Tags

,


ఎం కోటేశ్వరరావు


పాకిస్ధాన్‌ ప్రభుత్వం కొత్త రాజకీయ చిత్ర పటాన్ని రూపొందించి మన దేశంతో సరికొత్త వివాదానికి దిగింది. ఆక్రమిత కాశ్మీరును ఇప్పటికే తనదిగా చూపుతున్న పాక్‌ కొత్తగా జమ్మూకాశ్మీరు, లడఖ్‌ ప్రాంతాలను గుజరాత్‌లోని జునాఘడ్‌, సర్‌ క్రీక్‌ ప్రాంతాలను కూడా తనవిగా చూపుతూ కొత్త చిత్రపటాన్ని ప్రచురించింది. లడఖ్‌లో తమవిగా చైనా చెబుతున్న ప్రాంతం, గిల్గిట్‌్‌-బాల్టిస్ధాన్‌లో పాకిస్దాన్‌ 1963లో చైనాకు అప్పగించిన ప్రాంతం వీటిలో లేవు. నిజానికి ఈ మాప్‌లు కొత్తవి కాదు, స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లోనే ఈ ప్రాంతాలు, నాటి తూర్పు పాకిస్దాన్‌(నేటి బంగ్లాదేశ్‌)ను కలిపి నాటి పాక్‌ ప్రభుత్వం ముద్రించింది.తరువాత వాటిని వెనక్కు తీసుకుంది. కాశ్మీర్‌ సమస్యను ఇరు దేశాలు పరిష్కరించుకోవాలన్న 1972 సిమ్లా ఒప్పందం తరువాత 1999 నాటి లాహౌర్‌ ప్రకటనకు విరుద్దం. పాక్‌ చర్య రాజకీయ మూఢత్వమని మన దేశం వ్యాఖ్యానించింది.
పాక్‌ కొత్త చిత్రపటాన్ని తయారు చేసినంత మాత్రాన ఆ ప్రాంతాలు దానివి కావు, మన నుంచి పోవు. ప్రతి దేశం తనవి అని భావించే ప్రాంతాలను చూపుతూ రాజకీయ చిత్ర పటాలను తయారు చేస్తుంది, ప్రచారంలో పెడుతుంది. సరిహద్దుల గురించి వివాదం ఉన్నపుడు వాటిని ఇరుగు పొరుగు దేశాలు అంగీకరించవు. ఉదాహరణకు చైనా ముద్రించే చిత్ర పటాల్లో మన ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ను తన టిబెట్‌లో భాగంగా చూపింది. అదే విధంగా మన చిత్ర పటాల్లో మనవిగా చూపుతున్న ఆక్సారుచిన్‌, లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలు మన ఆధీనంలో లేవు.


మన ప్రధాని నరేంద్రమోడీ లేదా బిజెపి నేతలు అమెరికా అడుగులకు మడుగులొత్తుతున్నారు. మనకు ఎంతో కావలసిన దేశం అమెరికా అంటారు, అన్ని అంశాల్లో మనకు మద్దతు ఇస్తూ ముందుకు పొమ్మని చెబుతోంది అని చెబుతారు. చైనాకు వ్యతిరేకంగా మనకు మద్దతు ఇస్తోందని ఇటీవల ఎక్కువగా చెబుతున్నారు. భద్రతా మండలిలో మనకు శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు చిత్తశుద్దితో పని చేస్తున్న మిత్ర దేశం అని కొనియాడతారు. అయినా సరే కాశ్మీరును మన అంతర్భాగంగా అమెరికా ఇంతవరకు గుర్తించలేదు అనే విషయం ఎంత మందికి తెలుసు. కాశ్మీర్‌ను ప్రస్తావించాల్సి వస్తే గతంలో భారత ఆక్రమిత ప్రాంతం అని పిలిచే అమెరికన్లు ఇటీవలి కాలంలో భారత పాలిత కాశ్మీరు అని సవరించారు తప్ప మరొక మార్పు చేయలేదు. డోనాల్డ్‌ ట్రంప్‌ను నరేంద్రమోడీ పదే పదే కౌగలించుకున్నారు-దానికి ప్రతిగా నరేంద్రమోడీ భారత దేశ పిత అని ట్రంప్‌ బిరుదు ఇచ్చాడు తప్ప కాశ్మీరు మనదే అని గుర్తించలేదు.
అరుణాచల్‌ ప్రదేశ్‌ తనది అని చైనా తన పటాల్లో ముద్రించినా, కాశ్మీరు మనది అని అమెరికా గుర్తించకపోయినా వాటితో విబేధిస్తున్నామని చెబుతూనే రెండు దేశాలతో దౌత్య సంబంధాలు కొనసాగించటానికి మనకు ఎలాంటి ఇబ్బందీ లేకపోయింది. పాకిస్ధాన్‌ తన చిత్ర పటాల్లో తాజాగా మార్పులు చేసినా ఇదే వైఖరి కొనసాగుతుంది.


పాకిస్ధాన్‌ తన చిత్రపటాన్ని ఇప్పుడెందుకు సవరించింది ?
కాశ్మీర్‌ తమదే అని చెబుతున్నప్పటికీ ఆక్రమిత ప్రాంతాన్ని ఆజాద్‌ కాశ్మీరు అని ప్రత్యేకంగా చూపుతోంది తప్ప మిగతా కాశ్మీరు, జునాఘడ్‌ను తమ అంతర్భాగాలుగా ఇంతవరకు చూపలేదు. ఇప్పుడు సవరించింది అంటే కొత్త వివాదానికి తెరలేపినట్లు అనుకోవాల్సి వస్తోంది. కాశ్మీర్‌ రాష్ట్ర రద్దు, దానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టి ఏడాది గడచిన సందర్భంగా పాక్‌ ఈ చర్యకు పాల్పడింది. దీని గురించి జాతీయంగా, అంతర్జాతీయంగా వెలువడుతున్న విశ్లేషణలు మీడియా కథనాలను చూస్తే పాక్‌ చర్య వెనుక చైనా హస్తం ఉంది అన్నది ఒక ఆరోపణ. గతంలో నేపాల్‌ విషయంలోనూ అదే ఆరోపణను చైనా మీద చేశారు. గతంలో కుదిరిన ఒప్పందాలకు అనుగుణ్యంగా బంగ్లాదేశ్‌ వస్తువుల దిగుమతులపై చైనా పన్ను రాయితీలు ఇచ్చినపుడు కూడా దాన్ని భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌ను బుట్టలో వేసుకొనే చర్యగా వర్ణించారు. ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్‌ యుద్ద విమానాలు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని ఆల్‌ దఫ్రా వైమానిక కేంద్రంలో ఆగిన సమయంలో ఇరాన్‌ వైపు నుంచి మూడు క్షిపణులు బయలు దేరాయని, అవి ఆల్‌ దఫ్రా వైపే వస్తున్నట్లు సమాచారం అందిందని అమెరికాలోని సిఎన్‌ఎన్‌, ఫాక్స్‌ న్యూస్‌ టీవీ ఛానల్స్‌ వార్తలను ప్రసారం చేశాయి. ఇరాన్‌ క్షిపణులు వచ్చినట్లు అవి సమీపంలోని సముద్రంలో పడినట్లు కూడా అవి చెప్పాయి. ఇవి అమెరికా అల్లిన కట్టుకథలు, ఇరాన్‌తో మన సంబంధాలను చెడగొట్టే చర్య తప్ప మరొకటి కాదు. మీడియాలో వస్తున్న వర్ణణలు, అధికారయంత్రాంగం అనధికారికంగా వదులుతున్న లీకు వార్తలను బట్టి ఎలాంటి నిర్దారణలకు రాకూడదు. మీడియాలో వచ్చిన వార్తలకు విరుద్దంగా చైనా ఎటువంటి ఆక్రమణలకు పాల్పడలేదని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు పాక్‌ చర్య వెనుక చైనా ఉందని అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు.

అయితే పాక్‌ చర్య వెనుక చైనా హస్తం లేదా ?
అంతర్జాతీయ రాజకీయాలు వేడెక్కినపుడు, సంక్లిష్టంగా మారినపుడు ప్రతి పరిణామం వెనుక ఏదో ఒక దేశ హస్తం ఉన్నట్లు అనుమానాలు తలెత్తటం సహజం. అవి దాయాదులు లేదా శత్రుదేశాల మధ్యనే కాదు మిత్రదేశాల వ్యవహారాల్లో కూడా కనిపిస్తుంది. కొన్ని పరిణామాల వెనుక చైనా హస్తం ఉందని అనుకొనే వారికి ఆ స్వేచ్చ ఉంది. అయితే మరికొన్ని పరిణామాల వెనుక అమెరికా హస్తం ఉందని దాని ప్రభావానికి మన దేశం లొంగిపోతోందనే కోణంలో కూడా వారితో పాటు అందరూ ఆలోచించాల్సి ఉంది.
ఉదాహరణకు మన దేశంతో కుదుర్చుకున్న ఒక రైల్వే లైన్‌ నిర్మాణం నుంచి ఇరాన్‌ మనలను తప్పించిందని మన మీడియాలో వార్తలు వచ్చాయి. చాబహర్‌ రేవు నుంచి ఆప్ఘనిస్తాన్‌ సరిహద్దు వరకు నిర్మించ తలపెట్టిన కొత్త రైలు మార్గ నిర్మాణంలో భాగస్వామ్యం గురించి భారత్‌తో చర్చలు జరిగాయి తప్ప ఒప్పందం వరకు రాలేదని ఇరాన్‌ ప్రకటించింది. భవిష్యత్‌లో ఇరాన్‌ మీద అమెరికన్లు ఆంక్షలను తీవ్రతరం చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయనే భయం మన దేశానికి కలిగినందున ఆ ప్రాజెక్టు నుంచి మన దేశాన్ని ఇరాన్‌ తప్పించిందనే రీతిలో వార్తలు వెలువడ్డాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోక పోవటానికి, ఆంక్షల గురించి భయపడటం వెనుక అమెరికా హస్తం ఉన్నట్లేనా ? అమెరికా బెదిరింపులకు మన 56 అంగుళాల ఛాతీ ఉన్న నరేంద్రమోడీ సర్కార్‌ భయపడినట్లా ?


ఇరాన్‌ చాబహార్‌ రేవు అభివృద్ధికి 2016లో మన నరేంద్రమోడీ సర్కార్‌ ఒప్పందం చేసుకుంది. ఐదుదశల్లో ఈ రేవు సామర్ద్యాన్ని పెంచాలన్నది పధకం. తొలి దశలో మన దేశం చేసుకున్న ఒప్పందాన్ని సకాలంలో అమలు చేయలేకపోయిందని ఇరాన్‌ చెబుతోంది. దానికి అమెరికా వత్తిళ్లే కారణం అని ఇరాన్‌ విమర్శిస్తోంది. అది వాస్తవం కానట్లయితే సకాలంలో పధకాన్ని పూర్తి చేయలేని మన అసమర్ధత అయినా అయ్యుండాలి. తదుపరి చర్యలకు భారత్‌కోసం తాము వేచి చూడలేమని ఇతర దేశాల పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నామని ఇరాన్‌ చెబుతున్నది. అయితే ఇరాన్‌ మీద అమెరికా ఆంక్షలు తీవ్రం అవుతున్న కారణంగా మరొక దేశమేదీ ముందుకు రానపుడు అమెరికాను ఖాతరు చేయని చైనా అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది. అందుకే మన విశ్లేషకులు మన దేశం ఇరాన్‌ను తీసుకుపోయి చైనా చేతిలో పెట్టిందని, దీనికి మనల్ని మనమే నిందించుకోవాలని వ్యాఖ్యానించారు. చైనాను ఒంటరిపాటు చేయటం దేవుడెరుగు మనకు మనమే ఒంటరి అవటానికి అమెరికా వలలో మనం చిక్కుకోవటం కారణం కాదా ?
ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో మరొక దేశం జోక్యం చేసుకో కూడదు అన్నది అందరూ అంగీకరించే సాధారణ సూత్రం. అదే సమయంలో అంతర్జాతీయ రాజకీయాలు సరైన దారిలో లేవు కనుక వివాదాలు తలెత్తినపుడు ప్రతి దేశం ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం నిత్యకృత్యంగా మారింది. తమ దేశంలో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు రష్యా జోక్యం చేసుకున్నట్లు స్వయంగా అమెరికాలో ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అనేక దేశాల ఎన్నికల్లో, ఎవరు అధికారంలోకి రావాలో ఎవరు రాకూడదో అమెరికా నిర్ణయిస్తోందన్న అంశం కూడా బహిరంగ రహస్యమే.


మన దేశంలో ఉగ్రవాదదాడులు, విచ్చిన్న చర్యలు జరిగినపుడు వాటి వెనుక పాకిస్ధాన్‌ హస్తం ఉందని మన ప్రభుత్వం చెప్పటం తెలిసిందే. పాకిస్ధాన్‌లోని బెలూచిస్తాన్‌, కరాచీ తదితర ప్రాంతాల్లో కూడా ఇదే మాదిరి ఉగ్రవాద చర్యలు, దాడులు జరిగినపుడు పాక్‌ ప్రభుత్వం కూడా వాటి వెనుక మన హస్తం ఉందనే ఆరోపిస్తున్నది. పశ్చిమాసియాలోని అరబ్బు ప్రాంతాల్లో జరిగే దాడులకు ఇజ్రాయెల్‌ కారణమని, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా జరిగే చర్యలకు అరబ్బులు కారణమనే వార్తలు కూడా వస్తాయి. అత్యధిక సందర్భాలలో వీటికి ఆధారాలు ఉండవు అందువనల వీటిలో వాస్తవాలు ఏమిటి అన్నపుడు ఒక ఆరోపణ నిజమే అని అంగీకరించినపుడు రెండవదాన్ని కూడా నిజమే అనుకోవాలా లేదా ?


లడఖ్‌ ప్రాంతాన్ని కాశ్మీరు నుంచి విడదీసి కేంద్ర పాలిత ప్రాంతంగా మన ప్రభుత్వం ప్రకటించింది. తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని కూడా లడఖ్‌ అంతర్భాగమని భారత్‌ చెప్పటాన్ని తాము అంగీకరించటం లేదని భారత చర్య చట్టవిరుద్దమని చైనా ఏడాది క్రితమే భద్రతా మండలిలో అభ్యంతరాన్ని లేవనెత్తింది. మధ్యలో ఒకసారి తాజాగా ఆ చర్యకు ఏడాది నిండిన సందర్భంగా మరోసారి భద్రతా మండలిలో ఇష్టాగోష్టి చర్చకు చైనా లేవనెత్తింది. నిజానికి లడఖ్‌ను పూర్తిగా మనదే అని మనం చెప్పటం లేదా చైనా తన ఆధీనంలో ఉన్నదని చెప్పటం కొత్తగా తలెత్తలేదు. రెండు దేశాల మధ్య సమస్యలు, అనుమానాలు తలెత్తినపుడు మౌనాన్ని అంగీకారంగా తీసుకుంటారనే కారణంతో లాంఛనంగా అభ్యంతరాలను లేవనెత్తుతారు. ఏడాది క్రితం తొలిసారి చైనా లడఖ్‌ గురించి అదే చేసినపుడు మన అధికారులు చైనా వెళ్లి యథాతధ స్థితి గురించి తాము ఎలాంటి చర్య తీసుకోలేదని, అంతర్గత వ్యవహారాల్లో భాగంగా కొన్ని చర్యలు తీసుకున్నట్లు ఇచ్చిన వివరణతో చైనా తదుపరి పొడిగించలేదు. అయితే తరువాత సరిహద్దుల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపధ్యంలో తాజాగా చైనా మరోసారి భద్రతా మండలిలో దీన్ని చర్చకు పెట్టింది.


చైనా అంతర్గత విషయాల్లో మనం జోక్యం చేసుకుంటున్నామా ?
మన కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేసినపుడు, ఆర్టికల్‌ 370 రద్దు చేసినపుడు పాకిస్ధాన్‌ విమర్శలు చేసింది. చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ సమయంలో అది మా అంతర్గత వ్యవహారం ఇతర దేశాల జోక్యం తగదని మన ప్రభుత్వం ప్రకటించింది.
ఇదే మాదిరి మన మీద చైనా అలాంటి ప్రకటనలే చేస్తున్నది. అవి అధికార ప్రతినిధులు లేదా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ వ్యాఖ్యల రూపంలో ఉండవచ్చు. ఉదాహరణకు తైవాన్‌ సమస్య. తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమే అని ఐక్యరాజ్యసమితి స్వయంగా గుర్తించింది. మన దేశం, అమెరికా కూడా అదే వైఖరిని కలిగి ఉంది. అయితే చైనాలో తైవాన్‌ విలీనం అయ్యేందుకు తగిన వాతావరణం లేదనే పేరుతో అమెరికన్లు జోక్యం చేసుకుంటున్నారు. తైవాన్‌కు ఆయుధాలు అందిస్తున్నారు, చైనా వ్యతిరేక శక్తులకు అన్ని రకాల సాయం అందిస్తున్నారు. దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం లేనందున దొడ్డిదారిన ఆఫీసులను ఏర్పాటు చేసి నిత్యం అక్కడి చైనా వ్యతిరేక శక్తులతో సంబంధాలను కలిగి ఉంది. ఇటీవలి కాలంలో అమెరికా ప్రభావానికి గురై భారత్‌ తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొంటోందని చైనా విమర్శిస్తోంది.
కరోనా లాక్‌డౌన్‌కు ముందు తైవాన్‌లో జరిగిన ఎన్నికలలో చైనాలో విలీనాన్ని వ్యతిరేకించే శక్తులు విజయం సాధించాయి. వారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం పంపగా బిజెపి తన ఇద్దరు ఎంపీలను ఎంపిక చేసింది. విమానాల రద్దు కారణంగా వారు భౌతికంగా వెళ్లి అక్కడి పాలకులను అభినందించలేకపోయారు గానీ ఆన్‌లైన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆపని చేశారు. ఈ చర్యను తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యంగా చైనా పరిగణిస్తోంది.
కాశ్మీరులో ఉగ్రవాద సమస్యను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వానికి తగినన్ని అధికారాలు కల్పించే చర్యల్లో భాగంగా ఆ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించినట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. అదే మాదిరి చైనాలో అంతర్భాగమైన హాంకాంగ్‌లో కొన్ని శక్తులు 2047లో చైనాలో పూర్తిగా విలీనం కావాలన్న ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ స్వాతంత్య్రం కావాలని ఆందోళన చేస్తున్నాయి. చైనా అధికారాన్ని గుర్తించేందుకు నిరాకరిస్తున్నాయి. అలాంటి శక్తుల వలన ముప్పు వచ్చిందని భావించిన చైనా సర్కార్‌ తన అంతర్గత భద్రతా చట్టాన్ని హాంకాంగ్‌కు వర్తింప చేసింది. ఈ చర్యను వ్యతిరేకించే వారికి పరోక్షంగా మద్దతు తెలియచేస్తూ మన ప్రతినిధి ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్‌ వేదిక మీద లేవనెత్తారు. గతంలో ఎన్నడూ ఇలాంటి వైఖరిని తీసుకోలేదు. ఇది కూడా తమ అంతర్గత వ్యహారాల్లో జోక్యమే అని చైనా చెబుతోంది.
దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని కొన్ని దీవుల గురించి చైనాతో సహా ఆ ప్రాంత దేశాల మధ్య కొన్ని వివాదాలు ఉన్నాయి. వాటికి మనకూ ఎలాంటి సంబంధమూ లేదు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా జోక్యం చేసుకోవటమే కాదు, ఆప్రాంతానికి యుద్ద నౌకలను తరలించి ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. దాని ఎత్తుగడకు అనుగుణ్యంగా ఆ వివాదంలో మన దేశం జోక్యం చేసుకోవటాన్ని చైనా తప్పుపడుతున్నది.
ఇక టిబెట్‌ విషయం గురించి తెలిసిందే. చైనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన దలైలామాను అమెరికా రూపొందించిన పధకం ప్రకారం మన దేశానికి రప్పించటం, ఆశ్రయం కల్పించటం, ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకు ఏర్పాట్లు చేయటం, తిరుగుబాటుదార్లకు మన దేశంలో కొన్ని చోట్ల నివాసాలను ఏర్పాటు చేయటం తెలిసిందే. ఇదంతా దలైలామా మతాధికారి కనుక మానవతా పూర్వక వైఖరితో చేశాము. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటంగా చైనా అభ్యంతర పెడుతున్నది. దానిలో భాగంగానే అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ పట్టణ పర్యటనకు దలైలామాను అనుమతించవద్దని గతంలో చైనా అభ్యంతర పెట్టిన విషయం కూడా తెలిసిందే. వీటన్నింటిలో చైనా వ్యవహారాలలో మన జోక్యం ఉన్నట్లా లేనట్లా ? మనం ఏమి చేసినా మనకు సరైనదిగా కనిపిస్తే చైనా ఏమి చేసినా చైనీయులకూ సరైనదిగానే కనిపిస్తుంది. ఏదేశానికైనా వాటి పర్యవసానాలు ఏమిటి అన్నది ముఖ్యం.


పాకిస్ధాన్‌ ఉగ్రవాది మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించటాన్ని ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుకోవటం. ప్రపంచ అణు సరఫరా దేశాల బృందంలో మన దేశం చేరటాన్ని చైనా అభ్యంతరం పెట్టటం, లడఖ్‌ విషయంలో భద్రతా మండలికి ఫిర్యాదు చేయటం వంటివి చైనా జోక్యంగా పరిగణించే వాటిలో కొన్ని.
పాకిస్దాన్‌కు గతంలో అమెరికా ప్రధాన మద్దతుదారుగా ఉంది. ఎఫ్‌16 యుద్ద విమానాలను అందించి మనలను పరోక్షంగా బెదిరించిన చరిత్ర అందరికీ తెలిసిందే. మన ప్రాంతాలను పాక్‌ తన అంతర్భాగాలుగా చూపుతూ చిత్ర పటాలను రూపొందిస్తే చైనాకు ప్రత్యక్షంగా కలిగే లాభం ఏమీ లేదు. మనకు వ్యతిరేకంగా పాక్‌ను చైనా రెచ్చగొడుతోంది అనే అభిప్రాయం ఒకటి ఉంది. గత చరిత్రను చూసినపుడు కాశ్మీర్‌ను ఆక్రమించేందుకు పాకిస్దాన్‌ను పురికొల్పింది బ్రిటన్‌, అమెరికా అన్నది జగమెరిగిన సత్యం. తరువాత జరిగిన యుద్దాల సమయంలో మనకు వ్యతిరేకంగా ఆయుధాలు అందించింది అమెరికా అన్నదీ తెలిసిందే. బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ద సమయంలో మనం బంగ్లా దేశ్‌లో జరుగుతున్న ఊచకోతను నివారించేందుకు జోక్యం చేసుకొని పాక్‌ మిలిటరీని నిలువరించాము. స్వల్ప యుద్దం కూడా చేశాము. ఆ సమయంలో మనకు వ్యతిరేకంగా సైనిక చర్య తీసుకొనేందుకు అమెరికా తమ సప్తమ నౌకా దళాన్ని బంగాళాఖాత ప్రాంతానికి తరలించిన విషయం తెలిసిందే.అలాంటి అమెరికాతో, బ్రిటన్‌, ఇతర పశ్చిమ దేశాలతో రాసుకుపూసుకు తిరగటానికి మనకు ఎలాంటి పేచీ అభ్యంతరం కనిపించటం లేదు. పాకిస్ధాన్‌ పాలకులు అమెరికాతో చేతులు కలిపినపుడు అమెరికాను బహిరంగంగా విమర్శించటానికి మన మీడియాకు ధైర్యం చాలలేదు. ఒక వేళ ఇప్పుడు పాకిస్దాన్‌ను మన మీదకు చైనా ఎగదోస్తోంది అనుకుంటే, ఇంతకాలం అలాంటి చర్యలకు పాల్పడని చైనా ఇప్పుడు ఎందుకు ఆ పని చేస్తోందో రెండో కోణం కూడా పాఠకులకు అందించాలి. చైనాతో పాటు మన పాలకుల తప్పిదాలు, విధానాల్లో లోపాలు ఉంటే వాటిని కూడా ధైర్యంగా విమర్శించాలి. ఇరాక్‌ మీద అమెరికా దాడి, సిరియా మీద ఆల్‌ఖైదా ఉగ్రవాదులతో కలసి దాడులు చేసిన తమ పాలకుల గురించి అక్కడి మీడియాలో అనేక మంది తీవ్రంగా విమర్శించారు. వియత్నాం మీద దురాక్రమణ యుద్దానికి పాల్పడితే దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించిన చరిత్ర అమెరికా ప్రజలకు ఉంది. మనం ఇతరులను కెలక్కపోతే ఇతరులూ మనలను కెలకరు అనే విషయాన్ని గ్రహించాలి. అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్దంలో మనం ఒక పక్షం వహించటం ఏమాత్రం క్షేమకరం కాదు అని పాలకులు గ్రహించాలి. అది సరైనదే అనుకుంటే వచ్చే పర్యవసానాలకూ బాధ్యత వారిదే అవుతుంది.


వెలువడుతున్న వ్యాఖ్యానాలు, పర్యవసానాలేమిటి ?
పాకిస్ధాన్‌ రూపొందించిన కొత్త చిత్ర పటంతో తలెత్తే ఇతర పర్యవసానాల గురించి మన దేశంలో చర్చ జరుగుతోంది. జమ్మూకాశ్మీర్‌, లడఖ్‌ ప్రాంతాలు తమవి అని చెప్పటం ద్వారా కాశ్మీర్‌లోని వేర్పాటు వాదులు, లేదా ఆక్రమిత కాశ్మీర్‌లోని స్వతంత్ర కాశ్మీర్‌ వాదులకు ఎదురు దెబ్బ తగిలినట్లే అన్నది ఒక అభిప్రాయం. ఇప్పటి వరకు పాక్‌ పాలకులు కాశ్మీర్‌ సమస్య మీద ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని, కాశ్మీరీలు స్వతంత్ర దేశంగా ఉంటే తాము మద్దతు ఇస్తామని చెప్పిన మాటలకు ఇక ముందు ఆస్కారం ఉండదు. పాక్‌ మాటలు నమ్మి వేర్పాటును కోరుతున్న వారి పరిస్ధితి అగమ్యగోచరంగా మారుతుంది అని కొన్ని వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఉత్తరాఖండ్‌లోని కాలాపానీ,లిపులేక్‌,లిమియాధురా ప్రాంతాలు తనవే అంటూ కొద్ది వారాల క్రితం నేపాల్‌ ప్రకటించటం, ఇప్పుడు అదే పని పాక్‌ చేయటం కాకతాళీయంగా జరిగినవి కాదని వాటి వెనుక రెండు దేశాలకూ పెద్ద మొత్తంలో సాయం చేస్తున్న చైనా హస్తం ఉందనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి.
” చైనాతో కలుపుతూ పాకిస్ధాన్‌ కాగితాల మీద తన చిత్ర పటాన్ని రూపొందించినందున రెండు దేశాలతో యుద్దం ఉండవచ్చేమో అన్న భారత్‌ భయాన్ని తాజా పరిణామం ఎక్కువ చేస్తున్నది. అయితే ఆచరణలో అది పని చేస్తుందనేందుకు ఆధారాలు చాలా పరిమితంగా ఉన్నాయి, అయితే దేశీయ రాజకీయాలు ఈ చిత్రపటం వెనుక ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నట్లు ” హాంకాంగ్‌ నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు పేర్కొన్నది.