Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


తాము అందచేసిన రాఫెల్‌ విమానాల గురించి భారత మీడియా చేసిన హడావుడిని చూసి ఫ్రాన్స్‌ ఉబ్బితబ్బిబ్బయింది. తమ విమానాలను కొన్న మరే దేశంలోనూ లేని విధంగా భారత్‌లో ఇంతగా స్పందన ఉందా అని ముక్కున వేలేసుకుంది. దీనికి భిన్నంగా చైనాలో మీడియా రాఫెల్‌ రాక గురించి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు, అయితే ఏమిటి ? అన్నట్లుగా తాపీగా వ్యవహరించింది. భారత్‌ నుంచి ముప్పు వచ్చింది, జాగ్రత్త పడండి అని గాని మన మీడియా మాదిరి జనంలో చైనా వ్యతిరేక భావాలను రెచ్చగొట్టినట్లుగా భారత వ్యతిరేక ధోరణులను రెచ్చగొట్టినట్లు కనపడదు.


మన దేశం ఎప్పటికప్పుడు రక్షణ పాటవాన్ని పెంచుకోవాలి, అవసరమైన ఆయుధాలను సమకూర్చుకోవాలనటంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరమూ లేదు. కొన్ని దేశాలు అణ్వస్త్రాలను సమకూర్చుకొని మనవంటి దేశాలను అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం మీద సంతకం చేయాలని వత్తిడి తేవటాన్ని అంగీకరించవద్దని , సంతకం చేయవద్దని వామపక్షాలలో పెద్ద పార్టీ అయిన సిపిఎం అణ్వస్త్రాల తయారీ అవకాశాన్ని అట్టి పెట్టుకోవాలని చెప్పింది.

రాఫెల్‌ విమానాల విషయంలోనూ, బోఫోర్స్‌ శతఘ్నల విషయంలోనూ వాటి నాణ్యత, శక్తి సామర్ధ్యాల గురించి ఎన్నడూ ఎవరూ అభ్యంతర పెట్టలేదు, కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన అవినీతిని మాత్రమే వామపక్షాలతో సహా ఇతర పార్టీలన్నీ వ్యతిరేకించాయి. రాఫెల్‌ కూడా ఆధునికమైనదే, అయితే వాటిని మన వాయుసేనకు అందించగానే మన దేశం, నరేంద్రమోడీ అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ అయినట్లు, ఇంక ప్రపంచ యాత్రను ప్రారంభించటమే తరువాయి అన్నట్లుగా మీడియా అత్యుత్సాహం ప్రదర్శించటం ఆశ్చర్యం కలిగిస్తోంది.


లడఖ్‌ సరిహద్దులోని గాల్వన్‌ లోయలో చైనా మిలిటరీతో జరిగిన ఉదంతాలకు రాఫెల్‌ విమానాల రాకకు లంకెపెట్టి కథనాలు అల్లారు. దీన్ని తెలియని తనం అనుకోవాలా చూసే వారు, చదివేవారికి బుర్ర తక్కువ అని మీడియా పెద్దలు భావిస్తున్నారా ?


మన మిలిటరీకి అత్యాధునిక యుద్ద విమానాలను సమకూర్చుకోవాలని 2007లోనే నిర్ణయించారు. ఏ దేశమూ తమ దగ్గర తయారైన పదునైన ఆయుధాలను అది ప్రభుత్వం తయారు చేసినా లేదా ప్రయివేటు కార్పొరేట్‌ సంస్దలు తయారు చేసినా ఇతరులకు ఇచ్చేందుకు అంగీకరించదు. తాను అంతకంటే మెరుగైన దాన్ని తయారు చేసుకున్న తరువాతే మిగతా దేశాలకు వాటిని విక్రయిస్తే ఎలాంటి ఇబ్బంది లేదు అనుకున్నపుడు అమ్ముకొని సొమ్ము చేసుకుంటాయి. ఆ మేరకు కూడా తయారు చేసుకోలేని దేశాలు వాటిని కొనుగోలు చేస్తాయి. అలాగే మనకు విక్రయించేందుకు అమెరికా కార్పొరేట్‌ కంపెనీ అయిన లాక్‌హీడ్‌ మార్టిన్‌ తయారు చేసే ఎఫ్‌-16, లేదా మరో కార్పొరేట్‌ సంస్ద బోయింగ్‌ ఎఫ్‌-18 సూపర్‌ హార్నెట్‌, స్వీడన్‌ తయారీ గ్రిపెన్‌, రష్యన్‌ మిగ్‌35, ఐరోపాలోని పలు దేశాల భాగస్వామ్యం ఉన్న ఎయిర్‌ బస్‌ తయారీ యూరో ఫైటర్‌ టైఫూన్‌, ఫ్రెంచి కంపెనీ దసాల్ట్‌ రాఫెల్‌ పోటీ పడ్డాయి.


అమెరికా పాలకులు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అదిరించి బెదిరించి తమ విమానాలను మనకు కట్టబెట్టాలని చూశారు. మిగిలిన కంపెనీల తరఫున ఆయా దేశాలు కూడా తమ ప్రయత్నాలు తాము చేశాయి. చివరికి కుడి ఎడమలుగా ఉన్న యూరోఫైటర్‌ – రాఫెల్‌ రెండింటిలో ఒక దానిని ఎంచుకోవాలని ఖరారు చేసుకొని, వాటిలో కూడా మంచి చెడ్డలను ఎంచుకొని 2012 జనవరిలో రాఫెల్‌ వైపు మొగ్గుచూపారు. రాఫెల్‌నే ఎందుకు ఎంచుకున్నట్లు అంటే ? రాఫెల్‌ అయితే ఒక దేశంతో ఒప్పందం చేసుకుంటే సరిపోతుంది. యూరో ఫైటర్‌ ఒక దేశానిది కాదు, తయారీ భాగస్వాములు అయిన నాలుగు అయిదు దేశాలతో ప్రతి అంశం మీద ఒప్పందం చేసుకోవాలి. అది తలనొప్పుల వ్యవహారం కనుక రాఫెల్‌కే మొగ్గుచూపారు. ఇదీ పూర్వ కథ. ఇక యుపిఏ పాలనా కాలంలో జరిగిన ధరల సంప్రదింపులు, ఎన్‌డిఏ కాలంలో ధరలు పెంచటంలో చోటు చేసుకున్న అక్రమాల గురించి గతంలోనే ఎంతో సమాచారం ఉంది కనుక దాని జోలికి పోవటం లేదు.


ఇక్కడ గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి.ఎవరి యుద్ద సామర్ధ్యం ఎంత, ఎన్ని ఆయుధాలు ఉన్నాయి అని ప్రతిదేశం ఇతర దేశాల గురించి నిత్యం తెలుసుకొనే పనిలోనే ఉంటుంది.మనమూ అదే చేస్తాము. స్వంతంగా యుద్ద విమానాలను తయారు చేయగలిగిన దేశాలతో చైనా కూడా పోటాపోటీగా ఉంది.మనం కూడా తేలిక పాటి విమానాల తయారీకి పూనుకున్నాము. ప్రభుత్వ రంగ హిందుస్దాన్‌ ఏరోనాటికల్‌ తేజా విమానాలను ఇప్పటికే తయారు చేయటంలో ఎన్నో విజయాలు సాధించింది. మిగతా దేశాలతో పోటీపడే ఆధునికమైన వాటిని తయారు చేయాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. కనుకనే విదేశాల నుంచి కొనుగోలు చేసేందుకు నిర్ణయించాము.


రాఫెల్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించిన వెంటనే యూరోఫైటర్‌ తయారీలో భాగస్వామి అయిన బ్రిటన్‌ మన దేశంపై రుసరుసలాడింది. ఫ్రెంచి వారివి కొంటున్నారు మావెందుకు కొనరు, వాటి కంటే మావే మెరుగైనవి కదా అని వ్యాఖ్యానించింది (2012 ఫిబ్రవరి 18 టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా). అంతే కాదు, ఇతర దేశాలేవీ కొనుగోలుకు ముందుకు రాని రాఫెల్‌ విమానాలను ఫ్రెంచి వారు భారత్‌కు, అదీ అధిక ధరలకు కట్టబెట్టారనే విమర్శలు వచ్చాయి. మనం ఒప్పందం చేసుకున్న తరువాత మరొక దేశం కొనుగోలు చేసినట్లు వార్తలు లేవు.

ఇక రాఫెల్‌ జెట్‌ రాకతో మనం ఇరుగుపొరుగుదేశాల మీద దాడికి దిగవచ్చు అన్నట్లుగా మీడియా చెబుతోంది. ఏ దేశమూ అంత గుడ్డిగా ఉండదు అని గుర్తించాలి. రాఫెల్‌ విమానాలను కొనుగోలు చేసిన ఈజిప్టు తన మీద నిత్యం కయ్యానికి కాలుదువ్వే ఇజ్రాయెల్‌ మీద దాన్ని ఎందుకు ప్రయోగించటం లేదు, ఇజ్రాయెల్‌ ఆక్రమణకు గురైన ప్రాంతాలన్నింటినీ ఎందుకు వెనక్కు రప్పించలేకపోయింది? పాలస్తీనా సమస్య పరిష్కారానికి ఇజ్రాయెల్‌ను ఎందుకు ఒప్పించలేకపోయింది ?
సిరియా మీద అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలన్నీ కలసి దాడులు చేశాయి. వాటిలో రాఫెల్‌ విమానాలు కూడా పాల్గొన్నాయి. అయినా సిరియాను అణచలేకపోయాయి. ఎంతో బలహీనమైన సిరియానే అణచలేని రాఫెల్‌ మనకంటే ఎంతో బలమైన చైనా ఆటకట్టిస్తుందంటే నమ్మటం ఎలా ?


మనం మన జనం కష్టార్జితాన్ని ధారపోసి విదేశాల దగ్గర ఆయుధాలు కొనుక్కొనే స్ధితిలో ఉన్నాం. మరోవైపు చైనా స్వంతంగా విమానాలు తయారు చేసే స్ధితిలో ఉంది.
అమెరికా, రష్యా , ఇతర మరికొన్ని దేశాల వద్ద ఉన్న యుద్ద విమానాలు నాలుగవ, ఐదవ తరానికి చెందినవి. మనం కొన్న రాఫెల్‌ విమానాలు మూడు లేదా 3.5 తరానికి చెందిన వన్నది కొందరి భావన. చైనా వద్ద ఉన్న ఆధునిక జె-20 రాఫెల్‌కు సరితూగేది కాదని మన మీడియా కథకులు, కొందరు విశ్లేషకులు నిర్ణయించేశారు. తమ జె-20 నాలుగవ తరానికి చెందినదని, రాఫెల్‌ మూడు దాని కంటే కాస్త అభివృద్ధి చెందినదని చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఒక చైనా మిలిటరీ నిపుణుడిని ఉటంకించింది. అసలు జె-20 రాఫెల్‌ సమీపానికి కూడా రాలేదు, ఇది ఆటతీరునే మార్చి వేస్తుందని మన మాజీ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బిఎస్‌ ధోనా అంటున్నారు. పై రెండు అభిప్రాయాలతో ఏకీభవించటమా లేదా అన్నది సామాన్యులంగా ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. కానీ రంగంలో ఉన్న నిపుణులు పొరపాటు పడితే పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పలేము. ప్రస్తుతం మన మిలిటరీ దగ్గర ఉన్న సుఖోరు-30ఎంకె1 కంటే రాఫెల్‌ జెట్‌ మెరుగైనది అని కూడా చైనా నిపుణుడు చెప్పాడు.
మన దేశం రాఫెల్‌ విమానాలను కొనుగోలు చేయటం ఆయుధ సేకరణలో విషమానుపాతం(సమపాళ్లలో లేని) అని, రక్షణ అవసరాలకు మించి భారత్‌ మిలిటరీ సామర్ధ్యాన్ని పెంచుకుంటోందని, ఇది దక్షిణాసియాలో ఆయుధ పోటీకి దారితీస్తుందని పాకిస్ధాన్‌ వర్ణించింది. భారత ప్రాదేశిక సమగ్రతకు ముప్పు తలపెట్టాలని చూసే శక్తులు ఇప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని మన రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ హెచ్చరించారు. భారత్‌లోని సంబంధిత వ్యక్తులు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాంతీయ శాంతి, స్ధిరత్వాలకు తోడ్పడతాయని తాము ఆశిస్తున్నట్లు చైనా వ్యాఖ్యానించింది.


మీడియా మాటలను నమ్మి ఏ దేశమూ మరొక దేశం మీద కాలుదువ్వదు. ఎవరైనా అలాంటి దుస్సాహసాలకు పాల్పడితే అంతకు మించిన ప్రమాదం మరొకటి ఉండదు. దైనిక్‌ జాగరణ్‌ అనే హిందీ దినపత్రిక ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకూలమైనదే. ఆ సంస్ద జాగరణ ఒక వెబ్‌సైట్‌ను కూడా నిర్వహిస్తోంది. దానిలో జూన్‌ 17న భారత్‌-చైనా దేశాల మిలిటరీని పోల్చుతూ ఒక వ్యాసాన్ని ప్రచురించింది. దానిలో ఉన్న వివరాలు ఇలా ఉన్నాయి.
అంశము ×××××××××× ××××××భారత్‌×××××××××చైనా
1.రక్షణ బడ్జెట్‌ 2020 ఫిబ్రవరి ××××× 70 బి.డా ××××177.61బి.డా 2019 జూన్‌
2.జనాభా ××××××××××××××× 136 కోట్లు ××××143 కోట్లు
3. ఏటా మిలిటరీకి సిద్దం×××××××× 2.3 కోట్లు ×××× 1.9 కోట్లు
4. మొత్తం మిలిటరీ ×××××××××× 13.25 లక్షలు××× 23.35 లక్షలు
5.ఆటంబాంబులు ×××××××××× 120-130××××× 270-300
6. అన్ని రకాల విమానాలు×××××× 2,663 ××××××× 3,749
7.హెలికాప్టర్లు ×××××××××××× 646 ××××××××× 842
8. దాడి చేసే హెలికాప్టర్లు ××××× 19 ××××× 200
9.విమానాశ్రయాలు×××××××× 346 ×××× 507
10. ట్యాంకులు ××××××××× 6,464×××× 9,150
11. ప్రధాన రేవులు ××××××× 7 ×××××× 15
12.మర్చంట్‌ మెరైన్‌ బలం×××× 340 ××××× 2,030
13. మందుపాతరలు నాటే ఓడలు××× 6 ×××××× 4
14. ఆర్టిలరీ ×××××××××× 7,414 ××××× 6,246
15.జలాంతర్గాములు ×××××× 14 ××××××× 68
16. యుద్ద ఓడలు ××××××× 295 ××××× 714
17.విమాన వాహక నౌకలు××× 2 ×××××× 1
18. ఫ్రైగేట్స్‌ ×××××××××× 14 ×××××× 48
19. డిస్ట్రాయర్‌ షిప్స్‌ ×××××× 10 ×××××× 32
20.తనిఖీ నౌకలు ×××××××× 135 ××××× 138
21. ఖండాంతర క్షిపణులు ××× 5,000 ×××× 13,0000
22. ముడిచమురు ఉత్పత్తి రోజుకు××× 7.67 ల.పీపాలు×××× 41.89 ల. పీపాలు
23. చమురు వినియోగం రోజుకు ×××× 35.10 ల. పీపాలు ×××× 1.01 కోట్ల పీపాలు


పై సమాచారాన్ని వివిధ వనరుల నుంచి జాగరణ జోష్‌ వ్యాస రచయిత సేకరించారు. దీనిలో విమాన వాహక యుద్ద నౌకలకు సంబంధించి వివరాలు వాస్తవం కాదు. ప్రస్తుతం మన దేశం ఒక నౌకను కలిగి ఉంది, రెండో దానిని తయారు చేస్తున్నారు. మూడవ దానిని కూడా నిర్మించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో చైనా వద్ద ఇప్పటికే రెండు వినియోగంలో ఉన్నాయి, మూడవది నిర్మాణంలో ఉంది. 2030 నాటికి మొత్తం సంఖ్యను ఐదు లేదా ఆరుకు పెంచుకోవాలనే కార్యక్రమాన్ని చైనా ప్రకటించింది.


ఏ విధంగా చూసినా చైనా అన్ని విధాలుగా మెరుగైన స్ధితిలో ఉందని జాగరణ్‌ జోష్‌ వ్యాసకర్త పేర్కొన్నారు. ఎవరైనా అదే చెబుతారు. దీని అర్దం మన బలాన్ని తక్కువ చేయటం కాదు, చైనా బలాన్ని ఎక్కువ చేసి చెప్పటం కాదు. కొన్ని వాస్తవాలను వివరించినపుడు కొందరికి మింగుడుపడకపోవచ్చు.
పాలక పార్టీలకు ఒకే రకమైన భజన చేస్తూ వీక్షకులకు బోరు కొట్టిస్తున్న మన మీడియాకు రాఫెల్‌ దొరికింది. ఒంటిమీద బట్టలున్నాయో లేదో కూడా చూసుకోకుండా గంతులు వేయటానికి కారణాలు స్పష్టం. ఒకటి ఆ విమానాలు నరేంద్రమోడీ చేతిలో సుదర్శన చక్రాలన్నట్లుగా ఎంత గొప్పగా చిత్రిస్తే అంత, ఎంత చైనా వ్యతిరేక ప్రచారం చేస్తే అంతకంటే నరేంద్రమోడీ దృష్టిలో పడవచ్చు, మంచి పాకేజ్‌లను ఆశించవచ్చు. రెండవది పాలక పార్టీ దాని సోదర సంస్దలు లడఖ్‌ సరిహద్దులో జరిగిన పరిణామాల నేపధ్యంలో రెచ్చగొట్టిన చైనా వ్యతిరేకతకు మధ్యతరగతి సహజంగానే ప్రతి స్పందించింది కనుక వారిని ఆకట్టుకొని రేటింగ్‌ను పెంచుకోవచ్చు. ఇలాంటి కారణాలు తప్ప వాస్తవ ప్రాతిపదిక కనుచూపు మేరలో కానరాదు.
మీడియాలో వ్యక్తమైన రెండు అంశాలలో ఒకటి ముందే చెప్పుకున్నట్లు చైనా వ్యతిరేకత, రెండవది రాఫెల్‌ విమానాలు మన వాయుసేనలో చేరిక. రెండవది నిరంతర ప్రక్రియ. మన భద్రతను మరింత పటిష్టం చేసుకొనేందుకు అవసరమైన ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవటం ఎప్పటికప్పుడు చేసుకోవాల్సిందే. అది ప్రతిదేశమూ చేస్తున్నదే. కానీ చైనా వ్యతిరేకత వెంకటేశ్వర సుప్రభాతం కాదు కదా ! ఎవరు అవునన్నా కాదన్నా చైనా సోషలిస్టు దేశంగా తనదైన పంధాలో తాను పోతోంది. ఇష్టం లేకపోతే పొగడవద్దు, దాని ఖర్మకు దాన్ని వదలి వేయండి. అనేక మంది శాపనార్ధాలు పెడుతున్నట్లు అది కూలిపోతుంతో లేక మరింతగా పటిష్టపడుతుందో చైనా అంతర్గత వ్యవహారం, జనం తేల్చుకుంటారు. అదే సమయంలో అది మన పొరుగుదేశం. మన ఇరుగుపొరుగుతో లడాయి ఉంటే అది ఎలా ఉంటుందో మనం నిత్య జీవితంలో చూస్తున్నదే. మరొక దేశమైనా అంతే.


ఇరుగు పొరుగు దేశాలతో స్నేహం కోరుకోవాలని దాని వలన కలిగే లాభాల గురించి చర్చకు బదులు చైనాకు వ్యతిరేకంగా ఏమి వర్ణన, ఏమి కోలాహలం, ఇప్పటి వరకు ఏదో అనుకున్నారు, ఇక బస్తీమే సవాల్‌ , నరేంద్రమోడీ లేస్తే మనిషి కాదు అన్నట్లుగా గతంలో ఎన్నడూ లేని విధంగా మీడియా చిందులేసింది. 1962లో చైనాతో యుద్దం జరిగింది, తిరిగి సాధారణ సంబంధాలు పునరుద్దరణ జరిగిందా లేదా ? గాల్వన్‌లోయలో ఒక అవాంఛనీయ ఉదంతం జరిగింది. గతంలో జరిగిన యుద్ధానికి కారకులు చైనా వారే అని గతంలో చెప్పిన వారే వారితో చేతులు కలిపేందుకు చొరవ తీసుకొనేందుకు సిగ్గు పడలేదు కదా ! తాజా ఉదంతాలు కూడా చైనా కారణంగానే జరిగాయనే వాదనలను కాసేపు అంగీకరిద్దాం. అంతమాత్రాన చైనాతో రోజూ యుద్ధాలు చేసుకుంటామా ? సమస్యలను పరిష్కరించుకొనేందుకు రెండు దేశాలూ పూనుకున్న తరువాత మరోసారి చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముంది ? అంతగా కావాలనుకుంటే రాఫెల్‌ గొప్పతనం గురించి పొగడండి-దానికి లంకె పెట్టి చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముంది ? రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్దమంటూ వస్తే ఏ ఒక్క దేశమూ మిగలదు. అందువలన ఇప్పుడు కావాల్సింది సమస్యల పరిష్కారం తప్ప రెండు పక్షాలను ఎగదోయటం కాదు !