Tags
నందిని మార్వా
కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది.ప్రపంచంలో భారత్ ఇప్పుడు నాలుగవ స్ధానంలో ఉంది.దిగువ నుంచి ప్రారంభమై ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. వాస్తవానికి ఎక్కడ తప్పు జరిగింది? చాలా తక్కువ కేసులు ఉన్న రోజు నుంచి భారత్ లాక్‌డౌన్‌లో ఉంది, అప్పుడు చాలా తక్కువ కేసులు ఉన్నాయి. ఇప్పుడు పరిస్ధితిని చూస్తే అందరం అలక్ష్యంలో ఉన్నాము. మొత్తం లాక్‌డౌన్ ఒక లక్ష్యం లేనిదిగా కనిపిస్తోంది. ఈ మహమ్మారి గురించిన అత్యంత దిగ్భ్రాంతికరమైన అంశం ఏమంటే అధికారంలో ఉన్నవారి అవినీతి, తప్పిదాల గురించి ప్రతి వారిని కళ్లు తెరిచేట్లు చేయటం.
ప్రతివారికీ అర్ధమైన, చాలా ముఖ్యమైన అంశం ఏమంటే: ప్రజల కోసం, ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఇది అన్నది పెద్ద బూటకం.ఈ చేదు వాస్తవాన్ని పక్కన పెడితే మరొక పరిశీలనను చూద్దాం. ప్రాణాలు తీసే కరోనా వైరస్ రెండువందలకు పైగా దేశాలను ప్రభావితం చేస్తే దేశంలో ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాని వారెవరైనా ఉన్నారా అంటే మన ప్రధాని నరేంద్రమోడీ ఒక్కరే. ఒక దేశాధినేత బహిరంగ చర్చలో దేశ ప్రజలను ఉద్దేశించి ఎందుకు మాట్లాడరు ? ఆత్మనిర్భర భారత్ గురించి ఉపన్యాసాలు చేశారు, ప్రజలు నిర్వహించాల్సిన వివిధ లక్ష్యాల గురించి చెప్పారు, సహాయ చర్యల గురించి చెప్పారు కానీ మీడియా ముందుకు రాని అసలైన కారణం ఏమిటో ఎన్నడూ చెప్పలేదు. అమెరికా అధ్యక్షుడి కంటే మన ప్రధాని ఎంతో ముఖ్యమైన, విలువైన వారా ?
ప్రజాస్వామ్య భారత్‌లో పత్రికా గోష్టి నిర్వహించని తొలి ప్రధాని నరేంద్రమోడీ. డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ”మౌన మోహన్ సింగ్ ” అని మోడీ వెక్కిరించిన రోజులున్నాయి. ఇప్పుడు అది ఆయనకే వర్తించటం లేదూ ? ప్రధాని నరేంద్రమోడీ ఎన్ని పత్రికా గోష్టులు నిర్వహించారు, ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారో తెలియచేయాలని ప్రధాని కార్యాలయాన్ని కోరుతూ ఒక పౌరుడు సమాచార హక్కు కింద దరఖాస్తు చేశాడు. వీటికి సంబంధించి ప్రధాని కార్యాలయంలో ఎలాంటి పత్రాలు లేవు. నిజానికి మన దేశంలో జరుగుతున్నదేమిటి ? మన నేతలు వర్తమాన అంశాల మీద స్పందించకుండా ప్రతి అంశానికి సంబంధించిన వాస్తవాలను పక్కదారి పట్టించేందుకు ఎందుకు కేంద్రీకరిస్తున్నారు ?
ప్రముఖ పాత్రికేయులు ప్రధానితో కఠినంగా ప్రశ్నించటంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రధాని పని తీరు, ప్రయాణాలు, యోగా తదితర అంశాల గురించి ప్రశ్నిస్తే వాటి గురించి చెప్పేందుకు సిద్ధం సుమతీ అన్నట్లుగా ఉంటారు. కానీ ఇబ్బంది కరమైన ప్రశ్నలు అడిగితే ఇంటర్వ్యూల నుంచి వెళ్లిపోవటమో, ప్రస్తావన అంశానికి దూరంగా పోవటమో చేస్తారు. మీడియాతో మోడీకి సత్సంబంధాలు లేవని కూడా చెబుతారు. కరణ్ థాపర్ అనే సీనియర్ పాత్రికేయుడు ప్రధాని మోడీని గుజరాత్ హింసాకాండ గురించి అడిగినపుడు మన ప్రధాని మాట్లాడకుండా ఇంటర్వ్యూ నుంచి లేచి వెళ్లిపోయారు. బహుశా మన ప్రధాని గతం ఆయన్ను ఇప్పటికీ వెంటాడుతున్నదేమో !
భారత్‌లో విధించిన లాక్‌డౌన్ గురించి ప్రపంచమంతటా జనం మాట్లాడుకుంటున్నారు. మహమ్మారి నుంచి మనం బతికి బయటపడినా, ఆర్ధిక పతనం నుంచి కోలుకోలేమని ప్రముఖ ఆర్ధికవేత్తలు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి గిరాకి అంతం కావటానికి దోహదం చేశాయి, దాంతో మన ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలింది. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా కరోనా మహమ్మారి తోడైంది. ఏ మాత్రమూ ముందుగా చెప్పకుండానే దేశవ్యాప్తంగా కర్ఫ్యూను ప్రకటించారు. దేశ ప్రజలు దానికి సిద్దం కాలేదు. ఎన్నో మినహాయింపులు ఇచ్చారు. కానీ దేశంలోని పోలీసులు వాటిని అర్ధం చేసుకోలేకపోయారు. జనాన్ని లాఠీలతో మోదారు. ఇదే సమయంలో అనేక మంది వలస కూలీలు రోడ్డున పడ్డారు. తమ స్వస్ధలాలకు తిరిగి పోతున్నారు. వారిలో కొందరు నిద్రిస్తుండగా హతులయ్యారు. పొలాల్లో ఉన్న పంటలను రైతులు ఎలా ఇంటికి తెచ్చుకుంటారో ఎవరూ ఆలోచించలేదు. వైద్య సరఫరాల గొలుసు తెగిపోయింది. న్యూఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు(కొత్త పార్లమెంట్, నివాసాలు, ఇతర కార్యాలయాల నిర్మాణం)తో పాటు చాలా కాలం తరువాత ఆర్ధిక ఉద్దీపన పధకాన్ని ప్రకటించారు. అదింకా ప్రారంభం కావాల్సి ఉంది. ఈ తీరు, విధానాలను అన్నింటినీ చూస్తే భారతీయులు కరోనాతో కంటే ఆకలితో మరణించవచ్చు. అనేక మంది ప్రముఖులు చెప్పినట్లుగా అధ్వాన్నమైన పాలన, విధానాల అమలుకు ఏ మాత్రం లేని అనుభవం, ప్రభుత్వ నియంతృత్వ లక్షణం అతి పెద్ద విపత్తుకు దారి తీయవచ్చు.
ఇదిలా ఉండగా కోవిడ్-19 మహమ్మారి విషయంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని అమిత్ షా అంగీకరించారు, అయితే అదే సమయంలో ఆయన ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ఇదీ మన దేశ స్ధితి. నేతలు జనానికి, తమ కింది వారికీ సమాధానాలు చెప్పకపోగా ప్రతిపక్ష ప్రభుత్వాలతో తమను పోల్చుకుంటారు. కరోనా వైరస్ వ్యాప్తిని లాక్‌డౌన్ వాయిదా వేసింది తప్ప జనానికి తప్పించలేదు. ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవటానికి, అత్యవసర సంరక్షణ సౌకర్యాలను పటిష్ట పరుచుకొనేందుకు వ్యవధిని ఇచ్చింది. మన దేశంలో సామాజిక వ్యాప్తి లేదని ప్రభుత్వం ఇప్పటికీ చెబుతూనే ఉంది. అయితే పెరుగుతున్న కేసులను చూస్తే సామాజిక వ్యాప్తి పరిమితం అన్నది కేవలం నిర్వచనానికి పరిమితం కావచ్చుగానీ వ్యవహారికానికి పనికి రాదు.
తొలి కేసు బయటపడి నాలుగు నెలలు, లాక్‌డౌన్ ప్రకటించి రెండు నెలలు గడిచినా పరీక్షలు చేయటంలో, అవసరానికి తగిన డిమాండ్‌కు అనుగుణంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను కల్పించటంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనం ప్రకారం దేశంలో అత్యవసర పరిస్ధితికి తగిన విధంగా ఐసియు పడకలు లేవని తేలింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తరచుగా దేశంలోని మహమ్మారి గురించి జనానికి చెబుతారు. కెనడా ప్రధాని దాదాపు ప్రతి రోజూ దేశ ప్రజల నుద్దేశించి మాట్లాడతారు. ఇద్దరూ వర్తమాన అంశాల మీద మీడియాతో బహిరంగంగా మాట్లాడతారు. మనం న్యూజిలాండ్ గురించి మాట్లాడాల్సి వస్తే కరోనా వ్యాప్తి నుంచి న్యూజిలాండ్ విముక్తి పొందింది. మహిళాశక్తి దాన్ని అలా ముందుకు నడిపించింది.మన దేశంలో మాదిరి ఏ దేశంలోనూ ఇప్పటి వరకు వారి జాతిని ఉద్దేశించి వర్తమాన సమస్యల మీద మాట్లాడని నేతలు లేరు.
దేశంలోని దీర్ఘకాలిక సమస్యల గురించి పట్టించుకోకుండా కేవలం సానుకూల అంశాల గురించే మాట్లాడుతుంటే అది దేశంలో ఇప్పుడున్న వాస్తవ పరిస్ధితిని చూపదు. సరైన సమయంలో సరైన జోశ్యం చెప్పగల సరైన వారిని మన దేశం ఎంచుకోవాలి.భారత్ రోజుకు రెండు లక్షల ఎన్-95 ముఖతొడుగులను ఉత్పత్తి చేస్తున్నదని ఒక ప్రభుత్వ అధికారి చెప్పారు. వాస్తవం ఏమంటే ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే అది చాలా తక్కువ. ప్రతిదానికీ సమయం సందర్భం లేకండా మతోన్మాదం గురించి మాట్లాడటాన్ని మన దేశం ఎందుకు నిరోధించదు ? వర్తమాన అంశాల మీద మాట్లాడకుండా, కేంద్రీకరించకుండా కేవలం టీవీలలో ఉపన్యాసాలు దంచటమెందుకు ?
గమనిక : ఇన్వెంటివా డాట్‌కామ్ ఇన్ వెబ్ సైట్ సౌజన్యంతో( ఈ ఆంగ్ల వ్యాసాన్ని తొలుత జూన్ పన్నెండున ఇన్వెంటివా డాట్‌కామ్ ఇన్ ప్రచురించినది. పాఠకులకు అందించేందుకు అనువదించబడినది. ఎం కోటేశ్వరరావు )