Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు
అవును ! శీర్షికను చూసి కొంత మందికి ఆగ్రహం కలగటాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఎక్కడైనా వ్యక్తి పూజ ముదిరితే వారి మీద ఏ చిన్న వ్యాఖ్యను కూడా సహించలేరు. ఉద్రేకాలను తగ్గించుకొని ఆలోచించాలని మనవి. ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయిపోతుందో వాడే పండుగాడు. ఇక్కడ ఎవరు, ఎవరిని కొట్టారు ? ఎవరి మైండ్‌ బ్లాంక్‌ అయింది? పండుగాడు ఎవడో తెలియదు గానీ సంఘపరివారం మొత్తానికి మైండ్‌ బ్లాక్‌ అయినట్లుగా వారి మాటలను బట్టి కనిపిస్తోంది. ఎవరేమి మాట్లాడుతారో తెలియని స్ధితి. అఖిలపక్ష సమావేశం ప్రధాని మాట్లాడిన అంశాలు టీవీలలో ప్రసారం అయ్యాయి.” ఎవరూ చొరబడలేదు లేదా ఎవరూ చొరబడటం లేదు, కొంత మంది ఏ పోస్టునూ పట్టుకోలేదు ” అన్నారు. అంతకు ముందు వరకు మాట్లాడిన ప్రతి కేంద్ర మంత్రి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న బిజెపి మరికొన్ని పార్టీల నేతలందరూ, మీడియా కూడా మన ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది, మన మిలిటరీ పోస్టులను కూల్చివేసింది అని ఊదరగొట్టిన వారందరి మైండ్లు నరేంద్రమోడీ మాటలతో బ్లాంక్‌ అయ్యాయి. పోనీ ఆయన ఆంగ్లంలో మాట్లాడారా అంటే అదేమీ కాదు, ఆయనకు బాగా తెలిసిన హిందీలోనే కదా చెప్పారు. ఈ మాటల ప్రభావం, పర్యవసానాలేమిటో గ్రహించిన తరువాత కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యల్లో భాగంగా మోడీ గారి మాటల అర్ధం ఇది తిరుమలేశా అన్నట్లుగా ఒక వివరణ ఇచ్చింది.
వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసి) మన ప్రాంతంలో చైనీయులెవరూ లేరు, గాల్వాన్‌ లోయ ప్రాంతంలో ఆతిక్రమణకు పాల్పడేందుకు చేసిన మన ప్రయత్నాన్ని భారత సైనికులు విఫలం చేశారు అన్నది ప్రధాని అభిప్రాయం అన్నది వివరణ. దానికి ముందు విదేశాంగ మంత్రి జైశంకర్‌ చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ ఇతరులతో మాట్లాడిన తరువాత జూన్‌ 17న రాతపూర్వక పత్రికా ప్రకటన విడుదల చేశారు. యథాతధ స్ధితిని మార్చేందుకు ఎవరూ ప్రయత్నించరాదన్న ఒప్పందాలను అతిక్రమించి వాస్తవ పరిస్ధితిని మార్చేందుకు చేసిన యత్నం కారణంగానే హింస, మరణాలు సంభవించాయని దానిలో పేర్కొన్నారు. దీని అర్ధం ఏమిటి ? మన సైనికులు ఎందుకు మరణించారు అన్న ప్రశ్నకు చెప్పిందేమిటి ? సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడిన చైనా మన ప్రాంతంలో పోస్టులను ఏర్పాటు చేసిందని, వాటిని తొలగించాలని ఉభయ దేశాల మిలిటరీ అధికారులు చేసిన నిర్ణయాన్ని చైనా అమలు జరపలేదని, ఆ కారణంగానే చైనా పోస్టును తొలగించేందుకు మన సైనికులు ప్రయత్నించినపుడు చైనీయులు పధకం ప్రకారం దాడి చేసి మన వారిని చంపారని చెప్పిన విషయం తెలిసిందే. ఆ ఉదంతం మన ప్రాంతంలో జరిగినట్లా మరొక చోట జరిగినట్లా ? ఇదే నిజమా లేక చైనా వారు చెబుతున్నట్లు తమ ప్రాంతంలోకి మన సైనికులు వెళ్లి దాడికి పాల్పడ్డారన్నది వాస్తవమా ? మన ప్రధాని మరి అలా ఎందుకు మాట్లాడినట్లు, విదేశాంగ, రక్షణ శాఖల నుంచి సమాచారం తీసుకోరా ? అసలేం జరిగింది ? ఇప్పటికీ మైండ్‌ బ్లాంక్‌ అయ్యే రహస్యమే కదా ! ఇంత జరిగిన తరువాత అయినా మోడీ ప్రత్యక్షంగా విలేకర్లతో మాట్లాడి వివరణ ఎందుకు ఇవ్వరు ?
లడఖ్‌ లడాయితో మోడీ గణానికి ఏదో జరిగింది. జనంలో తలెత్తిన మనోభావాల నేపధ్యంలో ఎవరేం మాట్లాడుతున్నారో, అసలు వారి మధ్య సమన్వయం ఉందో లేదో కూడా తెలియటం లేదు. ఒక నోటితో చైనా వస్తువులను బహిష్కరించాలంటారు. అదే నోటితో ప్రపంచ వాణిజ్య సంస్ధలో మన దేశం భాగస్వామి గనుక అధికారయుతంగా చైనా వస్తువులను నిషేధించలేము, ప్రజలే ఆ పని చేయాలంటారు. వారు చెప్పే ఈ మాటల్లో నిజాయితీ ఉందా ?
బిజెపి, విశ్వహిందూపరిషత్‌, ఎబివిపి, బిఎంఎస్‌, భజరంగదళ్‌, ఎస్‌జెఎం వంటి అనేక సంస్దలను ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసింది అనే విషయం తెలిసిందే. అంటే ఈ సంస్ధలన్నీ తెరమీది తోలుబొమ్మలైతే వాటిని తెరవెనుక నుంచి ఆడించేది, మాట్లాడించేది ఆర్‌ఎస్‌ఎస్‌.1991లో సంస్కరణల పేరుతో మన మార్కెట్‌ను విదేశాలకు తెరిచారు. ఆ విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు ఫోజు పెట్టేందుకు స్వదేశీ జాగరణ మంచ్‌(ఎస్‌జెఎం)ను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ పాలనలో మాత్రమే అవసరమైనపుడు నాటకాలాడుతుంది. నాటి నుంచి నేటి వరకు వాజ్‌పేయి, నరేంద్రమోడీ ఎవరు అధికారంలో ఉన్నా మార్కెట్లను మరింతగా తెరిచారు తప్ప స్వదేశీ వస్తువులకు రక్షణ లేదా దేశంలో చౌకగా వస్తువుల తయారీకి వారు చేసిందేమీ లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ వాణిజ్య ఒప్పందం కారణంగా చైనా వస్తువుల మీద అధికారికంగా చర్యలు తీసుకోలేము అని చెబుతారు. ఇది జనం చెవుల్లో పూలు పెట్టే యత్నమే. ప్రపంచ వాణిజ్య సంస్ధలోని దేశాలన్నీ అలాగే ఉన్నాయా ?
స్వదేశీ జాగరణ మంచ్‌ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ (2020 జూన్‌ 19వ తేదీ ఎకనమిక్‌ టైమ్స్‌) మాట్లాడుతూ మన దేశం గత రెండు సంవత్సరాలలో అనేక చర్యలు తీసుకున్నా చైనా మీద కేవలం 350 పన్నేతర ఆంక్షలను మాత్రమే విధిస్తే అమెరికా 6,500 విధించిందని, మనం ఇంకా ఎన్నో చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. అమెరికాకు అగ్రతాంబూలం అని ట్రంప్‌ పదే పదే చెబుతాడు, దానికి అనుగుణ్యంగానే ప్రపంచ దేశాల మీద దాడులకు దిగుతాడు. మనం మరో దేశం మీద దాడికి దిగకపోయినా మనల్ని మనం రక్షించుకోవాలి కదా! అదే దేశభక్తి అని అనుకుంటే ట్రంప్‌కు ఉన్న అమెరికా భక్తితో పోలిస్తే మన నరేంద్రమోడీ భారత్‌ భక్తి ఎక్కడ ఉన్నట్లు ? 2016లో పేటియంకు అనుమతి ఇచ్చినపుడు తాము వ్యతిరేకించామని, అనుమతి ఇచ్చి ఉండాల్సింది కాదని, జనం దాన్ని వినియోగించకూడదని కూడా ఆ పెద్దమనిషి చెప్పారు. అమెరికాకు లేని ప్రపంచ వాణిజ్య అభ్యంతరాలు మనకేనా ? చేతగాని తనాన్ని కప్పి పుచ్చుకొనేందుకు చెప్పే సొల్లు కబుర్లు తప్ప మరేమైనా ఉందా ? 2014 నుంచి మన దేశం చైనాతో సహా వివిధ దేశాలకు చెందిన 3,600 వస్తువులపై దిగుమతి పన్నుల పెంపు లేదా ఇతర ఆంక్షలను విధించింది (ఎకనమిక్‌ టైమ్స్‌ జూన్‌ 19). పోనీ దేశమంతా తమకే మద్దతు ఇచ్చిందని, రెండోసారి పెద్ద మెజారిటీతో గెలిపించారని చెప్పుకుంటున్న పెద్దలు మరి తమ జనం చేత అయినా పేటిఎం లేదా చైనా వస్తువులను ఎందుకు బహిష్కరించేట్లు చేయలేకపోయారు ? వినియోగం కనీసం ఆగలేదు, రోజు రోజుకూ ఎందుకు పెరుగుతున్నట్లు ? అంటే కబుర్లు తప్ప వాటిని చెప్పేవారు కార్యాచరణకు పూనుకోవటం లేదు. మరో వైపు కమ్యూనిస్టుల మీద పడి ఏడుస్తారు. ఎన్నడైనా, ఎక్కడైనా కమ్యూనిస్టులు చైనా వస్తువులనే వాడమని గానీ, రక్షణాత్మక చర్యలు తీసుకోవద్దని చెప్పారా ?
ప్రపంచ దేశాలన్నీ ఇటీవలి కాలంలో రక్షణాత్మక చర్యలను నానాటికీ పెంచుతున్నాయి. ప్రపంచ ఎగుమతుల్లో అగ్రస్ధానంలో ఉన్న చైనా సైతం అలాంటి చర్యలకు పాల్పడుతున్నపుడు మన దేశం ఎందుకు తీసుకోకూడదు ? ఏ కమ్యూనిస్టులు వద్దన్నారు ? 2020 జనవరి ఆరవ తేదీ ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ విశ్లేషకుడు బనికర్‌ పట్నాయక్‌ అందచేసిన వివరాల ప్రకారం ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య (ఆర్‌సిఇపి) స్వేచ్చా వాణిజ్య ఒప్పందంలో దేశాలు భారత్‌తో సహా 5,909 సాంకేతిక పరమైన ఆటంకాలను (టిబిటి) విధించినట్లు పేర్కొన్నారు. ఆ ఒప్పందం నుంచి మన దేశం ఉపసంహరణకు ముందు మన వాణిజ్య మంత్రిత్వ శాఖ రూపొందించిన అంతర్గత విశ్లేషణలో ఈ వివరాలు ఉన్నాయి. దాని ప్రకారం పన్నేతర ఆటంకాలు (ఎన్‌టిబి) ఇతర ఆటంకాలు ఉన్నాయి. వివిధ దేశాలు విధించిన సాంకేతిక పరమైన ఆటంకాలలో చైనా 1,516, దక్షిణ కొరియా 1,036, జపాన్‌ 917, థాయలాండ్‌ 809 విధించగా మన దేశం కేవలం 172 మాత్రమే విధించింది. ఈ బృంద దేశాలలో సగటు పన్ను విధింపులో మన దేశం 17.1శాతంతో అగ్రస్ధానంలో ఉండగా దక్షిణ కొరియా 13.7, చైనా 9.8, జపాన్‌ 4.4శాతం విధించాయి. శానిటరీ మరియు ఫైటోశానిటరీ(ఎస్‌పిఎస్‌) ఆంక్షలను చైనా 1,332ప్రకటించగా దక్షిణ కొరియా 777, జపాన్‌ 754 విధించగా మన దేశం కేవలం 261 మాత్రమే ప్రకటించింది. ఇలా ప్రతి దేశంలో అనేక ఆంక్షలను విధిస్తూనే ఉండగా మనం ప్రపంచ వాణిజ్య సంస్ద ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం కనుక విధించటం లేదు అని చెప్పటాన్ని వంచన అనాలా మరొకటని చెప్పాలా ? పన్నేతర ఆంక్షలకు చెప్పే రక్షణ, పర్యావరణం, నాణ్యత వంటివన్నీ ఎక్కువ భాగం దిగుమతుల నిరోధానికి పరోక్షంగా చెప్పే సాకులే అన్నది అందరికీ తెలిసిందే. కొన్ని వాస్తవాలు కూడా ఉండవచ్చు. రాజకీయ పరమైన వివాదాలు తలెత్తినపుడు ఇలాంటి పరోక్ష దాడులకు దిగటం మరింత ఎక్కువగా ఉంటుంది.
చైనా వస్తువుల నాణ్యత గురించి అనేక మంది చెబుతారు, చైనా పేరుతో వచ్చే వస్తువులన్నీ అక్కడివి కాదు, ఆ పేరుతో మన దేశంలో తయారైన వాటిని కూడా విక్రయిస్తున్నారు. ఏ వస్తువైనా మన నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉండాల్సిందే. రోజు రోజుకూ చైనాతో విదేశీ వస్తువులు కుప్పలు తెప్పలుగా వస్తున్నపుడు ప్రమాణాలను అభివృద్ధి చేసేందుకు గత ఆరు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. పోనీ అత్యవసరం గాని వస్తువుల దిగుమతులను అయినా నిరోధించిందా అంటే అదీ లేదు.
” చైనాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను చేసుకొనేందుకు రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ అనేక అధ్యయనాలు చేసింది. ఒప్పందాలు చైనా కంటే భారత్‌కే ఎక్కువ అవసరమని పేర్కొన్నది. చైనా నుంచి మూడులక్షల డాలర్లు లేదా నాటి విలువలో 90లక్షల రూపాయలను విరాళంగా పొందింది.” కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్‌, బిజెపి తాజాగా ముందుకు తెచ్చిన ఆరోపణ ఇది. నిజమనే అంగీకరిద్దాం, చైనా నుంచి వచ్చిన విరాళం సంగతి ఫౌండేషన్‌ తన వార్షిక నివేదికలో స్పష్టంగా పేర్కొన్నది.
పదిహేను సంవత్సరాల క్రితం తీసుకున్న విరాళం గురించి, రాజీవ్‌ ఫౌండేషన్‌ చేసిన అధ్యయనాలు, సిఫార్సుల గురించి ఇంతకాలం తరువాత బిజెపికి ఎందుకు గుర్తుకు వచ్చినట్లు ? వాటిలో తప్పుంటే ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదు. అంటే, ” నా గురించి నువ్వు మూసుకుంటే నీ గురించి నేను మూసుకుంటా, నన్ను లడక్‌ విషయంలో వేలెత్తి చూపుతున్నావ్‌ గనుక నీ పాత బాగోతాలన్నీ బయటకు తీస్తా ! ఇది బిజెపి తీరు.” బయటకు తీయండి, పోయిన సూదికోసం సోదికి పోతే పాత రంకులన్నీ బయటపడ్డాయన్నది ఒక సామెత. బిజెపి -కాంగ్రెస్‌ వారు ఇలా వివాదపడుతుంటేనే కదా వారిద్దరి బండారం జనానికి తెలిసేది.
బిజెపి వారు ఎదుటి వారి మీద ఎదురు దాడికి దిగితే ఇంకేమాత్రం కుదరదు. ఆ రోజులు గతించాయి. ఇంకా తాను ప్రతిపక్షంలో ఉన్నట్లు, కొద్ది క్షణం క్రితమే అధికారాన్ని స్వీకరించినట్లు కబుర్లు చెబితే చెల్లవు. గురివింద గింజ మాదిరి వ్యవహరిస్తే రాజకీయాల్లో కుదరదు.రాహుల్‌ గాంధీ చైనా నేతలతో జరిపిన భేటీలో ఏమి చర్చించారో చెప్పాలని కూడా బిజెపి వారు సవాళ్లు విసురుఉన్నారు. సూదులు దూరే కంతల గురించి గుండెలు బాదుకుంటూ పదిహేనేండ్ల క్రితం చైనానుంచి తీసుకున్న 90లక్షల రూపాయలను ఏమి చేశారో చెప్పమని కాంగ్రెస్‌ వారిని ఇప్పుడు సవాల్‌ చేస్తున్నారు. దాన్ని వెల్లడించిన వార్షిక నివేదికలోనే ఖర్చుల గురించి కూడా చెప్పి ఉంటారు కదా ! ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత పెద్ద కార్యాలయాన్ని ఏడువందల కోట్ల రూపాయలు పెట్టి బిజెపి ఢిల్లీలో కట్టింది. దానికి అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందని కాంగ్రెస్‌తో సహా అనేక మంది అడిగారు, ఇంతవరకు ఎవరైనా చెప్పారా ?
గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ నాలుగుసార్లు, ప్రధానిగా ఐదుసార్లు చైనా వెళ్లారని, చైనా అధ్యక్షు గ్జీ జింపింగ్‌ను మూడుసార్లు మన దేశం ఆహ్వానించారని, గత ఆరు సంవత్సరాలలో వివిధ సందర్భాలలో జింపింగ్‌తో మోడీ 18సార్లు కలిశారని కాంగ్రెస్‌ ప్రతినిధి సూర్జేవాలా చెప్పారు.2009లో బిజెపి అంతకు ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ చైనా కమ్యూ నిస్టు పార్టీతో సంప్రదింపులు జరిపిందని,2011లో నాటి బిజెపి అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ నాయకత్వంలో బిజెపి ప్రతినిధి బృందం చైనా పర్యటన జరిపిందని అక్కడ భారత వ్యతిరేక చర్చలు జరిపారా అని కూడా సూర్జేవాలా ప్రశ్నించారు. చైనా రాజకీయ వ్యవస్ధను అధ్యయనం చేసేందుకు 2014లో బిజెపి 13 మంది ఎంపీలు, ఎంఎల్‌ఏల బృందాన్ని చైనా పంపిందని ఇవన్నీ భారత వ్యతిరేక కార్యకలాపాలా అని కాంగ్రెస్‌ వేస్తున్న ప్రశ్నలకు బిజెపికి మైండ్‌ బ్లాంక్‌ కావటం తప్ప సమాధానం ఏమి చెబుతుంది ?
ప్రపంచంలోనే చైనా అత్యంత విశ్వాస ఘాతుక దేశమని విశ్వహిందూ పరిషత్‌ నేత సురేంద్ర జైన్‌ (2020 జూన్‌ 19వ తేదీ ఎకనమిక్‌ టైమ్స్‌) ఎకనమిక్‌ టైమ్స్‌తో చెప్పారు. అలాంటి దేశంతో అంటీముట్టనట్లుగా ఉండాల్సింది పోయి ఎందుకు రాసుకుపూసుకు తిరుగుతున్నారని తమ సహచరుడు నరేంద్రమోడీని ఎందుకు అడగరు? చైనాతో వ్యవహరించేటపుడు చైనాది హంతక భావజాలమని, దాని ఆధారంగా పని చేసే ఆ దేశ నాయకత్వంతో వ్యవహరించేటపుడు ఆ విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని 2020 జూన్‌ నాలుగవ తేదీ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ వెలిబుచ్చిన అభిప్రాయం ఈ రోజు కొత్తది కాదు, ఎప్పటి నుంచో చెబుతున్నదే మరి బిజెపి నాయకత్వం ఎందుకు పెడచెవిన పెట్టింది ? వెనుక నుంచి ఆడించే ఆర్‌ఎస్‌ఎస్‌ ఎందుకు అనుమతించినట్లు ? ప్రశ్నించకుండా అనుసరించే జనాన్ని వెర్రి వెంగళప్పలను చేయాలని గాకపోతే ఏమిటీ నాటకాలు ?