Tags

, , ,


ఎం కోటేశ్వరరావు
మన ప్రధాని నరేంద్రమోడీ గారేమో చైనా మన భూభాగాన్ని అక్రమించలేదు, పోస్టులను స్వాధీనం చేసుకోలేదు అని అఖిలపక్ష సమావేశంలో అధికారికంగా చెబుతారు. మరోవైపు ఆయన తెగకు చెందిన వారు ప్రస్తుతం దేశంలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు, దానిలో భాగంగానే చైనా వస్తు బహిష్కరణ పిలుపులతో కాషాయ దళాలు ఒక నాటకాన్ని ప్రారంభించాయి. రెండు దేశాల సరిహద్దు భద్రతా దళాల మధ్య జరిగిన విచారకర ఘర్షణలో మన వారు 20 మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. చైనా తమ వారు ఎందరు మరణించిందీ చెప్పకపోయినా మన బిజెపి నేత, మాజీ సైనిక అధికారి 45 మంది చైనీయులను మన వారు చంపినట్లు చెబుతున్నారు. దాన్ని నమ్ముతున్న వారే ఎక్కువ మందిని మనమే చంపినా చైనా వ్యతిరేకతతో ఊగిపోతున్నారు.
ఏ దేశంలో అయినా పాలకులే మనోభావాలను రెచ్చగొట్టి ముందుకు తెచ్చినపుడు దానికి మీడియా మసాలా కూడా తోడైతే రెచ్చిపోవటం సహజం. రేటింగ్‌లు పెంచుకొనేందుకు అలా చేస్తాయని మనకు తెలిసిందే. ఉద్రేకాలు బాగా ఉన్నపుడు మంచి చెడ్డల విచక్షణ ఉండదు కనుక అది తప్పా ఒప్పా అన్నది పక్కన పెడదాం. ఈ పిలుపులు ఇస్తున్న వారు, దానికి అనుగుణ్యంగా వీధుల్లో దృశ్యాలను సృష్టిస్తున్నవారిలో అసలు నిజాయితీ, విశ్వసనీయత ఎంత?
ఢిల్లీ-మీరట్‌ ఆర్‌ఆర్‌టిఎస్‌ ( మెట్రో రైల్‌) పధకంలో కొంత మేరకు భూగర్భమార్గాన్ని నిర్మించేందుకు షాంఘై టన్నెల్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ(ఎస్‌టిఇసి)కి కేంద్ర ప్రభుత్వ టెండర్‌ దక్కింది. దాన్ని రద్దు చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధ స్వదేశీ జాగరణ మంచ్‌ (ఎస్‌జెఎం) ఆందోళనకు దిగింది. ఆ టెండర్‌ను పిలిచేటపుడు, అర్హతలను కోరినపుడు, తెరిచినపుడు అభ్యంతరం వ్యక్తం చేయని వారు ఇప్పుడు వీరంగానికి దిగటం ఏమిటి ? ఆర్‌ఎస్‌ఎస్‌ కుటుంబ సభ్యుడైన నరేంద్రమోడీ మిగతా కుటుంబ సభ్యుల అభిప్రాయాలను తీసుకోరా ? క్రమశిక్షణకు మారు పేరు, పద్దతిగా ఉంటాం అని చెప్పుకొనే వారు అంతా అయిపోయాక ఆందోళనకు దిగటం ఏమిటి ?
ఆసియన్‌ అభివృద్ధి బ్యాంకు(ఏడిబి) నుంచి అప్పు తీసుకొని కేంద్ర ప్రభుత్వం ( మా మోడీ ప్రపంచ బ్యాంకు, ఇతర అంతర్జాతీయ సంస్ధల నుంచి అప్పులు తీసుకోవటం నిలిపివేశారు, అప్పులను తగ్గిస్తున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన వారు దీని గురించి తలలు ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు) మెట్రో రైలు మార్గాన్ని నిర్మిస్తున్నది.నిబంధనలు అవకాశం ఇచ్చిన మేరకు టెండర్లలో మూడు విదేశీ, రెండు స్వదేశీ కంపెనీలు పోటీ పడ్డాయి. 2019 నవంబరులో టెండర్లు పిలిచి ఈ ఏడాది మార్చి 16న తెరిచారు. చైనా కంపెనీ రూ.1,126.9 కోట్లకు చేస్తామని పేర్కొనగా మన ఎల్‌అండ్‌ టి కంపెనీ రూ.1,170 కోట్లతో రెండవదిగా నిలిచింది. ఈ టెండర్‌ను లాంఛనంగా ఖరారు చేయాల్సి ఉంది. ఈ లోగా సరిహద్దు వివాదం చెలరేగింది. జూన్‌15న గాల్వాన్‌లోయ సరిహద్దు ఘర్షణల తరువాత స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ ఆందోళనకు దిగి ఆ టెండర్‌ను రద్దు చేయమంది. ఇప్పుడు తమ కాషాయ దళాన్ని సంతృప్తి పరచేందుకు కేంద్రం ఈ టెండరును రద్దు చేస్తుందా ? చేస్తే ఎడిబికి ఏ సంజాయిషీ ఇస్తుంది ? అది అంగీకరిస్తుందా ? సరిహద్దువివాదం సద్దు మణిగిన తరువాత గుట్టుచప్పుడు కాకుండా మోడీ సర్కార్‌ చైనా కంపెనీకి అప్పగిస్తుందా ?
ప్రభుత్వ రంగ సంస్ధ బిఎన్‌ఎన్‌ఎల్‌ వ్యవస్ధను మెరుగుపరచేందుకు రూ.8,640 కోట్ల టెండర్‌లో చైనా కంపెనీలు పాల్గొనకుండా చూసేందుకు మార్పులు చేస్తామని టెలికమ్యూనికేషన్స్‌ శాఖ ప్రకటించింది. దీని వెనుక వేరే శక్తుల హస్తం ఉందా ? ఎందుకంటే ప్రపంచం 5జి ఫోన్లకు మారేందుకు, 6జి ఫోన్ల అభివృద్దికి పరుగులు పెడుతున్నది. ప్రయివేటు జియో, ఎయిర్‌టెల్‌ వంటి వారికి మార్కెట్‌ను అప్పగించేందుకు మన బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటిఎన్‌లను ఇంకా 3జిలోనే ఉంచి దెబ్బతీశారు. ఇప్పుడు 4జి కూడా లేకుండా చేసేందుకు చైనా పేరుతో దెబ్బతీస్తున్నారా అన్న అనుమానం వస్తోంది.దీంతో ఉన్న కనెక్షన్లు కూడా పోతాయి. ఆర్ధిక, బ్యాంకింగ్‌, రక్షణ, టెలికామ్‌ రంగాలలో పిపిఇ మార్గంలో వచ్చే పెట్టుబడులలో చైనా కంపెనీల నుంచి వచ్చే వాటిని అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి.
అలాంటి ఆలోచన గాల్వాన్‌ ఘటనకు ముందే ఎందుకు లేదు ? మిగతా దేశాల నుంచి పెట్టుబడులు ముద్దు-చైనా పెట్టుబడులు వద్దు అంటున్నారని భావిద్దాం ! చైనాకు పోయే లాభాలు అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలకు పోతాయి. కమ్యూనిస్టు వ్యతిరేక పిచ్చివారిని సంతృప్తి పరచటం తప్ప దీని వలన మన దేశానికి ఒరిగేదేమిటి ? చైనా కంపెనీలు అనేక దేశాలలో స్దాపించిన అనుబంధ లేదా సోదర కంపెనీల ద్వారా పలు దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి, వాటిని కూడా అడ్డుకుంటారా ?
మేకిన్‌ ఇండియా అంటూ నరేంద్రమోడీ పిలుపు ఇచ్చారు. గత రెండు ఎన్నికల్లో బిజెపి దాని మిత్రపక్షాలకు ఓట్లేసిన జనం, బిజెపికి మద్దతుదార్లుగా ఉన్న వ్యాపారులు మేడిన్‌ చైనా వస్తుమయంగా దేశ మార్కెట్‌ను మార్చివేశారు. అంటే వారిలో దేశభక్తిని పెంపొందించటంలో మోడీ సర్కార్‌ ఘోరంగా విఫలమైందనుకోవాలా ? నరేంద్రమోడీ తీరుతెన్నులను నిత్యం పర్యవేక్షించే, చాపకింద నీరులా భలే పని చేస్తుంది అని కొందరు అనుకొనే ఆర్‌ఎస్‌ఎస్‌ ఏమి చేస్తున్నట్లు ? స్వదేశీ అంటూ బయలు దేరిన తమ నేతలు విదేశీగా మారిపోవటాన్ని ఆ సంస్ధ ఎలా అనుమతించింది? అదియును సూనృతమే ఇదియును సూనృతమే అంటుందా ? పరిణామాలను చూస్తుంటే దాని తీరుతెన్నులపై అనుమానాలు కలగటం లేదా ? ఎవరైనా ఎందుకిలా సందేహించాల్సి వస్తోంది?
” 2014వరకు మన దేశంలో చైనా పెట్టుబడులు కేవలం 160 కోట్ల డాలర్లు మాత్రమే. ఇప్పుటి వరకు ప్రకటించిన పెట్టుబడులు, వచ్చినవి మొత్తం 2,600 కోట్ల డాలర్లు, మరో 1500 కోట్ల డాలర్లను వివిధ పధకాలలో పెట్టుబడులుగా పెడతామని చైనా సంస్దలు వాగ్దానం చేశాయి. ఇవిగాక ప్రభుత్వ నివేదికల్లో చైనా నుంచి వచ్చిన పెట్టుబడుల జాబితాలో చేరనివి ఇంకా చాలా ఉన్నాయి. ఉదాహరణకు గ్జియోమీ టెలికాం సంస్ధ సింగపూర్‌ అనుబంధ కంపెనీ ద్వారా 50.4 కోట్ల డాలర్ల పెట్టుబడి ఒకటి. పశ్చిమ దేశాల్లో మాదిరి భారత్‌లో చైనా సంస్ధలు తనిఖీని తప్పించుకున్నాయి టెలికాం రంగంలో 5జి ప్రయోగాల్లో అనేక దేశాలల్లో చైనా సంస్ధ హువెయిపై ఆంక్షలు విధించగా భారత్‌లో ఒక నిర్ణయం తీసుకోకపోయినా తొలి ప్రయోగాల్లో పాల్గొనేందుకు అనుమతించారు. ( మార్చి 31వ తేదీ ది ప్రింట్‌ వ్యాసం).” ఇప్పుడు ఈ పెట్టుబడులన్నింటినీ నష్టపరిహారం ఇచ్చి రద్దు చేస్తారా ? పరిహారం ఎవరు చెల్లిస్తారు ? పరిహారమేమీ లేకుండా నెత్తిన చెంగేసుకొని పొమ్మంటే పోవటానికి చైనా అంత బలహీనంగా ఉందా ? మనం చేసుకున్న ఎగుమతి ఒప్పందాలను చైనా రద్దు చేయకుండా ఉంటుందా ?
చైనాతో లడాయి ఎవరికి లాభం, ఎవరికి నష్టం ? వీధుల్లో చైనా ఉన్మాదంతో వీరంగం వేస్తున్న వారు కమ్యూనిస్టులు చెబుతున్నది ఎలాగూ వినిపించుకోరు. కమ్యూనిస్టేతరులు చెబుతున్నదైనా పట్టించుకుంటారా ? జూన్‌ 20న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా విలేకరి అతుల్‌ ఠాకూర్‌ ఒక విశ్లేషణ చేశారు. ఆయనేమీ కమ్యూనిస్టు పార్టీ నేత కాదు.చైనాతో విరోధం ఆదేశం కంటే భారత్‌కే ఎక్కువ నష్టం అన్నది దాని సారం. మన దేశం అమెరికాకు ఎంతశాతం వస్తువులను ఎగుమతి చేస్తున్నదో కాస్త అటూ ఇటూగా రెండవ స్ధానంలో చైనాకు ఎగుమతి చేస్తున్నాం. మన ఎగుమతులు చైనాకు పదకొండుశాతం వరకు ఉంటే చైనా నుంచి మనం దిగుమతి చేసుకొనేది 2.1శాతంతో పన్నెండవ స్దానంలో ఉన్నామని అతుల్‌ చెప్పారు. మన దేశం నుంచి ఏటా చైనాకు ఎనిమిది లక్షల మంది ప్రయాణిస్తుంటే చైనా నుంచి వస్తున్నవారు రెండున్నరలక్షలు మాత్రమే అని కూడా పేర్కొన్నారు.
చైనా వస్తువులు మన దేశంలో విస్తరించటానికి కచ్చితంగా కమ్యూనిస్టులైతే కారణం కాదు. ఉదాహరణకు ఢిల్లీ సాదర్‌ బజార్‌లో దాదాపు 40వేల మంది రిటైల్‌ వర్తకులు చైనా వస్తువులను అమ్ముతున్నారు. ఆ దుకాణాల్లో ఒక్కటి కూడా సీతారామ్‌ ఏచూరి లేదా ప్రకాష్‌ కారత్‌కు గానీ లేవు. అక్కడ అమ్మేవారు చెప్పేది ఒక్కటే చైనా ధరలకు భారతీయ తయారీ వస్తువులను సరఫరా చేయండి చైనా వస్తువులను నిలిపివేస్తాం అంటే , తాము కూడా కొనటం మానేస్తామని వినియోగదారులు అంటున్నారు.పాలకులు లేదా చైనా వస్తు బహిష్కరణ వాదులు అందుకు సిద్దమేనా ? భారతీయ వస్తువులను తమకు ఇస్తే తమ దగ్గర ఉన్న చైనా వస్తువులను నాశనం చేస్తామని వినియోగదారులు అంటున్నారు, మరి ఆ పని చేస్తారా ? ఎంతసేపూ నిరసనకారులు ఎలక్ట్రానిక్‌ వస్తువులను ధ్వంసం చేయటం చూపుతున్నారు. చైనా ముడి వస్తువులతో మన దేశంలో తయారు చేస్తున్న ఔషధాల మాటేమిటి ? వాటిని కూడా రోడ్ల మీద పోస్తారా ? జబ్బు చేస్తే జనం దిక్కులేని చావు చావాలా ? అంతే కాదు, చైనా రసాయనాలతో ఔషధాలను తయారు చేసి మనం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. మరి ఆ ఎగుమతులు నిలిచిపోవాలని కాషాయ తాలిబాన్లు కోరుకుంటున్నారా ?
ఈ మధ్య కాషాయ దళాలు కొత్త వాదనను ముందుకు తెస్తున్నాయి. మోడీ ప్రభుత్వం ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) నిబంధనలకు కట్టుబడి ఉంది కనుక చైనా వస్తువుల మీద చర్య తీసుకుంటే దాని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని అందువలన దాన్ని తప్పించుకోవాలంటే జనమే స్వచ్చందంగా చైనా వస్తువులను బహిష్కరించాలని చెబుతూ తెలివిగా మాట్లాడుతున్నామని అనుకుంటున్నారు. అంతే కాదు, రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ మీద అమెరికా వాడు అణుబాంబులు వేసినప్పటి నుంచి జపనీయులు అమెరికా వస్తువులు కొనటం లేదని, మనం కూడా ఆపని ఎందుకు చేయకూడదనే ప్రచారం చేస్తున్నారు. ఉద్రేకంలో ఉన్నవారు ఇలాంటి అంశాలను నిర్ధారించుకొనేందుకు ప్రయత్నించరు.2019లో జపాన్‌ 23శాతం వస్తువులను చైనా నుంచి దిగుమతి చేసుకుంది. ఐరోపా యూనియన్‌ నుంచి 12, అమెరికా నుంచి 11శాతం దిగుమతి చేసుకుంది. అణుబాంబులు వేసిన అమెరికా సైనిక స్ధావరాన్ని జపనీయులు సహించారు, అమెరికా రక్షణలో ఉంటామని ఒప్పందం చేసుకున్నారు. అందువలన తప్పుడు ప్రచారంతో జనాన్ని మభ్యపెట్టలేరు.
మన ఆర్ధిక వ్యవస్ధ మొత్తాన్ని చైనా వస్తువులు దెబ్బతీస్తున్నాయంటూ బహిష్కరణ పిలుపు ఇచ్చేదీ పాలకపార్టీ వారే. చైనా ప్రాణం మనం దిగుమతులనే చిలకలో ఉందని, వస్తువుల దిగుమతులను ఆపివేస్తే చైనా ప్రాణం పోతుందని చెబుతున్నారు. దీనిలో వాస్తవం ఎంత ? 2019లో మనం చైనా నుంచి దిగుమతి చేసుకున్నది కేవలం 13.7శాతమే. వాటితోనే మన ఆర్ధిక వ్యవస్ధ నాశనం అవుతుందా ? చైనా ఎగుమతుల్లో మన వాటా రెండు-మూడుశాతం మధ్యనే అన్నది తెలుసా ? ఆమేరకు దిగుమతులు ఆపివేస్తేనే చైనా దెబ్బతింటుందా ? మతి ఉండే మాట్లాడుతున్నారా ? అదే నిజమైతే మోడీగారు ఏం చేస్తున్నట్లు ? చైనా వస్తువుల మీద అధికపన్నులు వేసి దిగుమతులను నిరుత్సాహపరిస్తే ప్రధాని మోడీ లేదా ఆయన మంత్రి వర్గ సభ్యులను డబ్ల్యుటిఓ లేదా ప్రపంచ నేర న్యాయస్ధానంలో విచారణ జరిపి శిక్షలు వేస్తారా ? వేస్తే వేయనివ్వండి ఎలాగూ వారి పూర్వీకులకు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న లేదా త్యాగాలు చేసిన చరిత్ర ఎలాగూ లేదు. ఇప్పుడు దేశం కోసం పోరాడి శిక్షలకు గురైన వారిగా చెప్పుకోవచ్చు కదా ! అసలు సిసలు దేశభక్తులం మేమే అని చెప్పుకొనే వారికి దేశం, జనం ముఖ్యమా ! మనకు హానికరమైన ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలు ముఖ్యమా ?
ప్రపంచ వాణిజ్య సంస్ధ వివాదాల ట్రిబ్యునల్‌ ముందు వేలాది కేసులు దాఖలయ్యాయి. ఏ ఒక్కదానిలో కూడా ఒక్క దేశాన్ని లేదా దేశాధినేతను శిక్షించిన దాఖలా లేదు. కేసులు అలాసాగుతూనే ఉంటాయి. 2001లో ప్రారంభమైన దోహా దఫా చర్చలు ఇంతవరకు పూర్తి కాలేదు, అసలు పూర్తవుతాయో లేదో తెలియదు. దాన్ని అవకాశంగా తీసుకొని ధనిక దేశాలు వ్యవసాయరంగంలో దొడ్డిదారిన సబ్సిడీలు ఇస్తూనే ఉన్నాయి.
అంతెందుకు మన మోడీగారి జిగినీ దోస్తు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇక్కడకు వచ్చి కౌగిలింతలతో ముంచెత్తుతాడు. ఒకే కంచం ఒకే మంచం అంటాడు. కానీ ప్రపంచ వాణిజ్య సంస్ధలో మన మీద కేసులు వేస్తాడు. ఏమిటా కేసులు ? మన ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధర ప్రపంచ వాణిజ్య నిబంధనలకు విరుద్దమని 2018లో ప్రపంచ వాణిజ్య సంస్ధకు అమెరికా ఫిర్యాదు చేసింది. అదేమిటటా ! సంస్ధ నిబంధనల ప్రకారం పదిశాతంలోపు సబ్సిడీ మాత్రమే ఇవ్వాల్సిన భారత్‌ తన వరి, గోధుమ రైతాంగానికి కనీస మద్దతు ధరల రూపంలో 60-70శాతం ఎక్కువగా సబ్సిడీ ఇస్తున్నట్లు చిత్రించింది. పత్తి మీద కూడా ఇలాంటి ఫిర్యాదులే చేసింది. ఎంతైనా ” మిత్ర ” దేశం కదా !
అమెరికాలో ఏటా ప్రతి రైతు సగటున 50వేల డాలర్ల మేర సబ్సిడీ పొందుతుంటే మన దేశంలో 200 డాలర్లు మాత్రమే అని నిపుణులు చెప్పారు. అమెరికాను అడ్డుకోలేని ప్రపంచ వాణిజ్య సంస్ధ మనం చైనా, లేదా మరొక దేశ వస్తువుల మీద పన్నులు వేస్తే ఎలా అడ్డుకోగలదు ? మరి ఎందుకు చేయటం లేదంటే మన బలహీనత, చేతగాని తనం, దాన్ని దాచుకొనేందుకు కుంటి సాకులు ? అసలు విషయం ఏమంటే మనకు విదేశీ పెట్టుబడులు కావాలి, అవి పెట్టే దేశాల వస్తువుల మీద పన్నులు వేస్తే అక్కడి నుంచి పెట్టుబడులు ఎలా వస్తాయి ? నరేంద్రమోడీ హయాంలో ముందే చెప్పుకున్నట్లు లెక్కల్లో చూపిన మేరకే 160 నుంచి 2600 కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెరగటంతో పాటు వస్తువుల దిగుమతులు కూడా అదే విధంగా పెరిగాయి. వస్తువులను నిలిపివేస్తే పెట్టుబడులు నిలిచిపోతాయి.
తాజా వివాదం గురించి అఖిలపక్ష సమావేశంలో ప్రధాని చెప్పిందేమిటి? చైనా వారు ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని, మన మిలిటరీ పోస్టులను ఆక్రమించ లేదని చెప్పారు. ఈ ప్రకటన తరువాత అయినా చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టే వారు, వస్తు బహిష్కరణ పిలుపు ఇచ్చి వీధులకు ఎక్కే వారు తమ నాటకాలను ఆపుతారా ? కారణాలు ఏమైనా ఉద్రిక్తతలు తలెత్తాయి. మన వారి విలువైన ప్రాణాలను ఫణంగా పెట్టాము. సరిహద్దు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోకుండా ఇన్ని తిప్పలు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది ?
చౌకగా వస్తున్న చైనా వస్తువుల కొనుగోలుతో మన వినియోగదారులు లబ్దిపొందారే తప్ప నష్టపోలేదు. చైనావి లేకపోతే అధిక ధరలకు ఇతర దేశాల వస్తువులను కొని జేబులు గుల్ల చేసుకోవాల్సి వచ్చేది. మిగతా దేశాల ధరలతో పోలిస్తే చైనా టెలికాం పరికరాల ధరలు 20శాతం తక్కువ. ప్రభుత్వ రంగ సంస్ధలైన బిఎస్‌ఎన్‌ఎల్‌ చైనా వ్యతిరేకులను సంతృప్తి పరచేందుకు చైనాను రంగం నుంచి తప్పించేందుకు పూనుకుంది అంటే అర్ధం ఏమిటి ?అంత మొత్తం ఎక్కువకు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తుందనే కదా ! ప్రయివేటు కంపెనీలు కూడా అదే పని చేస్తాయా ? ప్రభుత్వం వాటికి అలాంటి షరతు విధించి అమలు జరపగలదా ? కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాస్వాన్‌ మాటల్లో చెప్పాలంటే వినాయక విగ్రహాలను కూడా మనం చౌకగా తయారు చేసుకోలేని దుస్ధితిలో ఉన్నాం. చైనా కమ్యూనిస్టులు తయారు చేసిన విగ్రహాలను మన భక్తులు వినియోగిస్తున్నారు. చైనా వస్తువుల నాణ్యత గురించి గట్టి మార్గదర్శక సూత్రాలు జారీ చేస్తామని పాస్వాన్‌ చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎవరు అడ్డుకున్నారు? ఇప్పటి వరకు నాశిరకం వస్తువులను అనుమతించి మన జనాన్ని ఎందుకు నష్టపెట్టారు ?
చైనా వస్తువుల మీద లేదా కమ్యూనిస్టు చైనా మీద ఒక సంఘపరివార్‌ కార్యకర్తగా నరేంద్రమోడీకి ప్రేమ, అభిమానం ఉంటాయని ఎవరైనా అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఉండదు. ఒక వ్యాపారి మాదిరే ఆలోచిస్తారు, వ్యాపారుల వత్తిడికి లొంగిపోతారు. అమెరికా-చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య పోరులో లాభపడాలన్నది మన దేశ వాణిజ్య, పారిశ్రామిక సంస్ధల ఆశ, ఎత్తుగడ. ఉదాహరణకు అమెరికా పత్తి దిగుమతుల మీద చైనా 25శాతం పన్ను విధించటంతో అది అమెరికా ఎగుమతిదార్లకు గిట్టుబాటు కాలేదు. అదే సమయంలో మన పత్తి ఎగుమతిదార్లకు వరమైంది. పర్యవసానంగా మన పత్తికి ఆమేరకు డిమాండ్‌ పెరిగి రైతులు కూడా పరిమితంగా అయినా లాభపడ్డారు. చైనాకు పెద్ద ఎత్తున పత్తి దిగుమతులు పెరిగాయి. అయితే పరిస్ధితులెప్పుడూ ఇలాగే ఉండవు. అంతర్జాతీయ రాజకీయాల్లో తీసుకొనే వైఖరులను బట్టి మిగతాదేశాల వైఖరులు మారుతుంటాయి.
గత ఏడాది చైనా వైఖరి కారణంగా మన దేశం నుంచి చైనాకు నూలు ఎగుమతులు గణనీయంగా పడిపోయాయి. ఒకటి ప్రపంచ వ్యాపితంగా డిమాండ్‌ పడిపోవటం ఒక కారణం అయితే, రెండవది పాకిస్ధాన్‌, వియత్నాం. ఆ దేశాలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం పన్నులు లేని నూలు దిగుమతులను చైనా అనుమతించటంతో మన ఎగుమతులు పెద్ద ఎత్తున పడిపోయాయి. దాని ప్రభావం మన రైతుల మీద కూడా పడిందా లేదా ! చైనాకు వ్యతిరేకంగా అమెరికాను కౌగిలించుకొని అది చెప్పినట్లు చేయటమే దీనికి కారణం అన్నది లోగుట్టు.మనం డబ్ల్యుటిఓ సూత్రాలకు కట్టుబడి ఉన్నాం కనుక చైనా వస్తువుల మీద పన్నులు విధించలేమని అంటున్నవారు అమెరికా వస్తువుల మీద ఎలా విధించారు? మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న కొన్ని వస్తువుల మీద గతంలో ఇచ్చిన పన్నురాయితీలను ”మన అపర స్నేహితుడు ” డోనాల్డ్‌ ట్రంప్‌ రద్దు చేశాడు. మన ఉక్కుపై 25శాతం, అల్యూమినియంపై పదిశాతం పన్నులు పెంచలేదా దానికి ప్రతిగా మన మోడీ 28 అమెరికా ఉత్పత్తుల మీద దిగుమతి పన్ను పెంచలేదా ? కొన్నింటి మీద 120శాతం వేశారు. ప్రపంచ వాణిజ్య సంస్ధ మనమీదేమీ చర్య తీసుకోలేదే? మన దేశం పన్నులను ఎక్కువగా విధిస్తున్నట్లు ట్రంప్‌ మనలను ఆడిపోసుకోలేదా ? తమ వస్తువులను మరిన్ని దిగుమతి చేసుకోవాలని మన మీద వత్తిడి తేవటం లేదా ? సరే దీని మీద కూడా ఇప్పుడు కేసు వేశారనుకోండి. ప్రతి దేశం వాణిజ్యాన్ని ఒక ఆయుధంగా వాడుకొంటుంది. ఆ విషయంలో ఎవరైనా ఒకటే. పాకిస్ధాన్‌తో ఉన్న వైరం కారణంగా పంచదార దిగుమతులను అడ్డుకొనేందుకు 2018లో మన దేశం 50శాతంగా ఉన్న దిగుమతి పన్నును వందశాతానికి పెంచింది. ఈనెలలోనే మలేసియా నుంచి కాలిక్యులేటర్ల మీద ఒక్కోదానిపై 92సెంట్ల చొప్పున ఐదేండ్ల పాటు వసూలు చేసే విధంగా మన దేశం పన్ను పెంచింది. ఇదే పని చైనా వస్తువుల మీద ఎందుకు తీసుకోకూడదు ? ఎందుకంటే పాకిస్ధాన్‌, మలేషియాలు చైనా వంటివి కాదు గనుక. ఆడలేక మద్దెల ఓడు లేదా ఈ రోజు మంగళవారం కాబట్టి సరిపోయింది అన్నట్లుగా ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనల పేరుతో కాలక్షేపం చేస్తున్నారు. ఏ దేశమైనా తన మౌలిక ప్రయోజనాలకు భంగం కలిగినపుడు చర్యలు తీసుకొనేందుకు ఆ సంస్ధ నిబంధనలు అవకాశం కలిగిస్తున్నాయి. లేదూ అవి మనకు నష్టదాయకం అనుకుంటే బయటకు వచ్చేయటమే. ఈ రోజు అమెరికా ప్రయోజనాలకే అగ్రస్ధానం అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్ధతో సహా అనేక అంతర్జాతీయ సంస్ధల నుంచి బయటకు రావటం లేదా ఒప్పందాల నుంచి ఏకపక్షంగా వైదొలగటం లేదా ? డోనాల్డ్‌ ట్రంప్‌కు ఉన్న మాదిరి 56 అంగుళాల ఛాతీ మన నరేంద్రమోడీకి లేదా ? ఆయనకు మన ప్రయోజనాలు పట్టవా ?