Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు
సామాజిక మాధ్యమంలోనూ, సాంప్రదాయ మీడియాలోనూ కొన్ని సమస్యల మీద వెల్లడిస్తున్న అభిప్రాయాలూ, సమాచారమూ జనాలను తప్పుదారి పట్టించేదిగా ఉందా ? ఎందుకు అలా చేస్తున్నారు ? దాని వలన ఒరిగే ప్రయోజనం ఏమిటి ? కొంత మంది భిన్న ఆలోచన లేకుండా ఎందుకు నమ్ముతున్నారు ? జనం మెదళ్ల మీద ప్రచార యుద్ధం జరుగుతోందా ? విజేతలు ఎవరు ? వారికి కలిగే లాభం ఏమిటి ? ఇలా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు ! అన్నింటినీ తీర్చటం సాధ్యం కాదు. కొన్ని అంశాలను పరిశీలించుదాం.
కమ్యూనిజం గురించి జనంలో భయాలను రేపితే దానివైపు అమెరికన్‌ కార్మికవర్గం చూడదనే అభిప్రాయంతో అక్కడి పాలకవర్గం కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారదాడిని ఒక ఆయుధంగా చేసుకుంది. దాని దెబ్బకు అనేక మంది కోలుకోలేని మానసిక వికలాంగులయ్యారు. అయితే కాలం ఎల్లకాలమూ ఒకే విధంగా ఉండదు. ” కొంత మందిని మీరు వారి జీవితకాలమంతా వెర్రివాళ్లను చేయగలరు, అందరినీ కొంత కాలం చేయగలరు, కానీ అందరినీ అన్ని వేళలా వెర్రివాళ్లను చేయలేరు” అని అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో వివిధ అంశాలపై జరుగుతున్న ప్రచారానికి, పాలకులకు ఇది వర్తిస్తుందా ?
మన దేశ చరిత్ర గురించి చెబుతూ ఎప్పుడైనా పొరుగుదేశం మీద దండెత్తిన చరిత్ర ఉందా అడుగుతారు. మనకు తెలిసినంత వరకు అలాంటి చరిత్ర లేదు. అదే సమయంలో ఇరుగు పొరుగుదేశాలతో స్నేహంగా ఉండటం తప్ప పాలకులు ఇప్పటి మాదిరి విద్వేషం రెచ్చగొట్టిన చరిత్ర కూడా లేదు. మిత్రులుగా ఉండేందుకు అవరోధంగా ఉన్న సమస్యల పరిష్కారం కంటే వాటి మీద నిత్యం ద్వేషాన్ని రెచ్చగొట్టటం, అదే అసలైన దేశభక్తి అని ప్రచారం చేయటం , నరేంద్రమోడీ ఏమి చేసినా సరైనదే, బలపరుస్తాం అనే వెర్రిని జనాల మెదళ్లలోకి ఎక్కించి బిజెపి తాత్కాలికంగా లబ్ది పొందవచ్చు. కమ్యూనిస్టు నేత లెనిన్‌ ” ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగుందో తెలుసుకోనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు ” అని చెప్పారు. అయన కంటే ఎంతో ముందు వాడైన అబ్రహాం లింకన్‌ చెప్పినట్లు అందరినీ అన్ని వేళలా వెర్రివాళ్లను చేయలేరు.
” చైనా కుడి చేతి అరచేయి టిబెట్‌ . లడఖ్‌, నేపాల్‌, సిక్కిం, భూటాన్‌, అరుణాచల ప్రదేశ్‌ దాని అయిదు వేళ్లు, వాటిని విముక్తి చేయాలని చైనా కమ్యూనిస్టు నేత మావో జెడాంగ్‌ చెప్పారు ” అన్నది ఒక ప్రచారం. వాస్తవం ఏమిటి ? మావో జెడాంగ్‌ ఆ విధంగా చెప్పిన దాఖలాలు గానీ, కమ్యూనిస్టు చైనాలో అధికారిక చర్చ జరిగినట్లుగానీ ఎలాంటి ఆధారాలు లేవు. అయితే ఇది ఎలా ప్రచారం అయింది ?
క్రీస్తు పూర్వం 221లో ప్రారంభమైన చైనా క్విన్‌ రాజరిక పాలన నుంచి 1912వరకు సాగిన పలు రాజరికాలు నేపాల్‌, సిక్కిం,భూటాన్‌ తమ టిబెట్‌లో భాగమే అని భావించాయి. 1908లో టిబెట్‌లోని చైనా రాజప్రతినిధి నేపాల్‌ అధికారులకు పంపిన వర్తమానంలో నేపాల్‌ మరియు టిబెట్‌ చైనా అశీస్సులతో సోదరుల్లా కలసి పోవాలని, పరస్పర ప్రయోజనం కోసం సామరస్యంగామెలగాలని, చైనా, టిబెట్‌, నేపాల్‌, సిక్కిం, భూటాన్‌లు పంచరంగుల మిశ్రితంగా ఉండాలని, బ్రిటీష్‌ వారిని ఎదుర్కోవాలని పేర్కొన్నాడు. ఇది బ్రిటన్‌ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొనేందుకు ముందుకు తెచ్చిన ఒక అంశం, చైనా ప్రభువుల వాంఛకు ప్రతిబింబం అని కూడా అనుకోవచ్చు. దానిని ప్రస్తుతం చైనాకు వర్తింప చేస్తూ ప్రచారం చేయటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో ఎవరికి వారు ఆలోచించుకోవాలి. అయితే మరి మావో జెడాంగ్‌ రంగంలోకి ఎలా తెచ్చారు ?
ఇక్కడ అఖండ భారత్‌ గురించి చెప్పుకోవటం అవసరం. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా మన జనాన్ని సమీకరించేందుకు నేను సైతం అన్నట్లుగా అనేక మంది తమ భావజాలం, నినాదాలతో ముందుకు వచ్చారు. వాటితో అందరూ ఏకీభవించకపోవచ్చు గానీ అదొక వాస్తవం. దానిలో ఒకటి అఖండ భారత్‌. దీనికి అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి. హిమాలయాల నుంచి హిందూ మహా సముద్ర ప్రాంతంలోని దీవులు, ఆఫ్రికా ఖండం, మధ్య ఆసియా, మధ్య ప్రాచ్యం, అస్త్రాలయ(ఆస్ట్రేలియా) ప్రాంతంలోని అనేక దేశాలలోని భాగాలతో కూడినది అఖండ భారత్‌ అన్నది ఒకటి. ఈ ప్రాంతంలోని ఇప్పటి దేశాల పేర్లు పేర్కొనాల్సి వస్తే భారత్‌, ఆప్ఘనిస్తాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, పాకిస్ధాన్‌, టిబెట్‌, మయన్మార్‌, ఇరాన్‌,యుఏయి, బహరెయిన్‌, తుర్క్‌మెనిస్ధాన్‌, తజికిస్తాన్‌, లావోస్‌, కంపూచియా, వియత్నాం, థాయలాండ్‌, ఇండోనేషియా, బ్రూనె, సింగపూర్‌, ఫిలిప్పీన్స్‌, మలేషియాలలోని కొన్ని ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. మహాభారతం, మరికొన్ని పురాణాల్లో అందుకు సంబంధించిన కొన్ని ప్రస్తావనల ఆధారంగా అలా చెప్పారు. ఇవన్నీ చరిత్రలో ఒక మహారాజ్యంగా ఉన్నాయటానికి ఆధారం లేదు గానీ మతపరమైన, సాంస్కృతిక అంశాలలో సారూపత్యల కారణంగా అలా పరిగణించారని చెప్పాలి. ఉదాహరణకు ఇండోనేషియా నేడు ముస్లిం దేశం, అయినా అక్కడి వారి పేర్లు ఎలా ఉంటాయో చూడండి. మాజీ దేశాధ్యక్షుడు సుకర్ణో(సుకర్ణుడు) ఆయన కుమార్తె మాజీ దేశాధ్యక్షురాలు మేఘావతి సుకర్ణో పుత్రి.
మన స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటీష్‌ వారు మన దేశాన్ని ఎలా ముక్కలు చేశారో చెప్పేందుకు కెఎం మున్షీ తొలిసారిగా అఖండ హిందుస్తాన్‌ అంశాన్ని ముందుకు తెచ్చారు. మన దేశాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్న బ్రిటీష్‌ వారిని విమర్శించే సమయంలో మహాత్మాగాంధీ కూడా దాన్ని ఉదహరించారు. ఖాన్‌ సోదరుల్లో ఒకరైన మజహర్‌ అలీఖాన్‌ కూడా అఖండ హిందుస్తాన్‌ గురించి చెబితే ముస్లిం లీగు వ్యతిరేకించింది. స్వాతంత్య్ర పోరాటానికి దూరంగా, జైలు జీవితాన్ని భరించలేక బ్రిటీష్‌ వారికి విధేయుడిగా మారిన హిందూమహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత సావర్కర్‌ అఖండ భారత్‌తో పాటు హిందూ రాష్ట్ర భావనను కూడా ముందుకు తెచ్చారు. తరువాత సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన సంస్ధలన్నీ ఇప్పటికీ ఈ భావనలను ప్రచారం చేస్తూనే ఉన్నాయి, అఖండ భారత్‌ ఏర్పాటు లక్ష్యంగా చెబుతున్నాయి. అది సాధించినపుడే నిజమైన స్వాతంత్య్రం అని ప్రచారం చేస్తాయి.1993లో సంఘపరివార్‌కు చెందిన బిఎంఎస్‌ తన డైరీ మీద ముద్రించిన చిత్రపటంలో పాకిస్ధాన్‌, నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌,శ్రీలంక, థాయలాండ్‌, కంబోడియాలతో కూడిన అఖండభారత్‌ ప్రచురించినట్లు వికీ పీడియా పేర్కొన్నది. నరేంద్రమోడీ కూడా సంఘపరివార్‌కు చెందిన వ్యక్తే గనుక 2012లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సింధీల సభలో మాట్లాడుతూ పాకిస్ధాన్‌లో సింధు రాష్ట్రం ఒకనాటికి మన దేశంలో కలుస్తుందని సెలవిచ్చారు.2025 నాటికి పాకిస్ధాన్‌, టిబెట్‌లోని మానస సరోవరం తిరిగి మన దేశంలో కలుస్తుందని, లాహౌర్‌, మానసరోవర ప్రాంతాల్లో భారతీయులు స్ధిర నివాసం ఏర్పరచుకోవచ్చని, బంగ్లాదేశ్‌లో కూడా మనకు అనుకూలమైన ప్రభుత్వమే ఉన్నందున ఐరోపా యూనియన్‌ మాదిరి అఖండ భారత్‌ ఏర్పడుతుందని ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఇంద్రేష్‌ కుమార్‌ చెప్పారు.
1937 జపాన్‌ సామ్రాజ్యవాదులు చైనాను ఆక్రమించారు. దాంతో చైనీయులు రెండో సారి జపాన్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా పోరుసల్పారు. చాంగకై షేక్‌ నాయకత్వంలోని చైనా మిలిటరీతో పాటు లాంగ్‌ మార్చ్‌ జరుపుతున్న కమ్యూనిస్టు గెరిల్లాలు కూడా జపాన్‌కు వ్యతిరేకంగా పోరాడారు. అయితే అనేక మంది యుద్ధ ప్రభువులు జపాన్‌కు లొంగిపోయారు. ఈ నేపధ్యంలో చరిత్రలో చైనా పొందిన అవమానాలను గుర్తుచేస్తూ జపాన్‌కు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరాన్ని కమ్యూనిస్టు పార్టీనేతగా మావో చైనీయులకు చెప్పారు. ఆ సందర్భంగా చరిత్రను ప్రస్తావిస్తూ సామ్రాజ్యవాదులు చైనాను యుద్దాలలో ఓడించి అనేక సామంత రాజ్యాలను బలవంతగా చైనా నుంచి వేరు చేశారని, జపాన్‌ వారు కొరియా, తైవాన్‌,రైకూ దీవులు, పోర్ట్‌ ఆర్ధర్‌, పెస్కాడోర్స్‌ను, బ్రిటీష్‌ వారు బర్మా, నేపాల్‌, భూటాన్‌, హాంకాంగ్‌లను వేరు చేశారని, ఫ్రాన్స్‌ అన్నామ్‌(ఇండోచైనా ప్రాంతం)ను, చివరకు ఒక చిన్న దేశం పోర్చుగల్‌ చైనా నుంచి మకావోను స్వాధీనం చేసుకుందని మావో చెప్పారు. అంతే తప్ప ఎక్కడా ఐదువేళ్ల గురించి మాట్లాడలేదు. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత వాటిని స్వాధీనం చేసుకుంటామని ఏనాడూ చెప్పలేదు. తైవాన్‌ చైనా అంతర్భాగమని ఐక్యరాజ్యసమితి గుర్తించింది, దాని మీద ఎలాంటి వివాదమూ లేదు. అయితే 1948 నుంచి అది తిరుగుబాటు రాష్ట్రంగా ఉంటూ అమెరికా అండచూసుకొని కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా సామరస్య పూర్వకంగా విలీనం కావాలని చైనా కోరుతోంది తప్ప సైనిక చర్యకు పూనుకోలేదు.
అయితే నిప్పులేనిదే పొగ వస్తుందా ? రాదు.1954లో టిబెట్‌లోని చైనా అధికారులు మాట్లాడుతూ భారత సామ్రాజ్యవాదులు అక్రమంగా పట్టుకున్న సిక్కిం, భూటాన్‌, లడఖ్‌,నీఫా(నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ ఏజన్సీ-అరుణాచల్‌ ప్రదేశ్‌)ను విముక్తి చేయాలని చెప్పినట్లు, అదే ఏడాది 1840-1919 మధ్య సామ్రాజ్యవాదులు చైనా ప్రాంతాలను కొన్నింటినీ ఆక్రమించారంటూ రాసిన ఒక స్కూలు పాఠంలో లడఖ్‌, నేపాల్‌,భూటాన్‌, సిక్కిం, ఈశాన్య భారతాన్ని విముక్తి చేయాలని దానిలో రాసినట్లుగా చెబుతారు.1959లో చైనా జనరల్‌ ఝాంగ్‌ గుహువా టిబెట్‌ రాష్ట్ర రాజధాని లాసాలో మాట్లాడుతూ భూటానీలు, సిక్కిమీయులు, లఢకీలు టిబెట్‌ ఉమ్మడి కుటుంబంలో ఐక్యం కావాలని అన్నట్లు వార్తలు ఉన్నాయి. వీటిని ఎలా చూడాలి. అధికారికంగా అఖండ భారత్‌ గురించి ఎవరైనా మాట్లాడితే దాన్ని తీవ్రంగా పరిగణించుతారు. అందుకే ఆయా దేశాలు ఎన్నడూ మన దేశంతో దాన్నొక సమస్యగా చూడలేదు. మన మీద ద్వేషాన్ని రెచ్చగొట్టలేదు. చైనా నుంచి వేరు పడి స్వాతంత్య్రం కావాలని 1912కు ముందుగానీ తరువాత కమ్యూనిస్టులు అధికారానికి వచ్చేంత వరకు గానీ ఎన్నడూ టిబెట్‌లో ఉద్యమించిన ఉదంతాలు లేవు. అమెరికా జరిపిన కుట్రలో భాగంగా చైనాకు వ్యతిరేకంగా తిరుగుబాటును రెచ్చగొట్టిన నాటి నుంచి దలైలామాకు మన దేశంలో ఆశ్రయం కల్పించి, ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించి తిరుగుబాట్లకు మద్దతు ఇచ్చిన గత కాంగ్రెస్‌ పాలకులు, ఇప్పటికీ టిబెట్‌ తురుపుముక్కను ఉపయోగించాలనే సంఘపరివార్‌ ఎత్తుగడలు కొనసాగుతున్నంత కాలం అటూ ఇటూ అలాంటి రెచ్చగొట్టే, వివాదాస్పద మాటలు వెలువడుతూనే ఉంటాయి. అధికారికంగా పాలకుల వైఖరి ఏమిటనేదే గీటురాయిగా ఉండాలి. అలా చూసినపుడు అఖండ భారత్‌ను ఎలా విస్మరించాలలో, టిబెట్‌ ఐదు వేళ్ల ప్రచారాన్ని కూడా అదేపని చేయాలి. కానీ సంఘపరివారం తన అజెండాలో భాగంగా ఐదువేళ్ల వార్తలను అధికారికమైనవిగా చిత్రించి చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకుంది. ఆ ప్రచారానికి కొట్టుకపోతే బుర్రలను ఖరాబు చేసుకోవటం తప్ప మరొక ప్రయోజనం లేదు.
చైనా ఆక్రమించుకుంటుంది అని చేస్తున్న ప్రచారంలో ఒకటైన సిక్కింను 1975లో మన దేశం విలీనం చేసుకుందని, తరువాత మన దేశ చర్యను చైనా అధికారికంగా గుర్తించిందని ఈ తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి తెలియదా? తెలిసీ ఇంకా ఎందుకు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నట్లు ? దలైలామాను రెచ్చగొట్టి తిరుగుబాటు చేయించి మన దేశానికి రప్పించింది అమెరికా. తీరా చైనాతో సర్దుబాటు కుదరగానే ఆ పెద్దమనిషిని, టిటెటన్‌ తిరుగుబాటుదార్లను తాను వదలించుకొని మనకు అంటగట్టింది. తమ దేశానికి రావటానికి కూడా ఆంక్షలు పెట్టింది. టిబెట్‌ చైనాలో అంతర్భాగం కాదని మన దేశం ఎన్నడూ అధికారికంగా చెప్పలేదు. ఆ వైఖరిని తీసుకోలేదు. గత ఆరు దశాబ్దాలుగా వేలాది మంది టిబెటన్లు మన దేశంలో విదేశీయులుగా నమోదై ఉన్నారు తప్ప వారికి పౌరసత్వం ఇచ్చేందుకు గానీ, శరణార్ధులుగా గుర్తింపుగానీ ఇవ్వలేదు. అక్రమంగా టిబెట్‌ నుంచి తరలిస్తున్నవారిని అనుమతిస్తున్నది. అనేక చోట్ల వారికి నివాసాలను ఏర్పాటు చేసేందుకు భూములు కేటాయించారు. సంఘపరివార్‌ కమ్యూనిస్టు వ్యతిరేకతను సంతుష్టీకరించటానికి తప్ప దలైలామాను నెత్తికి ఎక్కించుకొని మనం ఎందుకు వీరంగం వేస్తున్నామో, దాని వలన ప్రయోజనం ఏమిటో ఎప్పుడైనా, ఎవరైనా ఆలోచించారా ?