Tags
2020 China–India skirmishes, Ajith Doval, India-China border stand off, India-China disengagement
ఎం కోటేశ్వరరావు
విచారకరమైన లడఖ్ ఉదంతం తరువాత భారత్ – చైనా దేశాల మధ్య సరిహద్దులో శాంతి నెలకొల్పేందుకు చర్చలు జరిపి ఒక అంగీకారానికి వచ్చారు, ఇంకా కొనసాగుతున్నాయి. అంగీకరించిన మేరకు ఇరుపక్షాలు కట్టుబడి ఉన్నదీ లేనిదీ వెంటనే నిర్ధారించటం సాధ్యం కాదని పరిశీలకులు చెబుతున్నారు. రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్ లడఖ్ పర్యటనకు వెళ్లారు. ఇరు పక్షాలూ వెనక్కు తగ్గాలనే ఒప్పందం పూర్తిగా అమలు కాలేదు. పరస్పరం నమ్మకం కలిగేంతవరకు అది పూర్తి కాదు, దశలవారీ జరుగుతుంది. అయితే ఈలోపలే సామాజిక మీడియాలో చైనా భయపడిందనీ, భవిష్యత్‌లో దాడులు చేయబోమని వాగ్దానం చేసిందని, మోడీతో మాట్లాడాలని జింపింగ్ కోరితే తిరస్కరించారని ఇంకా ఏవేవో అబద్దాల ఫ్యాక్టరీల కట్టుకధల ఉత్పత్తులను జనానికి చేరవేస్తున్నారు. వాటి రచయితలు లేదా ఫలానా సంస్ధ ఆ విషయాలు చెబుతోందని గానీ లేదా ఆధారం ఫలానా అని గాని ఉండదు. బుర్రకు పని పెట్టకుండా వినేవారు చెవులప్పగిస్తే చెప్పేవారు హిమాలయాలంత అబద్దాన్ని కూడా ఎక్కించేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి ప్రయత్నంలో భాగం వదలిన సొల్లు కబుర్లతో కూడిన ఒక అనామక ఆంగ్ల పోస్టు గురించి చూడమని ఒక పాఠకుడు పంపారు. దానిలో ఏముందో చెప్పకుండా కేవలం విమర్శలను మాత్రమే వెల్లడిస్తే, ఏకపక్షంగా చర్చిస్తే చదువరులను ఇబ్బంది పెట్టినట్లు అవుతుంది. అలాంటి వాటి బండారాన్ని బయట పెట్టకపోతే నిజమే అని నమ్మే అవకాశం ఉంది. ఆంగ్లంలో ఉన్న దాని అనువాదాన్ని, బండారాన్ని చూద్దాం.సదరు పోస్టు దిగువ విధంగా ఉంది.
” వెల్లడైన గొప్ప రహస్యము
లడఖ్ నుంచి చైనా ఎందుకు ఉపసంహరించుకుంది ? పెద్ద యుద్దాన్ని మోడీ గారు వాయిదా వేశారు, లేనట్లయితే పాకిస్ధాన్ మరియు చైనా యుద్దానికి భారీ సన్నాహాలు చేసేవి- మొత్తం కుట్ర వివరాలు తెలుసుకోవాలని ఉందా ? జూలై ఐదవ తేదీకి పెద్ద ప్రాధాన్యత ఉంది, ఎందుకంటే చైనా, పాకిస్ధాన్, మరియు ఇరాన్ కూటమి భారత్ మీద దాడి చేసేందుకు పూర్తి సన్నాహాలు చేశాయి. ఒకేసారి దాడి చేయాలన్న విధానం ప్రకారం ఆ తేదీని ఖరారు చేశారు, దాని ప్రకారం పాకిస్ధాన్ సైన్యం కాశ్మీర్ మీద దాడి చేయాల్సి ఉంది. పాక్ సైన్యానికి సాయం చేసేందుకు చైనా సైనికులు పాకిస్ధాన్ చేరారు.అయితే భారత గూఢచార సంస్ధ( రా ) మరియు సిఐఏ మరియు మొసాద్‌లు ఈ దాడి గురించి పూర్తిగా తెలుసుకున్నాయి.
కనుక భారత సైన్యం కూడా పూర్తి సన్నాహాలను చేసింది. కనుకనే జూలై ఐదవ తేదీకి ముందే మోడీ లడఖ్ చేరుకొని సైన్యానికి పూర్తి స్వేచ్చ నిచ్చారు మరియు చైనాను భయపెట్టారు.ఎలాంటి చర్యలు జరగక ముందే జూలై ఐదవ తేదీ తెల్లవారు ఝామునే ఇరాన్ మీద ఇజ్రాయెల్ మెరుపుదాడి చేసి తనకు ముప్పు అనుకున్న ఇరాన్ వద్ద ఉన్న అన్ని ఆయుధాలను నాశనం చేసింది. ఈ దాడి కూడా మోడీ దౌత్యం కారణంగానే జరిగింది.మరోవైపు పాక్ మిలిటరీ అధికారులు కాశ్మీర్ మీద దాడి చేసేందుకు నిరాకరించారు, ఎందుకంటే భారత జలాంతర్గాములు కరాచీ సమీపానికి చేరుకున్నాయి మరియు దాడి చేసినట్లయితే అనేక వైపుల నుంచి దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పాకిస్ధాన్‌కు తెలియచేశారు, దీన్ని పాకిస్ధాన్ ఏ మాత్రం అంచనా వేయలేదు.
మోడీ అప్పటికే అన్ని అగ్రరాజ్యాలను విశ్వాసంలోకి తీసుకున్నారు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా,రష్యా అన్నీ మోడీకి బాసటగా నిలిచాయి. అమెరికా దక్షిణ చైనా సముద్రంలో తన యుద్ద నావను సిద్దంగా ఉంచింది. కంగారులో ఉన్న చైనా సంప్రదించేందుకు ప్రయత్నించింది. ఈ సారి సంప్రదింపుల బాధ్యతను అజిత్ దోవల్ (ప్రధాని జాతీయ భద్రతా సలహాదారు) తీసుకున్నారు. మోడీతో మాట్లాడాలని గ్జీ జింపింగ్ కోరారు. మాట్లాడేందుకు మోడీ తిరస్కరించారు. అందువల్లనే చైనా విదేశాంగ మంత్రి అజిత్ దోవల్‌తో మాట్లాడాల్సి వచ్చింది. దోవల్ స్ధాయి విదేశాంగ మంత్రి కంటే తక్కువ, భూతం వంటి ఈ అవమానాన్ని చైనా దిగమింగక తప్పలేదు. చైనా, ఇరాన్, పాకిస్ధాన్ ఉమ్మడిగా జూలై ఐదున తలపెట్టిన దాడి పధకాన్ని చైనా విదేశాంగ మంత్రికి అజిత్ దోవల్ అందచేశారు. అది చైనాను కలవరపరచింది, హిందీ భాయి భాయి అనేదాకా తీసుకు వచ్చింది, తన సైన్యాన్ని వెనక్కు తీసుకొనేందుకు అంగీకరించాల్సి వచ్చింది, భవిష్యత్‌లో దాడి చేయబోమని వాగ్దానం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు చైనా మీద పాక్ సైన్యం ఆగ్రహంతో ఉంది, ఎందుకంటే అది పాకిస్ధాన్‌ను వంటరిగా వదిలేసి పోతున్నది. మనం చైనాతో ఉద్రిక్తతలను తగ్గించినందుకు భారత్‌లోని ప్రతిపక్ష పార్టీ ఆగ్రహంతో ఉంది.
మనం యుద్దానికి ఎందుకు వెళ్లలేదు ? బహుశా కొన్ని తెలివి తక్కువ భారత ప్రతిపక్ష పార్టీలు ఒక వేళ యుద్దం జరిగితే, అదే చైనా దాడి కేవలం మోడీ మీదే కాదు యావత్ భారత్ మీద, భారతీయుల మీద ఉంటుందని మరచిపోయి ఉండవచ్చు. అలాంటి మనుషులకు మరియు దేశం వ్యతిరేకులకు(దేశభక్తి లేని జనం) దేవుడు జ్ఞానం ప్రసాదించాలి.
మోడీ గనుక విదేశాలకు వెళ్లి అగ్రరాజ్యాలతో స్నేహబంధం కుదుర్చుకోనట్లయితే భారత సైన్యాన్ని సాయుధులను గావించనట్లయితే నేడు భారత్‌లోని అనేక నగరాలు, సరిహద్దులలో బాంబుల మోతలు బుల్లెట్ల శబ్దాలు మోగుతూ ఉండి ఉండేవి. మన ప్రధాని మంచి తనానికి కృతజ్ఞతలు, ఆయన దౌత్యం కారణంగా నేడు మనం చైనా, ఇరాన్, పాకిస్ధాన్‌లతో ఐక్యంగా పోరాడటంలో విజయవంతమై వారిని వెనక్కు గొట్టాము.”
పగటి కలలా -వాస్తవాలు ఏమిటి?
నరేంద్రమోడీ వ్యక్తి పూజలో భాగంగా, మూఢ భక్తులు, అమాయక జనాన్ని నమ్మించేందుకు ఇలాంటి పోసుకోలు కబుర్ల సృష్టికి వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో పెద్ద అబద్దాల ఫ్యాక్టరీలు, వాటిలో కిరాయి రాతగాళ్లు వాటిని జనానికి పంచేందుకు కొన్ని వెబ్‌సైట్లు, వాట్సాప్ గ్రూపులూ ఉన్నాయి. ఊరూ పేరు, ఆధారాలు లేని రాతలను వారు రాస్తుంటారు. అబద్దం అయితే అచ్చుకాదు కదా అనే అమాయకులు ఇంకా ఉన్నారు. అన్నింటి కంటే జనాలకు జ్ఞాపకశక్తి ఉండదు గనుక ఏమి చెప్పినా నడుస్తుందనే గట్టినమ్మకం, ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజమై కూర్చుంటుందన్న గోబెల్స్ సూత్రాన్ని బాగా వంట బట్టించుకున్నారు గనుక ఇలాంటి ఆధారం లేని రాతలతో జనం బుర్రలను నింపేందుకు పూనుకున్నారు.
పైన పేర్కొన్న పోస్టు పచ్చి అబద్దం అనేందుకు ఒక పక్కా నిదర్శనం ఏమంటే ఇరాన్ మన మిత్ర దేశం, ఏ నాడూ ఇరాన్ గురించి నరేంద్రమోడీ గానీ మరొకరు గానీ చైనా, పాకిస్ధాన్‌తో కలసి మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నదని ఎన్నడూ చెప్పలేదు. మనం విదేశీమారక ద్రవ్య చెల్లింపుల ఇబ్బందుల్లో ఉన్నపుడు రూపాయలు తీసుకొని, వాయిదాల పద్దతిలో మనకు చమురు అమ్మిన దేశం. ప్రలోభాలు, వత్తిడికి లొంగిపోయి ఇరాన్ నుంచి చమురు కొనుగోలు నిలిపివేసి అమెరికా నుంచి కొనుగోలు చేస్తున్నాము. ఆదేశంతో కుదుర్చుకున్న రైలు మార్గ నిర్మాణ పధకాన్ని వదులుకున్నాము. అయినా ఇరాన్ మనతో సఖ్యతగానే ఉంటున్నది. అలాంటి దేశం మన మీద దాడికి ప్రయత్నించిందని, దాన్ని వమ్ముచేశామని చెప్పటం అమెరికా, ఇజ్రాయెల్ గూఢచార సంస్ధల కట్టుకధలను ప్రచారం చేయటం తప్ప మరొకటి కాదు. ఆ అబద్దాల పరంపరలోనే మోడీ దౌత్యం కారణంగా ఇజ్రాయెల్ మెరుపుదాడి చేసి ఇరాన్ ఆయుధాలన్నింటినీ నాశనం చేసిందనే అభూత కల్పనను ముందుకు తెచ్చారు. నిజానికి అంతటి తీవ్ర దాడి చేసినట్లు ఏ పత్రిక లేదా మీడియా గానీ వార్తలు ఇవ్వలేదు. జూలై ఐదవ తేదీన ఇరాన్‌లోని ఒక అణువిద్యుత్ కేంద్రంలో పేలుడు సంభవించిందనే చిన్న వార్త తప్ప మరొకటి లేదు.
దక్షిణ చైనా సముద్రంలో మనకు మద్దతుగా అమెరికా ఒక యుద్ద నౌకను సిద్ధంగా ఉంచిందని సదరు కథనంలో పేర్కొన్నారు.రాసిన వారికి కనీస వివరాలు కూడా తెలియదని ఇది తెలియ చేస్తోంది. పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారమే మూడు విమానవాహక నౌకలతో పాటు నాలుగు ఇతర యుద్ద నౌకలు అక్కడ తిష్టవేశాయి. అవన్నీ మనకోసమే అని, నరేంద్రమోడీకి లేని గొప్పతనాన్ని ఆపాదించటం తప్ప వాస్తవం కాదు. లడఖ్ ఉదంతం జూన్ 15న జరిగితే కొన్ని నౌకలు అంతకు ముందే ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. దారిలో ఉన్నవి తరువాత చేరాయి, అవి కూడా అంతర్జాతీయ జలాల్లో తిష్టవేశాయి తప్ప చైనా సమీపంలో కాదు. అగ్రరాజ్యాలన్నీ మోడీకి మద్దతు ఇచ్చాయని, మోడీ కారణంగానే ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి జరిపిందని చెప్పటం చూస్తే మన జనాన్ని ఎంత అమాయకులని ఆ రాతగాళ్లు భావిస్తున్నారో వేరే చెప్పనవసరం లేదు.
ఇక చైనా భయపడిందని చెప్పటాన్ని చూస్తే అలాంటి పిచ్చి ఊహలు, విషయాలు నవ్వు తెప్పిస్తున్నాయి. చైనా మిలిటరీ అమెరికా బెదిరింపులనే ఖాతరు చేయటం లేదు, దాని కంటే బలహీనమైన మన మిలిటరీ గురించి భయపడుతున్నదని, భవిష్యత్‌లో దాడి చేయబోమని వాగ్దానం చేసిందని చెప్పటం అతిశయోక్తి, జనాల చెవుల్లో పూలు పెట్టటమే. వాటిని నమ్మటం అమాయకత్వం.
తాజాగా సరిహద్దుల్లో రెండు దేశాల సైన్యాలు వెనక్కు తగ్గటం గురించి అనేక విషయాలు, అస్పష్టమైన సమాచారం మాత్రమే మీడియాలో వస్తున్నది. మీరూ వెనక్కు తగ్గండి-మేమూ వెనక్కు తగ్గుతాం, రెండు దేశాల వాస్తవాధీన రేఖకు అటూ ఇటూ రేండేసి కిలోమీటర్ల వెడల్పున తటస్ధ ప్రాంతాన్ని ఏర్పాటు చేద్దామని, ఆ మేరకు వెనక్కు తగ్గుదామని అంగీకరించినట్లు వార్తలు తెలుపుతున్నాయి. బిజెపి నేతలు లేదా వారి పాకేజ్‌లతో బతికే మీడియా, కొంత మంది వ్యాఖ్యాతలు ఏమి చెబుతున్నారో వినండి, అదే సమయంలో భిన్న గళాలను కూడా గమనంలోకి తీసుకున్నపుడే వాస్తవాలేమిటో ఎవరికైనా అవగతం అవుతుంది. మన దేశంలో మిలిటరీ, వ్యూహాల గురించి రాస్తున్న ప్రముఖుల్లో ఒకరు బ్రహ్మ చెలానే. ఆయన రాసిన వాటన్నింటితో ఏకీభవించాలని లేదు తిరస్కరించాలని లేదు. తాజాగా సరిహద్దుల్లో భారత్-చైనాల మిలిటరీ వెనక్కు తగ్గటం గురించి ఆయన అనేక అంశాలు రాశారు, ట్వీట్లు చేశారు. వాటిలో ఇలా పేర్కొన్నారు ” 2020లో వెనక్కు తగ్గటం -2017లో డోక్లాంలో వెనక్కు తగ్గిన – మాదిరే అయితే వ్యూహాత్మక స్ధాయిలో చైనా విజయం సాధించటానికి అనుమతించినట్లే. పరువు దక్కిందని భారత్ తృప్తి పడటమే. తదుపరి చైనా దురాక్రమణ దారుణంగా ఉంటుంది. పోరాడ కుండా విజయం సాధించటం అనే సన్ జు పద్దతిలో ఒక్క తూటాను కూడా కాల్చకుండా 2017లో వ్యూహాత్మకమైన డోక్లాం పీఠభూమిని చైనా పట్టుకుంది. 2017లో చైనాను సులభంగా వదలి పెట్టటం ద్వారా ప్రస్తుత చైనా బహుముఖ దురాక్రమణను భారత్ ఆహ్వానించింది. డోక్లాం తమదని చెప్పిన భూటాన్ దాన్ని ఎలా కోల్పోయిందో నేను 2018లో రాసిన దానిలో పేర్కొన్నాను.”
” పోరు లేకుండానే చైనా విజయం సాధించవచ్చు ” అనే శీర్షికతో అదే బ్రహ్మ చెలానే హిందూ స్తాన్ టైమ్స్ జూలై తొమ్మిదవ తేదీ సంచికలో ఒక విశ్లేషణ రాశారు. డోక్లాం మాదిరి వెనక్కు తగ్గటం అంటే చైనాను స్పష్టమైన విజేతను కావించినట్లే అని పేర్కొన్నారు. భారత్ కోరినట్లుగా వివాదానికి పూర్వపు స్ధితి నెలకొనే అవకాశం సుదూరంగా ఉంది. తాత్కాలికమే అయినా తటస్ధ ప్రాంత ఏర్పాటుకు భారత్ అంగీకరించటం అంటే అది చైనాకు అనుకూలమైనది, తనది అని కొత్తగా చెబుతున్న గాల్వాన్ లోయ నుంచి భారత్‌ను చైనా బయటకు పంపుతున్నది. పది మైళ్లు ముందుకు – ఆరు మైళ్లు వెనక్కు అన్న వ్యూహాన్ని చైనా అనుసరిస్తున్నది అని చెలానే పేర్కొన్నారు. చైనా మూడడుగులు ముందుకు వేసి రెండడుగులు వెనక్కు తగ్గే ఎత్తుగడను అనుసరిస్తున్నదని, పరస్పరం వెనక్కు తగ్గాలనే ఒప్పందంతో భారత్ మరికొంత ప్రాంతాన్ని కోల్పోతున్నదని బిజినెస్ స్టాండర్డ్ పత్రిక తన సంపాదకీయంలో వ్యాఖ్యానించింది.
ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక ఆర్గనైజర్ మాజీ సంపాదకుడు, బిజెపి వ్యూహకర్త అయిన శేషాద్రి చారి జూలై 16వ తేదీన దక్కన్ హెరాల్డ్ పత్రికలో ” తటస్ధ ప్రాంతమా లేక నూతన వాస్తవాధీన రేఖా ? ” అనే శీర్షికతో మణిపాల్ విద్యా సంస్ధ ప్రొఫెసర్ అరవింద కుమార్‌తో కలసి సంయుక్తంగా రాసిన వ్యాసంలో ఆసక్తికరమైన అంశాలు పేర్కొన్నారు. ” ఉనికిలో లేని నూతన తటస్ధ ప్రాంతాలను అంగీకరించటమంటే వాస్తవాధీన రేఖ గురించి భారత దృష్టిలో పెనుమార్పు వచ్చినట్లు కనిపించటాన్ని కాదనలేము.రెండు సైన్యాలూ నోరు విప్పటం లేదు. అలాగే ఢిల్లీ, బీజింగ్ రాజకీయ వ్యవస్ధలు కూడా అలాగే ఉన్నాయి. వారి అగ్రనేత తన పౌరులకు జవాబుదారీ కాదు కనుక చైనా వైపు నిశ్శబ్దం, అస్పష్టతలను అర్ధం చేసుకోవచ్చు.భారత వైపు చూస్తే మిలిటరీ రహస్యం అనే ముసుగు కప్పుకున్నందున సమాచారం బయటకు రావటం లేదు, ఇది కూడా అర్ధం చేసుకో దగినదే ( ఆహా ఏమి కుతర్కం ! తాము చేసేది సంసారం, అదే ఎదుటి వారు చేస్తే వ్యభిచారం-చైనా వారికి మిలిటరీ రహస్యాలు ఉండవా ?) తటస్ధ ప్రాంతాలు వాస్తవాధీన రేఖ వెంట నూతన యథాతధ స్ధితిగా మారనున్నాయా అన్నది పెద్ద భయం. అది భారత భద్రతకు పూర్తి ముప్పుగా మారుతుంది. ముఖ్యమైన విషయం ఏమంటే వాస్తవంగా వెనక్కు తగ్గటం గురించి తనిఖీ లేదు. ఎలాంటి చొరబాట్లు లేవని ప్రభుత్వం అధికారికంగా చెబుతున్నందున ఉపసంహరణ సమస్య ఉత్పన్నం కాదు. ఇంకా, ఒక వేళ రెండు సైన్యాలు సరిహద్దులో కొన్ని ప్రాంతాలు, పోస్టుల వద్ద మోహరిస్తే వాటిని నూతన వాస్తవాధీన రేఖగా భాష్యం చెప్పవచ్చు. పరిస్ధితి చక్కబడి, సాధారణ పరిస్ధితులు తిరిగి నెలకొంటేనే విషయాలు తెలుస్తాయి.”
పైదాని అర్ధం ఏమిటి ? భారత్‌కు చైనా లొంగిపోయినట్లా , మోడీకి జింపింగ్ భయపడినట్లా ? జూలై 18వ తేదీ హిందూ పత్రికలో భద్రతా సంస్ధల నుంచి సేకరించిన సమాచారంతో రాసిన వార్త మరింత ఆసక్తికరంగా ఉంది. పెట్రోలింగ్ పాయింట్ (పిపి)15 వద్ద భారత్ వైపు ఒక దశలో చైనీయులు 5కిలోమీటర్ల వరకు మేనెలలో చొచ్చుకొని వచ్చారు. వెనక్కు తగ్గాలనే ప్రణాళిక ప్రకారం చైనీయులు రెండున్నర కిలోమీటర్లు వెనక్కు తగ్గారు,తరువాత ఒక కిలోమీటరు తగ్గారు, ఇంకా ఒకటిన్నర కిలోమీటర్లు వెనక్కు పోవాల్సి ఉంది. ఈ ప్రాంతంలో భారత సైన్యం కూడా రెండున్నర కిలోమీటర్లు వెనక్కు తగ్గాలి. మన మిలిటరీ అధికారులు చెప్పారని రాసినదాని ప్రకారం ఐదు కిలోమీటర్ల వరకు చైనీయులు చొచ్చుకు వచ్చిన వారు ఇప్పటి వరకు మూడున్నర కిలోమీటర్లు వెనక్కు తగ్గారు, ఇంకా ఒకటిన్నర తగ్గాల్సి ఉంది. అది కూడా పూర్తయితే మేనెలకు ముందున్న పూర్వపు స్ధితిలో చైనీయులు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటారు, మనం మాత్రం రెండున్నర కిలోమీటర్లు వెనక్కు తగ్గాల్సి ఉంటుంది.
భూటాన్ – చైనా సరిహద్దు ప్రాంతమైన డోక్లాంలో 2017లో మన సైన్యం చైనాను నిలువరించిందని, గొప్పవిజయం సాధించినట్లు సామాజిక మాధ్యమంలో ఇప్పటికీ వర్ణించేవారు ఉన్నారు. అమెరికాకు చెందిన వార్‌ఆన్ రాక్స్‌డాట్‌కామ్ 2018 జూన్ ఏడున ఒక విశ్లేషణ చేసింది. దానికి ” ఒక ఏడాది తరువాత డోక్లాం : హిమాలయాల్లో చైనా సుదీర్ఘ క్రీడ ” అని శీర్షిక పెట్టింది. ” వారాల తరబడి సంప్రదింపులు జరిపిన తరువాత తమ దళాలను తమ పూర్వపు స్ధానాలకు ఉపసంహరించుకొనేందుకు ఢిల్లీ మరియు బీజింగ్ అంగీకరించాయి. తన ప్రాజెక్టును పక్కన పెట్టినట్లు చెబుతూ చైనా కన్నుగీటింది. అయినప్పటికీ అప్పటి నుంచి చైనా ఆ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా తన దళాలను మోహరించింది మరియు నూతన ప్రాధమిక సదుపాయాలను నిర్మించింది. వివాదాస్పద ప్రాంతంలో మెల్లగా, స్ధిరంగా పైచేయి సాధిస్తోంది. ఆ సంక్షోభానికి ఏడాది నిండవస్తున్నది, ఈ కార్యకలాపాలను అడ్డుకొనేందుకు భారత్ లేదా భూటాన్ రంగంలోకి దిగలేదు.” అని దానిలో పేర్కొన్నది.
దేశంలో దేశభక్తి, మన ప్రయోజనాలను కాపాడుకోవాలనే విషయంలో అలాంటి పూర్వ చరిత్రలేని సంఘపరివార్ దాని అనుబంధ బిజెపి వంటి సంస్ధల నుంచి కమ్యూనిస్టులు గానీ మరొకరు గానీ నేర్చుకోవాల్సిందేమీ లేదు. ఇరుగు పొరుగుదేశాలతో సఖ్యతగా ఉండాలని, సమస్యలుంటే సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలనే కమ్యూనిస్టులతో సహా అందరూ చెబుతున్నారు. దొంగ దేశభక్తిని ప్రదర్శించేందుకు, ఆపేరుతో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు వీధులకు ఎక్కటం లేదు.చేదు నిజాలను ప్రశ్నించిన వారిని, చర్చించిన వారిని దేశ ద్రోహులుగా చిత్రించి దాడులు చేస్తున్నారు. రెండోవైపు తమ నేతలకు లేని గొప్పలను ఆపాదిస్తూ ,చవకబారు కథనాలతో జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. వాస్తవాలను బయటకు రాకుండా మూసిపెడుతున్నారు. వాస్తవాలను చర్చించేవారా ? మూసి పెట్టి అవాస్తవాలను ప్రచారం చేసే వారా ? ఎవరు దేశభక్తులు ? తప్పుడు, వక్రీకరణలతో కూడిన సమాచారాన్ని జనం మెదళ్లలో నింపి ఎంతకాలం మోసం చేస్తారు ? నరేంద్రమోడీకి చైనా, జింపింగ్ భయపడ్డారు అని చెబితే దేశభక్తులు, అలాంటిదేమీ లేదని చెబితే దేశద్రోహులౌతారా ? దేశ భక్తికి ప్రమాణాలు ఏమిటి ?