Tags

, ,


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌

రైతాంగం పూర్తి స్ధాయిలో వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగమయ్యారు. విత్తన స్వాతంత్య్రం కోల్పోయిన రైతాంగం విదేశీ కంపెనీల మీదనే ప్రధానంగా పత్తి విత్తనాల కోసం ఆధారపడక తప్పటం లేదు. బీటీ విత్తనాలు పురుగును రాకుండా చేస్తాయని మార్కెట్‌ లోకి 2002లో ప్రవేశించి ఇపుడు మార్కెట్‌ ను పూర్తిగా శాసిస్తున్నాయి. పత్తి రైతులు 95 శాతం బీటీ విత్తనాలనే వాడుతున్నారు. విదేశీ ఎంఎన్‌సీలతో కాంట్రాక్టు కుదుర్చుకున్న జాతీయ కంపెనీలు విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. 2019లో 354 లక్షల బేళ్ళ పత్తిని పండించారు.
ప్రపంచంలో హెక్టారుకు 109 కిలోలకు మించి దిగుబడులతో పత్తి పండించే దేశాలు 77 ఉన్నాయి. మరికొన్నింటిలో పండించినప్పటికీ దిగుబడి అతి తక్కువగా ఉన్నందున పరిగణనలోకి తీసుకోవటం లేదు. వాటిలో ఆస్ట్రేలియా 2,056 కిలోలతో దిగుబడిలో ప్రధమ, 1,905 కిలోలతో ఇజ్రాయెల్‌, 1,748 కిలోలతో చైనా ద్వితీయ, తృతీయ స్ధానాల్లో ఉన్నాయి. 623కిలోలతో పాకిస్ధాన్‌ 32వ, 496కిలోలతో మన దేశం 36వ స్ధానంలో ఉంది. ప్రపంచ సగటు 765 కిలోలు. దీని కంటే ఎక్కువ దిగుబడులు 17దేశాలలో వస్తున్నాయి.
అనేక దేశాల మాదిరి హై డెన్సిటీ ప్లాంటింగ్‌ చేసి సూటిరకాల విత్తనాలను వాడుతూవుంటే పత్తి సగటు ఉత్పత్తిలో ప్రపంచంలోనే ముందుండేవాళ్ళం. రైతుల ఆదాయం పెరిగేది. మన దేశ శాస్త్రజ్ఞులు, పాలకులు , రైతులు గమనించవలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది. ఒక్క భారతదేశంలోనే హైబ్రిడ్‌ విత్తనాలతో వ్యవసాయం చేస్తున్నారు. అమెరికా , బ్రెజిల్‌, చైనా తో సహా ప్రపంచంలో పత్తి పండించే దేశాలన్నీ హైబ్రిడ్‌ విత్తనాలతో పత్తి పండించటంలేదు. జన్యుమార్పిడి బీటీ విత్తనాలతో సహా వెరైటీలను అంటే సూటి రకాల విత్తనాలను అంటే పంటనుండి తీసిన విత్తనాలనే కంపెనీలు పేటెంట్‌ చట్టం పేరున రైతులకు అమ్ముతున్నాయి.
మన దేశంలో హైబ్రిడ్‌ విత్తనాల తయారీని మోన్సాంటో, బేయర్స్‌ లాంటి కంపెనీలు ప్రోత్సహించాయి. అపార లాభాలను పొందాయి. ప్రతి సంవత్సరం తన విత్తనాలను అమ్ముకోవటానికి కంపెనీల దుష్ట ప్రణాలిక వలన రైతులు రెండు రకాలుగా నష్టపోతున్నారు. 1.విత్తనాల ఖర్చు ఎక్కువ అవుతున్నది,2. పత్తి దిగుబడులు తగ్గి ఆదాయాన్ని కోల్పోతున్నారు.
తన పంటలో మంచి గింజలను గుర్తించి తరువాత విత్తనాలుగా వాడే అలవాటును మెల్లగా మాన్పించి హైబ్రిడ్‌ విత్తనాలను అలవాటు చేశారు. నాణ్యమైన హైబ్రిడ్‌ విత్తనాలను తయారుచేసిస్తామన్నారు. ఆ టెక్నాలజీ వేరన్నారు. 50 పత్తి గింజలను తెచ్చి మన దేశంలో మన చేతనే మల్టిప్లై చేయించి, మన మొక్కలతో సంకరం చేసి, అందమైన పాకింగ్‌ చేయించి, ప్రచారార్భాటాలతో రైతులచే కొనిపిస్తున్నారు. ఆడ మొగ మొక్కలను వేరుగా పెంచి , మొగచెట్ల పుప్పొడిని ఆడ మొక్కల పూవులపై అంటించి క్రాస్‌ (సంపర్కం) చేయాలి. మన దేశంలో చౌకగా వున్న బాల కార్మికులతో క్రాసింగ్‌ జరిపించి హైబ్రిడ్‌ విత్తనాలను కంపెనీలు తయారు చేస్తున్నాయి. విత్తన ఉత్పత్తికి కర్నూలు, మహబూబ్‌ నగర్‌ జిల్లాల వాతావరణం అనుకూలంగా ఉండటంతో అక్కడనుండే హైబ్రిడ్‌ విత్తనాలు తయారీ అవుతున్నాయి.. అనుకూల వాతావరణం, చౌకగా అందుతున్న బాలకార్మికుల శ్రమ కంపెనీలకు అనూహ్యమైన లాభాలను తెచ్చిపెట్టాయి. దీనికి తోడుగా పేటెంట్‌ చట్టం పేరుచెప్పి తమ అనుమతి లేనిదే మరెవ్వరూ ఆ విత్తనాలను తయారు చేయరాదని కట్టడి చేశారు. పంటకు పురుగులు, చీడ పీడ విరగడౌతుందనీ దిగుబడి పెరుగుతుందనే ఆశతో రైతులు మోన్శాంటో బీటీ విత్తనాలను ఆశ్రయించారు. బీటీ జన్యవును మన పత్తి మొక్కలలోని దేశీయవిత్తనాలలో పెట్టవచ్చని తెలుసుకోలేకపోయారు. తెలుసుకున్నవారు ధైర్యంచేయలేకపోయారు. మన దేశీయ విత్తనాలు పురుగులను బాగా తట్టుకుంటాయని గ్రహించలేకపోయారు. మోన్సాంటో కంపెనీ గుత్తాధిపత్యాన్నిపొందింది. ఇష్టమొచ్చిన రేటును వసూలు చేసింది. విత్తనాలు తయారుచేసే రైతుకి 250 రూ. ఇచ్చి 750 గ్రాములవిత్తనాలను మోన్శాంటో కంపెనీ తీసుకున్నది. పత్తి పండించే రైతుకి 450 గ్రాముల విత్తనాలను 1850 రూ. కి మించి అమ్మింది. ఇది దారుణమని నల్లమడ రైతుసంఘం ప్రచారం చేసింది. 2005 జూన్‌ నెల లో లామ్‌ ఫార్మ్‌ సభ లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి విత్తనాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ఈ వ్యాస రచయిత, తేళ్ళ క్రిష్ణమూర్తి, దండా వీరాంజనేయులు తెలిపారు. గుంటూరు జిల్లాలో ఆందోళన ప్రారంభించి సదస్సులు, సభలు. ధర్నాలు చేశారు. జొన్నలగడ్డ రామారావు, తేళ్ళ క్రిష్ణమూర్తి, కొల్లా రాజమోహన్‌ ఊరూరు తిరిగి రైతులను చైతన్య పరిచారు. రైతునాయకులు కొల్లి నాగేశ్వరరావు, యలమంచిలి శివాజీ, జొన్నలగడ్డ రామారావు, తేళ్ళ క్రిష్ణమూర్తి , కొండా శివరామిరెడ్డి లాంటివారు కదిలారు. ఆ నాటి ముఖ్యమంత్రి శ్రీ వై యసే రాజశేఖరరెడ్డి గారు స్పందించారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవాలని ఎమ్‌ఆర్పీటీయస్‌ లో కేసు వేశారు. మోన్శాంటో కంపెనీ 1850 రూ. పత్తి విత్తనాల పాకెట్‌ ను 750 రూ.కి. తగ్గించకతప్పలేదు. మన దేశంలో బీటీ విత్తనాలపై పేటెంట్‌ లేకపోయినా పేటెంట్‌ వున్నదని దబాయించి రౌడీ మామూలుగా టెక్నాలజీ ఫీజు-రాయల్టీ పేరున వందల వేల కోట్ల రూపాయలను వసూలు చేసుకుంటున్నారు. బీటీ 1 అనీ, బీటీ 2 అనీ, బీటీ 3 అనీ రైతులకు ఆశలు కల్పంచి సొమ్ము చేసుకుంటున్నారు. సూటిరకాల విత్తనాలను సాంద్రతను పెంచి సాగుచేసి అధికదిగుబడులను సాధించటమే దీనికి పరిష్కారం ,
అనేకదేశాలలో, ప్రయోగాలు, పరిశోధనల తర్వాత హై డెన్సిటీ ప్లాంటింగ్‌ అంటే మొక్కల సాంద్రత ను పెంచి ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నారు. ఎక్కువ మొక్కల వలన ఎక్కువ దిగుబడి వస్తుందనీ, దేశీయ సూటిరకాల విత్తనాలకు పురుగును తట్టుకునే శక్తి ఎక్కువనికూడా అధ్యయనాలు నిరూపించాయి. బలాలు కూడా సగంపెట్టినా దిగుబడి తగ్గదంటున్నారు. బ్రెజిల్‌ లాంటి దేశాలు లాభపడ్తూఉండగా మనం మోన్సంటో, బేయర్‌ కంపెనీల మాటలు విని వారికి లాభాలు చేకూర్చేవిధంగా హైబ్రిడ్‌ విత్తనాలనే ఎందుకు వాడుతున్నామో ఆలోచించాలి.
బ్రెజిల్‌, చైనా, అమెరికా, భారతదేశాలలో ప్రయోగాలు చేశారు. ఒక ప్రయోగంలో హెక్టరుకు 1500 నుండి 1,05,000 మొక్కల వరకూ 6 ప్లాట్లుగా పెంచారు. మెపిక్వాట్‌ క్లోరైడ్‌ అనే గ్రోత్‌ రెగ్యులేటర్‌ మందును ఉపయోగించి పెరుగుదలను నియంత్రించారు. తక్కువ మొక్కలున్న ప్లాటు తక్కువ దిగుబబడి నిచ్చింది. బాగా ఎక్కువ మొక్కలున్న ప్లాటు లోకి సూర్యరశ్మి, గాలి అందక మరీ ఎక్కువ పత్తినివ్వలేదు. మధ్యస్ధంగా 87,000 మొక్కలున్న ప్లాటు హెక్టారుకు 1682కేజీల లింటు కాటన్‌( 4546కేజీల సీడ్‌ కాటన్‌) వచ్చింది. నేలను బట్టి, భూసారాన్నిబట్టి, నీటి లభ్యతను బట్టి మొక్కల సంఖ్యను సైంటిస్టులు, అనుభవజ్నులైన రైతులు నిర్ణయించుకుని ఎక్కువ మొక్కలను పెంచి ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నారు.
మన దేశ కాటన్‌ సైంటిస్టులు ఆ దేశాలకు వెళ్ళి హై డెన్సిటీ ప్లాంటేషన్‌ సాగు విధానాన్ని పరిశీలించారు. నాగపూర్‌ కాటన్‌ రీసర్చ్‌ సెంటర్‌ వారు సూరజ్‌ అనే సూటి రకాల వెరైటీని, నంద్యాల కాటన్‌ పరిశోధనా సంస్ధ, దేశీయ 1938 వెరైటీలను అభివధిచేసి రైతులకు ఇచ్చారు. హై డెన్సిటీ ప్లాంటేషన్‌ తో మొక్కల సాంద్రత ను పెంచి ఎక్కువ దిగుబడిని సాధించవచ్చని ప్రభుత్వ సంస్ధలు ప్రదర్శనాక్షేత్రాలు ఏర్పాటుచేసారు. ప్రత్యమ్నాయంగా దేశీ విత్తనాల సాంద్రతను పెంచి ఎక్కువ దిగుబడిని సాధించవచ్చని చూపారు. మన దేశరైతులు మోన్సాంటో, బేయర్స్‌ లాంటికంపెనీల మాటలువిని హైబ్రిడ్‌ విత్తనాలనే వాడుతున్నారు. మన పొలంలో మన పంట విత్తనాలను ఎక్కువగా నాటి ఎక్కువ మొక్కలను పెంచి పత్తి దిగుబడిని అంతర్జాతీయస్ధాయికి తేవచ్చని నాగపూర్‌ లోని పత్తి పరిశోధనాసంస్ధవారు ప్రయోగాలు చేసి నిర్ధారించారు. ప్రదర్శనాక్షేత్రాలను ఏర్పాటు చేశారు. వారు సరఫరా చేసిన సూరజ్‌ వెరైటీని , నంద్యాల పత్తి పరిశోధనా సంస్ధ ఇచ్చిన వెరైటీలను రైతు రక్షణ వేదిక ప్రొఫెసర్‌ యన్‌ వేణుగోపారావు గారి నాయకత్వాన గుంటూరు జిల్లాలో ప్రచారం చేసింది. వెయ్యికన్నా ఎక్కువ సభ్యులతో సహకార సంస్ధగా ఏర్పడి సూటిరకాల అభివధికి దాదాపు 10 సం.కు పైగా కషిచేసింది. బీటీ వున్న సూటిరకాలుకూడా రైతు రక్షణ వేదిక రైతులు అభివద్దిóచేశారు. తక్కువ వనరులతో విషేషమయిన కషి జరిగింది. కార్పోరేట్‌ కంపెనీల హైబ్రిడ్‌ అనుకూల ప్రచారాల ముందు కొద్దిమంది కషి రైతులను ఉత్తేజపరచలేక పోయింది. నాగపూర్‌ లోని పత్తి పరిశోధనాసంస్ధ, నంద్యాల పరిశోధనాసంస్ధలకు తోడుగా వ్యవసాయశాఖ, వ్యవసాయ విద్యాలయం కదలలేదు. ప్రయోగాలను, పరిశోధనలను కొనసాగించలేదు. రైతు సమాజాన్ని ప్రభావితం చేయగల్గిన నాయకులు సూటి రకాలగురించి, హై డెన్సిటీ ప్లాంటేషన్‌ గురించి పట్టించుకోలేదు. ఫలితంగా మన రైతులు అదిక దిగుబడులద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోవటమేకాదు. దేశప్రజల విత్తన స్వాతంత్య్రాన్ని మోన్సాంటో లాంటి కోర్పోరేట్‌ శక్తులకు ధారపోసి దేశసార్వభౌమాధికారానికే ప్రమాదం తెచ్చి పెట్టారు. అంతర్జాతీయ అనుభవాలను మన పరిస్ధితులకు అన్వయించుకోవాలి. చిన్న రైతులను ఆర్ధికంగా నిలబెట్టినపుడే వ్యవసాయం రక్షించబడతుంది.
రైతు తన పొలంలోనుండి విత్తనాలను తీసుకొని కనీసం మూడు నాలుగు సంవత్సరాలు విత్తుకోవచ్చు. మొక్కల సాంద్రతను పెంచి అధిక దిగుబడిని పొంది , అధిక ఆదాయాన్ని పొందవచ్చు. సగటు దిగుబడులలో అంతర్జాతీయ స్ధాయిని అందుకోవచ్చు. ఎమ్‌ యన్‌ సీ ల దోపిడీ ని ఎదుర్కొని విత్తన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవచ్చు.
ఈ వ్యాస రచయిత నల్లమడ రైతు సంఘం, రైతు రక్షణ వేదిక నేత, గుంటూరు, ఫోన్‌ 9000657799