Tags

, ,


ఎం కోటేశ్వరరావు
లక్షలాది మంది యువత ఆశల మీద నీళ్లు చల్లుతూ తమ దేశంలోకి విదేశీ కార్మికులు రావద్దంటూ వీసాల జారీపై నిషేధం విధించిన ట్రంప్‌ తాజా చర్య గురించి మోడీ లేదా ఆయన పరివారం ఇంతవరకు నోరు మెదపలేదు. పచ్చిగా చెప్పాలంటే కరోనాతో సహజీవనం చేయాలంటూ కనీస చర్యలకు సైతం తిలోదాకాలు ఇస్తున్న పాలకులు ట్రంప్‌ చర్యపై మౌనానికి అర్ధం మీ చావు చావండి అనటమే. అమెరికన్లు ఎందరో నిరుద్యోగంతో ఉన్నందున కొన్ని మినహాయింపులలో తప్ప విదేశీ కార్మికులు పెద్ద సంఖ్యలో మా దేశంలో ప్రవేశించటానికి లేదు అని మన ప్రధాని జిగినీ దోస్త్‌, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించేశాడు. ఆ నిషేధం ఈ ఏడాది చివరి వరకు ఉంటుందని చెప్పాడు. ట్రంప్‌ ప్రకటనను గూగుల్‌ సిఇఓ సుందర పిచ్చయ్యతో సహా అనేక దిగ్గజ కంపెనీల ప్రతినిధులందరూ తప్పు పట్టారు.
డాలర్‌ కలలు కంటున్న అనేక మంది లబోదిబో మంటున్నారు. డాలర్‌ దేవుడు చిలుకూరు బాలాజీ ఇప్పుడేం చేస్తారో చూడాల్సి ఉంది. ఇక్కడ ఉద్యోగాలు లేక అమెరికా పోలేక మన యువత తీవ్ర నిరాశకు గురవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. గత చర్యల కొనసాగింపుగా డోనాల్డ్‌ ట్రంప్‌ విజయాన్ని కోరుతూ మన ప్రధాని నరేంద్రమోడీ చప్పుట్లు కొట్టిస్తారో, వీసాల నిషేధంపై మనసు మార్పించాలని ప్రార్ధిస్తూ దీపాలు ఆర్పించి కొవ్వొత్తులు వెలిగించమని చెబుతారో లేక మరేదైనా ఖర్చులేని వినూత్న కార్యక్రమం ఏమైనా ప్రకటిస్తారో తెలియదు.
ట్రంప్‌ నిర్ణయం వెలువడగానే సామాజిక మాధ్యమంలో ఎలాంటి స్పందన వచ్చిందో ఒక్కసారి చూద్దాం.
అమెరికా కలలు కంటున్నవారికి రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం.భారత అభివృద్ధి కథ ఇప్పుడే ప్రారంభమైంది-తిరిగి రండి దేశాన్ని నిర్మిద్దాం. నమస్తే ట్రంప్‌కు భారత ప్రభుత్వం పెద్దమొత్తంలో ఖర్చు చేసింది-దానికి బదులుగా డిసెంబరు వరకు హెచ్‌1బి వీసాలను ట్రంప్‌ రద్దుచేశాడు. మచ్చుకు కొన్ని ఇవి, యువతలో ఉన్న నిరాశను, మన పాలకులపై ఉన్న ఆశ-భ్రమలు, అసంతృప్తిని వెల్లడిస్తున్నాయి.
అసలెందుకు ట్రంప్‌ ఈ పని చేశాడు ? అమెరికా ఎన్నికలు 133 రోజులు ఉన్నాయనగా ఎన్నికల ఫలితాలను తారు మారు చేసేందుకు విదేశాలు మిలియన్ల కొద్దీ బ్యాలట్‌ పత్రాలను ముద్రిస్తాయని, వర్తమానంలో ఇది పెద్ద కుంభకోణమని సోమవారం నాడు ప్రకటించిన ట్రంప్‌ మంగళవారం నాడు వీసాల రద్దు నిర్ణయాన్ని వెలువరించాడు. ఓక్లహామా రాష్ట్రంలోని తుల్సాలో గత వారాంతంలో జరిగిన ఎన్నికల సభకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తారని కలలు కన్న ట్రంప్‌కు ఖాళీ కుర్చీలు దర్శనమివ్వటంతో హతాశుడయ్యాడు.మన దేశంలో పోస్టల్‌ బ్యాలట్ల మాదిరి విదేశాలలో ఉన్న అమెరికన్లకు ఇమెయిల్‌ ద్వారా అటువంటి సౌకర్యం ఉంది. గతంలో ఎవరు అధికారంలో ఉంటే వారు అలాంటి నకిలీ బ్యాలట్లను తమకు అనుకూలంగా తెప్పించుకున్న ఉదంతాలేమైనా జరిగి ఉన్న కారణంగానేే ట్రంప్‌ ముందే ఎదురుదాడికి దిగారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఓడిపోతే నేను ముందే దొంగ ఓట్ల గురించి చెప్పాను అని చెప్పేందుకు ఒక సాకును వెతుక్కుంటున్నారా ? అమెరికా దేశాధ్యక్ష ఎన్నికలలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా బ్యాలట్‌ పత్రాలను ముద్రించే విధానం ఉన్నందున ఏవి నకిలీవో ఏవి కాదో గుర్తించటం అంత సులభం కాదని వార్తలు వచ్చాయి.
ఇక గూగుల్‌,ఇతర బడా కంపెనీల ప్రతినిధులు ట్రంప్‌ నిర్ణయంపై ఆశాభంగం, అసంతృప్తిని వ్యక్తం చేశారు. డిసెంబరు వరకే అని చెప్పినా వారి నుంచి అలాంటి స్పందన వెలువడిందంటే ఒక వేళ ట్రంప్‌ ఓడిపోయి డెమోక్రాట్లు గెలిచినా ఒక వేళ అనూహ్యంగా ట్రంపే గెలిచినా అమెరికా యువతను సంతృప్తి పరచేందుకు ఆ నిర్ణయాన్ని కొనసాగిస్తే తమ పరిస్ధితి ఏమిటనే ఆందోళన వారిలో కలిగిందా ? ప్రస్తుతం తలెత్తిన సంక్షోభం ఎప్పుడు తొలుగుతుందో, ఇంకెంతగా దిగజారుతుందో ఎవరి ఊహకూ అందటం లేదు. అసలే ఆర్ధిక సంక్షోభం దానికి తోడు గోరు చుట్టు మీద రోకటి పోటులా కరోనా వైరస్‌ జమిలిగా ప్రపంచ ధనిక దేశాలను ఊపివేస్తున్నాయి.
గత ఎన్నికల్లో ట్రంప్‌కు ఓటు వేసిన భారతీయులు తక్కువ మందే అయినప్పటికీ తాజా పరిణామంతో తాము ట్రంప్‌ చేతిలో మోసపోయినట్లు వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో తగినంత మంది నిపుణులు ఉన్పప్పటికీ భారత్‌, ఇతర దేశాల నుంచి వచ్చే వారు తక్కువ వేతనాలకు పని చేసేందుకు ముందుకు వస్తారు. ఆ విధంగా వారి శ్రమదోపిడీని కొనసాగించేందుకు తప్ప అమెరికన్‌ కార్పొరేట్‌లకు విదేశీయుల మీద ప్రేమ, అనురాగాలు ఉండి కాదు. వీసాల మీద ఆంక్షలు విధించి విదేశీ కార్మికులను అడ్డుకుంటే కంపెనీలే కెనడా వంటి దేశాల్లో దుకాణాలు తెరిచి అక్కడి నుంచి పని చేయించుకుంటాయి.
మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం 2019లో తాత్కాలికంగా మూడు నుంచి ఆరు సంవత్సరాల వరకు గరిష్టంగా పని చేసేందుకు వీలు కల్పించే 1,33,000 హెచ్‌1బి వీసాలను, ఆయా దేశాలను బట్టి మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు పని చేసేందుకు ఇచ్చే పన్నెండువేల ఎల్‌1 వీసాలను, విదేశీ కార్మికులను పనిలో పెట్టుకొనేందుకు యజమానులకు వీలు కల్పించే 98వేల హెచ్‌2బి వీసాలను అమెరికా జారీ చేసింది. కరోనా పేరుతో ఇలాంటి వీసాలను నిలిపివేయాలని ట్రంప్‌ నిర్ణయించాడు.
అమెరికా సంపదల సృష్టిలో విదేశీ కార్మికుల శ్రమ భాగం తక్కువేమీ కాదు. స్ధానిక కార్మికులకు ఇచ్చే వేతనం కంటే బయటి దేశాల వారికి తక్కువ ఇస్తారు. అనేక దేశాల నుంచి అనుమతులు లేకుండా వచ్చే కార్మికులను చూసీ చూడనట్లు వ్యవహరిస్తారు. వారికి వేతనాలు తక్కువే కాదు, అసలు ఎక్కడా వారి నమోదు ఉండదు, యజమానులకు కార్మిక చట్టాలను అమలు జరపాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ బహిరంగ రహస్యాలే. అయితే అక్కడ స్ధానికుల్లో అసంతృప్తి తలెత్తినపుడు విదేశీ కార్మికుల మీద ఆంక్షల చర్యల వంటి హడావుడి చేస్తారు. అమెరికాలో పని చేసే కార్మికుల్లో హెచ్‌1బి వీసాలతో వచ్చి పని చేసే వారు 0.05శాతమే అని చెబుతున్నారు. ఆ మేరకు కూడా అనుమతించే పరిస్ధితి లేదంటే స్ధానికుల్లో ఉన్న అసంతృప్తి లేదా నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. విదేశీ కార్మికులకు వీసాలు నిరాకరించటం లేదా గడువు తీరిన వీసాలను పొడిగించకుండా తిరస్కరించటం ద్వారా నవంబరు ఎన్నికలలోపు కనీసం ఐదు లక్షల ఉద్యోగాలను స్ధానికులకు కల్పించాలన్నది ట్రంప్‌ లక్ష్యంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారానికి వచ్చిన సమయం, అమెరికాలో ఆర్ధిక సమస్యలు తీవ్రతరం అవుతున్న కారణంగా ప్రాజెక్టులు లేక అక్కడి కంపెనీలు(ఇన్ఫోసిస్‌, విప్రో వంటి మనదేశానివి కూడా) గత కొద్ది సంవత్సరాలుగా విదేశీ కార్మికుల నియామకాలను గణనీయంగా తగ్గించాయి. ఇన్ఫోసిస్‌ 2017లో హెచ్‌1 బి వీసాలున్న వారిని 14,586 మందిని నియమిస్తే 2019 నాటికి 60శాతం తగ్గించి 5,496 మందినే నియమించింది. అలాగే విప్రో 56, టిసిఎస్‌ 52, హెసిఎల్‌ 46, కాగ్నిజంట్‌ 56శాతం మందిని తగ్గించాయి. 2016-2019 మధ్య ఈ కంపెనీల నియామకాలు 59,478 నుంచి 32,350కి తగ్గాయి.
అమెరికా వీసాల నిరాకరణ కారణంగా కంపెనీలు ఎక్కడ ఖర్చు తక్కువ ఉంటే అక్కడకు తరలిపోతాయి.ఈ రీత్యా కొన్ని విదేశీ కంపెనీలు మన వంటి దేశాలకు రావచ్చు.అయితే అది పరిమితంగానే ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. గూగుల్‌ సుందర పిచ్చయ్య, ఇతర అమెరికన్‌ కంపెనీల ప్రతినిధుల అసంతృప్తికి కారణం లేకపోలేదు.హెచ్‌1బి వీసాల మీద పని చేసే కార్మికుల మీద ఆధారపడటం భారతీయ కంపెనీలు 50శాతానికి పైగా తగ్గిస్తే, గూగుల్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌, ఆపిల్‌, మైక్రోసాప్ట్‌ వంటి కంపెనీల ఆధారం 43శాతం పెరిగింది. అందువలన ట్రంప్‌ చర్యతో వెంటనే ఈ కంపెనీల మీద ప్రభావం పడుతుంది కనుకనే స్పందించాయి. ఈ కంపెనీలు 2016లో17,810 మంది విదేశీ కార్మికులను పెట్టుకోగా 2019కి 25,441కి పెరిగారు. ఈ నేపధ్యంలో అధ్యక్ష ఎన్నికల తరువాత తిరిగి గెలిస్తే ట్రంప్‌ లేదా అధికారానికి వచ్చే డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధి జో బిడెన్‌ మీద ఈ కంపెనీలు వత్తిడి తీసుకు వచ్చి ఆంక్షలను ఎత్తివేయించే అవకాశాలు కూడా లేకపోలేదు. దీనికి భారతీయుల మీద ప్రేమ కాదు స్ధానిక కార్మికుల కంటే విదేశీ కార్మికులకు ఇచ్చే వేతనాలు తక్కువ, పని ఎక్కువ చేయించుకొనే వీలు ఉండటమే అసలు రహస్యం.
అమెరికా వెళ్లి డోనాల్డ్‌ ట్రంప్‌ను గెలిపించమని చెప్పి వచ్చారు-మన దేశానికి పిలిపించి పెద్ద పీట వేసి మేము మీ వెంటే అని మరోసారి చెప్పి పంపారు మన ప్రధాని మోడీ గారు. గత మూడు సంవత్సరాలుగా ఈ సమస్య గురించి ట్రంప్‌ ప్రతి సారీ బహిరంగంగానే తన మనసులోని మాట చెబుతున్నాడు. అలాంటి వార్తలు వచ్చిన ప్రతిసారీ మోడీ, ప్రభుత్వం కూడా అమెరికాతో చర్చిస్తున్నది అనే లీకు వార్తలు తప్ప ఇంతవరకు ఒక్కసారంటే ఒక్కసారైనా నరేంద్రమోడీ బహిరంగంగా అభ్యంతరాల వెల్లడి సంగతి గోమాత ఎరుగు అసంతృప్తి అయినా వ్యక్తం చేసిన ఉదంతం ఉందా ? పోనీ మౌనంగా ఉండి సాధించిందేమిటి ? గతంలో దీని గురించి వార్తలు వచ్చినపుడు మై హూనా అన్నట్లు ఫోజు పెట్టిన వారు ఇప్పుడేమయ్యారని యువత ప్రశ్నిస్తోంది. వారికి ఓదార్పుగా ఒక్క మాట చెప్పటానికి కూడా నోరు రావటం లేదా అంటున్న వారికి ఏమి చెబుతారు ? మన దేశంలో ఏమి జరిగినా కారకులు మోడీయే అని చెబుతున్నారు కనుక దీన్ని గురించి కూడా అడగాల్సింది మోడీనే కదా !