Tags

, , ,

ఎం కోటేశ్వరరావు
అబ్బో ఆరోజులే వేరు. మన జనం ఎంత త్యాగశీలురు, సహనమూర్తులుగా ఉండేవారు. జేబులను కొల్లగొడుతున్నా స్వేచ్చా వాయువులను పీలుస్తూ మైమరచి పోయే వారు. అప్పటి వరకు సహనంలో మనకు మనమే సాటి అని ఒకదాని నొకటి వెనుక కాళ్లతో తన్నుకొని పరస్పరం అభినందించుకున్న గాడిదలు కూడా విస్తుపోయేలా జనం సహనశీలురుగా ఉండేవారు అని చరిత్ర గురించి కొత్త తరాలకు తాతయ్యలు, తాతమ్మలు చెప్పే రోజు వస్తుందా ?
చూస్తుంటే అదే అనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు గణనీయంగా పడిపోయిన మేరకు వినియోగదారులకు ధర తగ్గించకపోయినా నోరెత్తలేదు. వరుసగా పెట్రోలు, డీజిలు ధరలు (ఇది రాసే సమయానికి తొమ్మిది రోజులు) పెంచుతున్నా ఇదేమిటి అన్నట్లుగా కూడా చూడటం లేదు. మన మెదళ్లలో ఎందుకు అని ప్రశ్నించే సాప్ట్‌వేర్‌ పని చేయటం లేదా లేక హార్డ్‌వేర్‌ చెడిపోయిందా అన్న అనుమానం కలుగుతోంది. అసలు ఏదీ పట్టించుకోని వారికి అంధులకు ఇంధ్రధనుస్సును చూపించినట్లు ఎన్ని వివరాలు చెప్పినా ప్రయోజనం ఏముంది ! ఉండబట్టలేక వామపక్షాలు పిలుపులు ఇచ్చినా జనం పట్టించుకోనపుడు మిగులుతున్నది కంఠశోష మాత్రమే.
2019 మే నెలలో మనం సగటున ఒక పీపా ముడి చమురును రూ.4,664కు, జూన్‌ నెలలో రూ.4,149కి కొనుగోలు చేస్తే ఈ ఏడాది జూన్‌ 15 ధర రూ.2,642 ఉంది. అంతకు ముందు పదిహేను రోజులుగా దీనికి కాస్త అటూ ఇటూగా ఉంది తప్ప మిన్ను విరిగి మీద పడినట్లు పెరగలేదు. లీటరు పెట్రోలు ధర ఢిల్లీలో రూ.69.59గా ఉన్నదానిని మార్చి 16 నుంచి 82 రోజుల పాటు ఎలాంటి మార్పు చేయలేదు. తొమ్మిది రోజులుగా పెంచిన ఫలితంగా అది రూ.76.26కు పెరిగింది.
గతేడాది డిసెంబరు నెలలో సగటున ఒక పీపాను 66 డాలర్లకు కొనుగోలు చేశాము. అప్పుడు ధర వినియోగదారుడికి లీటరు పెట్రోలు ఢిల్లీలో 75.14 ఉండేది. 2015లో ఇదే సర్కార్‌ ఏలుబడిలో పీపా 35.68 డాలర్లకు కొనుగోలు చేసినపుడు వినియోగదారులకు రూ.59.98కి విక్రయించారు. ఇంకాస్త ముందుకు పోతే 2004లో పీపా ధర 34.22 డాలర్లు ఉన్నపుడు రూ.35.71కి దొరికింది. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్రణాళిక మరియు విశ్లేషణ విభాగం 2020 జూన్‌ 11వ తేదీన నవీకరించిన ప్రకారం మార్చినెలలో ఒక పీపా చమురు సగటున మన దేశం 33.36 డాలర్లకు దిగుమతి చేసుకుంది. అది ఏప్రిల్‌ నెలలో 19.9డాలర్లకు పడిపోయింది. మే నెలలో 30.60 డాలర్లకు పెరిగింది. జూన్‌ 15న ధర 40.66 డాలర్లు ఉంది తప్ప వెనుకటి అరవై డాలర్ల స్ధాయికి చేరకపోయినా తొమ్మిది రోజులుగా ఎందుకు పెంచుతున్నట్లు ? 2020 జూన్‌ తొమ్మిదవ తేదీన హిందూస్దాన్‌ పెట్రోలియం వెల్లడించిన సమాచారం ప్రకారం ఢిల్లీలో పెట్రోలు ధర రూ.73.04 ఉంటే దానిలో డీలరుకు విక్రయించిన ధర రూ.19.63 అయితే కేంద్ర ప్రభుత్వ ఎక్సయిజ్‌ పన్ను రూ.32.98, డీలర్లకు కమిషన్‌ రూ.3.57, ఢిల్లీ ప్రభుత్వ వ్యాట్‌ రూ.16.86లు ఉంది.
ఈ అన్యాయం గురించి వామపక్షాలు, ఇతర పార్టీలు బిజెపి దృష్టిలో జాతి వ్యతిరేకులు కనుక మాట్లాడటం లేదు అనుకుందాం. మరి అసలు సిసలు జాతీయ వాదులుగా పిలుచుకొనే బిజెపి ఈ ధరల దోపిడీ గురించి మాట్లాడదేం ? లీటరుకు ఒక రూపాయి పన్ను పెంచితే కేంద్రానికి ఏడాదికి 14వేల రూపాయల అదనపు ఆదాయం వస్తుంది. ధర పెంచితే పెట్రోలియం కంపెనీలకు లాభం వస్తుంది. వినియోగదారు జేబుకు చిల్లిపడుతుంది.
గొప్పలు చెప్పుకోవటంలో బిజెపి తరువాతే . కానీ అది తమకు ప్రయోజనం అనుకున్నవాటి విషయంలోనే సుమా ! సిగ్గుపడాల్సిన వాటిని ప్రస్తావించేందుకు సైతం భయపడతారు. గ్లోబల్‌ పెట్రోల్‌ ప్రైసెస్‌ డాట్‌ కామ్‌ ప్రతి వారం అధికారిక సమాచారం అధారంగా ధరలను సమీక్షిస్తుంది. ఈ మేరకు జూన్‌ ఎనిమిది నాటి సమాచారం ప్రకారం ప్రపంచంలో పెట్రోలు లీటరు సగటు ధర 95 సెంట్లు(డాలరుకు వంద సెంట్లు). మన ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్ధాన్‌లో 46,మయన్మార్‌లో 48, భూటాన్‌లో 66,నేపాల్లో 80, చైనాలో 83, శ్రీలంకలో 87, మన దేశంలో 101 సెంట్లు కాగా బంగ్లాదేశ్‌లో 105 సెంట్లు ఉంది. బంగ్లా మినహా మిగిలిన దేశాలలో రేట్లు ఎందుకు తక్కువ ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం చెప్పగలదా ? బిజెపి మరుగుజ్జులు ఈ వాస్తవాలను కాదనగలరా ?
మన్మోహన్‌ సింగ్‌ గారి ” చెడు ” రోజులు చివరిలో లేదా నరేంద్రమోడీ గారి ” మంచి రోజుల ” ప్రారంభంలో లీటరు పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వ పన్ను రూ.9.48, 3.56 చొప్పున ఉంటే ఆరు సంవత్సరాల తరువాత ఇప్పుడు రూ.32.98, 31.83 చొప్పున వసూలు చేస్తున్నారు.
వరుసగా చమురు ధరలను ఎందుకు పెంచుతున్నారు అన్నది ప్రశ్న. కనిష్టానికి పడిపోయిన ముడి చమురు ధరలు పూర్వపు స్ధితికి చేరకపోయినా తిరిగి పెరుగుతున్నాయి. మన దేశంలో 2019-20 సంవత్సరంలో చమురు కంపెనీలకు ఒక లీటరుకు లాభం సగటున రూ.2.20 ఉంది. చమురు ధరలు భారీగా తగ్గిన కారణంగా కేంద్ర ప్రభుత్వం పన్ను భారాన్ని మోపినప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెలల్లో రూ.13 నుంచి 19 వరకు లాభాలు వచ్చాయి. ఐసిఐసిఐ సెక్యూరిటీస్‌ సమాచారం ప్రకారం మే నెల 1-5 తేదీల మధ్య లీటరుకు రూ.16.10 ఉన్న లాభం కాస్తా కేంద్ర ప్రభుత్వం మే ఆరు నుంచి పెట్రోలు మీద 10 డీజిలు మీద 13 రూపాయల పన్ను పెంచిన కారణంగా చమురు మార్కెటింగ్‌ కంపెనీల లాభం రెండింటి సగటు లాభం రూ.3.90కి పడిపోయింది. తరువాత ముడి చమురు ధరలు స్వల్పంగా పెరిగినందున మే మధ్య నాటికి కంపెనీలకు ఒక లీటరుకు రూ.1.84, మే ఆఖరు నాటికి 1.56 తరుగు వచ్చిందట. దాంతో తిరిగి ధరలను పెంచటం ప్రారంభించాయి, ఒక్క రోజులో పెంచితే సంచలనాత్మకంగా ఉంటుంది కనుక రోజూ కాస్త కాస్త పెంచుతున్నాయి. అంటే తరుగుపోయి మిగుల్లోకి వచ్చేంత వరకు పెంచుతూనే ఉంటాయి. ఏప్రిల్‌-జూన్‌ మాసాలలో సగటున లీటరుకు రూ.7.9 మిగులు ఉంటుందనుకుంటే అది తరుగులోకి వచ్చింది. అందు వలన కనీసం రూ.5.10 మిగులు ఉండేట్లు చూడాలని నిర్ణయించారని వార్తలు. అంటే ఆ మేరకు లాభాలు వచ్చే వరకు పెంచుతూనే ఉంటారు. చమురు వినియోగం పడిపోయిన సమయంలో చమురు శుద్ధి కర్మాగారాలు కూడా ఆమేరకు తగ్గించాల్సి వచ్చింది. ఆ సమయంలో వాటికి వచ్చిన నష్టాలను కూడా ఇప్పుడు పూడ్చుకుంటున్నాయి. అందువలన ఇప్పుడున్న ముడి చమురు ధర ఇంకా పెరిగితే వినియోగదారుల జేబుల నుంచి కొట్టివేయటం తప్ప కేంద్రం పన్ను తగ్గించదు. ధరలూ తగ్గవు.
మన దేశంలో ఉన్న చమురు పన్ను ప్రపంచంలో మరెక్కడా లేదంటే మోడీ గారి మంచి రోజులకు, ఇంత పన్ను భరించటం మన జనాల సహనానికి చిహ్నం. కేర్‌ రేటింగ్స్‌ సంస్ధ వెల్లడించిన విశ్లేషణ ప్రకారం ఫిబ్రవరి 2020 నాటికి కేంద్రం, రాష్ట్రాలు విధిస్తున్న పన్ను సగటున పెట్రోలుపై 107, డీజిల్‌పై 69శాతం ఉంది. మార్చి 16వ తేదీన ఆ పన్నులు 134,88శాతాలకు పెరిగాయి. మే మొదటి వారంలో అవి 260,256 శాతాలకు చేరాయి. జర్మనీ, ఇటలీ దేశాల్లో 65శాతం, బ్రిటన్‌లో 62, జపాన్‌లో 45, మోడీ దోస్తు ట్రంప్‌ ఏలుబడిలో 20శాతం వరకు పన్నులు ఉన్నాయి. నరేంద్రమోడీ ఎంత గొప్పవ్యక్తో ఇతర ప్రపంచ నేతలతో పోల్చితే అది దేశభక్తి, ప్రజలపై భారాలను పోల్చితే అది దేశద్రోహం !