Tags

, , ,


ఎం కోటేశ్వరరావు
అవును జగన్మోహనరెడ్డే ఆంధ్రప్రదేశ్‌-ఆంధ్రప్రదేశ్‌ అంటేనే జగన్మోహనరెడ్డి అన్నట్లుగా అధికారపక్షం భజన చేస్తున్నపుడు అన్నింటికీ బాధ్యుడు జగనే కదా ! మంగళవారం నాడు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ తన రెండవ బడ్జెట్‌ విన్యాసాలు ప్రదర్శించారు. ఆయన బడ్జెట్‌ ప్రసంగంలో అడుగడుగునా జగన్నామ స్పరణం చేశారు మరి. గతేడాది రెండు లక్షల 27వేల 975 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. దాన్ని రూ.1,74,757 కోట్లకు సవరించారు. అంటే 53వేల కోట్ల రూపాయల కోత పెట్టారు. ఇది కూడా జగన్‌ అనుమతి లేకుండా చేసేంత స్వతంత్ర ప్రతిపత్తి ఆర్ధిక మంత్రికి ఉందనుకోవటం లేదు. గత ఏడాది కాలంలో నవరత్నాలకు, మరికొన్ని మరకతాలు తోడయ్యాయి తప్ప తగ్గలేదు. మరి అన్ని వేల కోట్ల రూపాయలను ఏ రంగాలకు తగ్గించినట్లు ? నవరత్నాలకు తగ్గించిన దాఖల్లాలవు కనుక కచ్చితంగా అభివృద్ధి పనులకే అని వేరే చెప్పాల్సిన పనేముంది. మరో విధంగా చెప్పాలంటే గతేడాది కాలంలో ఎంత అప్పయితే చేశారో అంతమేరకు అభివృద్ది పనులకు కోతలు పెట్టారు. తెచ్చిన అప్పును నవరత్నాలకు వినియోగించారు. కొందరు దీన్నే అప్పుచేసి పప్పుకూడు అంటున్నారు.
చంద్రబాబు సర్కార్‌ దిగిపోయే ముందు ఏడాది లక్షా 91వేల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించి ఏడాది చివరికి వచ్చేసరికి లక్షా 62వేల కోట్లకు (29వేల కోట్లు) కుదించింది. జగన్‌ ప్రభుత్వం తొలి ఏడాది దాన్నే రెండులక్షల 28వేల కోట్లకు పెంచి లక్షా 74వేల కోట్లకు(53వేల కోట్లు) కుదించింది. ఇది చంద్రబాబు కంటే ఎక్కువా తక్కువా ? జగన్‌ గారి ఇంగ్లీషు మీడియం పిల్లలు కూడా మోర్‌ దేన్‌ చంద్రబాబు సర్‌ (చంద్రబాబు కంటే ఎక్కువే అండీ) అని కచ్చితంగా చెబుతారు. వారిని పచ్చ పిల్లలు అనకండి, చాల బాగోదు.
చంద్రబాబు నాయుడు బిజెపితో అంటకాగారు కనుక రాష్ట్రానికి జరిగిన అన్యాయాల గురించి మాట్లాడలేని బలహీనతకు లోనయ్యారు. అందుకే కేంద్రం నుంచి రావాల్సిన వాటిని రాబట్టలేకపోయారు. ఆ మధ్య ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాల గురించి అడిగేందుకు ఢిల్లీ పర్యటన ఏర్పాటు చేసుకున్నారు. చివరి క్షణంలో మంత్రుల చెయ్యి ఖాళీ లేదు రావద్దు అని వర్తమానం పంపారని వార్తలు. అసలు రమ్మనటమెందుకు ? ఖాళీగా లేమని వద్దనటమెందుకు ? తమాషాగా ఉందా ? ఇది వ్యక్తిగతంగా జగన్‌కు ఏమిటన్నది ప్రధానం కాదు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రికి జరిగిన అవమానంగానే పరిగణించాలి.
తెలుగుదేశం సర్కార్‌ చివరి బడ్జెట్‌లో కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంటుల మొత్తం 50,695 కోట్లుగా చూపితే సవరించిన దాని ప్రకారం వచ్చిన మొత్తం 19,456 కోట్లు మాత్రమే. జగన్‌ సర్కార్‌ వస్తుందని చూపిన మొత్తం 61,071 కోట్లు కాగా వచ్చిందని చూపిన మొత్తం 21,876 కోట్లు మాత్రమే. వర్తమాన సంవత్సరంలో వస్తుందని చూపిన మొత్తం 53,175 కోట్లు. రెండేళ్ల తీరు తెన్నులు చూస్తే రాష్ట్రం రావాలంటున్న మొత్తం రాదని తేలిపోయింది. అసలు ఆ మొత్తం రాష్ట్రానికి ఇవ్వాలా లేదా ? బిజెపి నేతలు తమ పలుకుబడిని ఉపయోగించలేరా ? వారికి బాధ్యత లేదా ? జగన్‌ ఎలాగూ గట్టిగా అడగలేరు. చంద్రబాబు నాయుడి సంగతి సరే సరి. అలాంటపుడు అంత మొత్తాలను బడ్జెట్‌లో చూపటమెందుకు ? వస్తుందో రాదో ఖరారు చేసుకోవటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది. ఎందుకీ దోబూచులాట ?
కీలకమైన సాగునీటి రంగానికి జగన్‌ తొలి బడ్జెట్‌లో 13,139 కోట్లు కేటాయించి చివరకు ఖర్చు చేసింది 5,345 కోట్లు మాత్రమే. రెండవ బడ్జెట్లో కేటాయింపు రూ. 11,805 కోట్లు మాత్రమే ప్రతిపాదించటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. వ్యవసాయ ప్రధాన రాష్ట్రంగా మారటం, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో వున్న పూర్వరంగంలో దానికి జీవ ధార అయిన నీటి పారుదల రంగానికి కేటాయింపుల మేరకైనా ఖర్చు చేయకుండా, పెంచకుండా పోలవరం లేదా నిర్మాణంలో వున్న ఇతర సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తయి రైతులకు ఎలా వుపయోగపడతాయో తెలియదు. మరికొన్ని ముఖ్యమైన రంగాల కేటాయింపుల తీరుతెన్నులు ఎలా ఉన్నాయో చూడండి.( కేటాయింపులు కోట్ల రూపాయల్లో )
శాఖ 2019-20 ప్రతిపాదన —సవరణ —–2020-21ప్రతిపాదన——- శాతాలలో కోత
గ్రామీణాభివృద్ది 31,564 —- 11,661 — 16,710 —– 47.10
వ్య-సహకారం 18,327 — 5,986 —- 11,891 —- 35.12
పశు సంవర్ధక 1912 —- 720 — 1,279 —– 33.08
పరిశ్రమలు, వాణి 3,416 —- 852 —- 2,705 —- 20.82
సెకండరీ విద్య 29,772—- 17,971 — 22,604 —– 24.08
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్య జీవనాధారం వ్యవసాయం, గ్రామీణ రంగాలు వాటికి కేటాయింపులు ఎంత పెద్దమొత్తంలో కోత పెట్టారో చూస్తే రాష్ట్రాన్ని ఏం చేయదలచుకున్నారో అర్ధం అవుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. సంక్షేమ చర్యలను ఎవరూ తప్పుపట్టటం లేదు. అవి ఉపశమనం కలిగించే చర్యలే తప్ప సంపదలను ఉత్పత్తి చేసేవి కాదు. అందువలన సమతూకం తప్పితే సంక్షేమ పధకాలను పొందిన పేదల జీవితాలు కూడా ఎక్కడ వేసిన గొంగళి మాదిరి అక్కడే ఉంటాయి తప్ప సంక్షేమ చర్యలతో మెరుగుపడిన దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా లేవు.
ఓటు బ్యాంకు రాజకీయాలు లేదా వచ్చే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో విజయం గమనంలో ఉంచుకొని గానీ వెనుకబడిన తరగతుల సంక్షేమానికి గతేడాది 7,271 కోట్లు కేటాయించి 18,986 కోట్లు ఖర్చు చేసి ఈ బడ్జెట్‌లో 26,934 కోట్లు ప్రతిపాదించారు. అదే విధంగా మైనారిటీల సంక్షేమానికి 952 కోట్ల కేటాయింపు, 1,562 కోట్ల ఖర్చు, కొత్తగా 2,055 కోట్లు ప్రతిపాదించారు.
కరోనా వైరస్‌ దేశంలో ఒక అంశాన్ని ముందుకు తెచ్చింది. ప్రజారోగ్య వ్యవస్ధను నిర్లక్ష్యం చేస్తే అలాంటి మహమ్మారులు వచ్చినపుడు ప్రయివేటు రంగం చేతులెత్తివేస్తుందని తేలిపోయింది. అందువలన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు తగినన్ని నిధులు కేటాయించి ప్రభుత్వ ఆసుపత్రుల స్ధాయిని మెరుగుపరచాల్సి ఉంది. గతేడాది రూ.11,399 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది 7,408 కోట్లు మాత్రమే ఈ ఏడాది కేటాయింపు 11,419 కోట్లు మాత్రమే చూపారు.
వ్యవసాయం, నీటి పారుదల, గ్రామీణాభివృద్ధి వంటి ఆర్ధిక సేవల రంగాలకు గత బడ్జెట్‌లో 37.8 శాతం కేటాయిస్తే తాజా బడ్జెట్‌లో ఆ మొత్తాన్ని 27.39కి కోత పెట్టారు. ఇదే సమయంలో విద్య, వైద్యం, గృహనిర్మాణం వంటి సామాజిక సేవలకు 33 నుంచి 43శాతానికి పెంచారు. వీటిలో సాధారణ విద్యకు 14.38శాతంగా ఉన్న మొత్తాన్ని 11.21శాతానికి కోత పెట్టారు. సంక్షేమ చర్యల వాటాను 6.2 నుంచి 18.44శాతానికి పెంచారు. కరోనా వైరస్‌ కారణంగా పారిశుధ్య కార్మికుల సేవల గురించి పెద్ద ఎత్తున నీరాజనాలు పలికారు. బడ్జెట్‌లో మంచినీటి సరఫరా, పారిశుధ్య బడ్జెట్‌ను 2234కోట్ల నుంచి 1644 కోట్లకు తగ్గించటాన్ని ఏమనాలి ?
తెలుగుదేశం సర్కార్‌ చివరి ఏడాది రూ. 38,151 కోట్ల మేర అప్పులు తెచ్చింది. దాన్ని తీవ్రంగా విమర్శించిన జగన్‌ తొలి ఏడాది ఆ మొత్తాన్ని 52వేల కోట్లకు పెంచారు. వర్తమాన సంవత్సరానికి 60 వేల కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు. అల్లుడికి బుద్ధి చెప్పి మామ తప్పు చేసినట్లుగా లేదూ ఇది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ వాటాగా వచ్చిన అప్పు 97వేల కోట్ల రూపాయలు. చంద్రబాబు ఏలుబడిలో అది 2018-19 నాటికి రెండులక్షల 57వేల 509 కోట్ల రూపాయలకు చేరింది. ఇవి గాక రాష్ట్ర ప్రభుత్వశాఖలు తీసుకున్న మరో 54వేల 250 కోట్ల రూపాయల అప్పులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే మొత్తం అప్పు మూడు లక్షల 11వేల కోట్లకు చేరింది. ఆ మొత్తాన్ని జగన్‌ సర్కార్‌, 3,02,202, 67,171 చొప్పున మొత్తం 3,69,373 కోట్లకు పెంచారు. వచ్చే ఏడాదికి 3,48,998 అప్పు పెరుగుతుందని పేర్కొన్నది, వీటికి అదనంగా హామీగా ఉన్న అప్పును కలుపుకోవాల్సి ఉంది. అంటే మొత్తం నాలుగు లక్షల కోట్లు దాటటం ఖాయం. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో గత నాలుగు సంవత్సరాలుగా 27.92శాతంగా ఉన్న అప్పు వచ్చే ఏడాదికి చివరికి 34.55 శాతానికి పెరుగుతుందని ఆర్ధిక మంత్రి బడ్జెట్‌ పత్రాల్లో వెల్లడించారు. అందుకే జగనాంధ్ర అప్పుచేసి పప్పు కూడు ఆంధ్రగా మారబోతోందని చెప్పాల్సి వస్తోంది.