Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


” రెండు రెళ్లు నాలుగు అన్నందుకు గూండాలు గండ్రాళ్లు విసిరే సీమలో ” అని మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు మరీ అంత పచ్చిగా నిజం మాట్లాడతావా, అవి మా నేతను ఉద్దేశించే కదా అంటూ దాడులకు దిగేవారు ఒక వైపు. మరోవైపు రెండు రెళ్లు ఎంతో తెలుసుకొనేందుకు కాలుక్యులేటర్‌ను ఆశ్రయించే వారు పెరిగిపోతున్న తరుణమిది.
ఇలాంటి స్ధితిలో దేశ ఆర్ధిక విషయాల గురించి నిజాలు మాట్లాడితే మోడీ అభిమానులు లేదా భక్తులు భరిస్తారా ? మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ దెబ్బలాటలకు రారా ? మరోవైపు ఏమి జరుగుతోందో తెలియక జనం అర్ధం చేసుకొనేందుకు ఆపసోపాలు పడుతున్నారు. కాలుక్యులేటర్లు రెండు రెళ్లు నాలుగు, మూడు మూళ్లు తొమ్మిది అని చూపగలవు తప్ప వివరణ ఇవ్వలేవు. రాజకీయ నాయకులు మసి పూసి మారేడు కాయలను చేయగలరు తప్ప వాస్తవాలను కనపడనివ్వరు.
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఆగస్టు ఐదున ప్రధాని నరేంద్రమోడీ భూమి పూజ చేయనున్నట్లు ప్రకటించారు. శంకుస్ధాపనకు ఎంచుకున్న సమయం అశుభ గడియ అని, సరైన సమయం కాదని శంకరాచార్య స్వరూపానంద అభ్యంతరం చెప్పారు.చాలా చోట్ల అమావాస్య రోజును అశుభంగా పరిగణిస్తే తమిళియన్లు ఆరోజును పరమ పవిత్రమైనదిగా చూస్తారు. ఇవి విశ్వాసాలకు సంబంధించిన సమస్యలు గనుక అవునని, కాదని చెప్పేవారు ఉంటారు.
కానీ దేశ ఆర్ధిక విషయాలకు సంబంధించి చెప్పాల్సిన వారు నోరు విప్పరు. అంకెలు ఒకటే అయినా కొందరు భిన్నమైన టీకా తాత్పర్యాలు, భాష్యాలతో మన మెదళ్లను తినేస్తున్నార్రా బాబూ అని అనేక మంది భావిస్తున్నారు. తమ సిబ్బంది సేకరించిన గణాంకాలు తప్పని ఏకంగా పాలకులే నిరుద్యోగంపై నివేదిక గురించి చెప్పిన విషయం తెలిసిందే. పకోడీలు తయారు చేయటం కూడా ఉపాధికిందకే వస్తుంది, అలాంటి వాటిని పరిగణనలోకి తీసుకోవటం లేదని సాక్షాత్తూ మోడీ మహాశయుడే చెప్పిన విషయం తెలిసిందే.
ఇప్పుడు కరోనా వైరస్‌ పుణ్యమా అని ఎవరైనా పకోడి బండి పెట్టినా డబ్బుల్లేక ఆ వైపు వెళ్లేందుకు కొందరు విముఖత చూపుతుంటే, కరోనాను కావిలించుకోవటం ఎందుకురా బాబూ అని మరికొందరు వెళ్లటం లేదు. అంతిమంగా పకోడి బండ్లు చాలా మూతపడ్డాయి. ఎప్పుడు పూర్వపు స్ధాయికి వస్తాయో తెలియదు.
దేశ ఆర్ధిక స్ధితి గురించి జనానికి నిజం తెలియటం లేదు. కరోనా కారణంగా వివరాలను సేకరించే సిబ్బందే ఆ ఛాయలకు పోలేదని తెలిసిందే. బయటకు వస్తున్న సమాచారం మాత్రం ఆల్జీబ్రా మాదిరి గుండెను గాబరా పెడుతోంది. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు గణనీయంగా తగ్గినా, వినియోగదారులను వీర బాదుడు బాది వసూలు చేస్తున్న మొత్తం మంగళగిరి పానకాల స్వామికి పోసే పానకం మాదిరి ఎటుపోతోందో తెలియటం లేదు.

ఆందోళన కలిగిస్తున్న ద్రవ్యలోటు !
ఉగాది పంచాంగ శ్రవణంలో ఆదాయాలు, వ్యయాల గురించి ఏమి చెప్పారో తెలియదు గానీ ఈ ఏడాది బడ్జెట్‌లో పేర్కొన్నదాని కంటే లోటు రెట్టింపుకు పైగా పెరిగి 7.6శాతం ఉంటుందని అంచనా. ఇది తొలి రెండు నెలల తీరుతెన్నులను చూసి చెప్పిన జోశ్యం కనుక వాస్తవంగా ఎంత ఉంటుందో తెలియదు. కేంద్ర బడ్జెట్‌లోటు 7.6శాతం అయితే దానికి రాష్ట్రాలు 4.5శాతం జోడిస్తే వెరసి 12.1శాతం అవుతుందని అంచనా. ఈ లోటును పూడ్చుకొనేందుకు జనం కోసమే కదా అర్ధం చేసుకోరూ అంటూ కేంద్రం, రాష్ట్రాలూ పెట్రోలు, డీజిలు వంటి వాటి ధరలను మరింతగా పెంచినా ఆశ్చర్యం లేదు.
లోటు పెరగటం అంటే ప్రభుత్వాలకు ఆదాయం తగ్గటం, దానికి కారణం జనం వస్తువులు, సేవలను కొనుగోలు తగ్గించటం, అందుకు వారికి తగిన ఉపాధి, ఆదాయం లేకపోవటం, దాని పర్యవసానం వస్తువినియోగం తగ్గించటం, దాంతో పరిశ్రమలు, వ్యాపారాల మూత, ఫలితంగా నిరుద్యోగం పెరుగుదల ఇలా ఒకదానికి ఒకటి తోడై ఏం జరగనుందో తెలియని స్ధితి.
కరోనాకు ముందే పరిస్దితి దిగజారింది, తరువాత పరిస్ధితి మరింత ఘోరంగా తయారైంది. దాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ గారు చప్పట్లు, దీపాలతో జనాల చేత సంకల్పం చెప్పించారు. ఇరవై ఒక్క లక్షల కోట్ల ఉద్దీపన పధకం అంటూ ఆర్భాటంగా ప్రకటింపచేశారు. అదేమిటో జనానికి తెలియని బ్రహ్మపదార్ధంగా మారింది. ఎవరూ దాని గురించి పెద్దగా చర్చించటం లేదంటే అది మూసినా-తెరిచినా ప్రయోజనం లేని గుడ్డికన్ను వంటిది అని అర్ధం అయినట్లుగా భావించాలి.
ఏనుగు చచ్చినా వెయ్యే బతికినా వెయ్యే అన్నట్లుగా ప్రభుత్వాల ద్రవ్యలోటు తక్కువగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా లబ్ది పొందేది కార్పొరేట్లు, ధనికులే అన్నది సామాన్యులకు అర్ధంగాని అంశం.లోటు తక్కువగా ఉంటే ఏదో ఒక పేరుతో ప్రభుత్వాల నుంచి పన్ను రాయితీలు పొందేది వారే. లోటు ఎక్కువగా ఉంటే ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి. ఆర్ధిక వ్యవస్ధ సజావుగా లేనపుడు పెట్టుబడిదారులు ఎవరూ కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు రారు. తమ వద్ద ఉన్న డబ్బును ప్రభుత్వానికి బాండ్ల పేరుతో వడ్డీకి ఇచ్చి లబ్ది పొందుతారు.లోటు పూడ్చే పేరుతో విలువైన భూములు, ప్రభుత్వ రంగ సంస్ధల వాటాలు లేదా ఆస్ధులను కారుచౌకగా అమ్మినపుడు వాటిని కొనుగోలు చేసి లబ్ది పొందేదీ వారే.

వినియోగదారుల ధరలు మరింతగా పెరుగుతాయా ?
ఉత్పత్తిలో స్థబ్దత ద్రవ్యోల్బణాన్ని పెంచవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. కరోనా కారణంగా ప్రకటించిన లాక్‌డౌన్‌ను సడలించినా ఫ్యాక్టరీలు పూర్తి స్ధాయిలో పని చేయటం లేదు. దీని వలన గిరాకీ మేరకు వస్తువుల సరఫరా లేకపోతే ధరలు పెంచుతారు. మామూలుగానే వినియోగదారుల నుంచి గిరాకీ తగ్గింది, కరోనాతో అది పెరిగింది. అయినా జూన్‌ నెలలో వినియోగదారుల ధరల సూచి పాక్షిక సమాచారం మేరకే 6.09శాతం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంచనాల కంటే వాస్తవంలో ఎక్కువ ఉంటుందన్నది తెలిసిందే. టోకు ధరల ద్రవ్యోల్బణ సూచి మే నెలలో మైనస్‌ 3.21శాతం అయితే అది జూన్‌ నాటికి 1.81కి చేరింది. అయితే రిటెయిల్‌ ద్రవ్యోల్బణం 7 నుంచి 7.5శాతానికి పెరగవచ్చని ఆర్ధికవేత్త డాక్టర్‌ ఎన్‌ఆర్‌ భానుమూర్తి అంచనా వేశారు. ప్రభుత్వం తీసుకున్న ఆర్ధిక మద్దతు చర్యల వలన గిరాకీ పెరగవచ్చని, దానికి అనుగుణ్యంగా ఉత్పత్తి పెరగకపోతే ద్రవ్యోల్బణం-ధరలు- పెరగవచ్చని, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగితే ద్రవ్బోల్బణం ఎనిమిదిశాతానికి చేరవచ్చని భానుమూర్తి అన్నారు.
ద్రవ్యోల్బణం ఏడుశాతానికంటే తగ్గే అవకాశాలు లేవని అనిల్‌ కుమార్‌ సూద్‌ అనే మరో ఆర్ధికవేత్త చెబుతున్నారు.చమురు ధరలను పెంచారు, పప్పుధాన్యాలు, ఖాద్యతైలాల దిగుమతులు పెరుగుతున్నాయి, రూపాయి విలువ తక్కువగా ఉంది. రవాణా, టెలికాం ఖర్చులు పెరిగాయి, సరఫరా గొలుసు పూర్తిగా వెనుకటి స్ధితికి రాలేదు అన్నారు. వ్యవసాయ రంగం వరకు ఇబ్బంది ఉండకపోవచ్చు గానీ ఫ్యాక్టరీలు సామర్ధ్యంలో 50 నుంచి 55శాతమే పని చేస్తున్నాయని ఎస్‌పి శర్మ అనే మరో ఆర్ధికవేత్త చెప్పారు.

జిడిపి ఎంత మేరకు తగ్గవచ్చు ?
మన దేశంలోని రేటింగ్‌ సంస్ధ ‘ ఇక్రా ‘ అంచనా ప్రకారం వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో జిడిపి 9.5శాతం తిరోగమనంలో ఉండవచ్చు. తొలి త్రైమాస కాలంలో 25శాతం, రెండు, మూడులలో 12, 2.5శాతం వరకు లోటు ఉండవచ్చని, దాని అర్ధం సాధారణ కార్యకలాపాలు బలహీనంగా ఉంటాయని, ఈ కారణంగా ద్రవ్యోల్బణం ఆరుశాతం అని జోశ్యం చెబుతున్నారు.

భారత్‌లో పెట్టుబడులకు ఇదే తరుణమా ?
ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల చేసిన ప్రసంగ భావం అదే. ఒక వైపు చైనా సంస్ధల పెట్టుబడులకు దారులు మూసిన సమయంలో అమెరికా-భారత్‌ వాణిజ్య మండలి సమావేశంలో ప్రసంగించిన మోడీ అమెరికన్‌ పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. భారత్‌లో పెట్టుబడులకు ఇదే సరైన తరుణం అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు భారత్‌ స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన వారు 30శాతం లబ్ది పొందినట్లు ఒక అంచనా. విదేశీ ద్రవ్య పెట్టుబడిదారులు మన స్టాక్‌మార్కెట్‌ మంచి లాభాలను తెచ్చిపెట్టేదిగా భావిస్తున్నారు. ఆ మేరకు వారి పెట్టుబడులు పెరుగుతాయి, మన దగ్గర డాలర్ల నిల్వలు గణనీయంగా ఉండవచ్చుగానీ, మన దేశంలో ఉపాధి పెరిగే అవకాశాలు లేవు. మన సంపద లాభాల రూపంలో విదేశాలకు తరలిపోతుంది. మన స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు ముందుకు రావటానికి ఒక ప్రధాన కారణం కార్పొరేట్‌ పన్ను మొత్తాన్ని గణనీయంగా తగ్గించటమే. కంపెనీల దివాళా నిబంధనలను సరళంగా ఉంచాలని ప్రభుత్వం వత్తిడి తేవటాన్ని అంగీకరించని తాను బాధ్యతల నుంచి వైదొలిగినట్లు రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ చెప్పారు.
అంటే కంపెనీలు నిధులను, తీసుకున్న రుణాలను పక్కదారి పట్టించి దివాలా పేరుతో బిచాణా ఎత్తివేసేందుకు, సులభంగా తప్పించుకొనేందుకు అవకాశం ఇవ్వటం తప్ప మరొకటి కాదు. ఇది కూడా విదేశీ మదుపుదార్లను ఆకర్షిస్తున్నదని చెప్పవచ్చు. గూగుల్‌తో సహా అనేక కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెడతామని ముందుకు రావటానికి కార్పొరేట్‌ పన్ను తగ్గింపు ఒక ప్రధాన కారణం. ఫాక్స్‌కాన్‌ కంపెనీ ఇప్పటికే తమిళనాడులో సెల్‌ఫోన్ల తయారీ యూనిట్‌ను నడుపుతున్నది. కొత్తగా పెట్టే సంస్ధలకు 15శాతమే పన్ను అన్న రాయితీని ఉపయోగించుకొనేందుకు అది మరో కొత్త పేరుతో విస్తరణకు పూనుకుంది. గూగుల్‌ వంటి కంపెనీలూ అందుకే ముందుకు వస్తున్నాయి. వీటి వలన మనకు కలిగే ప్రయోజనం కంటే వాటికి వచ్చే లాభం ఎక్కువ కనుకనే పెట్టుబడుల ప్రకటనలు చేస్తున్నాయి.

నిరర్ధక ఆస్తులు ఎందుకు పెరుగుతున్నాయి !
ప్రభుత్వ రంగ బ్యాంకులను ఎన్‌పిఏ పాలకులు దివాలా తీయించారని బిజెపి చేసిన ప్రచారం గురించి తెలిసినదే. రాజకీయనేతలు బ్యాంకులకు ఫోన్లు చేసి వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇప్పించి కమిషన్లు దండుకున్నారని చెప్పింది. దాన్లో అతిశయోక్తి ఉన్నా వాస్తవ పాలు కూడా ఉంది. కానీ ఆరేండ్ల బిజెపి ఏలుబడి తరువాత బ్యాంకుల నిరర్ధక ఆస్తులు రికార్డు స్థాయిలో పెరగనున్నట్లు ఆర్‌బిఐ స్వయంగా హెచ్చరించింది. దీనికి కరోనా కారణం అంటూ సన్నాయి నొక్కులు ప్రారంభించారు. కరోనా కొన్ని సంస్దలను ఇబ్బందుల పాలు చేసిన మాట వాస్తవం. ఈ మాత్రానికే గణనీయంగా, ఆకస్మికంగా ఎలా పెరుగుతాయి ? మొత్తంగా చూసినపుడు స్టాక్‌ మార్కెట్‌లో పెరుగుదల ఆగలేదు. కంపెనీల లాభాల శాతం పెద్దగా పడిపోయిన దాఖలాలు లేవు. మోడీ సర్కార్‌ రుణ నిబంధనలను కఠినతరం గావించినట్లు చెప్పింది. ఇన్ని చేసినా నిరర్దక ఆస్తులు ఎందుకు పెరుగుతున్నట్లు ? కాంగ్రెస్‌ నేతల మాదిరే బిజెపి పెద్దలు కూడా దందా ప్రారంభించారా ? 2020 మార్చినాటికి 8.5శాతంగా ఉన్న నిరర్దక ఆస్తులు 2021 మార్చినాటికి 12.5 లేదూ పరిస్ధితి మరింత దిగజారి వత్తిడి పెరిగితే 14.7శాతానికి పెరగవచ్చని స్వయంగా రిజర్వుబ్యాంకు హెచ్చరించింది.

కావలసింది నరేంద్రమోడీ 56 అంగుళాల ఛాతీయా ? బలమైన దేశమా !
చరిత్రలో ఎందరో రాజుల ఏలుబడిలోని సామ్రాజ్యాలు కుప్పకూలిపోయాయి. వారి బలం వాటిని కాపాడలేకపోయింది. వర్తమాన చరిత్రలో నరేంద్రమోడీ నాయకత్వంలో గత ఆరు సంవత్సరాలుగా బలమైన ప్రభుత్వం ఉంది. దాన్ని ఎవరూ కదిలించలేరన్నది అందరికీ తెలిసిందే. కానీ ఐదేండ్లు తిరిగే సరికి దేశం ఆర్ధికంగా దిగజారిపోయింది. నరేంద్రమోడీ 56 అంగుళాల ఛాతీ లేదా గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవం, ఆయన మాతృ సంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో లాఠీలు పట్టుకొని వీధుల్లోకి వచ్చే ప్రచారకులు, స్వదేశీ జాగరణ మంచ్‌ వారు గానీ ఆర్ధిక దిగజారుడును ఆపలేకపోయారన్నది తిరుగులేని నిజం.
అనేక అంశాలు పరస్పర విరుద్దంగా కనిపిస్తున్నాయి.అది భాష్యం చెప్పేవారి చాతుర్యమా లేక వాస్తవ పరిస్ధితుల నిజాలను ధైర్యంగా నివేదించే సలహాదారులు మోడీ గడీలో లేరా ? దేశ ఆర్ధిక వ్యవస్దలోని అనేక సూచీలు తిరోగమనాన్ని సూచిస్తున్నాయి, వాటి మీద ఆధారపడే జిడిపి మాత్రం పురోగమనం చూపుతున్నది. దేశంలో నేడున్న అసహన పరిస్ధితుల నేపధ్యంలో అనేక మంది ఆర్ధికవేత్తలు బహిరంగంగా, సూటిగా పాలకుల వైఖరిని ప్రస్తుతానికి ప్రశ్నించలేకపోవచ్చు. అయినా కొందరు ధైర్యం చేసి వేస్తున్న ప్రశ్నలు, లేవనెత్తుతున్న సందేహాలను తీర్చేవారు లేరు.

గణాంకాల తిరకాసేమిటో సంతృప్తికరంగా తేల్చేయాలి: సి. రంగరాజన్‌
ఇటీవలి కాలంలో దేశ గణంకాలు, సమాచారానికి సంబంధించిన వివాదాలకు సంతృప్తికరంగా ముగింపు పలకాల్సి ఉందని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ సి. రంగరాజన్‌ జాతీయ గణాంకాల దినోత్సవం సందర్భంగా జూన్‌ 30వ తేదీన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ గణాంక మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ప్రకటించిన జీవన సాఫల్య అవార్డును అందుకుంటూ ఈ సూచన చేశారు. జాతీయ గణాంకాల కమిషన్‌కు గుర్తింపు ఇవ్వాలని, అలా చేస్తే దాని విధులు, బాధ్యతలేమిటో స్పష్టం అవుతాయని కూడా ఆయన చెప్పారు. ఇటీవలి కాలంలో ఈశాఖ విడుదల చేసిన గణాంకాలు, వాటికి అనుసరిస్తున్న పద్దతి వివాదాస్పదమై అనేక మందిలో అనుమానాలు తలెత్తాయి. జిడిపి సజావుగా ఉంటే దేశం ఎందుకు దిగజారుతోందనే ప్రశ్నలు వచ్చాయి. మన పరిస్ధితి ఎంత అధ్వాన్నంగా ఉందంటే మన సమాచార, గణాంకాల నాణ్యతను మెరుగుపరుచుకొనేందుకు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాల్సిన స్ధితిలో ఉన్నాము. అలాంటి రుణం ఒకటి మంజూరైందని ప్రధాన గణకుడు ప్రవీణ్‌ శ్రీవాత్సవ చెప్పారు.

అడుగడుగునా అంకెల గారడీ !
2012-18కాలంలో మన జిడిపి సగటున ఏడుశాతం అభివృద్ధి చెందినట్లు లెక్కలు చూపుతున్నాయి.2011 నుంచి 2018వరకు ప్రతి ఏటా జిడిపి వృద్ధి రేటును వాస్తవమైన దాని కంటే 2.5శాతం అదనంగా చూపుతున్నారని 2014 అక్టోబరు నుంచి 2018 జూన్‌వరకు ప్రధాన మంత్రి ప్రధాన ఆర్ధిక సలహాదారుగా పని చేసిన అరవింద సుబ్రమణ్యం పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాల పేరుతో సలహాదారు పదవి నుంచి తప్పుకున్న ఏడాది తరువాత సుబ్రమణ్యం తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ విమర్శను ప్రభుత్వ 2020-21ఆర్ధిక సర్వే తిరస్కరించింది. అయితే గత ఆర్ధిక సంవత్సరంలో దిగజారిన ఆర్ధిక స్దితి ప్రభుత్వం వెల్లడిస్తున్న అంకెల గారడీని నిర్ధారించింది. నరేంద్రమోడీ సర్కార్‌ ఇప్పటికీ నిజాలు చెప్పటం లేదు, ఇదే తీరు కొనసాగితే రేపు నిజం చెప్పినా నమ్మని స్ధితి కనిపిస్తోంది. మన ప్రభుత్వం జిడిపిని లెక్కిస్తున్న తీరు గురించి ఐఎంఎఫ్‌ ఆర్ధికవేత్తలు కూడా సందేహాలను వెలిబుచ్చారు.


నాడూ నేడూ ఒకటే ప్రచారం అదే దేశం వెలిగిపోతోంది !
2004వరకు అధికారంలో ఉన్న వాజ్‌పేయి హయాంలో దేశం వెలిగిపోయిందనే ప్రచారంతో బిజెపి ఆ ఏడాది ఎన్నికలకు పోయి బొక్కబోర్లా పడిన విషయం తెలిసినదే.2005-11 సంవత్సరాల మధ్యలో బ్యాంకుల రుణాల జారీ రేటు ఏటా 15శాతం చొప్పున అభివృద్ధి చెందిందని, తరువాత కాలంలో అది నాలుగుశాతానికి పడిపోయిందని సిఎంఐయి అధ్యయనం తెలిపింది. అంటే పెట్టుబడి ప్రాజెక్టులు మందగించాయనేందుకు అదొక సూచిక. పారిశ్రామిక ఉత్పత్తి 2011కు ముందు సగటున తొమ్మిదిశాతం వృద్ధి చెందినట్లు పరిశ్రమల వార్షిక సర్వే వెల్లడిస్తే తరువాత కాలంలో రెండుశాతానికి పడిపోయింది.ఇదే కాలంలో పెట్టుబడుల వార్షిక వృద్ధి రేటు 23.9 నుంచి మైనస్‌ 1.8శాతానికి పడిపోయింది. గ్రామీణ ప్రాంతాలలో వినియోగం వృద్ధి రేటు వేగం మూడు నుంచి మైనస్‌ 1.5శాతానికి తగ్గింది, పట్టణ రేటు 3.4 నుంచి 0.3కు తగ్గింది ఇలా అనేక సూచికలు పడిపోగా జిడిపి వృద్ధి రేటును మాత్రం 7.2-7.1శాతంగా చూపారు. వేతనాల బిల్లుల శాతాలు కూడా ఇదే కాలంలో గణనీయంగా పడిపోయాయి, దేశం మొత్తంగా వినియోగం తగ్గటానికి ఇదొక కారణం. వీటన్నింటిని చూసిన తరువాత అంకెలు పొంతన కుదరటం లేదని జిడిపి రేటు గురించి అనేక మంది సందేహాలు లేవనెత్తారు. ఈ నేపధ్యంలోనే పకోడీలు తయారు చేయటం కూడా ఉపాధి కల్పన కిందికే వస్తుందని, అలాంటి వాటిని గణాంకాలు పరిగణనలోకి తీసుకోకుండా నిరుద్యోగం పెరిగినట్లు చూపారని నరేంద్రమోడీ రుసురుసలాడారు. ఒక వేళ అదే నిజమైతే మోడీ ఏలుబడికి ముందు కూడా పకోడీల తయారీని లెక్కలోకి తీసుకోలేదు.

కరోనా తరువాత పరిస్దితి బాగుపడుతుందా ?
అనేక మంది కరోనా వచ్చింది కనుక తాత్కాలిక ఇబ్బందులు తప్పవని మోడీ దేశాన్ని ముందుకు తీసుకుపోతారనటంలో ఎలాంటి సందేహం లేదని ఇప్పటికీ భావిస్తున్నారు. అదే ప్రచారం చేస్తున్నారు. అంతా బాగుంది, మరోసారి దేశం వెలిగిపోతోంది, 2024 తరువాత కూడా మోడీయే ప్రధాని అని విపరీత ప్రచారం చేస్తున్నారు. అలాంటి గుడ్డి విశ్వాసం ఉన్న వారి బుర్రలకు ఇప్పటివరకు ఎక్కించింది ఒక పట్టాన దిగదు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు రేపు తప్పనిసరై నరేంద్రమోడీ నిజాలు చెప్పినా జనాలు నమ్మని పరిస్ధితి వస్తుంది. అందుకే ఇప్పటికైనా జరుగుతోందేమిటో చెబుతారా ? బలమైన ప్రభుత్వం ఉన్నంత మాత్రాన ఫలితం లేదని తేలిపోయింది. వీటన్నింటినీ చూసినపుడు ఇప్పుడు కావలసింది దేశమంటే మట్టికాదోయి దేశమంటే మనుషులోయి అన్న మహాకవి గురజాడ చెప్పిన అలాంటి జనంతో కూడిన బలమైన దేశమా లేక శ్రీశ్రీ చెప్పినట్లుగా చట్టసభల్లో తిరుగులేని మెజారిటీ ఉన్న ప్రభుత్వమా ?