Tags

, ,


ఎం కోటేశ్వరరావు


జూన్‌ 25న నితీష్‌ కుమార్‌ నాయకత్వంలోని ఐక్య జనతా దళ్‌(జెడియు)-బిజెపి-ఎల్‌జెపి, ఇతర చిన్న పార్టీల సంకీర్ణ కూటమి ఏలుబడిలో తాము నష్టపోతున్నామని, రక్షణ కల్పించాలని కోరుతూ కొందరు రైతులు మొక్కజొన్న హౌమం నిర్వహించారు. అంతకు మూడు రోజుల ముందుగా నరేంద్రమోడీ సర్కార్‌ ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. దాని ప్రకారం ఐదులక్షల టన్నుల మొక్క జొన్నలు, పదివేల టన్నుల పాలు, పాలపొడి దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడించింది. సాధారణంగా దిగుమతి చేసుకోవాలని ఎవరైనా వాంఛిస్తే ధాన్య రకాలపై 50 నుంచి 60శాతం, పాలు, పాల ఉత్పత్తులపై 30 నుంచి 60శాతం దిగుమతి సుంకాన్ని చెల్లించి తెప్పించుకోవచ్చు. కానీ ప్రపంచ వాణిజ్య సంస్ధ కోటా నిబంధనల మేరకు పైన పేర్కొన్న పరిమాణాలను కేవలం 15శాతం పన్నుతోనే దిగుమతి చేసుకోనున్నారు.


మొక్కజొన్నలను దిగమతి చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వ్యాపారులు అక్రమ వాణిజ్య పద్దతులను అనుసరిస్తున్న కారణంగా రైతులకు రక్షణ కల్పించాలని కోరుతూ తెలంగాణా హైకోర్టులో దాఖలైన పిటీషన్లలో అనేక మంది రైతులు తమను కూడా ప్రతివాదులుగా చేర్చుకోవాలని దరఖాస్తు చేసుకున్నారు. మొక్కజొన్నలను దిగుమతి చేసుకున్న సంస్దలు వాటిని నూతన విలక్షణ ఉత్పత్తులను మాత్రమే తయారు చేసేందుకు వినియోగించాలనే షరతును పెట్టింది. దిగుమతి చేసుకున్న మొక్కజొన్నలను వేయించి పేలాలుగా తయారు చేస్తే అది కొత్త ఉత్పత్తి కాదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. దిగుమతి చేసుకున్నవాటిని తిరిగి వేరే సంచులలో నింపి అమ్మితే కుదరదని అటువంటపుడు కేంద్రం ఏవిధంగా అనుమతించిందని కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ను కోర్టు ప్రశ్నించింది. దిగుమతి చేసుకున్న మొక్కజొన్నల కారణంగా తమకు రావాల్సిన ధరలు పడిపోయాయాని రైతులు వాదించారు. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలని ఆదేశించిన కోర్టు కేసును వాయిదా వేసింది.


కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కబుర్లు చెప్పినా, ఉద్దీపన పధకాలు ప్రకటించినా మొక్కజొన్న కనీస మద్దతు ధర క్వింటాలకు 90 రూపాయలు పెంచిన తరువాత 2020-21 సంవత్సరానికి రు.1,850గా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం దిగుమతి నిర్ణయాన్ని ప్రకటించక ముందే దిగుమతుల కారణంగా మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. క్వింటాలుకు 900 నుంచి 1200 రూపాయల వరకు మాత్రమే రైతులు పొందారని అనేక రాష్ట్రాల వార్తలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షల టన్నులను విధిగా దిగుమతి చేసుకోవాలని తీసుకున్న నిర్ణయం వర్తమాన తరుణంలో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. లాక్‌ డౌన్‌ సమయంలో కోళ్ల దాణా తయారీదారులు తక్కువ ధరలకు పెద్ద మొత్తంలో మొక్కజొన్నలు కొనుగోలు చేశారు. ఆ సమయంలో గుడ్లు, కోడి మాంస వినియోగం కూడా తగ్గిన విషయం తెలిసిందే.
కరోనా వైరస్‌ పాడి పరిశ్రమ మీద కూడా తీవ్ర ప్రభావం చూపింది. వివాహాల సమయంలో ఐస్‌ క్రీమ్‌ పెద్ద ఎత్తున వినియోగించే విషయం తెలిసిందే. వివాహాలకు అతిధులపై తీవ్ర ఆంక్షలున్న కారణంగా ఈ ఏడాది అసలు అడిగిన వారే లేరు. ఇతర ఉత్పత్తులకు సైతం డిమాండ్‌, ధర కూడా గణనీయంగా పడిపోయింది.


మొక్క జొన్న విషయానికి వస్తే ఆసియా ఖండంలో అంతకు ముందు రెండు సంవత్సరాల పాటు డిమాండ్‌ తగ్గి 2019లో మార్కెట్‌ పెరిగింది. చైనా 274 మిలియన్‌ టన్నులతో అగ్రస్ధానంలో ఉండగా ఇండోనేషియా 33, భారత్‌ 28 మిలియన్‌ టన్నులతో వినియోగంలో రెండు మూడు స్ధానాల్లో ఉన్నాయి. అందువలన చైనా వినియోగం, సాగులో, కొనుగోలు విధానాల్లో వచ్చే మార్పులు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. తలసరి వినియోగంలో దక్షిణ కొరియా 223 కిలోలతో ప్రధమ స్ధానంలో ఉండగా చైనా 188, వియత్నాం 159 కిలోలతో తరువాతి స్ధానాల్లో ఉన్నాయి. ఉత్పత్తి విషయంలో 2019లో ఆసియాలో గరిష్ట స్ధాయిలో 379 మి.టన్నులు ఉత్పత్తి కాగా ఒక్క చైనా వాటాయే 270 మి.ట, ఇండోనేషియా 33, భారత్‌ 29 మి.టన్నులు ఉంది.మన దేశంలో వినియోగం కంటే ఉత్పత్తి ఎక్కువ కావటంతో కొంత ఎగుమతి చేస్తున్నాము. ఇదే సమయంలో ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనల కారణంగా దిగుమతులు కూడా చేసుకోవాల్సి వస్తోంది.చైనా వినియోగం ఎక్కువ, దానికి తోడు ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనలకు అనుగుణ్యంగా దిగుమతి చేసుకుంటున్నది. వర్తమాన సంవత్సరంలో చైనాలో 260-265 మి.ట, భారత్‌లో 28 మి.ట దిగుబడి ఉండవచ్చని అంచనా.


దిగుబడుల విషయానికి వస్తే ప్రపంచంలో చిలీలో సగటున హెక్టారుకు 13 టన్నులు ఉండగా అమెరికా, మరికొన్ని చోట్ల 11, ఐరోపా యూనియన్‌ దేశాల సగటు 8, చైనాలో ఆరు కాగా మన దేశంలో మూడు టన్నులు మాత్రమే వస్తున్నది.2019లో ఆసియా దేశాల సగటు దిగుబడి 5.5 టన్నులు. దిగుమతి చేసుకొనే దేశాలలో 2019లో జపాన్‌ 18, దక్షిణ కొరియా 11, వియత్నాం 11, ఇరాన్‌ 10, మలేసియా 4, చైనా 3.9 మిలియన్‌ టన్నుల చొప్పున దిగుమతి చేసుకున్నాయి. ఈ ఏడాది చైనా 7మిలియన్‌ టన్నులు దిగుమతి చేసుకోవచ్చని భావిస్తున్నారు. రికార్డు స్ధాయిలో ఈ ఏడాది కూడా పంట ఉంటుందని, ధరలు కూడా తక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.
గత ఏడాది వివిధ దేశాలు దిగుమతి చేసుకున్న మొక్కజొన్నల టన్ను వెల చైనా 222 డాలర్లు, మలేసియా 213, ఇరాన్‌ 182, వియత్నాం 177డాలర్లు చెల్లించాయన్నది సమాచారం. 2020 జూలై 20వ తేదీ కరెన్సీ మారకపు విలువ ప్రకారం మన కనీస మద్దతు ధర రూ.1,850 అంటే డాలర్లలో 24.74 అదే టన్ను ధర 247.4 డాలర్లు. మన దేశం దిగుమతి చేసుకొనే వాటి ధర పైన పేర్కొన్న కనిష్ట-గరిష్ట ధరల మధ్య ఉంటుందని అనుకుంటే అది మన రైతాంగాన్ని దెబ్బతీయటం ఖాయం. దిగుమతుల సాకుతో స్ధానిక వ్యాపారులు కారుచౌకగా రైతుల నుంచి కొనుగోలు చేస్తారని గడచిన తరుణంలోనే వెల్లడైంది. ఈ నేపధ్యంలో రైతులకు రక్షణ ఏమిటన్నది సమస్య. ఎన్ని రైతు బంధులు, రైతు భరోసాలు ఇచ్చినా ధరలు పడిపోతే వచ్చే నష్టం అంతకంటే ఎక్కువగానే ఉంటుంది.
గత కొద్ది సంవత్సరాలుగా చైనా మొక్క జొన్న నిల్వలను తగ్గించింది. ఈ కారణంగా 2028 వరకు అవసరాలకు అనుగుణ్యంగా దిగుమతులను పెంచవచ్చని భావిస్తున్నారు. అయితే పన్ను తక్కువగా ఉండే విధంగా కోటా దిగుమతులను పెంచాలని అమెరికా, ఇతర దేశాలు చేస్తున్న వత్తిడికి తలొగ్గి కోటాను మార్చేది లేదని ఈ ఏడాది ఏప్రిల్‌లోనే చైనా స్పష్టం చేసింది. 2016లో చైనాలో నిల్వలు 260 మిలియన్‌ టన్నులు ఉన్నాయి.2018 నాటికి అవి 80 మిలియన్‌ టన్నులకు తగ్గాయి. ఆ ఏడాది 3.52 మి.టన్నులు దిగుమతి చేసుకోగా 2020లో 4మి.టకు పెరగవచ్చని చెబుతున్నారు. ఇదే సమయంలో కోటా కింద 7.2మి.టన్నులను ఒక శాతం పన్నుతో దిగుమతి చేసుకోనుంది. అదే ఇతరంగా చేసుకొనే దిగుమతులపై 65శాతం పన్ను విధిస్తున్నది. తాము 7.2మి.ట దిగుమతి చేసుకున్నప్పటికీ స్ధానిక రైతాంగం మీద ఎలాంటి ప్రభావం చూపదని, మొత్తం వినియోగంలో రెండుశాతం కంటే ఎక్కువ కాదని అధికారులు చెప్పారు.


గత నాలుగు సంవత్సరాలుగా చైనాలో మొక్కజొన్న ధరలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి మూడు నెలల వ్యవధి ఉండే దలియన్‌ వస్తు మార్కెట్‌లో ముందస్తు ధర టన్ను 289 డాలర్లు పలికింది. మన కంటే రెండు రెట్లు అధికదిగుబడి పొందటంతో పాటు మన రైతాంగం గత ఏడాది పొందిన 132డాలర్లతో పోల్చితే ధర కూడా రైతాంగానికి ఎక్కువే గిడుతున్నట్లు ఈ వివరాలు వెల్లడిస్తున్నాయి.
మన రైతాంగానికి ధరల రక్షణతో పాటు దిగుబడుల పెంపుదల కూడా ఒక ముఖ్యమైన అంశమే అన్నది స్పష్టం. చైనాలో 120 మిలియన్‌ హెక్టార్ల భూమి సాగులో ఉండగా దానిలో ఉత్పత్తి అవుతున్న పంటల విలువ 1,367 బిలియన్‌ డాలర్లని, మన దేశంలో 156 మిలియన్‌ హెక్టార్లలో ఉత్పత్తి విలువు కేవలం 407 బిలియన్‌ డాలర్లే అని నిపుణులు అంచనా వేశారు. రెండు దేశాల్లో అధిక దిగుబడి వంగడాలు, ఎరువులు, పురుగు మందులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నప్పటికీ చైనాలో కఠిన మైన నిబంధనలు, బలమైన సంస్కరణలు, ప్రోత్సాహకాలు, పరిశోధనా-అభివృద్దికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయటం వలన చైనా ముందుడుగు వేసేందుకు దోహదం చేశాయి. అశోక్‌ గులాటీ, ప్రెరన్నా టెరవే రూపొందిచిన ఒక నివేదిక ప్రకారం ఒక రూపాయి పరిశోధన-అభివృద్ధికి ఖర్చు చేస్తే జిడిపి రూ.11.20 పెరిగిందని పేర్కొన్నారు. 2018-19లో చైనా వ్యవసాయ పరిశోధనకు 780 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే భారత్‌లో 140 కోట్ల డాలర్లు ఖర్చు చేశారని తెలిపారు.


ప్రొడ్యూసర్‌ సపోర్ట్‌ ఎస్టిమేట్స్‌(పిఎస్‌ఇ -ఉత్పత్తిదారులకు మద్దతు అంచనా)ను ధరల్లో చూస్తే సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలను పరిగణనలోకి తీసుకుంటే 2018-19లో చైనా రైతుల మొత్తం ఉత్పాదక విలువలో 15.3శాతం పొందగా అదే భారత్‌లో 5.7శాతమే అని చైనా వ్యవసాయ సంస్కరణల వలన అక్కడి రైతాంగం గణనీయంగా లబ్ది పొందినట్లు ఆ నివేదిక పేర్కొన్నది. ఫలాన పంట వేస్తేనే అందచేస్తామనే మాదిరి షరతులేమీ లేకుండా రైతులు ఏ పంట వేస్తే దానికి నేరుగా నగదు చెల్లింపు విధానాన్ని అమలు జరిపింది. 2018-19లో చైనా 2007 కోట్ల డాలర్లు అందచేయగా భారత్‌లో పిఎం కిసాన్‌ పధకంలో 300 కోట్ల డాలర్లు అందచేశారు. ఇవిగాక రెండు దేశాల్లోనూ ఇతర సబ్సిడీలు ఉన్నాయి. మైక్రో ఇరిగేషన్‌ పధకాలకు పెద్ద మొత్తంలో చైనా ఖర్చు చేస్తూ 2030 నాటికి 75శాతం భూములకు నీరందించే లక్ష్యంతో పధకాలను అమలు జరుపుతున్నారు. నీటి వాడకం విషయంలో మన కంటే కఠినమైన నిబంధనలను అమలు జరుపుతున్నారు, చార్జీలను వసూలు చేస్తున్నారు.


చైనాలో ప్రస్తుతం మరో కొత్త ప్రయోగం చేస్తున్నారు. అక్కడ పట్టణాల్లో కూడా పరిమితంగా అయినా సాగు చేస్తున్నారు.బీజింగ్‌ మున్సిపాలిటీలో అలాంటి సాగుదార్లను నమోదు చేసి మొక్కల ఆసుపత్రుల ద్వారా చీడపీడల నివారణ సబ్సిడీ పధకాన్ని అమలు జరుపుతున్నారు. రసాయనాల వాడకం, పరిమాణం తగ్గింపు, సహజ పద్దతుల్లో కీటక నివారణ లక్ష్యాలుగా ఇది సాగుతోంది. దీన్ని హరిత తెగుళ్ల నివారణ సబ్సిడీ పధకంగా పిలుస్తున్నారు. దీనిలో భాగంగా మొక్కల ఆసుపత్రులను (మన కళ్లు, కిడ్నీ, ఎముకలు, గుండె, గొంతు,ముక్కు ప్రత్యేక వైద్యశాలల మాదిరి) ఏర్పాటు చేశారు. ఆసుపత్రులను వ్యవసాయ మందుల సరఫరాదారులు, దుకాణదారులతో అనుసంధానించారు.నమోదు చేయించుకున్న రైతులు తమ పంటలకు వచ్చిన తెగుళ్ల గురించి మొక్కల ఆసుపత్రులలో వైద్యులకు వివరిస్తారు. వైద్యులు వాటి నివారణకు అవసరమైన రసాయన లేదా సహజ నివారణ పద్దతుల గురించి సిఫార్సు చేస్తారు. ఇంటర్నెట్‌ ద్వారా ఆయా ప్రాంతాల దుకాణదారులకు వాటిని వెంటనే పంపుతారు. రైతులు అక్కడకు వెళ్లి తమ గుర్తింపును చూపి వైద్యులు సూచించిన వాటిని సస్య రక్షణకు వినియోగిస్తారు. రైతులకు అందచేసిన వాటి వివరాలను ప్రభుత్వానికి పంపిన వెంటనే సబ్సిడీ మొత్తాన్ని ఆయాశాఖలు విడుదల చేస్తాయి. రసాయనేతర సస్య రక్షణ ఉత్పత్తుల వాడకం పెరుగుతుండగా రసాయన ఉత్పత్తుల వినియోగం తగ్గుతున్నట్లు 2015-18 మధ్యకాలంలో వైద్యుల సిఫార్సులను పరిశీలించగా తేలింది. దీని వలన సబ్సిడీ మొత్తాలు కూడా తగ్గుతున్నట్లు గమనించారు. ఫలితాలను మరింతగా మదింపు వేసి విజయవంతమైనట్లు భావిస్తే ఇతర ప్రాంతాలకు సైతం విస్తరించే ఆలోచనలో ఉన్నారు.