Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు
ఒకరు వ్యూహాన్ని పన్నితే మరొకరు చక్రవ్యూహాన్ని రచిస్తారు. ఆర్ధిక లేదా యుద్ద రంగం, పోటీ ఉన్న దేనిలో అయినా పై చేయి సాధించేందుకు పోటీ పడేవారు చేసిందీ, చేసేది, చేస్తున్నదీ ఇదే. గతంలో అమెరికా-సోవియట్‌ యూనియన్‌లకు బాసటగా అటూ ఇటూ మోహరించిన వారిని గమనించాము. ఎటూ చేరకుండా తటస్దంగా ఉంటూ మన ప్రయోజనాలను సాధించుకొనేందుకు, అమెరికా బాధిత దేశాలకు మనవంతు సాయం చేసేందుకు మన దేశం అనుసరించిన అలీన విధానాన్ని చూశాము.
ఇప్పుడు సోవియట్‌ యూనియన్‌ లేదు. ప్రచ్చన్న యుద్దం ముగిసింది, తామే విజేతలమని అమెరికా ప్రకటించినప్పటికీ కమ్యూనిజం వ్యాప్తి నిరోధ లక్ష్యంగా ప్రారంభమైన ఆ యుద్దం నిజానికి ముగియలేదు. ప్రచ్చన్న యుద్దం 2.0 ప్రారంభమైందనే చెప్పవచ్చు. అమెరికా ప్రధాన లక్ష్యంగా సోవియట్‌ యూనియన్‌ స్ధానంలో చైనా వచ్చింది. అయితే నాటికీ నేటికీ అగ్రరాజ్యంగా అన్ని రంగాలలో అమెరికాయే ముందున్నది. సామ్రాజ్యవాదుల కుట్రలకు సోవియట్‌ బలైతే చైనా కమ్యూనిస్టు పార్టీ జాగరూకత కారణంగా తియన్మెన్‌ స్వేర్‌ నిరసన రూపంలో అక్కడి సోషలిస్టు వ్యవస్దకు తలపెట్టిన ముప్పును తప్పించారు. మూడు దశాబ్దాల నాటికీ నేటికీ పరిస్ధితిలో ఎంతో మార్పు వచ్చింది.చైనా అన్ని విధాలుగానూ ఎంతో బలపడింది, అమెరికాతో సమంగా ఉందా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి. అదే సమయంలో నేటి అమెరికా ముందు ఎన్నో సవాళ్లు ఉన్న విషయాన్ని కూడా గమనంలో ఉంచుకోవాలి.
ఇప్పుడు అలీన విధానమూ లేదు, దాన్ని పునరుద్దరించి నాయకత్వం వహించాలని మన (పాలకవర్గం) దేశమూ కోరుకోవటం లేదు. సోవియట్‌ను చూపి అమెరికా వద్ద, అమెరికాను చూపి సోవియట్‌ నుంచి ప్రయోజనాలు పొందేందుకు అనుసరించిన వ్యూహం నుంచి తప్పుకొని అమెరికాతో రాజీపడి తానూ స్వతంత్రంగా ఎదగాలన్నది మన పాలకవర్గ ఎత్తుగడగా మొత్తం మీద చెప్పవచ్చు. అందకనే కొన్ని అంశాలలో ప్రతిఘటన కూడా ఉంటోంది. అణుపరీక్షలను జరిపినపుడు అమెరికా మన మీద ఆంక్షలు విధించింది. అయినా మన విదేశాంగ విధానంలో దానికి అనుకూలమైన మార్పు వచ్చింది. ఈ నేపధ్యంలోనే చైనా ముత్యాల హారాన్ని చూడాల్సి ఉంది. అలీన విధానంలో స్వతంత్రంగా ఉండటంతో పాటు అమెరికా దుశ్చర్యలను అనేక సందర్భాలలో వ్యతిరేకించాల్సి వచ్చినపుడు సోవియట్‌ అనుకూల శిబిరంలో ఉన్నట్లు మన దేశం కనిపించింది. కొన్ని విధానాలలో సారూప్యత, సామీప్యత ఉన్నందువలన అలాంటి అభిప్రాయం కలిగింది. దాని వలన మనకు జరిగిన నష్టమేమీ లేదు. ఆర్ధికంగా ఎంతో లబ్ది పొందాము. నేడు అంతరిక్ష ప్రయోగాల్లో మనం అనేక విజయాలు సాధించామంటే దానికి సోవియట్‌ యూనియన్‌, తరువాత రష్యా అందిస్తున్న సహకారం తప్ప మరొకటి కాదు. ఈ ప్రయోగాలను దెబ్బతీసేందుకు అమెరికా చేయాల్సిందంతా చేసింది.
సర్వేజనా సుఖినోభవంతు, వసుధైక కుటుంబాన్ని కోరుకొన్న విశాల భావాన్ని మన పూర్వీకులు వ్యక్త పరిచారు. మన పౌరుల సంక్షేమంలో అగ్రస్ధానంలో అంటే మనం అన్ని రంగాలలో ముందుండాలి అనే భావంతో పోటీపడటం, ఆలోచించటం తప్పు కాదు. భారత్‌ మాత్రమే ఉండాలి అంటే అది జాతీయవాదానికి బదులు జాతీయ దురహంకారం అవుతుంది. సమస్యలు వస్తాయి. ఈ మాట చెప్పిన వారిని దేశద్రోహులు అని చిత్రించినా ఆశ్చర్యం లేదు. జాతీయ దురహంకారానికి అమెరికాయే ఉదాహరణ. అలాంటి అమెరికా అడుగులకు మనం మడుగులొత్తుతున్నామా లేదా అనే అభిప్రాయాలను చర్చించటం,దానిలో భాగంగా విమర్శలు చేయటం జాతి వ్యతిరేకం కాదు, ద్రోహమూ కాదు. అమెరికా అంతర్జాతీయంగా అనుసరిస్తున్న అనేక విధానాలను అక్కడి జనం తీవ్రంగా వ్యతిరేకించి రోడ్డెక్కిన ఉదంతాలు ఎన్నో. వియత్నాంపై దాడి చేయటాన్ని నిరసిస్తూ యువత ఆ సమయంలో పెద్ద ఎత్తున రంగంలోకి దిగింది. జాతీయంగా వర్ణవివక్షను పాటించటాన్ని, అణచివేయటాన్ని ఎలా నిరసించారో ఇటీవలనే జార్జి ఫ్లాయిడ్‌ ఉదంతంలో చూశాము.
మన పాలకవర్గం లేదా పాలకపక్షం తీసుకుంటున్న విదేశీ, స్వదేశీ విధానాలు, తప్పిదాలు వాటి మద్దతుదార్లకు కనిపించవు. అన్నీ మీరే చేశారు అని కాంగ్రెస్‌ పాలకుల మీద విమర్శలు చేసేందుకు సంఘపరివార్‌ సంస్ధలైన బిజెపి వంటివి ఎలా హక్కును కలిగి ఉన్నాయో, పాలక పార్టీగా బిజెపి అనుసరిస్తున్న విధానాలను విమర్శించే హక్కు ఇతరులకూ ఉంటుందా లేదా ?
2020 జూలై ఒకటవ తేదీ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక బిజెపి ప్రధాన కార్యదర్శులలో ఒకరైన రామ్‌ మాధవ్‌ ఇంటర్వ్యూను ప్రచురించింది. ”గత నాలుగైదు సంవత్సరాలలో భారత విధానంలో వచ్చిన మార్పు చైనాను అప్రమత్తం గావించింది, డోక్లాం వారికి పెద్ద కుదుపు ” అన్నది దాని శీర్షిక. గత శతాబ్దిలో పసిఫిక్‌ అట్లాంటిక్‌ కేంద్రంగా సాగిన పశ్చిమ ఐరోపా-అమెరికా కూటమి ప్రపంచ అధికార పంపిణీ ఇప్పుడు ఇండో-పసిఫిక్‌ వైపు మారిందని, ఈ ప్రాంతంలో ఒక ముఖ్య అధికార శక్తిగా ఉన్న మనం ప్రధాన పాత్ర పోషించేందుకు సిద్ధం కావాలని రామ్‌ మాధవ్‌ చెప్పారు. ఆసియాలో చైనా తరువాత మన దేశానికి ఉన్న స్ధానం తెలిసిందే. ప్రపంచ రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషించాలనుకోవటంలో కూడా తప్పులేదు. ఆ పాత్ర స్వభావం ఎలా ఉండాలన్నదే అసలైన ప్రశ్న. అయితే బిజెపినేతలు తామేదో ప్రపంచ రాజకీయాల్లో ముఖ్యపాత్రకు కొత్తగా తెరలేపుతున్నట్లు చిత్రిస్తున్నారు. అలీన ఉద్యమం ద్వారా మన దేశం గతంలోనే ఒక ముఖ్యపాత్రను పోషించిన విషయం తెలిసిందే.
తమ నేత నరేంద్రమోడీకి ఘనతను ఆపాదించేందుకు గత నాలుగైదు సంవత్సరాలలో మన విధానంలో వచ్చిన మార్పు అని బిజెపి రామ్‌ మాధవ్‌ చెప్పవచ్చుగానీ మన దేశ వైఖరిలో మార్పు యుపిఏ కాలంలోనే ప్రారంభమైంది. అమెరికా అనుకూల వైఖరికి వ్యతిరేకంగా వామపక్షాలు యుపిఏకు మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఒక విధాన మార్పు తెల్లవారేసరికి రాదు.
చైనాను దెబ్బతీసేందుకు దాని చుట్టూ అమెరికా ఎప్పటి నుంచో వ్యూహం పన్నుతోంది. సహజంగానే చైనా కూడా ప్రతి వ్యూహాన్ని అమలు జరుపుతోంది. ఏ దేశమూ మిలిటరీ వ్యూహాలు, లక్ష్యాలను బహిరంగంగా చెప్పదు.చైనా కూడా దానికి మినహాయింపు కాదు. రెండవ ప్రపంచ యుద్దం ముగిసి జపాన్‌ లొంగిపోయిన తరువాత ఆరు సంవత్సరాలకు అమెరికా -జపాన్‌ రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. అసలు విషయం చెప్పాలంటే అమెరికా బలవంతంగా జపాన్‌ మీద ఒప్పందాన్ని రుద్దింది. బాధ్యతా రహిత మిలిటరీవాదం ప్రపంచంలో ఇంకా ఉందనే సాకును చూపి నిరాయుధం గావించిన జపాన్‌ మీద ఎవరైనా దాడి చేస్తే దాన్ని రక్షించే బాధ్యతను అమెరికా తీసుకుంది. జపాన్‌లో అమెరికా సైన్యాన్ని, సైనిక స్దావరాలను ఏర్పాటు చేసేందుకు జపాన్‌ అంగీకరించింది. అంతే కాదు అమెరికా అనుమతి లేకుండా మరోదేశం సైనిక కేంద్రాల ఏర్పాటు సైనిక సంబంధ అనుమతులు జపాన్‌ ఇవ్వకూడదు. ఇది వియత్నాంలో 1945లో చైనాలో 1948లో కమ్యూనిస్టులు అధికారానికి రావటం, ఇండోనేషియా, కంబోడియా, లావోస్‌లలో కమ్యూనిస్టులు ఒక బలమైన శక్తిగా ఉన్న నేపధ్యంలో ఇది జరిగిందని గమనించాలి. అప్పటి నుంచి చైనాను ఇబ్బందులు పెట్టేందుకు అమెరికా చేయాల్సిందంతా చేసింది. తైవాన్‌లో కేంద్రీకృతమైన కమ్యూనిస్టు వ్యతిరేక మిలిటరీని బలోపేతం గావించింది. మయాన్మార్‌లో తిష్టవేసిన కమ్యూనిస్టు వ్యతిరేక చైనా సైన్యాన్ని కొంత కాలం అమెరికా పోషించి దాడులు చేయించింది. 1970దశకం వరకు కమ్యూనిస్టు చైనాకు ఐక్యరాజ్యసమితిలో స్దానం లేకుండా తిరుగుబాటు తైవాన్‌ను అసలైన చైనాగా చలామణి చేయించింది.
అమెరికా వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు చైనా తన ఎత్తుగడలను తాను అమలు చేస్తోంది. దానికి ముత్యాల హారం పధకం అని మన మీడియా విశ్లేషకులు నామకరణం చేశారు. వాణిజ్య, దౌత్య, సముద్ర మార్గాలు, మిలిటరీ లక్ష్యాలతో చైనా తన పధకాన్ని అమలు జరుపుతోంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహా సముద్రం ప్రాంతాలలో ఉన్న మయన్మార్‌లోని సిటివెక్యాకుపు, బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌, శ్రీలంకలోని హంబంటోటా, పాకిస్ధాన్‌లోని కరాచీ, గ్వాదర్‌ రేవులు, ఇతర సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నది. ఇవన్నీ మన దేశం చుట్టూ ఉన్నాయి. ఆఫ్రికాలోని జిబౌటీలో చైనా ఒక సైనిక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 2017లో అక్కడికి చైనా మిలిటరీ ప్రయాణించింది. ఈ సైనిక కేంద్రం ఎర్ర సముద్ర ప్రారంభంలో ఉంది. మధ్యధరా-ఎర్ర సముద్రాన్ని కలిపే సూయజ్‌ కాలువ ద్వారా ప్రయాణించే తమ నౌకలకు జిబౌటీ పరిసరాల్లోని సముద్రపు దొంగల నుంచి రక్షణ కల్పించేందుకు, శాంతి పరిరక్షక కార్యకలాపాలకు, మానవతా పూర్వక సాయం కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చైనా చెబుతున్నది. చైనా కంటే ముందే ఇక్కడ అమెరికా, ఫ్రాన్స్‌, ఇటలీ, జపాన్‌ సైనిక కేంద్రాలు చిన్నా పెద్దవి ఉన్నాయి. ఏ దేశమైనా ఆ కేంద్రాలకు సైన్యాన్ని తరలించవచ్చు, కానీ చైనా మాత్రమే అందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు చిత్రిస్తున్నారు. మన దేశానికి అతి సమీపంలో మారిషస్‌కు చెందిన డిగోగార్షియాలో అమెరికా సైనిక కేంద్రం ఉన్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతాన్ని మారిషస్‌కు అప్పగించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది, బ్రిటీష్‌ వారు తమకు లేని అధికారంతో అమెరికాకు ఆ దీవులను కౌలుకు ఇవ్వటం చెల్లదని అంతర్జాతీయ న్యాయ స్ధానం తీర్పు చెప్పింది. అయినా వైదొలిగేందుకు ఆ రెండు దేశాలు మొరాయిస్తున్నాయి. చైనా-పాకిస్ధాన్‌ ఆర్ధిక నడవా(సిపిఇసి)లో భాగంగా గ్వాదర్‌ రేవును అభివృద్ధి చేశారు. యుద్ధ పరిస్థితి వస్తే మన దేశంమీద పశ్చిమం వైపు నుంచి చైనా దాడి చేసేందుకు దీన్ని ఉద్దేశించారన్న ఆరోపణలు ఉన్నాయి. చిట్టగాంగ్‌ రేవులో చైనా కేంద్రాన్ని కూడా అదే విధంగా చూస్తున్నారు. ఇవిగాక మాల్దీవులు, షెషల్స్‌లో కూడా చైనా సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటోంది.
దక్షిణ చైనా సముద్రం-బంగాళాఖాతాన్ని కలిపే మలక్కా జలసంధి ప్రాంతం చైనాకు ఎంతో కీలకమైనది. చైనా దిగుమతి చేసుకొనే చమురులో 80శాతం మధ్య ప్రాచ్యం నుంచి ఈ మార్గం ద్వారానే చైనాకు రావలసి ఉంది. అందువలన ఈ ప్రాంత దేశాలతో చైనా స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉండేందుకే నిరంతరం ప్రయత్నిస్తుంటుంది. ఎవరైనా అదే చేస్తారు. తూర్పు కార్యాచరణ విధానం పేరుతో మన దేశం కూడా ఆ ప్రాంత దేశాల మీద పలుకుబడిని పెంచుకొనేందుకు పూనుకుంది. మయన్మార్‌కు 175కోట్ల డాలర్ల గ్రాంటు మరియు రుణం, బంగ్లాదేశ్‌కు 450 కోట్ల డాలర్ల రుణ వాగ్దానం, చైనాకు దగ్గరగా ఉండే మధ్య ఆసియా దేశాలైన తుర్కుమెనిస్ధాన్‌, ఉజ్బెకిస్ధాన్‌, కిర్ఖిజిస్తాన్‌, కజకస్తాన్‌, మంగోలియా దేశాలతో ఇటీవలి కాలంలో మన దేశం అనేక ఒప్పందాలు చేసుకుంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే ఆర్ధికపరమైన దౌత్యం ద్వారా ఇతర దేశాలను ఆకట్టుకొనే విషయంలో చైనాతో మనం పోటీ పడే స్ధితిలో లేము అన్నది ఒక మింగుడుపడని వాస్తవం. ఈ నేపధ్యంలో ఏమి చేయాలి అన్నది సమస్య. తమ వస్తువులను కొనుగోలు చేయాలని ఏ దేశాన్ని అయినా చైనా వత్తిడి చేసిన దాఖలాలు లేవు. తమ దేశంలో తయారు చేసుకోవటం కంటే చైనా నుంచి దిగుమతి చేసుకొని విక్రయించటమే లాభదాయకమని అమెరికా కార్పొరేట్లే అందుకు శ్రీకారం చుట్టాయి. మన వ్యాపారవేత్తలు మడి కట్టుకొని ఎలా కూర్చుంటారు ?
2019లో చైనా 421 బిలియన్‌ డాలర్ల అంతర్జాతీయ వాణిజ్య మిగులుతో ఉండగా మన దేశం 153 బిలియన్‌ డాలర్ల లోటులో ఉంది. కనుక ఆర్ధిక దౌత్యంలో దానితో పోటీ పడే అవకాశం లేదు. అయినంత మాత్రాన చైనాకో మరొక దేశానికో అణగి మణగి ఉండాల్సిన అవసరం లేదు. తిరుగులేని అగ్రరాజ్యంగా ఉన్న అమెరికాతో చైనా ఏనాడూ రాజీ పడలేదు. మన ప్రయోజనాలను మనం రక్షించుకోవాలి, ఎదగాలి, అందుకు అనువైన స్వంత, స్వతంత్ర మార్గాలను ఎంచుకోవాలి. దానికి బదులు ప్రమాదకరమైన అమెరికాతో కలసి చైనాకు వ్యతిరేకంగా కూటమి కట్టి మన సాధించేదేమిటన్నది ప్రశ్న. కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేందుకు అమెరికా వీరతాడు వేసుకొని వీరంగం వేస్తున్నది. మన దేశంలోని బిజెపి కమ్యూనిజానికి వ్యతిరేకంగా అలాంటి వీరంగం వేస్తోంది. అయితే ఇంతవరకు మన దేశంగా అనుసరించిన విధానం కమ్యూనిస్టు వ్యతిరేకమైనది కాదు. లేదూ మేము కూడా అమెరికా బ్యాండ్‌లో చేరతామంటే అది బహిరంగంగా ప్రకటించాలి.
చతుర్ముఖ భద్రతా సంభాషణ పేరుతో అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా,భారత్‌తో ఒక కూటమిని కట్టేందుకు అమెరికా పావులు కదుపుతోంది. 2007నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి ఆసియన్‌ ఆర్క్‌ ఆఫ్‌ డెమోక్రసీ (ఆసియా ప్రజాస్వామ్య విల్లు) అని ఒక ముద్దుపేరు పెట్టారు. ఈ విల్లును ఎవరి మీద ఎక్కు పెట్టినట్లు ? ఈ కూటమిని తనకు వ్యతిరేకంగా తయారవుతున్న దుష్ట చతుష్టయం అని చైనా భావిస్తోంది. వాటి ప్రతి చర్యనూ అనుమానంతో చూస్తోంది. నిజానికి ఈ దేశాలకు ఎవరి నుంచి ముప్పు తలెత్తినట్లు ? అమెరికా తన పెత్తనాన్ని రుద్దేందుకు కుట్ర సిద్ధాంతాలను నిరంతరం ముందుకు తెస్తూ ఉంటుంది. ఇరుగు పొరుగు దేశాల మధ్య తంపులు పెట్టి నిరంతరం తన ఆయుధాలను, అదిరించి బెదిరించి తన వస్తువులను అమ్ముకొని లబ్ది పొందే ఎత్తుగడ తప్ప దానికి మరొక పని లేదు.ఐరోపాలో సాగిన అనేక యుద్ధాలకు, రెండు ప్రపంచ యుద్ధాలకు కారకులు ఐరోపా సామ్రాజ్యవాదులు, వారితో చేతులు కలిపిన జపాన్‌ తప్ప మరొక దేశం కారణం కాదు. చతుర్ముఖ భద్రతా సంభాషణ నుంచి తాము వైదొలుగుతున్నట్లు ప్రారంభంలోనే ఆస్ట్రేలియా ప్రకటించటంతో కొన్ని సంవత్సరాల పాటు ముందుకు సాగలేదు. అక్కడ పాలకులు మారిన తరువాత 2017లో ఆసియన్‌ సమావేశాల సందర్భంగా తిరిగి ఈ నాలుగు దేశాలు కూటమిని ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించాయి. దానిలో భాగంగానే మలబార్‌ తీరంలో సైనిక విన్యాసాలు జరిపాయి. ఈ నేపధ్యంలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇంటర్వ్యూలో బిజెపి నేత రామ్‌ మాధవ్‌ ”గత నాలుగైదు సంవత్సరాలలో భారత విధానంలో వచ్చిన మార్పు చైనాను అప్రమత్తం గావించింది, డోక్లాం వారికి పెద్ద కుదుపు ” అంటూ చెప్పిన అంశాలకు, తాజా సరిహద్దు ఉదంతాలకు సంబంధం లేదని ఎవరైనా చెప్పగలరా ?
గాల్వాన్‌ లోయలో ఎవరు ఎవరిని రెచ్చగొట్టారు,అసలేం జరిగింది అన్నది ఇప్పటికీ బ్రహ్మపదార్దంగానే ఉంది. చైనీయులు మన ప్రాంతాల్లో లేరు, మన సైనిక పోస్టులను ఆక్రమించలేదు, చొచ్చుకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాన్ని తిప్పి కొట్టాము అని అని మన ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రకటన గందరగోళాన్ని కలిగించింది. ప్రధాని ప్రసంగాన్ని వక్రీకరించారంటూ ప్రభుత్వం చెప్పిన వివరణ మరిన్ని కొత్త ప్రశ్నలను ముందుకు తెచ్చింది. రామ్‌ మాధవ్‌ మాటల పూర్వరంగంలో గాల్వాన్‌ ఉదంతానికి ముందు జరిగిన కొన్ని పరిణామాలను చూడకుండా సమగ్రత రాదు. డోక్లాం ప్రాంతం చైనా-భూటాన్‌ మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతం. మన సిలిగురి ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. నివాస యోగ్యం గాని ఆ ప్రాంతానికి ఆనుకొన్ని ఉన్న కొంత ప్రాంతాన్ని తమకు అప్పగించి దాని బదులు వేరే ప్రాంతాన్ని తీసుకోవాలని రెండు దేశాల మధ్య ఎప్పటి నుంచో సంప్రదింపులు జరుగుతున్నాయి తప్ప అంగీకారానికి రాలేదు.2017లోమన సైన్యం ఆ ప్రాంతానికి వెళ్లి చైనా ప్రాంతంలో ఉన్న చైనా మిలిటరీతో మోహరించింది. అక్కడ తలపెట్టిన నిర్మాణాలను చైనా వాయిదా వేసింది తప్ప వెనక్కు తగ్గిందీ లేదు, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసిందీ లేదు. అణు సరఫరా దేశాల గ్రూపులో చేరాలన్న మన దేశ వాంఛను చైనా అడ్డుకుంది. అణ్వస్త్రవ్యాప్తి నిరోధ ఒప్పందంపై భారత్‌ సంతకం చేస్తేనే తాము అంగీకరిస్తామని చెప్పింది. భారత్‌, పాకిస్ధాన్‌, ఇజ్రాయెల్‌ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ మూడింటితో పాటు కొత్త దేశమైన దక్షిణ సూడాన్‌ కూడా ఆ ఒప్పందంపై సంతకాలు చేయలేదు.మరోవైపు చైనాను రెచ్చగొట్టే చర్యలకు మన ప్రభుత్వం కూడా తక్కువ తినలేదు. చైనాలోని తిరుగుబాటు రాష్ట్రం తైవాన్‌, అది చైనా అంతర్భాగమని అధికారయుతంగా మన దేశం గుర్తించింది. కానీ తైవాన్‌లోని చైనా వ్యతిరేకశక్తులు అక్కడ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి బిజెపి ఇద్దరు ఎంపీలను దానికి పంపాలని నిర్ణయించటం చైనాను రెచ్చగొట్టే చర్య అవుతుందా మిత్ర చర్యా ? కరోనా కారణంగా వారు వెళ్లలేదు గానీ ఇంటర్నెట్‌ ద్వారా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారత-చైనా సంబంధాలలో దలైలామా ఒక పెద్ద సమస్య.చరిత్రలో టిబెట్‌ ఎన్నడూ ఒక స్వతంత్ర దేశంగా లేదు. వివిధ చైనా రాజరికాలలో స్వయంపాలిత ప్రాంతంగా చెప్పుకోవటం తప్ప స్వతంత్ర దేశంగా ఎన్నడూ లేదు.క్వింగ్‌ రాజరికాన్ని కూల్చివేసిన తరువాత 1912లో ఏర్పడి 1949వరకు ఉన్న జాతీయ ప్రభుత్వం కూడా టిబెట్‌ స్వాతంత్య్రాన్ని గుర్తించలేదు. తరువాత కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. అమెరికా, ఇతర దేశాల జోక్యంతో దలైలామా తదితరులు కమ్యూనిస్టుల అధికారాన్ని గుర్తించేందుకు తిరస్కరించటమే గాక చివరకు 1959లో తిరుగుబాటు చేశారు. చైనా ప్రభుత్వం దాన్ని అణచివేసిన తరువాత దలైలామా మన దేశానికి పారిపోయి వచ్చి ధర్మశాల కేంద్రంగా ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. దాన్ని ఏ దేశమూ గుర్తించలేదు. అమెరికా, మన దేశం కూడా నిధులు సమకూర్చింది. దలైలామా తరువాత దాన్నుంచి వైదొలిగి ఇతరులకు బాధ్యత అప్పగించాడు. దలైలామా, ఇతర తిరుగుబాటు టిబెటన్‌ నేతలు ఏర్పాటు చేసే కార్యక్రమాలకు అధికార ప్రతినిధులెవ్వరూ హాజరు కావద్దని 2018లో మన విదేశాంగశాఖ ఆదేశించింది. ఆ చర్య చైనా వత్తిడికి లొంగినట్లు కాదా అన్న ఎక్స్‌ప్రెస్‌ ప్రతినిధి ప్రశ్నకు తనకు అసలా విషయం తెలియదని రామ్‌ మాధవ్‌ సమాధానమిచ్చారు. ఇది తప్పించుకొనే గడుసుదనం తప్ప నిజాయితీతో కూడింది కాదు. దలైలామా తిరుగుబాటు, భారత రాక, మన ప్రభుత్వం ఆశ్రయం కల్పించటం, ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించటం 1962లో భారత-చైనా యుద్ద పరోక్ష కారణాలలో ఒకటన్నది బహిరంగ రహస్యం. టిబెట్‌ను చైనా ప్రాంతంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఇప్పటికీ గుర్తించదు. తాజాగా దలైలామా 84వ జన్మదినంగా ఆయనకు భారత రత్న ఇవ్వాలని కొందరు బిజెపి పెద్దలు బహిరంగంగానే చెప్పటాన్ని ఏ విధంగా చూడాలి. ఇప్పుడు కరోనా వైరస్‌, ఆర్ధిక రంగంలో వైఫల్యాలు, రానున్న బీహార్‌ ఎన్నికల నేపధ్యంలోనే సరిహద్దు సమస్యలని ఎవరైనా విమర్శిస్తే వారు చైనా అనుకూలురు, దేశద్రోహులు అవుతారా ?అన్నింటికీ మించి బిజెపికి అవసరమైనపుడే ఉగ్రవాద దాడులు, సరిహద్దు సమస్యలు తలెత్తుతాయని గతంలో వచ్చిన విమర్శ తెలిసిందే.తాము అటువంటి వాళ్లం కాదు,పునీతులమే అని నిరూపించుకోవాల్సిన బాధ్యత బిజెపి మీద లేదా ! అనేక మంది మన దేశాన్ని డ్రాగన్‌(చైనా) కోరల్లో పెట్టామని చెప్పేవారు ఉన్నారు. ఎవరి అభిప్రాయం వారిది. మన నరేంద్రమోడీ గారు దాన్నుంచి రక్షించేందుకు ఆరు సంవత్సరాల్లో తీసుకున్న చర్యలేమీ లేవు. పాకిస్ధాన్‌ మీద మెరుపుదాడులు చేశామని మన జనాన్ని సంతృప్తి పరచారు. చైనా మీద అటువంటి అవకాశాలు లేవు. దాంతో జన సంతుష్టీకరణలో భాగంగా చైనా తయారీ యాప్‌లను నిషేధించి డిజిటల్‌ స్ట్రైక్‌ చేశాం చూశారా అన్నట్లు జనం ముందు నిలిచారు. ఈ చర్య దిగజారిన మన ఆర్ధిక వ్యవస్ధను ఏమాత్రం మెరుగుపరిచినా సంతోషమే. పెద్ద నోట్ల రద్దుతో ఏదో ఒరగబెడతామని చెప్పి జనాన్ని హతాశులను చెయ్యకుండా ఉంటే సంతోషమే. డ్రాగన్‌ కోరల నుంచి తప్పించుతామంటూ అమెరికా దృతరాష్ట్ర కౌగిలిలోకి తీసుకుపోతున్నారని చెబితే, ఆలోచించాల్సిందే అని ఒక్కరు అనుకున్నా చాలు !