Tags
AB Vajpayee, Five fingers of Tibet, RSS Outfits anti china feets, Sikkim, Sikkim annexation facts, Tibet
ఎం కోటేశ్వరరావు
టిబెట్ దలైలామా : అమెరికా వదిలించుకుంది-భారత్ తగిలించుకుంది ! అనే శీర్షికతో నేను రాసిన విశ్లేషణ మీద సామాజిక మాధ్యమంలో సంఘపరివార్ శక్తులు తూలనాడాయి. వారికి ఏకత, శీలము, సభ్యతలపై ఇచ్చిన ”శిక్షణ ” అలాంటిది మరి. వారు తిడుతున్నది నన్ను కాదు వారి గౌరవనీయ నేత అతల్ బిహారీ వాజ్‌పేయిని అని తెలియని అజ్ఞానంతో ఉన్నారని చెప్పాలి. టిబెట్ స్వయం పాలిత ప్రాంతం చైనాలో అంతర్భాగమని గుర్తిస్తూ 2003లో ప్రధాని వాజ్‌పాయి-చైనా ప్రధాని వెన్ జియాబావో ఒప్పందం మీద సంతకాలు చేశారని తెలుసా ! అని గుర్తు చేసిన తరువాత ఎవరు చేసినా తప్పే అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అనేక దేశాలలో ఉన్న పరిస్ధితులకు అనుగుణ్యంగా స్వయం పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు. టిబెట్‌తో సహా ఐదు స్వయం పాలిత ప్రాంతాలు చైనాలో ఉండగా, మన దేశంలో త్రిపుర స్వయంపాలిత గిరిజ ప్రాంతం, గూర్ఖాలాండ్(డార్జిలింగ్) వంటివి పది ఉన్నాయి. వాజ్‌పేయి ప్రభుత్వం టిబెట్‌ను లాంఛనంగా చైనాకు చెందినదిగా గుర్తిస్తే, అదే ఒప్పందంలో సిక్కిం మన దేశంలో అంతర్భాగమని చైనా గుర్తించిన చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు టిబెట్ సమస్యను తిరగదోడటం, దాన్ని తురుపు ముక్కగా వాడుకోవాలని బిజెపి మేథావి శేషాద్రి చారి సలహా ఇవ్వటాన్ని, ఐదు వేళ్ల పేరుతో సిక్కింను స్వాధీనం చేసుకొనేందుకు చైనా పూనుకొన్నదని ప్రచారం చేయటాన్ని ఏమనాలి. సదరు పెద్ద మనిషి 2003లో వాజ్‌పాయి ప్రధానిగా చైనాతో ఒప్పందం చేసుకున్నపుడు ఆర్‌ఎసెస్ పత్రిక ఆర్గనైజర్ సంపాదకుడిగా ఉన్నారు. ఆయనకు వాస్తవాలేమిటో తెలియవా ? ఎవరి పాటకు అనుగుణ్యంగా వారు ఈ నృత్యం చేస్తున్నట్లు ? వాజ్‌పారు అంత అమాయకంగా, సంఘపరివార్ అనుమతి లేకుండానే చైనాతో ఒప్పందం చేసుకున్నారని భావించాలా ? ఒక వేళ అనుమతి లేకపోతే ఆర్‌ఎస్‌ఎస్ లేదా బిజెపి వాజ్‌పాయి ఒప్పందాన్ని ఆనాడే బహిరంగంగా ఎందుకు ఖండించలేదు? తిరగదోడాలనుకుంటే దానికి కారణాలేమిటో చెప్పి ఆ పని చేయవచ్చు. అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీకి ఇదొక లెక్కా !
వాజ్‌పేయి చైనా పర్యటనలో కుదుర్చుకున్న ఒప్పందం సందర్భంగా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో భారత గడ్డమీద టిబెట్ నుంచి పారిపోయి వచ్చిన వారు సాగించే చైనా వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించేది లేదని స్పష్టంగా ఉంది. అదే ఒప్పందంలో బౌద్ద దలైలామా (టిబెట్ అధినేతగా కాదు ) స్ధితి యథాతధంగా కొనసాగుతుందని కూడా పేర్కొన్నారు. ఆ కారణంగానే దలైలామా మన దేశంలో ఇప్పటికీ ఉండగలుగుతున్నారు.టిబెట్‌లో ఏమి జరిగిందో పైన పేర్కొన్న వ్యాసంలో వివరించిన కారణంగా ఇంతకు మించి చెప్పనవసరం లేదు. టిబెట్ చైనాలోని స్వయం పాలిత ప్రాంతం అంటే దాని అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకోకూడదని అర్ధమంటూ కొందరు స్వయం సేవకులు విపరీత టీకా తాత్పర్యాలు చెబుతున్నారు. అదే సూత్రం మన దేశంలోని స్వయం పాలిత ప్రాంతాలకూ వర్తిస్తుందా ? నిర్ధిష్ట అంశాలకు సంబంధించి ఆయా ప్రాంతాల పాలక మండళ్లకు ఆయా దేశాల రాజ్యాంగం ప్రకారమే అధికారాలు ఇచ్చారు. వాటిలో ఆయా రాష్ట్రాల లేదా కేంద్ర ప్రభుత్వం రోజువారీ జోక్యం చేసుకోకూడదు, దాని అర్ధం అక్కడ ఉగ్రవాదం, వేర్పాటువాదం, ఇతర అవాంఛనీయ పరిణామాలు జరిగినా జోక్యం చేసుకోకూడదని కాదు.
టిబెట్ చరిత్రను చూసినపుడు చైనా పాలకులకు సామంత రాజ్యంగా లేదా స్వయంపాలిత ప్రాంతంగా ఉండటం తప్ప ఎన్నడూ స్వతంత్ర రాజ్యంగా లేదు. సిక్కిం విషయం అలా కాదు. అది బ్రిటీష్ వారు మన దేశాన్ని, ఆక్రమించే సమయానికే స్వతంత్ర రాజ్యంగా ఉంది. అంతకు ముందు నుంచే సిక్కిం పాలకులకు నేపాల్, భూటాన్ రాజులతో వైరం ఉంది. దాంతో నేపాల్ నుంచి రక్షణ పొందేందుకు గాను సిక్కిం రాజు బ్రిటన్‌తో ఒప్పందం చేసుకొని దాని రక్షణ దేశంగా ఉండేందుకు అంగీకరించారు. బ్రిటీష్ వారు మన దేశం నుంచి వెళ్లిపోయిన సమయంలో సిక్కిం స్వతంత్ర రాజ్యం. అయితే మన నాయకులు ఇతర సంస్ధానాలను విలీనం చేసుకున్న సమయంలో సిక్కింను కూడా విలీనం కమ్మని అడిగారు. అక్కడి రాజు అంగీకరించలేదు. దాంతో 1950లో భారత రక్షిత రాజ్యం లేదా సామంత రాజ్యంగా ఉండేట్లు ఒప్పందం కుదిరింది.
1962లో చైనాతో సరిహద్దు వివాదం తరువాత మన దేశ సహకారంతో చైనాకు వ్యతిరేకంగా సిఐఏ కార్యకలాపాలు ప్రారంభించింది. 1964లో చైనా తొలి అణుపరీక్ష జరిపింది. దాంతో చైనా మీద నిఘావేయాలని నిర్ణయించిన అమెరికన్ సిఐఏ మన ప్రభుత్వాన్ని సంప్రదించింది. చైనా మీద ఉన్న కోపంతో అది మన ప్రయోజనాలకూ నష్టమే అనే ముందు చూపు లేకుండా అంగీకరించింది. ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారి కెప్టెన్ మన్మోహన్ సింగ్ కోహ్లి ఆధ్వర్యంలో సిఐఏ అధికారులతో కలసి హిమాలయాల్లోని నందదేవి శిఖరం మీద అణుశక్తితో పని చేసే ఒక గూఢచార పరికరాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని ఎలా అమర్చాలో 1965 జూన్ 23న అమెరికాలోని అలాస్కా మౌంట్ మెకెన్లీ శిఖరం మీద ట్రయల్ వేసి తరువాత నందదేవి మీద పెట్టేందుకు తీసుకుపోయారు. అయితే వాతావరణం అనుకూలించకపోవటంతో దాన్ని అక్కడే వదలి వెనక్కు వచ్చారు. తరువాత దాన్ని అమర్చేందుకు 1966లో వెళ్లినపుడు ఎక్కడుందో కనపడలేదు, 1967లో కూడా వెతికారు, చివరకు 1968లో దాని మీద ఆశవదులుకున్నారు. ఉష్ణోగ్రతను ఎక్కువగా వెలువరించే పరికరం మంచులో కూరుకుపోయినపుడు రాయి తగిలేంతవరకు లోపలికి పోతూనే ఉంటుందని, ఆ అణుపరికరం వంద సంవత్సరాలు ప్రభావం చూపుతుందని, అది రిషి గంగలో కలిస్తే నీరు కలుషితమై జనం మరణించే అవకాశం కూడా ఉందని అయితే, ప్రధాన గంగా జలాల్లో కలిస్తే నీరు కలుషితం అవుతుంది, కొందరు ఇబ్బంది పడవచ్చు తప్ప ప్రాణాలు తీస్తుందని తాను అనుకోవటం లేదని ఢిల్లీలో నివసిస్తున్న 88 ఏండ్ల నాటి కెప్టెన్ మన్మోహన్ సింగ్ కోహ్లీ చెప్పినట్లు 2018 ఆగస్టు పదిన ఎకనమిక్ టైమ్స్ పత్రిక రాసింది. ఇప్పటికీ దాన్ని వెతికితే ఉపయోగమే అని, ఇదంతా తాము దేశం కోసమే చేశామని సింగ్ చెప్పారు. ఉత్తరా ఖండ్ పర్యాటకశాఖ మంత్రి సత్పాల్ మహరాజ్ ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి తీసుకు వచ్చి నీటి కాలుష్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పరికరాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తామని మోడీ హామీ ఇచ్చినట్లు ఎకనమిక్ టైమ్స్ రాసింది. ఇక్కడ దీని ప్రస్తావన ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అదే అమెరికా సిఐఏ సిక్కింలో పాగా వేసి మన దేశం, చైనాను రెండింటినీ దెబ్బతీసేందుకు కూడా పధకం వేసింది.
హౌప్ కోక్ అనే కుర్రదాన్ని సిక్కిం పన్నెండవ రాజు(చోగ్యాల్) పాల్డెన్ తొండుప్ నామగ్యాల్‌కు ఎరగా వేసి, చివరికి 1963లో వివాహం చేసి సిక్కిం యువరాణిగా ప్రకటించారు.డార్జిలింగ్‌లోని ఒక హౌటల్‌లో హౌప్ కలిసే నాటికి చోగ్యాల్ వయస్సు 36, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది, భార్యతో విడాకులు తీసుకొని ఉన్నాడు. వివాహమైన తరువాత తన సిఐఏ బంధు గణాన్ని హౌప్ సిక్కింకు రప్పించింది. భారత రక్షిత రాజ్యాలుగా ఉన్న సిక్కిం, భూటాన్‌లను స్వతంత్ర రాజ్యాలుగా మార్చేందుకు పూనుకున్నారు.1971లో భూటాన్ ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం పొందింది. అదే సమయంలో బంగ్లాదేశ్ విముక్తి పోరాటం జరిగింది. పోరాడుతున్న వారికి మద్దతుగా మన దేశం మిలిటరీని దించింది. దాంతో పాకిస్ధాన్‌కు మద్దతుగా తమ సప్తమ నౌకాదళాన్ని పంపుతున్నట్లు అమెరికా బెదిరించింది. ఈ పరిణామం తరువాత మన దేశం నాటి సోవియట్ యూనియన్‌తో రక్షణ ఒప్పందం చేసుకొని పాక్ మిలిటరీతో తలపడి బంగ్లా విముక్తికి చేయాల్సింది చేసింది. ఈ పూర్వరంగంలో సిక్కింలో సిఐఏ కార్యకలాపాలు, సిక్కిం కూడా స్వతంత్ర రాజ్యంగా ఐక్యరాజ్యసమితిలో చేరితే అక్కడ అమెరికన్లు తిష్టవేసి మనకు ప్రమాదకరంగా మారతారనే ముందు చూపుతో నాటి ప్రధాని ఇందిరా గాంధీ తీసుకున్న చర్యలతో సిక్కింలో రాజుకు వ్యతిరేకంగా జనం వీధుల్లోకి వచ్చారు. వారి వెనుక మన ”రా” గూఢచారులు ఉన్నారు. సిక్కింలో రాజు బౌద్దమతస్ధుడు. మెజారిటీ జనాభా నేపాలీ హిందువుల వారసులు. రాజు తమ పట్ల వివక్ష చూపుతున్నారనే అభిప్రాయం ఉండటాన్ని ఆసరాగా తీసుకొని సిక్కిం విలీనానికి 1971లోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ 1975వరకు అది సాధ్యం కాలేదు.
ప్రజల వత్తిడికి తట్టుకోలేక 1974 ఏప్రిల్ సిక్కిం రాజు పార్లమెంట్ ఎన్నికలు జరిపాడు. వాటిలో మన దేశంతో స్నేహాన్ని కోరుకొనే సిక్కిం జాతీయ కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తీర్పును ఆమోదించేందుకు రాజు తిరస్కరించి అణచివేతకు పూనుకున్నాడు.అయితే మేనెలలో పార్లమెంట్ ఒక చట్టాన్ని చేసి భారత్‌తో మరింత సన్నిహితంగా ఉండాలని తీర్మానించింది. తరువాత జూలై నెలలో సిక్కిం కొత్త రాజ్యాంగాన్ని పార్లమెంట్ ఆమోదించింది. దాని ప్రకారం సిక్కిం భారత్‌లో ఒక రాష్ట్రంగా చేరేందుకు వీలు కలిగింది. మన దేశ వత్తిడితో రాజు దాన్ని ఆమోదించకతప్పలేదు.సెప్టెంబరు నాలుగున మన పార్లమెంట్ సిక్కింను సహ రాష్ట్రంగా ఆమోదిస్తూ ఒక తీర్మానం చేసింది. అదే వారంలో సిక్కిం రాజు దీని మీద ప్రజాభిప్రాయాన్ని కోరాడు.1975 మార్చినెల ఐదున సిక్కిం పార్లమెంట్ మరోసారి భారత్‌తో అనుసంధానాన్ని కోరింది. తిరిగి రాజు ప్రజాభిప్రాయాన్ని కోరాడు. మన దేశంతో విలీనాన్ని కోరుకొనే నేతలను హత్య చేయించేందుకు రాజు ఆదేశించినట్లు ఉప్పందటంతో ఏప్రిల్ తొమ్మిదిన మన మిలిటరీ గ్యాంగ్‌టక్‌లో ప్రవేశించి అక్కడి సాయుధ దళాలను నిరాయుధులను గావించి, రాజును గృహనిర్బంధంలో ఉంచింది.ఏప్రిల్ 14న జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో 97.55 శాతం మంది భారత్‌లో విలీనానికి అనుకూలంగా ఓటు వేశారు. దాంతో నాటి సిక్కిం ముఖ్యమంత్రి భారత ప్రధాని ఇందిరాగాంధీకి ఒక వినతిని పంపుతూ విలీనానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఏప్రిల్ 26న మన పార్లమెంట్ ఒక రాజ్యాంగ సవరణను ఆమోదించి సిక్కింను 22 రాష్ట్రంగా ఆమోదించింది. మే 15న రాష్ట్రపతి ఆమోద ముద్రవేసి సిక్కింలో రాజరికానికి స్వస్తి పలికారు. సిక్కిం ప్రజాభిప్రాయం సక్రమంగా జరగలేదని, భారత్ దాన్ని ఆక్రమించుకుందని కొందరు విమర్శించారు. తరువాత ప్రధాన మంత్రి అయిన మొరార్జీ దేశారు సిక్కిం విలీనం అనైతికం, అన్యాయం అని వ్యాఖ్యానించారు. అయితే వ్యవహారం మొత్తం సిక్కింలోనూ, మనదేశంలోనూ చట్టబద్దంగానే జరిగింది. నాడు ఇందిరగాంధీ ఆపని చేయనట్లయితే సిక్కిం ఒక స్వతంత్ర రాజ్యంగా అమెరికా చేతిలోకి పోయి ఉండేది. మన నెత్తిమీద కూర్చొని మనకూ అటు చైనాకూ ముప్పు తెచ్చి ఉండేదన్నది జగమెరిగిన సత్యం.
అయితే మన దేశంతో నాడున్న విబేధాల నేపధ్యంలో భారత్ చర్యను చైనా తప్పు పట్టింది. సిక్కిం విలీనాన్ని గుర్తించేందుకు నిరాకరించింది.2003లో జరిగిన భారత్-చైనా ఒప్పందాల ప్రకారం సిక్కింను భారత ప్రాంతంగా చైనా గుర్తించింది. అదింకేమాత్రం రెండు దేశాల మధ్య వివాదాస్పదం కాదని చైనా ప్రధాని వెన్ జియాబావో 2005లో ప్రకటించాడు. ఆ ఒప్పందంలోనే టిబెట్‌ను చైనా అంతర్భాగంగా మన దేశం గుర్తించింది. ఇప్పుడు బిజెపి నేతలు కొందరు టిబెట్ సమస్యను తిరగదోడటం, ఐదువేళ్ల ఆక్రమణ అంటూ ప్రచారం చేయటం, దలైలామా పేరుతో రాజకీయాలు చేయాలని చూడటం వలన ప్రయోజనం ఉందా ? ఎవరి తరఫున ఎవరికోసం పని చేస్తున్నట్లు ? సద్దుమణిగిన వివాదాన్ని తిరిగి రేపటం, మిగిలి ఉన్న వివాదం మరింత సంక్లిష్టం కావటానికి దోహదం చేయదా ? కాశ్మీర్ సమస్యపై తనకు పాకిస్ధాన్ మిత్రదేశంగా ఉన్నపుడు ఒక వైఖరి, ఇప్పుడు మన దేశం తన కౌగిల్లోకి వచ్చింది కనుక మరొక వైఖరితో వ్యవహరిస్తున్నది అమెరికా. టిబెట్ విషయంలో కూడా తమకు చైనా దగ్గర అవుతుంది అనుకున్నపుడు దాన్ని వదలివేసింది. ఎప్పుడైతే చైనాయే తనకు ఏకు మేకైందని గ్రహించిందో అప్పటి నుంచి పరోక్షంగా టిబెట్, ఇతర అంశాల మీద అమెరికా వైఖరిలో మార్పు వచ్చింది. అందువలన దాని పాటకు అనుగుణ్యంగా మనం నృత్యం చేయటమా ? చైనాతో సహా అనేక అంశాలపై స్వతంత్ర వైఖరిని అనుసరించటమా అన్నది తేల్చుకోవాలి. ఎప్పుడైతే మనం అమెరికాకు దగ్గర అవుతున్నామో అదే సమయంలో పాకిస్ధాన్ చైనాకు దగ్గర అయింది. అందువలన కాశ్మీరు, ఇతర వ్యవహారాల గురించి చైనాలో మార్పులు ఉంటున్నాయి. చైనా వ్యవహారాల్లో మనం జోక్యం చేసుకున్నా, మన వ్యవహారాల్లో చైనా అదే తప్పు చేసినా వివాదాలు పరిష్కారం గావు. అలా రావణాకాష్టంలా మండుతూనే ఉంటే తాము లబ్ది పొందవచ్చన్న అమెరికా గుంటకాడ నక్కలా కూర్చుంది. దానికి అవకాశం ఇద్దామా ? విజ్ఞులు ఆలోచించాలి.