Tags

, ,


ఎం కోటేశ్వరరావు
భారత ఆర్ధిక వ్యవస్ధ పురోగమనం గురించి ఏ సంస్ధ ఏ రోజు ఏ జోశ్యం చెబుతుందో తెలియని అయోమయంలో దేశ ప్రజలు ఉన్నారు. అంతకంటే ఆందోళనకరమైన అంశం ఏమంటే అసలు విషయాలు తెలిసిన పాలకులు వాస్తవాలను మూసి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి మీద గుడ్డి నమ్మకంతో ఉన్న జనం అది పాచిపోతే ఏమౌతుందో ఆలోచించే స్ధితిలో లేరు. ఏ మంత్రదండమో తమను ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తుందనే భ్రమల్లో ఉన్నారు. ఈ పరిస్దితికి కారణం నయా ఉదారవాద విధానాలు జనంలో కల్పించిన భ్రమలు అని ప్రపంచ పరిణామాలను చూసిన వారు చెబుతున్నారు. భిన్న ఆలోచనలు-అభిప్రాయాల చర్చకు మీడియాలో చోటు దొరకటం లేదు. ఏకపక్ష సమాచారం జనం మెదళ్లలోకి ఎక్కుతోంది. ఎందుకు అనే ప్రశ్న మన మస్థిష్కాల సాప్ట్‌వేర్‌ నుంచి అంతర్దానమైందా ? చెడిపోయిందా ?
కోవిడ్‌-19 మహమ్మారి గత వంద సంవత్సరాలలో సాధారణ సమయాల్లో ఎరగనంత ఆరోగ్య, ఆర్ధిక సంక్షోభాన్ని సృష్టించిందని భారత రిజర్వుబ్యాంకు గవర్నరు శక్తికాంత దాసు శనివారం నాడు చెప్పారు. ఎస్‌బిఐ బ్యాంకింగ్‌ మరియు ఆర్ధిక సమావేశంలో గవర్నరు మాట్లాడారు. ఈ సంక్షోభం వలన ఉత్పత్తి, ఉద్యోగాలు, సంక్షేమ రంగాలలో అసాధారణ ప్రతికూలతలు చోటు చేసుకుంటాయని, బ్యాంకుల నిరర్ధక ఆస్తులు పెరుగుతాయని హెచ్చరించారు.
ఆల్ఫా ఇన్వెస్కో అనే వార పత్రిక శనివారం నాడే ఒక విశ్లేషణను వెలువరించింది. ముందే చెప్పుకున్నట్లు ఎప్పుడు ఏ జోశ్యం వెలువడుతుందో తెలియదు. అలాంటి వాటిలో మచ్చుకు ఈ విశ్లేషణలోని ముఖ్యాంశాలను చూద్దాం. ” మదుపుదార్లు రెండు అంశాల మీద అంచనా, ఆశలతో ఉన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేత క్రమం ప్రారంభమైంది గనుక ఏడాదిలోపు సాధారణ పరిస్ధితిలు నెలకొని 2020 జనవరి స్ధాయికి చేరుకుంటాయి. ఆదాయాల పునర్దురణ జరిగి వినియోగదారులు డబ్బు ఖర్చు పెడతారు. ఇవి అత్యంత ప్రమాదకరమైన అంచనాలు. ఆర్ధిక స్ధితి అస్తవ్యస్దంగా అదుపు తప్పి ఉంది. అంచనావేస్తున్నదాని కంటే కోలుకోవటం ఆలస్యం కావచ్చు. పూర్వపు స్ధితికి రావాలంటే కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. కరోనా వైరస్‌ ప్రారంభ దినాలలో తాత్కాలిక మైన ఎదురు దెబ్బ, పరిణామం అనే అభిప్రాయం ఉండేది. అయితే అందరం అనుకున్నదాని కంటే నష్టం ఎక్కువగా కనిపిస్తోంది. మూడు దృశ్యాలను ఊహించుకోవచ్చు.
1.ఆశావహ దృశ్యం: ఆర్ధిక వ్యవస్ధ రానున్న ఏడాది కాలంలో సాధారణ స్ధితికి చేరుకోవచ్చు.భారత్‌లో నష్టం ప్రస్తుత పరిస్దితిని బట్టి తక్కువగా ఉండవచ్చు.
2.వాస్తవిక దృశ్యం : భారత ఆర్ధిక వ్యవస్ధ భారీ ఆర్ధిక మూల్యాన్ని చెల్లించవచ్చు. అయితే రెండు మూడు సంవత్సరాలలో పునరుద్దరణ అవుతుంది.ఈ మూల్యాన్ని ప్రయివేటు రంగమా, ప్రభుత్వమా, సాధారణ జనమా లేక ద్రవ్య వ్యవస్ధా ఎవరు చెల్లించాలన్నది పెద్ద అనిశ్చితంగా ఉంటుంది.
3.అత్యంత చెడు దృశ్యం : రాబోయే రోజుల్లో ఎలాంటి వ్యాక్సిన్‌ లేకుండా కొన్ని సంవత్సరాల పాటు వైరస్‌ ఉండవచ్చు. తలసరి ఆదాయం పడిపోయి, నిరుద్యోగం పెరిగిపోయి భారత్‌ కొన్ని సంవత్సరాలు వెనక్కు పోవచ్చు. కోలుకోవటానికి ఐదు సంవత్సరాల వరకు పట్టవచ్చు. రిలయన్స్‌ ఇండిస్టీస్‌ దాదాపు 20బిలియన్‌ డాలర్ల మేరకు నిధులు పెంచుకుంది. అన్ని ప్రధాన ప్రయివేటు బ్యాంకులు మరింత నగదును పెంచుకొనేందుకు చూస్తున్నాయి. జిఎంఆర్‌ ఇన్‌ఫ్రా నుంచి విద్యుత్‌ ఆస్ధులను కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను జెఎస్‌డబ్ల్యు రద్దు చేసుకుంది. స్నోమాన్‌ లాజిస్టిక్సును తీసుకోవాలనుకున్న అదానీ కూడా వెనక్కు తగ్గారు. ఇవన్నీ అదనపు జాగ్రత్తలు, ఆర్ధిక వ్యవస్ధకు తాకబోయే దెబ్బలను సూచిస్తున్నాయి. ప్రమోటర్ల కంటే మదుపుదార్లు ఎక్కువ ఆశాభావంతో ఉన్నారు” ఇవి ఆల్ఫా ఇన్వెస్కో విశ్లేషణలోని కొన్ని అంశాలు.
2008లో ధనిక దేశాల్లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభమే ఇంకా పూర్తిగా తొలగకపోగా ప్రభావం చూపుతుండగానే అంతకు ఎన్నో రెట్లు పెద్దదని భావిస్తున్న సంక్షోభం ఇప్పుడు మన ముందున్నది. ఈ నేపధ్యంలో మన నేతలు జనానికి వాస్తవాలు చెబుతున్నారా ? అసలు వాస్తవ పరిస్ధితి ఏమిటో ఒక్కసారి చూద్దాం.
వర్తమాన ఆర్ధిక సంవత్సరం(2020-21)లో తొలి మూడు మాసాలు గడచి పోయాయి. ఆర్ధిక వ్యవస్ద పురోగతికి కొలమానంగా పరిగణించే జిడిపి ఎంతశాతం పడిపోయిందో ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ ఆర్ధిక సంవత్సరంలో జిడిపి వృద్ధి 4.5శాతం తిరోగమనంలో ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) వేసిన అంచనాను మన ఆర్ధిక మంత్రిత్వశాఖ జూన్‌ నెలవారీ నివేదికలో ప్రస్తావించినట్లు వార్తలు వెలువడ్డాయి. గతంలో ఐఎంఎఫ్‌ వేసిన అంచనాలు అనేకం తప్పాయి. ఈ వార్త వెలువడక ముందే తిరోగమనం 6.4శాతం వరకు ఉండవచ్చని కేర్‌ రేటింగ్స్‌ సంస్ధ పేర్కొనగా మరికొన్ని అంచానాలు ఐదుశాతానికి ఎక్కువే ఉండవచ్చని జోశ్యం చెప్పాయి.ప్రపంచ సగటు తిరోగమనం 4.9శాతంగా ఐఎంఎఫ్‌ పేర్కొన్నది.
ఒక ప్రామాణిక సంస్దగా పేరున్న సిఎంఐయి(సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ) జూలై ఎనిమిది నాటి వెబ్‌ సైట్‌ సమాచారం ప్రకారం 2019 సెప్టెంబరుతో ముగిసిన మూడు మాసాల కాలంలో కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనల విలువ రూ.2.3లక్షల కోట్లు కాగా డిసెంబరునాటికి అవి 5.15, మార్చినాటికి 3.37 లక్షల కోట్లుగా ఉండగా 2020 జూన్‌ నాటికి అది కేవలం 56వేల కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఇక పూర్తయిన ప్రాజెక్టుల పరిస్ధితిని చూస్తే పైన పేర్కొన్న మాసాలలో వరుసగా 0.85, 1.65, 1.70, 0.17 లక్షల కోట్లుగా ఉన్నాయి. అన్నింటి కంటే మార్చినెలతో ముగిసిన మూడు మాసాలలో నిలిపివేసిన ప్రాజెక్టుల విలువ రూ.9.24 లక్షల కోట్లంటే కరోనాతో నిమిత్తం లేకుండానే దేశంలో ఆర్ధిక దిగజారుడు ఎలా ఉందో సూచిస్తోంది. అందువలన ఎవరైనా కరోనాను సాకుగా చూపుతున్నారంటే వాస్తవ పరిస్ధితిని మరుగుపరుస్తున్నట్లే ! మూసిపెడితే పాచి పోతుందన్న సామెత తెలిసిందే. దేశంలో ఇప్పుడు అదే జరుగుతోందా ?
దేశంలో వలస కార్మికుల సంఖ్య ఎంతో మన ప్రభుత్వాల దగ్గర సమాచారం లేదన్నది కరోనా బయట పెట్టిన ఒక చేదు నిజం. అంటే ఎందరికి ఉపాధికల్పించారో కూడా అనుమానమే, కాకి లెక్కలు లేదా అంచనాలు తప్ప వాస్తవ పరిస్ధితిని అవి ప్రతిబింబించవు. సిఎంఐయి సమాచారం ప్రకారం ఏప్రిల్‌, మే నెలలో 23.5శాతానికి చేరిన నిరుద్యోగం జూన్‌ మాసంలో 11శాతం ఉంది. ఇది కరోనాకు ముందు అక్టోబరునెలలో ఉన్న గరిష్ట 8.2శాతానికి ఎక్కువ అన్నది తెలిసిందే. నిరుద్యోగం పెరిగినపుడు వేతనాలు తగ్గిపోవటం అన్నది సాధారణ సూత్రీకరణ. అసలు సమాచారమే సేకరించే యంత్రాంగమే అస్తవ్యస్తం అయిన స్ధితిలో సరైన గణాంకాలు కూడా లేవంటే అతిశయోక్తి కాదు.ఎలక్ట్రానిక్‌ వే బిల్లుల విలువ మొత్తం జూన్‌ నెలలో రూ.11.4 లక్షల కోట్లని ఆర్ధిక వ్యవస్ధ తిరిగి కోలుకుంటోందని కొన్ని విశ్లేషణలు వెలువడుతున్నాయి. నిజంగా కోలుకుంటే సంతోషించని వారెవరు ? అంతకు ముందు పూర్తి లాక్‌డౌన్‌ విధించటం, జూన్‌లో గణనీయంగా సడలించిన కారణంగా ఈ పెరుగుదల ఉండవచ్చు. సాధారణ స్ధితి నెలకొన్న తరువాత గతంతో పోల్చినపుడు వాస్తవాలు వెల్లడి అవుతాయి.
చరిత్రలో తొలిసారిగా ప్రపంచమంతటా 2020లో ఆర్ధిక పురోగతి తిరోగమనంలో ఉండబోతున్నదని ఐఎంఎఫ్‌ జోశ్యం చెప్పింది. ఇదే సమయంలో చైనాలో ఒకశాతం అభివృద్ధి ఉంటుందని చెప్పింది. చైనా ప్రభుత్వం ఈ ఏడాది జిడిపి వృద్ధి రేటు లక్ష్యాన్ని నిర్దేశించటం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే.ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఉన్న చైనాను విస్మరించటం సాధ్యం కాదు. అందువలన ప్రతి సంస్ద లేదా ప్రధాన దేశాలన్నీ దాని అభివృద్ధి గురించి తమ తమ అంచనాలను వెల్లడిస్తూనే ఉన్నాయి.చైనా ఆర్ధిక సంవత్సరం జనవరితో ప్రారంభమౌతుంది. తొలి మూడుమాసాల్లో 6.8శాతం తిరోగమనంలో ఉన్నది కాస్తా ఏప్రిల్‌-జూన్‌ మాసాల్లో 1.1శాతం పురోగమనంలోకి వచ్చినట్లు జపాన్‌ నికీ తెలిపింది. ఏడాది సగటు 3.3శాతం ఉండవచ్చని తొలుత అంచనా వేసినప్పటికీ దాన్ని ఇప్పుడు 1.6శాతానికి తగ్గించారు. మరో ఆరు నెలల్లో ఏమి జరగనుందో చూడాల్సి వుంది. లాక్‌డౌన్‌ తరువాత పూర్తి స్ధాయిలో అక్కడ ఆర్ధిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి గనుకనే తిరోగమనం నుంచి పురోగమనంలోకి వచ్చింది. మన వ్యవస్ద లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తరువాత పురోగమనం నుంచి తిరోగమనంలో జారనున్నట్లు జోశ్యాలు వెలువడుతున్నాయి, ఎంత తేడా !
మన ఆర్ధిక వ్యవస్ధ విషయానికి వస్తే కరోనా ఉద్దీపనగా ప్రకటించిన 21లక్షల కోట్ల పాకేజి ఏమైందో తెలియదు. లడఖ్‌ లడాయితో పాలకులు, వారి కనుసన్నలలో మెలిగే ప్రధాన స్రవంతి మీడియా రోజుకో కొత్త కథతో కాలక్షేపం చేస్తోంది. జనంలో ప్రమాదకరమైన జాతీయ భావనలను రెచ్చగొడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు గణనీయంగా పడిపోనందున మిగులు ఏమైందో తెలియదు, జనం మీద మోపిన చమురు పన్నులు, ధరల పెంపు రాబడి ఎటుపోయిందో తెలియదు.గత ఏడాదితో పోలిస్తే తొలి మూడునెలల్లో తెచ్చిన అప్పులు 51శాతం పెరిగాయి, రాష్ట్రాలూ అదే బాటలో ఉన్నాయి.
నిరుద్యోగ సమస్య విషయానికి వస్తే మూడుపదుల లోపు యువతీ యువకులు పెద్ద ఎత్తున కరోనా కారణంగా తలెత్తే నిరుద్యోగ బాధితులుగా ఉంటారని ఆర్ధికవేత్తలు చెబుతున్నారు. అనేక మంది పట్టణాల్లో ఉండే ఖర్చులను భరించలేక, ఉపాధి లేక గ్రామాలకు తరలి పోయారు. మూడు పదుల లోపు యువతీ యువకులు నైపుణ్యం తక్కువగా ఉండే ఉపాధివైపు ముందుగా మొగ్గుచూపుతారు,పనిలో కొంత నైపుణ్యం సాధించిన తరువాత మెరుగైన ఉపాధిని చూసుకుంటారు. అర్ధిక తిరోగమన, కరోనా మహమ్మారుల వంటి సమయాల్లో యజమానులు ఇలాంటి వారితో ప్రయోగాలు చేసేందుకు సిద్ధ పడరు.కరోనా వైరస్‌ ఎంతకాలం ప్రభావం చూపుతుందో ఎందరిని బలిగొంటుందో తెలియదు గానీ దాని సంక్రమిత సమస్యలు దశాబ్దాల పాటు ఉంటాయని అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ఐఎల్‌ఓ) హెచ్చరించింది. వంతుకు విరుద్ధంగా ప్రతి ఆరుగురిలో ఒకరు లేదా 17శాతం మంది యువత మహమ్మారికి ప్రభావితులై ఉపాధి కోల్పోయారని తన తాజా నివేదికలో పేర్కొన్నది. మన దేశంలో అది ఇంకా ఎక్కువగా ఉన్నట్లు అంచనా.2018-19లో 15-29 సంవత్సరాల వయస్సులోని వారు 17.3శాతం మంది నిరుద్యోగులుగా ఉంటే ఈ ఏడాది మేనెలలో వారు 41శాతం ఉన్నట్లు, 2.7 కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయినట్లు సిఎంఐయి తెలిపింది. యువతరం పొదుపు చేయలేనట్లయితే అది తరువాతి తరం మీద కూడా ప్రభావం చూపుతుందని సంస్ధ అధికారి మహేష్‌ వ్యాస్‌ చెప్పారు. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం ప్రతి నెలా 13లక్షల మంది పని కావాల్సిన వారిలో చేరుతున్నారు. ప్రస్తుతం దేశంలోని జనాభా తీరుతెన్నులను చూసినపుడు 2040 వరకు పని చేసే వయస్సు వారు తమ మీద ఆధారపడే పిల్లలు, వృద్ధుల కంటే ఎక్కువగా ఉంటారని అయితే కరోనా కారణంగా ఈ పరిస్ధితి వలన కలిగే లబ్దిని కోల్పోతారని, వారికి ఉపాధి కల్పించకపోతే లబ్ది కాస్తా నష్టంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. కరోనాకు ముందే యువతకు ఉపాధి కష్టంగా మారిన దేశాల్లో ఒకటిగా మన దేశం మారిన విషయం తెలిసిందే. నాలుగుదశాబ్దాల నాటి నిరుద్యోగ రికార్డును బద్దలు కొట్టటం, లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఆ నివేదికను తొక్కిపెట్టటం, బయటకు వచ్చినా తప్పుడు లెక్కలని బుకాయించి తరువాత అవి సరైనవే అని చెప్పిన విషయం తెలిసిందే. నిరుద్యోగం పెరిగినపుడు జీతం ఎంతని కాదు ముందు ఏదో ఒక పని చేయాలనే యావతతో తక్కువ వేతనాలకు యువత సిద్దపడే విషయం తెలిసిందే. తమ తలిదండ్రుల కంటే తక్కువ సంపాదించే దుస్ధితికి లోనవుతారు.
ఏదో ఒక డిగ్రీ చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూసిన వారు 2018లో ఆరుశాతం ఉంటే ప్రస్తుతం 12.7శాతం ఉన్నారు. మన వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు పారిశ్రామిక ఉత్పాదక, నిర్మాణ రంగాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతారు.2012 నుంచి అటువంటి పెట్టుబడులు తగ్గిపోతున్నాయని అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం ఒక అధ్యయనంలో తెలిపింది.2016 నుంచి చూసినపుడు మన దేశంలో 40.5 కోట్ల ఉద్యోగాలకు అటూ ఇటూగా ఉండటం తప్ప పెరుగుదల లేదు. పెద్ద నోట్ల రద్దు, నాన్‌ బ్యాంకింగ్‌ రంగంలో సంక్షోభం, కంపెనీలు కొత్త సామర్ధ్యాన్ని పెంచేందుకు వీలుగా పెట్టుబడులు పెట్టే పరిస్ధితి లేకపోవటం, దాంతో కొత్త ఉద్యోగాలు లేకపోవటాన్ని చూస్తున్నాము. సులభతర వాణిజ్య సూచికను ఏటేటా మెరుగు పరుస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పటం తప్ప 2019 జూన్‌ నాటికే వాణిజ్యం చేయాలన్న సంకల్పం పదేండ్ల నాటి కంటే తక్కువ స్ధాయికి పడిపోయినట్లు ఒక సంస్ధ సర్వే వెల్లడించింది. కార్పొరేట్‌ పన్నుల తగ్గింపు, బ్యాంకుల్లో నగదు లభ్యత పెంపు వంటి చర్యలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. జనంలో కొనుగోలు శక్తి ఎంతగానో క్షీణించిందన్న అంశం తెలిసిందే. సరైన ఉద్యోగాలు, సరైన వేతనాలు లేకపోతే జనం కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. మన జనాభా గణనీయంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది. వ్యవసాయ రంగంలో తలెత్తిన సంక్షోభం వారి కొనుగోలు శక్తిని మరింత దెబ్బతీసింది.
దేశ ఆర్ధిక విషయాలకు వస్తే కేంద్ర ప్రభుత్వం వాస్తవ పరిస్ధితిని దాచేందుకు ప్రయత్నిస్తోంది.2019-20 ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి 19.6లక్షల కోట్ల రూపాయల మేర ఆదాయం వస్తుందని అంచనా వేశారు. తరువాత దాన్ని 18.5లక్షల కోట్లకు సవరించారు. కానీ వాస్తవంగా వచ్చింది 16.8లక్షల కోట్లేనని తేలింది. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే అంతకు ముందు సంవత్సరం కంటే వాస్తవ ఆదాయం తగ్గింది. అంటే అసలు జబ్బు కరోనా వైరస్‌ కంటే ముందే ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలతో నిమిత్తం లేకుండా కేంద్ర ప్రభుత్వం చమురు పన్ను, ధరలను పెంచుతున్నది. ఈ అడ్డగోలు చర్యల గురించి ప్రధాని నరేంద్రమోడీ నోరు విప్పరు. ఏ విధాన ప్రాతిపదికన ధరలను పెంచుతున్నారో చెప్పని ఒక నిరంకుశ వైఖరి తప్ప మరొకటి కాదు. ఎలాంటి కసరత్తు లేదా సరైన అంచనాలు లేకుండా ప్రారంభించిన జిఎస్‌టితో తలెత్తిన సమస్యలు అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాలను ఇబ్బందుల్లోకి నెట్టాయి. అవి జనం చావుకు తెచ్చాయంటే అతిశయోక్తి కాదు. చమురు ఉత్పత్తుల మీద పెంచిన అదనపు పన్ను లేదా ధర ద్వారా వచ్చిన ఆదాయం దేనికి ఖర్చు చేస్తారో చెప్పరు.
కార్పొరేట్‌ శక్తులకు ఇచ్చిన పన్ను రాయితీల కారణంగా ప్రత్యక్ష పన్నుల రూపంలో వస్తున్న ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. పోనీ ఈ మేరకు లబ్ది పొందిన కార్పొరేట్లు తిరిగి ఆ సొమ్మును పెట్టుబడి పెట్టి ఉపాధి కల్పించే ప్రాజెక్టులను చేపడుతున్నాయా అంటే అదీ లేదు.2018-19లో వసూలైన రూ.11.36లక్షల కోట్ల పన్ను మొత్తం 2019-20కి రూ.10.49 లక్షల కోట్లకు తగ్గింది. ఉద్దీపన పేరుతో కార్పొరేట్‌ పన్ను, దానికి సెస్‌, సర్‌ఛార్జి 34.61శాతంగా ఉన్నదానిని 25.17కు తగ్గించారు. 2019 అక్టోబరు ఒకటి తరువాత ఉనికిలోకి వచ్చే సంస్ధలకు ఆ పన్నును 17.01శాతంగా నిర్ణయించారు. ఇక పరోక్ష పన్ను అయిన జిఎస్‌టి విషయానికి వస్తే అంచనా వేసిన విధంగా లేదా కోరుకున్న విధంగా ఏటా 14శాతం పెరగటం లేదు. పధకం ప్రారంభంలో ఉన్న ఆదాయాల ప్రాతిపదికన రాష్ట్రాలకు ఏటా 14శాతం వంతున పన్ను ఆదాయం పెరగకపోతే తగ్గిన మేరకు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే సెస్‌ మొత్తం నుంచి చెల్లిస్తామన్నది రాష్ట్రాలకు చేసిన వాగ్దానం. అంటే కనీసం ఏటా 14శాతం పెరుగుతుందనే అంచనాతో దీన్ని ప్రారంభించారని అనుకోవాలి.2019-20లో ఎనిమిది శాతమే పెరిగాయి. జిఎస్‌టిని 2017జూలైలో ప్రారంభించారు. దేనికైనా కొన్ని ప్రారంభ సమస్యలు ఉంటాయని సరిపెట్టుకుందాం.అలాంటివి 2017-18 ఆర్ధిక సంవవత్సరంలోనే బయట పడ్డాయి. తరువాత సంవత్సరాలలో ఆదాయం తగ్గటానికి ఇంకా ప్రారంభ సమస్యలే అని చెప్పటం సమర్ధనీయం ఎలా అవుతుంది. దీన్ని మరొక విధంగా చెప్పాలంటే వైఫల్యం అనాలి. ఈ విధానం కారణంగా మద్యం, చమురు ఉత్పత్తుల వంటి కొన్నింటి మీద తప్ప మిగతా అంశాల మీద రాష్ట్రాలు పన్నులు విధించే లేదా తగ్గించే అవకాశాలు లేవు.
దీని పర్యవసానాలు ఇంకా పూర్తిగా ప్రభావం చూపటం లేదు. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు,జిఎస్‌టి వైఫల్యం, దేశంలో తలెత్తిన ఆర్ధిక మాంద్యం కారణంగా బడ్జెట్లలో భారీ లోటు ఏర్పడుతోంది. దాంతో కేటాయింపులకు కోతలు మొదలయ్యాయి. ఇప్పటికే అనేక సబ్సిడీలను ఎత్తివేశారు. ఎరువుల సబ్సిడీలను పరిమితం చేశారు. కొన్ని సంక్షేమ పధకాలకు కోతలు పెట్టారు, మిగిలిన వాటికి రానున్న రోజుల్లో కోతలు పెట్టటం తప్ప మరొక మార్గం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ లోటు బడ్జెట్‌లను పూడ్చుకొనేందుకు భారాలు మోపటం పెట్రోలియం ఉత్పత్తులతో ప్రారంభమైంది. అంతకు ముందే అనేక రాష్ట్రాలు ప్రభుత్వ రంగ సంస్ధలను తెగనమ్మి లోటును పూడ్చుకున్నాయి. ఈ అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును తిరిగి పెట్టుబడి పెడితే ఉపాధి పెరుగుతుందని సరిపెట్టుకోవచ్చు దానికి బదులు కేంద్ర ప్రభుత్వం లాభాలు రానివాటినే కాదు వచ్చే వాటిని కూడా వదలించుకొని లోటును పూడ్చుకొనేందుకు నిర్ణయించింది.
కేంద్రం లేదా రాష్ట్రాలు చమురు ఉత్పత్తులపై పన్నులను పెంచుతున్నాయి. ఇది ఆర్ధిక వ్యవస్దను మరింతగా దెబ్బతీయనుంది. అత్యధికంగా వినియోగమయ్యే డీజిల్‌ మీద గతంలో సబ్సిడీ ఇచ్చిన కారణంగా ధరలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు సబ్సిడీ ఎత్తివేశారు. ధరలు కూడా పెట్రోలు కంటే డీజిల్‌ మీద ఎక్కువ పెంచారు. దీనికి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు, ఎక్కువ ఆదాయం రావాలంటే ఎక్కువ వినియోగంలో ఉన్నదాని మీద పిండుకోవాలంతే ! ఆదాయపన్ను రేటు పెంచితే ధనికులకు ఆగ్రహం వస్తుంది కనుక దాని జోలికి పోరు. చమురు ధరలు పెంచితే అధిక భారం మోసేది సామాన్య, మధ్యతరగతి వారే. నిత్యావసర వస్తువుగా ఉన్న చమురు ధర పెరిగితే వినియోగం పెద్దగా తగ్గే అవకాశాలు లేవు. పరోక్షంగా దానికి చెల్లింపుల కారణంగా ఇతర వస్తువినియోగం మీద పడి, డిమాండ్‌ తగ్గుదలకు దోహదం చేస్తుంది. అది ఉత్పాదకత తగ్గేందుకు, ఉపాధి పరిమితం, నిరుద్యోగం అపరిమితం అయ్యేందుకు తోడ్పడుతుంది.ధరలు పెరుగుతాయి. ఈ విషయాలను దాచిపెట్టి జనం దృష్టిని మళ్లించేందుకు పాలకులు రకరకాల జిమ్మిక్కులకు పాల్పడుతున్నారు. ఇరుగుపొరుగు దేశాలతో వివాదాలు, అంతుబట్టని ఉగ్రవాద ఉదంతాలు వాటిలో భాగమే అని అనేక మంది నమ్ముతున్నారు. ఏతా వాతా చెప్పవచ్చేదేమంటే ప్రభుత్వాలు లోటుబడ్జెట్‌లను పూడ్చుకొనేందుకు ధనికుల మీద, కార్పొరేట్‌ పన్నుల ద్వారా పూడ్చుకోవాలి తప్ప జనం మీద భారాలు మోపితే అది మొత్తం ఆర్ధిక వ్యవస్ధనే దెబ్బతీస్తుంది. దేశంలో ఇప్పుడు జరుగుతోంది అదే. ఈ దివాలా కోరు, ప్రజావ్యతిరేక విధానాలకు ఇప్పుడు కరోనా మహమ్మారి తోడైంది. గతంలో విధానాల వైఫల్యం ధరలు, నిరుద్యోగం, దారిద్య్రం పెరుగుదల వంటి సమస్యలను ముందుకు తెచ్చింది. ఇప్పుడు ఈ రెండూ జమిలిగా జనాన్ని ఎలా దెబ్బతీస్తాయో ఊహించటం కష్టం !
గమనిక : ఈ విశ్లేషణ తొలుత 2020 జూలై 12వ తేదీ నవతెలంగాణా దినపత్రిక ఆదివారం అనుబంధం సోపతి ఆన్‌లైన్‌ ఎడిషన్‌లో ప్రచురితమైంది. దాని నవీకరణలో భాగంగా తాజా అంశాలు జోడించటమైంది.