Tags
annihilation of communists Jakarta Method, Indonesian Communist Party (PKI)., Jakarta Method, US anti communism
జోర్డాన్ రాజధాని అమ్మాన్ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న మీడియా సంస్ద అల్ బవాబా డాట్ కామ్ లండన్ ప్రతినిధి నికోలస్ ప్రిట్‌చర్డ్ ఇటీవల అమెరికన్ జర్నలిస్టు విన్సెంట్ బెవిన్స్‌తో ఇంటర్వ్యూ చేశాడు. ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టు , వామపక్ష శక్తుల నిర్మూలనకు అమెరికా, దాని అండతో వివిధ దేశాలు అనుసరించిన దుర్మార్గ పద్దతుల గురించి వర్తమాన తరాలకు ఆసక్తి కలగించే అంశాలను వెల్లడించారు.1960దశకంలో ఇండోనేషియాలో నియంత సుహార్తో అమెరికన్ల అండతో దాదాపు పదిలక్షల మంది కమ్యూనిస్టులు లేదా కమ్యూనిస్టులని అనుమానించిన వారిని ఎలా చంపివేశారో విన్సెంట్ బెవిన్స్ అధ్యయనం చేశాడు. ఇండోనేషియాలో పరిమితంగానే బయలు పరచిన నాటి రహస్య పత్రాలను పరిశీలించాడు. అంతకు ముందు తరువాత అనేక దేశాలలో జకర్తా పద్దతి పేరుతో అమలు జరిపిన మారణకాండ గురించి ఈ క్లుప్త ఇంటర్వ్యూలో వివరించాడు.(జకర్తా మెథడ్ : వాషింగ్టన్స్ యాంటీ కమ్యూనిస్టు క్రూసేడ్ అండ్ ద మాస్ మార్డర్ ప్రోగ్రామ్ దట్ షేప్‌డ్ అవర్ వరల్డ్ ” అనే పేరుతో విన్సెంట్ బెవిన్స్ రాసిన పుస్తకాన్ని మే నెలలో పబ్లిక్ ఎఫైర్స్ అనే సంస్ధ ప్రచురించింది. ఈ సందర్భంగా చేసిన ఇంటర్వ్యూను జూన్ పదకొండున అల్ బవాబా ప్రచురించింది.) 2017లో పత్రాలను విడుదల చేసిన సమయంలో వచ్చిన వార్తల ఆధారంగా ఈ అనువాదకుడు రాసిన వ్యాసపు లింక్ చివరిలో ఉంది.
నికొలస్ ప్రిచర్డ్ : జకర్తా పద్దతి అంటే ఏమిటి ?
విన్సెంట్ బెవిన్స్: వామపక్ష వాదులు లేదా వామపక్ష వాదులని ముద్రవేసిన అమాయక పౌరులను కావాలని సామూహికంగా హతమార్చటమే జకర్తా పద్దతి. ప్రచ్చన్న యుద్ద సమయంలో ఈ ఎత్తుగడను వినియోగించారు. ఇది ముఖ్యమైన మూలమలుపు. అమెరికా మరియు ప్రపంచ వ్యవస్దను రూపొందించాలని చూసిన వారి వైపు నుంచి చూస్తే పెద్ద విజయం, అంతిమంగా విజయం సాధించింది. ఈ విజయం రూఢి అయింది కాబట్టే అమెరికా దాని అనుయాయి దేశాలు ఈ పద్దతిని కాపీ చేయటం ప్రారంభించాయి.1970దశకం ప్రారంభంలో చిలీ, బ్రెజిల్‌లో తమకు ముప్పుగా పరిణమిస్తారు లేదా అనిపించిన అమాయకులను హతమార్చేందుకు ఈ పద్దతిని అనుసరించారు. సామూహిక హత్యలని అర్ధమిచ్చే విధంగా జకర్తా పదాన్ని వినియోగించారు. అయితే ప్రతి దేశం ఆ పదాన్ని వినియోగించలేదు గానీ ఇరవైకి పైగా అమెరికా అనుయాయి దేశాల్లో నిరాయుధులైన వామపక్ష శక్తులను సామూహికంగా హతమార్చటానికి ప్రభుత్వాలు జకర్తా పద్దతి పధకాలను అమలు జరపటాన్ని గమనించాను.
హొనికొలస్ ప్రిచర్డ్ :వలసల అనంతర స్వాతంత్య్ర దేశాలను పురికొల్పిందేమిటి ?
విన్సెంట్ బెవిన్స్: ప్రచ్చన్న యుద్ద సందర్భంలో తృతీయ ప్రపంచ దేశాల ఆవిర్భావం జరిగింది. ఇప్పుడు ఈ పదాన్ని తరచూ నీచ అర్ధంలో వాడుతున్నారు. కానీ ఆ సమయంలో అది పూర్తిగా సానుకూల మరియు ఆశావాదంతో ఉండేది. ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో ఈ ఉద్యమ స్ధాపక ప్రముఖులు, దార్శనికులలో ఒకరు.1955లో ఆసియా, ఆఫ్రికా దేశాలను దగ్గరకు చేర్చారు.వాషింగ్టన్(అమెరికా)కు ఇది ఒక సమస్యగా మారింది.
నికొలస్ ప్రిచర్డ్: అనేక తృతీయ ప్రపంచ దేశాలు అమెరికా-సోవియట్ యూనియన్ మధ్య సమతూకాన్ని పాటించేందుకు ప్రయత్నించాయి. కానీ సుకర్నో అమెరికా శత్రువు అయ్యాడు, అప్పుడు ఏమైంది?
విన్సెంట్ బెవిన్స్: అంతకు ముందు ఉనికిలో లేని ఒక పెద్ద అగ్రరాజ్యంతో దెబ్బలాడేందుకు ఎలాంటి కారణం లేదు. వలస అనంతర కమ్యూనిస్టులలో కొందరు అమెరికాతో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నించారు.1945లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం ప్రకటించిన సమయంలో వియత్నాం నేత హౌచిమిన్ అమెరికా స్వాతంత్య్ర ప్రకటనను ప్రస్తావించారు. సుకర్నో కూడా అమెరికా విమోచన యుద్ద వారసత్వ పరిధిలోనే 1955 సభ నిర్వహించారు.అయితే చివరికి అమెరికా పరిష్కరించాల్సిన సమస్యలు లేదా ఇతర కారణాలతో శత్రువులుగా తేలారు.అది విషాదకర ఫలితాలకు దారి తీసింది.
నికొలస్ ప్రిచర్డ్: ఇండోనేషియాలో మిలిటరీకి మద్దతుగా అమెరికా నిలిచేందుకు దారి తీసిన కీలక విధాన నిర్ణయాలేమిటి ?
విన్సెంట్ బెవిన్స్: ప్రచ్చన్న యుద్దం తొలి రోజులలో అమెరికా తీసుకున్న వైఖరి గురించి మాట్లాడుకున్నట్లయితే తటస్ధంగా ఉన్నప్పటికీ ప్రతి తృతీయ ప్రపంచ దేశాన్ని అది వ్యతిరేకించింది. దానికి రెండు విరుద్ద వివరణలు ఉన్నాయి. ఒకటేమి చెబుతుందంటే కమ్యూనిజం, జాతీయ భావనలతో ఉన్న దేశాలతో తమకు ముప్పు అనే తీవ్ర మానసిక వ్యాధికి అమెరికా గురైంది. ప్రపంచంలో దోపిడీ చేస్తున్న దేశాలను కుదురుగా ఉంచాలంటే ప్రపంచ వ్యవస్దలో హింసాత్మక ఆధిపత్యం చలాయించే స్దితిని అమెరికా వారసత్వంగా పొందింది అని రెండో వివరణ చెప్పింది. వందల సంవత్సరాలుగా ఐరోపా దేశాలు చేస్తున్న మాదిరి విధానాలను కొనసాగించేందుకు ఒక సాకుగా కమ్యూనిస్టు వ్యతిరేకత పని చేసింది. నేనయితే ఈ రెండింటి మధ్య వైరుధ్యం ఉందనుకోను. ఒకదానినొకటి పరస్పరం బలపరుచుకుంటాయి.
ఇండోనేషియా విషయానికి వస్తే అమెరికా తీసుకున్న ఈ వైఖరి అత్యంత భయంకర పర్యవసానాలకు దారితీసింది. అంతకు ముందు దశాబ్దకాలంగా ” ఒక సమస్యను ” పరిష్కరించాలని చూస్తున్న అమెరికా చివరి యత్నంగా సామూహిక వధే పరిష్కారం అని నిర్ణయించుకుంది. తొలి యత్నంగా ఎన్నికల్లో ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ విజయాన్ని అడ్డుకుంటుంది అనే ఆశతో 1955లో ఒక మితవాద ముస్లిం పార్టీని స్ధాపించేందుకు సిఐఏ నిధులు ఇవ్వటం ప్రారంభించింది. అది పని చేయలేదు. రెండవ యత్నంగా ఇండోనేషియా దీవులపై బాంబులు వేస్తూ సిఐఏ పైలట్లు దొరికి పోయారు. మూడవ యత్నంగా వాషింగ్టన్ తన బలం మొత్తాన్ని ఒక హింసాత్మక పరిష్కారానికి అందించింది.
నికొలస్ ప్రిచర్డ్: అమెరికా ఏమి చేసింది ?
విన్సెంట్ బెవిన్స్ : ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ, మితవాద మిలిటరీ మధ్య ఘర్షణలు సృష్టించేందుకు 1964-05లో సిఐఏ, ఎం16 రహస్యంగా పని చేశాయి. వివాదం తలెత్తగానే కమ్యూనిస్టులను అణచివేయటానికి అది సరైన సమయం అని అమెరికా రాయబారి గుర్తించాడు. అది వాస్తవం కాదని తెలిసినా కమ్యూనిస్టులు కుట్రపన్నారంటూ అమెరికా తనశక్తికొద్దీ ప్రచారం చేసింది. ఇండోనేషియా మిలిటరీకి కావాల్సిన వాటన్నింటినీ అందించింది. బ్యాంకాక్‌లో ఉన్న సిఐఏ కేంద్రం నుంచి ఆయుధాలను అందచేసేందుకు అనుమతించింది. సమాచార వ్యవస్ధకు అవసరమైన పరికరాలను అందచేసింది.
హత్యాకాండ ప్రారంభం కాగానే అమెరికా అధికారులు నిరంతరం నివేదికలు తెప్పించుకున్నారు. జరుగుతున్నదాని పట్ల తాము సంతోషంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. మరిన్ని హత్యలను ప్రోత్సహించారు.హత్య చేయాల్సిన వారి జాబితాలను అందచేశారు. ఒక ఉద్యోగి జాబితాల్లోని వారిని అంతం చేశారా లేదా అని సరి చూసేవాడు. అది ఎంత భయంకరంగా ఉండేదో మీరు ఊహించుకోవాల్సిందే. అయితే ఇలా చేయటం ఇదే తొలిసారి కాదు. అంతకు ముందు నుంచీ జరుగుతోందనే ఆధారాలు మనకు ఉన్నాయి.1954లో గౌతమాలాలో, సిఐఏ మద్దతుతో ఇరాక్‌లోని బాత్ పార్టీ తిరుగుబాటు సందర్భంగా కమ్యూనిస్టు పార్టీలో, ఇతర వామపక్ష కార్యకర్తల్లో హతమార్చవలసిన వారి జాబితాలను 1963లో అమెరికా అధికారులు అందచేశారు.
నికొలస్ ప్రిచర్డ్: ఇండోనేషియాలో ఎంత మందిని చంపారు ?
విన్సెంట్ బెవిన్స్: షుమారు పది లక్షల మంది ఉంటారని నేను చెబుతున్నా. అనేక మంది నిపుణులు ఐదు నుంచి పదిలక్షల మంది ఉన్నారని చెప్పారు. తాజాగా జరిగిన సంచలనాత్మక అధ్యయనం ప్రకారం దాదాపుగా పది లక్షల మంది అని చెప్పారు.ఈ అనిశ్చితికి కారణం లేకపోలేదు.విచారణల్లో సరైన సంఖ్య ఇంతవరకు రాకపోవటానికి ఇప్పటికీ అమెరికా మద్దతు ఉన్న మిలిటరీ ఎంతో పట్టుకలిగి ఉండటమే కారణం. అసలేమి జరిగింది అని తెలుసుకొనే ఆసక్తి ఇండోనేషియా ప్రభుత్వంలో కూడా ఎన్నడూ లేదు.దీనికి తోడు ఏమి జరిగిందో వెలికి తీయాలంటూ ప్రభుత్వం మీద అంతర్జాతీయంగా తగిన వత్తిడి కూడా రాలేదు.
నికొలస్ ప్రిచర్డ్: హత్యల మీద అమెరికాలో స్పందన ఏమిటి ?
విన్సెంట్ బెవిన్స్ : ఉల్లాసం. విధాన నిర్ణేతలు, మరియు జర్నలిస్టులు స్వీకరించిన తీరు అమెరికాలో ఎంతో ఉల్లాసంగా ఉంది. బాబీ కెన్నడీ మాత్రమే ప్రముఖుల్లో వ్యతిరేకంగా గళం విప్పారు. సంతోషం, సంబరాల సముద్రంలో అది గులకరాయి విసిరినట్లుగా ఉంది. న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ఒక ప్రముఖ ఉదారవాది ఆసియాలో మిణుగురు వెలుగు పేరుతో రాసిన దాన్ని నేను నా రచనలో ఉటంకించాను. అత్యంత అనారోగ్య పద్దతిలో వారికి సరైనదే. వారికి అది విజయం. భౌగోళిక రాజనీతి ప్రాధాన్యతల ప్రకారం 1960దశకంలో వియత్నాం కంటే వారికి ఇండోనేషియా ముఖ్యం. పశ్చిమదేశాల ప్రవాహంలో ఇండోనేషియా పడితే వియత్నాంను నిలువరించటం ప్రాధాన్యత సంతరించుకుంటుందని రాబర్డ్ మెక్‌నమారా తన జ్ఞాపకాల్లో రాశాడు. ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ పతనం వియత్నాంలో అమెరికాకు ముప్పును ఎంతగానో తగ్గించింది, ఇప్పుడు ఇంకా కొన్ని పాచికలు మాత్రమే ఉన్నాయి అవి సులభంగానే పడిపోయేట్లు కనిపిస్తున్నాయి అని కూడా మెక్‌నమారా రాశాడు. సోవియట్ యూనియన్ ఊచకోతను ఆపేందుకు ప్రయత్నించలేదు లేదా వాస్తవానికి ఖండించలేదు. మౌలికంగా చూస్తే నిరాయుధ ఇండోనేషియన్ కమ్యూనిస్టు పార్టీని అంతం చేయటాన్ని అంతర్జాతీయ సమాజం పట్టించుకోలేదు.
హొనికొలస్ ప్రిచర్డ్: జకర్తా పద్దతిని ఇరాక్‌లో ఎలా ఉపయోగించారు ?
విన్సెంట్ బెవిన్స్ : జవహర్‌లాల్ నెహ్రూ, గమాల్ అబ్దుల్ నాజర్, సుకర్ణో వంటి వారి నాయకత్వాన తృతీయ ప్రపంచం ఒక్కటైనపుడు ఆఫ్రో-అసియన్ ప్రపంచంలో ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ(అధికారంలో లేని పార్టీలలో) మొదటి స్ధానంలో, ఇరాక్ పార్టీ రెండవ, సూడాన్ పార్టీ మూడవ స్ధానంలో ఉన్నాయి. ఈ మూడింటిని దాదాపుగా తుడిచిపెట్టారు.
1963లో బాత్ పార్టీ తిరుగుబాటు చేసింది, కమ్యూనిస్టు పార్టీ, ఇతర వామపక్ష శక్తులను అంతం చేసింది. నేను ఒక ప్రముఖ ఇరాకీ జర్నలిస్టును ఇంటర్వ్యూ చేశాను. ఇరాకీ వామపక్ష శక్తులను నిర్దాక్షిణ్యంగా అణచివేసిన సమయంలో అత్యంత దుర్మార్గంగా వ్యవహరించిన వారిలో ఒకడిగా సద్దామ్ హుసేన్ పేరు మోశాడు. ఎవరెవరిని అంతం చేయాలో సూచిస్తూ బాత్ పార్టీకి అమెరికా అధికారులు జాబితాలను అందచేశారు. తరువాత ఇండోనేషియాలో అదే పద్దతిని అమలు జరిపారు.
నికొలస్ ప్రిచర్డ్: ఈ ఉదంతాలలో విదేశాల్లో అమెరికా చేసిన దానికీ, స్వంత గడ్డమీద తలెత్తే ఘర్షణల పట్ల స్పందించటానికి ఏదైనా సంబంధం ఉందా ?
విన్సెంట్ బెవిన్స్ : ప్రపంచంలో తిరుగుబాట్లను అణచివేసేందుకు అనుసరించిన పద్దతులు, తన స్వంత పౌరుల పట్ల అనుసరించిన విధానాల గురించి ఎంతో ఆసక్తికరమైన పరిశోధనలు ఉన్నాయి. స్టువర్డ్ ష్క్రాడర్ రాసిన బాడ్జెస్ వితౌట్ బోర్డర్స్ అనే పుస్తకం ఉంది. విదేశాల్లో తిరుగుబాట్లను అణచివేసే అర్ధ సామ్రాజ్యవాద పోలీసుగా పనిచేసిన అమెరికా తన స్వంత జనంపైనే యుద్ధం చేసేదిగా ఎలా పరిణమించిందో దానిలో వెల్లడించారు.అమెరికా సెటిలర్ వలసవాదం, జాత్యహంకార నేపధ్యంలో తృతీయ ప్రపంచ దేశాలలో అమెరికా జోక్యాన్ని చూడాల్సి ఉంది. అది ఆఫ్రికా, అసియాల్లో అత్యాచారాలకు పాల్పడిన పూర్తి జాత్యహంకార ప్రభుత్వంగానే వ్యవహరించింది. అంతేకాదు ప్రపంచ కమ్యూనిస్టు వ్యతిరేక విధానాలు మరియు తిరుగుబాట్ల అణచివేత యుద్ధ చరిత్ర పరిధిలో వర్తమాన అమెరికా పోలీసు వ్యవస్ధ ఎలా పని చేస్తున్నదో చూడాల్సి ఉంది. ప్రపంచ మంతటా అదే పద్దతుల్లో వ్యవహరించిందో తన స్వంత గడ్డమీద కూడా అదే విధంగా ఉంది.
https://vedikaa.com/2017/10/19/us-hand-in-1960s-indonesia-anti-communist-massacre-revealed/
అనువాదం : ఎం కోటేశ్వరరావు