Tags
Alliance Between United States and India, cut troops in Germany, Diego Garcia, Mauritius, Mike Pompeo, NATO, Threat to India from whom
ఎం కోటేశ్వరరావు
చైనా విస్తరణ వాదం వర్తమానకాల సవాలు అని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చెప్పాడు, దాన్ని ఎదుర్కొనేందుకు తమ వనరులను సమీకరిస్తామని అన్నాడు.జర్మన్ మార్షల్ ఫండ్ బ్రసెల్స్ ఫోరమ్ వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి భారత్, వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, ఇండోనేషియా, దక్షిణ చైనా సముద్రాలకు ముప్పు ఉందని పాంపియో వ్యాఖ్యానించాడు. ఈ నేపధ్యంలో భారత్‌కు అమెరికా సైన్యం బాసటగా నిలవనున్నదని మీడియా వ్యాఖ్యానాలు చేసింది. ” చైనా సైన్యాన్ని ఎదుర్కొనేందుకు భారత్, ఆగేయాసియాకు అమెరికా మిలిటరీ తరలింపు: పాంపియో ” ఒక ఆంగ్ల దినపత్రిక శీర్షిక. ఈ వార్తలు వెలువడగానే సామాజిక మాధ్యమంలో ఇంకేముంది అమెరికా సైన్యం భారత్‌కు మద్దతుగా వస్తున్నట్లు, చైనాను అడ్డుకొనేందుకు సిద్దపడటం, అంతా అయిపోయినట్లు దాని మంచి చెడ్డలను చర్చిస్తున్నారు.
భారత్ లేదా ప్రపంచానికి అసలు ముప్పు ఎవరి నుంచి ఉంది? చైనా నుంచా ? అమెరికా నుంచా ? విస్తరణ వాదం అంటే ఏమిటి ? రెండవ ప్రపంచ యుద్దంలో పరాజిత జర్మనీ లేదా విజేత సోవియట్ యూనియన్ గానీ ఒక వేళ దాడి చేస్తే పరస్పరం సహకరించుకుందామంటూ 1947 మార్చి నాలుగున ఫ్రాన్స్-బ్రిటన్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. తరువాత తమ పరిసర దేశాలతో దాన్ని వెస్టరన్ యూనియన్‌గా విస్తరించారు.1949 ఏప్రిల్ నాలుగున మరికొన్ని ఐరోపా దేశాలు, అమెరికా, కెనడాలకు విస్తరించి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో)గా మార్పు చేశారు. ఏ జర్మనీ నుంచి ముప్పు అని ఒప్పందం ప్రారంభమైందో ఆ జర్మనీయే 1955లో నాటోలో చేరింది. ఏ సోవియట్ యూనియన్ అయితే దాడి చేస్తుందనే ప్రచారం చేశారో అది ఏ ఒక్కదేశం మీద కూడా దాడి చేయలేదు.1991లో సోవియట్ సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసిన తరువాత దాని రిపబ్లిక్‌లు స్వతంత్రదేశాలుగా ప్రకటించుకున్నాయి. సోవియట్‌తో ప్రచ్చన యుద్దంలో తామే విజేతలమని అమెరికన్లు ప్రకటించుకున్న తరువాత నాటో కూటమిని రద్దు చేయాలి. ముప్పు అనుకున్న సోవియట్ అసలు ఉనికిలోనే లేదు. అలాంటపుడు ఐరోపాకు ఎవరి నుంచి ముప్పు ఉన్నట్లు ? రద్దు చేయకపోగా ఇతర దేశాల్లో మిలిటరీ జోక్యానికి పూనుకుంది. అనేక దేశాలకు విస్తరింప చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో చేస్తున్న మిలిటరీ ఖర్చులో 70శాతం ఈ కూటమి ఖర్చే ఉంది. ప్రస్తుతం ప్రపంచానికి అది ముప్పుగా పరిణమించింది అంటే అతిశయోక్తి కాదు.1990దశకం నుంచి అనేక దేశాల మీద అమెరికన్లు, దాని మిత్రదేశాలు ఏదో ఒక వంకతో చేస్తున్న దాడులే అందుకు నిదర్శనం. ఇక విస్తరణ వాదం గురించి చెప్పాల్సి వస్తే 1949 నుంచి ఇప్పటి వరకు తొమ్మిది సార్లు విస్తరించారు,పన్నెండు నుంచి 30దేశాలకు సభ్య రాజ్యాలు పెరిగాయి. ఇంకా విస్తరించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా చేరిన దేశం ఉత్తర మాసిడోనియా. అనేక దేశాలు నాటో కలసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే వాటి శత్రువు ఎవరో, ఎవరి నుంచి రక్షణ పొందటానికో అగమ్యగోచరం.
ఇప్పుడు జర్మనీలో ఉన్న సైన్యాలను తగ్గించి భారత్, ఆగేయాసియాకు తరలిస్తామని పాంపియో చెబుతున్నాడు. అసలు చైనా విస్తరణ వాదం అనేది ఒక ఊహాజనితం, కుట్ర సిద్ధాంతాలలో భాగం. జర్మనీ నుంచి సైన్యాల తగ్గింపు-భారత్‌కు తరలింపు అన్నది లడఖ్ ఉదంతాన్ని ఆసరా చేసుకొని లబ్దిపొంద చూసే అమెరికా యత్నం తప్ప మరొకటి కాదు. భారత్-చైనాల మధ్య తాజా సరిహద్దు ఉదంతాలు జరగటానికి ఎంతో ముందే అమెరికా ఆ నిర్ణయానికి వచ్చింది. భారత్‌కు మేలు చేసేందుకే ఇది అన్నట్లు ఇప్పుడు ఫోజు పెడుతోంది.
జర్మనీలో 35వేల మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. వారిని 25వేలకు కుదిస్తామని అమెరికా చెప్పింది. నాటో నుంచి తాము వైదొలుగుతామని గత ఎన్నికల్లో చెప్పిన డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదు.నాటో నిర్వహణకు అయ్యేఖర్చును తామే ఎందుకు భరించాలని ప్రశ్నించి అదే ట్రంప్ వివాదపడిన విషయం తెలిసిందే. అదిరించో బెదిరించో ఖర్చును ఐరోపా దేశాల మీద నెట్టి తమ చేతికి మట్టి అంటకుండా నాయకత్వ స్ధానంలో ఉండాలన్నది అమెరికా ఎత్తుగడ. తనకు లాభం లేదనుకున్న అనేక ప్రపంచ సంస్ధలు, ఒప్పందాల నుంచి అమెరికా వైదొలిగింది.నాటో నుంచి వైదొలుగుతామని బెదిరించటం తప్ప ఒక్క అడుగు కూడా వెనక్కు వేయటం లేదు. అమెరికా గనుక అంత పని చేస్తే నాటో బలహీనపడి రష్యాకు ఉపయోగపడుతుందని నిపుణులు హెచ్చరించటమే దీనికి కారణం.
నాటోకు చెల్లింపులు చేయటాన్ని జర్మనీ ఒక అపరాధంగా భావిస్తోంది, ఐరోపా దేశాలు తమ రక్షణకు ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టుకోవాలి, జర్మనీ వైఖరిని మార్చుకోనట్లయితే అక్కడి నుంచి సైన్యాలను తగ్గించాలన్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ట్రంప్ చెప్పాడు. అమెరికా సైన్యాలు ఐరోపాలో అట్లాంటిక్ దేశాల భద్రత కోసం ఉన్నాయి తప్ప జర్మనీని రక్షించటానికి కాదని అమెరికాలో జర్మనీ రాయబారి ఎమిలీ హార్బర్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. నిజానికి జర్మనీలో అమెరికన్ సైన్యాల మోహరింపు మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా తదితర చోట్లకు వేగంగా తరలించటానికి అనువుగా ఉండటం తప్ప జర్మనీకో మరో ఐరోపా దేశానికో ముప్పు కారణం కాదు. నాటో సభ్యరాజ్యాలు తమ జిడిపిలో రెండుశాతం మొత్తాన్ని రక్షణకు ఖర్చు పెట్టాలని అమెరికా వత్తిడి చేస్తోంది. అంటే దాని సైనికులు, ఆయుధాలకు ఐరోపా దేశాలు చెల్లించాలన్నది అసలు విషయం.
జర్మనీతో అమెరికాకు వాణిజ్య పేచీ కూడా ఉంది. వాణిజ్యం విషయంలో అమెరికాను జర్మనీ చాలా చెడ్డగా చూస్తోంది, చర్చలు జరుపుతున్నాం గానీ సంతృప్తికరంగా లేవు. వారి వలన అమెరికాకు కొన్ని వందల బిలియన్ల డాలర్లు ఖర్చయ్యాయి, నాటో విషయంలో మా మనసు గాయపడింది. మా సైనికులు చేసే ఖర్చుతో జర్మనీ లబ్ది పొందుతోందని ట్రంప్ రుసరుసలాడాడు. తాము రక్షణ కోసం జిడిపిలో 3.42శాతం ఖర్చు చేస్తుంటే జర్మనీ కేవలం 1.8శాతమే కేటాయిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా విమర్శించాడు. నాటో బడ్జెట్‌లో అమెరికా, జర్మనీ 16శాతం చొప్పున భరిస్తున్నాయి. ఈనేపధ్యంలోనే అమెరికన్ సైనికుల ఖర్చును భరించే మరో దేశం కోసం ట్రంప్ చూస్తున్నాడన్నది స్పష్టం. అది మన దేశం అవుతుందా ? మరొక ఆగేయాసియా దేశం అవుతుందా అన్నది ఇప్పుడే చెప్పలేము. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే అమెరికాను మన భుజాల మీద ఎక్కించుకొనేందుకు మన పాలకవర్గం సిద్దం కాదు. దానితో చేతులు కలిపి లబ్ది పొందాలని చూస్తున్నదే తప్ప లొంగిపోయి అది విసిరే ఎంగిలి మెతుకులు తినాలని అనుకోవటం లేదు. ఈ వైఖరి నుంచి వైదొలిగే అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప అమెరికా సైన్యాలు మన గడ్డమీద తిష్టవేసే అవకాశాలు లేవనే చెప్పవచ్చు.
ప్రపంచంలోని 150దేశాలలో లక్షా 70వేల మంది అమెరికన్ సైనికులు విధులలో ఉన్నారు. వారిలో గరిష్టంగా జపాన్‌లో 55వేలు, దక్షిణ కొరియాలో 26, జర్మనీలో 35, ఇటలీలో పన్నెండు, బ్రిటన్‌లో పదివేల మంది ఉన్నారు. మైక్ పాంపియో చీకట్లో బాణం వేశాడు. జర్మనీ నుంచి తగ్గించదలచిన తొమ్మిదిన్నరవేల మందిని ఎక్కడకు తరలించాలన్నది ఇంకా తేలాల్సి ఉంది. జర్మనీతో రాజీ కుదిరితే వారిని అక్కడే కొనసాగించవచ్చు. ఎవరు అవునన్నా కాదన్నా నేడు ప్రపంచ వాణిజ్యంలో చైనా ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. దాన్నే విస్తరణవాదంగా అమెరికా, దాని అడుగుజాడల్లో నడిచే దేశాలు చిత్రిస్తున్నాయి. ఈ పేరుతోనే గడచిన మూడు సంవత్సరాలలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తన బల ప్రదర్శలో భాగంగా మూడు విమాన వాహక, ఇతర యుద్ద నౌకలను అమెరికా మోహరించింది. వాటిని చూపి మనతో సహా అనేక దాని మిత్ర దేశాలకు మీ వెనుక మేమున్నాం చైనా మీదకు మీరు దూకండి అని అమెరికా సందేశాలు పంపుతోంది. దానికి ప్రతిగా చైనా కూడా తన జాగ్రత్తలు తాను తీసుకొంటోంది. వాణిజ్య పరంగా పెట్టుబడులు, ఒప్పందాలు తప్ప చైనా మిలిటరీ పరంగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అయితే అది అనేక చోట్ల నిర్మిస్తున్న రేవులు వాణిజ్యంతో పాటు మిలిటరీని ఉంచేందుకు కూడా ఉపయోగపడతాయని అమెరికా, దాన్ని అనుసరించే వారు చెబుతున్నారు. కానీ వారు 150దేశాల్లో అమెరికా మిలిటరీ లేదా దాని సైనిక కేంద్రాలు ఎందుకు ఉన్నాయో చెప్పరు.
ప్రస్తుతం అమెరికా ప్రపంచ ఆధిపత్యాన్ని సాధించాలంటే నావికులు నడిపే 390, నావికులు లేకుండా కంప్యూటర్లద్వారా నడిచే మరో 45 నౌకలు కావాల్సి ఉంటుందని ఒక సంస్ధ అంచనా వేసింది. దీనికి గాను ప్రస్తుతం అమెరికా వద్ద మొత్తం 294 మాత్రమే ఉన్నాయని, 2030 నాటికి వాటిని 355కు పెంచుకొనేందుకు అమెరికన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. భారత్ తమ ప్రధాన రక్షణ భాగస్వామి అని 2016లోనే అమెరికా ప్రకటించింది. ఆ తరువాత మన మిలిటరీతో సంబంధాలను గణనీయంగా మెరుగుపరుకుంది, తొలిసారిగా మన త్రివిధ దళాలతో సైనిక విన్యాసాలను కూడా నిర్వహించింది. విశాఖ నుంచి కాకినాడ వరకు అమెరికా నావికా దళం ప్రయాణించింది. ఒక రక్షణ ఒప్పందం కూడా చేసుకుంది. ఇవన్నీ చైనాను ఎదుర్కొనే అమెరికా వ్యూహంలో భాగమని నిపుణులు చెబుతున్నారు. గతంలో అమెరికా పసిఫిక్ కమాండ్ పేరుతో ఉన్న మిలిటరీకి తాజాగా ఇండో -పసిఫిక్ కమాండ్ అని మార్చారు. ఇవన్నీ భారత్‌ను తనతో తీసుకుపోయే వ్యూహంలో భాగమే. ప్రపంచ పోలీసుగా అమెరికా తనకు తానే బాధ్యత తీసుకొని పెత్తనం చెలాయించ చూడటం ప్రపంచానికే ముప్పు. దానితో జతకట్టిన దేశాలకూ ముప్పే. రాచపీనుగ ఒంటరిగా పోదు అన్న సామెత తెలిసిందే.
తాజా విషయాన్ని చూద్దాం. ఢిల్లీ నుంచి కన్యాకుమారి దూరం 2,800 కిలోమీటర్లు అయితే మారిషస్‌కు చెందిన చాగోస్ దీవుల నుంచి కన్యాకుమారి దూరం కేవలం 1,722 కిలోమీటర్లు మాత్రమే. హిందూ మహాసముద్రంలోని ఈ దీవుల్లో ఒకటైన డిగోగార్షియాలో అమెరికా నావికా దళ కేంద్రం ఉంది. ఈప్రాంతాన్ని ఆక్రమించిన ఫ్రెంచి వారు తరువాత బ్రిటన్‌కు అప్పగించారు.వారు సంయుక్త భాగస్వామ్యం పేరుతో అమెరికాకు అప్పగిస్తే అక్కడ వారు సైనిక కేంద్రాన్ని నెలకొల్పారు. అది మన రక్షణకు ముప్పు అని ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం అవుతోంది.యావత్ ప్రపంచంలో తమది అత్యంత ప్రజాస్వామిక దేశమని బ్రిటన్ గొప్పలు చెప్పుకుంటుంది. కానీ అత్యంత అప్రజాస్వామికంగా రవి అస్తమించని సామ్రాజ్యాన్ని తన వలసగా చేసుకుంది. చాగోస్ దీవులను బ్రిటన్ 2019 నవంబరులోగా మారిషస్‌కు అప్పగించి అక్కడి నుంచి తప్పుకోవాలని ఐక్యరాజ్యసమితి ఆదేశించింది. బ్రిటన్ దాన్ని ధిక్కరించింది.
1968లో బ్రిటన్ నుంచి మారిషస్ స్వాతంత్య్రం పొందింది. అయితే తాము మారిషస్‌ను ఖాళీ చేయాల్సి ఉంటుందని గ్రహించిన బ్రిటన్ తనకు అధికారం లేకపోయినా చాగోస్ దీవుల సముదాయంలో పెద్దదైన డిగోగార్షియా, దానిపక్కనే ఉన్న మరికొన్నిటినీ ఒక మిలిటరీ కేంద్రంగా వినియోగించుకొనేందుకు అనుమతిస్తూ అమెరికాకు కౌలుకు ఇచ్చింది. అప్పటి నుంచి ఆ దీవులను తమకు అప్పగించాలని మారిషస్ డిమాండ్ చేస్తూనే ఉన్నా అపర ప్రజాస్వామిక దేశాలైన బ్రిటన్, అమెరికా దాన్ని ఖాతరు చేయలేదు.2019 ఫిబ్రవరి 25న వాటిని మారిషస్‌కు అప్పగించాలని అంతర్జాతీయ న్యాయ స్ధానం తీర్పు చెప్పింది. తరువాత మే 22న ఐక్యరాజ్యసమితి 116-6ఓట్ల మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించి బ్రిటన్ ఆ దీవులను ఖాళీ చేయాలని ఆదేశించింది. అమెరికా, బ్రిటన్ తిరస్కరించాయి. తమ మధ్య కుదిరిన ద్విపక్ష వ్యవహారాల మీద నిర్ణయం చేసేందుకు అంతర్జాతీయ కోర్టు, ఐరాసకు అధికారం లేదని వాదించాయి.
స్వాతంత్య్ర సమయంలో అధికారానికి రానున్న మారిషస్ నేత శివసాగర్ రామ్‌గులామ్‌ను బ్రిటన్ బ్లాక్‌మెయిల్ చేసింది, చాగోస్ దీవుల గురించి మాట్లాడవద్దని బెదిరించింది.1965లో తాము చేసుకున్న ఒప్పందం చట్టబద్దమే అని సముద్ర చట్టాల ట్రిబ్యునల్ 2015లో నిర్ధారించిందని బ్రిటన్ వాదిస్తోంది. అయితే ఆ ట్రిబ్యునల్ వాదనను ప్రపంచ కోర్టు కొట్టివేసింది. ఐక్యరాజ్యసమితి 1514 తీర్మానాన్ని ఆ ఒప్పందం ఉల్లంఘించిందని కోర్టు పేర్కొన్నది. ఈ ఒప్పందం 2036వరకు అమల్లో ఉంటుంది. మారిషస్‌కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆ దీవుల్లో నివాసం ఉంటున్న దాదాపు 1,500 చాగోసియన్లను బలవంతంగా మారిషస్, షెషల్స్‌కు తరలించారు. ఈ ఏడాది ప్రారంభంలో తాము చాగోస్ దీవులను సందర్శిస్తామని మారిషస్ ప్రకటించింది. అది బ్రిటన్ ప్రాంతమని, అక్కడ పర్యటించాలనుకోవటం రెచ్చగొట్టటమే అని, రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయంటూ అమెరికా బెదిరించింది. దాంతో మారిషస్ రాయబారి ఒక ప్రకటన చేస్తూ 2036లో డిగోగార్సియా దీవి ఒప్పందాన్ని బ్రిటన్ పునరుద్దరించలేదని, అయితే తాము అమెరికాకు 99 ఏండ్లకు కౌలుకు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించాడు. ఆ దీవుల్లో వారిని మారిషస్ మీద రెచ్చగొట్టేందుకు బ్రిటన్-అమెరికా డబ్బు ఆశచూపుతూ విభజించి పాలించే ఎత్తుగడను అమలు చేస్తున్నాయి.
చైనా విషయానికి వస్తే అది ఏ మిలిటరీ కూటమిలోనూ సభ్య దేశం కాదు. 1962లో అది మనతో చేసిన యుద్దం తప్ప అంతకు ముందు, తరువాత కమ్యూనిస్టు చైనా సైన్యానికి యుద్దం చేసిన అనుభవం కూడా లేదు. చైనాతో పోలిస్తే మన మిలిటరీ ఖర్చు తక్కువ, మొత్తంగా చూస్తే బలాబలాల రీత్యా చైనాదే పైచేయి అయినప్పటికీ పాకిస్ధాన్‌తో జరిగిన యుద్ధాల కారణంగా అనుభవం రీత్యా మనమే మెరుగ్గా ఉన్నట్లు నిపుణులు చెబుతారు. గత నాలుగున్నర దశాబ్దాలుగా ఎలాంటి ఘర్షణలు జరగని మన సరిహద్దుల్లో ఒక్క ఉదంతం కారణంగానే రెండు దేశాల మధ్య యుద్దం వచ్చే అవకాశాలు లేవు. అటూ లేదా మన వైపు నుంచి గిల్లికజ్జాలు పెట్టుకొనేందుకు అనువైన వాతావరణం కూడా లేదు. అయితే కరోనా, అంతకు ముందునుంచి ప్రారంభమైన ఆర్ధిక మాంద్యం నుంచి బాధ్యతను ఇతరుల మీదకు నెట్టివేసేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దానికి తోడు నవంబరులో జరిగే ఎన్నికలలో లబ్ది పొందేందుకు ట్రంప్ అనేక ఎత్తులు వేస్తున్నాడు. వాటిలో మనం చిక్కుకోరాదు.
చాగోస్ దీవులను బ్రిటన్ ”త్యాగం ” చేస్తే చైనా ఆక్రమిస్తుందని బ్రిటన్‌లో కొందరు రెచ్చగొడుతున్నారు. ముత్యాల హారం పేరుతో చైనా అమలు చేస్తున్న వ్యూహంలో భాగంగా హిందూ మహా సముద్రంలో అనేక చోట్ల అది వాణిజ్య, మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని చిత్రిస్తున్నారు. మరోసారి బ్రిటన్ ప్రపంచ రాజకీయాల్లో పాత్ర వహించాలంటే చాగోస్ దీవులను కలిగి ఉండాల్సిందేనని చెబుతున్నారు. మధ్య ప్రాచ్యం, భారత ఉపఖండాల మీద నాటో కూటమి ఆధిపత్యం సాధించాలంటే డిగోగార్షియా, ఇతర దీవులు బ్రిటన్ ఆధీనంలోనే ఉండాలని వాదిస్తున్నారు. దీన్ని బట్టి ఎవరు ఎవరికి ముప్పు పరిగణిస్తున్నారో వేరే చెప్పాలా ?(చైనా ముత్యాల హారం వ్యూహం గురించి మరోసారి చెప్పుకుందాం) మైక్ పాంపియో చెప్పినట్లు జర్మనీ నుంచి లేదా నేరుగా అమెరికా నుంచే సైనికులను తరలించాల్సి వస్తే మారిషస్ నోరు మూయించి నావికా దళ కేంద్రంగా ఉన్న డిగోగార్షియాలో అవసరమైన మార్పులు చేసి మిలిటరీని అక్కడ పెట్టేందుకు అవకాశం ఉంది. అది జరగాలన్నా ఏర్పాట్లకు కొంత సమయం పడుతుంది. అది చైనాకే ముప్పు అనుకుంటే పొరపాటు, అమెరికా రెండంచుల పదును ఉన్న కత్తి వంటిది. తన ప్రయోజనాలే దానికి ముఖ్యం. ఎటు నుంచి అయినా ఎవరిని అయినా దెబ్బతీయగలదు !