Tags
Compulsory licensing, compulsory licensing of patented drugs, Coronavirus and pharmaceutical companies, Coronavirus outbreak
డాక్టర్ కొల్లా రాజమోహన్
కొద్ది రోజులుగా కోవిడ్ 19 కి మందులను కనుగొన్నట్లుగా వార్తలు పెరిగాయి, ప్రజలలో ఆశలు చిగురిస్తున్నాయి. మందులున్నాయికదా అని ముందు జాగ్రత్తలను వదిలేసి కరచాలనాలు, కౌగిలింతలూ, కేరింతలూ, మొదలయ్యే ప్రమాదం వుంది. ఇక కరోనా వ్యాధి మనల్నేమీ చేయలేదనే ధైర్యం ప్రజలలో పెరుగుతున్నది. కొన్నివందల కంపెనీలు మందుల తయారీలో పోటీలు పడుతున్నాయి. అందరికన్నా ముందు మార్కెట్ లో ప్రవేశించి త్వరగా అమ్ముకోవాలని పరుగెత్తుతున్నాయి. ఉత్పత్తి సామర్ధ్యం ఉన్నచిన్న కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయి.
కొత్తగా వచ్చే మందులన్నీ కొత్తవేనా? ప్రభావమెంత ?
క్వారంటైన్‌తో ఇపుడు వైద్యం మొదలవుతున్నది. వ్యాధి లక్షణాలు ప్రబలే కొద్దీ రోగులను కోవిడ్ హాస్పిటల్‌కి మార్చి ప్రాణాన్ని నిలపటానికి ఆక్సిజన్ వెంటిలేటర్ ద్వారా ఇస్తున్నారు. చికిత్సలో భాగంగా అందుబాటులోవున్న యాంటీ వైరల్ , 30 రకాల మందులను కాంబినేషన్లలో ఇంతవరకూ వాడారు. ఇప్పటివరకూ వున్న మందులలో కరోనావైరస్ ను విజయవంతంగా సంహరించే మందు ఒక్కటి కూడా లేదనే వాస్తవాన్నిగ్రహించాలి. ఫలానా మందు పనిచేస్తుందని విశ్వసనీయవర్గాలు చెప్తే, వాడి చూడండని ఐసీయమ్‌ఆర్ ప్రొటోకాల్‌లో లేని మందులకు కూడా అనుమతులను ఇస్తున్నది. అత్యవసర సందర్భాలలో మాత్రమే వాడే రెమిడెసివీర్ అనేమందు నుండి మలేరియాకు, రుమటాయిడ్ ఆర్దరైటిస్‌కు వాడే క్లోరోక్విన్, లో మాలిక్యులార్ వైట్ హెపారిన్ డీప్ వైన్ త్రంబోసిస్ రాకుండా దేశీయ ట్రెడిషనల్ మందుల వరకూవాటిచూస్తున్నారు.
ఒక దశాబ్దం క్రితం కనిపెట్ట్టిన రెమిడెసివీర్ అనేమందును మొదట హెపటైటిస్ చికిత్సకు అభివృద్ధి చేశారు. ఆఫ్రికాలో ఎబోలా వ్యాధిని నియంత్రించటానికి మందుగా ప్రయోగించారు. తగ్గించటంలో ఉపయోగపడలేదు. అయినా ట్రయల్స్‌లో దుష్పలితాలేమీ కలగనందున కోవిడ్-19 చికిత్సలో క్లినికల్ ట్రయల్స్ మొదలెట్టారు. రెమిడెస్విర్ జనరిక్ మందును తయారు చేయటానికి డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ ) అనుమతిని ఇచ్చారు. హెటిరో , సిప్లా, జుబిలెంట్ లైఫ్ సైన్సెస్, డాక్టర్ రెడ్డీస్, జైడస్ కాడిలా కంపెనీలతో గిలియాడ్ ఒప్పందాలు కుదుర్చుకున్నది .కోవిఫర్ బ్రాండ్ పేరున 100 మి.గ్రా.ఇంజెక్షన్గను ఒకరు విడుదలచేశారు. మన దేశంతోపాటు, 127 దేశాలలో విక్రయించుకోవటానికి ఈ కంపెనీలకు అనుమతి లభించింది.
రెమ్డెసీవీర్ అందుబాటులోకివచ్చిన తరువాత కూడా మరణాల రేటు తగ్గకపోవటం ఆందోళన కలిగిస్తున్నది. అయితే రోగి శరీరంలోని వైరస్ లోడ్ తగ్గటం ప్రోత్సాహకరంగా వుంది. కోలుకోవడానికి సమయం15 నుంచి 11 రోజులకు తగ్గించటంలో స్పష్టమైన ప్రభావం చూపింది. అయిదురోజుల చికిత్సకు మందు ఖర్చు 40 వేల రూపాయలు అంటున్నారు, కానీ అపుడే బ్లాక్ మార్కెట్లో 3-4 రెట్లు ఎక్కువకు అమ్ముతున్నారు. ఢిల్లీ వంటి చోట్ల రూ.5,400 కు ఇవ్వవలసిన ఒక డోసు మందును రూ. 30,000 వేలకు అమ్ముతున్నారు. ధనవంతులు కరోనా వ్యాధిని అందరికీ పంచారు, ఆరోగ్యాన్ని కొనుక్కుంటున్నారు, పేదప్రజలు కరోనాతో సహజీవనం చేస్తున్నారు.
అమెరికన్ కంపెనీ ఐన గిలియాడ్ సైన్సెస్ కు రెమిడెసీవీర్ మందుల పై పేటెంట్ హక్కు ఉన్నది. రాబోయే మూడు నెలలలో ఉత్పత్తి చేసిన రెమిడెసీవీర్ మందులన్నీ అమెరికాకే ఫస్ట్ ఇవ్వాలని ట్రంప్ దురహంకారంతో ఆదేశించాడు. సెప్టెంబరు వరకు తయారయ్యే మందులన్నీ అమెరికా ప్రజలకే అంటున్నాడు. మా సంగతేంటని యూరప్ నాయకులు అడుగుతున్నారు. ఉత్పత్తిని పెంచి అందరికీ మందును అందిస్తామని గిలియాడ్ కంపెనీ చెప్తున్నది. రెమిడెసీవీర్ మందును ఇంజెక్షన్ గా తయారుచేయటానికి 3 డాలర్లుఱర్చవుతుంది. 3000 డాలర్లకు అమ్మటానికి కంపెనీ నిశ్చయించింది.
2) ఇటోలిజుమాబ్ మరియు టోసిలిజుమాబ్ మందులను ఇన్వెస్టిగేటివ్ ధెరపీ గా ఉపయోగించటానికి అధికారులు అనుమతినిచ్చారు. శరీరంలో కరోనా వైరస్ ప్రవేశించినపుడు , ఈ మందులవలన కత్రిమంగా తయారైన యాంటీబాడీస్ వైరస్‌ని ఎదుర్కొంటాయనే ప్రతిపాదనతో బెంగుళూరులో వున్న బయోకాన్ కంపెనీ ముందుకొచ్చింది. ఫేజ్-2 పరిశోధనలో మరణాలను గణనీయంగా తగ్గించిందని కంపెనీ పత్రికలకు వెళ్ళడించింది. ఐసీయమ్‌ఆర్ డైరక్టర్ భార్గవ గారు ఈ మందులు మరణాలను తగ్గించలేదనీ, కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చన్నారు. ఇంకా ఎక్కువ పరిశోధనలు అవసరమన్నారు. అయితే ఈ మందులు మంచికంటే ఎక్కువ హాని చేయవచ్చని కూడా నిపుణులు ఆందోళన చెందుతున్నారు. టోసిలాజుమాబ్ ను వాడాలంటే రోగి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వుండాలి, 3) ఫావిపిరవిర్‌అనే యాంటీవైరల్ మందును మైల్డ్, మోడరేట్ లక్షణాలున్నకోవిడ్ 19 కేసులలో వాడవచ్చని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతించారు. ఇన్ ఫ్లూయంజాను నియంత్రించటానికి ఈ మందును గ్లిన్ మార్క్ అనే జపాన్ కంపెనీ కనిపెట్టింది. 150 మంది మనుష్యులపై క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నట్లుగా గ్లిన్ మార్క్ కంపెనీ ప్రకటించింది. ఒక టేబ్లెట్ ను రూ.103 రేటు ప్రకటించి రూ 75 కి తగ్గించారు. దారుణంగా బ్లాక్ మార్కెట్ నడుస్తున్నది.
4) హైడ్రాక్సీ క్లోరోక్విన్: మార్చి 19 న డోనాల్డ్ ట్రంప్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను ”చాలా ప్రోత్సాహకరమైనది” ,” చాలా శక్తివంతమైనది” మరియు ”గేమ్ ఛేంజర్” అని పత్రికా విలేఖరుల సమావేశంలో అభివర్ణించారు. తరువాత ప్రపంచవ్యాపితంగా అనూహ్యమైన డిమాండ్ ఏర్పడింది.
5) ప్లాస్మా ధెరపీుప్లాస్మా ధెరపీ అంటే రోగనిరోధక శక్తి బాగావున్నవారి రక్తంనుండి ప్లాస్మాను వేరుచేసి రోగనిరోధక శక్తి తక్కువగావున్నవారికి ఇవ్వటాన్ని ప్లాస్మా ధెరపీ అంటారు. కోవిడ్-19 వ్యాధినుండి పూర్తిగా కోలుకున్నవారికి కరోనా వైరస్ ను ఎదుర్కొనే రోగనిరోధకణాలు యాంటీబాడీస్ ఎక్కువగావుంటాయి. వారి ప్లాస్మాను వేరుచేసి కరోనాతో బాధపడుతున్న రోగులకు ఇచ్చి పరిశోధనలు జరుపుతున్నారు. ఫలితాలు ప్రోత్సాహకరంగా వున్నాయంటున్నారు. కోలుకున్నరోగులనుండి రక్తాన్ని సేకరించి రోగులకు ఇవ్వటం కొత్తేమీకాదు. వంద సంవత్సరాల క్రితం స్పానిష్ ఫ్లూ వచ్చినపుడు కూడా ప్లాస్మాధెరపీ ద్వారా చికిత్సచేశారు.
6) క్యూబా లో 1980 లో కనిపెట్టిన ”ఇంటర్ ఫెరాన్ ఆల్ఫా2” వైరస్ వ్యాధుల చికిత్స లో ప్రముఖమైనది. ప్రాధమిక దశలో వైరస్ వ్టాధులన్నిటిలోను ఉపయోగపడ్తుందని, అమెరికా తో సహా ప్రపంచవ్యాపిత పరిశోధనలు నిరూపించాయి. చైనా తో కలిసి సంయుక్తంగా ఉత్పత్తి చేస్తున్న ఈ మందును 40 దేశాలలో వాడుతున్నారు. వూహాన్‌లో కోవిడ్-19 ప్రబలినపుడు ఇంటర్ ఫెరాన్ ఆల్ఫా2 ను వాడి సత్ఫలితాలను సాధించారు.
కరోనా మందులకు, వ్యాక్సిన్ కు కంపల్సరీ లైసెన్సింగ్ (తప్పనిసరిలైసెన్స్) ఇవ్వాలి. ఎక్కువ కంపెనీలకు మానుఫ్యాక్చరింగ్ లైసెన్సు ఇచ్చిప్రభుత్వం ధరలను నియంత్రించాలి. ప్రభుత్వాధీనంలో కరోనా మందులను అవసరమయిన ప్రజలందరికీ అందుబాటులో వుంచాలి.
కొత్త ఔషధాలను, టీకాలను సైంటిస్టులు ప్రజలప్రయోజనాలకోసం కనిపెట్తారు. ఆ ఖర్చులు భరించిన కంపెనీలు ఆ ఔషధాన్ని మరే కంపెనీ తయారుచేయకుండా పేటెంట్ తీసుకుంటాయి. 20 సంవత్సరాలు ఆ మందును తమ ఇష్టమొచ్చిన రేటుకి ప్రపంచంలో ఎక్కడైనాఅమ్ముకోవచ్చు. పోలియో వ్యాధినిరోధక మందును డాక్టర్ జోనాస్ సాల్క్ 1955 లో కనుగొన్నారు. ‘ పోలియో వాక్సిన్ పై పేటెంట్ ఎవరిది” అని అడిగితే ”ప్రజలది’ అని చెప్తూ ” సూర్యుని పేటెంట్ చేయగలమా” అన్నారు.
కరోనా టీకాల తయారీ.
ఇప్పటివరకూ కోవిడ్-19 కి వాక్సీన్ ను రూపొందించటానికి 200 పరిశోధనా బందాలు పోటీపడుతున్నాయి. కొన్ని సంవత్సరాలు పట్టే పరిశోధనలను కొన్ని నెలలకు కుదించారు. కంపెనీలన్నీ క్లినికల్ ట్రయల్స్ దశలోవున్నాయి. పరుగు పందెంలో ముందుగా వచ్చి మార్కెట్‌ను శాసించి అంతులేని లాభాలను పొందాలని తీవ్రప్రయత్నాలు చేస్తున్నాయి.
బ్రిటన్ ఆక్సఫర్డ్ జెన్నర్ ఇన్స్టిట్యూట్‌లో అసాధారణ వేగంతో ఫేజ్-1, ఫేజ్-2 ట్రయల్స్ పూర్తి చేశారని, ప్రఖ్యాత మెడికల్ పత్రిక లాన్సెట్ ప్రకటించింది. మూడవ దశలో బ్రిటన్‌లో పది వేలమంది వాలంటీర్లపై ఆగస్టునెలలో ప్రయోగం ప్రారంభమవుతుందన్నారు. వాక్సిన్‌ను ఆస్ట్రా జనికాతో కలిసి పూనేలో తయారు చేయటానికి సీరమ్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ సంవత్సరం చివరకు వంద కోట్ల డోసులను మార్కెట్‌లోకి తేవటానికి పూర్తిస్ధాయిలో తయారవుతున్నారు.
కోవిడ్-19 కొరకు వ్యాక్సిన్ల తయారీలో చైనా లోని సినోఫార్మా , సినోవాక్ బయోటెక్ సంస్ధలు ఫేజ్-2 ట్రయల్స్ ను పూర్తిచేశాయని లాన్సెట్ పత్రిక ప్రకటించింది. ప్రపంచవ్యాపితంగా వివిధ దేశాలలోని వేలాదిమంది వాలంటీర్లపై ఫేజ్-3 వ దశ పరిశోధనలకు తయారవుతున్నారు. ఆరు బ్రెజిలియన్ రాష్ట్రాలలో 9000 మంది పై అధ్యయనం ప్రారంభమయిందని గవర్నర్ జోవా డోరియా తెలిపారు. టీకా సమర్ధవంతమైనదని రుజువయితే 120 మిలియన్ డోసులను ఉత్పత్తి చేయబోతున్నామని గవర్నరు అన్నారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ , చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కూడావ్యాక్సిన్ పరిశోధనలలో ముందున్నదంటున్నారు, అడినోవైరల్ ఆధారిత వ్యాక్సిన్ లను కొన్ని చైనా కంపెనీలు అభివద్ది చేస్తున్నాయి.
విజయవంతమౌతున్న చైనా వ్యాక్సిన్లను చూసిన తరువాత, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ , చైనాతో కలిసి పనిచేయటానికి సుముఖత వ్యక్తంచేసాడు.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ , ఐ సీ యమ్ ఆర్ సంయుక్తంగా కొరోనా వైరస్ వాక్సిన్ తయారీలో ముందున్నాయి. భారత్ బయోటిక్ అభివద్ది చేసిన” కోవాగ్జిన్ ” ఇంజెక్షన్ రూపంలో ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించారు. ఢిల్లీ లోని ఎయిమ్స్, హైదరాబాద్ నిమ్స్, విశాఖ కేజీ హెచ్ తోపాటుగా12 ఆసుపత్రులను గుర్తించారు.
కరోనాకు ప్రపంచంలో అందరికన్నా ముందు తొలి టీకాను బయటకు తీసుకురావాలని రష్యా ప్రయత్నిస్తోంది. క్లినికల్ ప్రయోగాలు పూర్తయ్యాయని, టీకా సురక్షితమైనదనీ, ఆగస్టు నెల ఆరంభంలో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా ప్రకటించింది. మూడో దశ ప్రయోగాలను రష్యాతోపాటు ఆరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలలో వేలమందిపై నిర్వహించనున్నారు. మూడోదశ ప్రయోగాలకు సమాంతరంగా టీకాల ఉత్పత్తికి ప్రణాలికలు రచించారు. ఈ ఏడాది 3 కోట్ల డోసులను రష్యాఉత్పత్తి చేస్తుందని, విదేశాలలో 17 కోట్ల టీకాలను ఉత్పత్తి చేయ ప్రయత్నిస్తున్నామన్నారు.
అత్యవసర పరిస్ధితులలో ” కంపల్సరీ లైసెన్సు ”, కరోనా మహమ్మారికి మించి అత్యవసరం ఏమున్నది.?
డబ్లు టీ ఓ నిబంధనలను తయారుచేసేటపుడు ఒక చిన్న వెసులుబాటును పేద దేశాలు కల్పించుకున్నాయి. ఆ ప్రకారం ఒక దేశంలో ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్ధితులు ఏర్పడినపుడు కంపల్సరీ లైసెన్సింగ్ ఇవ్వటానికి అవకాశంవున్నది. పేటెంట్ చట్టం సెక్షన్ 84 ప్రకారం ప్రజల అవసరాలను తీర్చలేనపుడు మందు అందుబాటులో లేకపోతే, మందు ఖరీదును ప్రజలు భరించలేకపోతే, స్ధానిక మార్కెట్ లో అందుబాటులో లేకపోతే పెటెంట్ ఆఫీసర్ స్ధానిక ఉత్పత్తి దారునికి తప్పనిసరిగా లైసెన్సును ఇవ్వవచ్చు. ఛాలా తక్కువ ధరకు ప్రాణాలను నిలిపే మందుల తయారీకి అనుమతించవచ్చు. పేటెంట్ చట్టాన్ని పక్కన పెట్టవచ్చు. కానీ శక్తివంతమైన, దుర్మాగ్గమైన, నీతీ జాతీ లేని బహుళజాతి కార్పోరేట్ కంపెనీలకెదురొడ్డి నిలిచేదెవరు. సెక్షన్ 92 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా కంపల్సరీ లైసెన్సును ఇవ్వవచ్చు . చాలా ఖర్చుపడి పరిశోధన జరిపినందుకు పేటెంట్ కంపెనీ కి అమ్మకాలలో 4-6 శాతం రాయల్టీగా ఇచ్చేటట్లుగా కూడా చట్టంలో వుంది.
2012 మార్చినెలలో ఇండియన్ పెటెంట్ ఆఫీసర్ పీ హెచ్ కురియన్ మొదటిసారి ప్రజలకు అనుకూలంగా కంపల్సరీ లైసెన్సింగ్ ఆర్డరును ఇచ్చి చరిత్రలో నిలిచారు. భారతదేశంలో నెలకు సరిపోయే ఆ నెక్సావార్ మందును రూ.8800కు అమ్మేటట్లుగానూ బేయర్ కంపెనీకి అమ్మకాలలో 6 శాతం ఇచ్చేటట్లుగా ఇండియన్ పేటెంట్ యాక్ట్ 2005 క్రింద పేటెంట్ ఆఫీసు చారిత్రాత్మక ఆర్డరును ఇచ్చింది.
అంతకు ముందు నెలకు సరిపోయే ఆ మందును రూ 2లక్షల80 వేలకు విక్రయించే వారు.
ఇపుడు ఉపయోగిస్తున్న మందులన్నీ పాతవే. కోవిడ్-19 కి కాకపోయినా వైరస్ వ్యాధులైన సార్స్
( యస్.ఈ,ఆర్.యస్.), మెర్స్ ( ఎమ్.ఇ,ఆర్.యస్,), ఎబోలా, ఇన్ ఫ్లూయంజా. హెపటైటిస్-సీ, హెచ్.ఐ.వీ. వ్యాధుల కోసం అభివద్ధిచేశారు. కోవిడ్-19 ని కట్టడికి కొత్త మందులేవీ లేవు కనుగొనలేదు కాబట్టి పాత మందులను కారుణ్య కారణాలతో అనుమతిస్తున్నారు. పాత మందులకు కొత్త ఇండికేషన్స్, రీ పర్పస్ అంటే నూతన ప్రయోజనాలను, ఉపయోగాలను కనుగొని, క్లినికల్ ట్రయల్స్ చేసి పాత పేటెంట్ మందులను అమ్ముకునే ప్రయత్నం జరుగుతున్నది.
వంద సంవత్సరాలక్రితం స్పానిష్ ఫ్లూ వచ్చినపుడు భారత ప్రజలు 1 కోటి 70 లక్షల మంది మరణించారు. ప్రపంచంలో 10 కోట్ల మంది చనిపోయారని అంచనా. గంగా నది శవాలతో ఉప్పొంగిందంటారు. అమెరికాలో మూతికి మాస్క్ ధరించని వ్యక్తులకు 100 డాలర్ల జరిమానాను వందసంవత్సరాలనాడే విధించారు. కానీ ఈనాటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేను మాస్క్ ధరించనన్నాడు. మాస్క్ ధరించటం కంపల్సరీ చేయనన్నాడు. ప్రపంచం కరోనా కేసుల లెక్కలలో అమెరికాకు ప్రధమ స్ధానాన్నిసాధించాడు. బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనోరొ కూడ మాస్క్ ధరించనన్నాడు. బ్రెజిల్ కు ద్వితీయ స్ధానాన్ని తేవటమే కాకుండా తను కొరోనా జబ్బు బారిన పడ్డాడు.
స్పానిష్ ఫ్లూ తరువాత అధికారంలోకి వచ్చిన శ్రామికవర్గ సోవియట్ సోషలిస్టు కమ్యూనిస్టు ప్రభుత్వం , ప్రపంచంలో మొదటిసారిగా ప్రజలందరికీ వైద్యం ( యూనివర్సల్ హెల్త్ ) అనే ఆలోచనను ఆచరణలోకి తెచ్చింది. ప్రపంచ ప్రజలందరికీ ఆదర్శమయింది. అందరికీ విద్యనందించి ప్రజలకు ప్రాధమిక ఆరోగ్యసూత్రాలను నేర్పి చైతన్యపరచింది. ఆ ఒరవడిలో పయనిస్తూ ప్రపంచప్రజలందరి ఆరోగ్యం తన ధ్యేయంగా క్యూబా ముందుకెళ్తూవుంది. అందరికీ ఆరోగ్యం( యూనివర్సల్ హెల్త్ ) ఆచరించే దేశాలే కరోనా కట్టడి లో ముందున్నాయి. క్యూబా , వియత్నాం, న్యూజిలాండ్,కేరళ లాంటి చోట్ల ప్రజలను చైతన్యపరిచారు. రోగంగురించి ప్రజలకు తెలియచేశారు. ప్రభుత్వం ఏంచేస్తున్నదో ప్రజలేమి చేయాలో చెప్పారు. చెప్పింది చేశారు. ప్రభుత్వ నాయకులు- ప్రజలు సైంటిస్టుల మాటలను విన్నారు. తు.చ తప్పకుండా పాటించారు. ప్రజారోగ్యంపట్ల బాధ్యతతో వ్యవహరించారు.అందువలననే వియత్నాంలో ఒక్క మరణమూ నమోదు కాలేదు. కేరళ రాష్టంలో ప్రభుత్వం-ప్రజలు ఒకటై మహమ్మారిని అదుపులో వుంచారు.
పేద ప్రజలకు మందులు, టీకాలు దొరుకుతాయా? మాస్కులతోనే ప్రాణాలను కాపాడుకోవాలా?
ఇపుడు సైన్స్ అభివధ్ధిచెందింది. రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. వైరస్ వలన జబ్బు పడిన వారిని త్వరగా టెస్టులు చేసి గుర్తిస్తున్నారు, అందుబాటులోవున్నమందులను ఉపశమనానికి ప్రతిభావంతంగా వాడుతున్నారు. వెంటిలేటర్ ద్వారా కత్రిమంగా ప్రాణవాయువును అందించి ప్రాణాన్ని నిలుపుతున్నారు. ఈ లోగా శరీరం తన రోగనిరోధకశక్తితోనూ, ఉపశమన మందుల ప్రభావంతోనూ, మెరుగైన. వైద్యసేవలతోనూ బతికిబయటపడుతున్నారు. చనిపోయేవారిసంఖ్య గణనీయంగా తగ్గుతోంది. వంద సంవత్సరాలనాడు స్పానిష్ ఫ్లూ వచ్చినపుడు మాస్కు ధరించి, భౌతికదూరం పాటించి, రోగనిరోధక శక్తివున్నవారే బతికి బట్టకట్టారు. ఇపుడు కూడా మందులున్నా లేకపోయినా కరోనా రాకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
1) మాస్క్ ఖచ్చితంగా ధరించాలి. 2) ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి,3) సబ్బుతో చేతులు కడుక్కోవాలి.4) ఉన్నంతలో సమీకత పౌష్టికాహారం తీసుకోవాలి.5) శారీరక శ్రమ, వ్యాయామం చేయాలి.
ఎబోలా, హెచ్ ఐ వీ, ఏవియన్ ఫ్లూ, నిఫా, స్వైన్ ఫ్లూ, సార్స్, మెర్స్, ఈ వ్యాధులన్నిటికీ మూలం పూసలో దారంలాగా వున్న రహస్యాన్ని గమనించాలి. వన్యజీవులనుండి మానవులకు సంక్రమిస్తున్నజూనోటిక్ వ్యాధుల్లో అది దాగివున్నది. ఈ రకమైన వైరస్ వ్యాధులతో 1981 నుండి 3 కోట్ల మంది మరణించారు. అడవి లో వుండే వైరస్,లేడి,జింక,కోతి, ఏనుగు లాంటి ప్రాణులు మామూలుగా మనుష్యుల మధ్య వుండవు. సహజ వనరుల కోసం అడవులను నరకటం, కొండలను తవ్వటం, భూమిపొరలలో దాగున్న చమురు ను పిండటం లాంటి చర్యల వలన జీవసమతుల్యత నాశనమయి వైరస్ లు మానవ నివాసాలవద్దకుచేరుతున్నాయి. అభివద్ది పేరున జరుగుతున్న పర్యావరణ విధ్వంస వలన వైరస్‌లు , వన్యజీవులు స్ధానభ్రంశం చెంది మరొక నివాసాన్ని ఏర్పరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో మనిషిలో చేరిన వైరస్‌లు అల్లకల్లోలం సష్టించి మానవ వినాశనానికి కారణమౌతున్నాయి.
ధనం-లాభం-పెట్టుబడి-ధనం, తప్ప మరే విలువలూ లేని పెట్టుబడి దారీ వ్యవస్ధలో భూమాత ముడిపదార్ధాల గనిగా , మనుష్యులు వినియోగదారులుగా . కార్మికుడు ఉత్పత్తిశక్తిగా మారారు. ప్రకతిని నాశనం చేసిన కార్పోరేట్ శక్తులు వ్యాధి అంటకుండా దూరంగా వుండగలరు. ఆధునాతన వైద్యాన్ని అందుకోగలరు. ఎంతఖరీదైనా మందులు వాడుకోగలరు. వాక్సిన్ రాగానే కొనుక్కోగలరు. జనాభాలో సగంపైగావున్నపేదప్రజలకు వైద్యం, మందులు, టీకాలు అందుతాయా? రెక్కాడితే డొక్కాడని పేదప్రజల ఉనికికే ప్రమాదం తెచ్చిన ఈ వ్యవస్ధ మార్పుకోసం పోరాడాలి. తక్షణకర్తవ్యంగా కరోనా మందులను, వాక్సిన్ లను కంపల్సరీ లైసెన్సుక్రిందకు తెచ్చి ప్రజలందరికీ అందుబాటులోకి తేవటంకోసం ఆందోళన చేయాలి. సైన్సు ఫలితాలు అందరికీ అందేవరకూ పోరాడాలి.
వ్యాస రచయిత డాక్టర్ కొల్లా రాజమోహన్, గుంటూరు జిల్లా నల్లమడ రైతు సంఘనేతగా కూడా పని చేస్తున్నారు. ఫోన్-9000657799