Tags

, ,


ఎం కోటేశ్వరరావు


నవంబరు మూడవ తేదీ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగాల్సిన రోజు. కరోనా వైరస్‌ పరిస్ధితి మరింతగా దిగజారి ఎన్నికలు జరగకపోతే ఏం కానుందో తెలియదు గానీ, పోలింగ్‌ సక్రమంగా జరిగితే దేశ 46 అధ్యక్షుడిగా డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి జో బిడెన్‌ ఎన్నిక ఖాయం అనే సూచనలు కనిపిస్తున్నాయి. అక్రమాలకు పాల్పడి అయినా తిమ్మిని బమ్మిని చేసి రెండవ సారి పదవిలోకి వచ్చేందుకు ట్రంప్‌ నానా అగచాట్లు పడుతున్నారని మరోవైపు వార్తలు వస్తున్నాయి. అత్యంత గొప్ప ప్రజాస్వామిక దేశమని చెప్పుకొనే అక్కడ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చేయని ప్రయత్నం, ప్రత్యర్దులను దెబ్బతీసేందుకు చేయని కుట్రలు తక్కువేమీ కాదు. ఇక డబ్బు ఖర్చు సంగతి సరే సరి. పార్టీల్లో అభ్యర్ధిత్వం కోసం పోటీ పడటం నుంచి ఖరారై ఎన్నికలు ముగిసే వరకు బీరు ప్రాయంగా ఖర్చు చేస్తారు.


” ఘనమైన మన దేశ చరిత్రలో అనేక మంది చెబుతున్నదాని ప్రకారం ఏ యితర ప్రచారం కంటే ఉత్సాహ పూరితంగా ట్రంప్‌ ప్రచారం ఉంది – అది 2016 కంటే ఎక్కువగా ఉంది. బిడెన్‌ సోదిలో లేడు. మౌనంగా ఉండే మెజారిటీ జనం నవంబరు మూడున తమ గళం విప్పుతారు.కృత్రిమంగా ఎన్నికల అణచివేత, కుహనా వార్తలు తీవ్రవాద వామపక్షాన్ని రక్షించలేవు.” అని స్వయంగా ట్రంప్‌ తన గురించి తాను ట్వీట్‌ డబ్బాకొట్టుకున్నాడు. కానీ ఆచరణలో అనేక ఎన్నికల సర్వేలు, జోశ్యాల ప్రకారం ట్రంప్‌ కంటే జో బిడెన్‌ సంతృప్తికరమైన మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ట్రంప్‌ పలుకుబడి అత్యంత కనిష్ట స్ధాయికి పడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయినా ఏదో అద్బుతం చేసి ట్రంప్‌ గెలుస్తాడు అని నమ్ముతున్నవారు కూడా అక్కడ ఉన్నారు.


1924 నుంచి 96 సంవత్సరాల ఎన్నికల చరిత్రను చూసినట్లయితే ఫ్లోరిడా రాష్ట్రంలో వెనుకబడిన రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధి ఎవరూ ఇంతవరకు విజయం సాధించలేదు. ఇప్పుడు అక్కడ డెమోక్రటిక్‌ పార్టీ బిడెన్‌ 13 శాతం పాయింట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారని సర్వేలో వెల్లడైంది. ఇది ట్రంప్‌కు రాగల కీడును సూచిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. క్విన్‌నిపియాక్‌ విశ్వవిద్యాలయ సర్వేలో బిడెన్‌ 51శాతం, ట్రంప్‌ 38శాతంతో పోటీ పడుతున్నారని వెల్లడికాగా సిఎన్‌ఎన్‌ సర్వేలో 51-46శాతాల చొప్పున ఉన్నారు. దీనిలో కొత్త ఏముంది మార్చి నెలనుంచి జరుపుతున్న ఏ సర్వేలోనూ ఫ్లోరిడాలో ట్రంప్‌ది పైచేయిగా ఉన్నట్లు వెల్లడి కాలేదని ఆయన మద్దతుదార్లు చెబుతున్నారు. అయితే బిడెన్‌కు అనుకూలత వ్యక్తం కావటం ట్రంప్‌కు పెద్ద హెచ్చరికగా చెబుతూ ఎట్టి పరిస్ధితిల్లోనూ ఫ్లోరిడాలో పై చేయిసాధించాలని విశ్లేషకులు చెబుతున్నారు. అందువలన రానున్న రోజుల్లో ప్రచారం యుద్దం మరింత ముదరటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికలలో ట్రంప్‌ ఓడిపోతే అది బిడెన్‌ విజయం కంటే ట్రంప్‌ చారిత్రక ఓటమి అవుతుంది. జూన్‌ ఒకటవ తేదీ నుంచి చూస్తే ఫ్లోరిడాలో ట్రంప్‌ సగటున ఎనిమిదిశాతం వెనుకబడి ఉన్నట్లు తేలింది.


అమెరికా ఎన్నికల విధానం ప్రకారం పరోక్ష పద్దతిలో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం యాభై రాష్ట్రాలకు వంద సెనెట్‌ (మన రాజ్యసభ మాదిరి) సభ్యులు, కాంగ్రెస్‌లో (మన లోక్‌సభ వంటిది) 435 ప్రజాప్రతినిధులు ఉన్నారు. అధ్యక్ష ఎన్నికలలో వాషింగ్టన్‌ డిసి నుంచి ముగ్గురితో సహా మొత్తం 538 మంది ఎలక్టరల్‌ కాలేజీ ప్రతినిధులను ఎన్నుకుంటారు. వీరిలో 270 మంది మద్దతు పొందిన వారు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నిక అవుతారు. ఒక వేళ ఆ మేరకు పూర్తి మెజారిటీ రాని పక్షంలో అధ్యక్షుడిని పార్లమెంట్‌లోని ప్రజాప్రతినిధుల సభ కాంగ్రెస్‌, ఉపాధ్యక్షుడిని సెనెట్‌ సభ్యులు ఎన్నుకుంటారు.


ఫ్లోరిడా రాష్ట్ర ఫలితాలతో నిమిత్తం లేకుండానే ప్రస్తుతం డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి జోబిడెన్‌కు 270 ఓట్లు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. మిషిగాన్‌, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌ రాష్ట్రాలలో బిడెన్‌ ముందంజలో ఉన్నారు. 2016 ఎన్నికలను ప్రాతిపాదికగా తీసుకుంటే నాటి డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిని హిల్లరీ క్లింటన్‌కు 232 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు పైన పేర్కొన్న మూడు రాష్ట్రాల ఓట్లను కూడా బిడెన్‌ ఖాతాలో వేస్తే అవి 278 అవుతాయి. అలాగాక గత ఎన్నికల ప్రకారం బిడెన్‌కు 232ఓట్లు మాత్రమే ఈసారి కూడా మిగతా చోట్ల వచ్చి ఫ్లోరిడాలో ప్రస్తుతం ఉన్న ముందంజ కొనసాగి అక్కడి 29 ఓట్లను తెచ్చుకుంటే 261 అవుతాయి, పూర్తి మెజారిటీకి తొమ్మిది తక్కువ ఉంటాయి. ఫ్లోరిడాలో కరోనా సమస్య మీద జరిపిన సర్వేలో ట్రంప్‌కు 42శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. ఈ రాష్ట్ర మెజారిటీ ఓటర్లను తనవైపు తిప్పుకోవటంతో పాటు దేశం మొత్తంగా ఉన్న వ్యతిరేకతను కూడా అనుకూలంగా మార్చుకోవటం ట్రంప్‌ వల్ల అవుతుందా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది.


ప్రస్తుతం అమెరికాలో నిరుద్యోగులు పదకొండుశాతం ఉన్నారు.కరోనా వైరస్‌ను నిర్లక్ష్యం చేయటం, తగు నివారణ చర్యలను తీసుకోవటంలో ట్రంప్‌ నిర్లక్ష్యం గురించి తెలిసిందే. ఇది రాస్తున్న సమయానికి ప్రపంచంలో కోటీ 66లక్షల మందికి కరోనా వైరస్‌ సోకితే వారిలో 44లక్షల మంది అమెరికన్లే, అలాగే మరణించిన ఆరులక్షల 57వేల మందిలో అమెరికాలో లక్షా 50వేల మంది ఉన్నారు. దీనికి ట్రంప్‌ నిర్లక్ష్యం ప్రధాన కారణం. మరోవైపు ఆర్ధిక సమస్యలు, చైనాతో జరుపుతున్న వాణిజ్యపోరు వంటి అనేక ప్రతికూల అంశాల కారణంగా ప్రస్తుతం ట్రంప్‌కు జనంలో ఆదరణ 38శాతానికి పడిపోయినట్లు సర్వేలు చెబుతున్నాయి. 1948 నుంచి చూసినపుడు ప్రజాదరణ 40శాతంలోపు ఉన్న పదవిలోని అధ్యక్ష అభ్యర్ధులెవరూ రెండవ సారి గెలిచిన దాఖలాలు లేవు.


అయితే ట్రంప్‌ ప్రస్తుతానికి వెనుకబడి ఉన్నప్పటికీ ఓడిపోయే ఖాతాలో వేయకూడదనే అభిప్రాయం కూడా కొంత మందిలో ఉంది. అక్టోబరు నాటికి ఆర్ధిక వ్యవస్ధ కోలుకొని ఓటర్లను ట్రంప్‌ ఆశ్చర్యపరుస్తారని చెబుతున్నారు. అనేక కారణాలతో ఓటర్లు ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆర్ధిక వ్యవస్ధను పునరుద్దరించగలరనే ఆశాభావాన్ని కలిగిన వారు సగం ముంది ఉండటాన్ని వారు ఉదహరిస్తున్నారు.


గత ఎన్నికల్లో ట్రంప్‌కు మెజారిటీ వచ్చిన మిషిగాన్‌, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌ రాష్ట్రాలలో ఈసారి డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధికి మెజారిటీ ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే గత ఎన్నికల సమయంలో కూడా తొలుత హిల్లరీ క్లింటన్‌ ఆ రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నట్లు సర్వేలు తెలిపినా తీరా ఓటింగ్‌లో ట్రంప్‌ స్వల్ప మెజారిటీ తెచుకున్నాడు, అది పునరావృతం కాదని చెప్పలేము కదా అన్నది కొందరి వాదన. సర్వేలన్నీ కాలేజీ విద్యావంతులనే ఎక్కువగా ఎంచుకుంటాయని వారే మొత్తం సమాజానికి ప్రతినిధులు కాదన్నది వారి తర్కం.


ట్రంప్‌ నిత్యం ట్వీట్లు, తెలివి తక్కువ ప్రకటనలు, చర్యలకు పాల్పడుతున్నప్పటికీ రోజంతా జనం నోళ్లలో నానుతున్న విషయాన్ని తక్కువగా చూడకూడదని, అది కూడా పెద్ద సానుకూల అంశమే అని కొందరు చెబుతున్నారు. డెమోక్రటిక్‌ పార్టీలో అభ్యర్ధిత్వం కోసం పోటీపడిన బెర్నీశాండర్స్‌ను కుట్రతో వెనక్కు నెట్టిన కారణంగా ఆయన మద్దతుదారులు ఓటింగ్‌కు రాకపోవచ్చని కొందరు విశ్లేషకులు చెబుతూ అది ట్రంప్‌కు సానుకూలం అవుతుందని ప్రచారం చేస్తున్నారు. కరోనా కారణంగా అనేక చోట్ల పోలింగ్‌ కేంద్రాలను తగ్గించారు. ఇది ఓటింగ్‌శాతం తగ్గటానికి దారి తీయవచ్చని, పట్టణాలలో బిడెన్‌ మద్దతుదారులు ఎక్కువగా ఉన్నారని, పోలింగ్‌ కేంద్రాలలో ఎక్కువ సేపు వేచి ఉండేందుకు వారు ఇచ్చగించరని తద్వారా ప్రత్యర్ధి ఓట్లు తగ్గటం ట్రంప్‌కు కలసి వచ్చే అవకాశం ఉందని ఒక అభిప్రాయం. అక్టోబరు నాటికి కరోనాకు వ్యాక్సిన్‌ రావచ్చని ఆ నాటకీయ ప్రకటనతో ట్రంప్‌ అప్పటి వరకు వచ్చిన ప్రతికూలతలను అధిగమిస్తారన్నది ట్రంప్‌ మద్దతుదారుల ఆశ.


జూలై 15 నాటి వాషింగ్టన్‌ పోస్టు-ఎబిసి సర్వేలో 55శాతం మద్దతుతో బిడెన్‌ ముందుండగా ట్రంప్‌కు 40శాతమే వెల్లడైంది. మార్చినెలలో ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లు ఉంది. అది కరోనా వైరస్‌ వ్యాప్తికి ముందు, తరువాత పరిస్ధితి మారిపోయింది. వైరస్‌ను ఎదుర్కోవటంలో ట్రంప్‌ విఫలమయ్యారని 60శాతం మంది పేర్కొనగా సక్రమంగానే వ్యవహరించినట్లు 39శాతం చెప్పారు. తానుగా ముఖానికి తొడుగు ధరించేది లేదని ప్రకటించిన ట్రంప్‌ జనంలో దాని మీద తలెత్తిన విమర్శలకు తలొగ్గి తాను కూడా ధరించి సంతృప్తి పరచేందుకు ప్రయత్నించటాన్ని చూశాము. మితవాద ఓటర్లను ఆకర్షించేందుకు నాజీ చిహ్నాలను ఉపయోగించుకొనేందుకు కూడా ప్రయత్నించాడు. ఇది ట్రంప్‌లో తలెత్తిన అపనమ్మకాన్ని సూచిస్తున్నదని కొందరి భాష్యం.


ఓటింగ్‌ సమయానికి నిరుద్యోగం పదిశాతానికి మించి ఉంటే కరోనా మహమ్మారి అదుపులేదనేందుకు సూచిక అవుతుంది. అది ప్రతికూలంగా మారుతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ట్రంప్‌ ఓటమి ఖాయం అని అందరూ చెబుతున్నారు. తమనేత విజయం సాధించటం అత్యంత ముఖ్య అంశమని ట్రంప్‌ మద్దతుదారులు 72శాతం మంది భావిస్తుండగా, ట్రంప్‌ను ఓడించటం బిడెన్‌కు ఎంతో ముఖ్యమని ఆయన మద్దతుదారులు 67శాతం భావిస్తున్నారు.


సోమవారం నాడు ట్రంప్‌ విలేకర్లతో మాట్లాడిన తీరును చూస్తే త్వరలో పరీక్షలు పూర్తి చేసుకొని అందుబాటులోకి వస్తుందని భావిస్తున్న కరోనా వ్యాక్సిన్‌ మీద పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. దాన్లో భాగంగానే రెండువారాల్లోనే ఒక శుభవార్తను ప్రకటిస్తానని చెప్పాడు. ఒకవైపు ట్రంప్‌ ఇలా చెప్పుకుంటున్న సమయంలోనే మరోవైపు ఆ పెద్దమనిషి నాయకత్వంలో దేశం తప్పుడు మార్గంలో పయనిస్తోందని మెజారిటీ అమెరికన్లు భావిస్తున్నట్లు సర్వేలు వెలువడ్డాయి. ఏపి వార్తా సంస్ద చికాగో విశ్వవిద్యాలయ సంస్ధతో కలసి నిర్వహించిన సర్వేలో కరోనా వైరస్‌ వ్యవహారంలో సక్రమంగా వ్యవహరించినట్లు చెప్పిన వారి సంఖ్య 32శాతానికి పడిపోయింది. దేశాన్ని తప్పుడు మార్గంలో నడిపించారని భావించిన వారు 80శాతం ఉన్నట్లు, ఆర్ధిక వ్యవహారాలు సక్రమంగా ఉన్నట్లు కేవలం 38శాతం మంది భావిస్తున్నట్లు వెల్లడైంది. సర్వేలు వెల్లడిస్తున్న ఈ ప్రతికూల వార్తల నుంచి జనం దృష్టి మళ్లించేందుకు ట్రంప్‌ ఎలాంటి ఎత్తుగడలను ముందుకు తెస్తారో చూడాల్సి ఉంది.