ఎం కోటేశ్వరరావు
” స్వేచ్చా ప్రపంచం చైనాను మార్చాలి(కూల్చాలి) లేనట్లయితే అదే మనల్ని మారుస్తుంది” అన్నాడు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో. హాంకాంగ్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించాలన్న అంతర్జాతీయ అంగీకారాన్ని చైనా ఉల్లంఘించింది, దక్షిణ చైనా సముద్రం, మరియు ప్రభుత్వ మద్దతుతో మేథోసంపత్తి దోపిడీని ఆపాలి అని కూడా చెప్పాడు. దేశీయంగా చైనా రోజు రోజుకూ నియంతృత్వాన్ని పెంచుతోంది, అంతర్జాతీయంగా స్వేచ్చకు వ్యతిరేకంగా దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తూ కొత్త ప్రజోపద్రవాన్ని తెచ్చిందని కాలిఫోర్నియాలోని యోర్బా లిండాలో ఈ వారంలో చేసిన ఒక ప్రసంగంలో చైనాకు వ్యతిరేకంగా ప్రపంచాన్ని రెచ్చగొట్టాడు.పాంపియో మాటలు ఒక చీమ ఒక చెట్టును ఊపేందుకు చేసే ప్రయత్నం తప్ప మరేమీ కాదని చైనాకు వ్యతిరేకంగా ప్రారంభించిన నూతన యుద్దం నిష్ఫలం అవుతుందని చైనా విదేశాంగశాఖ కొట్టివేసింది.
గత నాలుగు దశాబ్దాల కాలంలో రెండు దేశాల సంబంధాల్లో వచ్చిన పెను మార్పును ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. 1970 దశకంలో చైనాతో దౌత్య సంబంధాలకు నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ తెరతీశాడు.” చైనా కమ్యూనిస్టు పార్టీకి ప్రపంచాన్ని తెరవటం ద్వారా తాను ఒక ప్రాంకెస్టయిన్‌ను సృష్టించానేమో అని నిక్సన్ ఒకసారి భయాన్ని వ్యక్తం చేశాడు, ఇదిగో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం” అంటూ పాంపియో చైనాను ఒక వికృతాకార అసహజ జంతువుగా వర్ణించాడు. మేరీ షెల్లీ అనే బ్రిటీష్ యువరచయిత్రి 1818లో ఫ్రాంకెస్టయిన్ అనే ఒక నవలను రాసింది. దానిలో విక్టర్ ఫ్రాంకెస్టయిన్ అనే యువశాస్త్రవేత్త ఒక వికృతాకార అసహజ జంతువును సృష్టించటం, దాని పర్యవసానాల గురించి ఆ నవల సాగుతుంది. అనేక ఆధునిక సినిమాలకు అది మూలకథావస్తువు అయింది. అమెరికన్లు కమ్యూనిస్టులను, సోషలిస్టు దేశాలను అలాంటి జంతువుతో పోల్చి ప్రచారం చేశారు.
రెండు దేశాల మధ్య ఉన్న రాజకీయ, సైద్దాంతిక మౌలిక విబేధాలను మనమింకే మాత్రం విస్మరించరాదు, చైనా కమ్యూనిస్టు పార్టీ ఎన్నడూ అలా చేయలేదు మనం కూడా అంతే ఉండాలి అని కూడా పాంపియో చెప్పాడు. ఎంతగా చైనా వ్యతిరేకతను రెచ్చగొడితే అంతగా నవంబరులో జరిగే ఎన్నికలలో తమ నేత ట్రంప్‌కు ఓట్లు వచ్చి తిరిగి అధికారం వస్తుందనే ఎత్తుగడ కూడా పాంపియో ప్రసంగ లక్ష్యం కావచ్చు. వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్ధి కావాలనే వ్యూహంతో పాంపియో ఉండటం కూడా ఆ దూకుడుకు కారణం కావచ్చు.
నాలుగు దశాబ్దాల క్రితం -అమెరికా, సోవియట్ యూనియన్ నాయకత్వంలో ఉన్న సోషలిస్టు కూటమి దేశాల మధ్య ప్రచ్చన్న యుద్ధం, సోవియట్-చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య సైద్దాంతిక విబేధాలు కూడా తీవ్రంగానే కొనసాగుతున్న సమయమది. అమెరికా తోడేలు అయితే అది తినదలచుకున్న మేక పిల్లలుగా సోషలిస్టు దేశాలు ఉన్నాయి. అప్పుడు కూడా జనాభారీత్యా పెద్దది అయినా చైనా కూడా ఆర్ధికంగా ఒక మేకపిల్ల వంటిదే. అలాంటి చైనాతో దోస్తీ అంటూ అమెరికా తోడేలు ముందుకు రావటమే కాదు, ఏకంగా కావలించుకుంది. ఇప్పుడు మింగివేసేందుకు పూనుకుంది. ఎంతలో ఎంత తేడా !
అది జరిగేనా ? చైనాతో పోల్చితే పసిగుడ్డు వియత్నాంనే ఏమీ చేయలేక తోకముడిచిన అమెరికా గురించి తెలియంది ఏముంది ! నాలుగు దశాబ్దాల కాలంలో అమెరికా ఎక్కడ కాలుబెడితే అక్కడి నుంచి తోకముడవటం తప్ప పైచేయి సాధించింది లేదు. కొంత మంది చెబుతున్నట్లు అమెరికాలోని ఆయుధ పరిశ్రమలకు లాభాలు తప్ప మరొకటి కాదన్నది కూడా వాస్తవమే. అందుకోసం సాధ్యమైన మేరకు ఉద్రిక్తతలను తానే సృష్టించటం, ఇతర దేశాలను ఎగదోయటం వంటి అనేక పద్దతులను అనుసరిస్తున్నది. నాలుగు దశాబ్దాల నాడు ఉన్నంత బలంగా అమెరికా ఇప్పుడు లేదన్నది ఒక అభిప్రాయం( అయినా ఇప్పటికీ అదే అగ్రరాజ్యం). ఇదే విధంగా చైనా స్ధితి కూడా అంతే, ఆర్ధికంగా, మిలిటరీ రీత్యా నాటికీ నేటికి ఎంతో తేడా !
సోవియట్-చైనా కమ్యూనిస్టు పార్టీలు ఒకరి ముఖం ఒకరు చూసుకొనేందుకు సుముఖంగా లేని స్ధితిని వినియోగించుకొని సోవియట్‌ను దెబ్బతీయాలన్నది నాటి అమెరికా ఎత్తుగడ. ప్రపంచంలో కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టాలని పూనుకున్న దేశమది. అప్పటికే ప్రపంచంలో అతి పెద్ద దేశమే కాదు, సోషలిస్టు వ్యవస్ధను కూడా కలిగి ఉన్న చైనాతో సయోధ్యకు రావటం వెనుక అమెరికన్లు మారు మనస్సు పుచ్చుకున్న దాఖలాలేమీ లేవు. ఇప్పుడు ఆ సోవియట్ యూనియన్ లేదు. చైనాను తన ప్రత్యర్ధిగా అమెరికా భావిస్తోంది. తన 140 కోట్ల జనాభా జీవన స్ధాయిని పెంచేందుకు చైనా సర్వశక్తులను వినియోగిస్తోంది. అమెరికా, దాని అనుయాయి దేశాలు చేస్తున్న కుట్రలు, రెచ్చగొడుతున్న కారణంగా, తాను సాధించిన విజయాలను పదిల పరుచుకొనేందుకు అది స్పందించాల్సి వస్తోంది తప్ప, తానుగా కాలుదువ్వటం లేదు. కొన్ని సందర్భాలలో రాజీ పడిందనే విమర్శలను కూడా ఎదుర్కొన్నది.
సోవియట్ వారసురాలిగా ఐరాసలో శాశ్వత సభ్యత్వం రష్యాకు దక్కింది. నాడు అలీన రాజ్యంగా ఉన్నప్పటికీ అనేక అంశాలలో సోవియట్‌కు మద్దతుగా, అమెరికాకు వ్యతిరేకంగా భారత్ ఉంది. నేడు రష్యా -చైనాల మధ్య విరోధం లేదు, సైద్ధాంతిక బంధమూ లేదు. కానీ అమెరికాను ఎదుర్కోవాలంటే చైనా లేకుండా సాధ్యం కాదన్నది ఇప్పటి రష్యా వైఖరి (భవిష్యత్ గురించి చెప్పలేము). అలీన వైఖరి అనేది పాతబడిపోయింది, ఇంక ఆ మాట గురించి మరచిపోండి, మేము ఏ కూటమిలోనూ చేరటం లేదని మన విదేశాంగ మంత్రి జై శంకర్ ప్రకటించారు. అయితే ఆచరణలో మనం అమెరికా కౌగిలిలో మరింతగా ఒదిగిపోతున్నామన్నది అందరికీ కనిపిస్తున్న వాస్తవం. లేకుంటే మీరు చైనా మీద యుద్దం ప్రకటించండి మీవెనుక మేము ఉన్నామన్నట్లుగా అమెరికా, దాని అనుంగుదేశాలు బహిరంగంగా ఎలా చెబుతాయి. ప్రపంచ రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల్లో వచ్చిన ఈ ప్రధాన మార్పును గమనంలోకి తీసుకోకుండా లడఖ్ వంటి వర్తమాన పరిణామాలను అర్ధం చేసుకోలేము.
హౌడీ మోడీ పేరుతో అమెరికాలో ట్రంప్-మోడీ చెట్టపట్టాలు వేసుకు తిరిగిన హూస్టన్ నగరంలో ఉన్న చైనా తొలి కాన్సులేట్ కార్యాలయాన్ని మూసివేయాలని అమెరికా ఆదేశించింది. మా ఊరు మీకు ఎంత దూరమోా మీ ఊరూ మాకూ అంతే దూరం అన్నట్లు తమ చెంగుడూ నగరంలో ఉన్న అమెరికా కార్యాలయాన్ని మూసివేయాలని చైనా ఆదేశించింది. రెండు దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేవు, రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయో తెలియని ఒక అనిశ్చితి ఏర్పడిందన్నది స్పష్టం. రానున్న అధ్యక్ష ఎన్నికలను గమనంలో ఉంచుకొని ట్రంప్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా ? అదే అయితే తాత్కాలికమే. కానీ వాటిలో భాగంగానే ఆసియాలో భారత్ పోతుగడ్డ అని రెచ్చగొడుతున్న దానిని మనం నిజమే అనుకుంటే మనకు కొత్త సమస్యలు వస్తాయని గ్రహించాలి. లేదూ అమెరికన్లు చైనాతో అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్దపడినా రాచపీనుగ ఒంటరిగా పోదు అన్నట్లు మనం నలిగిపోతాము.
అమెరికాకు అగ్రస్ధానం అన్నది వారి నినాదం. చైనాలో కమ్యూనిస్టులు లాంగ్ మార్చ్‌తో ఒక్కో ప్రాంతాన్ని విముక్తి చేస్తూ జైత్రయాత్ర సాగిస్తున్న సమయంలో అమెరికన్లు నాటి కొమింటాంగ్ పార్టీనేత చాంగ్‌కై షేక్‌కు అన్ని రకాల మద్దతు ఇచ్చారు.కొమింటాంగ్ మిలిటరీ తైవాన్ దీవికి పారిపోయి అక్కడ స్ధావరాన్ని ఏర్పాటు చేసుకుంది. కమ్యూనిస్టులు ప్రధాన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమెరికన్లు తైవాన్‌లోని తిరుగుబాటుదార్ల ప్రభుత్వాన్నేే అసలైనా చైనాగా గుర్తిస్తూ ఐక్యరాజ్యసమితిలో రెండు దశాబ్దాల పాటు కథనడిపించారు.
చైనాకు స్నేహ హస్తం చాచినా అమెరికన్లు తమ కమ్యూనిస్టు వ్యతిరేకతను ఎన్నడూ దాచుకోలేదు.దాన్ని దెబ్బతీసేందుకు చేయని ప్రయత్నం లేదు. అమెరికాతో సహా అనేక దేశాలకు తమ మార్కెట్‌ను తెరిచిన చైనీయులు తమవైన ప్రత్యేక సంస్కరణలు అమలు జరిపి అసాధారణ విజయాలను సాధించటంతో పాటు అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు ధీటుగా తయారయ్యారు. అమెరికన్లు తలచింది ఒకటి, జరిగింది మరొకటి. ఒకవైపు తైవాన్ ప్రాంతం చైనాకు చెందినదే అని గుర్తిస్తూనే మరోవైపు అమెరికా అక్కడి పాలకులు, మిలిటరీని మరింత పటిష్టం గావిస్తూ చైనాను నిరంతరం రెచ్చగొడుతున్నది.
తైవాన్‌ను స్వాధీనం చేసుకుంటామన్నట్లుగా దాదాపు ప్రతి రోజూ చైనా మిలిటరీ విమానాలు విన్యాసాలు చేస్తున్నాయని తైవాన్ మంత్రి జోసెఫ్ వు ఈనెల 22న ఆరోపించాడు.నేడు తైవాన్‌తో ఏ దేశమూ అధికారిక సంబంధాలను కలిగి లేదు. పరోక్షంగా అమెరికా, మరికొన్ని దేశాలు రోజువారీ సంబంధాలు కలిగి ఉన్నాయి. ఏ క్షణంలో అయినా మిలిటరీని ప్రయోగించి తైవాన్‌ను తనలో విలీనం చేసుకోవచ్చని చైనా విలీన వ్యతిరేక శక్తులు నిత్యం స్ధానికులను రెచ్చగొడుతుంటాయి. అంతర్జాతీయంగా చైనా మీద వత్తిడి తెచ్చే వ్యూహంలో భాగమిది. 1996లో హెచ్చరికగా చైనీయులు కొన్ని క్షిపణులను తైవాన్ వైపు ప్రయోగించారు. దీన్ని సాకుగా తీసుకొని అమెరికా దక్షిణ చైనా సముద్రంలోకి తన విమానవాహక యుద్ద నౌకను పంపి చైనాను బెదిరించింది. 2001లో అమెరికా నిఘా విమానం ఒకటి చైనా స్ధావరంలో అత్యవసరంగా దిగింది. సిబ్బందిని, విమానాన్ని కొద్ది రోజుల పాటు చైనా నిర్బంధించింది. ఆర్ధికంగా, మిలిటరీ రీత్యా తనకు పోటీగా చైనా ఎదుగుతున్నదనే భయం అమెరికాలో మొదలైన నాటి నుంచి రెండు దేశాల సంబంధాలు ఏదో ఒక రూపంలో దిగజారుతూనే ఉన్నాయి. వాణిజ్య మిగులుతో ఉన్న చైనా తన వస్తువులను కొనాలంటూ 2018లో ట్రంప్ వాణిజ్య యుద్దానికి తెరతీసిన విషయం తెలిసిందే. అది ఇప్పటికీ కొనసాగుతున్నది, ఈ లోగా కరోనా సమస్య ముందుకు వచ్చింది. తమ జనాన్ని గాలికి వదలివేసిన ట్రంప్ ప్రపంచ ఆధిపత్యం కోసం తెగ ఆరాటపడిపోతున్నాడు.ఎన్నికల రాజకీయాలకు తెరలేపినా దాని వెనుక ఇతర అజెండా కూడా ఉందన్నది స్పష్టం.
చైనాను కట్టడి చేయాలన్న అమెరికా పధకంలో భాగంగా ఒక వైపు మన దేశాన్ని మరోవైపు రష్యాను అమెరికన్లు దువ్వుతున్నారు.మన రక్షణ ఏర్పాట్లలో భాగంగా రష్యా నుంచి ఎస్-400 సంచార క్షిఫణి ప్రయోగ వ్యవస్ధలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించటాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకించటమే కాదు, బెదిరింపులకు దిగింది. చివరకు మనం గట్టిగా ఉండటంతో పులిలా బెదిరించిన వారు పిల్లిలా మారిపోయారు. మరోవైపున అనేక చోట్ల రష్యాతో ఘర్షణ పడుతున్న అమెరికన్లు చైనాను కట్టడి చేసే ఎత్తుగడలో భాగంగా రష్యాను కూడా దువ్వేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం అమెరికా ప్రారంభించిన దౌత్యకార్యాలయాల మూసివేత యుద్దంలో చైనా కూడా కంటికి కన్ను-పంటికి పన్ను అన్నట్లుగా స్పందించింది. నిజానికి ఈ వారంలో ప్రారంభమైనట్లు కనిపించినా గత ఏడాది అక్టోబరులోనే దానికి ట్రంప్ తెరలేపాడు. చైనా దౌత్య సిబ్బంది సంఖ్యపై ఆంక్షలు విధించాడు. ప్రస్తుతం రెండు దేశాలూ పరస్పరం కాన్సులేట్ కార్యాలయాలను మూయాలని ఆదేశించాయి. తరువాత వుహాన్, హాంకాంగ్, మకావులలో మూసివేతలకు చైనా ఆదేశించవచ్చని వార్తలు వచ్చాయి. వాటితో పాటు దౌత్యవేత్తల బహిష్కరణ, వారి మీద ఆరోపణల పర్వం ఎలాగూ ఉంటుంది. పరిశోధకుల పేరుతో అమెరికా వచ్చిన నలుగురు తమకు చైనా మిలిటరీతో సంబంధాలు ఉన్న విషయాన్ని దాచారంటూ వారిలో ముగ్గురిని అమెరికా అరెస్టు చేసింది. ఒక పరిశోధకురాలు శాన్ ఫ్రాన్సిస్కోలోని చైనా కాన్సులేట్‌కు వెళ్లి రక్షణ పొందింది. తమ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలను తస్కరించేందుకు వారు వచ్చినట్లు అమెరికా ఆరోపించింది. వారికి పది సంవత్సరాల జైలు శిక్ష, రెండున్నరలక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. ఇది రాజకీయ కక్ష తప్ప మరొకటి కాదని చైనా వ్యాఖ్యానించింది.
వర్తమాన పరిణామాల్లో హాంకాంగ్‌కు వర్తింప చేస్తూ చైనా చేసిన ఒక చట్టాన్ని ఆధారం చేసుకొని అమెరికా, దానికి మద్దతుగా బ్రిటన్, ఇతర మరికొన్ని దేశాలు రంగంలోకి దిగి అక్కడ ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నట్లు నానా యాగీ చేస్తున్నాయి.తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేసిన చైనా హంకాంగ్‌లోని బ్రిటీష్ మరియు ఇతర దేశాలకు చెందిన వారిని విదేశీ పౌరులుగా గుర్తిస్తూ గతంలో బ్రిటన్ జారీ చేసిన పాస్‌పోర్టుల గుర్తింపును రద్దు చేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నది. విదేశాంగశాఖ ప్రతినిధి విలేకర్లతో మాట్లాడుతూ హాంకాంగ్ పౌరులు విదేశీ ప్రయాణాలు చేసేందుకు అది చెల్లుబాటయ్యే పత్రం కాదని త్వరలో తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చైనా వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నవారికి అవసరమైతే తాము భద్రత కల్పిస్తామనే అర్ధంలో బ్రిటన్ ప్రభుత్వం తాజాగా కొన్ని వివరాలను ప్రకటించింది. ఈ పాస్‌పోర్టులు ఉన్నవారు, వారి కుటుంబ సభ్యులు 2021జనవరి తరువాత బ్రిటన్ సందర్శించవచ్చని, అక్కడ ఐదు సంవత్సరాల పాటు విద్య, ఉద్యోగాలు చేయవచ్చని, తరువాత కావాలనుకుంటే బ్రిటన్‌లో శాశ్వత నివాసానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో తాము వాటి గుర్తింపు రద్దు చేయనున్నట్లు చైనా సూచన ప్రాయంగా తెలిపింది. హాంకాంగ్ చైనాలో భాగమని, అంతర్గత భద్రతకు తీసుకొనే చట్టాలను బ్రిటన్ గుర్తించాల్సి ఉందని, దానికి భిన్నంగా వ్యవహరిస్తే తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమే అని చైనా స్పష్టం చేసింది. అంతే కాదు హాంకాంగ్ పౌరులు చైనా ప్రధాన భూభాగంలో ప్రవేశించాలంటే బ్రిటీష్ వారు జారీ చేసిన పాస్‌పోర్టులను చైనా గుర్తించదు, చైనా యంత్రాంగం ఇచ్చిన అనుమతి పత్రాలతోనే ప్రవేశించాల్సి ఉంటుంది. హాంకాంగ్ జనాభా 75లక్షలు కాగా తాజాగా బ్రిటన్ వెల్లడించిన నిబంధనల ప్రకారం 30లక్షల మంది వరకు బ్రిటన్‌లో స్ధిరపడేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో అంత మందిని బ్రిటన్ అనుమతిస్తుందా, వారందరికీ ఉపాధి, వసతి చూపుతుందా అన్న అంశం పక్కన పెడితే చైనా పౌరులకు బ్రిటన్ పాస్‌పోర్టులు ఇవ్వటం ఏమిటన్న సమస్య ముందుకు వస్తోంది.
రెండు దేశాలు దౌత్య పరమైన చర్యలు, ప్రతిచర్యలకు పాల్పడటం సాధారణంగా జరగదు. అమెరికా వైపు నుంచి జరుగుతున్న కవ్వింపులు ట్రంప్ ఎన్నికల విజయం కోసమే అని చైనా భావిస్తున్నప్పటికీ ట్రంప్ తిరిగి వచ్చినా లేదా మరొకరు ఆ స్ధానంలోకి వచ్చినా రాగల పర్యవసానాల గురించి కూడా చైనా ఆలోచిస్తున్నది. అందువలన నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల వరకు ఇలాంటి చర్యలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. చైనా తాత్కాలిక చర్యలకు ఉపక్రమించినప్పటికీ దీర్ఘకాలిక వ్యూహం ఎలా ఉంటుందన్నది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. కరోనా బారి నుంచి బయట పడి తిరిగి పూర్వపు స్ధాయికి ఆర్ధిక కార్యకలాపాలను తీసుకురావాలని కోరుకుంటున్న చైనా ఏ దేశంతోనూ గిల్లికజ్జాలకు సిద్దంగా లేదని చెప్పవచ్చు. దక్షిణ చైనా సముద్రంలో, ఇతర చోట్ల అమెరికా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా, దాని వలలో పడిన దేశాలు చైనా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా దానికి అనుగుణ్యంగానే చైనా స్పందన ఉంటుంది.
మన దేశ విషయానికి వస్తే లడఖ్‌లో జరిగిన పరిణామాల తరువాత పూర్వపు స్థితిని పునరుద్దరించాలని రెండు దేశాలు నిర్ణయించాయి.అయితే పరస్పరం అనుమానాలు, గతంలో ఉన్న స్ధితి గతుల గురించి ఎవరి భాష్యాలకు వారు కట్టుబడి ఉంటే అది వెంటనే నెరవేరకపోవచ్చు. అంగీకారాన్ని అమలు జరిపేందుకు మరిన్ని చర్చలు, సంప్రదింపులు అవసరం కావచ్చు.ౖౖ అమెరికా మాటలు నమ్మి చైనాను దెబ్బతీసేందుకు మనం సహకరిస్తే ఆ స్ధానంలో మనం ప్రవేశించవచ్చని ఎవరైనా కలలు కంటే అంతకంటే ఆమాయకత్వం మరొకటి ఉండదు. చైనాను దెబ్బతీసి తాను లాభపడాలని చూసిన ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాకే సాధ్యం కాలేదు. మన నిక్కర్ల నుంచి పాంట్స్( దేశ భక్తి గురించి చెప్పేవారికి ఎంత భావ దారిద్య్రం నిక్కరూ మనది కాదు, పాంట్సూ మనవి కాదు.) కు మారిన వారు అమెరికా మాటలు నమ్మి వ్యవహరిస్తే, వారి సూత్రీకరణలను జనం నమ్మితే కుక్కతోకను పట్టుకొని గోదావరిని ఈదిన చందమే అవుతుంది.
చీమ చెట్టును ఊపే ప్రయత్నం చేస్తున్నట్లుగా అమెరికా వైఖరి ఉంది అని చైనీయులు మాట మాత్రంగా పాంపియో గురించి చెప్పినప్పటికీ ఆచరణలో అంత తేలికగా సామ్రాజ్యవాదాన్ని దానికి కేంద్రంగా ఉన్న అమెరికా గురించి చైనా భావించటం లేదు. ఇదే సమయంలో చైనాను ఒంటరిపాటు చేయటం అమెరికాకు అంత తేలిక కాదు. రెండవ ప్రపంచయుద్దం తరువాత బ్రిటన్ స్ధానాన్ని అమెరికా ఆక్రమించింది.దాని ప్రతి చర్యలోనూ అమెరికాకు అగ్రస్ధానం ఉండాలన్నట్లు వ్యవహరించింది. అదే పెట్టుబడిదారీ వ్యవస్ధలోని అనేక దేశాలతో దానికి సమస్యలు తెచ్చింది, మిగతా దేశాలను భయానికి గురి చేసింది. ఇప్పుడు అవే దాని ప్రపంచ పెత్తనానికి ఆటంకాలు కలిగిస్తున్నాయి.
అమెరికా వ్యూహకర్తలు అనేక తప్పిదాలు చేశారు లేదా అంచనాలు తప్పి బొక్కబోర్లా పడ్డారు. అదిరించి బెదిరించి తమ పబ్బంగడుపుకోవాలంటే ఎల్లకాలం కుదరదు అనే చిన్న తర్కాన్ని విస్మరించారు.ఐక్యరాజ్యసమితిని ఉపయోగించుకొని ప్రపంచ పెత్తనాన్ని సాగించాలని చూసిన వారు ఇప్పుడు బెదిరింపులకు దిగి ప్రపంచ ఆరోగ్య సంస్ధతో సహా అనేక ఐరాస విభాగాల నుంచి వైదొలుగుతున్నారు. దానితో ఏ దేశమూ అమ్మో అయితే ఎలా అని ఆందోళనకు గురికాలేదు. పసిఫిక్ ప్రాంత భాగస్వామ్యం పేరుతో అమెరికా ఒక వాణిజ్య ఒప్పందాన్ని ముందుకు తెచ్చింది. అది తనకు లాభసాటి కాదు అని వెనక్కు తగ్గింది. అయితే దాని మాటలు నమ్మి ముందుకు పోయిన వారు తరువాత మరొక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అదే విధంగా అమెరికా ప్రారంభించిన ఆయుధ నియంత్రణ వంటి చర్చలను ట్రంప్ యంత్రాంగం ముందుకు తీసుకుపోలేదు. ప్రపంచం తలకిందులు కాలేదు. ఇలాంటి ఉదంతాలను అనేక దేశాలు అమెరికా బలహీనతగా చూస్తున్నాయి. అటువంటపుడు ఆచి తూచి వ్యవహరిస్తాయి తప్ప అమెరికా ఏది గుడ్డిగా చెబితే దాన్ని అనుసరించే అవకాశాలు లేవు. ఉదాహరణకు రెండు సంవత్సరాల క్రితం చైనాతో ప్రారంభించిన వాణిజ్య యుద్దంలో ఇతర ధనిక దేశాలు అమెరికా వెనుక నిలిచే అవకాశాలు ప్రస్తుతం లేవు.దేని ప్రయోజనాలు దానికి ఉన్నాయి. రెండవది ప్రతి పెట్టుబడిదారీ దేశమూ తన కార్పొరేట్ల ప్రయోజనాల కోసం జాతీయవాదాన్ని, ఏకపక్ష వైఖరిని ముందుకు తెస్తున్నది.
అమెరికా ఎంతగా రెచ్చగొడుతున్నా, దక్షిణ చైనా సముద్రంలోకి తన నౌక, వైమానిక దళాలను దించుతున్నా, అనేక దేశాలు తమను ఒంటరిపాటు చేసేందుకు పావులు కదుపుతున్నా చైనా నాయకత్వ వైఖరిలో ఎక్కడా ఆందోళన కనిపించకపోవటానికి, హాంకాంగ్‌తో సహా అనేక అంశాలపై పట్టుబిగింపు, భారత్ విధించిన ఆర్ధిక ఆంక్షలు, దేన్నయినా ఎదుర్కొనేందుకు దేనికైనా సిద్దమనే సంకేతాలకు కారణాలు ఏమిటనే వెతుకులాట పశ్చిమ దేశాల పండితుల్లో మొదలైంది.కొద్ది రోజుల క్రితం గ్జీ జింపింగ్ అసాధారణ రీతిలో బీజింగ్‌లో వాణిజ్యవేత్తలతో ఒక సమావేశంలో పాల్గొన్నారు. ఎక్కడైతే జీవం ఉంటుందో ఆశకూడా అక్కడే ఉంటుంది, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఐక్యంగా పరిస్ధితిని ఎదుర్కొన్నంత కాలం ఎలాటి ముప్పు లేదని వారికి భరోసా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. చైనీయుల మాటలను ప్రపంచం మొదటి నుంచీ అనుమానంతో చూస్తూనే ఉంది. అది సాధించిన అసాధారణ ఆర్ధిక విజయం, తాజాగా కరోనా వైరస్ సహా దేన్నీ ఒక పట్టాన నమ్మలేదు.
కరోనా వైరస్ గురించి అమెరికా, మరికొన్ని దేశాలు ఎలాంటి తప్పుడు ప్రచారం చేసినా అవి మరింత సంక్షోభంలో కూరుకుపోయాయి తప్ప చైనా విజయవంతంగా బయట పడింది. కరోనా మహమ్మారి కారణంగా తమకు ఆర్ధికంగా ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో చూసుకొనే స్ధితిలోనే ఇంకా మిగతా దేశాలు ఉంటే, దాన్ని అధిగమించి ఆర్ధిక వ్యవస్ధను తిరిగి గాడిలో పెట్టే దశలో చైనా ఉంది. అమెరికా శాండియోగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం లోని చైనా డాటా లాబ్ వెయ్యి మంది పట్టణ వాసులపై జరిపిన అధ్యయనంలో చైనా కేంద్ర ప్రభుత్వం మీద జనంలో విశ్వాసం మరింత పెరిగినట్లు వెల్లడైంది. కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న సమయం ఫిబ్రవరిలో పదిమందిలో 8.65 మంది విశ్వాసాన్ని వ్యక్తం చేయగా మేనెలలో 8.87కు పెరిగింది, అదే 2019 జూన్ నెలలో 8.23 ఉన్నట్లు బ్రిటన్ గార్డియన్ పత్రిక తెలిపింది. నిర్ణయాలలో ప్రజలు భాగస్వాములైనపుడు వాటికి ఎంత మూల్యం చెల్లించాలో వారికి తెలుసు, చెల్లించేందుకు కూడా సుముఖంగా ఉంటారని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. చైనా నాయకత్వం బలం అదే అని చెప్పుకోవచ్చేమో !