Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


కరోనా వైరస్‌తో సహజీవనం చేయాలి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు ఎత్తేసిన తరువాత అంతకు మించి చేసేది, చేయగలిగింది ఏముంది కనుక … చేద్దాం. అది బ్రతకనిస్తే బతుకుదాం, చంపేస్తే దిక్కులేని చావు చద్దాం. మన చేతుల్లో ఏముంది !
అవినీతి, అక్రమాలు, అధికారం కోసం తొక్కుతున్న అడ్డదారులు, డబ్బుకోసం నడుస్తున్న చెడ్డదారులు, ఆకలి, దారిద్య్రం, నిరుద్యోగం వంటి సకల అవాంఛనీయ, అవలక్షణాలు, రోగాలు రొష్టులతో పాటే జీవిద్దామని ఎవరూ చెప్పకపోయినా వాటితో సహజీవనం చేసేందుకు అలవాటు చేశారు. గతంలో ఎరగనిది ఇప్పుడు అదనంగా కరోనా తోడైంది. తరువాత మరొకటి రావచ్చు. మనకూ పెద్ద పట్టింపు ఉండటం లేదు. పాలకులకు కావాల్సిందీ, కోరుకుంటున్నదీ అదే.
కరోనా వచ్చింది కనుక ఏది ఆగింది. రాజస్ధాన్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ కూల్చివేత కుట్రకు తెరలేపిన బిజెపిని కరోనా ఆపలేదు. కరోనా పరీక్షలకు, పేషంట్ల చికిత్సకు అవసరమైన ఏర్పాట్లకు నిధులు లేవు, రెండు సంవత్సరాలుగా ఊరిస్తున్న నూతన వేతనాల ఖరారుకు ముందుకు రారు గానీ సలక్షణంగా ఉన్న భవనాలను కూల్చివేసి కొత్త సచివాలయాన్ని కట్టేందుకు కెసిఆర్‌ ప్రభుత్వానికి నిధుల కొరత లేదు.
ప్రపంచ చమురు మార్కెట్లో ధరలు పెరగకపోయినా పెట్రోలు, డీజిలు ధరలను పెంచి జేబులు లూటీ చేస్తున్నా జనం లేదా కనీసంన్న కేంద్ర ప్రభుత్వం మీద కరోనా కన్నెర్ర చేయలేకపోయింది. అంతర్జాతీయంగా చైనా మీద ఏక్షణంలో అయినా యుద్దం చేస్తామంటూ అమెరికన్లు తమకు సంబంధం లేని దక్షిణ చైనా సముద్రంలోకి విమానవాహక, అణు యుద్ద నౌకలను పంపటాన్ని కరోనా అభ్యంతర పెట్టలేదు.
లడఖ్‌ సరిహద్దులో చైనా మన ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చిందని మాననీయ కేంద్ర మంత్రులన్నారు. గౌరవనీయ ప్రధాని రాలేదన్నారు. తీరా చూస్తే అదేదే సినిమాలో నువూ మూస్కో నేనూ మూస్కుంటా అన్నట్లు మీరూ వెనక్కు వెళ్లండి మేమూ వెనక్కు తగ్గుతాం అనే ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వార్తలు. అసలేం జరిగిందీ, ఏం జరుగుతోంది అని జనం జుట్టుపీక్కుంటున్నా కరోనాకేమీ పట్టలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే సుత్తి వేసినట్లవుతుంది తప్ప మరొకటి కాదు. ఎందుకిలా జరుగుతోంది?
ప్రభుత్వ స్కూళ్ల వైపు చూడకుండా చేసినా, కార్పొరేట్‌ బళ్లవైపు బలవంతంగా నెట్టినా మనం పట్టించుకోలేదు. ప్రభుత్వ దవాఖానాలను పబ్లిక్‌ పాయి ఖానా లెక్క మార్చారు గనుక మనం అటువైపు వెళ్లే పరిస్ధితి లేదు. కార్పొరేట్‌ ఆసుపత్రుల వైద్య యంత్రాలకు అవసరమైన రోగులుగా మనం మారాం తప్ప మనకు అవసరమైన యంత్రాలుగా అవి లేవు. అక్కడ శవాలుగా మారిన తరువాత కూడా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నా నోరెత్తలేని దౌర్భాగ్య పరిస్ధితిలో పడిపోయాం. చాలా మందికి ఈ సమస్యలను చర్చించే, చెప్పే వారు నస పెట్టేవారిగా కనిపిస్తున్నారు. జనం అసలు వినేందుకు కూడా సిద్దం కావటం లేదు, ఇదెక్కడి సుత్తిరా బాబూ అని దూరంగా పోతున్నారు.
ఈ పరిస్ధితిని చూస్తుంటే పెద్దలు చెప్పిన అనేక విషయాలు గుర్తుకు వస్తున్నాయి. స్వాతంత్య్ర ఉద్యమ తొలి రోజుల్లో జనం కాంగ్రెస్‌ కార్యకర్తలను చూసి వచ్చార్రా దేశభక్తి గురించి ఊదరగొట్టే వారు అంటూ దూరంగా పారి పోయిన రోజులు ఉన్నాయట. తమ జీవితాల మీద పాలనా ప్రభావం పెద్దగా పడనంత వరకు, పాలకులు మితిమీరి జోక్యం చేసుకోనంత వరకు జనం లోకం పోకడను పెద్దగా పట్టించుకోరు. వారికి తెలియని, ఆసక్తిలేని విషయాలను ఎక్కించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే అలాంటి వారిని చూసి పారిపోతారు. ఇప్పుడు మన జీవితాలను శాసిస్తున్న, నడిపిస్తున్న నయా ఉదారవాద విధానాల పర్యవసానాలు, ఫలితాలు, వాటికి ప్రత్యామ్నాయం గురించి చెప్పేవారిని జనం అలాగే చూస్తున్నారా అనిపిస్తోంది.
ఉద్యోగులు, కార్మికులు రాజకీయ పోరాటాలు, ఆరాటాలకు దూరంగా ఉంటారు గానీ ఆర్ధిక పోరాటాలకు మాత్రం సిద్దం సుమతీ అన్నట్లుగా ఉంటారన్నది సాధారణ అభిప్రాయం. చిత్రం ఏమంటే జనం ఇప్పుడు వాటికి కూడా సిద్దంగావటం లేదు. యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరించేందుకు వారికి వత్తాసుగా పాలకులు నూతన ఆర్ధిక విధానాల పేరుతో గతంలో ఉన్న చట్టాలను నీరుగారుస్తున్నారు. ఎవరైనా ఇదేమని ప్రశ్నిస్తే ఉద్యోగాల నుంచి నిర్ధాక్షిణ్యంగా తొలగించి వేస్తున్నారు. కార్మికులు దాని గురించి ఏండ్ల తరబడి కార్మిక శాఖ (ఆచరణలో యజమానుల వత్తాసు కేంద్రాలుగా మారాయి) కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరుగు తారా బతుకు తెరువు కోసం ప్రయత్నిస్తారా ? ఏ కార్మికుడైనా తనకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేస్తే ఆ విషయం తెలిసిన వారెవరైనా అతనికి ఉద్యోగం ఇస్తారా ? లోకానికంతటికీ జరిగే అన్యాయాలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులను ఉద్యోగాల నుంచి తొలగించినా అదే పరిస్ధితి, వారికి చట్టాల గురించి తెలియక కాదు, ఎవరైనా కేసు వేస్తే వేరే ఉపాధి చూసుకోవాలి తప్ప ఏ సంస్దా దగ్గరకు రానివ్వదు. ఈ నేపధ్యంలో పోరాటాల ద్వారా తమ సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకోసం పోరాడటం కంటే అధికారపక్షంలోని నేతల పైరవీల ద్వారా ” పనులు చేయించుకోవటం ” సులభం, మంచిదనే సాధారణ అభిప్రాయం సర్వత్రా నెలకొన్నది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ ఉన్నత విద్యావంతులే అయినా వారిలో కూడా ఆ దగ్గర దారులు, అంతకు మించి మరొక భావన లేదు.దీని అర్ధం అయినదానికీ కానిదానికి ఆందోళన, పోరాటం తప్ప ఇతర పరిష్కారాల వైపు చూడవద్దని కాదు. కార్మికులెప్పుడూ పోరాటం, సమ్మెలను చివరి చర్యలుగానే చూస్తారు.
దాదాపు నాలుగు లక్షల మంది ఉద్యోగులు, రెండున్నర లక్షల మంది టీచర్లకు నూతన వేతనాలు నిర్ణయించేందుకు నియమించిన వేతన సవరణ కమిషన్‌కు రెండు సంవత్సరాలు నిండిపోయింది. ఏదో ఒక సాకుతో వ్యవధిని పదే పదే పొడిగిస్తూ చివరిగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఈ ఏడాది డిసెంబరు వరకు గడువు నిర్ణయించారు. అయినా ఉద్యోగులు కిక్కురు మనటం లేదు. అప్పటికైనా వెలుగు చూస్తుందా అన్నది అనుమానమే. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు వచ్చే ఏడాది జూలై వరకు కరవు భత్యం, ఇంక్రిమెంట్లను కూడా నిలిపివేసిన నేపధ్యంలో ఏదో ఒక సాకుతో కెసిఆర్‌ ప్రభుత్వం మరో ఆరునెలలు గడువు పెంచినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆరునెలలుగా కరోనా వ్యాప్తి పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. ఎంతకాలం అది ప్రభావం చూపుతుందో ఎవరూ చెప్పలేని స్ధితి.
నిజానికి బంగారు తెలంగాణాలో రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతర భృతి ప్రకటించి కమిషన్‌ సిఫార్సులను వాయిదా వేసినా సమస్య ఉండేది కాదు. ఏకంగా వేతన సవరణకే ముందుకు పోతుంటే మధ్యలో ఈ మధ్యంతరం ఎందుకు భరు అన్నట్లుగా ప్రభువులు మాట్లాడారు. రాజుగారు అబద్దం చెప్పరు అని విధేయులు నమ్మినట్లుగా రావుగారి గురించి ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల( ఒకటి రెండు సంఘాలు, వాటి నేతలు మినహా) నేతలు నిజంగానే నమ్మారు. పైరవీలు చేయకపోలేదు, చేసినా ఫలితం ఉండదని తేలిపోయింది. ఆర్‌టిసి కార్మికుల చారిత్రాత్మక సమ్మె సమయంలో అనుసరించిన వైఖరి మీద ఎన్ని విమర్శలు వచ్చినా ప్రభువులతో కలసి విందారగించి మేము మీ వెంటే అని ఏదో ఒరగబెడతారనే భ్రమలతో వ్రతం చెడినా ఫలం దక్కలేదు.
ఏడాది క్రితం సామాజిక మాధ్యమంలో. సాంప్రదాయక మాధ్యమంలో వచ్చిన వార్తలేమిటి ? ప్రస్తుత పరిస్ధితిల్లో ఉద్యోగులు గతం కంటే ఎక్కువే పెరుగుదల కోరుతున్నారు. అయితే ఆర్ధిక పరిస్ధితి దృష్ట్యా 20శాతానికి మించి ఇచ్చే అవకాశం లేదని అధికారులు అంటున్నారని ఒక లీకు. కాదు, దాదాపు అంతా ఖరారైంది, అధికారిక ప్రకటనే తరువాయి 33శాతం పెంపుదలతో 2020 ప్రారంభం నుంచి అమలు జరుపుతారు, మీ కెంత పెరుగుతుందో చూడండి అంటూ ఇంటర్నెట్‌లో కొన్ని సైట్లలో టేబుల్స్‌ వేసి మరీ ప్రకటించిన తీరు తెన్నులను చూశాము. ఈ ఏడాది ప్రారంభం నుంచి అమలు పోయి ఏడాది చివరి వరకు కమిషన్‌ గడువునే పొడిగించటంతో హతాశులయ్యారు. కరోనాకు ముందే ఆర్ధిక పరిస్ధితి బాగో లేదని చెప్పిన వారు ఇప్పుడు ఏమి చెబుతారో చూడాల్సి ఉంది.
ఆర్‌టిసి కార్మికులు అనివార్యమై అంతిమ ఆయుధంగా సమ్మెకు దిగారు. అంతకు ముందు వారి యూనియన్లు చేసిన పైరవీలు ఫలించలేదని గ్రహించాలి. పాలక పార్టీలో ముఖ్యమంత్రికి ఇష్టం లేని ఒక వర్గానికి గుర్తింపు ఆర్‌టిసి యూనియన్‌ నేతలతో సంబంధం ఉన్నందున వారి సమ్మె పట్ల కఠినంగా వ్యవహరించారని, చివరికి తమ సత్తా ఏమిటో చూపి మాతో పెట్టుకుంటే ఇంతే అన్న హెచ్చరికతో సమ్మెను సానుకూలంగా ముగించారనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. సమ్మె ఎలా ముగిసినా కార్మికులు తమ సంఘటిత హక్కు అయిన యూనియన్లను కోల్పోయారన్నది చేదు నిజం. ఉద్యోగ సంఘాలన్నీ ఏకంగా ముఖ్యమంత్రికే విధేయతను ప్రకటించినా ( స్వప్రయోజనాలు తప్ప ) సాధించేదేమీ లేదన్నది తేలిపోయింది. రేపు ప్రభువులకు దయ పుట్టి వచ్చే ఏడాది పిఆర్‌సిని అమలు జరిపినా అది ఎలా ఉంటుందో, ఉద్యోగులు, కార్మికులు ఎంత నష్టపోతారో, ఎంత మేరకు లబ్ది పొందుతారో తెలియదు.
కరోనా వైరస్‌ వలస కార్మికులకు తీరని నష్టం కలిగించటం ఒకటైతే అసలు వారెంత మంది, ఎక్కడ పని చేస్తున్నారో కూడా అధికార యంత్రాంగం దగ్గర వివరాలు లేని స్ధితి స్పష్టమైంది. ఇక వారి హక్కులు, సంక్షేమం, చట్టాల అమలు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
ఉద్యోగులు, కార్మికులే కాదు తెలంగాణాలో పోరాట వారసత్వం ఉందని చెప్పుకొనే జబ్బలు చరిచే యువతరం కూడా నిస్తేజంగా తయారైంది. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని వాగ్దానం చేసిన పాలకులను నిలదీసి ప్రశ్నించే స్ధితిలో కూడా వారు లేరు. రైతు బంధు తమకూ వర్తింప చేయాలని కౌలు రైతుల నుంచి కూడా ఎలాంటి వత్తిడి లేదు. అస్తిత్వ వాదం పోరాట పటిమను దెబ్బతీస్తుంది. ఐక్యతను విచ్చిన్నం చేస్తుంది. ఎవరి సమస్యలను వారే పరిష్కరించుకోవాలనే దివాలాకోరు, ప్రమాదకర వాదనలను ముందుకు తెస్తుంది. అందరి కోసం ఒక్కరు- ఒక్కరి కోసం అందరూ అనే సమిష్టి భావనలకు జనాన్ని దూరం చేస్తుంది.
వేతన కమిషన్‌ విషయానికి వచ్చే సరికి బీద అరుపులు అరుస్తున్న పాలకులు ఖాళీ ఖజానాతో ఉన్న సచివాలయాన్ని కూల గొట్టి వందల కోట్ల రూపాయలతో కొత్తదాన్ని కట్టేందుకు పూనుకున్నారు.ఇదే పాలకులు కరోనా మహమ్మారి పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నా కనీసం పరీక్షలు చేయించేందుకు సైతం ఏర్పాట్లు చేయలేదు. కొత్త సచివాలయం నిర్మిస్తామని తమ ఎన్నికల ప్రణాళికలో చెప్పామని మంత్రులు దబాయిస్తున్నారు. దానికంటే ముందు 2014నాటి ఎన్నికల ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాటిని ఎందుకు అమలు జరపలేదని ఎవరైనా ప్రశ్నిస్తే బూతులతో సమాధానాలు వస్తున్నాయి. ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సు పెంపుదల, ఇతర అంశాల గురించి కూడా చెప్పారు. మరి వాటి గురించి ప్రస్తావించరేం ? ప్రయివేటు కార్పొరేట్ల ఆసుపత్రుల దయా దాక్షిణ్యాలకు రోగులను వదలివేశారు. ప్రయివేటు విద్యా, వైద్య సంస్ధలు ప్రభుత్వ నియంత్రణ, నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టా రాజ్యంగా ఉన్నా పట్టించుకొనే వారు లేరు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే కదా చర్యలు తీసుకొనేది అని నిబంధనలు చెబుతున్నారు. ఈ పరిస్ధితులను ప్రశ్నించే తత్వాన్ని మన సమాజం కోల్పోయిందా ?
కార్మికులు, ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యలతో పాటు ఆర్ధిక విషయాల మీద కూడా ఉద్యమాలకు దూరంగా ఉంటున్న కారణాల గురించి కొన్ని అభిప్రాయాలు ఉన్నా అంతకు మించి లోతైన పరిశోధనలు జరగాల్సి ఉంది. ప్రపంచంలో నయా ఉదారవాద విధానాలు ముందుకు తెచ్చిన కొన్ని అంశాలు వాటి ప్రభావం కార్మికవర్గం, మొత్తంగా సమాజం మీద ఎలాంటి ప్రభావాలు చూపుతున్నాయో. అభివృద్ధి చెందిన అమెరికా, ఐరోపాలోని ధనిక దేశాలలో కొన్ని విశ్లేషణలు చేశారు. అయితే అక్కడి పరిస్ధితికీ మన వంటి దేశాలకూ చాలా తేడా ఉంది. కరోనా కారణంగా కోట్లాది మంది వలస కార్మికులు తమ పని స్ధలాల నుంచి స్వ గ్రామాలు, చిన్న పట్టణాలకు తిరిగి వెళ్లిపోయారు. దొరికిన పని చేస్తున్నారు లేకపోతే కాళ్లు ముడుచుకు కూర్చుంటున్నారు. అమెరికా లేదా ఇతర ధనిక దేశాల వారికి అలాంటి అవకాశాలు లేవు. పక్కనే ఉన్న మెక్సికో లేదా ఇతర లాటిన్‌ అమెరికా నుంచి వలస వచ్చిన వారు వెళ్లిపోగలరు తప్ప స్ధానికులు ఎక్కడికీ పోలేరు. ఎందుకంటే వారికి నిరుద్యోగం తప్ప ప్రత్నామ్నాయ ఉపాధి అవకాశాలు లేవు.
2018లో అమెరికా ఉపాధి వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం కార్మికులు 100 మంది అనుకుంటే సేవారంగాలలో ఉన్న వారు 80.2, ఉత్పాదకరంగంలో 12.8, వ్యవసాయ రంగంలో 1.4, వ్యవసాయేతర స్వయం ఉపాధి రంగంలో 5.6శాతం చొప్పున ఉన్నారు. అదే మన దేశ విషయానికి వస్తే 2019లో వ్యవసాయ రంగంలో 42.39, సేవారంగంలో 32.04, వస్తూత్పత్తిలో 25.58 శాతం ఉన్నారు. పదేండ్ల కాలంలో వ్యవసాయం నుంచి పదిశాతం మంది మిగిలిన రెండు రంగాలకు మారారు. ఈ ధోరణి ఇంకా పెరుగుతోంది. వ్యవసాయం గిట్టుబాటు గాక, దాని మీద భ్రమలు కోల్పోయి సేవా, వస్తూత్పత్తి రంగంలో తమ భవిష్యత్‌ను పరీక్షించుకొనే వారు పెరుగుతున్నారు. సేవా, వస్తూత్పత్తి రంగంలో ప్రవేశించే వారు అపరిమితంగా ఉండటం, వారిలో పోటీని ఆయా రంగాల యాజమాన్యాలు వినియోగించుకొని తక్కువ వేతనాలతో లబ్ది పొందుతున్నాయి. బతకలేకపోతే గ్రామాలకు తిరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ పోటీ వలన కార్మికవర్గంలో పోరాడే శక్తి తగ్గి, పైరవీలు, పనులు చేయించుకోవాలనే దారులకు మళ్లుతున్నారు.
పశ్చిమ దేశాలలో కొన్ని పరిణామాలు, పరిస్ధితి గురించి చూద్దాం. నయా ఉదారవాద విధానాలు ముందుకు తెచ్చిన ప్రధాన అంశం ప్రపంచీకరణ. దాన్ని ముందుకు తీసుకుపోయే సాధనాలుగా ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ), ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) వంటి అంతర్జాతీయ సంస్ధలు ఉన్నాయి. లడఖ్‌లో జూన్‌ 15 రాత్రి లడాయి జరగనంత వరకు చైనా వస్తువుల మీద ఎవరికీ వ్యతిరేకత లేదు. టిక్‌టాక్‌లు, ఇతర చైనా యాప్‌లు మన దేశ భద్రతకు ఎలాంటి ముప్పు కలిగించలేదు. చిత్రం ఏమిటంటే అవి ఒక్క మన దేశానికి ముప్పు తెచ్చేందుకు మాత్రమే తయారు చేయలేదు, మిగతా ప్రపంచమంతా వాటిని వినియోగిస్తూనే ఉంది, తమ భద్రతకు ముప్పు తెస్తున్నాయని ఎలాంటి నిషేధాలు విధించలేదు.
చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌ వంటి దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకొనే వాటిలో మన కంటే అభివృద్ధి చెందిన దేశాలు ముందు పీఠీన ఉన్నాయి. వాటి పర్యవసానాల గురించి తెలియకుండానే ఆయా దేశాలు దిగుమతులు చేసుకుంటున్నాయా ? ఎవరైనా అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే !
ఉదాహరణకు ఫ్రాన్సు పరిణామాన్ని చూద్దాం.1994-2014 మధ్య చైనా, తూర్పు ఐరోపా సహా తక్కువ వేతనాలు ఉన్న దేశాల నుంచి దిగుమతి చేసుకున్న గృహౌపకరణాలు మూడు రెట్లు పెరిగాయి. వాటి ధరలు తక్కువగా ఉన్నందున ఏటా ద్రవ్యోల్బణం 0.17శాతం తగ్గింది. ఆ మేరకు వినియోగదారులకు ధరలూ తగ్గాయి. దిగుమతుల కారణంగా దేశీయ ఉత్పత్తి దారులు పోటీలో నిలిచేందుకు తమ ఉత్పత్తుల ధరలనూ తగ్గించటం లేదా తగ్గేందుకు అనువైన చర్యలూ తీసుకోవాల్సి వచ్చింది. మొత్తంగా దిగుమతి చేసుకున్న ఉపకరణాలు 10 నుంచి 17శాతానికి పెరిగితే వీటిలో తక్కువ వేతనాలున్న దేశాల నుంచి పెరిగినవే 2 నుంచి ఏడుశాతం ఉన్నాయి. ప్రపంచ వ్యాపితంగా ధనిక దేశాల నుంచి దిగుమతుల శాతం 76 నుంచి 58కి తగ్గితే చైనా నుంచి 7 నుంచి 21శాతానికి పెరిగాయి.దిగుమతి వస్తువులు చౌకగా లభిస్తున్న కారణంగా 1994-2014 మధ్య వినియోగదారులకు కనీసంగా ఏడాదికి వెయ్యి యూరోల చొప్పున ఆదా అయినట్లు ఒక అంచనా.
అమెరికా విషయానికి వస్తే 1997-2006 మధ్య 325 వస్తూత్పత్తి పరిశ్రమలకు సంబంధించి విశ్లేషణ చేశారు. తక్కువ వేతనాలున్న దేశాల నుంచి అదే వస్తువుల దిగుమతి ఒక శాతం పెరిగితే అమెరికాలో తయారయ్యే వస్తువుల ధరలు రెండు నుంచి మూడుశాతం తగ్గినట్లు తేలింది. ఆమేరకు రెండు శాతం ద్రవ్యోల్బణం, ధరలూ తగ్గాయి. దీని వలన ద్రవ్యోల్బణం-ధరలతో లంకె ఉన్న వేతనాల పెరుగుదల భారం యజమానులకు తగ్గుతుంది. వారి లాభాల్లో ఎలాంటి తరుగుదల ఉండటం లేదు కనుకనే చైనా తదితర దేశాల నుంచి దిగుమతులను గణనీయంగా పెంచారు. అయితే కొంత కాలానికి అది సాధారణ పరిస్ధితిగా మారినపుడు ఉపాధి, వేతనాలు, ఆదాయాల తగ్గుదలతో జనాల్లో ఆందోళన తలెత్తితే, లాభాల కోసం స్ధానిక ఉత్పత్తిదారుల నుంచి వత్తిడి పెరుగుతుంది. అన్నింటికీ మించి ప్రపంచ మీద పెత్తనం చెలాయించే అమెరికన్లు ఇతర దేశాల మీద అంతకంతకూ ఎక్కువగా ఆధారపడాల్సి వస్తే పెత్తనానికే ముప్పు అని భావించి ధరలు ఎక్కువైనా తమ వస్తువులను చైనా వంటి దేశాలు కూడా దిగుమతులు చేసుకోవాలని లేదా సబ్సిడీలను అనుమతించాలంటూ వాణిజ్య యుద్ధాలకు దిగుతున్నారు.
మన దేశంలో కార్మికవర్గం, ఉద్యోగులు, ఇతర తరగతుల మీద విదేశాల నుంచి దిగుమతి అవుతున్న చౌక ధరల వస్తువుల ప్రభావం తక్కువగా లేదు. మనకు తెలియకుండానే వాటి పట్ల మొగ్గుచూపుతున్నాం. దీనికి మన దేశంలో అంతటి నాణ్యత కలిగిన వస్తువులను అంత తక్కువ ధరలకు అందచేసే పరిస్దితి లేకపోవటం ఒక ప్రధాన కారణం. వినియోగ వస్తువుల ధరలు తగ్గినపుడు వేతనాల మీద ఆధారపడే వారు వేతనాలు తక్కువగా ఉన్నా సర్దుకు పోయే పరిస్దితి ఉన్నపుడు ఆందోళన బాట పట్టేందుకు సముఖత చూపరు. అది కొంత కాలానికి సాధారణ పరిస్ధితిగా మారినపుడు సమస్యలు తిరిగి ముందుకు వస్తాయి. ఉదాహరణకు పెద్ద పట్టణాలలో బడా సంస్దలు కూరగాయల నుంచి వినియోగ వస్తువులన్నింటినీ గొలుసు కట్టు దుకాణాల ద్వారా విక్రయిస్తున్నారు. వీటి యజమానులు ఉత్పాదకుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్న కారణంగా మధ్యలో ఉండే పంపిణీదారులు, టోకు వ్యాపారులు పొందే లాభాల్లో కొంత మొత్తాన్ని నేరుగా వినియోగదారులకు అందచేస్తుండటంతో చిన్న దుకాణాలతో పోలిస్తే అక్కడ ధరలు తక్కువగా ఉంటున్నాయి. దీని వలన మిగిలిన మొత్తాలతో వినియోగదారులు అదనంగా వస్తువులను కొనుగోలు చేసేందుకు అలవాటు పడతారు. కొంత కాలం గడిచాక ఒక తరహా జీవన విధానానికి అలవాటు పడిన తరువాత అది సాధారణం అవుతుంది. అప్పుడు సమస్యలు ప్రారంభం అవుతాయి. పాలకుల మీద, నయా ఉదారవాద విధానాల మీద భ్రమలు తొలుగుతాయి. పని చేయించుకోవటాలు సాధ్యం కాదు. మన స్వాతంత్య్ర ఉద్యమం తొలుత బ్రిటీష్‌ వారికి వినతులతోనే ప్రారంభమైంది. తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంతో సహా ప్రతి ఉద్యమం అలాగే ప్రారంభమైంది. అనివార్యమై తరువాత పోరాట రూపాలను సంతరించుకున్నాయి.
పాలకవర్గాలు సంక్షేమ కార్యక్రమాలను అమలు జరుపుతున్నాయంటే దాని అర్ధం కార్మికవర్గానికి ఇవ్వాల్సిన దానికంటే తక్కువ ఇచ్చి సరిపెట్టేందుకే తప్ప అదనం కాదని గ్రహించాలి. అది కార్మికుల్లో భ్రమలు పెరగటానికి దారి తీస్తుందని అనేక దేశాల అనుభవాలు వెల్లడించాయి. ఉదాహరణకు అమెరికాలో 1954లో 35శాతం మంది కార్మికులు యూనియన్లలో చేరారు. 2018లో వారి శాతం 10.5శాతానికి పడిపోయింది. కాంట్రాక్టు విధానం పెరిగిన కొద్దీ యూనియన్లతో పని ఉండదు. వారి బేరమాడే శక్తి తగ్గిపోతుంది. అది సాధారణ పరిస్ధితిగా మారినపుడు తలెత్తే సమస్యలతో పాలకులు, వ్యవస్ధ మీద భ్రమలు తొలుగుతాయి. ఈ కారణంగానే అమెరికాలో ఇప్పుడు అలాంటి పరిణామాలను చూడవచ్చు. పెట్టుబడిదారీ విధానం విఫలమైందని భావిస్తున్న యువత సోషలిజం గురించి ఆసక్తిని ప్రదర్శించటం రోజు రోజుకూ పెరుగుతోంది. అది కోల్పోయిన పోరాటశక్తిని రగులుస్తుంది. అస్తిత్వభావాలను దూరం చేస్తుంది ! దీనికి అతీతంగా మన దేశం, రాష్ట్రం ఎలా ఉంటాయి ?