Tags

, , ,


ఎం కోటేశ్వరరావు
రాజకీయాలకు – నైతిక సూత్రాలకు సంబంధం లేదని ఇటాలియన్‌ దౌత్యవేత్త మాకియవెల్లీ ఐదు వందల సంవత్సరాల క్రితమే చెప్పాడు. దేశంలో జరుగుతున్న అనేక పరిణామాలు ఈ విషయాన్ని ఎప్పుడో స్పష్టం చేశాయి. తాజాగా జరిగిన, జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కేరళలో పట్టుబడిన దొంగబంగారం కేసును ఆసరా చేసుకొని సిపిఐ(ఎం) నాయకత్వలోని కేరళ వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డిఎఫ్‌) ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌, బిజెపి అనైతిక రాజకీయాలకు తెరలేపినట్లు కనిపిస్తోంది.
దుబాయిలోని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యుఏఇ) కాన్సులేట్‌ కార్యాలయం నుంచి తిరువనంతపురం విమానాశ్రయానికి దౌత్య సిబ్బంది ఉపయోగించే ఒక సంచిలో పంపిన దొంగబంగారం కేసును దర్యాప్తు జరిపించాలని కేరళ ముఖ్య మంత్రి పినరయి విజయన్‌ ఎలాంటి శషభిషలు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ దర్యాప్తు పూర్తిగాక ముందే విచారణ జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్‌ఐఏ) అధికారులు వెల్లడిస్తున్న సమాచారం, సిపిఎంను వ్యతిరేకిస్తున్నశక్తులు చేస్తున్న ప్రచార, ఆందోళనల తీరు తెన్నులు కొన్ని ప్రశ్నలను ముందుకు తెస్తున్నాయి. ఎవరూ కోరకుండానే పట్టుబడింది విమానాశ్రయంలో కనుక అది కేంద్ర పరిధిలో ఉంటుంది కనుక కేరళ సర్కారు వెంటనే లేఖ రాసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేయలేదంటూ కాంగ్రెసు, బిజెపి పార్టీలు వింత వాదనను ముందుకు తెచ్చాయి. విజయన్‌ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు తమ ఎత్తుగడలతో ఆ ప్రభుత్వాన్ని దెబ్బతీస్తాయా లేక ఎదురు తన్ని తామే దెబ్బ తింటాయా ? ఒక వైపు కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి చెందుతూ కేరళలో కూడా కొత్త సమస్యను సృష్టిస్తుంటే దాన్ని కూడా కట్టడి చేసేందుకు దాని మీద కేంద్రీకరించిన ముఖ్య మంత్రి పినరయి విజయన్‌ నాయకత్వంలోని ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఒక వైపు దొంగబంగారం రాజకీయాలు, మరో వైపు కరోనా కట్టడి పోరు !
దొంగబంగారం ఎలా బయట పడింది !
జూన్‌ 30వ తేదీన తిరువనంతపురం విమానాశ్రయానికి దుబాయి నుంచి వచ్చిన దౌత్యవేత్తల సంచి ఏముంది అనే అంశంపై కస్టమ్స్‌ అధికారులకు అనుమానం వచ్చి చిరునామాదారులకు విడుదల చేయకుండా నిలిపివేశారు.
జూలై ఒకటవ తేదీన కేరళ ఐటి శాఖలో కన్సల్టెంట్‌గా పని చేస్తున్న స్వప్న సురేష్‌ అనే మహిళ కస్టమ్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌కు ఫోన్‌ చేసి తాను తిరువనంతపురం యుఏయి కాన్సులేట్‌ కార్యాలయ కాన్సులర్‌ కార్యదర్శిని అని, సదరు సంచిని విడుదల చేయాలని కోరింది. అధికారులు అంగీకరించలేదు.
రెండవ తేదీన కస్టమ్స్‌ అధికారులకు పలు చోట్ల నుంచి సదరు సంచిని వదలి పెట్టాలని ఫోన్లద్వారా వత్తిడి వచ్చింది. అయినా తిరస్కరించి ఎవరి పేరుతో అయితే సంచి వచ్చిందో వారు వచ్చి తీసుకుపోవాలని కాన్సులేట్‌ కార్యాలయానికి కస్టమ్స్‌ సిబ్బంది స్పష్టం చేశారు.అయితే కాన్సులేట్‌ కార్యాలయంలో గతంలో పిఆర్‌ఓగా పని చేసిన సరిత్‌ కుమార్‌ అరబ్బు వేషంతో ఉన్న ఒక వ్యక్తితో కలసి వచ్చి సంచిని తమకు అందచేయాలని వత్తిడి చేసినా అధికారులు అంగీకరించలేదు.
మూడవ తేదీన కాన్సులేట్‌ అధికారులను పిలిపించేందుకు కస్టమ్స్‌ అధికారులు అనుమతి తీసుకున్నారు.
నాలుగవ తేదీన సదరు సంచి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పంపివేయాలంటూ ఒక లేఖ కస్టమ్స్‌ అధికారులకు అందింది. అయితే ఐదవ తేదీన ఆ సంచిలో ఏముందో తనిఖీ చేయాలని నిర్ణయించినందున ఆ సమయంలో అక్కడకు ఒక ప్రతినిధిని పంపాలని కాన్సులేట్‌ కార్యాలయానికి కస్టమ్స్‌ అధికారులు వర్తమానం పంపారు.
ఐదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీలోని హైకమిషనర్‌ కార్యాలయ సీనియర్‌ అధికారి సమక్షంలో కస్టమ్స్‌ సిబ్బంది సంచి తనిఖీ ప్రారంభించారు. ఆ సమయంలో ఆ సంచి ఎవరి పేరుతో వచ్చిందో యుఏయి కార్యాలయంలోని సదరు అధికారి కూడా ఉన్నారు. దానిలో 14.8 కోట్ల రూపాయల విలువ చేసే 30కిలోల బంగారం ఉంది. బంగారంతో తమకు సంబంధం లేదని, తమకు పంపింది కాదని కాన్సులేట్‌ అధికారులు స్పష్టం చేశారు. సాయంత్రం 3.15 సమయంలో అంతకు ముందు సంప్రదించిన స్వప్న సురేష్‌కు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉంది. ఆమె ఆచూకీ తెలియలేదు. ఈ తతంగం అంతా సాయంత్రం ఆరుగంటలవరకు జరిగింది. మాజీ పిఆర్‌ఓ సరిత్‌ను కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేశారు.
ఏడవ తేదీ ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి, ఐటి కార్యదర్శి అయిన ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌కు దొంగబంగారం కేసులో అనుమానితులతో సంబంధాలున్నాయనే అనుమానంతో బాధ్యతల నుంచి సిఎం కార్యాలయం తప్పించింది.
తొమ్మిదవ తేదీన జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్‌ఐఏ) విచారణను చేపట్టింది. స్వప్న సురేష్‌ మాట్లాడిన ఆడియో మీడియాలో ప్రసారమైంది. పదవ తేదీన నలుగురు అనుమానితులపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. పదకొండవ తేదీన రెండవ నిందితురాలు స్వప్న సురేష్‌, నాలుగవ నిందితుడు సందీప్‌ నాయర్‌ను బెంగళూరులో ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. నకిలీ సర్టిఫికెట్‌తో స్వప్న సురేష్‌ ఐటిశాఖలో చేరిందన్న అంశంపై విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
పన్నెండవ తేదీన స్వప్న, సందీప్‌ నాయర్‌ అరెస్టును ప్రకటించిన ఎన్‌ఐఏ వారిని కరోనా సంరక్షణ కేంద్రాలకు తరలించింది.
పద్నాలుగవ తేదీన దర్యాప్తు అధికారులు ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌ ఇంట్లో తనిఖీలు జరిపారు. కస్టమ్స్‌ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. మొదటి నిందితుడు సరిత్‌ కుమార్‌ ఈ బంగారం విషయంలో శివశంకర్‌కు ఎలాంటి సంబంధం లేదని అయితే ఆయన నివాసంలో బంగారం గురించి తాము మాట్లాడినట్లు వెల్లడించాడని వార్తలు వచ్చాయి.
పదిహేనవ తేదీన ఐటి పార్కుల మార్కెటింగ్‌ మరియు కార్యకలాపాల డైరెక్టర్‌ అరుణ్‌ బాల చంద్రన్‌ను బాధ్యతల నుంచి ఐటి శాఖ తొలగించింది.శివశంకర్‌ను ప్రభుత్వ సస్పెండ్‌ చేసింది.
పదహారవ తేదీన తిరువనంతపురం యుఏఇ కాన్సలేట్‌ అధికారి రషీద్‌ అల్‌ సలామీ దేశం వదలి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అతని పేరుమీదే బంగారం ఉన్న సంచి వచ్చింది.
కనిపించకుండా పోయినా కాన్సులేట్‌ కార్యాలయ గన్‌మన్‌ చేతికి గాయాలతో 17వ తేదీన కనిపించాడు. ఐటి శాఖలో స్వప్న సురేష్‌ చేరటంలో శివశంకర్‌ పాత్ర ఉన్నట్లు అతనికి జారీ చేసిన సస్పెన్షన్‌ నోటీసులో పేర్కొన్నారు. పందొమ్మిదవ తేదీన కేసులోని మూడవ నిందితుడైన ఫైజల్‌ ఫరీద్‌ను దుబారులో అరెస్టు చేశారు.

ముఖ్య మంత్రి మీద ఆరోపణలేమిటి ? నిందితులు-వారికి తోడ్పడిన వారి కథేమిటి ?


ఐటిశాఖను ముఖ్యమంత్రే చూస్తున్నారు. ఆ శాఖ అధికారి సిఎం కార్యాలయంలో ముఖ్యకార్యదర్శిగా కూడా ఉన్నాడు, అతని ప్రమేయంతోనే స్వప్న సురేష్‌ను ఐటి శాఖలో నియమించారు కనుక ముఖ్యమంత్రి నియమించినట్లుగా భావించి ఆయన పదవికి రాజీనామా చేయాలంటూ బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన వారు యుగళగీతాలు పాడుతూ రోడ్లెక్కుతున్నారు.
కేరళలో జనం టీవీ ఛానల్‌ బిజెపికి చెందినది. దాని వార్తల సమన్వయకర్త మరియు సంపాదకుడు అయిన అనిల్‌ నంబియార్‌ దొంగ బంగారం ఉదంతంలో నిందితులైన స్వప్న సురేష్‌, సందీప్‌ నాయర్‌లతో ఫోన్‌లో మాట్లాడినట్లు వెల్లడైంది. వారు పోలీసులకు దొరకకుండా దాక్కొనేందుకు అతనికి ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతో ఉన్న సంబంధాలతో సహకరించినట్లు మీద విమర్శలు వచ్చాయి. కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేసిన రోజునే నిందితులు పరారయ్యారు. స్వప్న సురేష్‌ -అనిల్‌ మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణలను ఎన్‌ఐఏ సంపాదించినట్లు వార్తలు వచ్చాయి. వాటి ప్రకారం సదరు జనం టీవీ సంపాదకుడు అనిల్‌ నంబియార్‌కు కేంద్ర మంత్రి వి మురళీధరన్‌, బిజెపి నేత కె సురేంద్రన్‌, కర్ణాటక బిజెపి అగ్రనేతలతో సంబంధాలున్నట్లు బయటకు వచ్చింది. తిరువనంత పురం నుంచి బయటపడిన స్వప్న-సందీప్‌ బెంగళూరు వెళ్లబోయే ముందు వర్కల లోని హిందూ ఐక్యవేది నేతకు చెందిన రిసార్టుకు వెళ్లారు. జూలై ఐదవ తేదీన బంగారం సంచిలో ఏముందో తెరిచి చూసేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ ప్రక్రియ ప్రారంభం కావటానికి కొద్ది సేపటికి ముందు అంటే మధ్యాహ్నం 12.42 నిమిషాలకు అనిల్‌ నంబియార్‌ నుంచి స్వప్నకు ఫోన్‌ వచ్చింది, 262 సెకండ్లు మాట్లాడుకున్నారు. అంతకు ముందు అనిల్‌- సందీప్‌ మధ్య కూడా ఫోన్‌ సంభాషణలు చోటు చేసుకున్నట్లు నమోదైంది. దీన్ని బట్టి బంగారం దొంగరవాణా గురించి అనిల్‌కు ముందే తెలుసు అని భావిస్తున్నారు.
దొంగబంగారం వార్త మీడియాలో గుప్పుమన్న తరువాత అనిల్‌ నంబియర్‌ తన ఫేస్‌బుక్‌ పోస్టులో స్వప్నకు తాను ఫోన్‌ చేసినట్లు అంగీకరిస్తూ వార్తల అదనపు సమాచారం కోసం కాంటాక్టు చేశానని చెప్పాడు. సాధారణంగా మీడియా సంస్ధలలో సంపాదకులకు బదులు విలేకరులే వివరణలకోసం ప్రయత్నిస్తారు. సంపాదకుడు అనిల్‌ నంబియారే రంగంలోకి దిగారు అనుకుంటే దానికి అనుగుణ్యంగా జనం టీవీలో వార్తలే దర్శనమివ్వలేదని వెల్లడైంది. ఈ కేసులో ఇద్దరు ముస్లిం లీగ్‌ కార్యకర్తలను కూడా ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ఇంకా మరి కొందరి కోసం గాలిస్తున్నారు.


నిందితులకు బిజెపితో సంబంధాలు !
వివిధ పార్టీల నేతలతో పలువురు కలుస్తున్న సందర్భాలను బట్టి కలిసే వారు చేసిన నేరాలతో పార్టీల నేతలకు సంబంధాలు ఉన్నాయని చెప్పటం కొన్ని సందర్భాలలో వాస్తవ విరుద్దం కూడా కావచ్చు. ఈ కేసులో స్వప్న సురేష్‌ అనే మహిళ పేరు ముంతాజ్‌ ఇస్మాయిల్‌ అని, అరెస్టయిన మాజీ పిఆర్‌ఓ సరిత్‌ పూర్వాశ్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌లో సభ్యుడని బిజెపి నేతలు ప్రచారం చేస్తున్నారు. స్వప్న సురేష్‌ వివరాల గురించి వికీపీడియా సమాచారం ప్రకారం ఆమె పేరు ముంతాజ్‌ ఇస్మాయిల్‌ అని తలిదండ్రులు హిందువులని ఉంది. భర్త పేరు, ఇతర వివరాలు లేవు. ఒక వేళ ఆమె మతాంతర వివాహం చేసుకొని పేరు మార్చుకొని ఉండవచ్చు. ఇక సరిత్‌ పూర్వాశ్రమంలో ఏ సంస్ధతో ఉన్నాడని కాదు, వర్తమానంలో ఎవరితో ఉన్నారన్నది ముఖ్యం.
మరో నిందితుడు సందీప్‌ నాయర్‌కు బిజెపికి సంబంధం లేదని ఆ పార్టీ నేతలు నమ్మబలుకుతున్నారు. ఆ పార్టీనేత కుమనమ్‌ రాజశేఖరన్‌తో కలసి ఉన్న ఫొటో బయటకు రాగానే అనేక మందితో తమ నేత కలుస్తారని, అంత మాత్రాన వారితో సంబంధం ఉన్నట్లు కాదని, సందీప్‌ ఎవరో తెలియదని బిజెపి సమర్ధించుకుంది.అయితే తన కుమారుడు బిజెపిలో చురుకైన కార్యకర్త అని సందీప్‌ తల్లి చెప్పింది ( జూలై 11వ తేదీ టెలిగ్రాఫ్‌) విదేశాంగ శాఖ సహాయ మంత్రి, కేరళ బిజెపి నేత వి. మురళీధరన్‌ బంగారం ఉన్న సంచి దౌత్యవేత్తలు ఉపయోగించేది కాదని చెప్పారు. అలా చెప్పాల్సిన అవసరం మంత్రికి ఏమి వచ్చింది. కస్టమ్స్‌ క్లియరింగ్‌ ఏజంట్ల అసోసియేషన్‌ అధ్యక్షుడి హౌదాలో ఆ సంచి విడుదల గురించి కస్టమ్స్‌ అధికారులతో మాట్లాడినట్లు హరిరాజ్‌ అనే వ్యక్తి చెప్పాడు. అతని ఫేస్‌బుక్‌లో నరేంద్రమోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అభిమానిగా చెప్పుకున్నాడు, తనకు బిఎంఎస్‌ లేదా బిజెపితో సంబంధం లేదని కూడా చెప్పుకున్నాడు. వచ్చిన సంచి దౌత్యవేత్తలు ఉపయోగించేది అయితే హరిరాజ్‌కు సంబంధం ఏమిటి ? అతని సిఫార్సుల అవసరం ఎందుకు ఉంటుంది? ఏ దౌత్యవేత్త తరఫున దాన్ని విడుదల చేయాలని అడిగినట్లు ? ఒక వేళ దౌత్యవేత్తది కానట్లయితే, దాని మీద చిరునామా దౌత్యకార్యాలయ అధికారి పేరు ఎందుకు ఉంది? ఎవరి కోరిక మీద హరిరాజ్‌ జోక్యం చేసుకున్నట్లు ?
విమానాశ్రయ సిసిటీవీలో చిత్రాలను పరిశీలించినపుడు గతంలో కూడా అనేక సార్లు స్వప్న సురేష్‌ విమానాశ్రయంలో కనిపించినట్లు బిజెపినేతలు చెబుతున్నారు ? వాస్తవం కూడా కావచ్చు, విమానాశ్రయాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి, అక్కడ భద్రత, తనిఖీ బాధ్యత కేంద్రానిదే, అలాంటపుడు ఆమె మీద అంతకు ముందు ఎందుకు అనుమానం రాలేదు ? ఇలా ఈ కేసులో అనేక అనుమానాలు తలెత్తాయి. స్వప్న సురేష్‌కు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారితో సంబంధాలున్నాయనే ఒక్క అంశం తప్ప ఈ కేసులో సిఎం లేదా కార్యాలయానికి ఉన్న సంబంధాల గురించి ఇంతవరకు ఎవరూ చెప్పలేదు.
బిజెపి నేతల ప్రకటనలు, వారు వీధులకు ఎక్కుతున్న తీరు తెన్నులను చూస్తే అనుమానాలు తలెత్తటం సహజం. కేరళ వామపక్ష ప్రజాతంత్ర సంఘటన ప్రభుత్వం ఎక్కడ దొరుకుతుందా, సిపిఎం నేతలను ఎక్కడ ఇరికించాలా అని అవకాశం కోసం బిజెపి ఎదురు చూస్తున్నదనేది బహిరంగ రహస్యం. రాజ్యాంగ వ్యవస్ధలు, సిబిఐ, ఆదాయపన్ను, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఇడి) వంటి సంస్దలు, వ్యవస్ధలను దుర్వినియోగ పరచి ప్రత్యర్ధి పార్టీలు, ప్రభుత్వాలను బదనామ్‌ చేయటంలో యాభై సంవత్సరాలలో కాంగ్రెస్‌ ఎంత అపవాదు మూటకట్టుకుందో బిజెపి తొలి ఐదేళ్లలోనే అంతకంటే ఎక్కువ సంపాదించుకుంది. ఇప్పుడు ఎన్‌ఐఏను కూడా దుర్వినియోగ పరచి ఏదో విధంగా కేరళ ప్రభుత్వాన్ని, పాలక పార్టీలను ఇరుకున పెట్టేందుకు బంగారం అవకాశాన్ని వినియోగించుకుంటుందా అని కూడా ఆలోచించాల్సి వుంది. ఎందుకంటే బిజెపి నేతల మాటలే అందుకు ఆస్కారం కలిగిస్తున్నాయి. బంగారం స్మగ్లింగ్‌ ఒక్క కేరళలోనే జరుగుతున్నట్లు, అది దేశ భద్రతకు ముప్పు అనీ, ఉగ్రవాదులకు డబ్బు అందచేసేందుకు వినియోగిస్తున్నారని, హైదరాబాద్‌ ఉగ్రవాదులకు అడ్డాగా ఉంది కనుక దీని మూలాలు అక్కడ కూడా ఉన్నాయని, దేశ ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీసే లక్ష్యంతో బంగారాన్ని అక్రమంగా తీసుకు వస్తున్నారని ఎన్‌ఐఏ అధికారులు వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి.
ఉగ్రవాదులు దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్నారు. అయితే వారి ఉనికి, కార్యకలాపాలు పెద్ద ఎత్తున సాగుతూ ప్రమాదకరంగా పరిణమించి గతంలో కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించిన వాటిలో కేరళ ఎన్నడూ లేదు. బంగారాన్ని ఉగ్రవాదుల కోసమే వినియోగిస్తున్నారనే నిర్ధారణకు గతంలో మన నిఘా సంస్ధలు ఎలాంటి నిర్దారణలకు రాలేదు. వారికి నిధుల అందచేసే పద్దతులలో అది కూడా ఒక అంశం కావచ్చు. దొంగ బంగారం ద్వారా దేశ ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీయ చూస్తున్నారన్న ప్రచారం వెనుక అతిశయోక్తి, ఇతర అంశాలు ఉన్నట్లు చెప్పవచ్చు. అమెరికా, ఐరోపా యూనియన్‌, చైనా రిజర్వుబ్యాంకుల వద్ద ఉన్న నిల్వల కంటే మన దేశంలో ప్రయివేటు వ్యక్తుల వద్ద ఇరవై వేల టన్నుల బంగారం ఎక్కువగా ఉంది అన్నది ఒక అంచనా. బంగారం మీద మన దేశంలో దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉండటం, దేశంలో డిమాండ్‌ బాగా ఉంటున్న కారణంగా అధికారికంగా దిగుమతి చేసుకుంటున్నదానిలో మూడవ వంతు అక్రమంగా వస్తున్నట్లు చెబుతున్నారు. కెనడాకు చెందిన ఇంపాక్ట్‌ అనే సంస్ధ గత ఏడాది నవంబరులో ఒక నివేదికను విడుదల చేసింది. ఏటా వెయ్యి టన్నుల వరకు వినియోగిస్తుండగా దానిలో 800-900 టన్నులు దిగుమతి అవుతోందని, 200 టన్నుల మేరకు అక్రమంగా వస్తున్నట్లు అంచనా వేసింది. ప్రస్తుతం మన దేశం ఎవరైనా బంగారం దిగుమతి చేసుకుంటే 12.5శాతం కస్టమ్స్‌ సుంకం, మూడు శాతం జిఎస్‌టి చెల్లించాలి, దిగుమతి చేసుకున్నదానితో ఆభరణాలు తయారు చేస్తే మరో ఐదుశాతం అదనపు జిఎస్‌టి చెల్లించాలి.
ఒక కిలోబంగారాన్ని అక్రమ పద్దతుల ద్వారా రప్పించుకుంటే ఆరు లక్షల రూపాయల మేర లాభం ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఒక గ్రాము బంగారం ఐదు వందల రూపాయల వరకు ధర పలుకుతున్నందున అక్రమ రవాణా లాభసాటిగా ఉంటోంది. ఆఫ్రికాలోని గ్రేట్‌ లేక్స్‌ ప్రాంతం నుంచి బంగారం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు రవాణా అవుతోంది. మన దేశంలోకి వస్తున్న అక్రమ బంగారంలో 75శాతం యుఏఇ నుంచి వస్తోందని ఇంపాక్ట్‌ నివేదిక అంచనా. అందువలన అక్కడ మన భారత గూఢచారులు ఏమి చేస్తున్నారన్నది ఒక ప్రశ్న. నేపాల్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, చైనా, భూటాన్‌ నుంచి కూడా బంగారం అక్రమంగా వస్తున్నట్లు గుర్తించారు.
దౌత్యవేత్తల సంచుల ద్వారా బంగారాన్ని గత ఏడాది కాలంలో 250 కిలోల వరకు తరలించి ఉంటారని ఎన్‌ఐఎ అధికారులు అంచనా వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కస్టమ్స్‌ అధికారుల అంచనా 20 సంచుల ద్వారా 180కిలోలు ఉండవచ్చని ఒక వార్త. వ్యక్తిగత లబ్ది కోసమా లేక దేశాన్ని అస్ధిరం కావించేందుకు బంగారాన్ని తరలిస్తున్నారా అనే కోణాల నుంచి దర్యాప్తు జరుగుతోంది. ఎన్‌ఐఏ నలుగురిని, కస్టమ్స్‌ సిబ్బంది 13మందిని ఇంతవరకు పట్టుకున్నారు.(సంఖ్యలో మార్పులు ఉండవచ్చు)
ప్రపంచంలోనే బంగారం స్మగ్లింగ్‌ ఎక్కువగా జరిగే దేశాల్లో మనది ఒకటి. అది ఎలా జరుగుతోందో గత ఏడాది నవంబరులోనే ఇంపాక్ట్‌ సంస్ధ తన నివేదికలో వెల్లడించినా మన కేంద్ర అధికారులు, నిఘా సంస్ధలు యుఏయి-దుబాయి మీద కేంద్రీకరించలేదన్నది స్పష్టం. ఒకటి శుద్ధి చేసిన బంగారం, రెండవది పాక్షికంగా శుద్ధిచేసిన బంగారు కడ్డీలు, బిస్కట్ల రూపంలో రవాణా అవుతోంది. మన దేశానికి చెందిన బంగారు వర్తకులు ఆఫ్రికాలోని తూర్పు ఆఫ్రికా టాంజానియా, ఉగాండాల నుంచి సేకరించి టాంజానియాలోని మవాంజా నుంచి దుబాయి తరలిస్తున్నారు. అక్కడి నుంచి మన దేశం వస్తోంది. ఉగాండా నుంచి సమీర్‌ భీమ్‌జీ అనే వ్యాపారి తరచూ భారత్‌ను సందర్శిస్తున్నట్లు అతనికి ప్రత్యక్షంగా భారత్‌తో బంగారం వ్యాపార లావాదేవీలు ఉన్నాయో లేదో తెలియదు గానీ ఉగాండాలోని ముగ్గురు ప్రముఖ ఎగుమతిదారుల్లో ఒకడని ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం గుర్తించింది. అయితే ముంబాయి స్మగ్లర్‌ ఒకడు సమీర్‌ అక్రమవ్యాపారి అని నిర్ధారించినట్లు ఇంపాక్ట్‌ నివేదిక పేర్కొన్నది.2016లో ఉగాండా అధికారులు జరిపిన దాడిలో అతని ఇంటిలో51.3కిలోల బంగారం దొరికింది. అతనికి మన దేశానికి చెందిన బంగారు రాజుగా పేరు పడిన ప్రధ్వీరాజ్‌ కొఠారీకి సంబంధాలు ఉన్నట్లు మన దేశ అధికారులకు సైతం తెలుసు.
మన దేశంలో బంగారు శుద్ధి రంగాన్ని ప్రోత్సహించేందుకు 2013లో నాటి ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చిన కారణంగా 2012లో శుద్ధి చేయని బంగారం దిగుమతి 23 టన్నులు ఉండగా 2015 నాటికి 229 టన్నులకు పెరిగింది. శుద్ధి చేయని బంగారం పేరుతో పరిశుద్దమైన బంగారాన్ని దిగుమతి చేసుకున్నారు. చిత్రం ఏమిటంటే అసలు ఆయా దేశాల్లో ఎంత బంగారం ఉత్పత్తి అవుతోంది, అసలు ఉత్పత్తి జరుగుతోందా లేదా, ఎగుమతి చేయగలదా లేదా అని కూడా తెలుసుకోకుండా మన దేశం కొన్ని దేశాల నుంచి దిగుమతులకు అనుమతి ఇచ్చింది. ఉదాహరణకు 2014-17 మధ్య మన దేశం డొమినికన్‌ రిపబ్లిక్‌ నుంచి 100.63 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది, నిజానికి అదేశానికి అంత ఎగుమతి చేసే స్ధాయి లేదు.


ఇత్తడి రద్దు పేరుతో 4,500 కిలోల బంగారం దిగుమతి !
మన నిఘా అధికారులు నిద్రపోవటం లేదా కుమ్మక్కు కారణంగా ఇత్తడి రద్దు పేరుతో 2017 ఫిబ్రవరి నుంచి 2019 మార్చినెల వరకు 4,500 కిలోల బంగారాన్ని కంటెయినర్ల ద్వారా అక్రమంగా రవాణా చేశారని మళయాళ మాతృభూమి పత్రిక 2019 నవంబరు 24న ఒక వార్తను ప్రచురించింది. ఎక్స్‌రే యంత్రాలు కూడా వాటిని పసిగట్టలేని విధంగా దాన్ని తరలించారు.షార్జా పారిశ్రామిక ప్రాంతం నుంచి భారత్‌కు చేరింది. ఈ రవాణా వెనుక నిసార్‌ అలియార్‌ అనే వ్యక్తి ఉన్నాడు.అతనికి షార్జాలో గోడవున్లు ఉన్నాయి.అధికారుల కన్ను గప్పేందుకు అక్కడ బంగారాన్ని వివిధ రూపాల్లోకి మార్చి దానికి నల్లని రంగు పూసేవారు, ఇత్తడి రద్దు మధ్య దానిని ప్రత్యేకంగా అమర్చి కంటెయినర్లకు ఎక్కించి నట్లు ఆ పత్రిక రాసింది.ఆ బంగారాన్ని గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో ఉన్న బ్లూ సీ మెటల్స్‌ కంపెనీ పేరు మీద రప్పించేవారు, జామ్‌ నగర్‌ చేరిన తరువాత దానిని శుద్ది చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపేవారు. కేరళలోని పెరుంబవూర్‌కు చెందిన బంగారు చక్రవర్తులుగా పేరు మోసిన వ్యక్తులు మధ్యవర్తులుగా బంగారాన్ని సరఫరా చేసేవారు. గత ఏడాది మార్చి 29న నిసార్‌ అలియార్‌ నుంచి డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌(డిఆర్‌ఐ) వారు 185కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. దాంతో బంగారం స్మగ్లింగ్‌ సంబంధాలు అనేకం బయటకు వచ్చాయి.
దేశంలో 2016కు ముందు రెండున్నర సంవత్సరాలలో రెండువేల కోట్ల రూపాయల విలువగల ఏడువేల కిలోల బంగారాన్ని అక్రమంగా చేరవేసినట్లు అదే ఏడాది సెప్టెంబరు 26న డిఆర్‌ఐ ఢిల్లీ జోనల్‌ విభాగం గుర్తించింది. గౌహతి నుంచి 617 సందర్భాలలో ఢిల్లీకి బంగారాన్ని విమానాల్లో తరలించినట్లు విచారణలో వెల్లడైంది.ఈ బంగారం మయన్మార్‌ నుంచి వచ్చినట్లు తేలింది. ప్రతి ఏటా అనేక చోట్ల ఇలాంటి ఉదంతాలు బయటపడటం అధికారులు నేరగాండ్లను అరెస్టు చేయటం సర్వసాధారణంగా జరుగుతోంది. 2015 మార్చినెలలో సిలిగురిలో 87కిలోలు, మరుసటి ఏడాది ఆగస్టులో కొల్‌కతాలో 58 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ఈ రెండు ఉదంతాల్లో నిమగమైన ముఠా మొత్తం 200 కోట్ల రూపాయల విలువైన 700 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించినట్లు తేలింది. ఒక ఉదంతంలో సిలిగురి నుంచి మణిపూర్‌కు తరలిస్తున్న ఐదుకోట్ల రూపాయలకు సమానమైన ఏడున్నరలక్షల డాలర.్లను కనుగొన్నారు.ఈ సొమ్ముతో మయన్మార్‌లో బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. అంతకు ముందు .274 టన్నుల బంగారం అక్రమంగా తరలించారని అంచనా వేసిన అధికారులు కఠిన చర్యలు తీసుకున్న తరువాత గత ఏడాది కొంతమేర తగ్గింది.
బిజెపి నేతలు ముందుకు తెస్తున్న తర్కం ప్రకారం ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్న అధికారి నిందితుల్లో ఒకరైన స్వప్న సురేష్‌కు పొరుగుసేవల ఉద్యోగం ఇచ్చారు. కనుక సిఎంకు వారితో సంబంధం ఉంది. ఇదే తర్కాన్ని మిగతా దొంగబంగారం కేసులకు కూడా వర్తింప చేస్తే మొత్తంగా బిజెపి నేతలకే చుట్టుకుంటుంది. కస్టమ్స్‌ శాఖ, ఇతర కేంద్ర సంస్దల వైఫల్యం కారణంగానే దేశంలోకి బంగారం అక్రమ రవాణా జరుగుతోంది కనుక నరేంద్రమోడీ లేదా ఆ శాఖలను చూసే మంత్రులు అధికారులను చూసీ చూడనట్లు వ్యవహరించమని ఆదేశించారని అనుకోవాలా ? దుబాయి అక్రమ రవాణా కేంద్రమని కేంద్రానికి తెలియదా ? దౌత్యవేత్తల సంచుల్లో లేదా తనిఖీకి అవకాశం లేనందున స్వయంగా వారే తరలించినా బాధ్యత ఎవరిది ? ఏ రాష్ట్రంలో దొంగబంగారం లేదా మరొక అక్రమం జరిగితే ఆ రాష్ట్రాల పాలకులకు సంబంధం ఉందంటే మిగిలిన కేసుల్లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను రాజీనామా చేయాలని ఎందుకు కోరలేదు ? దొరికింది విమానాశ్రయంలో, అదుపులోకి తీసుకున్నది కస్టమ్స్‌ అధికారులు, నిందితులు దొరికింది బిజెపి పాలనలోని బెంగళూరులో, ఆ పార్టీ కార్యకర్తలకూ సంబంధం ఉంది, ఒకడిని అరెస్టు చేశారు. అందువలన అసలు రాజీనామా చేయాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వం అధిపతిగా నరేంద్రమోడీ నైతికంగా ఆపని చేయాలా వద్దా ?