Tags

, ,


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌
కరోనా మహమ్మారి నేపధ్యంలోనూ వ్యవసాయ రంగం సాధించిన విజయాలు శ్లాఘనీయమని పలువురు పేర్కొంటున్నారు. విపత్కర పరిస్ధితులలో కూడా అంకితభావంతో కఠోరశ్రమతో కషి చేసిన వారికి అభినందనలు తెలియచేస్తున్నారు.
హైవేలు, సెజ్‌లు,పరిశ్రమలు, అభివృద్ధి పేరున భూమి నుండి కొంతమంది రైతులను వెళ్ళగొట్తున్నారు. వ్యవసాయం గిట్టుబాటుగా లేనందున యువకులు పొట్టచేతపట్టుకుని పట్టణాలకు వలస వెళ్తున్నారు. యువతీ యువకుల వలసలు ప్రరిశ్రమాధిపతులకు వేటగాని చేతిలోపడ్డ లేడిపిల్లలాగావుంది. మురికి కూపాలలో నికష్ట జీవనం గడుపుతూ పరిశ్రమలలో కూలి పనికి అవకాశంకోసం ఎదురుచూస్తూ, కూలీకి ఎపుడు పిలుస్తారా అని ఎదురు చూసే పరిస్ధితి దాపురించింది. వ్యవసాయం ఒక జీవన విధానంగా భావించినవారు, వలసలు వెళ్ళలేని వారు, అంతకుమించి ఏమీ చేతకానివారు, వ్యవసాయం గిట్టుబాటుగా లేకపోయినా వ్యవసాయం చేస్తూనేవున్నారు.
మన రైతులు రికార్డుస్ధాయిలో పంటలను పండిస్తున్నారు. గోధుమ, వరి, చిరుధాన్యాలను గత సంవత్సరం కన్నా 6.74 మిలియన్‌ టన్నుల ఎక్కువగా 291.95 మి.ట, పప్పుధాన్యాలను 23.02 మి.ట, నూనె గింజలు 34.19 మి.ట పత్తి 34.89 మిలియన్‌ బేళ్ళకు స్వేదం చిందించారు.ఫలాలు రైతుకుఅందటంలేదు.
కరోనా మహమ్మారి దుష్ప్రభావాలు రైతులను చావుదెబ్బ కొట్టాయి. మార్చి 24 రాత్రి విధించిన కరోనా లాక్‌ డౌన్‌ ఇంకా ఏదో రూపంలో కొనసాగుతూనేవుంది. ఒక్క వ్యవసాయరంగం మాత్రం మూతపడలేదు. కానీ మార్కెట్‌ రైతుకు అనుకూలంగాలేదు. రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేసింది.
రైతులను, వ్యవసాయ కూలీలను, గ్రామాలను ప్రభుత్వాలు ఆదుకుంటాయని వాగ్దానాలు చేస్తున్నారు. కష్టాలలో వున్నవారికి సహాయం చేయటంలో తేడా చూపకూడదు. దివాళాతీసిన బ్యాంకులను, పరిశ్రమలను ప్రభుత్వం ఆదుకుంటున్నట్లుగానే ఆదుకోవాలి. ధనవంతులయిన వారికి ఏరకంగా అప్పులను రద్దు చేశారో అదేవిధంగా గ్రామీణప్రజలకు అప్పులను రద్దుచేయాలి. ప్రభుత్వం గ్యారంటీ వుండి పరిశ్రమలకు అప్పులు ఇచ్చినట్లుగానే రైతులకు, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు అప్పులను ఇవ్వాలి.

60 నుండి 70 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయ కుటుంబం సగటు నెలవారీ ఆదాయం 1700 రూపాయలు . రోజుకి 19 రూ . ప్రజల ఆదాయాలు తగ్గుతున్నాయి. అప్పులు పెరుగుతున్నాయి. వ్యవసాయ రుణాలు పక్కదోవ పట్టి కార్పోరేట్‌ కంపెనీలకే అందుతున్నాయి.ఉదా-మహారాష్ట్ర లో ముంబాయి పట్టణం లోనే 53 శాతం వ్యవసాయ రుణాలు తీసుకుంటున్నారు. ముంబాయి సిటీ లోవ్యవసాయం చేయరన్న సంగతి అందరికీ తెలిసిందే. గ్రామీణ ప్రాంతంలోని రైతులకివ్వవలసిన వ్యవసాయ రుణాలను ముంబాయి బడాబాబులకు ఇచ్చి ఎంతోమంది రైతులకు రుణాలు ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్నారు. వ్యవసాయం నష్టాలలో వుంది. వ్యవసాయరంగాన్ని రక్షించుకుంటే ఆర్ధిక వ్యవస్ధను ఆదుకోగలదు.

కొన్ని పంటలను పండిస్తున్న రైతుల దీనావస్ధలను పరిశీలించండి.

1) టమాటాను సాగు చేయాలంటేఎకరానికి 2 లక్షల నుండి 2.50 లక్షలవరకూ ఖర్చవుతున్నది. పంట దిగుబడి బాగుందనుకునే సమయానికి కరోనా లాక్‌ డౌన్‌ విధించారు. కరోనా లాక్‌ డౌన్‌ ప్రభావం కారణంగా రవాణా ఆగిపోయింది. బయటిమార్కెట్లకు ఎగుమతులు దారుణంగా పడిపోయాయి. ఫలితంగా ధరలు నేలచూపు చూశాయి. కాయకోత కూలిఖర్చులుకూడా రాక పంటను పశువులకు వదిలేశారు, పొలాన్ని దున్నేశారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 50 వేల హెక్టార్లలో టమాటా సాగు చేస్తున్నారు. 35 వేల కుటుంబాలు టమాటా సాగు పై ఆధారపడి జీవితం సాగిస్తున్నాయి గత ఏడాది జూన్‌ నుండి 2020-05-26 వరకూ 19 మంది టమాటా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. (26-05-2020 ఈనాడు.)

2) గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 17 వేల హెక్టార్లలో పొగాకు పంట సాగు చేస్తున్నారు. కరోనా లాక్‌ ఔట్‌ వలన పొగాకు అమ్ముకునే ముఖ్యమైన 2 నెలల కాలంపోయింది. మొత్తం రాష్ట్రంలో 79,384 హెక్టార్లలో సాగవుతున్నది. ప్రస్తుత ఏడాది 137 మిలియన్‌ కిలోల పొగాకు ఉత్పత్తి కాగా మే నెల వరకు 16.30 కిలోలనే వ్యాపారులు కొన్నారు. దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్న విలువైన పొగాకు పంటను వదులు కోవటానికి ప్రభుత్వం కూడా సిద్దంగా లేదు. సాగు ఖర్చులు పెరిగినా, చివరకు మిగిలేది తక్కువయినా, నమ్మకమయిన ప్రత్యామ్నాయ పంటలు లేనందున పొగాకు పంటను కొనసాగిస్తున్నారు. కరోనా మహమ్మారి రాకముందే జనవరి నెలలో వచ్చిన అకాల వర్షాల వలన పంటనాణ్యతతగ్గి 60 శాతం పంట లోగ్రేడ్‌ అయింది. లో గ్రేడ్‌ పొగాకు ను కొనేవారేలేరు. కరోనా లాక్‌ డౌన్‌ ఫలితంగా ఏప్రియల్‌ నెలలో కొనుగోళ్ళు నిలిచాయి. ఎండకు ఆకు ఆరిపోయి బరువు తగ్గటమేకాక రంగుమారి నాణ్యతతగ్గింది. ఐ టీ సీ గుత్తాధిపత్యంతో పాటుగా కరోనా దెబ్బ రైతులపై పడింది. 30 శాతం రేటు పడిపోవటంవలన రైతులు ఆందోళనతో రోడ్డెక్కారు. ఒక్క బారన్‌ కు 3 లక్షల నష్టం అని రైతులు ఆవేదనచెందుతున్నారు.

3) స్టాక్‌ మార్కెట్లు మూయలేదు- మిర్చి యార్డు మూసేశారు: రైతులు అధిక వ్యయప్రయాసలకోర్చి మిర్చిని పండించారు. ఆసియాలో అతి పెద్ద మార్కెట్‌ గా పేరుపొందిన గుంటూరు మిర్చి యార్డు ను కరోనా వలన మూసేశారు. కరోనా వలన ఎగుమతులు ఆగిపోయాయని మిర్చి రేటును సగానికి దిగకొట్టారు. పంటను అమ్ముకునే అవకాశం లేనందున చాలామంది రైతులు పంటను కోల్డ్‌ స్టోరేజీలలో నిల్వ చేశారు.
మిర్చిలో తేజ వెరైటీకి చైనాలోనే కాకుండా శ్రీలంక, సింగపూర్‌, మలేసియాలలో కూడా మంచి డిమాండ్‌ వున్నది. 135 కోల్డ్‌ స్టోరేజీలలో దాదాపు కోటి టిక్కీల మిర్చి ని నిల్వ చేశారు. ఒక్కో టిక్కీకి సగటున 40 కిలోల మిరప కాయలుంటాయి. మొత్తంగా దాదుపుగా 4 లక్షల టన్నుల మిర్చి నిల్వలు కోల్డ్‌ స్టోరేజీలలో వున్నాయి. వీటిలో కొంత సరుకు వ్యాపారులది కూడా వుంటుంది. అంతేగాక గ్రామాలలో రైతుల ఇండ్ల వద్ద దాదాపు 40 వేల టన్నుల మిర్చి వుంటుందని అంచనా. లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా మిర్చియార్డు ప్రారంభమయింది. కానీ పాత రేటులేదు. 65 రోజులపాటు యార్డు మూసివేయటంవలన రైతులకు జరిగిన నష్టం ప్రభుత్వ పధకాలవలన తీరేదికాదు. యార్డు మూయకముందు , ఒక్క క్వింటాలు మిర్చి, 16 వేల రూపాయలనుండి 20 వేల రూ. వరకూ అమ్ముడుపోయింది. తరువాత సగటున 10 వేలు వుంది. ఎకరానికి 30 క్వింటాళ్ళ మిర్చి పండితే ,కరోనాలాక్‌ డౌన్‌ వలనఎకరానికి 1 లక్షా 80 వేల నుండి 3 లక్షలదాకా నష్టం దాపురించింది.

4) శనగకు గిట్టుబాటు ధర లేకపోవటంవలన రెండు సంవత్సరాల శనగ పంట కోల్డ్‌ స్టోరోజిలలోనే మగ్గుతున్నది..శనగ పంటవేసి నష్టపోయిన ఆ రైతులకు క్వింటాలుకు 1500 రూపాయలు సబ్సిడీగా ఇస్తామని 10 నెలల క్రితం కేబినెట్‌ ప్రకటించింది. ప్రకటనను రైతులు స్వాగతించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు ప్రాంతంలో ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ 1500 రూ. ఇంతవరకూ (జూన్‌ మొదటి వారం) రైతులకు ఇవ్వలేదు. రాష్ట్రంలో 4.75 లక్షల హెక్టార్లలో 6.32 లక్షల మెట్రిక్‌ టన్నుల శనగల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనావేసింది. ఈ సంవత్సరం శనగ పంటను కొనుగోలు కేంద్రాలలో 10 శాతం పంట కూడా కొనలేదు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలు ధర రూ.4875.
అకాల వర్షాల వలన కొన్ని గింజలకు నల్లమచ్చ వచ్చింది. పైకి నల్లగా వున్నా లోపల గింజ బాగానేవుంది.నల్ల గింజలు వున్నాయని కొన్ని శనగలను కొనలేదు. కరోనా కారణంగా మినుముల ధర దిగజారిపోయింది. రబీ మినుము ఫిబ్రవరి, మార్చి నెలలలో క్వంటాలు ధర రూ 7500 వుంది. ఇపుడు (జూన్‌ మొదటి వారం) 6200 కి కూడా ఎవరూ అడగటంలేదు.విదేశాలనుండి పప్పుధాన్యాల దిగుమతులను ఆపాలి.

5) ఐ టీ సీ కంపెనీ ప్రోత్సహించి సుబాబుల్‌ పంట : ప్రత్యామ్నాయ పంటగా ఐ టీ సీ కంపెనీ ప్రోత్సహించిన సుబాబుల్‌ వేసి పేపర్‌ మిల్లుల దోపిడీతో రైతులు నష్టపోయారు. కరోనా లాకవుట్‌ తో రవాణా సౌకర్యాలు లేనందున సుబాబుల్‌ రేటు ఇంకా దించేశారు, గతంలో ఎకరాకు 25 వుంచి 30 టన్నులవరకు దిగుబడి వచ్చే తోటలు ప్రస్తుతం 15- 20 టన్నులకు పరిమతమవుతున్నాయి.ఇదివరకు ఎకరం తోట రెండు సంవత్సరాల తరువాత అమ్మితే 90 వేల రూ. వచ్చేవి. ఇపుడు 40 వేలుకూడా రావటం లేదు. ఒక వైపు ధర లేక మరోవైపు కొట్టుడుకు వచ్చినా కరోనా దెబ్బతో అమ్ముకునే అవకాశంలేక సుబాబుల్‌ రైతులు అల్లాడుతున్నారు. ఖరీఫ్‌ లో వరి తర్వాత అత్యధికంగా పండించేది మొక్కజొన్న. కోళ్ళమేతలో మొక్కజోన్నను అత్యధికంగా వాడతారు. రబీలో రాష్ట్రంలో 5.59 లక్షల ఎకరాలలో రైతులు సాగు చేశారు. దిగుబడి అంచనా 14.56 లక్షల టన్నులు. కనీసం 3.64 లక్షల టన్నులు కొనాలని ప్రభుత్వం నిర్ణయించి ఏ పీ మార్క్ఫెడ్‌ ను నోడల్‌ ఏజెన్సీగా నిర్ణయించారు. ఇప్పటివరకూ లక్ష టన్నులు కూడా కొనలేదంటున్నారు. రాష్ట్రంలో అత్యదికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 1,32,097 ఎకరాలలో గుంటూరు జిల్లాలో 1,19139 ఎకరాలలో సాగయింది. పొలాలవద్ద ఎటువంటి ఖర్చులు లేకుండా రూ.3400 ఇస్తే ఇపుడు 2150 ఇచ్చేసరికి కష్టమవుతుంది.

అతిపెద్ద అరటి మార్కెట్‌ రావులపాలెం. రోజుకి 25 వేల గెలలు బయటకు వెళ్ళేవి.కరోనా దెబ్బ తో మార్కెట్‌ పడిపోయింది.ఎంత పెద్ద గెల తెచ్చినా వంద రూపాయలు, ఇష్టమైతే దింపండి. లేకుంటే వెళ్ళండి అన్నారు, రైతు ఏమవ్వాలి. 70 80 వేలు పెట్టుబడ,ి కూలిగిట్టక నరికేశారు.

రబీ క్రింద లక్షల ఎకరాలలో మొక్కజొన్న పంట వేశారు.పంట చేతికి వచ్చి అమ్ముకునే సమయానికి కరోనా ప్రభావంతో మార్కోట్‌ లో ధరలు పడిపోయాయి. గత ఏడాది కత్తెర పురుగు వలన నష్టాలు వస్తేఈ ఏడాది కరోనా కాటేసింది. గిట్టుబాటు ధర లేక లాభసాటి దర పక్కన పెడితే కనీసం మద్దతు ధరకు కూడా కొనే పరిస్ధితి కనిపించటంలేదు. డీ ఏ పీ బస్తా 1330, గింజ చేతికి వచ్చేసరికి 30 వేలకు పైననే ఖర్చులు అవుతున్నాయి. పోయిన సంవత్సరం 2200 పైననే అమ్మిన బస్తామొక్కజొన్నలు ఈరోజున 1200 కి కొనేవారులేరు.
ఆక్వా రైతులు కరోనాదెబ్బకు కుదేలవుతున్నారు. కోస్తాజిల్లాలలో లక్షల ఎకరాల రొయ్యల సాగు జరుగుతుంది. 1.80 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతుంది. వివిధ ప్రోసెసింగ్‌ కంపెనీలు రైతుల నుండి కొనుగోలు చేసి చైనా,యూరప్‌ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా దెబ్బతో రొయ్యల ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. రైతులకష్టమే కాదు పెట్టుబడికూడా ఎక్కువ. ప్రభుత్వం నిర్దేసించిన ధరలకు రొయ్యలను కొనుగోలు చేయటంలేదు. ప్రభుత్వం రైతుల తోనూ ప్రోసెస్‌ చేసే యజమానులతోనూ చర్చలు జరిపింది. కనీస ధరలను నిర్ణయించింది. ఆ కనీస ధరలకు రొయ్యల వ్యాపారులు కొనుగోలు చేయటంలేదు.
త్వరగా చెడిపోయే పూలు, పండ్లు
కరోనా వలన పువ్వుల పంటలు, పండ్ల తోటలు, కూరగోయలు వేసిన రైతుల పాట్లు చెప్పేవి కావు. ప్రకాశం, గుంటూరు జిల్లాలలోనేకాక అన్నిజిల్లాలోపూలతోటలను వేశారు.
ఉదాహరణకు ప్రకాశంజిల్లాలో ఒక రైతు ు మల్లేతోటకు అర ఎకరం కౌలు కి తీసుకుని వేసిన కౌలు కాకుండా 25 వేలు పెట్టుబడి పెట్టిన రైతు వేసవి లో మల్లెతోట ను జాగ్రత్తగా పెంచి పూలు అమ్ముకుందామని మార్కెట్‌ కి వెళ్తే లాక్‌ డౌన్‌ అన్నారు. పుచ్చకాయలు, జామకాయలు, నిమ్మకాయలు, బత్తాయి, సపోటా లు, మామిడి పళ్ళు పండినతర్వాత ఎక్కువ రోజులు నిలవ వుండక ర్వరలో కుళ్ళిపోతాయి. కూరగాయల పరిస్ధితి కూడా అంతే.
ఈ-కర్షక్‌ లో పేరు లేకుంటే ఉత్పత్తిని కొనుగోలు చేసేదిలేదని ప్రభుత్వ కొనుగోలు సంస్ధలు స్పష్టం చేస్తున్నాయి. వ్యవసాయశాఖ ఈ-కర్షక్‌ లోనమోదుచేస్తున్నది. రెవెన్యూ శాఖభూముల వివరాలను నమోదుచేస్తుంది. వ్యవసాయశాఖ- రెవెన్యూ శాఖ-మార్కెటింగ్‌ శాఖల మధ్య సమన్వయం లేదు. పంటను అమ్ముకోవటానికి మార్కెటింగ్‌ కేంద్రాలకు వెళ్ళినపుడు , పేరులేదనే నెపంతో ఉత్పత్తులను కొంటానికి నిరాకరిస్తున్నారు. రైతులే తమ పంటను మంచి ధర వచ్చే చోట ఎక్కడైనా అమ్ముకోవచ్చని మూడు స్వేఛ్ఛా వ్యాపార ఆర్డినెన్సులు తేవాలని కాబినెట్‌ నిర్ణయించింది. 82 శాతంగా వున్న సన్న చిన్నకారు రైతులు ఏ పంటకు ఎక్కడ గిరాకీ ఉందో కనుక్కొని అమ్ముకోగలగటం అసాధ్యం. యార్డుకి తీసుకెళ్ళి అమ్ముకునే శక్తి లేక రవాణా ఖర్చులు భరించలేక అయినకాడకు ఇంటి వద్దనే దళారీలకు అమ్ముకుంటున్నారు.
జూన్‌ 1న పంటలకు కనీస మద్దతు ధరలను కేంద్రం ప్రకటించింది. గతేడాది పెరిగిన ఖర్చులతోపోలిస్తే పెంచింది నామమాత్రమే. వరికి 2 శాతం అంటే 53 రూ. పెంచారు.
స్వామినాదన్‌ కమిటీ చెప్పినట్లు వాస్తవ సేద్య ఖర్చులకు 50 శాతం అదనంగా కలిపి గిట్టుబాటు ధర నిర్ణయించి ప్రభుత్వమే మొత్తం పంటను కొనే ఏర్పాట్లు చేసే సమగ్ర ప్రణాలిక తయారు చేయాలి. వ్యవసాయ రుణాలనన్నిటినీ రద్దు చేయాలి. యువత మేల్కోవాలి. ప్రభుత్వాన్ని కదిలించాలి. వ్యవసాయ పంటలనన్నిటినీ ప్రభుత్వం చేత కొనిపించాలి. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు, ఉద్దీపనలు, ప్రోత్సాహకాలు, వెసులుబాటులు, సౌకర్యాలు వ్యవసాయం చేసే రైతు కూలీలకు కల్పించేటట్లు పోరాడి సాధించాలి.

వ్యాస రచయిత నల్లమడ రైతుసంఘం, గుంటూరుజిల్లా నేత. రచనా కాలం జూన్‌నెల మొదటి వారం. సెల్‌ నం: 9000657799