Tags

, , ,


ఎం కోటేశ్వరరావు
దక్షిణ చైనా సముద్రంలో నౌకల స్వేచ్చా రాకపోకల పేరుతో అమెరికా యుద్ధానికి తలపడుతుందా? అమెరికా నౌకా దళాన్ని ఎదుర్కొనేందుకు చైనా అనివార్యంగా సాయుధ సమీకరణకు పూనుకోవాల్సి వస్తోందా ? ఇది ఏ కొత్త పరిణామాలకు నాంది కానుంది ? భారత్‌కు మద్దతుగా అమెరికా సైనిక బలగాలను తరలించిందా ? ఆ ప్రాంతంలో తలెత్తిన పరిణామాల ఫలితంగా వెలువడుతున్న అనేక ఊహాగానాలలో ఇవి కొన్ని మాత్రమే.
అమెరికాకు అగ్రాధిపత్యం అన్నది డోనాల్డ్‌ ట్రంప్‌ నినాదం. నవంబరులో ఎన్నికలంటూ జరిగితే తనకే అధికార పీఠం మరోసారి దక్కాలని కోరుతున్న ట్రంప్‌ ఓట్లకోసమే ఇదంతా చేస్తున్నారా అన్న అనుమానాలు ఉన్నాయి. కరోనా వైరస్‌ రోజు రోజుకూ మరింతగా అమెరికాను చుట్టుముడుతోంది. మిన్నువిరిగి మీద పడ్డా తాను ముఖతొడుగు ధరించేది లేదని ఇన్నాళ్లూ భీష్మించుకున్న ట్రంప్‌ ఆపని కూడా చేసి జనాల కళ్లు కప్పేందుకు పూనుకున్నారు. దక్షిణ చైనా సముద్రం, ఆ ప్రాంతంలో ఉన్న సంపదలన్నీ తనవే అని చైనా బెదిరింపులకు దిగిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఈనెల పదమూడవ తేదీన ఒక ప్రకటనలో ఆరోపించాడు. తన తీరం నుంచి పన్నెండు నాటికల్‌ మైళ్లు(22కిలోమీటర్లు) దూరానికి ఆవల ఉన్నవాటి మీద అధికారం తనదే అని చైనా అంటే కుదరదని, మలేషియాకు దగ్గరగా చైనాకు 1,852 కిలోమీటర్ల దూరంలో ఉన్న జేమ్స్‌ షావోల్‌ వంటి ప్రాంతాలు కూడా తనవే అని చైనా అంటోందని పాంపియో ఆరోపించాడు.
వాస్తవాలను, సముద్ర అంతర్జాతీయ చట్టాలను అమెరికా వక్రీకరిస్తోందని, పరిస్దితిని బూతద్దంలో చూపుతోందని చైనా విమర్శించింది. ఆ ప్రాంత దేశాలతో వివాదాలను నేరుగా, సామరస్య పూర్వకంగా పరిష్కరించుకొనేందుకు చైనా సిద్దంగా ఉన్నదని, వాటిలో అమెరికా లేదని పేర్కొన్నది. దక్షిణ చైనా సముద్రంలో పరిస్ధితి ప్రశాంతంగా ఉందని తెలిపింది.
ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికాకు ఎలాంటి ప్రమేయం లేనప్పటికీ ఆ ప్రాంత దేశాల ప్రయోజనాల పేరుతో అమెరికా తన యుద్ద నావలను దక్షిణ చైనా సముద్రంలోకి దింపి రెచ్చగొట్టేందుకు పూనుకుంది. దాన్ని ఎదుర్కొనేందుకు చైనా కూడా తన ప్రయత్నాలను తాను చేస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని అంతర్జాతీయ జలాల్లో అమెరికాకు చెందిన అణుశక్తితో పనిచేసే రెండు విమాన వాహక యుద్ద నౌకలు ఉన్నాయి. మూడవది దారిలో ఉంది. ఇవిగాక నాలుగు యుద్ద నౌకలు పరిసరాల్లో సంచరిస్తున్నాయి. ఆ సముద్రంలోని పార్సెల్‌, స్పార్టలే దీవుల ప్రాంతంలో చైనా కృత్రిమ దీవులను నిర్మించి తరచూ పెద్ద ఎత్తున తన నౌకా దళ విన్యాసాలను నిర్వహిస్తోంది. ఆ ప్రాంతంలో తమ మిత్రదేశాల నౌకలు స్వేచ్చగా తిరిగేందుకు మద్దతుగా, ప్రాంతీయ భద్రత కోసమే తమ యుద్ద నౌకలు ఉన్నాయి తప్ప వేరే కాదని అమెరికా చెప్పుకుంటోంది. అమెరికా విమానవాహక, ఇతర యుద్ద నౌకల సంచారం తమ ప్రజావిముక్తి సైన్యానికి(చైనా మిలిటరీ) సంతోషం గలిగించేదేనని, క్షిపణులను కూల్చివేసే విమాన వాహక నౌకలతో సహా అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని చైనా వ్యాఖ్యానించింది.ఈ ప్రాంతానికి చెందని వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న కొన్ని దేశాలు బల ప్రదర్శన చేస్తున్నాయని పేర్కొన్నది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతం నుంచి నౌకలు, వైమానిక మార్గాల ద్వారా ఏటా ఐదులక్షల కోట్లడాలర్ల మేర వాణిజ్య లావాదేవీలు జరుగుతున్నాయని అంచనా.
జూన్‌ నెలలో దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, జపాన్‌ మిలిటరీ సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. (జపాన్‌కు అధికారికంగా మిలిటరీ లేనప్పటికీ ఆత్మ రక్షణ దళాల పేరుతో ఉన్న వాటిని సాయుధం గావిస్తున్నది. ఏక్షణంలో అయినా పూర్తి మిలిటరీగా మార్చేందుకు వీలుగా ఉంది.)ఈనెల ఒకటి నుంచి ఐదు వరకు వార్షిక విన్యాసాల్లో భాగంగా చైనా సైనిక విన్యాసాలు నిర్వహించిన గ్జిషా(పార్సెల్‌) దీవుల చుట్టూ అమెరికా యుద్ద నౌకలు తిరుగుతున్నాయి. ఈ దీవులు, స్పార్టలే దీవులలో తమకూ వాటా ఉందని వియత్నాం, బ్రూనీ, ఫిలిప్పైన్స్‌, మలేషియా కూడా చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో చైనా సైనిక విన్యాసాల గురించి తాము దౌత్య పరమైన నిరసన తెలిపినట్లు ఈనెల రెండున వియత్నాం వెల్లడించింది. ఒక వేళ మిలిటరీ మధ్య ఘర్షణలు ప్రారంభమైతే అమెరికాకు మద్దతుగా జపాన్‌, ఆస్ట్రేలియా వస్తాయని, తమతో ఉన్న సంబంధాల రీత్యా వియత్నాం పాల్గొనకపోవచ్చని అయితే, తన అమెరికా సేనల రాకపోకలకు తమ సముద్ర ప్రాంతాన్ని అనుమతించవచ్చని చైనా అంచనా వేస్తోంది. ఏ దేశమూ పూర్తి విజయం సాధించలేదని చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌లో రాసిన ఒక విశ్లేషణలో పేర్కొన్నారు. చైనా తన భద్రత, ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో సమతూకాన్ని పునరుద్దరించేందుకు చైనా చేయాల్సిందంతా చేస్తోందని కూడా తెలిపారు. కృత్రిమ దీవులలో కొద్ది వారాల క్రితమే రెండు పరిశోధనా కేంద్రాలను వాటికి మద్దతుగా రక్షణ, మిలిటరీ ఏర్పాట్లు కూడా చేసింది. తాము అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించలేదని చైనా చెబుతోంది.
దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు పనేమిటి అన్న ప్రశ్నకు మేము ఇక్కడ ఉన్నాం లేదా చైనా నౌకలను అడ్డుకొనేందుకు అని చెప్పటమే అని సింగపూర్‌కు చెందిన నిపుణుడు ఇయాన్‌ స్టోరే వ్యాఖ్యానించాడు.తమ యుద్ద నౌకలు నిర్దిష్టంగా ఎక్కడ ఉన్నాయి అన్నది వెల్లడి కాకుండా అమెరికా జాగ్రత్తలు తీసుకుంది. అయితే మలేషియా తీరానికి రెండు వందల నాటికల్‌ మైళ్ల దూరంలో అవి ఉండవచ్చని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాటిని ఆస్ట్రేలియా ఫ్రైగేట్‌ పరమటా అనుసరిస్తున్నది. ముందుగా రూపొందించిన పధకం ప్రకారమే ఏడాది క్రితం నుంచి అది అమెరికా నౌకలను అనుసరిస్తున్నదని ఆస్ట్రేలియా మాజీ రక్షణ అధికారి జెన్నింగ్స్‌ చెప్పారు. ఆ ప్రాంతం మీద తమకు హక్కు ఉన్నట్లు మలేసియా, చైనా, వియత్నాం వాదిస్తున్నాయి. అమెరికా విమాన వాహక నౌక థియోడర్‌ రూజ్‌వెల్ట్‌ ఈ ఏడాది ప్రారంభం నుంచే తిరుగుతున్నది, అయితే కరోనా వైరస్‌ కారణంగా ఒక నావికుడు మరణించటం, వందలాది మంది బాధితులుగా మారటంతో ప్రయాణం నిలిచిపోయింది. ఇతర అమెరికా యుద్ద నౌకల పరిస్ధితి కూడా అదే విధంగా ఉంది.
గాల్వాన్‌ లోయలో భారత-చైనా మిలటరీ వివాదం తరువాత భారత్‌కు మద్దతుగా తాముంటామని అమెరికా ముందుకు వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ నావలు దానిలో భాగమే అన్నట్లుగా ఒక భాగం మీడియా చిత్రించింది. నిజానికి వాటికీ గాల్వాన్‌ లోయ వివాదానికి సంబంధం లేదు. అయితే ఆసియాలో ప్రాంతీయ శక్తిగా రూపొందాలంటే చైనాను ఎదుర్కొనేందుకు భారత్‌ ముందుకు రావాలని అప్పుడు అమెరికా మద్దతు ఇస్తుందని, ఇందుకు గాను అమెరికా సాయం, సాంకేతిక పరిజ్ఞానం పొందితేనే సాధ్యమని వాషింగ్టన్‌ కేంద్రంగా పని చేసే ఒక అమెరికన్‌ సంస్ధ డైరెక్టర్‌ అపర్ణా పాండే రెండు వారాల క్రితమే సలహా ఇచ్చారు.
రెండవ ప్రపంచయుద్ద సమయంలో చైనా అత్యంత బలహీనమైన మిలిటరీతో ఉన్నది. జపాన్‌ దురాక్రమణనే అది ఎదిరించలేకపోయింది. ఇంతవరకు సముద్రంలో అమెరికా-చైనా నౌకా యుద్దంలో తారసిల్లిన ఉదంతం లేదు.అమెరికా ఒక మిలిటరీ శక్తిగా ఇప్పటికీ అగ్రస్ధానంలో ఉన్నప్పటికీ ప్రాంతీయ యుద్దాలలో దానికి చావుదెబ్బలు తగిలాయి తప్ప విజయాలేమీ లేవు. కొరియా యుద్దంలో చైనా సత్తా ఏమిటో అమెరికాకు తెలిసి వచ్చింది. అప్పటితో పోల్చుకుంటే ఎంతో బలపడిన చైనాతో ఇప్పుడు తలపడుతుందా అన్నది ఒక ప్రశ్న. ఇటీవలి కాలంలో ముఖ్యంగా గత దశాబ్దిలో చైనా వైమానిక, నౌకాదళంలో చోటు చేసుకున్న మార్పులు, బలం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. అయితే చైనాకు పెద్దగా యుద్ద అనుభవం లేదు, అందువలన దానికి బలం ఉన్నా తామే పైచేయి సాధిస్తామని అమెరికా అనుకుంటోంది. అమెరికా పెద్ద ఆర్దిక శక్తిగా ఉన్నా వేల మైళ్ల దూరం నుంచి చైనాను ఎదుర్కొని తమను ఆదుకొంటుందని ఆసియా ప్రాంత దేశాలు భావించటం లేదు. అందువల్లనే అటుచైనా ఇటు అమెరికా వైపు మొగ్గేందుకు జంకుతున్నాయని చెప్పాలి. దానికి తోడు అనేక దేశాలతో ఇటీవలి కాలంలో చైనా కుదుర్చుకున్న ఒప్పందాలు, మిలిటరీ కేంద్రాల ఏర్పాటును చూసిన తరువాత అమెరికాను నమ్మి ప్రస్తుతానికైతే ఘర్షణ పడేందుకు సిద్దంగా లేవు. దక్షిణ చైనా సముద్రంలో అమెరికా ఎన్ని యుద్ద నావలను దించిందో దాని ధీటుగా చైనా బలగాలు కూడా ఉన్నాయని, పరిస్ధితి ఎంత పోటా పోటీగా ఉందంటే ఒక సందర్భంలో చైనా నావకు అత్యంత సమీపానికి అమెరికా నావ వచ్చినపుడు రెండువైపులా ఎంతో సంయమనం పాటించినట్లు ఒక చైనా మిలిటరీ అధికారి వెల్లడించారు. అయితే కరోనా మహమ్మారి సమయంలో కూడా అమెరికా రెచ్చగొడుతున్న తీరును దాని తెగింపుకు నిదర్శనమని చైనా భావిస్తోంది. మన దేశంతో చైనా సరిహద్దు వివాదం ప్రారంభంగాక ముందే ఏప్రిల్‌, మే నెలల్లోనే దక్షిణ చైనా సముద్రంలోకి అమెరికన్‌ నౌకల రాక ప్రారంభమైంది. సాధారణంగా కొన్ని నెలల ఏర్పాట్ల తరువాత గానీ అలాంటివి చోటు చేసుకోవు. అయితే ఈ నౌకల రాక నేపధ్యంలోనే మే నెలలో చైనాాభారత సరిహద్దు వివాదం చెలరేగటం వెనుక ఆంతర్యం ఏమిటన్నది సమాధానం లేని సందేహమనే చెప్పాలి.
అమెరికాాచైనా మధ్య పెరుగుతున్న వివాదం వివాదాస్పద దీవుల విషయంలో తాము చైనా మీద వత్తిడి తీసుకురాగలమని, ఆ పరిస్ధితి తమకు ప్రయోజనకరమే అని కొన్ని దేశాలు భావించవచ్చు గానీ అదే సమయంలో అవి యుద్దాన్ని కోరుకోవటం లేదు. ప్రపంచ వ్యాపితంగా కరోనా తెచ్చిన ఆర్ధిక సంక్షోభ భయం కూడా దీనికి తోడవుతున్నది కనుక అంతగా ఉత్సాహంగా లేవు. ప్రస్తుత పరిస్ధితుల్లో యుద్దం తమకు లాభమా నష్టదాయకమా అన్న అమెరికా యుద్ద పరిశ్రమల అంచనాను బట్టి కూడా పరిణామాలు ఉంటాయి. కరోనా వైరస్‌ సమస్యతో తీవ్ర ఆర్ధిక వడిదుడుకులకు గురైన చైనా అనివార్యమై అమెరికాను ఎదుర్కొనేందుకు తన జాగ్రత్తలు తాను తీసుకొంటోంది తప్ప యుద్ధానికి అది కూడా సిద్దం కాదనే చెప్పాలి.
సంచలనాత్మక కథనాలతో వీక్షకులను, పాఠకులను పెంచుకొనేందుకు మీడియా రాస్తున్న, చూపుతున్న కథనాలు, కొందరి విశ్లేషణలను చూస్తే ముంగిట యుద్దం ఉన్నదా అనే భ్రమ కలుగుతోంది. ఇప్పుడున్న స్ధితిలో కరోనా, దానితో కలసి వస్తున్న ఆర్ధిక సంక్షోభం నుంచి ఎలా బయటపడాలా అని ప్రతి దేశ పౌరుడూ ఎదురు చూస్తున్న తరుణంలో ఎవరైనా యుద్ధాన్ని కోరుకుంటారని అనుకోజాలం. అలాంటి యుద్దోన్మాదం, ఉన్మాదులను సమాజం సహించదు. ట్రంప్‌ సర్కార్‌ ఎంతగా రెచ్చగొట్టినా అది అధ్యక్ష ఎన్నికల లబ్ది కోసమే అన్నది బలమైన అభిప్రాయం, అందువలన ప్రస్తుతం యుద్దం వచ్చే అవకాశాలు పరిమితమే అని చెప్పవచ్చు.యుద్ద భేరీలు, నాదాలు చేసినంత మాత్రాన, మీడియా రెచ్చగొట్టుళ్లతో యుద్ధాలు జరగవు. అవన్నీ ఎత్తుగడల్లో భాగం కూడా కావచ్చు. అయితే సామ్రాజ్యవాద దేశాల తీరుతెన్నులను చూస్తే తాము సంక్షోభంలో పడినపుడు దాన్ని జనం మీద, ఇతర దేశాల మీద నెట్టివేసేందుకు యుద్ధాలకు పాల్పడినట్లు చరిత్ర చెబుతోంది. అందువలన అమెరికా ఆంతర్యాన్ని తక్కువగా అంచనా వేయకూడదు.