Tags

,


ఎం కోటేశ్వరరావు


మనకు నరేంద్రమోడీ అనే కొత్త దేవుడు, రక్షకుడు వచ్చాడు. ఆయన మహత్తులు అన్నీ ఇన్నీ కావు. ఛాతీ 56 అంగుళాలంట. ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మనకు మంచి రోజులు వచ్చాయి. గుజరాత్‌ అనుభవాన్ని దేశమంతటా అమలు చేస్తారు. గతంలోనూ, ఇప్పుడూ సాగుతున్న ప్రచార సారం ఇదే.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం-దాని రూపు రేఖల గురించి మీడియా గత కొద్ది రోజులుగా ప్రచారం ప్రారంభించింది. శంకుస్ధాపన కార్యక్రమాన్ని అట్టహాసంగా జరపబోతున్నారు. కొద్ది రోజుల పాటు జనాన్ని ఆ భక్తిలో ముంచి తేల్చుతారు. సుప్రీం కోర్టు మార్గాన్ని సుగమం చేసింది, స్దలం గురించి సవాలు చేసిన వారు కూడా తీర్పును ఆమోదించారు. రామాలయ నిర్మాణ ఏర్పాట్లు చేసుకోనివ్వండి ఇబ్బంది లేదు.
కకావికలమైన దేశ ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టటానికి చర్యలేమిటో ఎక్కడా కనపడటం లేదు. ఎవరూ చెప్పటం లేదు. ఎంత త్వరగా రామాలయ నిర్మాణం పూర్తి అయితే అంత త్వరగా కరోనా అంతం అవుతుందని రాజస్ధాన్‌లోని దౌసా బిజెపి ఎంపీ జస్‌కౌర్‌ మీనా ప్రకటించారు. కరోనా వైరస్‌ నిర్మూలనకు రామాలయ నిర్మాణానికి లంకె ఏమిటో తెలియదు. తన ఆలయం పూర్తి అయిన తరువాతే కరోనా సంగతి చూస్తానని రాముడు అలిగి కూర్చున్నాడా అని ఎవరైనే అంటే అదిగో మా మనోభవాలను దెబ్బతీస్తున్నారని దెబ్బలాటకు వస్తారు.
రిజర్వుబ్యాంకు జూన్‌ 30న ప్రకటించిన వివరాల మేరకు 2020 మార్చి నెలాఖరుకు మన విదేశీరుణం 558.5 బిలియన్‌ డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా. మోడీ అధికారానికి వచ్చిన 2014లో ఈ మొత్తం 446.2బిలియన్‌ డాలర్లు. ఈ కాలంలో మన విదేశీ అప్పుల గురించి సామాజిక మాధ్యమంలో మోడీ మద్దతుదారులు చేసిన ప్రచారాలు అన్నీ ఇన్నీకావు. మోడీ కొత్తగా అప్పులు చేయలేదు, అంతకు ముందు పాలించిన వారు చేసిన అప్పులను తీర్చేశారు. ఇలా ప్రచారాలు సాగాయి, ఇంకా చేస్తూనే ఉన్నారు. అదే వాస్తవం అయితే ఆరు సంవత్సరాలలో 112 బిలియన్‌ డాలర్ల అప్పులు ఎలా పెరిగినట్లు ?
రిజర్వుబ్యాంకు వెల్లడించిన అంకెల మేరకు పైన పేర్కొన్న సంవత్సరాల మధ్యకాలంలో ముందుకు వచ్చిన ధోరణులు, కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. జిడిపిలో విదేశీ అప్పు శాతం 23.9 నుంచి 20.6కు తగ్గింది. తీసుకున్న అప్పులకు వడ్డీ, అసలు మొత్తం కలిపి జిడిపిలో 5.9 నుంచి 6.5శాతానికి పెరిగింది. వాణిజ్య రుణాల మొత్తంతో పాటు వాటికి చెల్లించే అధిక వడ్డీ ఈ పెరుగుదలకు కారణం. అప్పులో రాయితీలతో కూడిన రుణాల శాతం 10.4 నుంచి 8.6కు తగ్గింది.
అంతర్గత అప్పు 2014-2020 సంవత్సరాల మధ్య 1,160.56 బిలియన్‌ డాలర్ల నుంచి 2,219.37 బి.డాలర్లకు చేరిందని, ఇది 2024 నాటికి 3,299.94 బి.డాలర్లకు చేరుతుందని స్టాటిస్టా డాట్‌ కామ్‌ పేర్కొన్నది. భారత అప్పు జిడిపిలో 87.6శాతానికి పెరగనుందని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ ప్రధాన ఆర్ధిక సలహాదారు డాక్టర్‌ సౌమ్య కాంతి ఘోష్‌ జూలై 20న రాసిన విశ్లేషణలో పేర్కొన్నారు. దానిలో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి.” 2012లో రు.58.8లక్షల కోట్లుగా (జిడిపిలో 67.4శాతం) ఉన్న అప్పు 2020 ఆర్ధిక సంవత్సరానికి రు. 146.9లక్షల కోట్లకు(జిడిపిలో 72.2శాతం) పెరిగింది. వర్తమాన సంవత్సరంలో పెద్ద మొత్తంలో అప్పు చేయనున్నందున అది రు. 170లక్షల కోట్లకు(జిడిపిలో 87.6శాతం) చేరనుంది. విదేశీ అప్పు విలువ రు.6.8లక్షల కోట్లు(జిడిపిలో 3.5శాతం) కాగా మిగిలిందంతా స్వదేశీ అప్పు. దేశ అప్పులో రాష్ట్రాల వాటా 27శాతం. జిడిపి కుప్పకూలిన కారణంగా అప్పు నాలుగుశాతం పెరగనుంది. ఖజానా బాధ్యత మరియు బడ్జెట్‌ యాజమాన్యం(ఎఫ్‌ఆర్‌బిఎం) చట్టం ప్రకారం జిడిపి-అప్పు దామాషాను 2023 నాటికి 60శాతానికి తగ్గించాల్సి ఉంది.అయితే 2030 నాటికి మాత్రమే అది సాధ్యమయ్యేట్లు కనిపిస్తోంది. రాబోయే సంవత్సరాలలో వడ్డీ ఖర్చు తగ్గుతుంది.”
ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధల నుంచి అప్పులు తీసుకోవాల్సి రావటంతో అవి విధించిన షరతుల మేరకు 2003లో ఖజానా బాధ్యత మరియు బడ్జెట్‌ యాజమాన్యం(ఎఫ్‌ఆర్‌బిఎం) చట్టాన్ని చేశారు. అయితే దానికి మినహాయింపులకు కూడా చట్టంలోనే అవకాశం కల్పించారు. చేసిన అప్పులను చెల్లించగలిగే విధంగా చూసే ఏర్పాటులో ఈ చట్టం ఒక భాగం. పరిమితికి మించి అప్పులు చేయరాదు, ద్రవ్యలోటును పెంచకుండా క్రమశిక్షణ పాటించాలి అన్నది ప్రధాన అంశం.2009 నాటికి రెవెన్యూ లోటు లేకుండా చేయాలని అయితే జిడిపిలో అరశాతం వరకు ఉండవచ్చని లక్ష్యంగా నిర్ణయించారు. అదే ఏడాది నాటికి ద్రవ్యలోటును మూడుశాతానికి తగ్గించాలని, 0.3శాతం వరకు ఉండవచ్చని పేర్కొన్నారు. 2007-08లో ద్రవ్యలోటు 2.7, ఆదాయలోటు 1.1శాతం ఉంది. అదే సంవత్సరం ప్రపంచంలోని ధనిక దేశాలలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కారణంగా ఉద్దీపన పధకాలను చేపట్టేందుకు ఎఫ్‌ఆర్‌బిఎం చట్ట లక్ష్యాలను వాయిదా వేశారు. తరువాత ఈ చట్టానికి 2012, 2015లో సవరణలు చేశారు. 2015నాటికి లక్ష్యాలను సాధించాలని 2012లో సవరణ చేయగా 2018 నాటికి రెవెన్యూ లోటును కనీసం 0.5శాతానికి తగ్గించాలని, ద్రవ్యలోటు 3శాతం, కనీసంగా 0.3శాతంగా ఉండాలని 2015లో సవరించారు.
అయితే 2016లో ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలు మరీ కఠినంగా ఉన్నాయని వాటిని సమీక్షించాలని ఎన్‌కె సింగ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. ఆ మేరకు ద్రవ్యలోటును 2020 మార్చి ఆఖరుకు 3శాతం, 2020-21కి 2.8, 2023 నాటికి 2.5శాతానికి పరిమితం చేయాలని, అప్పును 60శాతానికి పరిమితం చేయాలన్నది వాటి సారాంశం. అప్పుల విషయానికి వస్తే కేంద్రం 40, రాష్ట్రాలు 20శాతానికి పరిమితం చేసుకోవాలని, రెవెన్యూలోటును 0.8శాతానికి తగ్గించుకోవాలని సింగ్‌ కమిటీ చెప్పింది.
అయితే నరేంద్రమోడీ సర్కార్‌ తాను నియమించిన కమిటీ సిఫార్సులను తానే తుంగలో తొక్కింది. మూడుశాతం ద్రవ్యలోటును 3.2శాతంగా 2017లో నాటి ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ పేర్కొన్నారు.2018లో చట్టానికి మరో అరశాతం లోటు పెంచుకోవచ్చని నిర్ణయించారు. ప్రస్తుత మంత్రి నిర్మలా సీతారామన్‌ 2020లో ద్రవ్యలోటును 3.8శాతంగానూ 2021లో 3.5శాతం ఉంటుందని చెప్పారు. అయితే వాస్తవంలో 2020 ద్రవ్యలోటు 4.59శాతం అని రెవెన్యూలోటు 3.27శాతమని ప్రభుత్వమే వెల్లడించింది.
ఇక వర్తమాన ఆర్ధిక సంవత్సర ద్రవ్యలోటు విషయానికి వస్తే 3.5శాతం అంటే 7.96 లక్షల కోట్ల మేర ద్రవ్యలోటు ఉంటుందని అంచనా వేశారు. అయితే మొదటి మూడు మాసాల్లోనే దానిలో 83.2శాతం అంటే 6.62లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చయ్యాయి. మరో తొమ్మిది నెలల్లో ఖర్చుకు 1.34 లక్షల కోట్లు మాత్రమే ఉంటాయి. కరోనా నేపధ్యంలో ఈ పరిమితికి లోబడేందుకు ఇప్పటికే ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల మీద జనాన్ని లూటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సొమ్మంతా లోటు, ఆదాయ లోటు పూడ్చుకొనేందుకు వినియోగిస్తున్నారు. ప్రస్తుత మాదిరి ఆర్దిక పరిస్ధితి దిగజారుడు కొనసాగితే అనేక పధకాలు, సంక్షేమ చర్యలకు కోతలతో పాటు జనం మీద ఏదో ఒకసాకుతో భారాలు మోపే అవకాశాలు ఉన్నాయి.
భారత్‌ రేటింగ్‌ మాదిరి దేశాలతో పోలిస్తే భారత ప్రభుత్వ అప్పు ఎంతో ఎక్కువగా ఉందని మూడీస్‌ రేటింగ్‌ సంస్ధ పేర్కొన్నది. ఆ దేశాల మధ్యగత (మిడియన్‌) రుణ భారం 53శాతం అయితే 2019లో భారత అప్పు 72శాతంగా ఉంది. 2003లో (వాజ్‌పేయి ఏలుబడి) 84.7శాతంగా ఉన్న అప్పు 2016 నాటికి 67.5శాతానికి తగ్గింది.కరోనాకు ముందు అప్పు పెరుగుదల రేటు ప్రకారమైనా 2024మార్చి నాటికి భారత్‌ అప్పు జిడిపిలో 81శాతం ఉంటుందని మూడీస్‌ మే నెలలో అంచనా వేసింది.
కరోనా ఖర్మకు జనాన్ని వదలి వేశారు, అది బలహీనపడితేనో, లేక జనం తమంతట తాము జాగ్రత్తలు తీసుకుంటే తప్ప కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకు మించి చేసేదేమీ లేదని తేలిపోయింది. కరోనా పోరుకు సంకల్పం చెప్పేందుకు చప్పట్లు కొట్టమని, కొవ్వొత్తులు వెలిగించమని మరోమారు కోరే అవకాశం లేదు. కరోనా వదలినా ఆర్ధిక సంక్షోభ ఊబి నుంచి జనం ఎప్పుడు బయటపడతారో తెలియని కొత్త సంక్షోభంలోకి ఒక్కొక్క దేశం చేరుతోంది. మన దేశాన్ని కరోనాకు ముందే ఆ బాటలో నడిపించారు. ఇప్పుడు నిండా ముంచబోతున్నారా ?