ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్ విజృంభణ తగ్గలేదు.రానున్న రోజుల్లో ఏ రంగంపై ఎలాంటి దుష్ట ప్రభావం చూపనుందో అంతుచిక్కటం లేదు. రానున్నది రాకమానదు-కానున్నది కాకమానదు-కాడి పట్టుకోక తప్పదు అన్నట్లుగా రైతాంగ ఏరువాక ప్రారంభమై దేశంలోని అనేక ప్రాంతాలలో ఖరీఫ్ సాగు ముమ్మరంగా సాగుతున్నట్లు వార్తలు. ఇప్పటి వరకు వర్షాలు సకాలంలో, తగిన మోతాదులో పడిన కారణంగా కొన్ని చోట్ల విత్తనాల కొరత ఏర్పడిందని జార్ఖండ్, బీహార్ వంటి చోట్ల 15 నుంచి 25శాతం మేరకు విత్తన ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. ఎక్కడైనా పెద్ద రైతులు ముందే కొనుగోలు చేస్తారు కనుక వారికి ఎలాంటి ఇబ్బంది, భారమూ ఉండదు, అప్పటి కప్పుడు కొనుగోలు చేసే చిన్న రైతుల మీద ఇది అదనపు ఖర్చు. కరోనా కారణంగా వలస కార్మికులు తమ స్వస్ధలాలకు వెళ్లిపోయిన కారణంగా పంజాబ్, హర్యానా వంటి ప్రాంతాలలో వ్యవసాయ కార్మికుల కొరత ఏర్పడితే, మరికొన్ని చోట్ల మిగులుగా మారారు. దీనివలన కొన్ని చోట్ల వేతనాలు పెరిగితే, మరికొన్ని చోట్ల పడిపోయే పరిస్ధితి. ప్రపంచీకరణ యుగం కనుక రైతాంగాన్ని ప్రభావితం చేస్తాయని భావిస్తున్న కొన్ని జాతీయ, అంతర్జాతీయ అంశాలను చూద్దాం.
నరేంద్రమోడీ సర్కార్ రైతుల ఆదాయాలను రెట్టింపు చేసే సంగతి నోరు లేని గోమాత కెరుక. చమురు పన్ను, ధరల పెంపుదల ద్వారా వ్యవసాయ పెట్టుబడుల భారాన్ని మాత్రం గణనీయంగా పెంచుతున్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణతో పాటు డీజిల్ వినియోగం పెద్ద ఎత్తున పెరుగుతోంది. గతంలో డీజిల్ మీద ఉన్న సబ్సిడీలను తొలగించారు, కొంతకాలం డీజిల్ మీద పన్ను తక్కువగా ఉండేది, ఇప్పుడు దాన్ని కూడా దాదాపు సమం చేసి పెట్రోలు కంటే డీజిల్ రేటు ఎక్కువ ఉండేట్లు చేశారు. ఎందుకంటే ఎక్కువగా అమ్ముడు పోతున్నది డీజిలు కనుక కంపెనీలకు బాగా లాభాలు రావాలంటే డీజిల్ ధరలు పెంచాలి మరి. దీని ధర పెరిగితే వ్యవసాయం, పంటల రవాణా, పురుగుమందులు, ఎరువులు ఇలా అన్ని రకాల వ్యవసాయ పెట్టుబడుల ధరలూ గణనీయంగా పెరుగుతాయి. ఉదాహరణకు పంట వేసేందుకు ఎకరం పొలాన్ని సిద్దం చేయాలంటే ఇంతకు ముందు అవుతున్న రెండున్నర వేల రూపాయల ఖర్చు కాస్తా మూడున్నరవేలు అవుతుందని ఒక అంచనా. చేపలు పట్టేందుకు డీజిల్ సబ్సిడీ ఇస్తున్నట్లుగానే రైతాంగానికి కూడా సబ్సిడీ ఇవ్వాలన్న డిమాండ్‌ను పాలకులు పట్టించుకోవటం లేదు. దేశంలోని డీజిల్ వినియోగంలో 2013లోనే ట్రాక్టర్లు, నాటు, కోత యంత్రాల వంటి వాటికి 10.8శాతం అయితే పంపుసెట్లకు 3.3శాతంగా అంచనా మొత్తంగా చూసినపుడు 14.1శాతం ఉంది. ఇప్పుడు యాంత్రీకరణ ఇంకా పెరిగినందున వినియోగ వాటా గణనీయంగా పెరుగుతుంది. రవాణా రంగం, అది ప్రయివేటు అయినా, ప్రభుత్వరంగమైనా చమురు ధరలను వినియోగదారుల మీద వెంటనే మోపుతాయి. ప్రభుత్వం కనీస మద్దతు ధరలను పెంచి, అమలు జరిపితే తప్ప రైతాంగానికి అలాంటి అవకాశం లేదు.
లాక్‌డౌన్ సమయంలో మొత్తంగా మూతపడటంతో రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయింది. తమ ఉత్పత్తులను ముఖ్యంగా నిలవ ఉంచటానికి అవకాశం లేని కూరగాయలు, పండ్లు, పూల వంటి వాటిని రవాణా చేయటానికి, విక్రయించటానికి కూడా అవకాశం లేకపోయింది. ఈ నష్టాన్ని ఏ ప్రభుత్వమూ చెల్లించలేదు. కరోనా వైరస్ కారణంగా తలెత్తిన పరిస్ధితిని అధిగమించేందుకు ప్రకటించిన ఉద్దీపన పధకం 21లక్షల కోట్ల రూపాయలలో కేవలం ఒక లక్ష కోట్ల రూపాయలను వ్యవసాయ మౌలిస సదుపాయాల నిధిగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది కూడా ఆహార తయారీ సంస్ధలకు పెట్టుబడి అని ఒక ముక్తాయింపు. వ్యాపారుల ఉల్లి, బంగాళా దుంపలు, ధాన్య నిల్వలపై ఇప్పటి వరకు నిత్యావసర వస్తువులుగా ఉన్న ఆంక్షలను ప్రభుత్వం తొలగించింది. దీని వలన వ్యాపారులంతా వాటిని ఎగబడి కొంటారు, రైతులకు ధరలు పెరుగుతాయి అని మనల్ని నమ్మమంటారు. వ్యవసాయ రంగంలో కార్పొరేట్ సంస్ధల పట్టును మరింత పెంచేందుకు తోడ్పడే చర్య ఇది.
ప్రభుత్వం ఒక వైపు చైనాతో పోల్చుతూ ఆర్ధిక సర్వే, బడ్జెట్ పత్రాలలో పుంఖాను పుంఖాలుగా రాస్తుంది. కానీ అదే ఎవరైనా చైనాతో పోల్చితే చూడండి అని చైనా మద్దతుదారులు అంటూ సామాజిక మాధ్యమంలో సంఘపరివార్ మరుగుజ్జులు దాడి చేస్తారు. మన దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోవటానికి ఒక కారణం పెట్టుబడులు తగ్గిపోవటం. నాలుగు దశాబ్దాల క్రితం గ్రాస్ కాపిటల్ ఫార్మేషన్‌లో 18శాతం వ్యవసాయ రంగానికి వస్తే ఇప్పుడు ఎనిమిదిశాతానికి పడిపోయింది. అది కూడా అనుత్పాదక సబ్సిడీల రూపంలో ఎక్కువ భాగం ఉంటున్నందున పెద్ద రైతులకే ఎక్కువ లబ్ది కలుగుతున్నదని ఆ రంగ నిపుణులు చెబుతున్నమాట. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సర్వే 2019-20లో చైనాను ఉదహరిస్తూ కార్మికులు ఎక్కువగా పని చేసే వస్తు ఎగుమతుల కారణంగా కేవలం ప్రాధమిక విద్య మాత్రమే ఉన్న వారికి 2001-06 మధ్య 70లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయని, మన దేశంలో ఎగుమతుల కారణంగా 1999-2011 మధ్య కేవలం పది లక్షల లోపే అసంఘటిత రంగ ఉద్యోగాలు పెరిగాయని, మనం కూడా చైనా మాదిరి చర్యలు తీసుకోవాలని చెప్పారు. కానీ గత ఆరు సంవత్సరాలలో మోడీ సర్కార్ పని తీరులో అలాంటి చిత్తశుద్ది ఎక్కడా కనపడదు. మేకిన్ ఇండియా పిలుపు ద్వారా ఎన్ని కొత్త ఉద్యోగాలు ఆరేండ్లు గడిచినా చెప్పటం లేదు. మన దేశంలో ఒక కమతం సగటు విస్తీర్ణం 1.4హెక్టార్లు కాగా చైనాలో 0.6 మాత్రమే. అయినా ఉత్పాదకత ఎక్కువగా ఉంది. వ్యవసాయరంగంలో కేంద్ర పెట్టుబడులే కాదు, దిగుబడులు, నాణ్యత పెంచేందుకు అవసరమైన పరిశోధన-అభివృద్ధి, వ్యవసాయ విస్తరణను గాలికి వదలివేశారు. అన్ని పంటల ఉత్పాదకత, దిగుబడులు చైనాలో గణనీయంగా పెరిగేందుకు తీసుకున్న చర్యల కారణంగా ప్రపంచ మార్కెట్లో వచ్చే ఎగుడుదిగుడులు అక్కడి రైతాంగాన్ని పెద్దగా ప్రభావితం చేయటం లేదు. రైతాంగానికి ప్రభుత్వం అందచేసే రాయితీలు కూడా మన కంటే ఎంతో ఎక్కువ.
2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని ఎన్‌డిఏ ప్రభుత్వం చెప్పింది. కరోనా వైరస్ మహమ్మారి నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం 21లక్షల కోట్ల రూపాయలతో ఆత్మనిర్భర భారత పధకాన్ని అమలు జరపనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. రైతుల ఆదాయాలను రెట్టింపు చేయాలంటే 2022 నాటికి 30 బిలియన్ డాలర్లుగా వున్న వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను 60బిలియన్ డాలర్లకు పెంచాలని నిపుణుల అభిప్రాయం. ప్రస్తుతం మన దేశం వాణిజ్యంలో చైనాతో బాగాలోటులో ఉంది. కానీ వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో మిగుల్లో ఉంది. వాటి దిగుమతులను ఇంకా పెంచుకోవాలని వత్తిడి చేస్తోంది, కొంత మేరకు చేసుకుంటామని చైనా కూడా చెప్పింది. 2018-19లో మన దేశం చైనాకు 190 కోట్ల డాలర్ల మేరకు ఎగుమతులు చేస్తే మన దేశం 28.2 కోట్ల మేరకే చైనా నుంచి దిగుమతి చేసుకుంది. ముడిపత్తి, రొయ్యల వంటి ఎగుమతులు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 117 శాతం ఎక్కువ. అయితే తాజాగా లడఖ్ సరిహద్దు వివాదం కారణంగా మన దేశం చైనా వస్తువుల దిగుమతులపై నిషేధాలను విధిస్తామని ప్రకటించింది. అదే జరిగితే మొక్కజొన్న, చింతపండు, కాఫీ, పొగాకు, జీడిపప్పు, నూకల బియ్యం వంటి మన వ్యవసాయ దిగుమతులను చైనా కూడా ఏదో ఒక పేరుతో నిలిపివేయటం లేదా నామమాత్రం చేయటం ఖాయం. యుపిఏ ప్రభుత్వ చివరి ఏడాది మన దేశం గరిష్టంగా వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. గత ఆరు సంవత్సరాలుగా మధ్యలో కొంత మేరకు తగ్గినప్పటికీ మొత్తంగా చూస్తే అంతకు తగ్గలేదు, అయితే దిగుమతులు గణనీయంగా తగ్గిన కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలో ఇప్పుడు మిగుల్లోనే ఉన్నాము. ఆర్ధిక సర్వే ప్రకారం 2018-19లో మన వ్యవసాయ ఎగుమతులు 2.7లక్షల కోట్ల రూపాయల మేర ఉంటే దిగుమతులు 1.37లక్షల కోట్ల మేరకు ఉన్నాయి. అయితే ధనిక దేశాలు సబ్సిడీలు ఇచ్చినా, చైనా వంటివి మన దిగుమతులను నిలిపివేసినా ఈ మిగులు హరించిపోతుంది.
ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలు అమెరికా, కెనడా,ఆస్ట్రేలియా, ఐరోపా యూనియన్ దేశాలు తమ రైతాంగానికి పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇచ్చేందుకు వీలు కల్పిస్తున్నాయి. కానీ ఆ దేశాలు మాత్రం మన వంటి దేశాలు ఇచ్చే సబ్సిడీల మీద ధ్వజమెత్తుతాయి. ఉదాహరణకు అంబర్ బాక్స్ వర్గీకరణ కిందకు వచ్చే, ఇతరంగా మొత్తం సబ్సిడీల గురించి మన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ డబ్ల్యుటిఓ స్టడీస్ అనే సంస్ధ ఒక పత్రాన్ని ప్రచురించింది. దానిలో దిగువ వివరాలు ఉన్నాయి. ఒక్కో రైతుకు సగటున ఆ ఏడాదిలో సబ్సిడీ మొత్తాన్ని డాలర్లుగా పరిగణించాలి. ఉపాధి పొందుతున్నవారిని మిలియన్లలో సూచించారు.
దేశం == సంవత్సరం ==ఉపాధి పొం సంఖ్య == అంబర్‌బాక్సు == స్ధానిక మద్దతు
ఆస్ట్రేలియా == 2017-18 ==== 0.3 ==== 222 ==== 5357
కెనడా == == 2016 ==== 0.3 ==== 7414 ==== 13010
ఇయు ==== 2016 ==== 9.8 ==== 1068 ==== 8589
జపాన్ ==== 2016 ==== 2.3 ==== 3492 ==== 11437
నార్వే ==== 2018 ==== 0.1 ==== 22509 ==== 53697
రష్యా ==== 2017 ==== 4.2 ==== 855 ==== 1378
స్విడ్జర్లాండ్==== 2018 ==== 0.1 ==== 9716 ==== 57820
అమెరికా ==== 2016 ==== 2.2 ==== 7253 ==== 61286
బంగ్లాదేశ్ ==== 2006 ==== 24.6 ==== 8 ==== 11
బ్రెజిల్ ==== 2018 ==== 8.6 ==== 134 ==== 332
చైనా ==== 2016 ==== 212.9 ==== 109 ==== 1065
ఈజిప్టు ==== 2016 ==== 6.7 ==== 0 ==== 9
భారత్ ==== 2018-19 ==== 200 ==== 49 ==== 282
ఇండోనేషియా ==== 2018 ==== 37.6 ==== 7 ==== 139
ఫిలిప్పీన్స్ ==== 2018 ==== 10.4 ==== 0 ==== 125
ద.కొరియా ==== 2015 ==== 1.4 ==== 547 ==== 5369
థాయలాండ్ ==== 2016 ==== 12 ==== 11 ==== 367
ప్రపంచంలోని భారత్, చైనాలతో సహా 54 ప్రధాన దేశాలు వ్యవసాయంలో వచ్చే మొత్తం ఆదాయంలో పన్నెండుశాతానికి సమానమైన 700 బిలియన్ డాలర్లను ఏడాదికి సబ్సిడీ ఇస్తున్నట్లు ఓయిసిడి తాజా నివేదిక ఒకటి పేర్కొన్నది. వర్ధమాన దేశాల కంటే ధనిక దేశాలు ఇస్తున్న సబ్సిడీల రెట్టింపు ఉంటున్నాయి. వర్దమాన దేశాలు 8.5శాతం ఇస్తుంటే ఓయిసిడి దేశాలు 17.6శాతం ఇస్తున్నాయి. జపాన్, దక్షిణ కొరియా 40శాతం ఇస్తుండగా, చైనా, ఇండోనేషియా, ఐరోపా యూనియన్ ఇస్తున్న సబ్సిడీలు 54దేశాల సగటు 12 నుంచి 30శాతం వరకు ఇస్తున్నాయి.అమెరికాలో ఈ ఏడాది సబ్సిడీలు 33 బిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చని, అవి వ్యవసాయ ఆదాయంలో నేరుగా రైతులకు అందచేసే మొత్తం 36శాతమని కొన్ని వార్తలు సూచించాయి. మన ప్రభుత్వం చైనా స్దాయిలో అయినా రైతాంగానికి రాయితీలు ఇస్తుందా ? నల్లధనం వెలికితీత, దేశమంతటా గుజరాత్ నమూనా అమలు, అచ్చేదిన్ వంటి అనేక వాగ్దానాలకు ఏ గతి పట్టించారో ఇప్పుడు రైతుల ఆదాయాల రెట్టింపు వాగ్దానానికి కూడా అదే గతి పట్టిస్తున్నారు.
ప్రపంచంలో ధనిక దేశాలు రైతాంగానికి ఎలా సబ్సిడీలు ఇస్తున్నాయో ముందు చూశాము. వాటిని నియంత్రించాల్సిన ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ)ను పని చేయనివ్వకుండా అమెరికా ఆటంకాలు కల్పిస్తున్నది. దానిని నిరసగా సంస్ధ డైరెక్టర్ జనరల్ రాబర్ట్ అజెవీడో మరో ఏడాది పదవీ కాలం ఉండగానే తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే నెలలో బాధ్యతల నుంచి తప్పుకుంటారు. 2013లో ఈ బాధ్యతలను చేపట్టిన బ్రెజిలియన్ దౌత్యవేత్త అమెరికా, మరికొన్ని దేశాల వైఖరితో విసిగి పోయారు. ఇటీవలి కాలంలో ప్రపంచ వాణిజ్య సంస్దను ఖాతరు చేయకుండా సభ్యదేశాలు రక్షణాత్మక చర్యలకు పూనుకోవటం ఒకటైతే వివాదాల పరిష్కారానికి అమెరికా మోకాలడ్డుతుండటం సంస్ధ పని తీరు, విశ్వసనీయతను దెబ్బతీస్తోంది. డబ్ల్యుటిఓ సమగ్రమైనది కాకపోవచ్చు గానీ అందరికీ అవసరమైనదే, ప్రపంచమంతటా ఆటవిక న్యాయం అమలుజరుగుతున్న తరుణంలో కనీసం వాణిజ్యానికి ఇది అవసరం అని అజెవీడో రాజీనామా ప్రకటన సమయంలో వ్యాఖ్యానించాడు.
2015లో దోహాదఫా చర్చలను అర్ధంతరంగా వదలి వేసిన తరువాత 164 సభ్యదేశాలు గల ఈ సంస్ధ ఒక పెద్ద అంతర్జాతీయ ఒప్పందాన్ని కూడా కుదర్చలేకపోయింది. అమెరికా-చైనా మధ్య 2018లో ప్రారంభమైన దెబ్బకు దెబ్బ వాణిజ్యపోరు మూడో ఏడాదిలో ప్రవేశించింది. దీనికి కరోనా మహమ్మారి సంక్షోభం తోడైంది. తమ పెత్తనం, తన సరకులను ఇతర దేశాల మీద రుద్దాలనే లక్ష్యంతో ప్రపంచ వాణిజ్య సంస్దను ముందుకు తెచ్చింది అమెరికా. అయితే అనుకున్నదొకటీ అయింది ఒకటీ కావటంతో చివరకు ఆ సంస్దనే పని చేయకుండా అడ్డుకోవటం ప్రారంభించింది. సంస్ధలో సభ్య దేశాలు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినపుడు ఫిర్యాదులను పరిష్కరించటం ఒక ప్రధాన విధి. అందుకుగాను ఏడుగురు సభ్యులతో ఒక ట్రిబ్యునల్ ఉంది. దానిలో న్యాయమూర్తుల నియామకం ఏకాభిప్రాయ సాధనతో జరుగుతుంది. వారి పదవీ కాలం ముగియగానే కొత్తవారిని నియమించాల్సి ఉండగా కుంటి సాకులతో అమెరికా అంగీకరించటం లేదు. ప్రపంచ వాణిజ్య సంస్ధ వలన చైనాకే ఎక్కువ ప్రయోజనం కలుగుతోంది కనుక నిబంధనలను మార్చాలని అమెరికా, ఐరోపా యూనియన్, జపాన్ వంటి దేశాలు ఒక పల్లవి అందుకున్నాయి. చైనాను తమతో పాటు అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించాలన్నది వాటి డిమాండ్. మన దేశం కూడా వరి, గోధుమల వంటి వాటికి కనీస మద్దతు ధరలను అనుచితంగా పెంచుతున్నదని, పత్తికి కనీస మద్దతు ధర పేరుతో రాయితీలు ఇస్తున్నదని అమెరికా, మరికొన్ని దేశాలు ఫిర్యాదు చేశాయి. అన్నింటికీ మించి వివాదాలు దీర్ఘకాలం కొనసాగటం ఒకటైతే అనేక కేసులలో తీర్పులు తమకు వ్యతిరేకంగా రావటాన్ని అవి సహించలేకపోతున్నాయి. తీర్పులన్నీ నిబంధనలు ఏవి ఉంటే వాటికి అనుగుణ్యంగానే వస్తాయి తప్ప అడ్డగోలుగా ఇవ్వలేరు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం చైనా వర్దమాన దేశ తరగతిలోకే వస్తుంది. అందువలన సబ్సిడీలు, ఇతర అంశాలలో దానికి వెసులు బాటు ఉంది. అది ధనిక దేశాల లాభాలకు గండికొడుతోంది. చైనాను ధనిక దేశంగా తీర్పు చెప్పాలన్నది అమెరికా డిమాండ్. అమెరికాకే అగ్రస్ధానం అనే నినాదంతో అధికారానికి వచ్చిన ట్రంప్ సర్కార్ మరింత అడ్డంగా వ్యవహరించింది. ఏడుగురికి గాను కనీసం ముగ్గురు ఉంటే కేసులను విచారించవచ్చు. ఇటీవలి వరకు అదే జరిగింది. ఆరునెలల క్రితం ముగ్గురిలో ఇద్దరి పదవీ కాలం ముగియటంతో వారు తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కేసులు దాఖలైనా విచారించే వారు లేరు. ప్రపంచ వాణిజ్య సంస్దలో సంస్కరణలు తేవాలి గానీ అవి తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేవిగా ఉండకూడదని, అంటే తాము చేసిన దాన్ని ప్రశ్నించే అధికారం ఆ సంస్ధకు ఉండకూడదని అమెరికా పరోక్షంగా చెబుతోంది. ఈ నేపధ్యంలో న్యాయమూర్తుల నియామకం జరగదు, సంస్కరణలకు అవకాశం లేదు. అమెరికా అడ్డగోలు కోరికలు, ఆకాంక్షలను మిగిలిన దేశాలు అంగీకరించే ప్రసక్తే లేదు.
ప్రపంచ వాణిజ్య సంస్ధను తనకు అనుకూలంగా మార్చుకోవాలని అమెరికా చూస్తుంటే, స్వేచ్చా వాణిజ్య సూత్రాలను పరిరక్షించాలని చైనా వాదిస్తోంది. ఈ సంస్దలో చేరిన 164 దేశాలు ఏడాదికి తమ జిడిపిని 855 బిలియన్ డాలర్లు పెంచుకున్నట్లు తాజా అధ్యయనం తెలిపింది. వీటిలో అమెరికా 87, చైనా 86, జర్మనీ 66 బిలియన్ డాలర్ల చొప్పున లబ్ది పొందాయని తేలింది. అగ్రరాజ్యాలకే అధిక ఫలం అన్నది స్పష్టం. అయితే ఈ సంస్ద నిబంధనలలో పెద్ద మార్పులు లేకపోయినా అనేక అంశాలలో మార్పులకు ఒక్కో దఫా చర్చలు దోహదం చేస్తున్నాయి. వాణిజ్యంలో ఉన్న ఆటంకాలను మరింతగా తొలగించేందుకు, సబ్సిడీల తగ్గింపు తదితర అంశాలపై 2001లో దోహాలో మంత్రుల చర్చలు ప్రారంభమయ్యాయి. ఇంతవరకు ముగియలేదు, 2015లో విసుగుపుట్టి వదలివేశారు. అమెరికా-ఐరోపా యూనియన్ ధనిక దేశాల మధ్య తలెత్తిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి సబ్సిడీ ఒక పెద్ద పీఠముడి. జరుగుతున్న పరిణామాలను చూస్తే న్యాయమూర్తుల నియామకాన్ని ఇలాగే అడ్డుకుంటే చివరకు ప్రపంచ వాణిజ్య సంస్ధ మనుగడే ప్రశ్నార్ధకం అవుతుంది.
వ్యవసాయ దిగుమతులపై పన్నుల గురించి అమెరికాాఐరోపా యూనియన్ తమకు అనుకూలమైన పద్దతుల్లో ఒక అంగీకారానికి వచ్చాయి. అయితే ధనిక దేశాలు వ్యవసాయ సబ్సిడీలను గణనీయంగా తగ్గించకుండా ప్రయోజనం లేదని, వాటి సంగతి తేల్చాలని చైనా, భారత్, బ్రెజిల్ వంటి వర్ధమాన దేశాలు పట్టుబట్టటంతో 2005 నుంచి ప్రతిష్ఠంభన ఏర్పడింది. అంతకు ముందు ఉరుగ్వే దఫా చర్చలలో కొన్ని దేశాలు తమలో తాము ఒక ఒప్పందం చేసుకొని ఇతర దేశాలను క్రమంగా వాటిలో చేర్చుకున్నాయి. అయితే దోహా చర్చలలో వర్ధమాన దేశాలు మొత్తంగా ఒప్పందం జరగాలి తప్ప ప్రయివేటు వ్యవహారాలు కుదరవని తేల్చి చెప్పాయి. ఉరుగ్వే దఫా చర్చల నాటికి చైనా ప్రపంచ వాణిజ్యంలో భాగస్వామి కాదు, దోహా చర్చల సమయంలోనే ప్రపంచ వాణిజ్య సంస్దలో చేరింది. చర్చల సమయంలోనే చైనా అమెరికా తరువాత రెండో పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా వృద్ధి చెందింది. దీంతో వర్దమాన దేశాల పట్టు పెరిగింది. అమెరికా పెత్తనాన్ని అడ్డుకుంటున్నది. మనకు మిత్ర దేశం,సహ భాగస్వామి అని ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి చెబుతున్న అమెరికాతో లడాయిలో మన దేశం చైనాతో కలసి వ్యవహరిస్తోంది. ఇప్పుడు లడఖ్ లడాయితో చైనా మీది కోపంతో అమెరికా పంచన చేరుతుందా ? ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎరువులు, ఇతర రాయితీలను పెంచకుండా పరిమితం చేసి ధనిక దేశాలను సంతృప్తి పరుస్తోంది. ఇప్పుడు మరింతగా వాటికి లొంగిపోనుందా ?
ప్రపంచమంతటా కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఆహార ధాన్య నిల్వల గురించి ఎలాంటి ఆందోళన లేదు. అనేక చోట్ల పంటలు బాగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే కరోనా కారణంగా ఆహార జాతీయవాదం ప్రబలి కొన్ని దేశాలలో ఆహార ధాన్యాల ఎగుమతులపై ఆంక్షల వంటి రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్నారు. అమెరికా, కెనడా,బ్రెజిల్, ఐరోపా దేశాలలో కరోనా కారణంగా మాంస పరిశ్రమలు మూతపడ్డాయి. మన దేశం మాదిరే అనేక చోట్ల వలస కార్మికుల సమస్యలు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే ఆందోళన చెందాల్సిన పరిస్ధితి లేదు గానీ కరోనా మరింత ముదిరితే ఆహార ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే ధరలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో కరోనా తీవ్రంగా విజృంభిస్తుండగా చైనాలో కట్టడి చేసి సాధారణ ఆర్ధిక కార్యకలాపాలను ప్రారంభించారు. నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల కారణంగా డోనాల్డ్ ట్రంప్ తన విజయావకాశాల కోసం పిచ్చి పనులకు పూనుకుంటే రెండు దేశాల మధ్య సాగుతున్న వాణిజ్యం యుద్ధం ఏ రూపం తీసుకుంటుందో, వ్యవసాయ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఊహించలేము.
కరోనా కాఠిన్యం -కర్షకులకు కష్టకాలం, అనిశ్చితి !
06 Monday Jul 2020
Posted AP NEWS, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices
in