Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు
మొండి వాడు రాజుకంటే బలవంతుడు అన్నది బాగా ప్రాచుర్యంలో ఉన్న సామెత. ఏకంగా రాజే మొండి అయితే ….గతంలో అలాంటి చరిత్ర మనకు తెలియదు, మన పెద్దలూ చెప్పలేదు. ఇప్పుడు రాజరికం లేదు గానీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి గురించి అలాంటి అభిప్రాయం అయితే ఉంది. ఆయన ఏమి చేసినా ప్రత్యర్ధులు దాన్ని వేరే విధంగా చూస్తే మద్దతుదారులు సానుకూలంగా చూస్తూ మురిసిపోతున్నారు.
మూడు రాజధానుల ఏర్పాటుకు రూపొందించిన బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేయటంతో ఇతర ప్రాంతాల్లోని జగన్‌ మద్దతుదారులు ఫెళ్లున నవ్వారు. గవర్నర్‌ మీద దింపుడు కల్లం ఆశలు పెట్టుకున్నవారు, బిజెపి-జనసేన, తెలుగుదేశం పార్టీ నేతల మీద భ్రమలు పెంచుకున్నవారు గొల్లుమంటున్నారు. ఇంత ద్రోహమా అని గుండెలు బాదుకుంటున్నారు. ఇల్లు అలకగానే పండగ కాదు అన్నట్లుగా ఈ బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్రవేయగానే అంతా అయిపోలేదు కోర్టులు ఉన్నాయి అనే వారు కూడా ఉన్నారు. ఊహించినట్లుగానే గవర్నర్‌ చర్య మీద రాజధాని గ్రామాల్లో ఆగ్రహం వ్యక్తమైనా మిగతా చోట్ల లోలోపల ఉడికి పోయినా, గ్రామాల్లో, పట్టణాల్లో కరోనా పెద్ద ఎత్తున వ్యాపిస్తున్న కారణంగా పెద్ద స్పందన వెల్లడి కాలేదు. అమరావతి కారణంగా తమ ఆస్ధుల విలువ పెరిగిందని సంతోషించిన వైసిపి మద్దతుదారులు తక్కువేమీ కాదు. రాజధాని, పరిసర ప్రాంతాల్లో గెలిచిన ఎంఎల్‌ఏలందరూ ఆ పార్టీకి చెందిన వారే. ఇప్పుడు సచివాలయం తరలింపు గురించి పైకి బింకంగా ఏమి మాట్లాడినా తమ ఆస్ధుల విలువ కూడా హరించుకుపోతున్నపుడు వైసిపి మద్దతుదారుల్లో అంతర్గతంగా సంతోషం ఏమీ ఉండదు. తమ నేతకు చెప్పలేకపోయినా గవర్నర్‌ అడ్డుకుంటే బాగుండు అని కోరుకున్న వారు లేకపోలేదు.
సుప్రీం కోర్టు, రాష్ట్రపతి ఆమోదంతో హైకోర్టు ఏర్పడింది కనుక, ఆ వ్యవస్ధల పాత ఆమోదాన్ని చెత్తబుట్టలో వేసి కొత్త ప్రతిపాదన చేస్తే దానికి కూడా ఆమోదం పొందవచ్చని కొందరు న్యాయవాదులు చెబుతున్నారు. ఇలాంటి సలహాలను నమ్మే జగన్‌ సర్కార్‌ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విషయంలో చేతులు కాల్చుకుంది అని గమనించాలి. లేదూ హైకోర్టు మార్పు విషయంలో హక్కుల అంశం లేదు కనుక ఎవరైనా కోర్టులకు ఎక్కినా విధాన పర నిర్ణయంగా భావించి కోర్టులు అభ్యంతర పెట్టవు అన్నది ఒక అభిప్రాయం. హైకోర్టును కర్నూలులో పెట్టాలని బిజెపి కూడా కోరుతున్నది, దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర అవసరం అయితే కేంద్ర అధికారంలో ఉన్న తాము దాని సంగతి చూసుకుంటామని, సాయం చేస్తామని బిజెపి నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రపతి అంటే రబ్బరు స్టాంపు గనుక ఎక్కడ ముద్రవేయమంటే అక్కడ వేస్తారు అని చెప్పేవారూ ఉన్నారు. తనకు లాభం అని బిజెపి భావించినా- వైసిపితో తెరవెనుక ముడి గట్టిగా పడినా అది కూడా జరిగినా ఆశ్చర్యం లేదు. పాలన వికేంద్రీకరణలో భాగంగా సచివాలయంతో సహా కార్యాలయాల తరలింపును కోర్టులు అడ్డుకోలేవు.
ముందు అమరావతి నుంచి సచివాలయాన్ని తరలించి తమ పంతం నెగ్గించుకోవాలన్నది వైసిపి పట్టుదల కనుక దాని కోసం బిజెపితో ఎలాంటి రాజీకైనా అంగీకరించే అవకాశం ఉంది. ఒక వేళ హైకోర్టు తరలింపులో అనుకోని అవాంతరాలు ఎదురై ఆగిపోయినా వైసిపికి పోయేదేమీ లేదు. ఆ సాకును చూపి న్యాయ రాజధానిని సీమలో ఏర్పాటు చేయలేక పోయామని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే రాజధాని ప్రాంత రైతుల్లో భూ సమీకరణ దగ్గర నుంచి అధికారంలో ఉన్నంత కాలం అది కల్పించిన ఆశలు, భ్రమలు, మునగచెట్టు ఎక్కించిన తీరు ఒకటైతే, జగన్‌ అధికారంలోకి వచ్చి అమరావతికి మంగళం పాడటానికి నిర్ణయించుకున్న తరువాత కూడా కేంద్రంలో తమకు ఉన్న పలుకుబడితో చక్రం అడ్డువేస్తామని తెలుగుదేశం నమ్మించింది. రైతులు కూడా నమ్మారు. ఇప్పుడు చంద్రబాబు నిజంగానే భావోద్వేగానికి గురైనా అదంతా నటన అనుకొనే వారే ఎక్కువగా ఉంటారు. ఎవరైనా ఒకసారి విశ్వసనీయత కోల్పోతే నిజం చెప్పినా నమ్మరు !
బిజెపి విషయానికి వస్తే అది నమ్మించి మోసం చేసిన తీరును జనం మరచిపోరు. అందువలన కన్నా లక్ష్మీనారాయణ అనే బొమ్మను పక్కన పెట్టి సోము వీర్రాజు అనే మరో బొమ్మను జనం ముందు పెట్టినా దానికి ఉన్నది పోయేదేమీ లేదు కొత్తగా వచ్చేదేమీ కనిపించటం లేదు. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పరిస్ధితి ఏమిటో అర్దం కాకుండా ఉంది. నటుడు కనుక తిరిగి సినిమాల్లోకి పూర్తిగా వెళ్లవచ్చు, లేదా కాల్షీట్లు తీసుకొని బిజెపి రాజకీయ సినిమాలో పాత్రపోషించవచ్చు, నమ్ముకున్న కార్యకర్తలేమౌతారు ?
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌-బిజెపి రెండూ తమ వంతు పాత్రలను ఎలా పోషించాయో పదే పదే చెప్పుకోవనవసరం లేదు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది. బిజెపి నాటకాలు ఇంకా ఆడుతూనే ఉంది. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర పాత్ర ఉండదని, 2015 నోటిఫికేషన్‌ ప్రకారం రాజధాని అమరావతే అని, మూడు రాజధానుల విషయం పత్రికల్లో మాత్రమే చూస్తున్నామని కేంద్ర ప్రభుత్వం గతంలో పార్లమెంటులో ప్రకటించింది. వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటుకు అవసరమైన బిల్లులను రూపొందించటం, వాటిని గవర్నర్‌ ఆమోదించటంతో చట్టాలు కావటం తెలిసిందే. ఇప్పుడు గతంలో మాదిరి చెబితే కుదరదు. తన వైఖరి ఏమిటో చెప్పకతప్పదు.
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని విషయమై శివరామకృష్ణన్‌ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రమే. రాజధాని ఖరారు అయ్యేంత వరకు పదేండ్ల పాటు హైదరాబాదులో రాజధాని కొనసాగవచ్చనే అవకాశం ఇచ్చిందీ కేంద్రమే. శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులపై తెలుగుదేశం-బిజెపి సంకీర్ణ రాష్ట్ర ప్రభుత్వం నారాయణ కమిటీని వేసి అది చేసిన సిఫార్సుల ప్రకారం రాజధానిని ప్రతిపాదించింది. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రకారం అమరావతిని ఖరారు చేయటాన్ని కేంద్రం అంగీకరించింది. తాము నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక స్ఫూర్తి లేదా సిఫార్సులకు అనుగుణ్యంగా అమరావతి ఎంపిక లేదని కేంద్రం నాడు ఎలాంటి వివరణా కోరలేదు, అభ్యంతరమూ వ్యక్తం చేయలేదు. అక్కడ సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు నిధులు కూడా మంజూరు చేసి విడుదల చేసింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వయంగా వచ్చి రాజధానికి శంకుస్ధాపన చేశారు. చంద్రబాబు రమ్మంటే వచ్చి రాయి వేసి వెళ్లారు తప్ప దానితో బిజెకి సంబంధం లేదని ఇప్పుడు ఆ పార్టీ వారు చెబుతున్నారు. రేపు మరి విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని శంకుస్ధాపనలకు కూడా పిలిస్తే వస్తారా ? వైసిపి ప్రభుత్వం అసలు పిలుస్తుందా ? ఏం జరుగుతుందో ఎలా కథ నడిపిస్తారో చూడాలి. ఈ మూడు రాజధానుల గురించి కేంద్రానికి రాష్ట్రం ఏ రూపంలో నివేదిస్తుందో కూడా ఆసక్తి కలిగించే అంశమే.
రాజధాని ఏర్పాటులో కేంద్రం జోక్యం చేసుకోదని బిజెపి కొత్త నేత సోము వీర్రాజు చెప్పారు. దీనిలో కొత్తదనం ఏముంది. గతం నుంచీ చెబుతున్నదే. బిజెపి నేతలు పార్టీగా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నాం తప్ప కేంద్ర ప్రభుత్వ పరంగా జోక్యం చేసుకొనే అవకాశం లేదని చెబుతున్నారు, దీనిలో అవకాశవాదం తప్ప పెద్ద తెలివితేటలేమీ లేవు. ఇప్పుడు మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్రవేయటాన్ని కూడా సమర్ధిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నియామకం విషయంలో గవర్నర్‌ తీసుకున్న చర్య సరైనది అయినపుడు రాజధానుల బిల్లుల విషయంలో గవర్నర్‌ చర్య తప్పిదం ఎలా అవుతుందని చెట్టుకింది ప్లీడర్‌ వాదనలు చేస్తున్నారు. మేము గవర్నర్ల వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని పత్తిత్తు కబుర్లు చెబుతున్నారు.
ఎన్నికల కమిషనర్‌ నియామకం గవర్నర్‌ చేయాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తెచ్చింది, కొత్త కమిషనర్‌ పదవీకాలం గురించి తెచ్చిన ఆర్డినెన్స్‌, కొత్త కమిషనర్‌ నియామకం తప్పని హైకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు దాని మీద ఎలాంటి స్టే ఇవ్వలేదు కనుక తన పదవి గురించి రమేష్‌ కుమార్‌ తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్‌ను కలవండన్న కోర్టు సూచన మేరకే కలిశారు. కానీ మూడు రాజధానుల బిల్లుల విషయం వేరు. వాటిని ఆమోదించవద్దని గవర్నర్‌కు లేఖ రాసిన పార్టీలలో బిజెపి కూడా ఉందని వారు మరచిపోతే ఎలా ? గవర్నర్‌ వ్యవస్ధలో జోక్యం చేసుకోము అని చెబుతున్నవారు లేఖ ఎందుకు రాసినట్లు ? లేఖ రాసినందుకే కన్నా లక్ష్మీ నారాయణను పదవి నుంచి తప్పించారా ? పోనీ లేఖ రాయటం తప్పని కొత్త అధ్యక్షుడు పశ్చాత్తాపం ఏమైనా ప్రకటిస్తారా ?
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను శాసనమండలి ఆమోదించలేదు, సెలెక్టు కమిటీకి నివేదిస్తున్నట్లు మండలి అధ్యక్షుడు ప్రకటించారు.సిఆర్‌డిఏ రద్దు బిల్లు, రాజధానికి సంబంధించి ఇతర అంశాల గురించి కోర్టులలో కొన్ని కేసులు దాఖలై ఉన్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ద చర్యలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్న వారు రాజ్యాంగ ప్రతినిధి గవర్నర్‌ గనుక వాటిని ఆమోదించవద్దని లేదా న్యాయసలహాలు తీసుకోవాలని బిజెపితో పాటు ఇతర పార్టీలు కోరాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి గవర్నర్‌ ఆమోద ముద్ర వేశారు. కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా లేదా ఆయన కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చిన తరువాతే గవర్నర్‌ ఈ చర్య తీసుకున్నారనే విమర్శలు వున్నాయి.వాటికి సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు లేదా లేదని నిరాకరిస్తున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా మూడు రాజధానుల గురించి బిజెపిలో ఏకాభిప్రాయం లేదు. ఈ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్న లేదా ప్రకటనలు చేస్తున్న వారిని ఆ పార్టీ ఇంతవరకు కట్టడి చేయలేకపోయింది.
ఇక హైకోర్టు గురించి గతంలో చేసిన వాదనలనే బిజెపి నేతలు చేస్తున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడక ముందే ప్రావిన్సులలో హైకోర్టులు ఉన్నాయి. రాష్ట్ర రాజధానిలోనే హైకోర్టు ఉండాలన్న అంశం రాజ్యాంగంలో స్పష్టంగా లేదు. అందువలన రాష్ట్రాల ఏర్పాటు, సంస్దానాల విలీనాల సమయంలో జరిగిన ఒప్పందాల ప్రకారం రాజధాని ఒక చోట హైకోర్టు ఒక చోట ఏర్పాటు చేశారు. తిరువాన్కూరు-కొచ్చిన్‌ సంస్ధానాల విలీనం సమయంలో రాజధాని తిరువనంతపురం, హైకోర్టు కొచ్చిన్‌లో ఉండాలన్నది ఒప్పందం. అలాగే మద్రాసు ప్రావిన్సు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు రాజధాని కర్నూల్లో, హైకోర్టు గుంటూరులో ఉండాలన్నది పెద్ద మనుషుల ఒప్పందం. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినపుడు ఈ సమస్యకు బదులు ఇతరంగా ముల్కీ వంటి ఒప్పందాలు జరిగాయి. రాజధానిని విజయవాడలో పెట్టాలని కొందరు కోరినా హైకోర్టుతో సహా చివరకు హైదరాబాద్‌ను ఖరారు చేశారు. రాజధానులలో కాకుండా ఇతర చోట్ల హైకోర్టులు ఉన్న ప్రాంతాలన్నింటికీ ఇలాంటి ఏదో ఒక నేపధ్యం ఉన్నది. తరువాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలలో ఉత్తరాఖండ్‌లో హైకోర్టు నైనిటాల్‌ నగరంలో ఉంది. రాజధాని చలికాలంలో డెహ్రాడూన్‌లో, వేసవి కాలంలో దానికి 250కిలోమీటర్ల దూరంలోని గైరాసియన్‌ పట్టణంలో ఉంటుంది. ఇవేవీ వివాదం కాలేదు, ఒక సారి ఖరారు అయిన తరువాత మార్పులు జరగలేదు. ఆంధ్రప్రదేశ్‌లోనే ఖరారైన రాజధాని విషయంలో రాజకీయం మొదలైంది.
న్యాయమూర్తుల నియామకం, హైకోర్టు బెంచ్‌ల ఏర్పాటు వంటివి సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వ వ్యవహారం కనుక హైకోర్టు తరలింపు ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవాల్సింది సుప్రీం కోర్టు, కేంద్రమే. సచివాలయాన్ని తరలిస్తే కేంద్రం చేయగలిగిందేమీ లేదు. కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు లేదా తీరుస్తారు అన్నట్లుగా హైకోర్టు తరలింపును సుప్రీం కోర్టు ఆమోదించకపోతే, అది జరగకుండా కేవలం సచివాలయాన్నే తరలిస్తే జగన్‌ సర్కార్‌ రాజకీయంగా చిక్కుల్లో పడుతుంది. దాన్ని సొమ్ము చేసుకొనేందుకు బిజెపి రంగంలోకి దిగవచ్చు. అనేక రాష్ట్రాలు హైకోర్టు బెంచ్‌లను ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రాన్ని ఇప్పటికే అనేక సార్లు కోరి ఉన్నాయి. వాటిలో దేనినీ కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు తరలింపుకు ఆమోదం తెలిపితే కొత్త సమస్యలకు తెరలేపినట్లవుతుంది.
ఇక 2015లో వెలువరించిన గజెట్‌ నోటిఫికేషన్‌ లేదా రాజధానిగా అమరావతి ఉత్తర్వు మార్చటానికి వీలు లేని శిలాశాసనమో, చంద్రబాబు చెక్కిన శిలాఫలకమో కాదని, కొత్త ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా మరొకదానిని జారీ చేయవచ్చని బిజెపి నేత జివిఎల్‌ నరసింహారావు గతంలోనే చెప్పారు. 2015లో అప్పటి ప్రభుత్వం జీవో ద్వారా నోటిఫై చేసింది కనుక ప్రస్తుతానికి అమరావతే రాజధాని అని లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో కేంద్రం పేర్కొందని ప్రస్తుత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకొని భవిష్యత్తులో రాజధానిని మరోచోటుకి మార్చి, ఆ విషయాన్ని తెలియజేస్తే కేంద్రం గుర్తిస్తుందని కూడా నరసింహారావు చెప్పారు. అదే ముక్క పార్లమెంటు సమాధానంలో బిజెపి సర్కార్‌ ఎందుకు చెప్పలేదు అని అడిగినవారు లేకపోలేదు.
ఏదీ శిలాఫలకం, శాసనం కానపుడు, మార్చుకోవటానికి అవకాశం ఉన్నపుడు స్వయంగా బిజెపి నేతలు కోరిన పదేండ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హౌదాకు విధానాలను మార్చటానికి, ఉత్తర్వులు జారీ చేసేందుకు కేంద్రానికి ఉన్న అడ్డంకి, అభ్యంతరం ఏమిటి? ఎందుకు హౌదా ఇవ్వరు. పోనీ ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు తీసుకున్న ఇతర చర్యలేమైనా ఉన్నాయా అంటే లేవు.
చంద్రబాబు నాయుడు అమరావతిని ఒక భ్రమరావతిగా చూపుతూ సింగపూర్‌, కౌలాలంపూర్‌, మరొకటో మరొక దాని పేరో చెప్పి రైతులకు, జనాలకు భ్రమలు కల్పించారు. రాజధాని తరలింపు జరిగితే రైతులకు ఎలా న్యాయం చేస్తారనే ప్రశ్న ముందుకు వచ్చింది. రాజధాని తమ ప్రాంతంలో పెడతామని చెప్పారు గనుకనే మేము భూములను ఇచ్చామని, ఇప్పుడు రాజధాని తరలిపోయి, తాము ఇచ్చిన భూములు దేనికీ పనికి రాకుండా పోతే తామేమి కావాలని వారు అడుగుతున్నారు. దానిలో తప్పు లేదు. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. వారు ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకొని భూములు ఇచ్చారు. దానికి ప్రతిఫలంగా కొన్ని సంవత్సరాల పాటు కౌలు చెల్లింపు, వారు ఇచ్చిన భూమి విస్తీర్ణాన్ని బట్టి అభివృద్ధి చేసిన రాజధాని ప్రాంతంలో కొంత స్ధలాన్ని వారికి అందచేయాల్సి ఉంది. చట్టపరంగా ప్రభుత్వం ఆ పని చేయకపోతే కోర్టులకు వెళ్లి దాన్ని సాధించుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఇక్కడ సమస్య అది కాదు. రాజధాని ఏర్పడితే ఆ ప్రాంతంలో తమ వాటాగా వచ్చిన స్ధలాలకు మంచి రేట్లు వస్తాయని, అవి మొత్తం భూముల విలువ కంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉంటాయని ఆశించారు. ప్రభుత్వం అభివృద్ధి చేసిన ప్లాట్లు అంటే రోడ్లు, డ్రైనేజి వంటి మౌలిక సదుపాయాలు కల్పించి అందచేయటం. అలా ఇచ్చినా తాము ఆశించిన మేరకు ధరలు రావన్నది రైతుల అసలు ఆందోళన. దీనికి తోడు పేదలకు ఇండ్ల స్ధలాలు ఇచ్చే పేరుతో ఇతర ప్రాంతాల వారికి ఇక్కడ స్ధలాలు కేటాయిస్తే తమ భూములకు డిమాండ్‌ పడిపోతుందని, ఇలాంటి ఎన్నో అనుమానాలు ఆ ప్రాంత వాసుల్లో ఉన్నాయి.
ఇప్పటికీ బిజెపి నేతలు రాజధాని ప్రాంత రైతులకు న్యాయం చేస్తామని, చేయాలనే తాము కోరుతున్నట్లు చెబుతుంటారు. మరోవైపు మూడు రాజధానుల విషయంలో తాము చేయగలిగిందేమీ లేదంటారు. వారితో కలసిన లేదా గత ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నందున వారిని కలుపుకు ఉద్యమిస్తానని ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌ ఏమి చేస్తారో, ఏమి చెబుతారో చూద్దాం. వైసిపి నాయకులు కూడా రాజధాని రైతులకు న్యాయం చేస్తామనే చెబుతున్నారు. వారి ఆచరణ ఏమిటో చూడాల్సి ఉంది.