Tags

, , ,


ఎం కోటేశ్వరరావు
గత రెండు వారాలుగా దేశంలో అనేక అంశాలు ముందుకు వచ్చాయి. ప్రధానమైన వాటిలో చైనా వస్తువులను బహిష్కరించాలి-వారికి బుద్ది చెప్పి మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలి అని తెచ్చిపెట్టుకొని వీరంగం వేయటం ఒకటి. అది వీధుల్లో సద్దుమణిగినా సామాజిక మాధ్యమాల్లో కొనసాగుతోంది. రెండవది చైనాకు ధీటుగా మనం ఎందుకు అభివృద్ధి కాలేకపోయాము, ఏం చేయాలి అని అనేక మంది నిజాయితీతో మధనపడటం.అసలైన దేశభక్తి వీరిదే. తోలుబొమ్మలాటలో పాత్రధారుల వంటి మొదటి తరగతి సరిహద్దు సమస్య సద్దుమణగ్గానే సామాజిక మాధ్యమాల్లో కూడా కనుచూపు మేరలో కనపడదు. మోడీ సర్కార్‌కు ఇబ్బందులు తలెత్తినపుడు తిరిగి రంగంలోకి వస్తుంది. డోక్లాం సమస్య తలెత్తినపుడు మూడు సంవత్సరాల క్రితం ఈ బాపతే చైనా వ్యతిరేక శివాలును ప్రదర్శించటాన్ని ఇక్కడ గుర్తు చేయాలి.
ఎందరో మేథావులు మన దేశంలో ఉద్భవిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది.వారి పరిజ్ఞానం మన కంటే విదేశీ కార్పొరేట్లకే ఎక్కువగా ఉపయోగపడుతోంది. ఆంగ్లం చదువుకున్న మేథావులు కూడా తమకు తెలియని వేదాల్లో ఎంతో సాంకేతిక పరిజ్ఞానం ఉందని నమ్మే దౌర్భాగ్య వైపరీత్యం ఒక వైపు ఉంది. చివరికి ఓం శబ్దం గురించి అమెరికా నాసా చెప్పిందంటే తప్ప నమ్మని జనం కూడా తయారయ్యారు. మరోవైపు గత ఏడు దశాబ్దాలలో పరిశోధన-అభివృద్ధికి తగిన ప్రాధాన్యత, నిధులు కేటాయింపుల్లేని స్ధితి మరొకటి. యాభై ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో జరిగిన తప్పిదాలన్నింటినీ ఐదేండ్లలో పరిష్కరించామని చెప్పుకుంటున్న సంఘపరివార్‌ నేతలు ఈ విషయంలో కాంగ్రెస్‌ చెప్పుల్లోనే కాళ్లు దూర్చారు. ఇతర దేశాలతో పోటీ పడేందుకు అవసరమైన నిధులు కేటాయించకుండా అరకొర నిధులలో కొన్నింటిని ఆవు మూత్రం, పేడలో బంగారం, ఇంకా ఏముందో పరిశోధించేందుకు మళ్లిస్తున్నారు. వాటిలో ఏముందో ఒక నోటితో వారే చెబుతారు,మరో నోటితో పరిశోధనలు చేయాలంటారు ? మరి కొందరు తెలివితేటలు గల పిల్లల్ని ఎలా పుట్టించాలా అని పరిశోధిస్తున్నవారు కూడా లేకపోలేదు. ఇవన్నీ ఉట్టితో పనిలేదు, ఏకంగా స్వర్గానికి తీసుకుపోతామని జనానికి సందేశమివ్వటమే !
మన దేశంలో శాస్త్రీయ పరిశోధనలకు అనేక సంస్ధలను ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పాలకులు వాటికి తగినన్ని నిధులు కేటాయించేందుకు శ్రద్ద తీసుకోలేదు. కొన్ని రంగాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడున్న సర్కార్‌ గత ఆరు సంవత్సరాలలో అంతకు మించి చేసిందేమీ లేకపోగా శాస్త్రవేత్తలను కించపరచటం, శాస్త్రపరిజ్ఞానాన్ని తక్కువ చేసి మాట్లాడటం జరుగుతోంది. దీనికి కారణం ఏమంటే సమాజంలో శాస్త్రీయ భావాల వ్యాప్తి పెరిగితే మత, తిరోగామి శక్తుల అజెండా అమలుకు ఆటంకంగా మారతాయని సామాజికవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం జపాన్‌ 3.1, చైనా 2.1శాతాల చొప్పున తమ జిడిపిలో పరిశోధనాఅభివృద్ధికి ఖర్చు చేస్తున్నాయి. మన దేశం 0.7శాతం మాత్రమే, అదీ కొన్ని సంవత్సరాలుగా ఎదుగుబొదుగూ లేకుండా ఉందంటే అతిశయోక్తి కాదు. దీనిలో కూడా సింహభాగం అణుశక్తి, అంతరిక్షం, రక్షణ వంటి కీలక రంగాలలోనే వెచ్చిస్తున్నారు.
మన ప్రయివేటు రంగం రాయితీల మీద చూపుతున్న శ్రద్ద పరిశోధనపై పెట్టటం లేదు. అతి పెద్ద కార్పొరేట్‌ సంస్ధ రిలయన్స్‌ ఇండిస్టీస్‌ 2016లో తన అమ్మకాల ఆదాయంలో కేవలం అరశాతమే పరిశోధనకు ఖర్చు చేసింది.ఔషధ, ఐటి రంగాలలో చేస్తున్న ఖర్చు మిగతావాటితో పోలిస్తే ఎక్కువే అయినా విదేశాల్లోని సంస్దలతో పోలిస్తే తక్కువే. అమెరికా, ఐరోపాలోని ఔషధ కంపెనీలు తమ అమ్మకాల ఆదాయంలో 20శాతం వరకు ఖర్చు చేస్తుండగా ఒకటీ అరా తప్ప భారతీయ కంపెనీలు పదిశాతానికి మించి కేటాయించటం లేదు. ఐటి రంగంలో తక్కువ వేతనాలు చెల్లించి ఎగుమతులతో ఆ రంగం పనిచేస్తుండగా జనరిక్‌ ఔషధాల ఎగుమతులతో ఫార్మా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మన మార్కెట్లో స్వదేశీ వస్తువులకు కల్పిస్తున్న రక్షణల కారణంగా మన కార్పొరేట్‌లు ఎలాంటి నవీకరణ లేకుండా తమ వస్తువులను అమ్ముకొనేందుకు అలవాటు పడ్డాయి. ఇది ఎంతవరకు పోయిందంటే ఎక్కడో తయారయ్యే వాటిని తెచ్చి అమ్ముకుంటే వచ్చే లాభాలు మెరుగ్గా ఉన్నపుడు మనం తయారు చేయటం ఎందుకు అనేంతగా ! అమెరికా, ఐరోపా దేశాలు మనకు మార్గదర్శకంగా ఉన్నాయి, కనుకనే ఏటేటా చైనా వస్తువుల దిగుమతి జరుగుతోంది. ఎగుమతి మార్కెట్లలో నిలవాలంటే నవ ప్రవర్తక ఉత్పత్తులు కావాలి, అందుకోసం పరిశోధన-అభివృద్ధి ఖర్చు చేయాలి. మన ఎగుమతులు గత పది సంవత్సరాలుగా 250-300 డాలర్ల మధ్య ఉంటున్నాయి తప్ప మెరుగుపడటం లేదు. ప్రపంచ వస్తు ఎగుమతుల్లో మన వాటా 1.7శాతం మాత్రమే. ఐటి గురించి ఘనంగా చెప్పుకోవటమే తప్ప మూడున్నర శాతం మాత్రమే మన ఎగుమతులు ఉన్నాయి.
నూటముఫ్పైఅయిదు కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో వైద్యం ఎంతో ముఖ్యమైనది.ఈ రంగంలో ఎంతో పరిశోధన జరగాల్సి ఉందని కోవిడ్‌-19 నిరూపించింది. ఈ రంగంలో పరిశోధనా సంస్ధగా ఉన్న ఐసిఎంఆర్‌కు ఇస్తున్న నిధులెన్ని ? 2017,18 సంవత్సరాలలో పరిశోధన-అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేసిన 93శాతం ఖర్చులో పన్నెండు ప్రధాన పరిశోధనా సంస్ధలు ఉన్నాయి. వాటిలో డిఆర్‌డిఓకు 31.6శాతం, అంతరిక్షశాఖకు 19, వ్యవసాయ పరిశోధనకు 11.1, అణుఇంధనసంస్ధకు 10.8, సిఎస్‌ఐఆర్‌ 9.5శాతం పొందగా ఐసిఎంఆర్‌కు 3.1,భూశాస్త్రాలకు 2.3, ఎలక్ట్రానిక్స్‌-ఐటికి 0.8, పర్యావరణ, అడవులకు 0.5, రెన్యువబుల్‌ ఎనర్జీకి 0.1శాతం ఖర్చు చేశారు.
శాస్త్ర, సాంకేతిక శాఖ(డిఎస్‌టి)లో పని చేసిన ప్రతి ఉన్నతాధికారి పరిశోధన-అభివృద్ధికి నిధులు పెంచేందుకు ప్రయత్నించినా పాలకులు ప్రాధాన్యత ఇవ్వలేదన్నది పచ్చి నిజం. డబ్బు రూపంలో ఏడాదికేడాది పెరిగినట్లు కనిపించవచ్చు గానీ జిడిపిలో శాతాల వారీ చూస్తే గత పదేండ్లలో తగ్గింది తప్ప పెరగలేదు.2009లో నాటి డిఎస్‌టి కార్యదర్శి టి రామస్వామి ఒక పత్రిక ఇంటర్వ్యూలో చెప్పినదాని సారాంశం ఇలా ఉంది. పరిశోధన ఖర్చు జిడిపిలో 0.9శాతం ఉంది, రెండుశాతానికి పెంచటానికి ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రతి పదిలక్షల మంది జనాభాకు మన దేశంలో పూర్తికాలం పని చేసే శాస్త్రవేత్తలు కేవలం 120 మందికాగా చైనాలో 800, బ్రిటన్‌లో 2,800, అమెరికాలో 3,200 ఉన్నారు. పదేండ్ల తరువాత అదే రామస్వామి చెన్నరులో ఎంఎస్‌ స్వామినాధన్‌ ఫౌండేషన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ 2018లో పరిశోధకులు పదిలక్షల జనాభాకు 253 మంది మాత్రమే ఉన్నారని,జిడిపిలో రెండుశాతం కేటాయింపులు లేవని చెప్పారు. ప్రపంచ బ్యాంకు సమాచారం ప్రకారం చైనాలో 1,225(2017 సం), కెనడాలో 4,264(2016), జపాన్‌ 5,304(2017) అమెరికాలో 4,245(2016), బ్రిటన్‌లో 4,341( 2017) ఉన్నారు. బ్రెజిల్‌లో 888(2014), చివరికి దరిద్రం తాండవించే పాకిస్ధాన్‌లో 336(2016) ఉన్నారు. మిగతా దేశాలఅందుకోవాలంటే మనం ఎంతగా ఎదగాలో ఈ అంకెలు వెల్లడిస్తున్నాయి. గత పదిహేను సంవత్సరాలలో మన దేశంలో పరిశోధన ఖర్చు మూడు రెట్లు పెరిగితే అదే చైనాలో పెరుగుదల పది రెట్లు ఉంది. ప్రభుత్వాల వైపు నుంచి ప్రోత్సాహకాలు పెద్దగా లేకపోయినా 2008-17 మధ్యకాలంలో భారతీయులు స్వదేశం-విదేశాల్లో పేటెంట్లకు చేసిన దరఖాస్తులు, పొందిన పేటెంట్లు దాదాపు రెట్టింపు కావటం ఒక మంచి సూచిక.
మన దేశంలో పరిశోధన మరియు అభివృద్ధికి చేస్తున్న కేటాయింపులు 2012-13లో రూ.73,892 కోట్లు కాగా 2016-17 నాటికి రూ.1,04,864 కోట్లకు పెరిగాయి. జిడిపిలో చూస్తే 0.7శాతమే. ఇదే ఇజ్రాయెల్‌ 4.6, దక్షిణ కొరియా 4.5, జపాన్‌ 3.2, జర్మనీ 3.0, అమెరికా 2.8, ఫ్రాన్స్‌ 2.2, బ్రిటన్‌ 1.7, కెనడా 1.6 శాతం చొప్పున ఖర్చు చేస్తున్నాయి. బ్రిక్స్‌ దేశాలలో చైనా 2.1, బ్రెజిల్‌ 1.3, రష్యా ఒకశాతం ఖర్చు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ స్వయంగా పార్లమెంటులో చెప్పారు.
నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారానికి వచ్చాక జరిగిన సైన్సు మహాసభలలో అధికార పార్టీ నేతలు చేసిన ఉపన్యాసాలు, చెప్పిన మాటలు దేశంలో సైన్సు కంటే నాన్‌ సైన్స్‌ లేదా నాన్‌సెన్స్‌ను ప్రోత్సహించేవిగా ఉన్నాయి. మన పురాతన కాలంలోనే ప్లాస్టిక్‌ సర్జరీ ఉండేదని, దానికి నిదర్శనం వినాయకుడని ఫ్రధాని నరేంద్ర మోడీగారే స్వయంగా చెప్పారు. ఇక ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌గా పని చేసిన ఒక పెద్దమనిషి పురాతనకాలంలో మన దేశంలో విమానాశ్రయాలు, ఫైటర్‌ జెట్‌లు ఉన్నాయని సెలవిచ్చారు. మరో పెద్ద మనిషి ఐనిస్టీన్‌, న్యూటన్‌ సిద్దాంతాలే తప్పన్నాడు. బ్రహ్మకు తెలియంది ఏమీ లేదు, ప్రపంచంలో అందరి కంటే ముందు ఆయనే డైనోసార్లను కనుగొన్నాడు, వేదాల్లో రాశారు అని పంజాబ్‌ విశ్వవిద్యాలయ జియాలజిస్టు అషు ఖోస్లా చెప్పారు. వేదాలు మూడున్నర లేదా మూడు వేల సంవత్సరాల నాడు రచించినట్లు లేదా అప్పటి నుంచి వల్లెవేస్తున్నట్లు చెబుతారు. ఇంకా పురాతనమైనవని కొందరు చెబుతారు. కానీ డైనోసార్లు ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రితం అంతరించినట్లు శాస్త్రవేత్తల అంచనా, అంతకు ముందే వేదాలను బ్రహ్మరాశాడా ? నిజానికి వేదాలు, బ్రహ్మ గురించి చెబుతున్నదానికి నమ్మకం తప్ప శాస్త్రీయ ఆధారాలు లేవు. రావణుడు పుష్పక విమానాలను వాడినట్లు చెబుతారు, మరి సర్వం తానే అయిన విష్ణురూపమని చెప్పే రాముడు, మరొకరు వాటిని ఎందుకు వినియోగించలేదు, వానరులతో వారధి ఎందుకు కట్టించాల్సి వచ్చింది అంటే సమాధానం ఉండదు.
ఇక వేద గణితం, వేద భౌతికశాస్త్రం గురించి, సైన్సు సాధించిన అనేక అంశాను వేదాలు, పురాణాలకు వర్తింప చేస్తూ చెప్పే ఆధునిక విద్యావంతుల గురించి చెప్పాల్సిందేముంది ? శాస్త్ర ప్రపంచం ఏ నూతన ఆవిష్కరణ చేసినా వేదాలు, పురాణాల్లో కొన్ని సంస్కృత పదాలను పట్టుకొని వాటి అర్దం అదే అని నిస్సంకోచంగా చెప్పేస్తారు. ఐనిస్టీన్‌, న్యూటన్‌కు భౌతిక శాస్త్రం గురించి పెద్దగా తెలియదని 106వ సైన్సు కాంగ్రెస్‌లో ఒక పెద్దమనిషి చెబుతుంటే అసలు మీ అర్హత ఏమిటని అడిగే వారే లేకపోయారు.
పారిశ్రామిక విప్లవానికి మూలం పరిశోధన-అభివృద్ధి అన్నది తెలిసిందే. ఆ సమయంలో మనం ఆ బస్సును ఎందుకు అందుకోలేకపోయాం అన్నది పరిశోధించాల్సిన అంశమే. వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని చెప్పే వారు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో కుప్పలు తెప్పలుగా ఎక్కడబడితే అక్కడ మనకు కనిపిస్తున్నారు. గతంలో అలాంటి ”అగ్రహారీకులు” ( ఒక సామాజిక తరగతిని కించపరుస్తున్నట్లు భావించవద్దని మనవి) , వారి ప్రభావానికి లోనైన కొంత మందిలో తప్ప సామాన్య జనం వాటిని పట్టించుకొనే వారు కాదు. చాదస్తుల్లెెమ్మని విస్మరించారు. మన పూర్వీకులు తర్క శాస్త్రాన్ని అభివృద్ధి చేశారు. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనే ప్రశ్నలు వేసే తర్కాన్ని ముందుకు తెచ్చిన చార్వాకులను అణచివేసిన తిరోగమన భావజాలం, అలాంటి ప్రశ్నలు తలెత్తకూడదు అని కోరుకున్న ఫ్యూడల్‌ వ్యవస్ధ మరింత పట్టు సాధించిన కారణంగా మన సమాజం తనకు తెలియకుండానే ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయింది లేదా బలహీనపడింది. బ్రిటీష్‌ వారి పాలనలో క్రైస్తవ మిషనరీలు, వలస పాలనా యంత్రాంగం చేసిన విమర్శలను తట్టుకోలేక మా వేదాల్లో అన్నీ ఉన్నాయనే ఎదురుదాడిని మనవారు ప్రారంభించారు. హిందూయిజాన్ని ఆధునిక శాస్త్రాలతో అన్వయించి తమ మతం ఎంత గొప్పదో అని చెప్పేందుకు వివేకానందుడు, దయానంద సరస్వతి వంటి ఎందరో ప్రయత్నించారు. ఆనాడు వారికి తట్టిన ఉపాయం అది. నాటి పరిస్ధితులు నేడు లేవు. పనికి రానిదాన్ని వదలి పెట్టాలి తప్ప దాన్నే మరింతగా చెబితే ప్రయోజనం లేదని కూడా తేలిపోయింది. జనం పుట్టుకతో ఆమాయకులు తప్ప బుద్ది హీనులు కాదు, విద్య వారిని బుద్దిహీనులుగా మారుస్తుంది అని బెట్రాండ్‌ రస్సెల్‌ అంటాడు .మనకు తెలియనంత మాత్రాన వేదాల్లో ఏమీ లేదంటే ఎలా , ఏదో ఉంది అని చెప్పే విద్యావంతులు ఇప్పుడు ఊరూరా తయారయ్యారు ? దేవుడు ఉంటే నిరూపించమంటే చేతకాదని సరిపెట్టుకుందాం. కళ్ల ముందు కనిపిస్తున్న వేదాలు, పురాణాల్లో ఉందని చెబుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పుడైనా ఎందుకు బయటకు తీయరు. చైనా, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొనే బదులు మన జనానికి కావలసిన చమురు, వస్తువులు, కరోనా వాక్సిన్‌ తయారీకి , ఇంధనం, పైలెట్లతో పనిలేకుండా ఎటుబడితే అటు తిరిగే యుద్ద విమానాల తయారీకి ఎందుకు సహకరించరు ? ప్రపంచ దేశాలో భారత్‌ను అగ్రస్ధానంలో ఎందుకు నిలబెట్టరు ? ఇలాంటి కష్టకాలంలో కూడా ముందుకు రాకపోతే సొల్లు కబుర్లు చెబుతున్నారని అనుకోరా ? వారికి దేశభక్తి లేదా ?