.
వైఎస్ జగన్మోహనరెడ్డి, అనుయాయుల మీద ఉన్న కేసులు ఆశ్రిత పెట్టుబడిదారుల నుంచి లబ్దిపొందారన్న స్వభావం కలిగినవి. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా కొందరు పెట్టుబడిదారులు, వాణిజ్యవేత్తలకు అనుచిత లబ్ది కలిగిస్తే దానికి ప్రతిగా జగన్ కంపెనీల్లో పెట్టుబడుల రూపంలో ప్రతి లబ్ది కలిగించారన్నవి, మరికొన్ని ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు ఎదుర్కొనేవి స్వయంగా అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించినవి. ఏవైనా చిన్నవా, పెద్దవా అన్నది కాదు. అక్రమాలకు పాల్పడ్డారా లేదా అన్నదే అసలు సమస్య. కోట్లాది రూపాయలను అక్రమంగా వెనుకేసుకొని జైలుపాలైతే కుటుంబ సభ్యులు వాటిని దర్జాగా అనుభవిస్తారు. అలాంటి ఘరానా పెద్దలు జైల్లో ఉన్నా వారి భోగాలకు కొదవ ఉండదు. కొన్నేండ్లు జైల్లో ఉండి వచ్చినంత మాత్రాన సమాజంలో గౌరవానికి ఎలాంటి ఢోకా ఉండటం లేదు. బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఎగవేసిన వారికి సంబంధించి ఆస్తుపాస్తులేవైనా ఉంటే వాటిని జప్తుచేసి ఎంతో కొంత రాబట్టేందుకు అవకాశం ఉంది. అవినీతి కేసులో ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయినా, లేదా కొన్ని కంపెనీలు, వ్యక్తులకు కట్టబెట్టినా ఆ మొత్తాన్ని రాబట్టినపుడే భవిష్యత్‌లో అవినీతికి పాల్పడే వారికి కాస్త బెరకు ఉంటుంది. అందుకు తగిన విధంగా వైసిపి ప్రభుత్వం బనాయిస్తున్న కేసులు ఉన్నాయా? ప్రజల సొమ్మును తిరిగి వసూలు చేసే సత్తా ప్రభుత్వానికి ఉందా అన్నదే ఇప్పుడున్న సవాలు.
కరోనాను వెనక్కు నెట్టి వైఎస్ జగన్ కక్ష కొరడాను తీస్తున్నారా !
14 Sunday Jun 2020
Posted AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties
in